top of page

మమతల మధువు ఎపిసోడ్ 9


'Mamathala Madhuvu Episode 9' New Telugu Web Series

Written By Ch. C. S. Sarma

'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 9

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.

భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.

వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.


హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటికి చెబుతాడు.


ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.

తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్.

భార్యతో గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు.

ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు


ఆవేశాన్ని తగ్గించుకోమని ఆదిత్యకు చెబుతుంది అతని మరదలు ప్రేమ.

తనమీద దాడి చేసిన పాండూని ఎదిరిస్తాడు ఆది.

ఆ ఘర్షణలో తలకు బలంగా దెబ్బ తగలడంతో పాండూ మరణిస్తాడు.

ఆది తాత భీమారావు, మధ్యస్థం చేసి, గొడవలు జరక్కుండా చూస్తాడు. ఆదిని బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు.


గతకాలపు ఆలోచనలు పూర్తయి, వర్తమానంలోకి వస్తాడు ఆది.

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా శాంతి కొడుకు ఆనంద్ తో బెంగళూరు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది.

ప్రేమకు తనమీద మునుపటి అభిమానం లేదని గ్రహిస్తాడు ఆది.


ఇక మమతల మధువు ఎపిసోడ్ 9 చదవండి..



ఆ రాత్రి గౌరి... గోపాల్తో తనకు భవానికీ... మధ్యన జరిగిన సంభాషణను గురించి తెలియజేసింది. ప్రేమకు ఆదిత్య మీద వున్న చిన్ననాటి అభిమానం యిప్పుడు లేదని తెల్చింది.


అంతా విన్న గోపాల్ కి ... తన చెల్లెలు ఆదిత్యకు ప్రేమ పేరిట వ్రాసిన లేఖల వల్ల ఆమె అభిప్రాయం తేటతెల్లమయింది. కానీ... వయస్సు వచ్చి ప్రేమ మనస్సు మారిందన్న మాట అతనికి ఆవేదనను కలిగించింది. వారి చిన్న నాటినుంచీ... భీమారావు..తను... గౌరి... భవాని ధనుంజయరావు... ఆయన తల్లి సుశీలకు... ప్రేమ ఆదిత్య వివాహం జరిపించాలనే కోరిక. పెద్దల నిర్ణయం మారలేదు. ఆది నిర్ణయం మారలేదు... కానీ ప్రేమ నిర్ణయం మారింది.


"ప్రేమకు యిష్టం లేనప్పుడు... ఆమెను నొప్పించి, బలవంతంగా కేవలం మన యిష్టానుసారం ఆది ప్రేమల వివాహం జరిపించడం న్యామయా గౌరీ!.. అలా చేయ కూడదని నా అభిప్రాయం.” తన అభిప్రాయాన్ని గౌరికి తెలియజేశాడు గోపాల్. భర్త చెప్పిన మాటల్లో వున్న నిజాన్ని గ్రహించింది గౌరి. మౌనంగా వుండిపోయింది. పడకగదిలో భవానీ భర్తతో ఆ రోజు తనకూ గౌరికీ జరిగిన సంభాషణ గురించి... ప్రేమ పేరున తను ఆదిత్యకు వ్రాసిన లెటర్లును గురించి ఎంతో విచారంతో చెప్పింది. అంతా విన్న ధనుంజయరావు...


"భవానీ!... మన కాలానికి యీ కాలానికి వ్యక్తుల మనస్తత్వాల్లో ఎంతో వ్యత్యాసం, యీ జనరేషన్కు స్వతంత్ర భావాలు అధికం. అది తప్పా రైటా... తన నిర్ణయం వల్ల తల్లిదండ్రులు సంతోష పడతారా.. బాధపడతారా అనే విచక్షణా భావన నేటి యువతీయువకుల్లో చాలా మందికి లేదు. మన పిల్ల యీ కోవకు చేరిందంటే... అది మన దురదృష్టం... పై వారం బెంగుళూరుకు వెళుతున్నాను. ఈ విషయాన్ని గురించి ప్రేమతో మాట్లాడుతాను. నచ్చ చెప్పేదానికి ప్రయత్నిస్తాను. నీవు బాధపడకు. మనం దైవాన్ని నమ్మేవాళ్ళం. ఆ తండ్రి నిర్ణయం ఎలా వుందో సహనంతో చూద్దాం.” భార్యకు నచ్చచెప్పాడు... ధనుంజయరావు.


ఆది తన గదిలో మంచంపై పడుకొని ప్రేమను గురించే ఆలోచిస్తున్నాడు.భీమారావు అతని గది తలుపు తట్టాడు. లేచి వెళ్ళి తలుపు తెరిచాడు ఆదిత్య.

"ఏం తాతయ్యా!...”

"నీతో మాట్లాడాలని వచ్చాను నాన్నా!...”

"రండి తాతయ్యా!... కూర్చొండి.”


పదేళ్ళనాడు తన్ను... ఆది... 'నీవు' అని సంభోదించేవాడు. యిప్పుడు 'మీరు' అని సంభోదిస్తున్నాడు. పెద్దవాడు అయ్యాడు కదా!.. మంచి వ్యక్తిత్వం... పెద్దల పట్ల ఎంతో గౌరవం వయస్సుతోపాటి సంతరించుకొంది. నవ్వుతూ... మంచం పైన కూర్చున్నాడు భీమారావు.


“చెప్పండి తాతయ్యా!...”

ఆది ముఖంలోకి పరిశీలనగా చూచీ... “నాన్నా ఆదీ... కొందరు వ్యక్తులు... కొన్ని సందర్భాల్లో పరిస్థితుల రీత్యా పొరపాటు చేస్తారు. తను చేసిన పొరపాటు తన వారిమీద ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా సమర్థవంతంగా జీవితాన్ని కొందరు సాగిస్తారు. తన కష్టం... తన వంతు... సాధించిన ఫలితం అందరి వంతుగా పంచుతారు. ఎల్లప్పుడూ... అందరి ఆనందాన్ని కోరుతారు. యదార్థం చెప్పాలంటే అలాంటి వారే సమర్థవంతమైన మనుషులు. వుత్తము లు.


నీవు చేసింది తప్పు అని ఆక్షేపించడం... అందరూ చేయగలపని, కానీ... ఏ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఆ తప్పు చేయవలసి వచ్చిందో... అతను చేసిన ఆ తప్పు వెనకాలవున్న నీతి... న్యాయం ధర్మం... యీ మూడింటినీ గురించి ఆలోచించేవారు యీ సమాజంలో చాలా తక్కువ. నేను రొండో రకానికి చెందిన వాణ్ణి. విమర్శించడం అంటే నాకు అసహ్యం. అభిమానించడం అంటే నాకు ఎంతో యిష్టం... చిన్నతనంలో నీవూ తప్పులు చేశావు. నా కొడుకూ... తప్పు చేశాడు. తప్పు చేయడం మానవ సహజం.


తప్పును తెలిసికొని... ధర్మానికి కట్టుబడి నడవడం వివేకం. నా కొడుకు తన జీవితాన్ని ఎంతో ధర్మబద్ధంగా నడిపాడు. నీవు నీ భావి జీవితాన్ని యుక్తాయుక్త విచక్షణతో ధర్మబద్ధంగా సాగించాలనేది నా కోరిక." భీమారావు చెప్పడం ఆపి మనుమడి... ముఖంలోకి చూచాడు.


"మీరు చెప్పింది జీవిత సత్యం తాతయ్యా... మీ మనుమడినైన నేను భవిష్యత్తులో ఏ విషయాన్ని మీతోకాని... నాన్న అమ్మలతో కాని... దాచను. చిన్నతనం నుండీ యింతవరకూ మీరు నా మీద చూపిన ప్రేమానురాగాలను నేను ఎన్నటికీ మరువలేను. మీ సలహా... అంగీకారం లేకుండా నేను ఏ పనీ... చేయను. మీరు నాయీ మాటను నమ్మండి తాతయ్యా...” భీమారావు చేతిని తన చేతిలోకి తీసుకొని తన కుడి హస్తాన్ని... తాతగారి చేతిలో వుంచాడు ఆది.


భీమారావు వదనంలో... ఎంతో ఆనందం. ఆయన కళ్ళల్లోని తడిని చూచాడుఆది.

"నాన్నా ఆదీ!...”

"చెప్పండి తాతయ్య!...”


“నా కొడుకు చేసిన తప్పు అన్నానే... అదేమిటని అడగవా?...”

"అడగను.”

“ఏనాటికైనా అది నీకు తెలిస్తే!...”

“నా తండ్రిని దోషిగా భావించను. పరిస్థితుల ప్రభావం... అని ఆ చేదు నిజాన్ని నాలోనే దాచుకుంటాను. నా తండ్రిని యిప్పటిలాగే అభిమానిస్తాను.”


