top of page
Original.png

నాన్న కోరిక

3 hours ago
6 min read

'

నాన్న కోరిక నెరవేర్చేందుకు కొడుకును ప్రొఫెసర్‌గా తీర్చిదిద్దిన తల్లి రంగి

Nanaa Korika - Telugu Emotional Story | M R V Sathyanarayana Murthy

నాన్న కోరిక - తెలుగు భావోద్వేగ కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com on 10/10/2026


“నాన్న కోరిక...” ఒక తల్లి ప్రేమ, త్యాగం, పట్టుదలకు అద్దం పట్టే హృదయస్పర్శమైన తెలుగు కథ. భర్త చివరి కోరికను నెరవేర్చేందుకు రంగి తన జీవితాన్నే కొడుకు భవిష్యత్తు కోసం అంకితం చేస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా శేఖర్‌ను ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దిన తల్లి కథ ఇది.తల్లిదండ్రుల త్యాగం, విద్య విలువ, కుటుంబ ప్రేమను గుర్తుచేసే స్ఫూర్తిదాయక కథ.



రంగి అంటిగిన్నెలు, పళ్ళాలు, గ్లాసులు చకచకా తోముతోంది. ఆమె మనసు ఆనందంగా ఉంది. ఇన్నాళ్లకు, వాణమ్మ గారి అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయమైంది.


అమ్మగారి మొహం పున్నమి సెందురుడిలా వెలిగిపోతోంది... తన ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగుతాయని.


వాణి పెరట్లోకి వచ్చి, "రంగమ్మా, పని అయ్యాక నాకు చెప్పి వెళ్లు... నీతో పని ఉంది" అని, మరలా ఇంట్లోకి వెళ్ళింది. ఆమె మనసు గాలిలో తేలిపోతోంది.


అరగంటలో పాత్రలన్నీ శుభ్రం చేసి, పెద్ద స్టీల్ బుట్టలో పెట్టి, వంటింటి గడప దగ్గర పెట్టింది రంగి.


"అమ్మగారూ, పనైపోయింది... నేనెళ్తాను" అంది.


"ఒక్క నిమిషం ఉండు" అంది వాణి... ఐదు నిమిషాలు అయ్యాక, ఒక పెద్ద కవరులో స్వీట్లు, హాటు పెట్టి, ఆ కవరు రంగికి ఇచ్చింది వాణి.


"మీ ఆయనకు చెప్పు... అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందని..." అంది వాణి చిన్నగా నవ్వుతూ.


"అలాగే అమ్మగారూ" అని కవరుతో బయటకు వచ్చి, ఇంటికి నడవసాగింది. సాయంకాలం ఆరు గంటలవడంతో వీధి దీపాలు వెలుగుతున్నాయి... పది నిమిషాలకు ఇల్లు చేరుకుంది రంగి. అది ఊరి చివర రోడ్డు మార్జిన్‌లో తాటాకులతో ఇళ్లు వేసుకున్న పేదల కాలనీ.


శేఖర్ తల్లి కేసి చూసి నిట్టూర్చాడు... తన కోసం, తల్లి, తండ్రి ఇద్దరూ కష్టపడుతున్నారు... తను డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగంలో చేరి, వాళ్లిద్దరికీ విశ్రాంతి ఇవ్వాలి అని గట్టిగా అనుకున్నాడు.


శేఖర్ పదవ తరగతి చదువుతున్నాడు... మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు.


రంగి స్వీట్ ఒకటి తీసి, కొడుక్కి ఇచ్చి, "ఇది తిను నాన్నా, బేగి వంట సేత్తాను" అని, పొయ్యి వెలిగించి, అన్నం వండటం మొదలు పెట్టింది.


అరగంటలో వంట అయ్యింది... ఏడున్నరకి వెంకటేసు బల్ల రిక్షా మీద ఇంటికి వచ్చాడు.

"ఏంటి మావా, ఇయాల ఆలీసం అయ్యింది?" అడిగింది రంగి.


