top of page

మమతల మధువు ఎపిసోడ్ 10


'Mamathala Madhuvu Episode 10' New Telugu Web Series

Written By Ch. C. S. Sarma

'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 10

రచన: సిహెచ్. సీఎస్. శర్మ(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.

భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.

వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.


హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటికి చెబుతాడు.


ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.

తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్.

భార్యతో గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు.

ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు

ఆవేశాన్ని తగ్గించుకోమని ఆదిత్యకు చెబుతుంది అతని మరదలు ప్రేమ.

తనమీద దాడి చేసిన పాండూని ఎదిరిస్తాడు ఆది.

ఆ ఘర్షణలో తలకు బలంగా దెబ్బ తగలడంతో పాండూ మరణిస్తాడు.

ఆది తాత భీమారావు, మధ్యస్థం చేసి, గొడవలు జరక్కుండా చూస్తాడు. ఆదిని బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు.

గతకాలపు ఆలోచనలు పూర్తయి, వర్తమానంలోకి వస్తాడు ఆది.

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన శాంతి, కొడుకు ఆనంద్ తో బెంగళూరు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది.

ప్రేమకు తనమీద మునుపటి అభిమానం లేదని గ్రహిస్తాడు ఆది.


ఇక మమతల మధువు ఎపిసోడ్ 10 చదవండి..


గోపాల్ తనలో జరుగుతున్న సంఘర్షణకు... ముగింపు కలగాలని నిర్ణయించుకొని ఆ గతరాత్రి గౌరి నిదురించిన తర్వాత.. యింట్లోని ఆఫీస్ గదిలోనికి వెళ్ళి... తను ఏ పరిస్థితుల్లో శాంతిని వివాహం చేసికొన్నది... వారిరువురి పరిచయాన్ని గురించి వివరంగా వ్రాసి... తను చేసిన ఆ నేరాన్ని క్షమించవలసినదిగా భీమారావును కోరాడు...


వుదయాన్నే జాగింగ్కు బయలుదేరి... ఆఫీస్కు వచ్చి తను వ్రాసిన ఐదు పేజీల కథను కవర్ ను తండ్రి భీమారావుగారి రూమ్లో వారు చూడవలసిన కాగితాలలో వుంచి యింటికి వెళ్ళిపోయాడు. ముగ్గురూ కలసి తొమ్మిది గంటలకు ఆఫీసుకు వచ్చారు.

తన గదికి వచ్చిన గోపాల్, ఆది రూమ్లో తన తండ్రి తన విషయంలో అన్న మాటలు అతనికి ఎంతో ఆనందం కలిగించినా... తను వ్రాసిన దాన్ని చదివి తండ్రి ఏమంటాడో... అనే భయం అతని హృదయంలో నిండి వుంది. తన రూమ్లో సీట్లో కూర్చొని ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ వున్నాడు.


భీమారావు తన గదికి వెళ్ళి కాగితాలను ఫయిల్సును ఆఫీస్బయ్ ద్వారా ఆదిత్య గదికి... పంపేశాడు. చాలా కాలంగా కన్స్ట్రక్షన్ కంపెనీని ఓపన్ చేయాలనేది వారి ఆశయం. యిప్పుడు... ఆదిత్య కూడా వచ్చాడు కాబట్టి... తన నిర్ణయాన్ని గోపాల్ కి చెప్పి అతని వుద్దేశ్యాన్ని తెలుసుకోవాలని యింటర్కమ్ గోపాల్ ని పిలిచాడు.


గోపాల్... తను వ్రాసిన దాన్ని నాన్నగారు చూచి పిలుస్తున్నారని భావించి... భయంతో మెల్లగా... భీమారావుగారి క్యాబిన్ ని సమీపించాడు. కర్చీఫ్ తో ముఖాన్ని తుడుచుకొని... భీమారావుగారి గదిలో ప్రవేశించాడు.

గోపాల్ని చూడగానే భీమారావు... నవ్వుతూ...

“నాన్నా! రా కూర్చో.” అన్నాడు.


గోపాల్ క్షణంసేపు తండ్రి ముఖంలోకి చూచి... మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు.

