top of page
Original.png

వినరా భారత వీర కుమారా!

బుర్రకథ, బుర్రకథ కళాకారులు, జానపద కళలు, తెలుగు కథ, ప్రేరణాత్మక కథ, వెన్నెల కథ, పీహెచ్‌డీ, తెలుగు సాహిత్యం, జానపద సాహిత్యం, సంస్కృతి, పరిశోధన, గ్రామీణ జీవితం, తెలుగు విశ్వవిద్యాలయం, విద్య, కళాకారులు, భారతీయ సంస్కృతి, సామాజిక కథ, ప్రేరణ, తెలుగు రచనలు, Mana Telugu Kathalu

బుర్రకథ కళపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకుంటున్న యువ పరిశోధకురాలు వెన్నెల, వేదికపై బుర్రకథ కళాకారుల ప్రదర్శనతో తెలుగు జానపద కళా వైభవాన్ని ప్రతిబింబిస్తున్న దృశ్యం.
బుర్రకథ కళపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకుంటున్న యువ పరిశోధకురాలు వెన్నెల, వేదికపై బుర్రకథ కళాకారుల ప్రదర్శనతో తెలుగు జానపద కళా వైభవాన్ని ప్రతిబింబిస్తున్న దృశ్యం.

Vinara Bharatha Veera Kumara - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri

వినరా భారత వీర కుమారా! - తెలుగు ప్రేరణాత్మక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 11/07/2026


అంతరించిపోతున్న జానపద కళను కాపాడాలనే సంకల్పం ఒక సాధారణ గ్రామీణ యువతిని డాక్టరేట్‌ సాధించిన పరిశోధకురాలిగా ఎలా మార్చింది? "వినరా భారత వీర కుమారా!" కథలో వెన్నెల తన వ్యక్తిగత విజయాన్ని సమాజ ప్రయోజనంగా మలుస్తుంది. బుర్రకథ కళాకారుల కష్టాలు, వారి కళా వైభవం, విద్య యొక్క శక్తి, సంస్కృతిని కాపాడాలనే బాధ్యతను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించే అద్భుతమైన ప్రేరణాత్మక తెలుగు కథ ఇది. 


కీ.శే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియం విద్యార్ధినీ విద్యార్థులతో కళకళలాడుతోంది. ఆ రోజు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వేడుకలు నిర్వహించటానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 


తమ నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షలతో పి.హెచ్.డి సాధించిన విద్యార్ధులకు విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్‌గారు ‘డాక్టరేట్’ ప్రధానంచేసి సన్మానం చేస్తారు ఆ రోజు. 


ఒక అంశంలో పి.హెచ్.డి సాధించాలంటే ఎంతో సాధన, పరిశోధన, నిశిత పరిశీలనలకు నిరంతర పఠనం తోడు కావటం ద్వారా మాత్రమే విద్యార్థులు తమ ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు. తాము ఎంచుకున్న అంశాలపై వాళ్ళకెంతో తపన, ఆసక్తి, తృష్ణ ఉంటేగానీ, తాము అనుకున్న విజయ తీరాలకు చేరుకోలేరు.


మంచి గైడ్ ద్వారా ఆ పి.హెచ్.డి సాధించటానికి సాధకులకు ఎంతో సహనం కావాలి. అందుకే ఎన్నో వేలమంది మాష్టర్ డిగ్రీని సాధించినా, ఏ కొద్ది మందో మాత్రమే ఈ పి.హెచ్.డి పట్టాను పొందగలుగుతారు. 


5 సంవత్సరాల క్రితం జానపద వాఙ్మయంలో తన మాస్టర్ డిగ్రీను పూర్తిచేసిన వెన్నెల, తన తెలుగు శాఖాధిపతి శ్రీ ధనంజయ్‌గారిని కలసి “సార్! నేను తెలుగులో పి.హెచ్.డి చేయాలనుకుంటున్నాను. నేను ఎంచుకున్న అంశానికి సంబంధించి నాకు ఎవరినైనా గైడ్‌గా సూచించండి” అని అడిగింది.


