'Mamathala Madhuvu Episode 8' New Telugu Web Series
Written By Ch. C. S. Sarma
'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 8
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.
భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.
వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.
హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు.
గోపాల్ ఇంటికి చేరుకుంటాడు. తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్. భార్యతో గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు.
ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు. ఆవేశాన్ని తగ్గించుకోమని ఆదిత్యకు చెబుతుంది అతని మరదలు ప్రేమ. తనమీద దాడి చేసిన పాండూని ఎదిరిస్తాడు ఆది. ఆ ఘర్షణలో తలకు బలంగా దెబ్బ తగలడంతో పాండూ మరణిస్తాడు.
ఇక మమతల మధువు ఎపిసోడ్ 8 చదవండి..
అరగంటలో యీ వార్త ఆ వాడంతా వ్యాపించింది. వారి బంధువులు.... తెలిసిన వారు వీర గోవిందయ్య యింటికి చేరారు. గోపాల్... భీమారావులు వెళ్ళి చూచి వచ్చారు. ఆ సాయంత్రం... పాండూ మట్టిలో కలసిపోయాడు.
భీమారావు మనుమడు ఆదిత్య పాండును కొట్టి చంపాడని... జనం తీర్మానించారు. యీ అవమానంతో గోపాల్ ఆదిత్యను ఆవేశంతో తిట్టాడు. కొట్టాడు. అన్నను ప్రక్కకు త్రోసి భవానీ... ఆదిత్యను తన యింటికి తీసుకొని వెళ్ళింది. వాడవారి మాటలను విన్న ప్రేమ, ఆదిత్యను చూచేదానికే భయపడింది. తన వల్ల పాండు చచ్చిపోయాడని ఆదిత్య కుమిలి కుమిలి... ఏడ్చాడు. యింట్లోనించి బయటికి వచ్చేదానికి బయపడ్డాడు.
పాండూ మేనమామ పుల్లారావు... రౌడీ... త్రాగుబోతు. భీమారావు యింటికి వచ్చి... "నా అల్లుణ్ణి నీ మనవడు చంపాడు. మేము పోలీస్ కంప్లయింట్ యిస్తాం... కోర్టులో కేసు వేస్తాం... మీ వాడిని... జైలుకు పంపిస్తాం. నా సంగతి మీకు తెలవదు.” త్రాగిన మైకంలో నోటికొచ్చినట్లు వాగాడు.
భీమారావు... డాక్టర్ వేణుమాధవు, మాస్టారు మాధవయ్యను. సబ్ ఇన్ స్పెక్టర్ జార్జిని వారి... ఆఫీస్ కు ఆహ్వానించాడు. ధర్మాధర్మాలను గురించి కొడుకు గోపాల్ సమక్షంలో వారితో చర్చించాడు.
చివరిగా... “పాండూ చనిపోవడం మాకూ ఎంతో బాధగా వుంది. డాక్టర్ వేణుమాధవ్ గారి మాట ప్రకారం వాడికి గుండెలో యింతక ముందే సమస్య వున్నట్లు తెలిసింది. మాస్టర్ రామనాధంగారి మాట ప్రకారం... పాండుయే మొదట ఆదిని కొట్టాడన్నది నిజం. ఏది ఏమైనా... వీరగోవిందు తన కొడుకును కోల్పోయాడు. పోయిన వాడిని మనం తెచ్చియివ్వలేము. యధార్థానికి నా మనుమడి తప్పులేకపోయినా... తప్పును ఎదిరించిన కారణంగా యీనాడు వాణ్ణి అందరూ అసహ్యించుకొంటున్నారు. వాడూ... ఎప్పుడూ ఏడుస్తూనే వున్నాడు. తన వల్ల పాండు చనిపోయాడని బాధపడుతున్నాడు.
వీర గోవిందు పేదవాడు. వాడికి నేను రెండు ఎకరాల భూమిని యివ్వదలచాను. యివిగో పత్రాలు, మీరు ముగ్గురూ మాకు వీరగోవిందుకు శ్రేయోభిలాషులు. యీ పత్రాలను వాడికి యివ్వండి. కోర్టుకేసు... అని, త్రాగి నా యింటికి వచ్చి ఆ పుల్లారావు వాగాడు. నేను సహనంతో అన్నీ విన్నాను. మీరు... గోవిందును కలసి... వివరంగా మాట్లాడి యీ పత్రాలు వాడికి యివ్వండి. ఆ రెండు ఎకరాల విలువ యిరవై లక్షలు. నేను మీకు చెప్పదలచుకొన్నది చెప్పాను. యిక మీరు మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి.” సవినయంగా చెప్పాడు భీమారావు.
