top of page

మానవత్వం పరిమళించిన వేళ


'Manavathvam Parimalinchina Vela' written by Padmavathi Thalloju

రచన : పద్మావతి తల్లోజు

"మమ్మీ! నువ్వా స్వీట్స్ తింటావా?" అన్న ప్రశ్నకు ఉలిక్కిపడి, నా ఆరేళ్ల కొడుకు సన్నీ వైపు చూశాను.

వాడి ఎడమచేతిలో పెళ్లి వారిచ్చిన స్టీల్ టిఫిన్ బాక్స్, కుడి చేతిలో దాని తాలూకు కవరు ఉన్నాయి. తన ప్లేట్లోని స్వీట్స్ కవర్లో వేసి నా వైపు, నా చేతిలోని ప్లేట్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు.

"స్వీట్స్ ఇంటికి తీసుకెళ్లడానికి ప్యాక్ చేస్తున్నట్లు ఉన్నాడు. “అన్నీ వాడి నాన్నమ్మ బుద్ధులే! ఆవిడా అంతే! ఎక్కడైనా పెళ్లికో, పేరంటానికో వెళితే తాను తినకుండా స్వీట్లు గట్రా కర్చీఫ్ లో కట్టుకొచ్చేది. అసలే దగ్గరి బంధువుల పెళ్లి. వీడు నా పరువు తీస్తున్నాడు" అంటూ మా వారి దగ్గర విసుక్కున్నాను.

కళ్ళతో గదమాయించినా వాడు వినే పరిస్థితిలో లేడు. ఎలాగూ నేను స్వీట్లు ఇష్టంగా తినను. ఎటూ పాలుపోక వాటిని కవర్ లో వేశాను. అంతే! వాడు ఒక్క సారిగా కవరుతో సహా ఫంక్షన్ హాలు గేటు వైపు పరుగెత్తాడు. ఎక్కడైనా తప్పిపోతాడనే కంగారులో నేను, మావారు చేతులు కడగకుండానే వాడిని వెంబడించాం. గేటు దాకా వెళ్లి చూద్దును గదా.. అక్కడ బిచ్చమెత్తుకునే చిన్న పిల్లాడికి స్వీట్స్ ఉన్న కవర్ ఇస్తూ కనిపించాడు సన్నీ.

"ఏంటి సన్నీ ఇది.. అలా చెప్పకుండా పరిగెత్తుకొస్తే ఎలా? ఎంత కంగారుపడ్డామో తెలుసా?" అన్నారు మా వారు.

"డాడీ! ఆకలేస్తుందనుకుంటా.. పాపం! ఈ బాబు చాలాసేపటి నుండి ఎండలో ఇక్కడే నిలుచున్నాడు" అన్నాడు సన్నీ జాలిగా.

"కాసేపాగితే ప్లేట్లలో మిగిలిపోయినవి తెచ్చి వేసేవారు గా, దానికి నువ్వు పరిగెత్తుకు రావాలా?" అన్నాను నేను కోపంగా.

"అలా డస్ట్ బిన్లో వేసినవి తింటే చిన్న పిల్లాడు కదా.. వీడికి జ్వరం రాదా మమ్మీ!" సన్నీ నుండి సమాధానం లేని ప్రశ్న. నేను, మా వారు ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం.

మా బంధువులు బాగా ఉన్నవాళ్లు కావడంతో కేవలం తిండికే లక్షలు ఖర్చు పెట్టారు. ఆ ఐటమ్స్ వడ్డించు కోవటానికి ప్లేటు సరిపో లేదంటే నమ్మండి. ఇలాంటి ఆర్భాటాల పెళ్లి కి వచ్చేవారు ఆకలితో వస్తారా మరి? రుచి చూడడానికి అన్నీ వడ్డించు కోవడం.. చెత్త బుట్ట పాలు చేయడం! ఆ పసివాడికి వచ్చిన ఆలోచన మాకు రానందుకు సిగ్గేసింది. వాడిని అభినందించాలని ఉన్నా, మా అహం అందుకు అడ్డొచ్చింది.