“అమ్మా  వెన్నెల!  నువ్వు మాస్టర్ డిగ్రీలో మంచి మార్కులతో విశ్వవిద్యాలయంలోనే బంగారుపతకం సాధించావు. నీ పట్టుదల, శ్రమ నాకు తెలుసు. నీవు తప్పక పి.హెచ్.డిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలవు. ఇంతకీ నీవు ఏ అంశంపై నీ పరిశోధన చేయాలనుకుంటున్నావు”  అంటూ అడిగారాయన. 


“సార్! నాకు మన జానపద కళలలో ప్రాముఖ్యం వహించిన ‘బుర్రకథ’ అనే అంశంపై పరిశోధన చేయాలని ఉందండి. నేను పుట్టి, పెరిగింది పల్లెటూరిలోనే కదా. పండుగలలో మా ఊరి ఆలయంలో జరిగే జాతరలో ఈ బుర్రకథ కార్యక్రమం తప్పక ఉండేది. అలా నా చిన్నతనం నుండి ఈ బుర్రకథలపై నాకు మక్కువ ఏర్పడింది. అందుకే అదే అంశంపై నా పరిశోధన చేయాలని అనుకుంటున్నాను” అంది వెన్నెల.


ధనంజయ్‌గారు చాలా ఆశ్చర్యంగా “ఏమిటి? ‘బుర్రకథ’ పై పరిశోధన చేయటమా? డిజిటల్, సోషల్ మీడియా టెక్నాలజీ ఒకవైపు, టి.వీ. ఛానల్స్ మరొకవైపు విస్తృతంగా రాజ్యమేలుతున్న ఈ కాలంలో, ఎప్పుడో కాలంచెల్లిన, ఒకరకంగా అంతరించిపోతున్న జానపద కళను పరిశోధనాంశంగా తీసుకుని పి.హెచ్.డి చేస్తానంటున్నావు. ఇది నీకు చాలా కష్టమైన పని అవుతుందేమో సుమా” అంటూ హెచ్చరించారు.


“ఔనుసార్! ఈ మధ్యన ఓ టివీ ఛానల్‌వారు "రేలారే" అనే కార్యక్రమం పెట్టారు. మీరు చెప్పినట్లుగానే ఆ కార్యక్రమంలో అణగారిపోతున్న ఈ జానపద కళాకారులను, వారి ప్రస్తుత జీవన స్థితిగతులను చూపిస్తూ వాళ్ళతో బుర్రకథలను చెప్పిస్తూ,  జానపద గీతాలను పాడిస్తూ ఎంతో ఉత్తేజపూరితంగా నిర్వహిస్తున్నారు. పల్లెటూరిలోనే పుట్టిపెరిగిన నాకు వాటి గురించి తెలుసు కాబట్టి సెలవలకు ఇంటికి పోయినప్పుడు ఆ టివీ కార్యక్రమాన్ని స్నేహితులతో కలసి చూస్తున్నాను. 


ఆ కళాకారుల బాధలను వింటూంటే,  ‘నాకు వాళ్ళ జీవితాలను దగ్గరగా పరిశీలించి నా చదువు ద్వారా వాళ్ళకు ఏమైనా ప్రయోజనం చేకూర్చగలనా?’ అన్న ఆలోచన కలిగింది. అందుకే ముందుగా బుర్రకథకుల జీవితాలపై అధ్యయనం చేసి పేపర్ ప్రజెంటేషన్ పూర్తిచేసి యూనివర్సిటీకి సమర్పిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చానండి” అంది. 


“మంచిదమ్మా! నీకు “సంకుల విఠల్” అనే ప్రొఫెసర్‌గారిని పరిచయం చేస్తాను. ఆయనే నీకు గైడ్‌గా ఉండి నీ పరిశోధనలో  సహాయం చేస్తారు. ఆయన కూడా ‘జానపద గీతాలు’ అనే అంశంపై పరిశోధన చేసి, ఇప్పుడు ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. నీకు వారి ఫోను నంబర్ ఇస్తాను. వారితో మాట్లాడి తరువాత వెళ్ళి కలుసుకుని నీ తరువాత కార్యక్రమాన్ని గురించి వారితో చర్చించు” అన్నారు ధనంజయ్‌గారు.   