"ఇంటికొత్తావుంటే, షావుకారు పది బియ్యం మూటలు కొత్త కాలనీకి పట్టుకెళ్ళమన్నాడు. సరేలే, ఓ యాభై రూపాయలు వత్తాయని, అయి పట్టుకెళ్ళి కొత్త కాలనీలోని, కిరాణా షాపు దగ్గర దింపేసి వచ్చాను" అన్నాడు వెంకటేసు.


పాక బయట ఉన్న గోలెంలోని నీళ్లతో స్నానం చేసి వచ్చాడు వెంకటేసు... భర్తకి, కొడుక్కి భోజనం పెట్టి, వాళ్లు తిన్నాక, తను తిని పాక బయటకు వచ్చింది రంగి.


భర్త నులక మంచం మధ్యలో కూర్చుని ఉన్నాడు.


ప్లేటులో ఒక స్వీటు, కొద్దిగా కారబ్బూంది పట్టుకొచ్చి భర్తకు ఇచ్చింది.


"ఏటి ఇశేషం?" అడిగాడు వెంకటేసు స్వీటు తింటూ...

"మా వాణమ్మ గారి అమ్మాయికి పెళ్లి కుదిరింది" అంది ఆనందంగా రంగి.


"శానా మంచిమాట చెప్పావ్... ఆళ్లకి ఒక బెంగ తీరుతాది" అన్నాడు వెంకటేసు... వాణమ్మ గారి ఇంట్లో జరిగిన సంగతులన్నీ చెప్పింది రంగి.


"ఆ... భార్యాభర్తలిద్దరూ శానా మంచోళ్లని అందరూ సెబుతారు... మన పిలగాడి సదువుకి కూడా సాయం చేత్తన్నారు..." అని ఖాళీ ప్లేటు రంగికిచ్చి, కాళ్లు నొక్కుకున్నాడు వెంకటేసు.

వెంటనే రంగి, "నువ్వు పడుకో మావా, నీ కాళ్లు నేను నొక్కుతాను" అంది.


వెంకటేసు నులక మంచం మీద వెల్లకిలా పడుకొని, ఆకాశంలో చందమామ కేసి చూశాడు.


"మావా, రిక్షా మీద అంతంత బరువులు ఏసుకుని తొక్కడం కట్టం కదా. నా మాటవిని పోస్టాఫీసులో దాచిన డబ్బు తీసుకుని, రిక్షాకి మోటరు పెట్టించుకో" అంది రంగి భర్తకు కాళ్లు నొక్కుతూ.


"అమ్మో... ఆటిలోంచి ఒక్క రూపాయి కూడా తియ్యను. ఆ డబ్బు మన పిలగాడి సదువుకి పెట్టాలి.


ఆడు మంచిగా సదువుతున్నాడని హెడ్ మాట్టరు గారు సెప్పారు. మన వాడిని బాగా సదివించి, మాట్టర్ని సేయాల... ఆడు ఎంతో మందికి సదువు చెప్పి, బాగా పేరు తెచ్చుకోవాల" అన్నాడు వెంకటేసు.


కొడుకు గురించి చెబుతున్నప్పుడు, ఆనందంతో వెలిగిపోయిన భర్త మొహం చూసి, మురిసిపోయింది రంగి.


ఒక పావుగంటకు వెంకటేసు నిద్రలోకి జారుకున్నాడు.


పైన ఆకాశంలో చందమామ మేఘాల వెనక్కి వెళ్లాడు.


నెమ్మదిగా వీస్తున్న గాలి కొద్దిగా వేగం పెంచుకుంది.


రంగి గుండెలు గుభిల్లుమన్నాయి... అలసి ఇంటికి వచ్చిన భర్తకి నిద్రాభంగం కల్పిస్తున్న గాలికేసి తిరిగి, "కుసింత ఆగు సామీ, నా పెనిమిటి ఇప్పుడే పడుకున్నాడు... లేస్తే మల్లీ నిదుర రాదు... దయసూడు సామీ..." అని దణ్ణం పెట్టింది.