***

ఆరోజు సన్నీ బడికి సెలవు. వాడికి ఏమైందో తెలియదు కానీ, ఉదయం లేచిన దగ్గర నుండి అటక పైనున్న తోపుడు బండి కావాలని ఒకటే ఏడుపు. వాడిని ఎలా సముదాయించాలో నాకర్ధం కావడం లేదు. ఇవ్వడానికేమీ లేదుగానీ, అది మా వారి చిన్ననాటి జ్ఞాపకం. సన్నీ చిన్నతనంలో కూడా వాడికి ప్రత్యేకంగా ఓ ప్లాస్టిక్ వాకర్ కొని తెచ్చారు మావారు. కానీ, ఆ బండిని మాత్రం అటక దించలేదు.

సన్నీ తన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడనే ఒకే ఒక్క కారణంతో ఇంకో ఆలోచన లేకుండా వాడికా బండినిచ్చి, కాంపౌండ్లోనే ఆడుకోమని చెప్పి నేను టీవీ సీరియల్స్ చూడడంలో మునిగిపోయాను. ఓ గంట గడిచాక చూస్తే సన్నీ అలికిడి ఎక్కడా లేదు. మా ఇంటి పక్కనే కార్పెంటర్ షాప్ లో కనిపించాడు. అక్కడ పనిచేసే పిల్లలందరికీ సన్నీ అంటే చాలా ఇష్టం. వీడు కూడా సెలవొస్తే చాలు వాళ్లు చేసే పనులు చూస్తూ, రోజంతా అక్కడే గడిపేస్తాడు.

నేను చూస్తుండగానే.., సన్నీ ఆ కార్పెంటర్ కుర్రాడిని వెంటబెట్టుకొని రోడ్డు వైపు వెళుతున్నాడు. నాకు కంగారేసి వాళ్ళ వెనకే పరిగెట్టాను.

ఆ రోడ్డు పక్కనే పుట్టుకతోనే కాళ్ళులేని బిచ్చగత్తె ఉంటుంది. చేతుల సాయంతో జరుగుతూ, తన మిగిలిన శరీరాన్ని నేలమీద ఈడుస్తూ అందరిని యాచిస్తూ, చాలా దీనంగా తన జీవితాన్ని గడుపుతుంది.నేల మీద రాపిడికి ఆమె శరీరమంతా పొక్కులు తేలి, అక్కడక్కడ రక్తపు చారికలు కూడా కనిపిస్తాయి. తాను నాకు తారసపడి నప్పుడల్లా రాత్రి మిగిలిపోయిన అన్నమో లేదా ఒక రూపాయో ఇచ్చి దాని జీవితాన్ని నేనే ఉద్ధరించినట్లుగా ఫీల్ అవుతుంటాను.

వాళ్ళిద్దరూ వెళ్లి ఆ బిచ్చగత్తె దగ్గరే ఆగారు. ఎందుకో అర్థం కాలేదు! దగ్గరకు వెళ్లి చూద్దును గదా.. ! మా వారి తోపుడు బండిని ఆ బిచ్చగత్తెకు ఇస్తున్నారు. పరీక్షగా చూస్తే ఆ బండి రూపురేఖలే మారిపోయాయి. సన్నీ పాత కారు చక్రాన్ని, నాలుగో చక్రం గా అమర్చి, వాటిపైన ఒక చెక్కని చేర్చి, నాలుగు చక్రాల తోపుడు బండిలా దాన్ని తయారు చేశారు. ఇదంతా మా సన్నీ ఐడియా అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ కుర్రాడు, సన్నీ కలిసి ఆ బిచ్చగత్తెను బండి పై కూర్చోవడానికి సహాయం చేశారు. విచిత్రం! ఆమె తన చేతులతో నేలను వెనక్కి తోస్తూ సునాయాసంగా రోడ్డు దాటుతోంది. దాని కళ్ళలో సంతోషం మనం లక్ష రూపాయలు ఇచ్చినా రాదు. అందుకే అన్నారు 'ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న' అని.