అలా విఠల్‌సార్ మార్గదర్శకత్వంలో వెన్నెల తన ఊరు చుట్టుప్రక్కలనున్న కళాకారులనే కాదు, యావత్తు భారతదేశంలోని ‘బుర్రకథ’ కళాకారులను కలుసుకుని వారి జీవితలను తరచి చూసి, వారి జీవితపు ఎత్తుపల్లాలను అవగాహన చేసుకుని, తన పరిశోధనాపత్రాలను డిపార్ట్‌మెంట్‌కి సమర్పించింది.


తెలుగులో పి.హెచ్.డి చేసే స్కాలర్స్ అంతా  సాధారణంగా కవిత్రయంచే విరచితమైన, ‘మహా భారతం’లోనో, పోతనచే పదగ్రస్తమైన ‘భాగవతం’లోనో, తమతమ పరిశోధనాంశాలను ఎంచుకుంటారు. కానీ ఈ వెన్నెల ‘బుర్రకథ’ అనే అంశంపై పరిశోధన చేసింది. 


ఆమె ఏఏ విషయాలను తన పరిశోధనలో ప్రస్తావించిందో తెలుసుకోవాలనే ఆతృతతో, ఆమె పరిశోధనా పత్రాలను ఆసక్తిగా చదవసాగారు ధనంజయగారు.  వెన్నెల ‘బుర్రకథ’ పరిశోధనా సరళికి, చదువుతున్న ధనంజయగారి కళ్ళవెంట అశ్రువులు అప్రయత్నంగా జాలువారుతున్నాయి.  


“జానపదులు చెమటోడ్చి పనిచేసే కష్టజీవులు. సాయంత్రం కాగానే తమ శ్రమను మరచిపోవడానికి వినోదాన్ని కోరుకుంటారు. పూర్వం ఈ జానపద కళలకు ఎంతో ఆదరణ ఉండేది. హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు మొదలైన కళారూపాలు ఎంతగానో పేరుగాంచాయి. 


ఆలయాలలోని మంటపాలు, నాలుగు కూడళ్ళ మధ్యనుండే రచ్చబండలు ఈ కళారూపాల ప్రదర్శనకు అనువైన ప్రదేశాలుగా ఎంచుకునేవారు.


‘బుర్రకథ’లు చెప్పటానికి ముగ్గురు వ్యక్తుల అవసరం ఉంటుంది. ప్రధాన కథకుడు తలకు తురాయి టోపీ పెట్టుకుని నిండైన ఆహార్యంతో, కుడి భుజంపై ‘తంబూర’ పెట్టుకుని, ఎడమచేతి వేళ్ళకు ‘చిరుతలతో కూడిన పెద్ద రుమాలు’ ధరించి, లయబద్ధంగా వాటిని మోగిస్తూ తన శ్రావ్యమైన కంఠంతో కథను ముందుకు నడుపుతూంటే, అతనికి ఇరుప్రక్కల 'వంతలు’ చెరొక డోలు ధరించి, ప్రధాన కథకుడు చెప్పే ప్రతి విషయానికి 'తందాన, తాన తందానా' అంటూ వంత పాడారు. 


వంతలలో ఒకరు ‘వచనం’, మరొకరు ‘హాస్యం’లతో జనాలను నవ్విస్తూ ఆహ్లాదపరుస్తున్నా, వారి సంభాషణలలో చమత్కారం పాలు ఎక్కువగా ఉంటుంది. “వినరా భారత వీరకుమారా వందనం వందనం” అంటూ బుర్రకథను ఆరంభిస్తారు. రాత్రి మొదలయిన ఈ బుర్రకథలు వేకువ ఝామువరకూ సాగుతూంటాయి.


‘సీతారామ జననం’, ‘బాలనాగమ్మ’, ‘సారంగధర’, ‘బొబ్బిలి యుద్ధం’, మొదలైన కథాంశాలను ఎన్నుకుని బుర్రకథకులు ప్రజలను రంజింపచేసేవారు.

ప్రేక్షకులంతా వారికి బియ్యం, బట్టలతో పాటు ధనం కూడా ఇస్తూండటంతో ఆ కాలాన ఈ ‘బుర్రకథ’ కళాకారులకు తిండికి, జీవన భృతికి లోటుండేది కాదు. కానీ నేడు టి.వీ., సినిమా, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల వంటి సాంకేతిక విప్లవంతో వారికి దినసరి  దొరకటమే కష్టమైపోతోంది.