"గోపూ! చాలా రోజులుగా నాలో ఒక కోర్కె వుంది. వారానికో ధర అమ్మే యీ పెట్రోలు... డీజిల్ ధరల వల్ల యింక కవర్డ్ కార్లో ట్రక్సును పెంచాలని నాకు లేదు. మనకు యిప్పుడు వున్న బండ్లు చాలు. నా కోర్కె ఏమిటంటే... మనం కన్స్ట్రక్షన్ వింగ్ ఒకదాన్ని ప్రారంభించాలని, యిప్పుడు మన ఆది మనతో వున్నాడుగా.... ట్రక్సు బిజినెస్ నీవు చూచుకో... క్రొత్తగా ప్రాంభించనున్న కన్స్ట్రక్షన్ బిజినెస్ అది చూచుకొంటాడు. నేను వర్క్ష్కాప్ను చూచుకొంటాను. యీ నా ప్రపోజలు నీ అభిప్రాయం ఏమిటి నాన్నా!...” ప్రశ్నార్థకంగా గోపాల్ ముఖంలోకి చూచాడు భీమారావు.


గోపాల్ గుండె దడ తగ్గింది. ముఖంలో చిరునవ్వు.

"మీ ప్రపోజల్ చాలా మంచిది నాన్నా!... ప్రారంభిద్దాం. ఆదీని పిలవనా!.... వాడి వుద్దేశ్యం కూడా తెలుసుకొందాం.” ఆనందంగా చెప్పాడు గోపాల్. ఇంటర్ కం లో భీమారావు ఆదిని పిలిచాడు. ఆది భీమారావు గదికి వచ్చాడు. గోపాల్... భీమారావులు వారి నిర్ణయాన్ని ఆదికి వివరించారు. ఆది... తన ఆమోదాన్ని తాత తండ్రికి తెలియజేశాడు.


ముగ్గురూ మంచి రోజు చూచి భీమారావు కన్స్ట్రక్షన్ ప్రయివేట్ లిమిటెడ్ పేర కంపెనీ రిజిస్ట్రేషన్ చేసే నిర్ణయానికి వచ్చారు. గంట ఒకటన్నర అయింది. ముగ్గురూ భోజనానికి యింటికి వెళ్లారు. గౌరి వడ్డించింది. భోం చేస్తూ... భీమారావు గోపాల్ ఆదిత్య తమ కొత్త కంపెనీ నిర్ణయాన్ని గౌరికి తెలియజేశారు. ఆది ఆఫీస్ లో కాలుపెట్టిన తొలిరోజే ముగ్గురూ కలిసి తీసుకొన్న నిర్ణయానికి గౌరి ఎంతగానో సంతోషించింది.


భోజనానంతరం... భీమారావు మనుమడితో కలిసి పొలాలు... తోటల వైపుకు, వాటన్నింటినీ ఆదికి చూపించాలని బయలుదేరారు. గోపాల్ ఆఫీస్కు వెళ్ళాడు.

అతని మనస్సు యిప్పుడు ఎంతో ప్రశాంతంగా వుంది. తండ్రి తను వ్రాసిన దాన్ని చూచీ కూడా తన్ను ఏమీ అడగలేదు. అంటే తను ఏ పరిస్థితుల్లో ఆ నేరాన్ని చేసిందీ... వారు అర్థంచేసికొన్నారు. తన్ను క్షమించారు. యీ విషయంలో యికపై తన హృదయంలో ఎలాంటి ఆందోళన, ఆవేదన... అనవసరం అని గోపాల్ నిర్ణయించుకొన్నాడు. ప్రశాంత చిత్తంతో ఆఫీస్ కార్యక్రమాల్లో మనస్సును లగ్నం చేశాడు.


భూములు తోటలు అదికి చూపించి... భీమారావు ఆదిత్యా ఆరుగంటలకు యింటికి చేరారు. గోపాల్ కూడా అదే సమయానికి యింటికి వచ్చాడు. స్నానాదులు. ముగించి... పెట్టబోయే కంపెనీ గురించిన చర్చలతో... భోజనాన్ని ముగించారు. భీమారావు అది... అది పడక గదిలోకి... గోపాల్ గౌరి వారి గదిలోకి వెళ్ళిపోయారు. సరస సంభాషణలతో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా గోపాల్ గౌరీలు నిదురించారు.