భీమారావు ఆశ్చర్యంతో ఆది ముఖంలోకి చూచాడు.

"తాతయ్యా!... నేను చెప్పింది నా మనస్తత్వాన్ని గురించి... నా మాటను నమ్మండి.” నవ్వుతూ చెప్పాడు ఆది.


"నేనూ!... ఆ విషయాన్ని గురించి నా కొడుకును అడగలేదు. అడగను కూడా!...” సాలోచనగా పలికాడు భీమారావు.


"అది మీలోవున్న జొన్నత్యం తాతయ్యా!. మరోసారి చెబుతున్నాను. నా ఏ చర్య మీకుగాని నాన్నగారికి గాని... బాధ కలిగించే రీతిలో ఎన్నటికీ వుండదు. తాతయ్యా!... నేనొక మాట చెప్పనా…’


“చెప్పు నాన్నా!...”

“రేపటి నుంచీ నేను మీతోపాటు ఆఫీస్కు వస్తాను. మీ బాధ్యతలను నాకు అప్పగించండి. యికపై మీరు విశ్రాంతి తీసుకొండి.”


“గోపూ... నేను యీ విషయాన్ని గురించి చర్చించాము. మన బి.టి.యస్. కంపెనీకి నీవు యి.డి.వి. ఆఫీస్ నీ క్యాబిన్ రడీగా వుండి నాన్నా...”

"థ్యాంక్యూ తాతయ్యా!...” భీమారావు చేతిని తన చేతిలోనికి తీసుకొని కరచాలనం చేశాడు ఆది.


“ఆదీ!...”

“చెప్పండి తాతయ్యా!...”


“యీ రోజు నేను నీ ప్రక్కనే పడుకోనా...”

"యీ రోజే కాదు తాతయ్యా!... యికపై మీరు... నాతోపాటి యీ రూమ్లోనే పడుకోవాలి.”


భీమారావు ఆనందంగా నవ్వాడు. ఆ యిరువురూ పడకపై వాలిపోయారు.

"తాతయ్యా!... బారైట్ ఆర్పి బెడ్లైట్ ఆన్చేయనా!...”


"కొంతసేపు ఆగు నాన్నా!..." మెల్లగా అన్నాడు భీమారావు.

"ఏం తాతయ్యా నాతో యింకా ఏమైనా చెప్పాలా.!....

"అవును.”

"ఏమిటది?.”


మీ నాన్నను గురించి... వాడు చేసిన తప్పును గురించి...” ఆది ముఖంలోకి చూస్తూ వీచారంగా అన్నాడు భీమారావు.

“ఆ విషయం ఏమిటో మీరు నాకు చెప్పక ముందు నేను మీకు ఒక యదార్థ విషయాన్ని చెబుతాను వింటారా తాతయ్యా!..."

“చెప్పు. వింటాను.”


రామాచారి... భారతి... వీరు మా ప్రొఫెసర్స్. వారు వారి... కాలేజి రోజుల్లో ప్రేమించుకొన్నారు. వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నారు. భారతీ తల్లిదండ్రులకు రామాచారి నచ్చలేదు. కారణం తెగల భేదం. ఆమె వివాహాన్ని విష్ణుశర్మతో జరిపించారు. కాపురానికి పంపారు. ఎవరో చెప్పగా విని... విష్ణుశర్మ... భారతి శీలాన్ని శంకించాడు.


చిత్రహింసలు పెట్టాడు ఆమె గర్భవతిగా వున్న సమయంలో ఆ గర్భం రామాచారి వల్ల కలిగిందనే అనుమానంతో ఆమె నుండి... తల్లిదండ్రుల మాట ప్రకారం విడాకులను కోగాడు. కోర్టు విడాకులను మంజూరు చేసింది. భారతి ఎంతగానో బాధపడింది. అవివాహితుడుగా వున్న రామాచారి... భారతిని కలిశాడు. ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను వివాహం చేసుకొన్నాడు. భారతి ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ప్రేమ... అనే పేరు పెట్టారు.


