top of page

మానస పుత్రుడు



'Manasa Puthrudu' written by Padmavathi Thalloju

రచన : పద్మావతి తల్లోజు

"తాతయ్యా ! బస్ వచ్చేసింది" పిల్లల అరుపుకు ఈ లోకం లోకి వచ్చాను.

హడావిడిగా పిల్లలిద్దరినీ స్కూల్ బస్సు ఎక్కించాను. వారి బుట్టలూ, బ్యాగులూ సీటు కింద పెట్టే పనిలో నేనుండగా, నా మెడ చుట్టూ తమ చిన్ని చేతులు బిగించి, నా మొహాన్ని ముద్దులతో నింపారు ఇద్దరూ.

"బై తాతయ్యా" అని కిలకిలా నవ్వుతూ బస్సు లోపలికి పరిగెత్తారు. మనసు దూది పింజ అయ్యింది కాసేపు. అలసట మటుమాయమైంది

. వెనక్కి తిరుగుతుండగా "కాస్త బస్సు ఆపండి అంకుల్!" అంటూ వెనక నుండి ఓ ఆడ గొంతు అభ్యర్థన. అది నా స్నేహితుడు శివరాం కోడలు సుమది. కాలనీ రోడ్లు ఇరుగ్గా ఉండటం మూలాన స్కూల్ బస్సులు లోపలికి రాలేవు. అర కిలోమీటరు నడిచి మెయిన్ రోడ్డు మీద అరగంట బస్సు కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి. సుమ దాదాపుగా పిల్లల్ని లాక్కొస్తున్నట్లుగా పరిగెత్తుకొచ్చి వారిని బస్సులో ఎక్కించేసింది. బస్సు కదిలే దాకా ఆగి నింపాదిగా సుమతో పాటు నడుస్తూ,

"ఏమ్మా! ఈరోజు ఆలస్యమైనట్టుంది."అంటూ ఆరా తీశాను.

"ఈ ఊర్లోనే ఒక పెళ్ళికి వెళ్ళాలి అంకుల్! ఆ ఏర్పాట్లలో పడి.."అంటూ నవ్వింది.

"కనీసం బస్ ఎక్కించే పని అయినా మా శివరాం గాడికి పురమాయించ లేక పోయావా?"అన్నాను సాలోచనగా.

"ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడమెందుకు అంకుల్" అంటూ వాళ్ళ ఇంటి బాట పట్టింది.

ఎంతైనా శివరాం అదృష్టవంతుడు అనిపించింది. కొడుకు, కోడలు ఒక్క పనీ చెప్పరు తనకు. ఈ ఒక్క విషయంలో తప్ప చాలా విషయాల్లో నాకు శివరాంకు పోలిక ఉంటుంది. ఇద్దరం పని చేసింది ఒక ఆఫీసులోనే. ఇద్దరికీ ఒక్కడే మగ సంతానం. వారికీ ఇద్దరేసి పిల్లలు. ఆ నలుగురు కూడా ఒకే స్కూల్లో చదువుతారు. శివరాం భార్య రెండేళ్ల కిందట కాలం చేస్తే, నా భార్య వరలక్ష్మి ఈమధ్యే నాకు దూరం అయింది.

***

ఇంట్లోకి అడుగుపెట్టగానే, ఫోటోలో ఎదురుగా నవ్వుతూ నా భార్య! తన జ్ఞాపకాల పరిమళం నన్ను తాకింది. తానో సాదా సీదా ఇల్లాలుగానే నా జీవితంలోకి ప్రవేశించింది. ఆ తర్వాతే తనేంటో అర్థమైంది నాకు. మా ఊర్లో మాది ఓ లంకంత కొంప. ఇంటికి సరిపోయేంత జనం. బండెడు చాకిరీ నవ్వుతూ చేసేది. గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేది. అతి కష్టం మీద పొదుపు చేసి, కొంత డబ్బు దాచుకునేది. అది తాను చీరలో, నగలో కొనుక్కోవడానికి అనుకుంటే పొరబడినట్లే.. అనాథ వృద్ధుల అవసరాలు తీర్చడానికి. అవును, మీరు విన్నది నిజమే! మా బాబు పుట్టినరోజుతో సహా మా ముగ్గురి పుట్టిన రోజులూ, మా పెళ్లి రోజు వృద్ధాశ్రమంలో ఆ ముసలి వాళ్ళ మధ్యే జరిగేవి. వృద్ధులు అంటే తనకెంతో జాలీ, దయా.

దానికి ఒక కారణం ఉంది. వరలక్ష్మి పెళ్లి తర్వాత తనతో పాటు అదృష్ట లక్ష్మి ని కూడా మెట్టినింటికి తెచ్చుకుంది. ఇలా ఎందుకన్నానంటే, మా పెళ్లి తర్వాత ఆమె పుట్టింట్లో దరిద్రమే తాండవించింది. ఆమె తల్లిదండ్రులు కూడా వారి చివరి రోజులలో కొడుకుల నిరాదరణకు గురై, దిగులుతోనే చనిపోయారు. నా వరం బాధ చూడలేక వారిని నా దగ్గరకి తెచ్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ, నాకున్న బాధ్యతలు నన్ను ఆ పని చేయనివ్వలేదు. అందుకే, వరలక్ష్మి ఆ వృద్ధులలో తన తల్లిదండ్రులను చూసుకుంటుంటే నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు.

వరలక్ష్మి తన తల్లి గారి ఇంటి నుండి పెద్దగా పెట్టుపో తలకు నోచుకోలేదు. పెద్ద సంసారం కాబట్టి నేను కొనిచ్చేది తక్కువే. అందుకే, 'మనం కాస్త కుదురుకున్నాక దానధర్మాల సంగతి చూద్దాం వరం. కనీసం ఇలాంటి ప్రత్యేక సందర్భాలకు అయినా చీరలో, నగో కొనుక్కో'అనేవాడిని.

'మనిషికి చావు చెప్పి రాదు కదండీ. మంచి పనిని దాట వేసుకుంటూ వెళితే మన చివరి రోజులలో ఒకరి చేత సేవ చేయించుకునే పరిస్థితి కొస్తాం గానీ, ఒకరికి సేవ చేసే సత్తువ మనకు ఎక్కడుంటుంది?' అనేది.

అలాంటి ఉన్నత భావాలు ఉన్న నా వరం పుట్టినరోజు ఇంకా వారం రోజుల్లో రానుంది. ఆమె పేరు మీద కొందరు వృద్ధులకు అన్న దానం చేయాలని ఉంది. శివరాం అడిగితే చక్కని సలహాలు చెబుతాడు అనిపించింది. అందునా వాడిని చూసి కూడా చాలా రోజులు అయింది. శివరాం పెరట్లో మామిడి చెట్టు కింద కబుర్లు అనుకోగానే, నా అడుగులు ఉత్సాహంగా వాళ్ళ ఇంటి వైపు పడ్డాయి.

***

శివరాం ఇంటి గేటు తీసే ఉంది. కానీ, ఇంటికున్న తాళం నన్ను వెక్కిరించింది. నిరాశగా వెనక్కి మళ్ళుతూ యథాలాపంగా మామిడి చెట్టు వైపు చూశాను. ఆశ్చర్యం! అక్కడ మామిడి చెట్టు లేదు. ఆ స్థానంలో ఓ పాత రేకుల షెడ్డు వెలిసింది. దగ్గరికి వెళ్లి చూద్దును కదా, షెడ్డు లోపల ఒక నులక మంచం. దానిమీద మూలుగుతున్న ఒక ఆకారం! పోల్చుకునే ప్రయత్నం చేశాను. ఒక్క సారిగా గుండె ఆగి నట్టయింది. అది శివరాం!

"శివా!"అని పిలిచాను.

పిలుపు నూతిలోంచి వచ్చినట్లు నాది నాకే వినిపించలేదు. కానీ వాడికి వినిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచాడు. వాడి కళ్ళలో తడి.

జారిపోయే గుండెను చిక్కబట్టుకొని అడిగాను"ఎలా ఉన్నావు రా?"అని.

అక్కడ పరిస్థితి చూసి కూడా నేను అలాంటి ప్రశ్న వెయ్యొచ్చా? ఉహు..... మన దురదృష్టం ఏంటో గాని ఆప్తుల దగ్గరే అవసరమైన మాటలకు కరువు వస్తుంది.\

వాడి నుండి సమాధానాన్ని ఆశించకుండా"ఏమైనా తిన్నావా?"అని అడిగాను.

తలతిప్పి చూపాడు. పాత స్టూల్ పైన ఒక పళ్లెంలో అన్నం, కూర ఆ పక్కనే నీళ్లు పెట్టి ఉన్నాయి.

'నేను వంటింట్లోకి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు రా! మా కోడలే ప్లేట్ చేతి కందిస్తుంది’ అని శివరాం గొప్పగా చెప్పే వాడు. అంటే ఇలాగా! వంటింట్లోకి ఏం ఖర్మ.... వాడినసలు ఇంట్లోకే రానీయడం లేదు వాడి కొడుకు, కోడలూ.

నాకు ఇప్పుడిప్పుడే విషయం కాస్త అర్థమవుతోంది. శివరాం భార్య పోయాక టైంకి తిండి పెట్టే వారూ, మందలించేవారు లేక సిగరెట్లకూ, మందుకూ అలవాటు పడ్డాడు. అది కాస్తా, జబ్బు పేరుతో వాడిని మంచం పట్టించింది. అందుకే వాడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు.

"కనీసం నీ కొడుక్కెనా నీకు ట్రీట్మెంట్ ఇప్పించి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని లేదా రా?" అన్నాను బాధగా.

"నా గురించి బాధపడడానికి నీలా నా కొడుక్కి ఉద్యోగం ఇప్పించ లేదు, ఇల్లు కూడా కట్టించలేదు కదరా" అన్నాడు అంతకన్నా బాధగా.

నిజానికి తండ్రీ కొడుకుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమా లేక వ్యాపారమా? కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది.

వాడి మాటల వెనక ఉన్న పరమార్థం లోకి వెళితే... నిజానికి నేనో డయాబెటిక్ పేషంట్ ని. పదేళ్ల కిందటే నాకు చూపు మందగించింది. చేసేది డీఈవో ఆఫీసులో ఉద్యోగం. ఊపిరి సలపని పని. ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోయే వాడిని. ఆఫీసులో దగ్గరే ఉండి నా బాధ చూసిన వాడు కాబట్టి శివరాం, నా భార్య సహాయంతో నచ్చజెప్పి నా చేత బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు. నా స్థానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నా కొడుకు ఒక చిన్న పోస్టుతో ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు.

శివరాం బలవంతం మీద రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో శివరాం ఉండే కాలనీలోనే ఒక కొత్త ఇల్లు కొని అందులో ప్రవేశించడం జరిగింది. నా కోసం ఇంత చేసిన శివరాం ఇలాంటి పరిస్థితికి రావడానికి ఒక విధంగా నేను కూడా కారణమేమో! కనీసం తన ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నం అన్నా నేను చేసి ఉండాల్సింది అనిపించింది. శివరాంను లేపి బలవంతంగా వాడి చేత రెండు ముద్దలు అన్నం తినిపించి, కబుర్లు చెబుతూ వాడు నిద్ర లోకి జారుకున్నాక ఇంటి బాట పట్టాను. శివరాం కొడుకుని గట్టిగా మందలించి మార్చాలని, వాడి సమస్యకో పరిష్కార మార్గం వెతకాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను.

ఇంటికి వెళ్లేసరికి నా కోడలు వందన గుమ్మంలో నాకోసమే ఎదురు చూస్తుంది.

"ఎక్కడికి వెళ్లారు మామయ్యా! పొద్దుపోయింది రండి . భోం చేద్దురు"అంది.

"శివరాం ఆరోగ్యం బొత్తిగా బాగా లేదమ్మా! చూడడానికి వెళ్ళాను"అన్నాను. అంతకుమించి అక్కడి విషయాలేవీ తనతో చెప్పాలనిపించలేదు. (ఒక విధంగా చెబితే నా కోడలు కూడా సుమలా మారిపోతుందని భయం వల్ల కావచ్చు)

భోజనం అయ్యాక కాస్త కునుకు తీద్దాం అనుకున్నాను. కానీ, శివరాం గురించిన ఆలోచనలు నాకు నిద్రను దూరం చేశాయి. లేచి టీవీ చూద్దాం అనుకున్నా. మనసు దాని మీద కూడా లగ్నం కావడం లేదు.

"మామయ్య! కాస్త ఏమనుకోకుండా రాత్రి వంటకి ఏమైనా కూరగాయలు పట్టుకు రాగలరా?" అంది మా కోడలు.

నేను ఖాళీగా కూర్చోవడం వీళ్ళకు నచ్చదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు... నా కొడుకు ఆఫీసునుండి వచ్చేటప్పుడు కావలసినవి పట్టుకొస్తాడుగా! ఉహు.... ఏం చేస్తాను? మారు మాట్లాడకుండా చెప్పులు వేసుకొని, బ్యాగ్ తీసుకొని మార్కెట్ కి బయలుదేరాను.

నా వరలక్ష్మి ఉన్నప్పుడు నన్ను ఒక్క పని చేయనిచ్చేది కాదు. ఆఫీసు, టీవీ, శివరాం... ఈ మూడింటి తోనే పొద్దు గడిచిపోయేది. ఏ మాత్రం ఆలోచించకుండా పని మీద పని చెప్పేస్తుందే.... వందన! తాను పరాయి పిల్లేం కాదు. స్వయానా నా చెల్లెలు కూతురే. మా కొత్త ఇంటి గృహ ప్రవేశానికి అని వచ్చి, మా బావగారు తన కూతురు వందన ను నా కొడుకు సుధీర్ కు చేసుకోమని అడిగాడు. స్వయానా నా చెల్లెలి భర్త అడిగేసరికి కాదనలేకపోయాను. నా మాటకు విలువిచ్చి (నాకప్పుడు అలా అనిపించింది) సుధీర్ వందన మెడలో తాళి కట్టాడు. కానీ, ఆ తర్వాతే తెలిసింది బంధువుల మాటల మధ్య. సుధీర్, వందన ఒకరి నొకరు ఇష్టపడ్డారనీ, మా వాడు తన మేనత్తను మామని కలుసుకొని పెళ్లి విషయం నాతో మాట్లాడమని ప్రాధేయ పడ్డాడు అనీ. వరలక్ష్మి కి సుధీర్ పై చాలా నమ్మకం. కానీ, వాడిలో నాకు స్వార్థమే ఎక్కువ పాలు కనిపించేది. ఈ సంఘటన వాడి మీద ఉన్న నా అభిప్రాయానికి బలాన్నిచ్చింది.

ఈ విషయాలన్నీ వరలక్ష్మితో చెబుతూ అన్నాను'చూడు వరం! నేను చెప్పాను కదా...నా అనుమానం ఏమంటే ఈ పెళ్లి వెనక ఉన్నట్టే నా రిటర్మెంట్ వల్ల వచ్చిన డబ్బులతో ఇల్లు కొనడం వెనుక కూడా వీడి హస్తం ఉండొచ్చు. వీడి మామ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తానని మెలిక పెట్టి ఉండవచ్చు. పిచ్చిగా నువ్వు, ఆ శివరాం గాడు వాడి ట్రాప్ లో పడి నాకు ఎసరు పెట్టారు అన్నాను అక్కసుగా.

'ఆపండి! నోటికి ఎంత మాట వస్తే అంత అనడమే? పెళ్లి విషయం డైరెక్టుగా మనతో చెప్పేందుకు వాడు భయపడి ఉండొచ్చు కదా! ఇక మీ రిటైర్మెంట్, ఇల్లు కొనడం వంటి విషయాలు నేను, శివరాం అన్నయ్య కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ప్రతిదీ భూతద్దంలో చూస్తారెందుకు?" అంటూ గయ్యిమని లేచింది నా పైకి. తల్లి మనసు తప్పుగా ఎలా ఆలోచిస్తుంది చెప్పండి.

***

తెల్లవారితే వరలక్ష్మి జయంతి. ఆ రోజున రాత్రి నా మనవడు, మనవరాలితో హోం వర్క్ చేయించి, వారిని చెరో పక్క పడుకోబెట్టుకొని కథలు చెబుతున్నాను. గుమ్మం దగ్గర అలికిడి.

"నాన్నా!" అన్న పిలుపు వినిపించింది.

నిద్రలోకి జారుకున్న పిల్లల్ని మెల్లగా విడిపించుకుని లేచి, లైట్ వేసి చూసాను. సుధీర్! చేతిలో ఏదో కవర్ పట్టుకుని నిలబడి ఉన్నాడు.

"నాన్నా! ఈ అగ్రిమెంట్ చదివి నేను ఇంటు మార్క్ పెట్టిన చోట సంతకాలు చేయండి. ఇదిగో మీ కళ్ళజోడు" అంటూ చేతికందించి నా ముఖంలో కదిలే భావాలను కూడా గమనించకుండా వెళ్ళిపోయాడు.

అవును! ఇది నేను ఊహించిందే. రెండు రోజుల కిందట సుధీర్, వందన కలిసి మా సొంతూరు వెళ్లి వచ్చారు. ఎందుకో, ఏమిటో వారు నాతో చెప్పలేదు. వారి సంభాషణ మధ్య పాత ఇంటి ప్రస్తావన లీలగా వినిపించింది. అది అమ్మకానికి పెట్టి ఉంటారు అనుకున్నాను. దాని తాలూకు రిజిస్ట్రేషన్ పేపర్లన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. వాళ్లమ్మే ఇచ్చింది వాడికి. అంత గుడ్డి నమ్మకం తనది. ఈ రోజుతో ఆ ఇంటితో నా రుణం తీరబోతోంది. కొడుకే పరాయివాడు అయినప్పుడు నాకంటూ సొంత ఆస్తులు ఎందుకని భారమైన గుండెతో అగ్రిమెంట్ పేపర్లు చదవకుండానే మార్క్ పెట్టిన చోట సంతకాలు చేసేశాను.

***

ఉదయం లేవగానే అన్యమనస్కంగానే నా పనులన్నీ ముగిస్తున్నాను. మాట మాత్రం గానైనా సుధీర్ తన తల్లిని గుర్తు చేసుకుంటాడు అని చూస్తున్నాను . ఉహు.... నాకు అక్కడ నిరాశే ఎదురైంది.

"నాన్నా! మన ఊరు వెళ్దాం, బయలుదేర" మన్నాడు.

"ఎందుకు? ఏమిటి?" అని ప్రశ్నలు వేసేంత సమయం కూడా ఉండదక్కడ. ముందు నుండైనా మా మధ్య పొడిపొడి మాటలే.

అయినా తెలియనిదేముంది? తల్లి పుట్టినరోజు కానుకగా కొడుకు ఇంటిని, తల్లిదండ్రుల జ్ఞాపకాలనూ అమ్మేస్తున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది! ఆ క్షణంలో శివరాం కొడుక్కి, నా కొడుక్కి పెద్దగా తేడా లేదని పించింది. వాడు తండ్రి రోగానికి భయపడి తండ్రిని దూరం చేసుకుంటే, వీడు డబ్బుకు ఆశపడి మా జ్ఞాపకాలనే మానుండి దూరం చేస్తున్నాడు.

***

ఊళ్లోకి దిగగానే ఊరి పెద్దలు, నా బాల్య స్నేహితులు చాలా మంది నా చుట్టూ గుమిగూడారు. ‘మంచి పని చేశారు’ అంటూ అభినందిస్తుంటే అర్థం కాక వారితో పాటు అడుగులు కలిపాను.

నేను ఆశ్చర్యం లోంచి తేరుకునేలోపే మా ఇల్లు వచ్చేసింది. ఇల్లు చక్కగా పూలతో అలంకరించి ఉంది. మా మెయిన్ డోర్ కి ఎర్రని రిబ్బన్ కట్టి ఉంది. గుమ్మం పైన పెద్ద అక్షరాలతో ఒక బోర్డు..... కళ్ళజోడు సరి చేసుకుంటూ చదివే ప్రయత్నం చేశాను.

'వరలక్ష్మి వృద్ధాశ్రమం'.

ఇది కలా..... నిజమా....! సుధీర్ వైపు చూశాను. పళ్లెంతో నా దగ్గరకి వచ్చాడు. అందులో చిన్న కత్తెర. కానిమ్మని చూపులతోనే సైగ చేశాడు. వణుకుతున్న చేతులతో రిబ్బన్ కత్తిరించి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా గోడకి మా భార్యాభర్తలది పెద్ద సైజు ఫోటో తగిలించి ఉంది.

సుధీర్ ఒక నడివయసు జంటను నా దగ్గరికి తీసుకొని వచ్చి పరిచయం చేస్తూ చెప్పాడు "ఈ వృద్ధాశ్రమాన్ని ఇకముందు నడిపేది వీళ్లే నాన్నా! వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు చిన్నవైనా ఆశయం మాత్రం పెద్దది. కూలీనాలీ చేసుకుని పూట గడుపుకునే కుటుంబాలలో వాళ్లు బతికేదే కష్టం, ఇక వాళ్ల ఇళ్లలోని ముసలివాళ్లు మధ్యాహ్న భోజనం లేక అల్లాడిపోతున్నారు. అలాంటివారికి వీళ్ళిద్దరూ తమ జీతాలు వెచ్చించి, ఆస్తులు అమ్మి తిండి పెడుతున్నారు. ఎవరూ లేని వృద్ధులను చేర దీస్తున్నారు. దాతల సాయం కోరుతూ పేపర్లో వీళ్ళ పై వచ్చిన ఆర్టికల్ చదివాను నేను. అమ్మ వృద్ధుల బాగోగుల కోసం ఎంత తపన పడేదో మనకు తెలుసు కదా! నాయనమ్మ, తాతయ్య పోయాక ఈ ఇల్లు ఎలాగూ ఖాళీ గానే ఉంది కదా.... వీళ్ళు ఉండేది కూడా మన జిల్లానే కాబట్టి, మన వంతు సాయంగా ఈ ఇంటిని వృద్ధాశ్రమంగా వాడుకోవడానికి ఇచ్చాను. మీ జ్ఞాపకాలను మరమ్మతుల పేరుతో మరుగు పరచ కూడదని ఇంటికి మార్పులు చేర్పులు చేయకూడదనే నిబంధనను అగ్రిమెంట్ లో చేర్చాను. అమ్మ పుట్టినరోజు జ్ఞాపకంగా ఉండిపోవాలని ఈ రోజే ప్రారంభం చేయించాను.ఇక ముందు కూడా ఈ ఆశ్రమం నడవడానికి మన చేతనైనంత సాయం చేద్దాం. అమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా ఉంది నాన్నా!.."ఇంకా నా కొడుకు ఏదో చెబుతూనే ఉన్నాడు. వాడు నాతో మనసు విప్పి మాట్లాడు తున్నాడు మొదటిసారిగా! నేను వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కూడా మొదటిసారే!

***

ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం గగనమే అయింది. అదేంటో మనిషికి పట్టరాని సంతోషం కలిగినా, భరించలేని బాధ కలిగినా నిద్రే దూరమవుతుంది. బాగా అలసిపోయాను కదా.... నిద్రపోయి ఉంటాను అనుకొని సుధీర్, వందన నా గురించే మాట్లాడుకుంటున్నారు.

"మీ నాన్నగారి గురించి మీరెంత ఆలోచిస్తారో ఈ రోజే తెలిసిందండి. మరి ఎందుకండీ ఆయననలా శ్రమ పెట్టడం? పిల్లలకు బయట ట్యూషన్ మాన్పించి ఆయన చేతే చదువు చెప్పిస్తున్నారు. అడపాదడపా ఆయనకు పనులు చెప్పమని నన్ను కూడా పురమాయిస్తున్నారు. మామయ్య మన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో" అంటూ బాధపడుతోంది వందన.

"ఇదంతా ఆయన కోసమే వందనా! శివరాం అంకుల్ పరిస్థితి చూసావా? ఆంటీ చనిపోయాక ఆయనతో మాట్లాడే వారు లేక, ఆయన కోడలు పిల్లల్ని కూడా దగ్గరికి రానీయక పోవడంతో ఒంటరితనం భరించలేక ఆయన వ్యసనాలకు దగ్గరయ్యారు. నేను నాన్నకు ఎప్పటికీ అలాంటి పరిస్థితి రానివ్వను. అందుకే పిల్లల్ని ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేదో వండి పెడితే ఆయన కాదనలేక తినకూడదని, ఇష్టమైనది తెచ్చుకుంటారని కూరగాయలు తెచ్చే పని ఆయనకే అప్పగించమంటున్నాను. ఆయన దిగులుగా ఉన్నట్టు కనబడితే ఏదో ఒక పని చెప్పి మనసును డైవర్ట్ చేయమని నీకు చెబుతాను.

'వృద్ధాశ్రమం' వల్ల అమ్మ ఆశయం నెరవేరింది. శివరాం అంకుల్ ఇష్టపడితే, ఆయన్ని కూడా మన ఆశ్రమంలో చేర్చగలిగితే నాన్నగారి దిగులు కూడా తీరుతుంది. ఇలాంటి విషయాలు ఆయనతో సూటిగా చెప్పలేక ఆయనను కష్టపెడుతున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా వందనా?" అని అడుగుతున్నాడు సుధీర్.

నా కోడలు ఏం సమాధానం చెప్పిందో వినలేదు గానీ, నేను మాత్రం నీళ్లతో నిండిన నా కళ్ళను తుడుచుకుంటూ 'తప్పు నీది కాదు రా, నాదే! ఎప్పుడూ నీ గురించి తప్పుగానే ఆలోచించాను. మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నన్ను క్షమించు' అనుకున్నాను మనసులో.

ఎదురుగా ఫోటోలో నా భార్య నవ్వుతూ, 'వాడు మన పెంపకంలో పెరిగిన వాడండీ . వాడెప్పుడూ తప్పు చేయడు’ అన్నట్టు అనిపించింది. పిల్లలిద్దరినీ గుండెలకు అదుముకొని తృప్తిగా నిద్ర లోకి జారుకున్నాను.

____ శుభం ____

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.


468 views0 comments
bottom of page