ఆదరించేవారులేక, ఆదరణకోల్పోయిన ఈ కళాకారులు బ్రతుకుతెరువు కోసం ఈత చాపలల్లుతూ, సంతల్లో అమ్ముకుంటూ, ఊరూరాతిరుగుతూ, దొరికిన కూలిపనులను చేసుకుంటూ జీవిస్తున్నారు. 


ఏదైనా తీర్థాలు, జాతరలు జరిగినప్పుడు, దేవుడి ఉత్సవాలప్పుడు వీరి కార్యక్రమాలను ఏర్పాటుచేస్తూ వీరిని ప్రోత్సహించే నిర్వాహకులు, నేటికాలంలో సినిమాల ప్రభావంతో రికార్డింగ్ డాన్స్ వంటి అసభ్య నృత్యాలను నిర్వహించి ఈ కళాకారులను విస్మరిస్తున్నారు.


వారి పిల్లలు  ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగాలు సాధించాలన్నా వారి ఆర్ధిక స్థితి తోడ్పడదు.  కొందరు దాతల సాయంతో కొంతమంది పైచదువులకు వెడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా ఇదే కళను నమ్ముకుని జీవన పోరాటం చేస్తున్నారు. 

ఈ కళకు పూర్వ వైభవం తేవాలంటే ప్రభుత్వాలు, ప్రజలు, కళాశాలలలో, విశ్వవిద్యాలయాల్లో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ కళారూపాలను ప్రదర్శించి ప్రోత్సహించాలి. పురాణ కథలతో పాటు, సామాజిక సమస్యలు, విద్య, ఆరోగ్యం రక్తదానం, ప్రకృతి పరిరక్షణ మొదలయిన విషయాలపై ప్రజలలో అవగాహనకు ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగ పడతాయి. 


ప్రభుత్వాలు ఈ కళాకారులకు పింఛను, నిరుద్యోగ భృతి, వృత్తి విద్యలో శిక్షణలనందిస్తే ఈ కళ అంతరించిపోకుండా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇలా ఎన్నో బుర్ర కథ కళాకారుల సమస్యలను, అభివృద్ధి అంశాలను తన పరిశోధనలో తెలియపరిచింది వెన్నెల.


ఇదంతా చదువుతున్న ధనంజయగారికి బుర్రకథ కళాకారుల యదార్ధ స్థితిగతులను ఆవిష్కరించటానికి వెన్నెల పడిన తపన అర్ధమయ్యింది. ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ వేదికపై సందడి మొదలయ్యింది. పి.హెచ్.డి పూర్తిచేసిన  స్కాలర్స్ అంతా ముందువరసలో కూర్చొన్నారు, గానీ వెన్నెల ఇంకా సభాప్రాంగణంలో కనిపించలేదు.


యూనివర్సిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్‌గారు విచ్చేసి భద్రతా సిబ్బంది నడుమ వేదిక ముందు ఆశీనులయ్యారు.   వైస్-ఛాన్సలర్‌గారు గవర్నర్‌గారి ప్రక్కనే కూర్చుని, వారితో ఏదో విషయం మాట్లాడుతున్నారు. “వేడుకలు ప్రారంభించటానికి ఆలస్యం ఏమైనా ఉందా?” అంటూ అడిగారు ఛాన్సలర్‌గారు. 


“ఏమీలేదండి. ఇంకాసేపట్లో మా తెలుగు విభాగం వారి సాంస్కృతిక కార్యక్రమంతో వేడుకలు ఆరంభమవుతాయి” అని బదులు చెప్పారు వైస్ ఛాన్సలర్‌గారు. 

“ఏదైనా నృత్యసంగీత కార్యక్రమమా? లేక నాటికేమయినా వేస్తున్నారా?” అని అడిగారు ఛాన్సలర్‌గారు.  


“కాదుసార్! మన పురాతన సంస్కృతికి ఆనవాలుగా మిగిలిన జానపదకళలలోని ‘బుర్రకథ’ను కళాకారులు ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. మీరు కూడా మన జానపద కళలను బాగా ఇష్టపడతారని తెలిసింది. మీకు ఈ ప్రదర్శన ఆనందాన్ని ఇస్తుందనే భావిస్తున్నాను” అని చెప్పారు ధనంజయగారు. 