భీమారావు ఔదార్యాన్ని... నిర్ణయాన్ని ఆ ముగ్గురు మెచ్చుకొన్నారు. "మేము మీకు చెప్పేటంతటి వారముకాము” చేతులు జోడించారు. సబయిన్స్పెక్టర్ ఆ పత్రాలను చేతికి తీసుకొన్నాడు. ఆ ముగ్గురూ వీరగోవిందుయింటికి వెళ్ళారు.
వారి మాటలను విని వీరగోవిందు ఒప్పుకొన్నా... త్రాగు బోతు పుల్లారావు నోరు విప్పి వాగసాగాడు. యిన్స్పెక్టర్... 'యింక ఒక్కమాట మాట్లాడితే... న్యూసెన్సు కేసు క్రింద అరస్టు చేసి, కటకటాల వెనక్కు త్రోసి ఎముకలు విరిచేస్తాను. జాగ్రర్త.' హెచ్చరించాడు. వారి మాటలకు భయపడి పుల్లారావు... పారిపోయాడు. వీరగోవిందు భూమి పత్రాలను తీసికొన్నాడు.
ముగ్గురూ భీమారావుగారి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పారు. భీమారావు చేతులను జోడించి వారికి కృతజ్ఞతలను తెలియజేశాడు. వారు వెళ్ళిపోయారు.
కుర్చీలో కూర్చొని... మనుమడిని గురించి... అతని భవిష్యత్తును... ఎలా తీర్చిదిద్దాలా అనే విషయాన్ని గురించి ఆలోచించసాగాడు భీమారావు. చివరకు... ఒక నిర్ణయానికి వచ్చాడు.
****
"గోపూ!... అమ్మా గౌరీ... నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. వారి ముఖాల్లోకి చూస్తూ చెప్పాడు భీమారావు.
ఆయనకు ఎదురుగా సోఫాలో గోపాల్ కూర్చొని వున్నాడు. ప్రక్కన గౌరి నిలబడి వుంది.
"ఏ విషయాన్ని గురించి మామయ్యా!..."
“మన ఆదిత్య విషయం.”
"మీ నిర్ణయం ఏమిటి నాన్నా...”
"బెంగుళూరులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించదలచాను.” సాలోచనగా మెల్లగా చెప్పాడు భీమారావు.
“బెంగుళూరా!...” ఆశ్చర్యంతో గౌరి.
“అవునమ్మా!...”
"మీ నిర్ణయం నాకు నచ్చింది నాన్నా!...”
“అమ్మా గౌరీ... యిక యిక్కడ వాడి చదువు సాగడం కష్టం. లోకులు వాణ్ణి ఆడిపోసుకొంటున్నారు. వాడు వీళ్ళందరి దృష్టికీ దూరంగా పోవాలి. ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో... వాడు పెరిగి పెద్దవాడు కావాలి. బెంగుళూరులో మనకు ముఖ్యులైనవారితో కూడా నేను మాట్లాడాను. వాడిని అక్కడికి పంపితే... భవిష్యత్తు బాగుంటుందమ్మా!... నా మాటనమ్ము!.” అనునయంగా చెప్పాడు భీమారావు.
గౌరికి ఎడుపు వచ్చింది. కళ్ళల్లో నీళ్ళు... మనస్సులో బిడ్డ తనకు దూరం అవుతాడే అనే బాధ... ఏది ఏమైనా వాడి భవిష్యత్తు బాగుండాలి. వాడు చక్కటి వాతావరణంలో పెరిగి... బాగా చదివి... గొప్పవాడు కావాలి. అది జరగాలంటే... తనకు వాడికి ఎడబాటు తప్పదు. మామయ్య అన్ని విషయాలను బాగా ఆలోచించి కాని... ఓ నిర్ణయానికి రారు. వారితో ఏకీభవించడం నా ధర్మం. మనస్సున అనుకొంది గౌరీ.