***

మరుదినం... ఆదిత్య ఆఫీసులో క్రిందటిరోజు భీమారావు తనకు పంపిన పేపర్సు, ఫైల్సులను అన్నింటినీ పరీక్షగా చూచాడు. అందులో కొన్ని స్పేర్ పార్ట్స్ కొటేషన్లు... సప్లయి బిల్సు... బ్రాంచి ఆఫీసెస్ ఫండ్ రిక్వయిర్మెంటు వివరాలు. అన్నింటినీ డేట్ వారిగా... కేటగిరీ వైజ్ అరేంజి చేశాడు. ఒక ఫైల్లో అడుగున వున్న కవర్ మీద అతని దృష్టి లగ్నమయింది. కవర్ను ఓపన్ చేసి అందులోని కాగితాలను బయటికి తీసాడు. అది గోపాల్... తన తండ్రికి వ్రాసిన లేఖ, దీక్షగా ఐదు పేజీలు ఆది... చదివాడు. అతనికి తన తండ్రి ఏ పరిస్థితుల్లో శాంతిని వివాహం చేసికొన్నది.. ఆ తర్వాత ఏ కారణంగా తన తల్లిని వివాహం చేసికొన్నదీ... అర్థం అయింది.


తను మంగుళూరు నుండి వూరికి వచ్చిన రాత్రి... భీమారావుకు తనకు మధ్యన జరిగిన సంభాషణ... తన కొడుకు గోపాల్ను గురించి భీమారావు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తను తాతయ్యకు యిచ్చిన మాటా... గుర్తుకు వచ్చింది. తన మాట మీద తను నిలబడాలని నిర్ణయించుకొన్నాడు. తన మాట... చేతుల వల్ల తండ్రిని... తాతయ్య నొప్పించకూడదనికొన్నాడు.


ఆ కాగితాలను మడిచి కవర్లో పెట్టాడు. 'దీన్ని ఎవరి కంటా పడకుండా జాగ్రర్తగా దాచాలి. అనుకొని ఆ కవర్ను తన ప్యాంట్ జేబులో వుంచుకొన్నాడు. యింటికి వెళ్ళాక... తన మంచంపైన వున్న పరుపు కవర్లో దాచాలని నిర్ణయించు కొన్నాడు. కానీ... యీ విషయం ఏనాటికైనా తన తల్లికి తెలిస్తే.. ఆమె ఎలా ప్రవర్తిస్తుందో అన్న భయం ఆది మనస్సున వుండిపోయింది. అకౌంట్సు మ్యానేజర్ సత్యారావును పిలిచి... కొటేషన్స్, సప్లయర్స్ బిల్సు... బ్రాంచీల ఫండ్లను గురించి మాట్లాడి... తన నిర్ణయాన్ని తెలిపి ఆ కాగితాలన్నీ సత్యారావుకు సంతకం చేసి యిచ్చాడు.


మిత్రుడు శివా ఫోన్ చేశాడు. అందరం కలిసివచ్చి నిన్ను చూడాలను కొంటున్నామని చెప్పాడు. తండ్రికి తాతయ్యకు ఫోన్ చేసి... మన అన్ని బ్రాంచీలను చూచి వచ్చేదానికి పైవారం బయలుదేరాలనుకొంటున్నానని వారికి చెప్పాడు. వారు అంగీకరించారు.


ఆది స్నేహితులు శివ, నంద, రాము, మాధవ్, వేణు వచ్చారు. ఆది వారితో తను స్థాపించదలచిన 'గ్రామ సేవా సమాజం'... గురించి చర్చించాడు. “యీనాటికి స్వాతంత్య్రం మనకు సిద్ధించి అరవై ఏడు సంవత్సరాలు అయినా... యింకా కొన్ని గ్రామాల్లో ప్రజలకు ఎన్నో సమస్యలున్నాయి. తమ వూరి సమస్యలను... తాముగా పరిష్కరించు కోనేదానికి మనలాంటి యువత జి.యస్.యస్ సభ్యులుగా చేరాలి. ఈ జి.యస్.యస్ ప్రతి గ్రామంలోనూ వుండాలి. కనుక... మీరంతా నాతో ఏకీభవిస్తే ముందుగా మన వూర్లో... తర్వాత నెలరోజుల లోపలి చుట్టు ప్రక్కల వున్న యిరవై గ్రామాల్లో జి.యస్.యస్ను స్థాపించాలని... ఆ తర్వాత మరో యిరవై గ్రామాలు... యీ రీతిగా జి.యస్.యస్ మన తాలూకా... యితర తాలూకాలు... కొంత కాలంలో పూర్తి రాష్ట్రవ్యాప్తం చేయాలనేది నా కోరిక.


