జ్ఞాపకాల పరిమళాలు
- Sathyanarayana Murthy M R V

- 3 hours ago
- 5 min read
#జ్ఞాపకాలపరిమళాలు, #JnapakalaParimalalu, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Jnapakala Parimalalu - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy Published In manatelugukathalu.com on 17/12/2025
జ్ఞాపకాల పరిమళాలు - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“అమ్మా పరీక్ష ఫీజు కట్టాలి, డబ్బులు ఇయ్యమ్మా” అడిగింది శిరీష, తల్లిని. వంటింట్లో ఉన్న సరోజిని ఉప్మాని టిఫిన్ బాక్స్ లలో పెడుతోంది.
“టేబుల్ మీద నాన్న పర్సు ఉంది కదా. అందులోంచి తీసుకో తల్లి” అంది సరోజిని.
శిరీష టేబుల్ మీద ఉన్న తండ్రి పర్సు లోంచి తన ఫీజుకి కావాల్సిన డబ్బులు తీసుకుంది. సరోజిని రెండు టిఫిన్ బాక్స్ లు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. శిరీష తన బాక్స్ తీసుకుని సైకిల్ ఎక్కి కాలేజీ కి వెళ్ళిపోయింది.
చిన్న కూతురు రాగిణి తల్లి దగ్గరకు వచ్చి”అమ్మా, బుక్స్ కొనుక్కోవాలి. నిన్నడబ్బులు అడిగితే ఈరోజు ఇస్తానన్నావు. ఇస్తావా?” నెమ్మదిగా అడిగింది. కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టింది సరోజిని.
“మొన్న బేరాలు లేవమ్మా. అందుకే నిన్న నీకు ఇవ్వలేదు. నిన్న బేరాలు వచ్చాయి, నాలుగు డబ్బులూ వచ్చాయి. నీకు కావాల్సిన డబ్బులు నాన్న పర్సులోంచి తీసుకో” అని వంటింట్లోకి వెళ్ళింది.
రాగిణి టేబుల్ మీదున్న పర్సులోంచి తనకి కావాల్సిన డబ్బులు తీసుకుని, టిఫిన్ బాక్స్ స్కూల్ బాగ్ లో పెట్టుకుని వెళ్ళింది. రాగిణి పక్క వీధిలో ఉన్న హైస్కూల్ లో పదవ తరగతి చదువుతోంది. సరోజిని వంట పూర్తీ చేసి, గిన్నెలో మిగిలిన ఉప్మాని పెల్తులో పెట్టుకుని తింది. తర్వాత పంజాబీ డ్రెస్ వేసుకొని దాని మీద ఖాకీ రంగు చొక్కా వేసుకుంది.
భర్త ఫోటో ముందు నిలబడి ‘ ఈ సంసారాన్ని నడపటానికి తగిన ధైర్యాన్ని ఇయ్యి రాజూ’ అని కోరుకుంది. తర్వాత ఇంటికి తాళం వేసి పక్క పోర్షన్ లో ఉంటున్న వనజకి తాళం చెవి ఇచ్చింది.
సరోజినిని చూసి “కొత్త షర్టు కుట్టించుకో. అది చిరిగిపోయింది. చూసుకున్నావా?” అంది వనజ. ఆమె మాటలకి బలంగా ఊపిరి తీసి వదిలింది సరోజిని.
“ఈషర్టు మా రాజుది. ఆ సంగతి నీకూ తెలుసు. ఇది నా వంటిమీద ఉంటే ఆయన నాతోడుగా ఉన్నారన్న అనుభూతి, ధైర్యం కలుగుతుంది అక్కా” అని తన వాటావైపు వచ్చి, ఆటోకి దణ్ణం పెట్టుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేసి గాంధీ బొమ్మల సెంటర్ కి వెళ్ళింది సరోజిని.