"సరే మామయ్యా!... మీ యిష్టప్రకారమే చేయండి." పవిటతో కన్నీటిని ఒత్తుకొంటూ మెల్లగా చెప్పింది. గౌరి... తలుపు చాటున వుంది, ఆ సంభాషణ అంతా విన్నాడు ఆది.
"అది ఎక్కడమ్మా!..."
"అదీ...” పిలిచింది గౌరి.
భయంతో తలదించుకొని వచ్చి తాతయ్య ప్రక్కన నిలబడ్డాడు ఆది. భీమారావు... గోపాల్... గౌరీ అదిత్య ముఖంలోకి చూచారు. అతని వదనం ఎంతో విచారంగా వుంది. గౌరి కొడుకు ప్రక్కకు చేరింది. భీమారావు ఆదిని దగ్గరకు తీసికొన్నాడు. తన ప్రక్కన సోఫాలో కూర్చోనజేశాడు. తలవంచి ఆది ముఖంలోకి చూస్తూ...
“నాన్నా!... ఆదీ!...”
తలఎత్తి తాతయ్య ముఖంలోకి చూచాడు ఆది.
“రెండు వారాల్లో స్కూళ్ళు తెరుస్తారు. నీవు తొమ్మిదవ తరగతికి వెళ్ళబోతున్నావు. యీ స్కూల్లో కాదు..." భీమారావు ముగించకముందే....
తలదించుకొని ఆదిత్య.... “నేను మీరు చెప్పిందంతా విన్నాను తాతయ్య. నేను బెంగుళూరు వెళ్ళిపోతాను. నీవు, అమ్మ, నాన్న నాతో వచ్చి నన్ను మీరు అక్కడ వదిలి పెడతారు కదూ!...” కన్నీటితో అమాయకంగా చూస్తూ అడిగాడు ఆది.
"అవును నాన్నా!... అది చాలా మంచి స్కూలు... టీచర్లు పిల్లలూ అందరూ మంచివాళ్ళు. నీవు బాగా చదవుకోవచ్చు నాన్నా!...” అనునయంగా చెప్పాడు భీమారావు.
“నెలకొకసారి నేను... అమ్మ వచ్చి నిన్ను చూచి... కావలసినవి కొని యిచ్చి వస్తుంటాం ఆదీ!..." ప్రీతిగా తనయుడి కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు వాత్యల్యంతో గోపాల్.
“నాన్న చెప్పింది నిజం నాన్నా!... నెలకు ఒకసారి మేము నీ దగ్గరికి తప్పకుండా వస్తాము." ఎంతో అభిమానంగా చెప్పింది గౌరి.
“నావల్ల మీకు చాలా అవమానం జరిగింది. ఎంతగానో బాధ పడ్డారు. యికపై మీకు అలాంటి కష్టం వుండదమ్మా!... నన్ను క్షమించండి.” ముందు తాతయ్య కాళ్ళు... తర్వాత తండ్రి కాళ్లు... చివరగా తల్లి కాళ్ళు తాకాడు ఆదిత్య.
భుజాలు పట్టుకొని ఆదిని పైకి లేపింది గౌరి... అతని కళ్ళనుంచి అశ్రువులు కారుతూ వున్నాయి.
“ఆదీ!...” అంటూ కన్నీళ్ళతో గౌరి ఆదిని తన... హృదయానికి హత్తుకొంది.
భీమారావు నిర్ణయం ప్రకారం మంచిరోజున గౌరీ... గౌపాల్... భీమారావులు ఆదిత్యతో బెంగుళూరికి వెళ్ళారు. అతన్ని బోర్డింగ్ స్కూల్లో చేర్చి... నయబోధ చేసి... తిరిగి వచ్చారు.