“పెద్దలకు నమస్కారం. దయచేసి విద్యార్ధులందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ మెట్రోపాలిటన్ సిటీలో మీరెప్పుడూ చూడని ఓ జానపద కళతో మన తెలుగు విభాగం విద్యార్ధులు మీ ముందుకు వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తిలకించి ఆస్వాదించండి” అని చెప్పారు స్టేజిమీదకు వచ్చిన ధనంజయగారు.


‘బుర్రకథ’ కళాకారులు స్టేజిమీదకు వచ్చారు. ప్రధాన కథకుడు చిన్నస్వామిగారు ఎర్రని వస్త్రాలు ధరించి ఉదయించే సూర్యునిలా వెలిగిపోతున్నారు. మిగిలిన కళాకారులు తగిన ఆహార్యంతో రంగస్థలాన్ని శోభాయమానం చేస్తున్నారు. 


“మేం బనగానపల్లి నుండి వచ్చి మొట్టమొదటిసారిగా ఈ జంటనగరాలలో ఈ రోజున మా మొదటి ప్రదర్శన ఇస్తున్నాం. చదువు విలువ తెలుసుకుని కష్టపడి తన చదువుసాగించి, తన కన్నవారికి తద్వారా తన తరం వారికి కళల విలువను తెలియజేసే ఓ అమ్మాయి కథను  మేము ఈ రోజు మీకు వినిపిస్తాం అంటూ “వినరా భారత వీర కుమారా..” అని కంఠమెత్తి పాడటం మొదలుపెట్టారు.  


“నువ్వేదో రామాయణ, భారత కథను చెపుతావనుకుంటే, కళలు, విలువలంటున్నావేమిటి గురువా? అయితే నువ్వు చెప్పే కథ సినిమా కథనా? లేక టివీ సీరియల్ కథనా?” అంటూ ప్రధాన కథకునికి ఇరువైపులా వున్న వంతలు అడుగుతున్నారు. 


“తినబోతూ రుచడుగుతారెందుకు?  మరి వినండి” అంటూ “అనగనగా ఓ చిన్న ఊరిలో చక్కని చిన్న పిల్ల వుంది. అందంలో లక్ష్మీ దేవిని తలపిస్తూ, చదువులో సరస్వతికి ప్రతిరూపంగా నిలచింది” అంటున్న ప్రధాన కథకునికి అడ్డువస్తూ ‘వంత’, “ఆ మన సినిమాలోని హీరోయిన్ లెక్క ఉంటుందా?” అని అడిగాడు నవ్వుతూ. 


“ఊరుకోరా! నీకు ఎప్పుడూ సినిమాల ధ్యాసేనా? పొట్టకోస్తే అక్షరం ముక్క రాదుగానీ నీకు సినిమాలు కావాలి” అంటూ కథను ముందుకు నడిపాడు ప్రధాన కథకుడు.


ఆ చక్కనిపిల్ల పల్లెటూళ్ళో చదువు సంధ్యలెరుగని ఇంటిలో తప్పపుట్టింది. ‘నే చదువుకుంటా’నంటూ పేచీపెట్టి ఊరిలోని స్కూలులో పదవతరగతి వరకు చదివింది. ‘నేను కాలేజీలో చేరతానయ్యా’ అంటూ వాళ్ళ నాన్నను వేధించటం మొదలుపెట్టింది. 

“డబ్బులు లేనోడు దుబ్బుకు కొరకాడు” అంటారు.  “నిన్ను పట్నంలో కాలేజీలో జేర్పించి చదువు సాగించే ఆర్ధిక స్థోమత నాకు లేదు. అందులోను చదువుతో పూర్తవుతుందా? ఆడపిల్ల బాధ్యత. నీకు పెళ్ళి చేయాలంటే అది నాకు శక్తికిమించిన పనవుతుంది. అర్ధం చేసుకో అమ్మా” అంటున్న నాన్న మాటలకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయింది. 


