'Manasu mata vinadu' written by Padmavathi Thalloju
రచన : పద్మావతి తల్లోజు
లిఫ్ట్ ఉన్న సంగతి కూడా మర్చిపోయి, మెట్ల వెంట పరుగులు తీశాను ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న మా ఇంటి నుండి ఫస్ట్ ఫ్లోర్ లోకి. దానికి కారణం సుధ! తాను నాకు పెట్టిన మెసేజ్!
గవర్నమెంట్ టీచర్ గా పని చేసే నేను, సిటీలో ఓ పేరున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే మా వారు, మా ఇద్దరు పిల్లలతో సహా ప్లాట్ కొని, అందులోకి ప్రవేశించడం జరిగింది. గృహప్రవేశ సమయంలో అడక్కుండానే కావలసిన వస్తువులు ఇచ్చి నా మనసుకు దగ్గరయింది సుధ. పెళ్లయి ఎనిమిదేళ్లయినా, పిల్లలు లేని తాను మేము ఉద్యోగరీత్యా బయటికి వెళ్లినప్పుడు మా పిల్లల్ని తన పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంది.
ప్రతిరోజు రాత్రి 10 గంటల 30 నిమిషాలు తర్వాత ఇద్దరం కాసేపు ఫోన్లో చాట్ చేసుకుని పడుకునే వాళ్ళం. "చాలా విరక్తిగా ఉంది. నాకు చచ్చిపోవాలని ఉంది నీలూ!" అంటూ ఇందాక సుధ నుంచి వచ్చిన మెసేజ్ నా ఊపిరిని ఆగిపోయేలా చేసింది. వెంటనే తనకి కాల్ చేశాను. రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయడం లేదు. మా వారి మొబైల్ నుండి సుధ భర్త కిరణ్ కు డయల్ చేశాను.
" అన్నయ్యా! సుధ ఎక్కడుంది? సూసైడ్ చేసుకుంటానని నాకు మెసేజ్ పెట్టింది. వెంటనే తనను ఆపండి" అంటూ అరిచాను.
కానీ, కిరణ్ చాలా కూల్ గా "అదేం లేదమ్మా! ఇది తనకు అలవాటే. అసలు విషయం ఏమిటంటే.." అంటూ నిదానంగా మాట్లాడుతున్న తన మాటలకు చిర్రెత్తుకొచ్చి కాల్ కట్ చేసి, ఫస్ట్ ఫ్లోర్ కి పరిగెత్తాను.
‘నీ పెళ్ళాం చావబోతుంది రా.. మగడా!’ అంటే ‘అది తనకు అలవాటే’ అంటాడు..! కొంపదీసి సుధ నిర్ణయం వెనుక కిరణ్ హస్తం లేదు కదా! పిల్లలు లేరని మానసికంగా చిత్రవధ చేశాడా? మరో పెళ్లి చేసుకుంటానని సుధ గుండెల్లో గునపాన్ని దించాడా? చిత్ర విచిత్రంగా సాగుతున్న నా ఆలోచనలతో పాటు నా పరుగు కూడా సుధ ఇంటిముందు ఆగిపోయింది. డోర్ తీసిన కిరణ్ను ఒక్క తోపు తోసి, "సుధా!" అంటూ లోపలికి పరిగెట్టాను. నా తోపుకు కింద పడ్డ కిరణ్ లేచి దులుపుకుంటూ నా వెనకే వచ్చాడు.
నన్ను చూడగానే మంచంపై పడుకున్న సుధ ఒక్కసారిగా లేచి నన్ను కావలించుకుని బోరుమంది. "మూడు నెలలు దాటింది నీలూ! ఎంత అపురూపంగా చూసుకున్నాను. నిన్నటితో అది ముగిసిపోయింది" వెక్కిళ్లు పెడుతూ. ‘అంటే..అంటే..! తనకు అబార్షన్ జరిగిందా? ఓ మై గాడ్!’ నా మనసు బాధతో బరువెక్కింది.
"ఇది నాలుగవ సారి! ఇంకా తాను అలవాటు పడకపోతే ఎలా? మరీ చిన్న పిల్లలా ఆ ఏడుపు ఏంటి? మళ్ళీ వచ్చే సారీ .."అంటున్న కిరణ్ మాటలకు అడ్డుతగులుతూ,
" మీరసలు మనిషేనా? మిమ్మల్ని అన్నయ్యా! అంటూ పిలవాలంటేనే అసహ్యంగా ఉంది నాకు. నాలుగు సార్లు భార్యకి అబార్షన్ అయితే ఆ విషయాన్ని ఇంత తేలికగా తీసుకుంటారా? మంచి గైనకాలజిస్ట్ కు చూపించి మందులు ఇప్పించాల్సింది పోయి.."అంటూ కోపంగా అరుస్తున్న నన్ను సుధ మధ్యలోనే ఆపేసి,
" ఏం మాట్లాడుతున్నావ్ నీలూ! అబార్షన్ ఏంటి ? గైనకాలజిస్ట్ ఎందుకు? నేను బాధపడుతున్నది "బిగ్ బాస్ షో" గురించి. ఆదివారంతో అది కాస్తా ముగిసిపోయింది. సోమవారం అంతా ఏం చేయాలో తోచక పిచ్చెక్కినట్టు అయింది .ఇటువంటి పరిస్థితుల్లో బతికి ఏం సాధించమంటావ్ నీలూ!" అంటూ బేలగా అడుగుతున్న సుధ మాటలకు అవాక్కయ్యాను. లాగిపెట్టి కొట్టాలని ఉన్నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని, తనలో ఈ యాంగిల్ ఏమిటి ? అన్నట్టు కిరణ్ వైపు చూశాను.
"బిగ్ బాస్ ప్రతి సీజన్ తర్వాత మాకు ఇది మామూలే ! రెండు రోజులు బాధపడి తానే అలవాటు పడిపోతుంది. మీరు కొత్తగా వచ్చారు కదా! తన విషయం మీకు పూర్తిగా తెలియదు. ఇదే నేను మీకు అప్పటి నుండి చెప్పాలని ట్రై చేస్తుంటే, మీరు నన్ను అస్సలు మాట్లాడనివ్వడమే లేదు. మీ పాటికి మీరు నా మీద నిందలు వేస్తూనే ఉన్నారు . లోకంలో ఎదుటి వాళ్ళు చెప్పేది విననిది మా ఆవిడ ఒక్కతే అనుకున్నాను. ఇంకా చాలామందే ఉన్నారు. "అన్నాడు కిరణ్ కాస్త వెటకారంగా!
"సారీ అన్నయ్యా!" అంటూ, నా తొందరపాటు తనానికి సిగ్గుపడుతూ అక్కడి నుండి లేచి వచ్చేశాను.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> మంచు తెర
రచయిత్రి పరిచయం :
నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.
コメント