ప్రేమకు మూడుసంవత్సరాలు నిండే సమయంలో భారతి ప్రసవించింది. మొగ కవలలు పుట్టారు. వారి పేర్లు రామ్... లక్ష్మణ్, ప్రేమ నా కాలేజ్ మీట్, చాలా మంచి అమ్మాయి. వృత్తి రీత్యా రామాచారి.. భారతీ ఎంతో గొప్పవారు. ముగ్గురు బిడ్డలతో... వారు చాలా ఆనందంగా వున్నారు. యీ కథలోని మా రామాచారి ప్రొఫెసర్గారి వ్యక్తిత్వం గురించి మీ అభిప్రాయం ఏమిటి తాతయ్యా... అసలు సిసలైన మనిషి అంటే వారే కదూ!..."


తాతగారి సమాధానం కోసం వారి ముఖంలోకి ఆత్రంగా చూచాడు ఆది.

"మీ ప్రొఫెసర్ రామాచారిగారు చాలా గొప్ప వ్యక్తి మంచికి... మానవత్వానికి... నిజమైన ప్రేమకు వారు ప్రత్యక్షసాక్షి ఆదీ!...”


"ఆ యిద్దరూ... స్టూడెంట్స్ నందరినీ... తమ కన్నబిడ్డల్లా చూచుకొంటారు. నన్ను ఎంతగానో అభిమానిస్తారు.” నవ్వుతూ చెప్పాడు ఆది.


"ప్రేమ అందంగా వుంటుందా!...” ఆది ముఖంలోకి కొంటెగా చూస్తూ అడిగాడు భీమారావు.


ఆది... మౌనంగా వుండిపోయాడు. అతని హృదయంలో యిప్పుడు యిద్దరు ప్రేమలు నిలిచివున్నారు. తన మనస్సున అత్త కూతురు ప్రేమను గురించిన ఆలోచన. తల్లి... అత్తయ్య మాట్లాడుకొన్న మాటలు... గుర్తుకు వచ్చాయి.


"ఆదీ!... నా ప్రశ్నకు నీవు జవాబు చెప్పలేదు!..." తొట్రుపాటుతో భీమారావు ముఖంలోకి చూచాడు.

“చాలా అందంగా వుంటుంది తాతయ్యా!... అందరికంటే ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది.”


“మరి... మన ప్రేమ వ్యక్తిత్వం?...”

“ప్రేమను చూచి నేను పది సంవత్సరాలయింది... తాతయ్య!... మీరు నన్ను యీ ప్రశ్న అడగడంలో మీ వుద్దేశ్యం?...” ప్రశ్నార్థకంగా భీమారావు ముఖంలోకి చూచాడు ఆది.

“మన ప్రేమ అంటే నీకు ఎంతో యిష్టం కదూ!... ఆమెను నీవు పెండ్లి చేసికోవాలనుకొంటున్నావు కదూ!...” నవ్వుతూ అడిగాడు భీమారావు.


“నాకు యిప్పుడప్పుడే... వివాహం చేసికోవాలని లేదు తాతయ్యా!... సోషల్ సేవ చేయాలని... మన వూరికి చుట్టుప్రక్కల వున్న కుగ్రామాలన్నీ తిరిగి... అక్కడి ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని వారికి సాయం చేయాలని నా నిర్ణయం. త్వరలో గ్రామసేవా సమాజం, అనే ఒక సంస్థను ప్రారంభిస్తాను. వివాహ ప్రసక్తి నాలుగైదేళ్ళ తర్వాతే తాతయ్యా!...”


"ఓహో! అలాగా!... అదీ!... నీ నిర్ణయం చాలా మంచిది."

"నేను కేవలం నాకోసం బ్రతక తలచుకోవడం లేదు తాతయ్యా... గ్రామాల్లో వుండే పేద ప్రజలకు సాయం చేసి ప్రజల మనిషిగా బ్రతకాలనుకొంటున్నాను.”


"ఆ మాటల్లో... భీమారావుకు ఆదిత్య దృఢ సంకల్పం గోచరించింది.

"ని నిర్ణయం నాకు పరిపూర్ణ సమ్మతం ఆదీ!... ఆనందంగా నవ్వాడు భీమారావు. కొన్నిక్షణాల తర్వాత...

"యిక నేను నీతో చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పనా!...

"మీ యిష్టం తాతయ్యా!...”


“నాకు యీ విషయం తెలిసి పది మాసాలయింది. నేను చెప్పబోయే విషయాన్ని నీలోనే దాచుకుంటానని మాట యివ్వు" చేయి జాచాడు భీమారావు. ఆదిత్య మౌనంగా భీమారావు చేతిలో చేయి వేశాడు.