నెలకొకసారి ఎవరో ఒకరు వెళ్ళి ఆదిని చూచి... వచ్చేవారు. రెండు మూడు నెలలు దీనంగా వీడ్కోలు పలికిన ఆది... ఆ తర్వాత ఆనందంగా వారికి వీడ్కోలు చెప్పేవాడు. శలవుల్లో వూరికి రాననేవాడు. తండ్రి, తల్లి లేక తాతయ్యో వెళ్ళి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను ఆదికి చూపించి వచ్చేవారు. యీ రీతిగా ఆ స్కూల్లో నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
బీ.టెక్ రెండు సంవత్సరాలు బెంగుళూరులో ముగించీ యం.టెక్ ఎంతో పేరున్న సూరత్ కాల్ యన్.ఐ.టిలో చేరాడు. అక్కడకు వచ్చి ఒక సంవత్సరం గడిచింది.
“సార్ వచ్చేసాం.” అన్న టాక్సీ డ్రయివర్ మాటతో ఆది... వర్తమానంలోకి వచ్చాడు. దిగి డబ్బులు యిచ్చి హాస్టల్ వైపు నడిచాడు.
***
శాంతి హాస్పటిల్ నుండి డిచ్చార్జి అయింది. ఆమె ఆరోగ్యం చక్కబడింది. ఫోన్ గోపాల్లో అన్ని విషయాలు మాట్లాడింది శాంతి. మామగారి ఆదేశానుసారం... ఆనంద్ కలసి తను బెంగుళూరీకి వెళుతున్నట్లు చెప్పింది. సంతో కంచ అంతా విని... 'మంచిది శాంతి.' అన్నాడు సంతోషంతో గోపాల్.
రామకోటి ఆనంద్ శాంతులను ప్లయిట్ బెంగుళూరికి తీసుకొని వచ్చి ముందుగానే ఆడ్వాన్సు యిచ్చిన యింట్లో చేర్చాడు. గోపాల్ను ఆఫీసుకు తీసుకొని వెళ్ళి అందరినీ పరిచయం చేసి 'వీరు మీ క్రొత్త మ్యానేజర్...' చెప్పి రామకోటి వారందరికీ గోపాల్ను పరిచయం చేశాడు.
తదనంతరం... ఆఫీసు విధులను గురించి... గోపాల్ బాధ్యతలను గురించి వివరించాడు. రెండు రోజులు వుండి ముఖ్యమైన కష్టమర్స్ను పరిచయం చేసి... బాలప్పతో.. గోపాల్కు అన్ని విషయాల్లో సాయం చేయమని చెప్పి... రామకోటి వైజాగ్కు తిరిగి పోయాడు. భీమారావుకు అన్ని విషయాలూ ఫోన్లో వివరించాడు. రావుగారు ఆనందించారు.
మూడు వారాల తర్వాత భీమారావు బెంగుళూరికి వెళ్ళాడు. ఆనందన్ను... శాంతిని కలిశాడు. ఆఫీస్లో ఆనంద్ పనిచేసే విధానం... ప్రతి విషయాన్ని అతను పరిశీలనగా చూచి నిర్ణయాలు తీసుకొనే పద్ధతి... ముఖ్య పరివారి పట్ల అతను చూపే ఆదరాభిమానాలు... వారి ప్రశంసలు... భీమారావుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
అప్పటికి ప్రేమ... బెంగుళూరు వి.ఐ.టిలో... బి.యి.సి. యస్ యింజనీరింగ్ సెకండ్ యియ్యర్ చదువుతూ వుంది. తన ఆఫీస్ కార్యక్రమాలను ముగించుకొని ఆమెకు ఫోన్చేసి... తనువున్న లాడ్జికి వచ్చి కలవమన్నాడు భీమారావు. తను లాడ్జికి.... వెళ్ళిపోయాడు.
చెప్పిన టైముకు ప్రేమ తన స్నేహితురాలు నందినీతో... లాడ్జికి చేరింది. అందరి క్షేమ సమాచారాలను విచారించింది. భీమారావు చెప్పిన ప్రకారం... ఆనంద్ వారి రూముకు వచ్చాడు. ప్రేమను... తన మనుమరాలని ఆనందు చెప్పి, ప్రేమకు ఆనంద్ను... బెంగుళూరు బ్రాంచి మ్యానేజరని చెప్పి, వారిరువురికి పరిచయాన్ని కలిగించాడు. ఆ యిరువురూ చిరునవ్వులతో... ఒకరికొకరు విష్ చేసికొన్నారు. ప్రేమ... తన తాతయ్యగారి పోలికలను ఆనంద్లో చూచి ఆశ్చర్యపోయింది.
