top of page

మంచు తెర


'Manchu Thera' written by Padmavathi Thalloju

రచన : పద్మావతి తల్లోజు

"ఆ రేవంత్ వైఫ్ సౌమ్యని చూశావా? ఎలా ఉంది?" అతిథులకు వడ్డిస్తున్న సౌమ్య వైపు చూస్తూ అడిగింది చిత్ర, భావనని.


"ఆ... చూసాలే! ఒట్టి పల్లెటూరి బైతు! రాగానే, మా ఆయనతో 'అన్నయ్యా!' అంటూ వరసలు కలిపి, రేవంత్ ను నాకు అన్నయ్యను చేసేసింది. ఊరి తెలివితేటలు ఎక్కడికి పోతాయి" అంది అక్కసుగా భావన.

చిత్ర కిసుక్కున నవ్వి " కొంపదీసి రేవంత్ కు, నీకు మధ్య ఉన్న ఆ అఫైర్ సంగతి సౌమ్యకి చెప్పేశాడా?" అనుమానంగా అంది.


" నాకు తెలిసి రేవంత్ అంత పిచ్చి పని చేయడు. ఎందుకంటే, ఆస్తి కోసమే ఇంత అందగత్తెను, పైగా జాబ్ చేసేదాన్ని నన్ను వదులుకొని, ఏమీ లేని దాన్ని కట్టుకున్నాడు. అసలే పల్లెటూరోళ్లకు పట్టింపులెక్కువ. ఈ విషయం వాళ్లకు తెలిసిందా..? ఆస్తి మాట దేవుడెరుగు. రేవంత్ ను ఊరు నుండి తన్ని, తరిమేస్తారు." అంది ఎగతాళిగా నవ్వుతూ భావన.


ఆ టాపిక్ ఎక్కడికో వెళ్లేలా ఉందని మాట మార్చడానికి చిత్ర "ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మీ వారిని మాత్రం నీకు తగ్గట్టుగా భలే మార్చుకున్నావే!? ఆ డ్రస్.. ఆ హెయిర్ స్టైల్..నేను కాసేపు గుర్తుపట్టలేక పోయాననుకో.." అంది చిత్ర మెచ్చుకోలుగా!


తన భర్త వినయ్ పైపు ఒకింత గర్వంగా చూసుకుంటున్న భావన ఆలోచనలు గతాన్ని పలకరించాయి.

*** *** ***

ఒకే ఆఫీసులో పనిచేసే భావన, రేవంత్ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే, అది కమిట్మెంట్ ప్రేమ. ఎందుకంటే, ఇద్దరికీ సెంటిమెంట్ పాలు కాస్త తక్కువే! తమకు లాభం లేనిది, ఏ పనీ చేయరు. పెళ్లి వరకు వచ్చేసరికి వారిలోని అసలు స్వభావాలు బయటికి వచ్చేశాయి. తన శాలరీ మొత్తం తన అకౌంట్లో వేసుకుంటానని, అవసరమైతే తన పుట్టింటి వారి కోసం ఖర్చు పెట్టుకుంటానని భావన పెళ్లికి ముందు రేవంత్ కు కండిషన్ పెట్టింది. ఆమె శాలరీ మీద ఆశ వదులుకోవాలి అని అనగానే, రేవంత్ ఆలోచనలో పడ్డాడు.


తన తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని ఊరు వెళ్లిన వాడు, బాగా ఆస్తి పరుడైన తన మేనమామ ఒక్కగానొక్క కూతురు సౌమ్యతో నిశ్చితార్థం చేసుకునే వచ్చాడు. భావన నిలదీస్తే.., తన తండ్రికి ఆరోగ్యం క్షీణించిందని.. అందుకే, పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చిందని తేలిగ్గా అబద్దం ఆడేశాడు. గత్యంతరం లేక భావన అప్పటికే ఊరుకుంది. తాను వెళ్లలేదు కానీ, ఆ పెళ్లికి వెళ్లి వచ్చిన చిత్ర అసలు విషయం చెబితే గాని, భావనకు అర్థం కాలేదు రేవంత్ ఎంత అవకాశవాది అనేది. ఆవేశంతో ఊగిపోయింది. ఆవేశం కాస్తా పంతంగా మారి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదిస్తున్న వినయ్ ని ముక్కు మొహం చూడకుండానే పెళ్ళాడేసింది. ఆ తర్వాత రేవంత్ తో, తనను పోలుస్తూ, సాధించడం మొదలుపెట్టింది. వినయ్ లోని సింప్లిసిటీ, నెమ్మది తనం ఆమెకు చేతగానితనంగా అనిపించేది. భావన పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం చూచాయగా తెలుసుకున్న వినయ్ మాత్రం.. భావన మీద ప్రేమతో ఆమెను తప్పు పట్టకుండా, కేవలం తన వైపు తిప్పుకోవాలని చేయని ప్రయత్నం లేదు. ఆమె ఇష్టపడేట్టు, తనను తాను మార్చుకోవటం మొదలుపెట్టాడు.