మన యీ ప్రయత్నంలో మనం కొన్ని సమస్యలను... విమర్శలను ఎదుర్కొవలసి వుంటుంది. కానీ... మనం వాటిని లెక్క.... చేయకూడదు. ధైర్య సాహసాలతో లక్ష్యసిద్ధికి ముందుకు నడవాలి. కొంత కాలంలో మన లక్ష్యాన్ని మనం సాధించగలమనే నమ్మకం నాకుంది. యిందుకు మీ అభిప్రాయం ఏమిటి?... మీ మీ వుద్దేశాలను నిర్భయంగా చెప్పండి. చర్చించి... ఒక నిర్ణయానికి వద్దాం. మరోమాట... ప్రతి గ్రామంలోనూ రాజకీయ పరంగా... రెండు వర్గాలు... యింకా ఎక్కువే... వుండవచ్చు. మన జి.యస్.యస్. ఏ వర్గానికి... పార్టీకి సంబంధించినది కాదు. దీని లక్ష్యాలను నేను నా కంప్యూటరలో ఫీడ్ చేసి వున్నాను. చూడండి.”


తన కంప్యూటర్ను ఓ పన్ చేసి... జి.యస్.యస్ సిద్ధాంతాలను... లక్ష్యాలను వారందరికీ చూపించాడు ఆది.

ఆది నిర్ణయం ఆ అయిదుగురికీ నచ్చింది. 'నీ నిర్ణయానికి మా ఆమోదం... ' అంటూ వారంతా... అదిని అభినందించి అతనితో చేతులు కలిపారు.


తాత భీమారావు... తండ్రి గోపాల్రావు... తల్లి గౌరీ... మేనత్త భవానీ ఆశీస్సులతో ఆ వూర్లో... సుభముహూర్తాన జి.యస్.యస్ ను స్థాపించారు ఆ ఆరుగురు యువకులు అది నాయకత్వంతో, వారం రోజుల్లోనే మరికొందరు విద్యార్థులు జి.యస్.యస్లో చేరారు.


తన పోగ్రామ్ ప్రకారం ఆది... తమ అన్ని బ్రాంచీలకు వెళ్ళి బ్రాంచి మ్యానేజర్స్ తో తదితరులతో మాట్లాడి బ్రాంచిని అభివృద్ధి పరిచేటందుకు అందరూ కలసి ఐకమత్యంతో... పనిచేయాలని, నెలకొకసారి తను వస్తానని... మీ అవసరాలను తీరుస్తానని చెప్పాడు. ఆది మాటలకు... లక్ష్యానికి అందరూ ఆనందించారు. వారం రోజుల్లో తన టూర్ ముగించుకొని వూరికి చేరాడు ఆది బెంగు ళూకు మాత్రం వెళ్ళలేదు.


ఆయా బ్రాంచి మేనేజర్లు... భీమారావుకు... గోపాల్కు ఫోన్ చేసి ఆదిని అభినందించారు. ప్రశంసించారు.

మంచి ముహూర్తాన 'భీమారావు కన్స్ట్రక్షన్ ప్రయివేట్ లిమిటెడ్, రిజిష్టర్ అయింది. భీమారావు ఆదికి తెలియకుండా రామాచారి... ప్రొఫెసర్తో మాట్లాడి... వారి అమ్మాయి ప్రేమను క్రొత్త కంపెనీలో వుద్యోగం... యిచ్చాడు. ప్రేమ ఆది యింటికి వచ్చింది. ఆమెను... చూచి ఆది ఆశ్చర్యపోయాడు. భీమారావు తను ప్రేమకు వుద్యోగాన్ని యిచ్చానని... గోపాల్... ఆదికి... గౌరీలకు చెప్పాడు. ఆమెకు ఆఫీస్ లో ఒక ప్రత్యేక గదిని ఏర్పాటుచేశాడు. తన యింట్లోనే ఆమెను... వుంచుకొన్నాడు. క్రొత్త కంపెనీ బాధ్యతలను భీమారావు ప్రేమకు అప్పగించాడు. ఆది నీవు కలసి దీన్ని వృద్ధిచేయాలని చెప్పాడు.