అయిదు సంవత్సరాల క్రితం కామెర్లు వచ్చి భర్త చనిపోతే, తప్పని పరిస్థితులలో ఆటో నడపడం నేర్చుకుని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజూ వచ్చే కిరాయి డబ్బుల లోంచి, ఆటోకి కట్టవలసిన వాయిదా డబ్బులు పక్కన పెట్టి, మిగిలిన డబ్బులతో ఇంటి అవసరాలు తీరుస్తుంది. కిరాయిలు తక్కువ వచ్చినప్పుడు ఇంటి అవసరాలు, పిల్లలకు ఇవ్వాల్సినవి వాయిదా వేస్తుంది. ఆమె పిల్లలు కూడా పరిస్థితి అర్ధం చేసుకుని నడుచుకుంటారు.
ఒక రోజు ఇంటి తాళం చెవి ఇవ్వడానికి వచ్చిన సరోజినిని అడిగింది వనజ” నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట అడగనా?” అని.
“అడుగు అక్కా” అంది చిన్నగా నవ్వుతూ సరోజిని.
“నీ పిల్లలు నిన్ను డబ్బులు అడిగినప్పుడల్లా, ‘మీ నాన్న పర్సులో ఉన్నాయి తీసుకోండి’ అని అంటావు. నీ చేతులతో వాళ్లకి డబ్బులు ఎందుకివ్వవు ?” అడిగింది వనజ.
“ఏమీ లేదక్కా. రేపు నా పిల్లలు పెరిగి పెద్ద అయ్యాకా ‘అమ్మే’ మమ్మల్ని కష్టపడి చదివించింది, అని అనుకుని తండ్రిని మరిచి పోతారేమోనని నా భయం. నిజానికి ఈ ఆటో లోన్ మీద ఆయనే కొన్నారు. ఈ ఆటో వలననే మేము ముగ్గురం బతుకుతున్నాము. ఇది ఆయన చలవే కదా. అందుకే నా సంపాదన ఆయన పర్సులో పెడతాను. పిల్లలకి ఆయనే డబ్బులు ఇస్తున్నారన్న తృప్తి కోసమే ఇలా చేస్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయింది సరోజిని.
చనిపోయిన భర్తని తన గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ, పిల్లలకు కూడా భర్తని నిరంతరం గుర్తుచేస్తూ అతని జ్ఞాపకాల అనుభూతిలో జీవిస్తున్న సరోజిని వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కారం చేసింది వనజ.
****
“గౌరమ్మా, నాలుగు ఇడ్లీ కట్టు” అన్నాడు రాజేష్, నాలుగు రూపాయలు టేబుల్ మీద పెట్టి. గౌరమ్మ నాలుగు ఇడ్లీలు పొట్లం కట్టి అతనికి ఇచ్చింది. అవి తీసుకుని రాజేష్ వెళ్ళిపోయాడు.
చిన్న రేకుల వసారాలో హోటల్ నడుపుతోంది గౌరమ్మ. ఒక రూపాయకి ఒక ఇడ్లీ, రెండు రూపాయలకి గరిటడు ఉప్మా ఇస్తుంది. ఉదయం వేళల్లో వసారాలో ముందున్న బల్లల మీద కూర్చుని కొంతమంది, నిలబడి కొంతమంది టిఫిన్లు తింటూ ఉంటారు. పేదలపాలిటి ‘అన్నపూర్ణ’ గౌరమ్మ. బజారులో నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు, ఉప్మా ఇరవై రూపాయలు. అందుకే చాలా మంది గౌరమ్మ హోటల్ కే వస్తారు. ఆమెకి ఎప్పటికప్పుడు వేడి వేడి ఇడ్లీ తయారు చేసి ఇస్తుంది రంగమ్మ.