ప్రేమ రూపురేఖలు... మాటతీరు ఆనంద్కు బాగా నచ్చాయి. ఆనంద్లోని గాంభీర్యం ముక్తసరిగా... సౌమ్యంగా అతను చేసి మితభాషణ ప్రేమకు నచ్చాయి. నలుగురూ కలసి భోం చేశారు. భోజనానంతరం ఆనంద్ వెళ్ళిపోయాడు. ప్రేమ ఆదిత్యను గురించి అడుగుతుందని భీమారావు ఆశించాడు. ప్రేమ ఆదిత్య మాటనే ఎత్తలేదు. ఆదిత్యను గురించి ఆమె ఏమంటుందో వినాలని...
భీమారావు...
“ఆరునెలల్లో ఆది వూరికి వస్తాడు ప్రేమా!..." అన్నాడు.
“అలాగా!... అత్తయ్య మామయ్య ఆనందిస్తారు." నవ్వుతూ అంది ప్రేమ.
చేతి వాచీని చూచి... “యిక మేము బయలుదేరుతాం తాతయ్యా!..." అంది.
"సరేనమ్మా!... బయలుదేరండి.” ముగ్గురూ రోడ్లోకి వచ్చారు. ప్రేమ టాక్సీని ఆపింది.
"వెళ్ళొస్తాం తాతయ్యా!..." చెప్పి ప్రేమ టాక్సీ ఎక్కింది. నందినీ ఆమె ప్రక్కన కూర్చుంది. టాక్సీ కదిలింది.
భీమారావు సాలోచనగా... తన గదివైపుకు నడిచాడు.
ఆదిత్య గోల్డ్ మెడల్ సాధించి యం.టెక్ పాసయ్యాడు. ప్రొఫెసర్స్కు... స్నేహితులకు... వార్డ్నర్ తదితరులకు చెప్పి లగేజ్తో మంగుళూరు ఏర్పోర్టుకు బయలుదేరాడు.
ప్రేమ జ్ఞప్తికి వచ్చింది. తన అత్తయ్య పంపిన ఆమె ఫొటోను పర్సునుంచి తీసి చూచాడు. ఆమెను నేరుగా చూచి పదిసంవత్సరాలయింది. ఫొటోను పరీక్షగా చూచాడు. 'ఎంత అందంగా తయారయింది' అనుకొన్నాడు. ఆమె కోసం... తను చిన్నతనంలో చేసిన సంఘటనలు... ఆమెపట్ల తనకు ఆ రోజుల్లో వుండే ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చాయి. ఆమె అంటే... తనకు ఎంతో యిష్టం... యిప్పుడు నన్ను నేరుగా చూచీ ప్రేమ ఏమంటుందో... ప్రస్తుతంలో తనపట్ల ఆమెకు ఎలాంటి అభిప్రాయం వుందో... ఆ చిన్ననాటి జ్ఞాపకాలను తను మరచిపోయి వుంటుదా!... మరచిపోయి వుండదని మనస్సు సామాధానం యిచ్చింది.
టాక్సీ... ఏర్పోర్టు చేరింది. దిగీ లోనికి నడిచారు. బోర్డింగ్ పాస్ తీసుకొని ప్లయిట్ ఎక్కాడు ఆది. ఒకటింగ్ కాలు గంటలో ప్లయిట్ చెన్నై చేరింది.
తల్లి గౌరి... తండ్రి గోపాల్... తాతయ్య భీమారావు.. అత్త భవానీ.. మామయ్య ధనుంజయరావు వచ్చారు. ఆదిత్యను చూచి అందరూ ఆనందంతో అభిమానంతో రిసీవ్ చేసికొన్నారు. అందరి పాదాలు తాకి ఆది నమస్కరించాడు. తల్లి ఆదిని తన హృదయానికి హత్తుకొంది ఎంతో పారవశ్యంతో, ప్రేమ కోసం ఆది నయనాలు నలువైపులా గాలించాయి.
దాన్ని గమనించిన అత్త భవానీ... “ప్రేమ రాలేదు నాన్నా... అది యిప్పుడు... బెంగుళూరులో బి.య్యి. సి.యస్... చదువుతూ వుందిగా!...” చిరునవ్వుతో చెప్పింది భవానీ.