“రామకోటి ద్వారా తను విన్న గోపాల్ మొదటి వివాహం... శాంతి ఆనంద్ కు సంబంధించిన విషయమిది. తను శాంతిని ఆనంద్ ని కలసి... వారిని బెంగుళూరుకు తరలించిన విషయమది. తన... కొడుకు గోపాల్ ఎటువంటి పరిస్థితుల్లో ఆది తల్లి... గౌరిని వివాహం చేసికొన్నాడనే విషయం అదీ. తనతో యింతవరకూ.... గోపాల్ చెప్పక ఇరవై నాలుగు సంవత్సరాలుగా దాచిన విషయం అది.”


అంతా వివరంగా చెప్పి...

“ఆదీ!... యిప్పుడు చెప్పు. మీ నాన్నను గురించి నీ అభిప్రాయం ఏమిటి?” ఆది ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు భీమారావు.


"ఒక తండ్రిగా మీరు మీ బిడ్డను... యిప్పటికీ... ఎంతగానో అభిమానిస్తున్నారు. ఒక బిడ్డగా నేను నా తండ్రిని.. నా జీవితాంతం ప్రేమిస్తాను. అభిమానిస్తాను. గౌరవిస్తాను తాతయ్యా!... నేను యింతకంటే... వేరుగా ఏమీ చెప్పలేను." ఆదిత్య కంఠం బొంగురుపోయింది. అతని నయనాల్లో కన్నీరు. కళ్ళు మూసుకొన్నాడు. కన్నీరు చంపలపైకి దిగజారాయి.


భీమారావు మనుమడి కన్నీళ్ళను తుడిచాడు. “యీ కన్నీళ్ళు!...” ప్రశ్నార్థకంగా ఆది ముఖంలోకి చూచాడు.


“అమ్మకు ఏనాటికైనా యీ విషయం... ఎవరి మూలంగానైనా తెలిస్తే... ఆమె పరిస్థితి ఎలా వుండబోతుందో అనే భయం కారణంగా తాతయ్యా!...” గద్గిదస్వరంతో పలికాడు ఆదిత్య.


యిరువురి మధ్యా కొంతసేపు మౌనం నాట్యం చేసింది. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన భీమారావు... “అలాంటి రోజు అంటూ మీ అమ్మకు రాకూడదు. ఒకవేళ వస్తే... యీ కుటుంబ పెద్దగా ఆమెకు నచ్చచెప్పవలసిన బాధ్యత నాదే అవుతుంది. భయపడకు ఆదీ!... పొద్దుపోయింది. యిక పడుకొందాం నాన్నా!..” అనునయంగా చెప్పాడు భీమారావు.

యిరువురూ... వారి వారి ఆలోచనలతో మంచంపై వాలారు.

***

మరుదినం... భీమారావు, గోపాల్, ఆదిత్యా... ఆఫీస్కు వెళ్ళారు. తల్లి గౌరి పూజ చేసి ఆదిత్య నొసటన సింధూరాన్ని దిద్దింది. ఆశీర్వదించింది. ఎదురు వచ్చి వారిని సాగనంపింది.

ఆ ముగ్గురూ ఆఫీస్లో ప్రవేశించి.. ఆదిత్య కోసం ఏర్పాటు చేసిన గదిలోకి నడిచారు. భీమారావు తన వాచీని చూచి...

“నాన్నా ఆదీ... నీవు నీ సీట్లో కూర్చో" చిరునవ్వుతో ఆదేశించాడు.


"తాతయ్యా!... నాన్నా!... థాంక్యూ...” యిరువురి పాదాలను తాకి... వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ఆది. గోపాల్ టేబుల్పైన ఒక మూలన వున్న విజిటింగ్ కార్డ్సు రెండు పాకెట్లను ఆదిత్యకు అందించాడు. ఆదిత్య అందుకొని... ఒక పాకెట్ నుంచి తన విజిటింగ్ కార్డును తీసి చూచాడు. అందులో యగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి. ఆదిత్య అని వుంది.

“యీ రోజు కోసం నేను మీ తాతయ్యా ఎంతో కాలంగా ఎదురు చూచాము.” నవ్వుతూ చెప్పాడు గోపాల్.


“నేటికి మా కోర్కె తీరింది.” భీమారావు ముఖంలో ఆనందం.