టిఫిన్లు తిన్న వాళ్ళు, ఆ ప్లేట్లను ఒక ప్లాస్టిక్ తొట్టెలో పెట్టి, పక్కనే ఉన్న నీళ్ళ గ్లాసు తీసుకుని చేతులు కడుక్కుంటారు. ఆ పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టిన మంచినీళ్ళ టిన్ కులాయి తిప్పి మంచినీళ్ళు తాగుతారు. ఎంగిలి ప్లేట్లు తొట్టె నిండగానే, రంగమ్మ వచ్చి వాట్ని శుభ్రంగా తోమి కడుగుతుంది. ఆ సమయంలో గౌరమ్మే ఇడ్లీలు తీసి వచ్చినవారికి ఇస్తుంది. ఒకరోజు దబ్బకాయ చెట్నీ చేస్తే, మరురోజు అల్లం చెట్నీ చేస్తుంది. దానికి తోడు ఎప్పుడూ శనగపిండి చెట్నీ ఉంటుంది.
అప్పుడప్పుడు టీచర్లు, ఉద్యోగస్తులు కూడా వచ్చి గౌరమ్మ దగ్గర టిఫిన్లు కట్టించుకుని ఇంటికి పట్టుకెళ్ళి తింటారు. ఒక రోజు ఇంగ్లీష్ మాస్టారు రమణమూర్తి “ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తున్నావు. నీకు ఏం లాభం ఉంటుంది?” అని అడిగారు.
దానికామె చిన్నగా నవ్వి, “నేను రేటు పెంచి డబ్బు సంపాదించి ఇక్కడ డాబా వెయ్యాలని అనుకోవడం లేదు బాబూ. నా హోటల్ కి వచ్చిన వారు కడుపు నిండా తిని, ఆనందంగా వెళ్తే చాలు” అని అంది. ఆమె నిస్వార్ధబుద్ధికి ముగ్దుడయ్యారు మాస్టారు.
ఉదయం పదిన్నర అవగానే హోటల్ కట్టేస్తుంది గౌరమ్మ. చిన్న వెదురు గంపలో శనగలు, బటానీలు, నిమ్మతొనలు [పుల్లని బిళ్ళలు] పెట్టుకుని, పక్క వీధిలో ఉన్న హై స్కూల్ కి వెళ్తుంది. ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన పిల్లలకి తన గంపలో ఉన్న చిరుతిళ్ళు ఇస్తుంది ఉచితంగా. గంప ఖాళీ అయ్యాకా ఎంతో ఆనందంగా హోటల్ దగ్గరకు వచ్చి వంట మొదలుపెడుతుంది.
“అక్కా, రోజూ ఇలా పిల్లలకు ఉచితంగా చిరుతిళ్ళు ఇస్తే, నీ పోషణ ఎలా? అది ఆలోచించావా?”అడిగింది రంగమ్మ.
“రంగమ్మా, హోటల్ మీద వచ్చే ఆదాయం నాకు సరిపోతుంది, నీకు జీతం కూడా ఇవ్వగా, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బు పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాను. నేను ఇచ్చే చిరుతిళ్ళు తింటూ ఆనందంగా వెలిగిపోతున్న వారి ముఖాల్లో నా కొడుకు కన్నయ్యని చూసి సంతోషపడతాను” అంది తృప్తిగా గౌరమ్మ.
పదోతరగతి చదువుతున్న కన్నయ్య రాత్రివేళ ట్యూషన్ నుండి ఇంటికి వస్తూ ఉంటె, బ్రేకులు ఫెయిల్ అయిన లారీ గుద్దేసి చనిపోయాడు. పుట్టెడు శోకం దిగుమింగుకుని నాలుగేళ్ల నుండీ పిల్లలకు తనకు తోచినది ఇస్తూ వారి ఆనందమే తన జీవిత ధ్యేయంగా కొడుకు జ్ఞాపకాలలో ముందుకు సాగుతున్న గౌరమ్మకి నమస్కరించి వెళ్ళిపోయింది రంగమ్మ.