వయసుకు మించిన మంచి పని చేసినందుకు వాళ్ళిద్దరినీ ఏమి అనలేక పోయాను. కానీ, సమస్య అది కాదే! అటక సర్దుతూ ఓసారి చూసుకోక నేను బండిని జారవిడిచినందుకే మా వారు నన్ను కొట్టినంత పని చేశారు. నా అదృష్టం బాగుండి ఆ బండికేమీ కాకపోవడంతో నేను ఆరోజు బతికిపోయా!

కానీ, సన్నీ దాని ఆనవాలే లేకుండా చేశాడీరోజు! నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు. సన్నీని పిలిచి "సన్నీ! నాన్నకీ విషయం తెలిస్తే కోప్పడతారు. నువ్వూ నాన్నకేం చెప్పకు. నా చేతి నుండి జారిపడి విరిగిపోయిందని చెబుతాను. సరేనా?"అన్నాను.

దానికి వాడు "అలా అబద్ధం చెప్పడం తప్పు కదా మమ్మీ! ఆ అవ్వకి అది పనికొచ్చిందిగా!" అంటున్నాడు. అవసరానికి తగ్గట్టుగా అలవోకగా అబద్ధాలాడేసే మనకు, పిల్లల చేత అబద్ధాలు ఆడించడం ఎంత కష్టమో నాకు ఇప్పుడే అర్ధమవుతోంది.

***

సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి చేరే మా వారు ఏడైనా అయిపు లేరు. ఉద్యోగాలు చేసే వారి సగం జీవితం ఈ ట్రాఫిక్ లోనే గడిచిపోతోంది. మా ఊర్లో ఉన్నప్పుడే బాగుండేది. అన్నట్టు మా ఊరి గురించి, మా గురించి మీకు చెప్పడం మరిచాను. సిటీకి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ పల్లెటూరు మాది. ఇంటికి పెద్ద కోడలిని నేను. అత్తమామల సేవలో తరిస్తూ, మా తరువాతి ముగ్గురు మరుదులను ఓ ఇంటి వాళ్లను చేసి నేను, మా వారు ఊళ్లో మంచి పేరు సంపాదించుకున్నాం. నా దురదృష్టమేంటో గాని, పెళ్లయి పదేళ్లు అయినా నాకు సంతాన భాగ్యం కలగలేదు. అసలే పల్లెటూరు. గొడ్రాలినంటూ.. నా వెనకే చెవులు కొరుక్కునే వాళ్ళు. నేను బాధ పడడం చూసి మా అత్తయ్య తట్టుకోలేకపోయేది.

"నాక్కూడా పెళ్లయిన పదేళ్లకి మా పెద్దాడు కడుపులో పడ్డాడు. మా పెద్ద కోడలికి నా సాలే వచ్చింది." అంటూ అడిగిన వారికి, అడగనివారికి చెబుతూ ఆ మాటనే దాటవేసే ప్రయత్నం చేసేది. వారి కాలంలో చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ విధంగా చూస్తే తనకి, నాకు ఎంతో వ్యత్యాసం ఉంది. మా అత్తగారు ఊర్లో వారికే కాదు, అసలు ఇంట్లో వారికి కూడా తెలియకుండా ఎంతోమంది డాక్టర్లకు నన్ను చూపించి, రహస్యంగా మందులు ఇప్పించేది. ఒక విధంగా చెప్పాలంటే మా సన్నీ మా అత్తగారి వరప్రసాదం.

పిల్లల చదువు పేరుతో ఇద్దరు మరుదులు పట్టణాల్లో స్థిరపడితే, ఉద్యోగరీత్యా చిన్న మరిది యూఎస్ఏలో స్థిరపడ్డాడు. మా మామగారు పోయాక నా పోరు పడలేక మావారు హైదరాబాదుకు మకాం మార్చారు. ఇక మా అత్తగారి విషయంలో తోటికోడళ్ళం విశాల హృదయాలతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. ముగ్గురు కోడళ్ళం తలా నాలుగు నెలలు ఆవిడను పంచుకున్నాం. చిన్న కోడలు ఉండేది విదేశంలో కావడంతో ఆవిడకి కాన్పులకి తప్ప మా అత్తగారి అవసరం ఉండదు. ఈ పంపకంలో మా అత్తగారి మానసిక పరిస్థితిని అంచనా వేసే తీరిక, ఓపిక మాకెవరికీ లేదు.