దేవుడు ఆమె మొర విన్నాడు... గాలి మంద్రంగా వీయడం మొదలు పెట్టింది... రంగి మనసులో వేయి వేణువులు మోహనరాగం ఆలపించాయి. చాప పరుచుకుని, భర్త నులక మంచం పక్కన పడుకుంది రంగి.


వాణమ్మ గారి అమ్మాయి పెళ్లి చాలా వైభవంగా జరిగింది... రంగి, వెంకటేసు పెళ్లి పనులలో ఉత్సాహంగా పాల్గొన్నారు...


పెళ్లి హడావుడి అయ్యాక, మూడో రోజున వాణమ్మ రంగికి, వెంకటేసుకి బట్టలు పెట్టింది... భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు.


నెల రోజులు గడిచాయి... ఒకరోజు రాత్రి వెన్నెల్లో ఆరు బయట కూర్చుని రంగి, వెంకటేసు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు... అందులో వారి పెళ్లి ముచ్చట్లు కూడా ఉన్నాయి... అర్ధరాత్రి మూలుగు వినిపిస్తే, చటుక్కున లేచింది రంగి... వెంకటేసు గుండె దగ్గర చేయి పెట్టుకుని బాధపడుతున్నాడు.


"ఏమైంది మావా?" గాభరాగా అడిగింది రంగి.


"గుండె దగ్గర కొంచెం నొప్పిగా ఉంది అమ్మీ" అన్నాడు వెంకటేసు...

"కుసింత ఆగయ్యా... కొబ్బరి నూనె తెచ్చి రాస్తాను ఉండు" అని పాకలోకి వెళ్ళింది... ఆమె తిరిగి వచ్చేసరికి మూలుగు ఆగిపోయింది.


ఆమె కంగారుగా, "మావా... మావా..." అని గట్టిగా పిలిచింది... ఆమె పిలుపు అందనంత దూరానికి వెళ్ళిపోయాడు వెంకటేసు.


మళ్లీ... మళ్లీ "మావా... మావా..." అని గట్టిగా పిలుస్తూనే ఉంది రంగి... ఆమె కేకలకి, పక్క ఇంట్లో ఉన్న రాజయ్య లేచి, రంగి దగ్గరకు వచ్చాడు, "ఏమైంది?" అంటూ…

"మావ పలకడం లేదు అన్నా" దుఃఖపడుతూ అంది.


ఈ హడావుడికి, శేఖర్ లోపలినుంచి వచ్చాడు. తల్లిని, తండ్రిని అలా చూసి, ఒక్కసారి బావురుమన్నాడు.


రాజయ్య, వెంకటేసు చెయ్యి పట్టుకుని, నాడి చూశాడు... రంగి, ఆందోళనగా అతని కేసి చూసింది...


కొద్దిసేపు తరువాత, బుర్ర అడ్డంగా ఊపి, "సెల్లెమ్మా, బావ నిన్ను అన్యాయం చేసి ఎల్లిపోయాడు" అని బాధగా చెప్పాడు రాజయ్య... అతని మాటలు విని రంగి, శేఖర్ ఇద్దరూ ఘొల్లుమన్నారు.


కొద్దిసేపటికి చుట్టుపక్కల వాళ్లందరూ రంగి ఇంటికి వచ్చారు... జరిగిన ఘోరం చూసి బాధపడ్డారు... తల్లిని, కొడుకుని ఓదార్చారు... రాజయ్యే దగ్గరుండి శేఖర్‌తో, వెంకటేసు అంత్యక్రియలు జరిపించాడు.


వెంకటేసు చనిపోయి పదిహేను రోజులు గడిచాయి... ఒక రోజు రంగి రాజయ్యతో, "అన్నా నువ్వు నాకో సాయం చేయాలి. రిక్షా తొక్కడం నేర్పాలి. నేను పనిచేసే రెండు ఇళ్లలో నా పని పోయింది. వారు వేరే వాళ్లను పెట్టుకున్నారట.


నన్ను రావద్దని కబురు చేశారు. బహుశా నా మొహం చూడటం వారికిష్టం లేదేమో? ఇల్లు గడవడం కష్టంగా ఉంది" అని బాధపడింది.