అందరూ కార్ స్టాండ్కు వచ్చారు. భీమారావు గోపాల్... గౌరీ.. ఆదిత్యా ఒక కార్లో... భవానీ ధనుంజయరావు మరో కార్లో ఎక్కి నెల్లూరు బయలుదేరారు. గోపాల్ డ్రయివర్ సీట్లో... అతని ప్రక్కన భీమారావు... వెనక సీట్లో గౌరి... ఆదిత్య కూర్చున్నారు.
ఆదిత్య యూనివర్సిటీ ఫస్టులో వచ్చినందుకు... ప్రొఫెసర్స్... మిత్రుల ఏమన్నారని అడిగిన తల్లి ప్రశ్నకు వివరంగా జవాబు చెప్పాడు అది. తన బిడ్డ వున్నతికి ఆ తల్లి మనస్సు ఎంతగానో సంతోషించింది. అంతా వింటున్న భీమారావు గోపాల్... కూడా ఆనందించారు. మూడు గంటల్లో యింటికి చేరారు.
ఆదిని వాకిట్లో ఆపి... గౌరీ... భవానీ ఎఱ్ఱనీళ్ళు పళ్ళెంలో కలుపుకొని వచ్చి ఆదికి దిష్టితీశారు. ఆది ఆనందంగా పది సంవత్సరాల తర్వాత... తన యింట్లో ప్రవేశించాడు.
ఆది వచ్చిన విషయాన్ని విని అతని బాల్యస్నేహితులు శివ... నంద... రామ... మాధవ్... వేణు వచ్చి నవయువకుడుగా ఎదిగి తమ ముందున్న ఆదిని చూచి ఆశ్చర్యపోయారు. ఆప్యాయంగా పలకరించారు. అందరినీ... ఆదరంగా పేరు పేరునా అడిగి వాళ్ళు ఏం చేస్తున్నదీ... అడిగి తెలుసుకొన్నాడు ఆది. ఆదిలోని మార్పుకు, గాంభీర్యానికి... స్నేహశీలతకు... వారంతా సంతోషించారు.
గౌరి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది. ఆ రెండు కుటుంబాల సభ్యులు... ఆది స్నేహితులు... ఆ కుటుంబాన్ని గౌరవించే పెద్దలు... కలసి ఆనందంగా ఆ విందులో పాల్గొన్నారు.
***
భవానీ గౌరీ ఆదిత్య కోసం బెడ్రూమ్న సర్దుతున్నారు. వాడుకకు అవసరమైన వస్తువులనన్నింటినీ ఆ రూమ్లో వేయించి వుంచింది గౌరి...
“వుత్తరోత్తరా యీ రూమే ఆది ప్రేమల బెడ్రూమ్ వదినా. విశాలంగా బాగుంది కదూ!... అంది గౌరి
“నా చిన్నతనంలో నేను... మా అన్నయ్య యీ రూమ్లోనే పడుకొనే వాళ్ళం. కూర్చొని చదువుకొనేవాళ్ళం గౌరీ.” నవ్వుతూ చెప్పింది భవానీ తన చిన్ననాటిమధురస్మృతులను గుర్తుచేసుకొంటూ, సంవత్సరం రోజుల క్రింద ఆది గౌరికి పంపిన లెటర్ల కవరు బీరువాను తెరవగానే క్రిందపడింది. భవానీ ఈ క్రిందపడ్డ కొన్ని పుత్తరాలను, కొన్ని వుత్తరాలతో వున్న కవర్ను చేతికి తీసుకొంది. వాటిని చూచి ఆశ్చర్యపోయింది.
భవానీ వాలకాన్ని చూచిన గౌరి... "ఎందుకు అంతగా ఆశ్చర్యపోతున్నావు. వదినా!... యీ పుత్తరాలన్నీ ప్రేమ అదికి వ్రాసింది. వాడు నాకు పంపాడు. అన్నింటినీ చదవమని, చదివాను. నీవు చదువు. ప్రేమ వాళ్ళ బావను ఎంతగా అభిమానిస్తూ వుందో నీకూ తెలుస్తుంది.” నవ్వుతూ చెప్పింది గౌరి.