వారం రోజుల్లో ప్రేమ... గౌరికి ఎంతో సన్నిహితురాలైపోయింది. నెల రోజుల్లో ఆ యింటి మనిషిగా.... మారిపోయింది. ప్రేమ యింట్లో అన్ని విషయాలకు గౌరి సాయంగా నిలిచింది.

ఆది... యిటు ఆఫీస్ వ్యవహారాలు... తను స్థాపించిన జి.యస్.యస్ వ్యవహారాలతో ఎప్పుడూ చాలా బిజీగా వుండేవాడు.


నెల రోజుల్లో భీమారావు... గోపాల్రావు... ఆది... సహకారతో... ప్రేమ కొత్త కంపెనీకి పది కోట్లు రెండు ఆర్డర్స్ను సంపాదించింది. నలుగురు యింజనీర్లును... పది మంది సూపర్వైజర్సుకు ప్రాజెక్ట్ నిర్వహణకు భీమారావు సలహాతో గోపాల్ ఆర్డర్స్... రీలీజ్ చేశాడు. ప్రాజెక్టు పనులు ప్రారంభమైనాయి.


రెండు నెలలలో జి.యస్. యస్... పాతిక గ్రామాల్లో వెలసింది. జి.యస్.యస్ లక్ష్యాలు పేపర్లకు ఎక్కాయి. ఆదిత్య తదితరుల ఫోటోలు పత్రికల్లో ప్రచురణ జరిగింది.

యిటు ఆఫీస్ పని... అటు పబ్లిక్ సేవా కార్యక్రమాలను నిర్విరామంగా ఆది నిర్వహిస్తూ యింటా బయట మంచి పేరు తెచ్చుకొన్నాడు. జిల్లాలో అతని పేరు అందరికీ తెలిసింది.

****

భీమారావు ఆదేశానుసారం గోపాల్... బెంగుళూరు వెళ్ళాడు. శాంతిని కలిసి యోగక్షేమాలను విచారించాడు. కానీ... తను యింట్లో వున్న సమయంలో ఆనంద్ యింటికి రానందుకు బాధపడ్డాడు.


ఆఫీస్ గోపాల్... ఆఫీసుకు సంబంధించిన విషయాలను ఆనంద్ ను అడగక ముందే 'సార్... సార్' అంటూ అన్నీ వివరించాడు.


యిరవై మూడు సంవత్సరాల వయస్సు వచ్చినా... ఆనంద్ తన్ను చిన్న తనంలో ద్వేషించిన రీతిగానే అసహ్యించు కొంటున్నాడని శాంతితో చెప్పి... గోపాల్ విచారపడ్డాడు. వారి విషయం... తండ్రి భీమారావుకు తను లేఖ ద్వారా తెలియజేశాననీ... ఆయన తన్ను ఏమీ అడగలేదని... ఎప్పటిలాగే ఎంతో అభిమానంగా తనయందు వున్నాడని... ఏ విషయానికీ శాంతిని బాధపడవద్దని... ఆమెతో చెప్పాడు గోపాల్.


వైజాగ్ నుంచి... మురారి జయలు శాంతిని చూచేదానికి గోపాల్ అక్కడ వుండగానే వచ్చారు.


ఆ సాయంత్రం... గోపాల్, మురారీలు రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకొంటున్న సమయంలో ఆనంద్... ప్రేమలు అదే రెస్టోరెంటుకు వచ్చారు. వారు గోపాల్రావు... మురారీలను చూడలేదు. నవ్వుకొంటూ ఒక మూలన వున్న టేబుల్ ముందు... ప్రక్కప్రక్కగా చూర్చొని ఏదో ఆర్డర్ చేశారు. వారిరువురు సరదాగా `మాట్లాడుకొంటూ నవ్వుకొంటున్నారు.