రాజయ్య ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, "అలాగే" అన్నాడు... వారం రోజులు, రాత్రి సమయాలలో రాజయ్య ఆమెకి రిక్షా తొక్కడం నేర్పాడు... ఒక రోజు రాజయ్యతో కలిసి, రిక్షా తొక్కుతూ గాంధీ బొమ్మల సెంటర్‌కి వచ్చింది రంగి. అక్కడున్న వారు రంగి పట్ల సానుభూతితో దగ్గర దగ్గర ఉన్న కిరాయిలు ఆమెకిచ్చి సహకరించారు.


పది రోజులలో రంగి, సామాన్లు భుజానికెత్తుకుని వాటిని యజమానులకు చేరవేయడంలో అనుభవం సంపాదించింది... నెలసరి ఆదాయం ఆరు వేలు వచ్చింది.


గతంలో తన సంపాదన మీద, రెట్టింపు. రాత్రిళ్లు ఆరు బయట భర్త పడుకునే మంచం మీద వెల్లకిలా పడుకుని, చంద్రుడికేసి తదేకంగా చూస్తూ, అక్కడి నుంచి భర్త చూస్తున్న అనుభూతి పొందుతోంది.


ఒక్కోసారి చంద్రుడిలోని మావను తలుచుకుని, "కుసింత సేపు ఆగకుండా నన్ను విడిచి వెళ్ళిపోయావా?" అని బాధగా అంటూ ఉంటుంది.


"మావా, నువ్వు కోరినట్టుగా అబ్బాయిని బాగా చదివిస్తాను" అని రోజూ చెప్పి, అప్పుడు నిద్రపోతుంది.


రంగి కొడుకు, శేఖర్ పదవ తరగతి పరీక్షలు మంచి మార్కులతో పాసయ్యాడు. వాణి గారి భర్త ప్రసాద్ మాష్టారు రంగి రిక్షాకు మోటారు కొని ఇచ్చారు. రంగికి రిక్షా తొక్కే శ్రమ తగ్గింది, కాళ్ల నొప్పులూ తగ్గాయి... శేఖర్ ఇంటర్మీడియట్‌లో చేరడానికి ఫీజులు ఆయనే కట్టారు.


రెండేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. శేఖర్ ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీలో చేరాడు... రంగి ఆదాయం పెరిగింది... ప్రసాద్ మాష్టారు, రోటరీ క్లబ్ వారిని, శేఖర్ డిగ్రీ చదువుకి సాయం చేయడానికి ఒప్పించారు... రంగికి భారం తగ్గింది.


కొడుకు ఉన్నత చదువుల కోసం, బ్యాంకులో దాచిన డబ్బు ఏభై వేలు దాటింది.

శేఖర్ డిగ్రీ పూర్తి చేసి, విశాఖపట్నంలో పి.జి. చేయడం చాలా వేగంగా జరిగిపోయాయి... రాజమండ్రిలో ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు.


ఒకరోజు రంగితో, "అమ్మా, నాకు ఉద్యోగం కూడా వచ్చింది... నాన్న ఆశయం నువ్వు నెరవేర్చావు. ఇంక రిక్షా తొక్కడం మాని, నాతో రాజమండ్రి రా" అని అన్నాడు.


రంగి ఒక్క నిమిషం ఆగి, "నువ్వు ఇప్పుడు కాలేజీలో, పిల్లలకు పాఠాలు సెబుతావు.


సంతోషం... దీని కంటే ఇంకా పెద్ద కాలేజీలో పాఠాలు సెప్పాల... అప్పుడు నీతో వత్తాను. దానికోసం నువ్వు ఇంకా సదవాలి" అంది.


తల్లి ఉద్దేశం శేఖర్‌కి అర్థమయింది. "అమ్మా, యూనివర్సిటీలో పాఠాలు చెప్పాలంటే ఇంకా చాలా కాలం చదవాలి. అంతకాలం నీకు దూరంగా ఉండాలంటే నాకు బాధగా ఉంటుంది" అన్నాడు.