******************
స్కూల్ మొదటి గంట కొట్టింది కావేరి. పిల్లలు, ఉపాధ్యాయులు గదుల్లోనుండి బయటకు వచ్చి స్కూల్ భవనం ముందున్న ఖాళీ స్థలంలో సమావేశమయ్యారు. ప్రార్థన, ప్రతిజ్ఞ, మిగతా విషయాలు పూర్తీ అయ్యాకా ఎవరి గదుల లోకి వాళ్ళు వెళ్ళారు. ఎంతో శ్రద్ధగా, ఆనందంగా చూసింది ఆ దృశ్యాన్ని కావేరి. తర్వాతా రెండవ గంట కొట్టి, అన్ని తరగతి గదుల్లోకి వెళ్లి హాజరుపట్టీలు ఇచ్చి, మూడవ గంట కొట్టి ప్రధాన ఉపాధ్యాయుల గదిలోకి వచ్చింది కావేరి.
“కావేరీ, ఈ ఎక్స్ట్రా వర్క్ పుస్తకం స్టాఫ్ రూమ్ కి తీసుకువెళ్ళి, వాళ్ళ చేత సంతకాలు చేయించి తీసుకురా” అన్నారు ఆయన. ఆ పుస్తకం స్టాఫ్ రూమ్ కి తీసుకువెళ్ళి అందులో ఉన్న ఉపాధ్యాయుల చేత సంతకాలు చేయించి, దానిని తీసుకువచ్చి ప్రధాన ఉపాధ్యాయుల టేబుల్ మీద పెట్టింది కావేరి.
ప్రధాన ఉపాధ్యాయులు ఆమె కేసి చూసి దీర్ఘంగా నిట్టూర్చారు.
“ఎం. ఏ. పాసైన నీ చేత ఇటువంటి పనులు చేయించడం నాకు చాలా బాధగా ఉందమ్మా” అన్నారు ఆయన. కావేరి చిన్నగా నవ్వింది.
“నాకు బాధలేదు సార్. చాలా ఆనందంగా ఉంది. నా తండ్రి అటెండర్ గా పనిచేసిన స్కూల్ లోనే నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనారోగ్యంతో నా తండ్రి చనిపోయాడు. కారుణ్య నియామకంలో నన్ను ఇక్కడకు పంపిన అధికారులకు నేను చాలా ఋణపడిఉన్నాను. ఈ ఉద్యోగం నా కుటుంబాన్ని నిలబెట్టింది. నా తండ్రి చనిపోవడంతో ఆయనమీది బెంగతో అమ్మ అనారోగ్యం పాలయ్యిది. తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నేను ఎం. ఏ. చదువుతున్నాను. ఆ రెండు సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ ఉద్యోగం రావడం మా ముగ్గురి అదృష్టం సార్.
నా తండ్రి కొన్ని సంవత్సరాలు తిరిగిన ఈ సరస్వతి నిలయంలో నేను పని చేస్తూ తిరుగుతూ ఉంటే, నా మనసు ఒక అలౌకిక ఆనందానికి గురవుతోంది. త్వరలోనే బి. ఎడ్. చేసి, ఈ స్కూల్ లోనే ఉపాద్యాయురాలిగా పనిచేయాలన్న ఆశ నాలో బలగా ఉంది. నాన్న తీపి గురుతులు తలుచుకుంటూ, ఇక్కడే హాయిగా గడపాలని నాకోరిక సార్” అని గది బయటకు వచ్చి, చిన్న చెక్క స్టూల్ మీద కూర్చుంది కావేరి. రోజూ రాగానే, తండ్రి కూర్చునే ఆ స్టూల్ కి నమస్కరించి అప్పుడు దాని మీద కూర్చుంటుంది కావేరి.
తండ్రి జ్ఞాపకాల్ని సుగంధ పరిమళంగా ఆస్వాదిస్తూ, బతుకు బండిని మంచి మార్గంలో పయనింపచేస్తూ, యువతరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న కావేరిని నిండు హృదయంతో ఆశీర్వదించారు ప్రధాన ఉపాధ్యాయులు.
సమాప్తం.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments