top of page
Original.png

తప్పనిసరి తద్దినం

తప్పనిసరి తద్దినం, హాస్య కథ, కుటుంబ హాస్యం, తెలుగు కథ, అల్లుడు మామగారు, తద్దినం, శ్రాద్ధం, కుటుంబ బంధాలు, వ్యంగ్య కథ, మనతెలుగుకథలు, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తప్పనిసరి తద్దినం' కథలో తద్దినం సందర్భంగా పిండాల దగ్గరకు వచ్చిన కుక్కను ఆపడానికి ప్రయత్నిస్తున్న శ్రీధర్, మంత్రాలు చదువుతున్న శాస్త్రిగారు.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తప్పనిసరి తద్దినం' కథలో తద్దినం సందర్భంగా పిండాల దగ్గరకు వచ్చిన కుక్కను ఆపడానికి ప్రయత్నిస్తున్న శ్రీధర్, మంత్రాలు చదువుతున్న శాస్త్రిగారు.

Thappanisari Thaddinam - Telugu Family Comedy Story | Jeedigunta Srinivasa Rao

తప్పనిసరి తద్దినం - తెలుగు కుటుంబ హాస్య కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 11/07/2026


తప్పనిసరి తద్దినం ఒక నవ్వులతో నిండిన తెలుగు కుటుంబ హాస్యకథ. మామగారి తద్దినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాలని ప్రయత్నించిన శ్రీధర్‌కు, గత ఏడాది పిండాన్ని తిన్న పక్కింటి పెంపుడు కుక్క టింకు మళ్లీ అనుకోని సమస్యగా మారుతుంది. సిద్ధాంతి రంగాచార్యులు మంత్రాలు చదువుతుండగా జరిగిన వినోదభరిత సంఘటనలు, భార్య కవిత పట్టుదల, శ్రీధర్ చేసిన తెలివైన ప్రయత్నాలు, చివర్లో వచ్చిన ఊహించని ట్విస్ట్ ఈ కథను ఆద్యంతం ఆసక్తికరంగా మారుస్తాయి. కుటుంబ బంధాలు, సంప్రదాయాలు, వ్యంగ్యం, హాస్యం సమపాళ్లలో మిళితమైన ఈ తెలుగు కథ ప్రతి పాఠకుడిని కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది.




"ఏమండీ! మంగళవారం మా నాన్నగారి తద్దినం. ఈసారైనా ఏ మతిమరుపు గొడవల్లేకుండా కాస్త పద్ధతిగా జరిపించండి," కాఫీ గ్లాస్ టేబుల్ మీద పెడుతూ కాస్త కంఠం పెంచి అంది కవిత.


శ్రీధర్ పేపర్లోంచి తల పైకెత్తి, "అదేంటి అలా అంటావు? పోయిన ఏడాది ఇరవై వేలు ఖర్చు చేసి మామగారి తిథి బాగా చేశాను కదా!" అన్నాడు.


"అవును, ఏం లాభం! తీరా ఆయన పిండప్రదానం చేస్తుంటే... మన పక్కింటి పిన్నిగారి పెంపుడు కుక్క 'టింకు' వచ్చి ఆ పిండాన్ని తినేసింది. కాకి కోసం చూస్తే పిల్లి వచ్చింది! ఆ పాప పరిహారానికి మళ్లీ నేను తిరగని గుడి లేదు, చెయ్యని దానం లేదు," అంది కవిత.


"ఖర్మరా బాబు! మా తల్లిదండ్రుల తిథి సరిగ్గా జరగడం కోసం ఈవిడని ప్రసన్నం చేసుకోవడానికి మామగారి తద్దినం కూడా నేనే పెట్టాల్సి వస్తోంది. ఏదో శాస్త్రం చెప్పినట్టు 'పాండవుల సంపాదన కౌరవుల తద్దినాలకే సరిపోతోంది' అన్నట్టుగా ఉంది నా పని," అని మనసులో అనుకుని...

శ్రీధర్ గొంతు సవరించుకుంటూ, "కాకి తిన్నా, పిల్లి తిన్నా ఒకటే అనుకుంటా  కవితా, నీ పిండం పిల్లికి వెయ్యి అంటారుగా!" అన్నాడు.


"అవును, మీరు ఇలాంటి వారు అని తెలియక ఊరిలో ఉన్న పది ఎకరాలు మీ పేరున రాశారు మా నాన్న. అప్పటికీ నేను అడిగాను నా పేరున రాయమని, ఆయన ఏమన్నారో తెలుసా? 'రేపు నేను పోతే తలకొరివి పెట్టాల్సింది అల్లుడే కదా! అయినా బంగారం లాంటి నిన్నే ఇచ్చాను శ్రీధర్ కి' అని అన్నారు," అంది కవిత.


"అబ్బా! ఊరుకోవే, ఈసారి శాస్త్రోక్తంగా మీ నాన్నగారి తిథి జరిపిస్తాను," అన్నాడు. 


"ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి మా తల్లిదండ్రుల తద్దినం సరిగ్గా జరిపిస్తేనే మీ అమ్మానాన్నల తద్దినం మన ఇంట్లో. లేదంటే మీరు ఏ మఠంలోనో పెట్టుకోవాలి," అంది, తన తండ్రి ఇచ్చిన పది ఎకరాల పొలం బలం చూసుకుని.


తద్దినం రోజు రానే వచ్చింది. శ్రీధర్ త్వరగా స్నానం చేసి కుర్చీలో కూర్చుని, "కవితా! టిఫిన్ తీసుకుని రా త్వరగా," అని అరిచాడు.


"టిఫిన్ ఎలా తింటారు? భోక్తలు తినేదాకా మీరు ఏమీ తినకూడదు. కావాలంటే హార్లిక్స్ కలిపి ఇస్తాను," అంది వంటగదిలోనుంచి. 


"సరే! అలాగైతే బయటకు వెళ్లి శాస్త్రిగారు వస్తున్నారేమో చూసి వస్తాను," అన్నాడు శ్రీధర్.


"ఆపండి మీ దొంగవేషాలు! బయట టిఫిన్ బండిలో టిఫిన్ తినేద్దామా అని కదా? శాస్త్రిగారు వస్తారు, ఈలోపు అరటి ఆకులు కడిగి ఉంచండి," అంది.


 ఈసారి ఏరికోరి 'సిద్ధాంతి రంగాచార్యులు' గారిని పిలిచాడు. ఆయన చాలా నిష్ట గల మనిషి, పైగా కాస్త కోపిష్టి కూడా.


ఉదయం 9 గంటలకు రంగాచార్యులు గారు వచ్చారు.

"చూడూ శ్రీధర్! తద్దినం అంటే తమాషా కాదు. శ్రద్ధగా చేయాలి. పితృదేవతలు సూక్ష్మ రూపంలో వస్తారు. ఎక్కడా ఎంగిలి, అపచారం జరగకూడదు. అందుట్లో మీ మామగారి తద్దినం," అంటూ పంచె కట్టుకుని పీట మీద కూర్చున్నారు.


శ్రీధర్ వినయంగా కూర్చొని శాస్త్రిగారు చెప్పినట్టు చేస్తున్నాడు. "వంటమనిషిని పెట్టుకోవాల్సింది, పెద్ద వంట మేడం చెయ్యడం ఎందుకు?" అన్నాడు శాస్త్రిగారు వంటగది వైపు చూసి.


"వాళ్ళ నాన్నగారికి ఇష్టమైన వంటలు చేయాలని తనే చేస్తుంది. మా మామగారు పోయే టైములో ఆయనకు నోట్లో పళ్లు లేవు. వంటలో పోపు వేస్తే నమలలేరు అని పోపు లేకుండా వండుతుంది మా ఆవిడ," అన్నాడు శ్రీధర్.


"ఆయనకి పళ్లు లేకపోయినా భోక్తలకి పళ్లు ఉన్నాయి! పోపు లేకపోతే రుచి ఏముంటుంది శ్రీధర్ గారు? భోక్తలు సంతృప్తిగా తింటేనే ఫలితం ఉంటుంది. సరే, కానివ్వండి. ఇంకో అయిదు వందలు ఎక్కువ ఇవ్వండి, భోక్తలు ఆ విధంగా సంతోషిస్తారు," అన్నాడు శాస్త్రిగారు.


మంత్రాల ఘోషతోను, పొగతోను ఇల్లు నిండిపోయింది. భర్త మాటికిమాటికీ కళ్లు తుడుచుకోవడం చూసిన కవిత, 'ఎంతైనా మొగుడికి మామగారు అంటే ప్రేమ' అనుకుంది.

 

భోక్తలకి వడ్డన మొదలుపెట్టింది కవిత. "కొద్దిగా నిరుచప్పిడిగా ఉన్నా ఏమీ అనుకోకుండా తినండి, మా మామగారు రుచికి ప్రాధాన్యత ఇవ్వరు," అన్నాడు ఊరుకోక శ్రీధర్.


పిండాలు కలిపి సిద్ధం చేశాడు శ్రీధర్. కాకి పిండం కూడా ఒక అరటి ఆకు మీద పెట్టాడు. రంగాచార్యులు గారు మంత్రాలు చదువుతుండగా, కవిత పొరపాటున వంటగది వెనుక తలుపు తెరిచి ఉంచేసింది.


​అంతే! ఎక్కడి నుంచి వచ్చిందో కానీ... పోయిన ఏడాది విలన్, పక్కింటి కుక్క 'టింకు' మెల్లగా హాల్లోకి జొరబడింది. వంటల వాసనకు లాలాజలం కార్చుకుంటూ నేరుగా పిండాలు ఉన్న విస్తరి వైపుకి రాసాగింది.


టింకు రాకను గమనించిన శ్రీధర్‌కి గుండె ఆగినంత పనైంది!

'ఓరి దేవుడో! ఈసారి గాని ఇది పిండాన్ని ముట్టుకుందా... కవిత నాకు పెడుతుంది పిండం, పంతులుగారు శపించినా శపిస్తారు!' అని మనసులో అనుకున్నాడు.


పంతులుగారు కళ్లు మూసుకుని గట్టిగా మంత్రం చదువుతున్నారు: "...ఆయాతు పితరః సౌమ్యా గంభీరైః పథిభిః పూర్వ్యైః..." అంటూ.


టింకు లాలాజలం కార్చుకుంటూ పిండం మీద పడబోయింది. ఇక లాభం లేదనుకున్నాడు శ్రీధర్. అదృష్టవశాత్తూ శ్రీధర్‌కి కాలేజీ రోజుల్లో హాబీగా నేర్చుకున్న ఇంద్రజాలం (మ్యాజిక్) విద్య గుర్తుకు వచ్చింది.


సమయం అస్సలు లేదు! శ్రీధర్ చటుక్కున లేచి తన మ్యాజిక్ కిట్ లో నుంచి బ్లాక్ స్మోక్ పౌడర్‌ను (పొగ వచ్చే మ్యాజిక్ పొడి) హోమగుండం వైపు విసిరాడు. 


అంతే... ఒక్కసారిగా హాలంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది.


పంతులుగారు కూడా పొగకి కళ్లు తెరవలేక, దగ్గుతూ మంత్రాలు ఆపేశారు. వంట గదిలో ఉన్న కవిత, "బాబోయ్! ఇంత పొగ వస్తోంది ఏమిటి?" అనుకుంటూ కళ్లకు చీర కొంగు కప్పుకుంది.


ఈ సమయంలో శ్రీధర్ మెరుపు వేగంతో స్పందించాడు. టింకు వైపు దూకి, దాని నోటికి ప్లాస్టర్ వేసి, పక్కనే ఉన్న ఖాళీ డబ్బా బోర్లించి దాని కింద దాన్ని నొక్కేశాడు.


కొద్ది క్షణాలకి పొగ కాస్త తగ్గింది. కవిత, రంగాచార్యులు గారు కళ్లు నలుపుకుంటూ చూశారు. "ఏమిటోనయ్యా! ఇంత పొగ ఎప్పుడూ చూడలేదు," అంటూ మంత్రం మొదలుపెట్టారు శాస్త్రిగారు.


భోక్తలు కళ్లు తుడుచుకుంటూ భోజనం ముగించారు.


శ్రీధర్ గంభీరంగా గొంతు సవరించుకుని, "చూశావా కవితా! మన సిద్ధాంతి గారి మంత్ర మహిమ, నాకున్న మామగారి పై భక్తి, మంత్రం శాస్త్రోక్తంగా జరిగింది. ఇక కాకి పిండం కూడా మేడ మీద పెట్టేసి వస్తాను," అంటూ మేడ మీదకి వెళ్ళాడు.


"ఈలోపున అమ్మాయి, నువ్వు తాంబూలం, దక్షిణ తయారు చేయి, బాగా ఆలస్యం అయింది," అన్నారు శాస్త్రిగారు కుర్చీలో కూర్చొని.


"అలాగే శాస్త్రిగారు," అంటూ భర్త పర్సులో నుండి డబ్బులు తీసి, తమలపాకుల కోసం వంటగది వైపు వెళ్తూ, "ఛీ పాడు డబ్బా ఇక్కడ ఎందుకు పెట్టింది పనిమనిషి?" అంటూ కవిత టింకు ఉన్న డబ్బాని తీసింది. అంతే చెంగున పరుగులు తీస్తూ వచ్చి శాస్త్రి గారి కాలు గీకింది.


"చచ్చానురా నాయనా! ఛీ పాడు కుక్క నా కాలు కరిచింది," అంటూ వణికిపోతున్న శాస్త్రి గారిని, కొయ్యబారి పోయి నిలుచున్న కవిత, చుట్టూ తిరుగుతున్న టింకుని చూసి శ్రీధర్ నీరు కారిపోయాడు. "చివరిలో ఇలా జరిగిందేమిటి?" అని.


"శ్రీధర్! భక్తి శ్రద్ధ లేకుండా చేసే పూజలకి ఇలాగే ఆటంకం కలుగుతుంది. తల్లిదండ్రులకి తద్దినం పెట్టడం మర్చిపోతున్న ఈ రోజుల్లో మామగారికి శ్రద్ధగా శ్రాద్ధం పెట్టేవాళ్లు ఎవ్వరు ఉంటారు? ఏదో తప్పనిసరి తద్దినం తప్పా. సర్లే, ముందు దక్షిణ ఇలా ఇస్తే నేను వెళ్లి బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకుంటాను," అన్నారు శాస్త్రి గారు.


"ఇదిగో! రేపు మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళాలి. మీరు మా నాన్న ఇచ్చిన పది ఎకరాల పొలం నా పేరున రిజిస్టర్ చేయాలి. ఇక నుంచి మీకు ఈ తప్పనిసరి తద్దినం పెట్టక్కర్లేదు. నేనే రాఘవేంద్ర స్వామి మఠం లో డబ్బు కట్టి పెట్టిస్తాను," అంటూ ఏడుస్తూ మాట్లాడుతున్న భార్య కవిత ని చూసి ముక్కున వేలు వేసుకుని 'కలికాలం' అనుకున్నాడు శ్రీధర్.

                                 

                        శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):











జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page