ఆ సమయాన ప్రేమ తండ్రి ధనుంజయరావు... ఆ రెస్టారెంట్లో ప్రవేశించాడు. ప్రేమ... ఆనంద్ లు వున్నవైపు పోబోతూవున్న అతన్ని చూచిన గోపాలరావు, ధనుంజయరావును సమీపించి తన టేబుల్ దగ్గరకు తీసికొని వచ్చాడు. ఆ ముగ్గురూ... టి బిస్కెట్స్ తీసుకొని వెళ్ళిపోయారు. తను ఆఫీస్ పనిమీద వచ్చానని, రేపు ప్రేమను కలసి బళ్ళారికి వెళతానని చెప్పాడు ధనుంజయరావు. అతనికి వీడ్కోలు చెప్పి... గోపాల్ మురారీలు వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం... మురారి... జయ వైజాగ్ వెళ్ళిపోయారు.


గోపాల్... బయలుదేరబోతూ... శాంతితో తను రెస్టారెంటులో చూచిన సన్నివేశాన్ని శాంతికి వివరించాడు. ఆనంద్ ని... ఆ పిల్లతో కలవడం మానమని చెప్పవలసిందిగా... శాంతికి చెప్పాడు. అది కొనసాగి... పెండ్లివరకూ వస్తే... తను సమస్యలో యిరుక్కోవలసి వస్తుందని శాంతిని హెచ్చరించాడు. నెల్లూరుకు బయలుదేరి వెళ్ళిపోయాడు.


వూరికి వచ్చిన తర్వాత... చెల్లెలు భవానీతో... విషయాన్ని చెప్పి ఆ అబ్బాయి ఎవరో... అతనితో తిరగవద్దని ప్రేమకు చెప్పవలసిందిగా కోరాడు. భవాని కూతురు చేష్టలకు... ఆశ్చర్యపోయిది. ప్రేమ బుద్ధి యీలా మరినందుకు బాధపడింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ధనుంజయరావు ఆశ్చర్యపోయాడు.


బళ్ళారి నుంచి మరలా బెంగుళూరికి వెళ్ళాడు... ధనుంజయరావు. రెండు రోజుల క్రింద కలసిన తండ్రి మరలా రావడాన్ని చూచి ప్రేమ ఆశ్చర్యపోయింది. తన భార్య ద్వారా ... తను విన్న విషయాన్ని ప్రేమకు... చెప్పకుండా... మగపిల్లల విషయంలో జాగ్రత్తగా... వుండాలని... అందరూ ఒకేలాగా వుండరని... అరిటాకు ముల్లుమీద పడ్డా... ముల్లు అరిటాకకు తగిలినా... నష్టం అరిటాకుకేనని... ఆడపిల్ల జీవితం అరటాకులాంటిదని... ప్రేమకు నయభోధ చేశాడు ధనుంజయ రావు.


సమాధానంగా ప్రేమ... “నాకు తెలుసు నాన్నా!... మీరు నా గురించి ఆందోళన చెందకండి.” నవ్వుతూ సమాధానం యిచ్చింది. ధనుంజయరావు తలవూపి... “జాగ్రత్త అమ్మా!”... చెప్పి, హాస్టల్ నుండి బయలుదేరాడు.


అతను వెళ్ళిన పావు గంటకు ఆనంద్ అక్కడికి... వచ్చాడు. అతనితో కలసి ప్రేమ సిటీకి వెళ్ళిపోయింది.


ధనుంజయరావు క్యాంప్ నుంచి తిరిగి వచ్చాడు. ప్రేమను తను రెండవసారి కలసి మాట్లాడిన విషయాన్ని... దానికి ఆమె యిచ్చిన జవాబు భార్య భవానీతో వివరంగా చెప్పాడు. భవానీ... తన భర్త చెప్పిన మాటలను... విశ్వసించ లేకపోయింది. కారణం... ప్రేమ యుక్తవయస్కురాలైనప్పటి నుంచీ ఆదిత్య ప్రస్తావన వస్తే లేచిపోయేది. ఆమె ఆచర్య... తన కుటుంబసభ్యుల చిరకాల వాంఛకు విరుద్ధం.