"కాలం ఇట్టే గడిచిపోతుంది... నువ్వు బాగా సదవాలని మీ నాన్న కోరిక... కాదనకు బాబూ" అంది రంగి అనునయంగా... మౌనంగా తలూపాడు శేఖర్.


వెంటనే పి.హెచ్.డి.కి దరఖాస్తు చేశాడు శేఖర్... సీటు రాగానే ఉద్యోగానికి రాజీనామా చేసి, పరిశోధన మొదలు పెట్టాడు. రంగి బ్యాంకులో దాచిన డబ్బు కొడుక్కి ఇచ్చింది. సకాలంలో పి.హెచ్.డి. పూర్తిచేసి, బంగారు పతకం సాధించి తల్లికి ఆనందం కలిగించాడు.


ఏడాది గడవకుండానే యూనివర్సిటీలో సహాయ ప్రొఫెసర్‌గా చేరాడు... రంగి, కొడుక్కి ఇచ్చిన మాట ప్రకారం శివపురం నుండి వచ్చి రాజమండ్రిలో శేఖర్ దగ్గర ఉంటోంది.


భర్త చిరకాల కోరిక నెరవేర్చానని రంగి సంతోషించింది. తల్లి తనదగ్గర ఉంటున్నందుకు శేఖర్ ఆనందించాడు.


మదర్స్ డే నాడు, మీ మాతృమూర్తులను యూనివర్సిటీకి తీసుకురమ్మని, వైస్ ఛాన్సలర్ మాధవీలత సిబ్బందిని ఆదేశించారు. సుమారు ఇరవై మంది తమ మాతృమూర్తులను యూనివర్సిటీకి తీసుకువచ్చారు.


రంగి యూనివర్సిటీ భవనాలు చూసి ఆశ్చర్యపోయింది. ఇంత గొప్ప ప్రదేశంలో కొడుకు ఉద్యోగం చేస్తున్నందుకు గర్వపడింది. మాధవీలత వచ్చిన మాతృమూర్తులందరినీ తన స్వంత ఖర్చుతో సన్మానించారు. అందరూ తమ తల్లుల గురించి చెప్పారు.


శేఖర్ మాట్లాడుతూ, "మా అమ్మ కడుపున పుట్టడమే నా అదృష్టం. మా నాన్న రిక్షా డ్రైవర్, మా అమ్మ పనిమనిషి. వారిద్దరూ నా రెండు కళ్లు. అమ్మ ఎంతో శ్రమించి నన్ను చదివించింది.


నేను పదో తరగతిలో ఉండగా మా నాన్న చనిపోతే, రిక్షా తొక్కి, బరువులు మోసి తన రక్తం చిందించి నన్ను చదివించింది.


నన్ను ఉన్నత విద్యావంతుడిగా చూడాలన్న మా నాన్న కోరిక తీర్చడానికి తాను కొవ్వొత్తిలా కరిగిపోయి, నా జీవితానికి వెలుగునిచ్చింది. నేను ఎప్పటికీ మా అమ్మ ఋణం తీర్చుకోలేను" అని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.


అతని మాటలు పూర్తికాగానే హాలంతా చప్పట్లతో మార్మోగింది... వైస్ ఛాన్సలర్ మాధవీలత, రంగి దగ్గరకు వచ్చి, "అమ్మా, మీ భర్త ఆశయం నెరవేర్చారు. ఒక మంచి ఆచార్యుడిని మా యూనివర్సిటీకి ఇచ్చారు.


మీరు ఎందరో మహిళలకు ఆదర్శం" అని ఆమెకు నమస్కరించింది.

సభ మరోసారి చప్పట్లతో మార్మోగింది.


కథ సమాప్తం.


*******



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):








M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


సత్యనారాయణ మూర్తి  M R V

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

సత్యనారాయణ మూర్తి  M R V

సత్యనారాయణ మూర్తి  M R V

telugu emotional story,  wife husband story telugu,  old age home story


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page