top of page

ఒక ఆత్మ 'ఆత్మకథ!'

#PGopalakrishna, #Pగోపాలకృష్ణ, #OkaAthmaAthmakatha, #ఒకఆత్మ ఆత్మకథ


Oka Athma Athmakatha - New Telugu Story Written By P. Gopalakrishna

Published In manatelugukathalu.com On 28/01/2025

ఒక ఆత్మ ఆత్మకథ - తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ  

కథా పఠనం: A. సురేఖ



షష్టి పూర్తి చేసుకోవలసిన వయసులో పెళ్ళీ పెటాకులు లేకుండా ఘోటకపు బ్రహ్మచారిలా గడపవలసి రావడం నిజంగా చాలా కష్టమే. వృద్ధాప్యం లో మగాడికైనా, ఆడదానికైనా ఒక తోడు ఉండాలని అందరూ చెప్తే, మొదట్లో ఏమో అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడిప్పుడే మనిషికి మనిషి తోడు ఎంత అవసరమో అర్థమవుతోంది. బహుశా పూర్వజన్మ లో చేసిన పాపమో లేదా వయసులో ఉన్నప్పుడు నేనెప్పటికీ ఇలాగే పులి లాగా బతికేస్తాను అని భ్రమ పడడం వల్లనో కానీ నేను మాత్రం షష్టి పూర్తి చేసుకోవలసిన వయసులో కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయాను. 


“మీ వాడికేమే కాముడూ, చక్కగా గవర్నమెంట్ స్కూల్ లో మాష్టరీ ఉద్యోగం. మంచి జీతం” పొరుగింట్లో నాయనమ్మ వరసయ్యే నరసాంబ గారు బోసినోటితో అంటూ ఉంటే కొంచెం గర్వంగా అనిపించినా పెళ్ళవ్వలేదనే చింత మనసుని తొలిచేస్తోంది. మరి పెళ్లేందుకు చేసుకోలేదని మీకు అనుమానం రావచ్చు. సంప్రదాయమైన కుటుంబం లో పుట్టి ఎప్పటివో పద్ధతులు పాటించే మా తల్లిదండ్రులు ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా మగపిల్లాడికి పెళ్లి ఎలా చేస్తామని అనడంతో నా పెళ్లి విషయం తాత్కాలికంగా పక్కన పడిపోయింది. 


“మీ శర్మ కి మా అమ్మాయిని చేసుకోవే అక్కయ్యా” అంటూ మామయ్య ఎన్నిసార్లు చెప్పినా అమ్మా, నాన్నా ససేమిరా అనడంతో విసుగొచ్చిన మామయ్య తన కూతురు మీనాక్షికి దూరపు సంబంధం చేసేశాడు. అలా చిన్నప్పటినుండి ఇష్టపడిన మీనాక్షీ పెళ్లి ఇంకొకరితో జరిగిపోతూ ఉంటే, మనసు బాధగా మూలిగినా, పెళ్ళిలో మామయ్యా వాళ్ళు పెట్టిన కమ్మని భోజనం తిని, మీనాక్షిని అక్కడే మరిచిపోయాను నేను. 


బహుశా భోజన ప్రియుడిని కావడం వల్లనో ఏమో, తిండి యావ తప్ప మీనాక్షి కన్నీళ్లకు నేనే కారణమని అనుకోలేకపోయాను ఆరోజు. పాపం తాను ఆ రోజు నా వైపు చూసిన చూపులు ఇప్పటికీ నేను మరిచిపోలేదంటే నమ్మండి. కానీ ఏం చేస్తాం. మాదేమో ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగిన కుటుంబమాయే. 


