#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #NakoKallajoduKavali, #నాకోకళ్ళజోడుకావాలి

Nako Kallajodu Kavali - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma
Published In manatelugukathalu.com On 28/01/2025
నాకో కళ్ళజోడు కావాలి - తెలుగు కవిత
రచన: బులుసు రవి శర్మ
నాకో కళ్ళజోడు కావాలి
పెద్దగా కనిపించేవి
చిన్నగా కనిపించాలి !
ఉత్తరపు గాలి వీయంగానే
ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాను
ప్రక్కనే రంగుల జుబ్బాలు తొడుక్కున్న
నేస్తాలు కూడా నాతో పాటు తలలు ఊపుతారు
రెండు నెలల క్రితం
ఇక్కడే ఈ దుకాణంలో ప్రాణం పోసుకున్నాను
వెన్నెముక నిటారుగా నిలబడడానికి
ఓ వెదురు బద్ద
రెండు భుజాలు కలుపుతూ బాణంలా
మరో వెదురు
రెండు రంగుల చొక్కా
గుండ్రటి నల్లటి కళ్ళు
చెవులకి కాగితపు జలతారుతో ముస్తాబయ్యాను
ఏ చిన్ని చేతులకు చిక్కి తాదాత్మ్యం పొందుతానో
లేక
ఏ మొరటు చేతుల్లో నలిగి పోతానో
ఏ చేతులయితేనేం
పుట్టింది ఎగరడానికే కదా
మా నేస్తాలతో కలిసి
సరదాగా ఎగురుతాను
ఎగిరి ఎగిరి
ఏ చెట్టుకొమ్మకి చిక్కుకుంటానో
తెగిన దారంతో విల విల లాడుతూ
తెలియని గమ్యం చేరుకుంటానో
పైకి ఎగిరినప్పుడు
అన్నీ చిన్నగానే కలిపిస్తాయి
మేడలు మిద్దెలు
నదులు కొండలు
అన్నీ చిన్నగా కనిపిస్తాయి
కానీ
మనుషుల మధ్య
భేదాలు విభేదాలు
కష్టాలు కోపాలు
పగలు ప్రతీకారాలు
అన్నీపెద్దగా
ఇంకా పెద్దగా అవుపడతాయి
అందుకే
నాకో కళ్ళజోడు కావాలి
పెద్దగా కనిపించేవి
చిన్నగా కనిపించాలి
కళ్ళజోడు పెట్టుకొని చూసి
తృప్తి పడతాను
అవన్నీ లేని రోజు కోసం
కలలు కంటాను
-బులుసు రవి శర్మ
Comentários