నా తర్వాతి తోటికోడలికి మా అత్తగారు తన దగ్గర ఉన్నప్పుడే క్రమశిక్షణ గుర్తొస్తుంది. పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతాయని మా అత్తగారిని టీవీ చూడనివ్వదు. పిల్లలకు సెపరేట్ బెడ్రూమ్స్ కావడంతో సాయంత్రం అయితే చాలు ఎవరి రూమ్ లో వాళ్ళు లాక్ అవుతారు. వెనుకటి కాలంలో ఇళ్లతోపాటు మనుషుల మనసులు కూడా అంతే విశాలంగా ఉండేవి. మనమే వాటికి గోడలు కట్టి, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాం. అక్కడ ఆ నలుగురి మధ్య ఆ నాలుగు నెలలు ఆవిడ ఒంటరితనాన్నే అనుభవిస్తుంది.

ఇక మూడో కోడలి విషయానికి వస్తే ఆవిడకి అత్తగారి కన్నా తల్లి గారి పైనే మమకారం. ఆమె తల్లి గారి కుటుంబం అంతా నెలలో ఇరవై రోజులు కూతురింట్లోనే మకాం వేస్తారు. మా అత్తగారిని పట్టించుకునే నాథుడే ఉండడు. అయిన వాళ్ళ మధ్య కూడా పరాయి దానిలా ముక్కు మూసుకొని ఆ నాలుగు నెలలు అయ్యాయనిపించి నా దగ్గరకి పరిగెత్తుకొని వస్తుంది.

అతిశయోక్తి అనుకోకపోతే ఆవిడ కొద్దోగొప్పో సుఖపడే దంటే నా దగ్గరే! సన్నీ గాని, మా వారు గాని ప్రాణంలా చూసుకుంటారావిడని. సన్నీకి చక్కని నీతి కథలూ, గొప్పవాళ్ళ చరిత్రలూ చెబుతుందావిడ. వాడిలో కనిపించే ఆ మానవత్వపు ఛాయలు కూడా ఆమె నుండి అలవడినవే. పల్లెటూర్లో చక్కని పలకరింపులకు అలవాటు పడిన ఆవిడ ఈ పట్నాల్లో పెట్టుడు ఆప్యాయతల మధ్య ఇమడలేక పోతోంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది.. సిటీకి మా ఊరు ఏమంత దూరం కాదు. అక్కడ కూడా మంచి స్కూళ్లు ఉన్నాయి. మా సన్నీ చిన్నవాడే కావడంతో వాడి గురించి మరీ అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. మా వారు ఉద్యోగానికి శ్రమనుకోక బస్సులో తిరగ గలరు. ఈ పంపకాల బాధనుండి మా అత్తగారిని తప్పించి, ఆమె చివరి రోజులు మాతో, మా సొంతూరులో ప్రశాంతంగా గడిచిపోయేలా చేయాలని. మా వారి అభీష్టం కూడా అదే! కానీ, సిటీలో ఉండాలన్న కోరిక, తోటి కోడళ్ళు ముగ్గురుండగా అత్తగారి బాధ్యత నేను ఒక్కదాన్నే ఎందుకు తీసుకోవాలన్న పంతమూ.. నన్ను మా ఊరికి వెళ్లనివ్వడం లేదు.