ఇప్పటివరకు నీవు చదివిన పుస్తకాలలో వున్న పురాణ కథలు నీకు బాగానే వచ్చు కదా. నాకు తోడుగా నువ్వు కూడా బుర్రకథ చెప్పటానికి వస్తే  కాస్త నాకు ఆర్ధికంగా  వేణ్ణీలకు చన్నీళ్ళుగా వెసులుబాటు దొరుకుతుంది. తొందరలో నీకు పెళ్ళి చేసి ఒక అయ్యచేతిలో నిన్ను పెడితే నా బాధ్యత కూడా తీరుతుంది” అన్నాడు తండ్రి. 


ఆ మాటలకు ‘ససేమిరా’ అన్న ఆ పిల్ల కూలిపనులకు వెళ్ళి, ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పి ఓ సంవత్సరంలో కాలేజీలో చేరటానికి అవసరమైన డబ్బులు సంపాదించుకుని కాలేజీలో చేరిందా చదువుల సరస్వతి. పట్టుదలతో చదువు కొనసాగించిన ఆ తల్లికి అన్ని సబ్జెక్ట్‌లలో  ఫస్ట్ మార్కులే వచ్చాయి. కొడుకుకు చదువుపై శ్రద్ధలేకపోవటంతో స్కూలు విద్య దగ్గరే ఆగిపోయాడు. కూతురుమాత్రం చదువుల్లో దీటుగా వుంది స్కూలులో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకుంటోంది. 


చదువంటే  కూతురు చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతున్న ఆ తండ్రి ఓ రోజేం చేశాడంటే, ఊరిలోని ఓ పెద్దింటి ముసలాయన కాలం చేశాడు. ఆ ఇంటి ఆసామి తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసి చివరి రోజు తండ్రి స్మృత్యర్ధం బుర్రకథ కార్యక్రమం పెట్టించాడు. మన చదువులతల్లి తండ్రి తమ్ముడు, తల్లితో కలసి రాములవారి కథను చెప్పాడు. 


తన తండ్రికి ఇష్టమైన రాముని కథను చెప్పినందుకు సంతోషపడిన ఆ ఆసామి కథకులకు  బట్టలు పెట్టి పదివేల రూపాయిలు ఇచ్చాడు. అప్పుడా బుర్రకథ చెప్పిన తండ్రి ఏమన్నాడో తెలుసా?” అంటూ ఆగాడు చిన్నస్వామి. 


“ఇంకా డబ్బులు కావాలని అడిగుంటాడు” అన్నాడు వంత. “కాదు అన్నా తినడానికి బియ్యం కావాలని అడిగుంటాడు” అంది పక్కనే ఉన్న వనిత. 


“మీరు అంతకు మించి ఆలోచించలేరా? ఎప్పుడూ తిండి గొడవ లేకపోతే సినిమాల విషయమేనా? ఆ తండ్రి ఏమడిగాడంటే  నా కూతురు చదువులో బాగా రాణిస్తోంది. ఆమె కోరిన చదువును చెప్పించండయ్యా. మీరెప్పుడడిగినా బుర్రకథను మీకు ఉచితంగా చెపుతాను. అంతేకాదు మీకే పనులు కావాలన్నా నేను చేసిపెడతాను” అని వేడుకున్నాడు. 


మీ ఇంట ఆడపిల్ల చదువుకుంటోందా? నేను తప్పక ఆమె చదువుకి సహాయం చేస్తాను” అంటూ ఆయన ‘అభయహస్తం’ ఇచ్చాడు.


ఆవిధంగా ఆ పేదింటిపిల్ల చక్కగా కాలేజీలో చేరి తనను కోరుకున్న ఉన్నత చదువును పూర్తిచేసింది. ఆ వనిత తన గతాన్ని, పేదరికాన్ని మరచిపోలేదు. తనవారికి, తన తోటి కళాకారులకు ఏదైనా మంచి చేయాలని తహతహలాడుతోంది. ఆ తల్లి కష్టానికి వందనం. వింటున్న మీ అందరికి వందనం” అంటూ ముగించారు చినస్వామిగారు. 


ప్రధానకథను రంజింపచేయటానికి వారు ఉదాహరించిన పిట్టకథలు ఎంతో ఆసక్తికరంగా సాగి కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలను మంత్రముగ్ధులను చేసాయి. చప్పట్లతో ఆడిటోరియం మారుమ్రోగింది.  