 మీనాక్షి కి చక్కని అబ్బాయి దొరికాడు. ఈడు జోడు బావుంది అంటూ అందరూ అంటూ ఉంటే, మనసులో ఒక పక్క బాధ ఉన్నా, అమ్మా నాన్నా ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయ్యేదాకా వీడి పెళ్లి ప్రసక్తి లేదంటూ భీష్మించుకోవడంతో మాట్లాడకుండా ఉండిపోవలసి వచ్చింది. “పోనీలే బావని చేసుకోకపోవడం మంచిదయింది, వాడేమైనా అందగాడా! ఏదో వరస కుదురుతుందని, ఆస్తి బయటకి పోకుండా చూసుకోవచ్చని, పైగా మా కళ్ళముందు తిరుగుతుంటావని మా అక్కని పదేపదే అడిగాను. దేముడు మేలు చేసి, గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధమే ఖాయం చేశాడు”. పెళ్ళి పందిట్లో కుర్చీలో కూర్చొని, అత్తయ్యా, మామయ్యా మీనాక్షితో నెమ్మదిగా అన్న మాటలు కూడా నా చెవిన పడి, మనసు చివుక్కుమన్నా మాట్లాడకుండా ఏదో పనుల్లో ఉన్నట్లు నటించాల్సివచ్చింది. అలా భర్త చేయి పట్టుకొని మీనాక్షి సంతోషంగా కాపురానికి వెళ్ళిపోయింది. 


పెద్దక్కకి పెళ్ళి చూపులని అమ్మా, నాన్నా చెప్పినరోజు నా సంతోషానికి అవధుల్లేవంటే నమ్మండి. అక్కకి పెళ్ళయి పోతున్నట్లు కలలు కంటూ, తరువాత వెంటవెంటనే చెల్లాయికి కూడా పెళ్ళి చేసేసి, నాకు వచ్చిన ఏదో ఒక సంబంధాన్ని ఖాయం చేసుకొని పెళ్లి చేసేసుకోవాలని ఉత్సాహంగా పెళ్ళిచూపులకి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైపోయాను. సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య, వెనకాల రిక్షా లో దిగిన పెళ్లికొడుకు తల్లి దండ్రులని, పెళ్ళికొడుకుని లోపలికి తీసుకొచ్చి పరిచయాలు ఐపోయాయనిపించాడు. 


 పెళ్లికొడుకు వయసు అక్క వయసుకంటే దాదాపు పదమూడేళ్లు ఎక్కువ. నలభై పై మాటగా ఉన్న పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు చక్కగా తయారు చేసి పెట్టిన స్వీట్లు వగైరాలు ఖాళీ చేసేసి అక్క కి ఎత్తుపళ్లున్నాయని, మనిషి కూడా బాగా సన్నంగా ఉందని, పొట్టిగా ఉన్న అమ్మాయి తమకు వద్దు అంటూ మొహంమీద చెప్పేసి, చల్లగా జారుకున్నారు. 


ఇది కాకపోతే ఇంకోసంబంధం అనుకుంటూ నాన్న మళ్ళీ వీధులు పట్టి తిరగడం మొదలెట్టారు. దగ్గర బంధువులకి, దూరపు బంధువులకి సంబంధాలేమయిన ఉంటే చెప్పమని అమ్మ కూడా తరుచూ చెప్పేది. 


మొత్తానికి మరో పది రోజుల్లోనే ఇంకో సంబంధం వచ్చింది. అబ్బాయికి అన్నీ బ్రహ్మాండంగా నచ్చాయి కానీ జాతకాలు కుదరలేదని ఆ సంబంధం వెనక్కి తిరిగిపోవడంతో ఏంచేయాలో దిక్కుతోచలేదు అమ్మా నాన్నలకి. సరిగ్గా ఒక నెలరోజులకి వచ్చిన సంబంధం కట్నం ఎక్కువ ఆడగడంతో, ఇవ్వలేక విధిలేని పరిస్థితుల్లో వదులుకోవలసి వచ్చింది. 


పాతిక పైగా సంబంధాలు చూసి విసుగొచ్చిన అమ్మా నాన్నా ఇంక పెద్దక్క పెళ్లి వయసు దాటిపోయిందని చెల్లాయికి సంబంధాలు చూడడం మొదలెట్టారు. అక్క పెళ్ళి పక్కన పెట్టేశాకా, నాకు ఇంక పెళ్లి చేసుకోవాలనే కోరిక క్రమంగా నశించి పోయింది. చెల్లాయి కి కూడా పెళ్లి కుదరకపోవడంతో అప్పటికే నలభై ఐదు దాటిపోయిన నాకు ఇంక పిల్లనిచ్చే వాళ్ళు దొరకడం కష్టమని ఆ ప్రయత్నాలు విరమించుకున్నాను. 


అప్పటికే ఉద్యోగం వచ్చి పదేళ్లు సర్విస్ దాటి పోయింది. కనీసం ఏదో ఒక ఇల్లయినా సంపాదించుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాను. కాలం గిర్రున తిరుగుతోంది. నాన్నా, అమ్మా ఒకరి తరువాత మరొకరు కాలం చేశారు. 


“మా పెళ్ళిళ్ళు అవ్వకపోతే అదే పోయిందిలేరా, నువ్వైనా పెళ్లిచేసుకుని మన వంశం నిలబడేలా చేయి”, అంటూ పెద్దక్క పదేపదే చెప్పినా నాకు ఎందుకో పెళ్ళంటే విముఖత ఏర్పడిపోయింది. అమ్మా నాన్నలు కాలం చేశాక, చెల్లాయి పెళ్లి గురించి పట్టించుకునే తీరిక లేక ఆ ప్రయత్నాలు మూల పడిపోయాయి. ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ, ఎవరి గూడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాం. గూడు వేరైపోవడంతో మనుషుల మధ్య అంతరాలు కూడా పెరిగిపోయాయి. 


“అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి?” అని ఆలోచించడం మొదలెట్టాను. పెళ్ళి లేకుండా ఎందరో మహానుభావులయ్యారు. మనం మాత్రం ఎందుకు సంసారసాగరం లో ఈదుకుంటూ కొట్టుమిట్టాడాలి? నా ఆలోచన నాకు భేషుగ్గా అనిపించింది. ఇక్కడినుండి మనిషిలో స్వార్ధం మొదలవుతుందేమో. వచ్చిన జీతం అంతా వచ్చినట్లు దాచడం మొదలెట్టాను. అయిదంకెల జీతం కాస్తా ఆరంకెలకు చేరుకుంది. 


వయసా ఏమంత ఐపోయిందని? ఏభయ్యవ పడిలోకి చేరుకున్నా ఇంకా తల నెరవడం మొదలవ్వలేదు. అందం ఒక్కటే తక్కువ కానీ, శుభ్రమైన భోజనం తిని శరీరం బలిష్టంగానే పెరిగింది. అవును భోజనమంటే గుర్తొచ్చింది. అసలు చక్కగా హై స్కూల్ లో మాష్టారుగిరీ వెలగబెడుతూ ఇంట్లో చేయి కాల్చుకోవడం ఎందుకూ? చక్కగా స్కూల్ లో మధ్యాహ్నం భోజనం తినేసి, కాస్తో, కూస్తూ మిగిలింది తెచ్చేసుకుంటే పోలా? డబ్బు కి డబ్బూ మిగులు. చేయికాల్చుకునే పనుండదు. 


“శభాష్ రా శర్మా, తెలివితేటలు అంటే నీవి”. 

“ఆలస్యం అమృతం విషం” 

రేపటినుండి ఈ ఆలోచన అమల్లో పెట్టుకోవాలి” మనసులోకి వచ్చిన ఆలోచన వృధాగా పోతే ఎలా? అందుకే అమలు చేశాను. 


భోజనం ఖర్చు స్కూల్ ఖాతాలోకి పోవడంతో, ఇంక నాకున్న ఖర్చు మూడొంతులు తగ్గిపోయింది. మనిషిని దిట్టంగా ఉండడం వలన మందు, మాకు ఖర్చు ఎటూ లేదు. 


బ్రహ్మచారి జీవితం కాబట్టి బంధువుల రాకపోకలు కూడా లేవు. ఎప్పుడైనా అక్కా వాళ్లింటికి వెళ్తే పలకరించడమే తప్ప ఇంకేమీ లేదు. అమ్మా నాన్నా పోయాక వాళ్ళ బరువు బాధ్యతలు నాకింకేం మిగిలాయి. ఒక మారుమూల పల్లెటూరు ఎంచుకుని అక్కడికి బదిలీ మీద వెళ్లిపోయాను. ఇప్పుడున్న స్కూల్ లో అయితే పదిమంది పదిరకాలుగా అనుకోవచ్చు. కొత్త స్కూల్ కదా! మనగురించి వాళ్ళకి తెలిసే అవకాశం బహుతక్కువ. నా అవతారం చూసిన అక్కడి టీచర్లు నా జోలికి వచ్చిందీ లేదు. 


ఇక్కడ ఇంకో విషయం నేను గమనించాను. నాకు అది బాగా నచ్చింది. నా అవతారం చూశాక నాకు పని చెప్పబుద్ధి కాలేదేమో, వాళ్ళంతా నా పని కూడా చేయడం మొదలెట్టారు. అప్పుడప్పుడు క్లాస్ తీసుకోవడం, మిగిలిన సమయాల్లో హాయిగా కాలంగడిపేయడం. 


“ఒరేయ్, శర్మా! నీ తెలివితేటలు అమోఘం సుమీ” అని నాకు నేనేచెప్పుకునే సందర్భాలు కోకొల్లలు. నాకు ఎలాంటి బరువు బాధ్యతలు లేవని నా సహోపాధ్యాయులకు తెలియడం నాకు మంచిదయింది. 


“గురూగారూ, నాకో పదివేలు అప్పుగా కావాలి, సర్దుబాటు చేస్తారా. వచ్చే జీతాల్లో రెండు రూపాయలు వడ్డీ వేసి ఇచ్చేస్తాను” ఎంతో మొహమాటంగా అడిగాడు నాకంటే జూనియర్ అయిన నారాయణ మాష్టారు. అతనికి ఊళ్ళో మంచి పేరొందని వినికిడి. 


“నా దగ్గర ఎక్కడినుండి వస్తాయి మాష్టారూ, నాదీ మీలాంటి జీతమేగా” లోపల లోపల ఇవ్వాలని అనిపించినా, కొంచెం బెట్టు చేయకుండా ఇవ్వడం మంచిది కాదనిపించింది. అప్పటికి మాట్లాడకుండా ఊరుకున్నా, మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ విషయం కదిపాడు. నోటురాసి ఇస్తాను అనడంతో తప్పనిసరి పరిస్థితి లో ఇస్తున్నట్లు మొహం పెట్టి, ఖాళీ ప్రో నోటు మీద సంతకం చేయించుకుని డబ్బు చేతిలో పెట్టాను. 


సరిగా పది రోజులయిందేమో, “నారాయణ మాష్టారుకి డబ్బులు ఇచ్చారుట కదా” అంటూ అడిగాడు రాజు మాష్టారు.


తప్పనిసరై ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పడంతో, “అతనికి ఇస్తే మీ డబ్బులు వచ్చినట్లే”! అంటూ విషపూరితంగా నవ్వాడు. 


బయటికి స్నేహితుల్లా నటించే వీరి మనసులో ఇంత విషం ఉందా అనిపించింది. కానీ నారాయణ మాష్టారికి డబ్బులు అప్పిచ్చి తప్పు చేశానేమో అని బాధపడడం మొదలెట్టాను. ఇంకోపక్క రాజు మాష్టారు డబ్బులు కావాలని నారాయణ మాష్టారిలా పదివేలు కాకుండా ఒక ఏభైవేలు సద్దుబాటు చేయమని రూపాయి వడ్డీ ఇచ్చుకోగలనని, ఎవరికీ వడ్డీ గురించి చెప్పనని మాటిచ్చాడు. 


మనదగ్గర మాత్రం డబ్బు పెట్టుకొని ఏంచేస్తాం? వడ్డీ అయినా వస్తుంది కదా!అనిపించింది. కానీ నారాయణ మాష్టారు డబ్బు తిరిగి ఇవ్వకపోతే.. అదే భయం రాజు మాష్టారి ముందు బయటపెట్టాను. 


“అతను డబ్బివ్వకుండా ఎక్కడికీ పోడు. జీతం వచ్చిన వెంటనే నేనే వసూలు చేసి మీకు అందించే ఏర్పాటు చేయిస్తానుగా”. భరోసా ఇచ్చాడు ఆయన. 


“ఇప్పటికిప్పుడు నా దగ్గర లేవు కానీ, ఒక వారం ఆగండి చూద్దాం” అన్నాను. ఒకటి రెండు రోజులు గడిచాయి, అతను అసహనంగా ఉన్నాడని అర్థమవుతోంది. కానీ ‘మళ్ళీ డబ్బులు అడిగితే చూద్దాంలే’ అనుకుంటూ ఊరుకున్నాను.


మళ్ళీ రెండు రోజులనాడు డబ్బులు అడిగాడు రాజు మాష్టారు. ఇంకా కాదంటే బావుండదని నోటు మీద సంతకం చేయించుకొని అప్పు ఇచ్చాను. అప్పటినుండి ఎంతో స్నేహంగా ఉండడం మొదలెట్టారు. మొత్తం మీద నెల తిరిగేసరికి మన వడ్డీ వ్యాపారం ఊపందుకుంది. పదివేలుకి తక్కువ ఇచ్చింది లేదు. 

ఏబయివేలు లోపు రెండు రూపాయలు వడ్డీ కి ఇస్తే, ఏభై వేలు పైనబడిన వాటికి రూపాయి వడ్డీ కి ఇవ్వడం స్కూల్ లో ఒకరిద్దరు మినహా అందరూ అప్పులు తీసుకోవడంతో బీరువా లో ఖాళీగా మూలుగుతున్న డబ్బు కాస్తా, పెట్టుబడిగా మారి, నెలకి సుమారు ముప్పై వేలు వరకు వడ్డీ రావడం మొదలైంది. 


అలా అలా మొదలైన వడ్డీ వ్యాపారం నాకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ప్రజాల్లోనే నా డబ్బు తిరుగుతూ నాలుగేళ్ళల్లో సుమారు రెట్టింపు అయిపోయింది. వడ్డీ ఎప్పటికప్పుడు వసూలు అయిపోతుంటే ఇబ్బంది ఏముంది. ఈ నాలుగేళ్ళల్లో శుభ్రత అంటే ఏంటో మరిచిపోయాను. 


వారానికో పదిరోజులకో బట్టలు మార్చడం, షేవింగ్, హెయిర్ కటింగ్ లాంటివి ఎప్పుడో ఏ అరునెలలకో ఒకసారి చేయడం మొదలెట్టాను. అసలు నేను పుట్టిందే వడ్డీ వ్యాపారం కోసమని భావించడం మొదలుపెట్టాను. అప్పుడే మా ఉపాధ్యాయుల్లో ఒకరి పట్ల ఒకరికి మనస్పర్థలు మొదలయ్యాయి. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు మొత్తం వసూలు చేసుకోవడం మొదలు పెట్టాను. క్రమంగా ఒకరిద్దరు చిన్న బాకీల వాళ్ళు మినహా, ఏభై వేలు లోపు బాకీలన్నీ వసూలు చేసేశాను. 


“గురూగారూ, మీ దగ్గర ఉన్న డబ్బు మాకు ఇవ్వండి, నెలకి మీకు వడ్డీ రూపంలో ఏభై వేలు పైచిలుకు డబ్బు వస్తుంది” అంటూ ఒకరోజు నారాయణ, రాజు మాష్టారులు ఇద్దరూ వచ్చారు. 