*** *** ***

"భోంచేద్దురు రండి!" అన్న సౌమ్య పిలుపుకు ఈ లోకంలోకి వచ్చిన భావన అందరితో పాటు కూర్చుని తినడం మొదలు పెట్టింది.

" అన్ని వంటలు చాలా బాగున్నాయి. చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను. ఏ హోటల్ నుంచి తెప్పించారు?" అని అడిగింది చిత్ర లొట్టలేసుకుంటూ!


పక్కనుండి వచ్చిన రేవంత్ వెంటనే అందుకుని" ఈ వంటలన్నీ మా సౌమ్యే చేసింది. ఒంటిచేత్తో వంద మందికి వండి వడ్డించ గలదు" అంటూ సౌమ్య భుజంపై చేయి వేసి దగ్గరికి హత్తుకుంటూ అన్నాడు గర్వంగా!


ఆ దగ్గరితనం చూస్తుంటే భావనకు మాత్రం పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది. అక్కడికి వచ్చే ముందు తాను అనుకున్నది ఒక్కటి! అక్కడ జరుగుతున్నది ఒకటి! డబ్బు మీద మోజుతో పెళ్లయితే చేసుకున్నాడు గానీ తనను మర్చిపోలేక, సంవత్సరం తిరగకముందే సౌమ్యకు విడాకులిచ్చి తన దగ్గరికి పరిగెత్తుకు వస్తాడని అనుకుంది. అది జరగలేదు. సరికదా! మొదటి పెళ్లి రోజు వేడుక తన ఇంట్లోనే జరుపుకుంటూ.., స్టాఫ్ అందరిని భోజనానికి పిలిచాడు. ఇష్టంలేని భార్యతో ముఖంపై బలవంతపు నవ్వును పులుముకుంటూ తన ముందు తిరుగుతుంటే కనీసం.. అలాగైనా చూడాలని ఆశతో తీరా అక్కడికి వస్తే, అక్కడేమో., సీన్ రివర్స్ అయ్యింది.


" చాలా రోజుల తర్వాత చక్కని పల్లెటూరి రుచులను పరిచయం చేశారు." అంటూ సౌమ్యని, వినయ్ తో సహా అందరూ పొగుడుతుంటే భరించలేక భోజనం మధ్యలోనే లేచి చెయ్యి కడిగేసుకుంది భావన.


అందరూ బలవంతం చేస్తే, స్టాఫ్ తీసుకొచ్చిన పూలదండలు రేవంత్, సౌమ్య ఒకరికొకరు మార్చుకొని, కేక్ కట్ చేశారు. ఆనక వారి వివాహ జీవితం గురించి మాట్లాడమని ఒత్తిడి చేస్తే, మొదట సౌమ్య లేచి" రేవంత్ బావ నాకు భర్తగా దొరకడం నా అదృష్టం" అంటూ సిగ్గుపడుతూ చేతిలో ముఖం దాచుకొని కూర్చుండిపోయింది.


తర్వాత రేవంత్ లేచి" సౌమ్యకు నేను దొరకడం కాదు, తాను నాకు దొరకడం నా అదృష్టం. చాలామందికి ఈ మాట షాకింగ్ గా అనిపించవచ్చు. పెళ్లి తర్వాత జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటే నేను ఎందుకు అనాల్సి వచ్చిందో మీకే అర్థమవుతుంది. పెళ్లి చేసుకొని మా ఊరు నుండి తిరిగి వస్తుంటే మా కారుకు యాక్సిడెంట్ జరిగింది. డోర్ ఓపెన్ కావడంతో నేను ఎగిరి రాళ్ళ మీద పడిపోయాను. తలకు బలమైన గాయమైంది. మిగతా వాళ్ళు కొద్దిపాటి దెబ్బలతో తప్పించుకున్నారు. ఆల్మోస్ట్ కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోయాను. అందరూ ఆశలు వదులుకున్నారు ఒక్క సౌమ్య తప్ప. ఒక తల్లికంటే ఎక్కువగా సేవలు చేసి నన్ను బతికించుకుంది. ఈ రోజు నేను మీ ముందు ఇలా.. నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే, అది కేవలం సౌమ్య వల్లే! ఇది నాకు తాను ఇచ్చిన జీవితం. చివరి వరకు తనకే అంకితం!(ఆర్తిగా కళ్ళు తుడుచుకున్నాడు )ఈ విషయం నేను కొద్ది మందికి తప్ప ఎవరితోనూ.. ఇప్పటి వరకు షేర్ చేసుకోలేదు. లాక్ డౌన్ పీరియడ్ కాబట్టి, ఎవరూ నా గురించి ఆరా కూడా తీయలేదు. యాక్సిడెంట్ విషయం తెలిసిన ఒకరిద్దరు కూడా పలకరించిన పాపానపోలేదు.. అంటూ క్రీగంట భావన వైపు చూసి, మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు.