పది సంవత్సరాలు ప్రేమను చూడకపోయినా... మాట్లాడకపోయినా... ఆది మనస్సులో ప్రేమ పట్ల ప్రేమ వుందని తనకు తెలుసు. అందుకు ప్రేమ పేర తను ఆదికి వ్రాసిన పుత్తరాలు.... వాటికి ఆది వ్రాసిన జవాబులే సాక్షి. తన మనస్సులోని సంచలనాన్ని తొలిగించుకోవాలంటే... తను ప్రేమతో మాట్లాడాలి. దాని నిర్ణయాన్ని తెలుసుకోవాలి... తన అభిప్రాయాన్ని భర్తకు తెలియజేసి ప్రేమకు ఫోన్ చేసింది భవానీ.


“ఏమ్మా!... రాత్రి పది గంటలప్పుడు ఫోన్ చేస్తున్నావ్?...” చిరాగ్గా ప్రేమ అడిగిన ప్రశ్న.


“నీ వల్ల నా మనస్సుకు శాంతి లేదే!...” కటువుగా చెప్పింది భవాని.


"నీకు అశాంతిని కలిగించే పనిని నేను ఏం చేశాను?...”

భవానీకి... ప్రేమ కంఠంలో ఆశ్చర్యం గోచరించింది.

"నీతోటే తిరుగుతున్న అబ్బాయి ఎవరు?” సూటిగా ప్రేమను నిలదీసి అడిగింది భవాని.


“నా ఫ్రెండ్!... ఆ జవాబులో నిర్లక్ష్యం ధ్వనించింది గౌరికి,

“ఫ్రెండ్ అంటే!...”


"ఫ్రెండ్ అంటే ఫ్రెండ్... బాయ్ ఫ్రెండ్.”

“అతన్ని నీవు ప్రేమిస్తున్నావా!...” నెమ్మదిగా అడిగింది భవాని, ప్రేమ వుద్దేశాన్ని తెలుసుకోవాలని.


"ప్రేమా... దోమా... అలాంటిదేమీ లేదు. అతని తత్వం నాకు నచ్చింది. అందువల్ల అప్పుడప్పుడూ కలుస్తాను. అంతే....” అసహనంగా వుంది జవాబు.

“బావ వూరికి వచ్చాడు.”

“చెప్పావుగా!...” నిర్లక్ష్యంతో నిండివుంది ప్రేమ యీపలుకు,

“నాయీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు.”

"అడుగు.”

"బావను నీవు పెండ్లి చేసికొంటావు కదూ!..."

"చేసికోను."


భవానీ... ఆశ్చర్యపోయింది. ప్రేమ మీద కోపం... ఆవేశం... రెండింటినీ అణచుకొని

"కారణం?..." ఎంతో శాంతంగా అడిగింది భవాని.


"నా దృష్టిలో వాడొక రౌడీ!... కోపిష్టి... అలాంటి వాడు నాకు భర్త కాలేడు. పోద్దు పోయింది. నీతో మాట్లాడటానికి నాలో సహనం నశించింది. కట్చేస్తున్నా!...” సెల్ కట్చేసింది ప్రేమ.


భవానీ చెవులకు ప్రేమ జవాబు కరంట్ షాక్ తగిలింది. తల దిమ్మెక్కిపోయింది. శరీరానికి చమటపట్టింది. కళ్ళనిండా నీళ్ళు. ఏడుస్తూ సోఫాలో కూలబడింది. భర్త ధనుంజయరావు ఆమె స్థితిని చూచి ఆశ్చర్యపోయాడు.


“ఏం చెప్పింది భవానీ!...” ప్రక్కన కూర్చొని మెల్లగా అడిగాడు.

“అది, ఆదిని రౌడీ... కోపిష్టి... అని, వాణ్ణి నేను పెండ్లి చేసుకోనని అందండీ.” బోరున ఏడ్చింది భవానీ.


ధనుంజయరావు ఆమెను ఓదార్చాడు. అనునయించాడు. అతని నయవచనాలు... ఆమె ఆవేదనను తీర్చలేక పోయాయి.


“చదువు మాన్పించి ప్రేమను యింటికి తీసుకొనిరానా భవానీ!...” మెల్లగా భార్య కన్నీటిని తుడుస్తూ... ఆడిగాడు ధనుంజయరావు.


“ఒద్దు. దాని ముఖాన్ని నేను చూడదలచుకోలేదు.” ఆవేదనతో భవానీ మంచంపై వాలిపోయింది.

======================================================


ఇంకా వుంది======================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


30 views0 comments

コメント


bottom of page