భవానీ వదనంలో విచారం. కళ్ళల్లో నీళ్ళు, గౌరి... ఆశ్యర్యపోయింది.
"ఏం వదినా!... ఏమయింది?...”
"ప్రేమ మనస్సు మారిపోయింది గౌరీ!...”
“అంటే!"
"దానికి యిప్పుడు ఆది మీద చిన్నప్పటి ప్రేమా... అభిమానం లేదు.” విచారంగా చెప్పింది భవానీ.
“అయితే... యీ వుత్తరాలన్నీ...”
"అది వ్రాయలేదు.”
"ఎవరు వ్రాశారు?...”
"నేను.”
"నీవా!...” ఆశ్చర్యపోయింది గౌరీ.
“వదినా నీవు చెప్పేది!...”
“నిజం... ఆది మనస్సులో ఎప్పుడూ... ప్రేమ వుండాలని అది వ్రాసినట్లుగా నేను యీ వుత్తరాలను వ్రాశాను. కారణం... ఆది అంటే నాకు ఎంతో యిష్టం, వాడు నా అల్లుడు కావాలనేది నా కోరిక."
"ప్రేమకు యిష్టం లేకుండా నీ కోరిక ఎలా తీరుతుంది వదినా!... ” విచారంగా అంది గౌరి.
“మనమంతా వున్నాంగా... అది చిన్నపిల్ల... నచ్చచెప్పి ఒప్పించగలమని నా ఆశ.” గద్గద స్వరంతో అంది భవాని.
“యింతవరకూ నాతో నీవు యీ విషయాన్ని ఎందుకు చెప్పలేదు వదినా!...”
"సమయం వచ్చినప్పుడు చెప్పాలనుకొన్నాను. యీ వుత్తరాలు బయట పడటంతో నీకు నిజం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించు గౌరీ..." ప్రాధేయపూర్వకంగా గౌరి చేతులను పట్టుకొంది భవాని,
"ప్రేమ అంటే అదికి ఎంతో యిష్టం. మాట పట్టింపుకోసం... తన లక్ష్యాన్ని సాధించే దానికోసం... గడచిన పది సంవత్సరాలు వాడు మనకు దూరంగా వున్నాడు. ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ ప్రేమను గురించి అడిగేవాడు. దానికి సంబంధించిన విషయాలు చెబుతూ వుంటే... ఎంతో ఆనందించేవాడు.” విచారంగా చెప్పింది గౌరి.
"వాడి మనస్సు నాకు తెలుసు గౌరీ... అందుకే, నేను ఆ వుత్తరాలను వ్రాశాను. వాడు అన్ని విధాలా ఆనందంగా వుంటూ తన లక్ష్యాన్ని సాధించాలనుకొన్నాను.. నీవు... గమనించలేదు. మద్రాస్ ఏర్పోర్టులో వాడి కళ్ళు ప్రేమ కోసం వెదికాయి. విషయాన్ని గ్రహించిన నేను అది బెంగుళూరులో చదువుతున్న విషయాన్ని చెప్పాను.”
"అవును ఆ మాటనే నీవు చెప్పావు. నేనూ విన్నాను." క్షణం ఆగి... “వదినా... నీకు జ్ఞాపకం వుందా!... మామయ్యగారు ప్రేమతో... ఆది కాలేజీలో చేరమన్నారు. తనకు అక్కడ చేరడం యిష్టం లేదని... బెంగుళూరులో చేరాలని వుందని చెప్పింది.”
సాలోచనగా అంది గౌరి.
"అవును.” భవానీ విచారంతో కూడిన జవాబు.
“దాని అర్థం ప్రేమకు ఆది అంటే యిష్టం లేదనేగా!...”
“యీ మాటే కదా నేను నీకు చెప్పాను. కానీ మనం... దానికి నచ్చచెప్పాలి. మనస్సు మార్చాలి. ఆదికి ప్రేమకు వివాహం జరిగేలా చూడాలి.” తన నిర్ణయాన్ని వివరంగా చెప్పింది భవానీ.