***

ఇలా నా ఆలోచనలతో నేనుండగా.. మా వారి స్కూటర్ శబ్దం వినిపించింది. తేరుకొని చూస్తే, స్కూటర్ పార్క్ చేస్తున్న తండ్రికి సన్నీ కళ్ళు పెద్దవి చేసి, చేతులు తిప్పుతూ కాస్త దూరంలో ఉన్న ఆ బిచ్చగత్తెను చూపిస్తూ జరిగిందంతా చెబుతున్నాడు. ఆయన ఫ్రెషప్ అయ్యాక తన మూడ్ చూసి జరిగిన విషయం చెబుదామనుకున్నా! ఉహు... వాడు ఆగితేనా! పిల్లల్లో ఉండే ఈ ఆతృతే మనల్ని ఒక్కోసారి ఇరకాటంలో పడేస్తోంది.

వాడి మటుకు వాడు, చెబుతూ పోతున్నాడు. నేను మాత్రం మా వారి ముఖంలో మారే రంగుల్ని గమనిస్తున్నాను. అంతా విని ఎలాంటి కోపం లేకుండా సన్నీ తలపై చేయి వేసి నిమిరి "వెరీ గుడ్! మంచి పని చేశావు. వెళ్లి ఆడుకో" అంటూ ఇంట్లోకి అడుగు పెట్టారు.

ఇప్పుడు టెన్షన్ పడటం నా వంతు అయింది. సోఫాలో నీరసంగా కూర్చొని కళ్ళు మూసుకున్న మా వారి దగ్గరికి వెళ్లి, నుదుటి పై చేయి వేసి చూసాను.. జ్వరం ఉందేమో అని. నా చేతి స్పర్శకే కళ్ళు తెరిచారు. కళ్ళనిండా నీళ్ళు. చలించిపోయాను.

"మీకు బాధ కలిగించినందుకు క్షమించండి. సన్నీ మారాం చేస్తే బండి ఇచ్చాను" అంటూ నేను సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే, ఆయన వద్దని చేత్తో వారించారు.

"నేను దాని కోసం బాధపడట్లేదు వసూ! వస్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ చూశాను. ఓ కుర్రాడు ఎంసెట్ కోచింగ్ కు వెళుతూ బస్సు కింద పడి చనిపోయాడు. కొనప్రాణంతో దాదాపు రెండు గంటలు రద్దీగా ఉండే ఆ రోడ్డుపై పడి కొట్టుకుంటున్నా.. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. నేను కాస్త ధైర్యం చేసి ముందుకు వెళ్దాం అంటే.. పోలీస్ కేసు అవుతుందని ఊదరగొట్టి అందరూ నన్ను వెనక్కి లాగేశారు. '108'కి ఫోన్ చేశాను. కానీ, అది వచ్చే లోపే ఆ పిల్లాడి ప్రాణం పోయింది. మానవత్వాన్ని మరిచి, మనసులు చంపుకొని మనం సాధిస్తున్న ఈ ప్రగతి దేనికోసం వసూ! పసివాళ్లు దేవుడితో సమానం అంటారు. పెరిగే కొద్ది ఆ దైవత్వాన్ని వీడి రాక్షసుల్లా ఎందుకు మారుతున్నాం? కనీసం ఈ పసి వయసులో సహాయంచేసే మన సన్నీ చిన్ని చేతుల్ని ఆంక్షల పేరుతో సంకెళ్లు వేసి ఆపొద్దు. ఇకనుండి వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేద్దాం" ఆయన ఆవేదన అంతటితో ఆగలేదు. రాత్రి నిద్రలో కూడా అవే పలవరింతలు.

మావారి మంచితనాన్ని బేరీజు వేసే ప్రయత్నంలో ఆ రాత్రి నాకు కలత నిద్రే ఎదురయింది. మా అత్తగారి వృద్ధాప్యం, సన్నీ ముందున్న భవితవ్యం, మా వారిలో దాగున్న మానవత్వం.. పల్లెదనాన్నే కోరుకుంటున్నాయి. ఆ మరునాడు సొంతూళ్లో స్థిరపడదామనే నా నిర్ణయాన్ని మావారి ముందుంచాను. ఆ క్షణాన ఆయన కళ్ళలో కదలాడిన వెలుగు రేఖ నా దృష్టిని దాటిపోలేదు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.



153 views0 comments

Comments


bottom of page