“ప్రధాన కధకుడు చినస్వామిగారు. అతనికి వంతలుగా ఒకవైపు కొడుకు చంద్రస్వామి నిలబడితే మరోవైపు కూతురు వెన్నెల నిలుచుంది. తన గాత్రంతో చినస్వామి భార్య చంద్రమ్మ సహకారం అందించింది” అంటూ కళాకారులను సభకు పరిచయం చేశారు ధనంజయగారు. 


“ఈ వెన్నెలమ్మ మన వెన్నెలేనా?” అంటూ వైస్ ఛాన్స్‌లర్‌గారు ఆశ్చర్యపోతూ వెన్నెల ముఖంలోకి పరీక్షగా చూశారు. “గమనించారా తేజోవంతమైన ఆ కళ్ళలోని వెలుగును” అంటూ గవర్నర్‌గారికి వెన్నెల గురించి చెప్పారు వైస్ ఛాన్స్‌లర్‌గారు.


అప్పటివరకు క్రిందకూర్చున్న పెద్దలు వేదికను అలంకరించారు. కళాకారులు తమతమ స్థానాలలో కూర్చున్నారు. 


ఒక్కొక్క విభాగంలో పేర్లను చదువుతూ గవర్నర్‌గారి చేతులమీదుగా ‘డాక్టరేట్’ పట్టాను అందిస్తున్నారు. తెలుగు శాఖకు సంబంధించి “కుమారి వెన్నెల ‘బుర్రకథ’ అనే అంశంలో తన పరిశోధనాపత్రం అందించారు” అంటూ మైక్‌లో చెపుతున్నారు. 

గవర్నర్‌గారు వెన్నెలకు డాక్టరేట్ పట్టాను అందిస్తూ  “నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నీలాంటి విద్యార్ధినికి ఇలా ‘డాక్టరేట్’ అందిస్తున్నందుకు. ముఖ్యంగా నేను నిన్ను ఒకందుకు అభినందిస్తున్నాను. 


నీ చదువు ఒక్క నీ కుటుంబానికే పరిమితం చేయకుండా, ‘బుర్రకథ’ కళాకారులందరికీ మేలుచేసే విధంగా కొనసాగించావు. నీవు చేసిన శ్రమ గురించి మీ ధనంజయసార్ నాకు చెప్పారు.  నీ ఆశయం అంతరించి పోతున్న ఒక జానపద కళకు పునరుజ్జీవం కలిగించేదిశలో సాగింది. Keep it up. 


నేను కూడా నీ పరిశోధనా వ్యాసాన్ని పూర్తిగా చదివి ప్రభుత్వానికి ఈ బుర్రకథా కళాకారుల సమస్యల గురించి తెలియజేసి, వాటి పరిష్కారానికి నీవు సూచించిన సలహాలను పరిగణలోనికి తీసుకుని కార్యాచరణ తీసుకోవాలని నా వంతు సూచనలను చేస్తాను. విద్యార్ధులందరూ మీ చదువును  ఈ వెన్నెలలా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలి” అంటూ సందేశమిచ్చారు.


వెన్నెలను స్టేజ్ మీద చూసిన ప్రేక్షకులంతా “ఈమె బుర్రకథ కళాకారిణా? ఎంత చక్కగా ప్రదర్శన ఇచ్చింది. తనకథనే బుర్రకథగా చెప్పించి ఆ రంగంలో కష్టపడేవారి సమస్యలను ఎంతో సున్నితంగా వివరించింది” అని  విస్మయంగా అనుకుంటూ, అభినందనలను చప్పట్లరూపంలో అందించారు.   


వేదిక ముందు కూర్చున్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెన్నెల తమ కళ్ళముందు ఇంతగొప్పగా ఎదిగిన తీరుకు ఓరకమైన భావోద్వేగానికి లోనైనారు. 

ఈ ‘వెన్నెల’ చదువుల సౌరభం, చల్లని ఆడిటోరియం  నిండా పౌర్ణమినాటి చంద్రుని వెన్నెలకి సాటిగా పరచుకుంది. 


***** 

📖 ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులు, విద్యార్థులు, సాహిత్యాభిమానులతో పంచుకోండి. అంతరించిపోతున్న మన జానపద కళలను కాపాడే ప్రయత్నంలో మనమూ భాగస్వాములం అవుదాం.    

మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి
మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page