"మాకు యిప్పుడు చాలా ఆనందంగా వుంది ఆదీ!... తాతయ్యలాగా మంచిపేరు ప్రఖ్యాతులతో నీవు నిండుగా నూరేళ్ళు వర్ధిల్లాలి నాన్నా. " గోపాల్ దీవెన.


భీమారావు గోపాల్రావులు ఆదిత్యకు ఎదుటి కుర్చీలలో కూర్చున్నారు. తను ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎలా పైకి ఎక్కి వచ్చింది... భీమారావు మనుమడికి వివరించాడు. తండ్రి ఆదేశానుసారంగా ఒక లిమిటెట్ కంపెనీని... ఏర్పాటు చేసేదానికి తను... తన తండ్రి ఏ విధంగా శ్రమించింది... యీనాటి వారి వున్న అస్థిపొస్టుల వివరాలు... వున్న లారీలు... రాష్ట్రంలో వున్న బ్రాంచి ఆఫీసులు... ఆ బ్రాంచీ న్యూనేజర్ల వివరాలు... లాస్ట్ యియ్యర్ టర్నోవర్ను గురించి గోపాల్ ఆదిత్యకు వివరించాడు.


తర్వాత ఆఫీస్ స్టాప్ నందరినీ పిలిచి వారిని ఆదిత్యకు పరిచయం చేశాడు. తదుపరి ఆఫీస్ వెనుక భాగంలో వున్న వర్క్ షాప్ కి ముగ్గురూ వెళ్లారు. అక్కడవున్న ఫోర్మెన్స్... మెకానీక్స్... హెల్పర్స్... ఫిట్టర్సు... అందరినీ భీమారావు ఆదిత్యకు పరిచయం చేశాడు.


అందరికీ ఆదిత్య సగౌరవంగా నమస్కరించి కరచాలనం చేశాడు. భీమారావు ఆదిత్యను కంపెనీ యగ్జిక్యూటివ్ డైరెక్టరుగా అందరికీ పరిచయం చేశాడు.


ముగ్గురూ ఆఫీస్ లో ప్రవేశించి అన్ని భాగాలను చూచి... తిరిగి ఆదిత్య రూమ్కు వచ్చారు. "నాన్నా! యిది మన చిన్న సామ్రాజ్యాం. యిక్కడ పనిచేసే ప్రతి ఒక్కరినీ మేము మన యింటి సొంత మనిషిగా భావిస్తాము. గౌరవిస్తాము.


అభిమానిస్తాము. మనం యిక్కడ లేకపోయినా... వీరంతా వారివారి విధులను తమ సొంతపనిగా భావించి నిర్వహిస్తూ వుంటారు. అన్నింటినీ నీవు పరిశీలించి... కంపెనీ వున్నతికి నీ ఆలోచన ప్రకారం ఏం చేయాలో ఆలోచించి నీ అభిప్రాయాన్ని నాకు నాన్నకు చెప్పు. అదీ!... కేవలం మనకోసం మనం బ్రతకడం గొప్ప కాదు. మనం పది మందిని బ్రతికించడం గొప్ప.


మీ నాన్న నాయీ మాటను ఎంతగానో నమ్మాడు. ఆచరించాడు. అందుకే నా బిడ్డ గోపు అంటే నాకు ప్రాణం. మీ నానమ్మ... చనిపోయిన నాటి నుంచీ యీ నాటివరకూ వాడు నామీద చూపే ఆదరాభిమానాలతో... నేను మీ నానమ్మ పోయిన మాటనే మరచిపోయానంటే... నీవు నమ్మగలవా!... యిక నా కోడలు... మీ అమ్మ... ఆమె నా కోడలు కాదు నన్ను కన్నతల్లి. నా జీవితాంతం మీరంతా చల్లగా వుండాలి. నీవు ఎప్పుడూ... మంచిని తలచి... మంచిని ఆచరించి... మంచివాడివనిపించుకోవాలి. సరేనా అదీ!..." ఆవేశంగా చెప్పిన భీమారావు తలత్రిప్పి గోపాల్ ముఖంలోకి చూచాడు.


గోపాల్ మౌనంగా తలదించుకొన్నాడు. తన తండ్రికి తన యందువున్న ప్రేమాభిమానాలు ఆయన నోట వినడంతో... 'యిలాంటి తండ్రిని నేను మోసం... చేశాను. నేను చేసిన నేరాన్ని యింతవరకూ ఆయనతో చెప్పలేకపోయాను. యిరవై నాలుగు సంవత్సరాల తర్వాత... ఆయనకు తెలిసిన పచ్చి నిజాన్ని గురించి నన్ను ఒక్క మాట కూడా అడగలేదంటే... యీన మనిషికాడు. నా పాలిటి దేవుడు.' అనుకొన్నాడు మనస్సున గోపాల్.