పది నిముషాల ముందు ఆ గదిని సమీపించిన ఆదిత్య వారి సంభాషణ అంతా విన్నాడు. అతని మనస్సు వికలమైంది. మౌనంగా... వారి కంట పడకుండా వెళ్ళిపోయాడు. యుక్త వయస్కురాలైనా ప్రేమ మనస్సులో తనకు స్థానం లేదన్న విషయం వారి మాటల వల్ల... ఆదికి అర్థం అయింది. మనసులో ఏదో మూగబాధ. ప్రశాంతమైన గాలి కోసం మేడపైకి వెళ్లాడు.
గడచిన పదిసవంత్సరాలుగా... అనుభవపూర్వకంగా తను సాధించింది నేర్చుకొన్నది... సహనం... శాంతి అసహ్యించుకొన్న వారిని అభిమానించడం... ప్రేమిచడం... వారికి ఆనందం కలిగేలా తను చేయగలిగిన సహాయం చేయడం.
వారి అభిమానాన్ని పొందడం. ఎప్పుడూ... తన మనస్సును ప్రశాంతంగా వుంచుకోవడం... సద్భావాలను మదిలో నిలుపుకోవడం... వాటిని గౌరవించి ఆచరించడం... గడచిన పదేళ్ళ జీవితానుభవంలో తను నేర్చుకొన్నవి.. ఆచరించినవీ యివి... ప్రేమకు నిర్వచనం... పెండ్లి... పిల్లలు... కాదు, నిస్వార్థ రహితమైన అభిమానమే ప్రేమ. వయస్సులో నచ్చిన పిల్లకు ఐలవు అని చెప్పేది ప్రేమకాదు. అది కేవలం వ్యామోహం. తల్లి దండ్రులు తమ సర్వస్వాన్ని అర్పించి బిడ్డలను పెంచి పెద్ద చేయడం ప్రేమ... వుపాధ్యాయులు పుస్తక పఠనాన్ని చేసి పిల్లలకు పాఠాలు నేర్పివారిని విజ్ఞానవంతులను చేయడం ప్రేమ...
కలవారు లేని వారికి చేసే దానధర్మాలు ప్రేమ... సంస్కర్తలు సాటి మానవాళి శ్రేయస్సుకోసం వారు పడే శ్రమ, దీక్ష... ప్రేమ... సన్యసించి మఠాలను ఆశ్రయించి గురువులై సాటి సమాజీకులకు చేసే ధర్మ బోధనలు ప్రేమ... క్షతగాత్రులైన వారిని రక్షించివారి స్వస్థతకు పాటు పడటం ప్రేమ... నిరాశ్రయులుకు ఆశ్రయాన్ని కల్పించడం ప్రేమ... సాటి మనిషిని మనిషిగా చూచీ గౌరవించి తమతో సమానంగా సౌభతృత్వంతో భావించడం ప్రేమ. జాతీని రీతిని దేశాన్ని... గౌరవించి... అభిమానించడం ప్రేమ. అపకారికి వుపకారం చేయాలనే హైందవ సిద్ధాంతం ప్రేమ.
ప్రేమ తన్ను కాదన్నంతమాత్రాన ఆమె మీద ద్వేషం పెంచుకోవం అమానుషం. ఆమె వివాహ విషయంలో ఆమెకు సర్వహక్కులూ వున్నాయి. దాన్ని కాదన్న వారు... ఆమెను నొప్పించిన వారు నేరస్థులౌతారు. పది సంవత్సరాల్లో ప్రతివ్యక్తి రుచి అభిరుచులు.. ఆశలు ఆశయాలు మారడం సహజం కదా!... పదమూడేళ్ళ తన ఆ వయస్సుకు... యిరవై మూడేళ్ళ యీ నాటి వయస్సుకు తనలోనూ ఎంతో మార్పు తను జీవితాంతం... ప్రేమను చిన్ననాడు అభిమానించినట్లే యిక ముందూ అభిమానించాలి. ఆమె తనను ఏదైనా సాయం కోరితే చేయాలి. ఎప్పుడూ మంచి హితుడుగా ఆమె దృష్టిలో మిగిలిపోవాలి.
మేడమీద అటూ యిటూ పచారు చేస్తూ చివరికి ఆ నిర్ణయానికి వచ్చాడు. ఆదిత్య. మెట్లమీద నుంచి తల్లిగౌరి పిలుపును వీని ఆదిత్య... క్రిందికి నడిచాడు.
====================================================
ఇంకా వుంది
====================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments