top of page

కీలెరిగి వాత


'Kilerigi Vatha' written by Padmavathi Thalloju

రచన : పద్మావతి తల్లోజు

"ఏంటండీ అది!? చదవగానే అలా మ్రాన్పడ్డారు!?"

చేతిలో కాఫీతో వరండాలోకి వచ్చిన విజయమ్మ, రెండు చేతులతో ఉత్తరం పట్టుకుని నించుండిపోయిన భర్త జనార్థనాన్ని చూస్తూ కంగారుగా అడిగింది.

భార్య వైపు అయోమయంగా చూస్తూ.. "అదేంటి విజ్జీ! నిశ్చితార్థం చేసుకున్నాక, మాకు మీ సంబంధం వద్దంటూ ఉత్తరం రాస్తాడేం ఆ నరసింహం!?" అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోతూ.

"అయ్యో!? ఇదేం అన్యాయం అండీ!? కారణం ఏంటట!?" ఆందోళనగా అంటూ, కాఫీ అక్కడ టీపాయ్ పై పెట్టి, ఆయన మోకాళ్ళపై చేయివేసి, కాళ్ళ వద్ద కూర్చుంది విజయమ్మ.

"అదేం చెప్పలేదే. ‘మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వదలుచుకోలేదు. మీతో మాకే సంబంధం వద్దనుకుంటున్నాం.' అని మాత్రం రాసాడు" అన్నాడు ఇంకా అయోమయం నుండి తేరుకోని జనార్దనం.

"హయ్యో! నేను చెబుతూనే ఉన్నా ముందు నుండి..! ఈ వేలు విడిచిన చుట్టరికాలంటూ సంబంధాలు ఖాయం చేసుకోకండి, బంధువులన్న మాటేగానీ, ఎప్పుడో పరాయి రాష్ట్రంలో స్థిరపడిన వాళ్ళ గురించి మనకేం తెలీదంటూ..!" సన్నగా రాగం తీయడం మొదలు పెట్టింది విజయమ్మ.

"కారణం చెప్పకుండా ఇలా చేయడం ఏంటసలు? ఊరంతా పిలిచి వేడుకగా నిశ్చయం చేసుకున్న సంబంధం. ఇప్పుడు ఎందుకు క్యాన్సిలయిందని అడిగవారికి మనం ఏం చెప్పాలి!? పిల్లాడిలో ఏం లోపం ఉందో అనుకుని ఇకపై మన వాడికి సంబంధాలు వస్తాయా!?" ఆందోళనగా అన్నాడతను.

"ఓరి భగవంతుడా!? ఇదేం ప్రారబ్ధం మాకు!? చక్కని పిల్లాడు, బ్యాంక్ మేనెజరూ! ఒక్కడే కొడుకు. ఉన్న ఒక్క ఆడపిల్ల, అక్కకు పెళ్ళి అయ్యి, పురుళ్ళు, పుణ్యాలు పూర్తయి, బాదరబందీ లేని బతుకు వాడిది. ఒకరిని నొప్పించే మనస్తత్వం కాదు. ఒక్క దురలవాటు లేదు. పైగా మనమంటే పల్లెటూరిలో ఉన్నాం కానీ, వాడు ఉద్యోగం చేసుకుంటూ పట్నంలోనే ఉన్నాడు కదా! ఇక మన పిల్లాడిని వద్దనుకుంటున్న కారణం ఏంటి!?" చిన్నగా శోకాలు మొదలు పెట్టింది విజయమ్మ.

ఆలోచిస్తున్న జనార్ధనం కాస్త తేరుకుని, అర్జెంటుగా ఈ సంబంధం కుదిర్చిన మీ తమ్ముడు సూర్యాన్ని, మన అమ్మాయి లావణ్యను, ఆమె భర్తను, మన వంశోద్ధారకుడు రాహుల్ ను వెంటనే రమ్మని ఫోన్ చెయ్యి. విషయం చెప్పకు. వాళ్ళు వచ్చాక ఏం చేయాలో అంతా కలిసి నిర్ణయించుకుందాం" ఏదో నిశ్చయించుకున్నట్లు అన్నాడు అతను.

***

విజయమ్మ ఫోన్ చేసిందే తడవు ఆదరాబాదరాగా అందరూ పరుగెత్తుకొచ్చారు.

" నిశ్చితార్థం జరిగి ఇన్ని రోజులు అయింది. ఎలాగూ.. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ సంపాదించే ఉంటావు. ఏం జరిగిందని కాల్ చేసి అడుగు తనను" అన్నాడు జనార్ధనం, రాహుల్ ను ఉద్దేశించి. " లేదు నాన్నా ! నెంబర్ తీసుకో లేదు"అన్నాడు రాహుల్ భయంగా !

"పెళ్లి కుదిరింది అంటే చాలు! 24 గంటలు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ కాలం పిల్లలు. వీడికి మాత్రం ఏ తెలివి.. లేదు" అంటూ కోపంగా అరిచాడు జనార్ధనం.

"ఈ కాలం పిల్లల్లా వాళ్ళని మీరు పెరగనిస్తే కదా!" అంటూ గొణిగింది విజయమ్మ.

" ఏమంటున్నావ్?" అని కళ్ళు పెద్దవి చేసి గుర్రుగా చూసాడు జనార్ధనం, విజయమ్మవైపు. విజయమ్మ జడుసుకుని రెండడుగులు వెనక్కి జరిగింది.

" అల్లుడుగారూ! వీడి కాబోయే బామ్మర్దితో మీకు దోస్తీ బాగానే కుదిరింది కదా! నెంబర్ ఏమైనా ఇచ్చాడా?" అని అల్లుడిని అడిగాడు జనార్ధనం.

" ఇలాంటి అవసరం వస్తుందని తెలియదు కదా మామయ్య! నేను అడగలేదు "అన్నాడు కాస్త బెరుగ్గా.

జనార్ధనం కోపం ముందు అల్లుడితో సహా అందరూ వణకాల్సిందే! తండ్రి ఉగ్ర రూపం చూసి కూతురు లావణ్య మాత్రం ఒక్కమాట మాట్లాడకుండా, డోర్ వెనకే నక్కింది.

"మీరే ఫోన్ చేసి గట్టిగా అడగాల్సింది. వాళ్ళని వదలకూడదు బావా!"అన్నాడు సూర్యం కాస్త ధైర్యం తెచ్చుకొని. సంబంధం తెచ్చినందుకు తననెక్కడ చెంపలు వాయిస్తాడోనని విజయమ్మ వెనకే నిలబడ్డాడు ఎందుకైనా మంచిదని.

"రాత్రి నుండి ఇరవై సార్లు కాల్ చేశానురా! రింగ్ అవుతుంది కానీ, ఆ నరసింహం ఫోన్ తీయడే! అందరం అన్ని ఫోన్ల నుండి మరోసారి ప్రయత్నిద్దాం. ఎవరి ఫోన్ అయినా ఎత్తక పోతాడా? మనం అంత పెద్ద తప్పేం చేశామో, మనక్కూడా తెలియాలిగా" అన్నాడు జనార్ధనం అసహనంగా. ఆ రోజు రాత్రి వరకు ప్రయత్నించినా, వారి ప్రయత్నం ఫలించలేదు. అలసిపోయి అందరూ నిద్రలోకి జారుకున్నారు.

***

సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో, అందరూ ఆదమరచి నిద్రలో ఉండగా జనార్ధనం ఫోన్ మోగింది. అది నరసింహం దగ్గర నుండి! ఆదుర్దాగా ఫోన్ ఎత్తి "హలో " అనగానే ఏ పలకరింపులు లేకుండానే నరసింహం మాట్లాడటం మొదలుపెట్టాడు.

"వంద కాల్స్, ఓ ఇరవై మెసేజ్ లు. దీన్నిబట్టే అర్థమవుతుంది. నా ఉత్తరం నీలో ఎంత అలజడి రేపిందో! చాలా తేలికగా తీసుకోవడం వల్లో లేక వయసు మీద పడటం వల్లో నీవు మర్చిపోయిన ఓ విషయం గుర్తు చేయనా జనార్ధనం! సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం ఇలాంటి ఉత్తరమే మా ఇంటికి వచ్చింది. పెళ్లి చూపుల్లో మా చెల్లి నచ్చింది అంటూ., తాంబూలాలు పుచ్చుకొని, ఆనక నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ నువ్వు రాసిన ఉత్తరం. అందరం గుండెలు పగిలేలా ఏడ్చాము. ఫోన్లు లేని కాలం. అసలు ఎందుకు వద్దన్నారో తెలియదు. అసలే పల్లెటూరు. బయట ముఖం చూపించలేక రాష్ట్రమే వదిలి వెళ్లాం. ఆ బాధ ఎలా ఉంటుందో నీకూ రుచి చూపించాలనే ఉత్తరం రాసి, ఫోన్ సైలెంట్ లో పెట్టా. భయపడకు! పెళ్లి యధావిధిగానే జరుగుతుంది. ఎందుకంటే, నీ కొడుకుకు నీ బుద్దులేవీ రాలేదు కాబట్టి. కానీ ఒక విషయం గుర్తుంచుకో. పిల్లనిచ్చానని అణగిమణిగి ఉంటానని మాత్రం అనుకోకు. ఇక ఉంటా!" అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు.

పక్కనే పడుకొని నరసింహం మాటలు వింటున్న అతని భార్య "ఏంటండీ ఇదంతా!? నాకేం అర్థం కావట్లేదు. సంబంధం తప్పిపోయిన మీ చెల్లిని వారం తిరగకముందే మా అన్నకు ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపారుగా! ఏడ్చామని చెబుతున్నారు. మీరు ఉద్యోగరీత్యా రాష్ట్రం వదిలి వచ్చారు గానీ, అవమానంతో కాదుగా! ఎందుకు ఇన్ని అబద్ధాలు. పాపం! అన్నయ్య గారిని మీ చేతలతో హడల గొడుతున్నారు" అంది ఒకింత జాలిగా!

"నువ్వు జాలిపడేంత ఉత్తముడేం కాదు ఆ జనార్ధనం. కుటుంబాన్ని అంతా తన కంట్రోల్ లో పెట్టుకొని చక్రం తిప్పుతున్నాడు. వాడి జుట్టు మన చేతిలో ఉండటం ఒకందుకు మనకే మంచిది. ఆడ పిల్లని ఇస్తున్నాం. ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా చెప్పు! అయినా వియ్యంకుల మధ్య ఈ మాత్రం పరాచికాలు సహజమే కదా! నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మాని పడుకో. పెళ్లి పనులు మొదలు పెట్టాలి" అన్నాడు నరసింహం తేలికగా నవ్వేస్తూ..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.

242 views1 comment
bottom of page