భావనకు కాస్త గిల్టీగా అనిపించి తలదించుకుంది. నిజమే! చిత్ర ద్వారా యాక్సిడెంట్ విషయం తనకు తెలిసినా కూడా హాస్పిటల్ కి వెళ్లి రేవంత్ చూడాలనుకోలేదు. పైగా ప్రేమ పేరుతో తనను మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని సంబరపడింది. ఒక విధంగా ఆలోచిస్తే ప్రేమ లేదని రేవంత్ పై నింద వేస్తుంది కానీ, మనం ప్రేమించిన వారికి ఏదైనా జరగరానిది జరిగితే, కంగారుపడి పరిగెత్తుతామా లేక ప్రతీకారం గురించి ఆలోచిస్తామా? మరి తాను చేసిందేమిటి? భావనలో పేరుకొన్న అహంకారం మంచు తెరలా కరగటం మొదలైంది. ఏ మాత్రం చదువు, అందంలేని సౌమ్య తన ప్రేమతో రేవంత్ ను బతికించుకుంటే.., తనలో లేని ప్రేమను వెతుక్కుంటూ వినయ్ తనను భరిస్తున్నాడు. మొదటిసారిగా వినయ్ ని చూస్తే జాలి తో కూడిన ప్రేమ కలిగింది భావనలో. భావన కంటిలో తడి చేరటం కూడా అదే మొదటిసారి!


అంతలోనే ఏం జరిగిందో కానీ, సౌమ్య కళ్ళు తిరిగి తూలి పడబోయింది. వెంటనే రేవంత్ వచ్చి పట్టుకున్నాడు." ఈరోజు ఉదయం నాలుగు గంటలకు లేచింది మొదలు పని చేస్తూనే ఉన్నావు. సౌమ్య! కాస్త నీ ఆరోగ్యం కూడా చూసుకో" అని ప్రేమగా మందలిస్తున్న రేవంత్ చెవిలో సన్నగా ఏదో చెప్పింది సౌమ్య.


ఆనందంతో రేవంత్" హే గయిస్! మీకు త్వరలోనే మరో పార్టీ! నేను తండ్రిని కాబోతున్నాను" అంటూ అరుస్తూ సౌమ్యని రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పుతూ, యధాలాపంగా ఒకసారి భావన వైపు చూశాడు రేవంత్.


" నేను జీవితంలో ముందడుగు వేసాను. ఇక నీదే ఆలస్యం!" అని రేవంత్ అన్నట్టు అనిపించింది భావనకు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక పోయింది.


" పద.. వెళ్దాం! అంటూ వినయ్ ని బయల్దేర తీసింది.


అలవాటు ప్రకారం ఆమె వెనుక సీట్లో కూర్చుంటుందని, వినయ్ కారు వెనక డోర్ తెరవగానే, తాను ముందు సీట్లో వినయ్ పక్కనే కూర్చుంది. వినయ్ ఆశ్చర్యపోతూ కారు స్టార్ట్ చేయగానే అతని దగ్గరగా జరిగి అతని భుజం పై తల ఆన్చి పడుకుంది. తన చిటికెన వేలు కూడా తగలకుండా, తనను దూరంగా ఉంచే భావన అంతలా దగ్గర అయ్యేసరికి ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడు వినయ్. పూల నావను తలపిస్తూ వారి కారు ప్రయాణం కూడా హాయిగా ముందుకు సాగింది ఏ అడ్డంకులు లేకుండా..!


149 views1 comment

1 Comment


అర్థం చేసుకొనే వినయ్ లాంటి భర్త, సౌమ్య లాంటి భార్య ప్రతి ఇంట్లో ఉండాలి.అప్పుడే ఈ విడాకుల వ్యవస్థ పూర్తిగా అంతమవుతుంది.

Like
bottom of page