పనిమనిషి... టీ తీసుకొని వచ్చింది. భీమారావును సమీపించింది.

“లక్ష్మీ !... బాగున్నావా!...”

"అంతా మీ దయ సామీ. బాగుండా!..." నవ్వుతూ జవాబు చెప్పింది లక్ష్మి.


మనవణ్ణి చూపిస్తూ... “యీన నా మనుమడు. ఆదిత్య కంపెనీకి యగ్జిక్యూటివ్ డైరెక్టర్. యిక మీదట రోజూ వీరికీ టీ యివ్వాలి.”

“అలాగే సామి.”


ముగ్గురూ టీ కప్పులు అందుకొన్నారు. లక్ష్మి వెళ్లి పోయింది.

గోపాల్... కుర్చీనుండి లేచాడు. ఆదిని సమీపించాడు.

"విషయు ఆల్టి బెస్టు మై సన్!...” కరచాలనం చేశాడు. “నాన్నా!... నేను నా గదికి వెళతాను.”

“మంచిది నాన్నా!...” నవ్వుతూ చెప్పాడు భీమారావు.

గోపాల్ తన గదికి వెళ్లిపోయాడు. ఆదిత్య సెల్ మ్రోగింది.


"హలో!"

“ఎలా వున్నావ్ ఆదీ.” మృధుమధురమైన కంఠం.

"ఐ యాం ఫయిన్. హౌ ఆర్ యు?..."

“ఓకే...”

"ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?”

“యం.బి.ఏ. చేయాలనుకొంటున్నాను.”

"ఎక్కడ?..."


“బెంగుళూరు... తమరి ప్లాన్స్ ఏమిటి?..."

“మా తాతయ్య గారి ట్రాన్ఫోర్టు కంపెనీలో యి.డి.గా యీ రోజే చేరాను”

"నాకు పుద్యోగం యివ్వగలవా!..."

"నీకా...."

"అవును"


"మరి నీ... యం.బి.ఏl...” ఆది ముగించక ముందే…”

"నీవు పుద్యోగం యిస్తే... వుద్యోగం చేస్తూ ప్రయివేటుగా చేస్తాను.”


"ఓ... అలాగా!..."

అవును. ఏం.... వుద్యోగం యిస్తావా?...

"మా తాతయ్య గారిని అడగాలి.”

"నీ సెక్రెటరీగా తీసుకో...” నవ్వింది ఆ సుందరి.


“సెక్రెటరీయ్యా!...” నవ్వాడు ఆది.

"ఎవరు ఆదీ!..." భీమారావు అడిగాడు.


“ఓకే బై... తర్వాత ఫోన్ చేస్తాను.” ఆదిత్య కట్ చేశాడు.

"తాతయ్యా... మా ప్రొఫెసర్ రామాచారి గారి కూతురు ప్రేమ.”

“ఓ... ఆ ప్రేమనా!...” ఆశ్చర్యంగా ఆది ముఖంలోకి చూచాడు భీమారావు.


"అవును తాతయ్య!...”

"ఏం కావాలట?...”

"వుద్యోగం. నన్ను యివ్వమంటూ వుంది.” అమాయకంగా నవ్వాడు ఆదిత్య.

"యిస్తావా!...”


"తాతయ్యా!... ఏమిటి మీరంటున్నది!... నన్ను ముందు సాయీ వుద్యోగంలో విజయుణ్ణి కావాలని ఆశీర్వదించండి తాతయ్యా!..." చేతులు జోడించాడు నవ్వుతూ ఆది.


చేతిని పైకెత్తి... “విజయోస్తు మనవడా!... నీవు అనుకొన్నది తప్పక సాధించి తీరుతావు నానా... నీ మీద నాకు ఆ నమ్మకం వుంది. కొన్ని ఫయిల్సు పంపిస్తాను. అన్నింటినీ జాగ్రత్తగా చూచి నీ అభిప్రాయాన్ని నాకు చెప్పు." కుర్చీ నుండి లేచి

భీమారావు తన గదికి వెళ్ళిపోయాడు.

* * *

==============================================


ఇంకా వుంది



==============================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


42 views0 comments

Comments


bottom of page