క్రమం తప్పకుండా వడ్డీ కడుతున్నారాయే. పైగా ఒకే స్కూల్, పది మందికి అప్పు ఇచ్చి వాళ్ళని అడిగే కంటే, ఒకరిద్దరికి మొత్తం డబ్బు ఇవ్వడం మెలనిపించింది నాకు. అలా నా దగ్గర ఉన్న మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేసి ఊరుకున్నాను. ముందుగా ఊహించినట్లు బదిలీలు రావడంతో వాళ్ళిద్దరి సలహా మేరకు వాళ్ళు వెళ్ళిన స్కూల్ కి బదిలీ మీద వెళ్ళి జాయిన్ అయ్యాను. అదే రోజు మధ్యాహ్నం ఇద్దర్నీ కూర్చోపెట్టి, నా డబ్బులు ఆరునెలల లోగా తిరిగి ఇచ్చేయాలని చెప్పాను. 


ఇద్దరికీ కోపమొచ్చిందేమో, నా పట్ల తిరస్కారంగా చూస్తూ అక్కడినుండి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల టైమ్ లో ఇంటికి వస్తూ ఉండగా స్పీడ్ గా వచ్చిన బైక్ నన్ను ఢీకొట్టి వెళ్ళిపోవడం, నాకు స్పృహతప్పడం జరిగిపోయింది. 


మనుషుల సంచారం లేకపోవడం వలన, నన్ను పట్టించుకున్నవారే లేకపోయారు. అందుకే ఇప్పుడు ఆత్మ రూపంలో మీకు ఈ కథ చెప్పవలసి వచ్చింది. ఉదయానికి పేపర్ లో నా గురించి వార్త వచ్చిందిట. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అంటూ. సదరు వ్యక్తి ఉపాధ్యాయుడు అని తెలిసింది అంటూ. కొసమెరుపు ఏంటంటే, ఇటీవల కాలంలో అతనికి మతిభ్రమించింది అని సహచర ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారని రాశారు. అదంతా చూసిన నాకు “ఔరా! వీళ్ళు ఇంత దుర్మార్గులా”! అనిపించి బాధపడ్డాను. 


నా చావు వార్త విన్న తరువాత నా దగ్గర అప్పు తీసుకున్న వారు అయ్యో అంటారని ఆశ పడ్డాను. కనీసం కొంతమంది అయినా కన్నీళ్ళు పెట్టుకుంటారని భ్రమ పడ్డాను. నా తోబుట్టువులు కూడా నా చావుని తేలిగ్గా తీసుకున్నారు తప్ప అయ్యో అని ఏడవలేదు. నాకు ఏ మాత్రం సంబంధం లేని ఒకరిద్దరు సహ ఉపాధ్యాయులు మాత్రం నా శరీరాన్ని దగ్గరగా చూసినప్పుడు వాళ్ళ కళ్ళు చెమర్చడం నాకు ఆశ్చర్యం వేసింది. అనుక్షణం వాళ్ళని నేను ద్వేషించినా వాళ్ళు మాత్రం నాకోసం కంట తడిపెట్టడం సంతృప్తిగా, సంతోషంగా అనిపించింది. 


ఇంక నా అంతిమ యాత్ర అంటే చెప్పకూడదు. ఒక కైలాస రధం తెప్పించి మెడలో పూల దండ వేసి, అంతిమ స్నానం కూడా చేయించకుండా రధం ఎక్కించారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది అంటూ కంగారు పడుతూ.. 


నాకు కడపటి వీడుకోలు చెప్పడానికి లక్షలు లక్షలు అప్పు పుచ్చుకున్న నా సహోద్యోగులు కూడా రాలేదు. కేవలం ఇద్దరు మనుషులు వచ్చి అయ్యిందనిపించి క్షణం కూడా వృధా చేయకూడదన్నట్లు వెనుదిరిగారు. 

 *********

“వీడొక పాపి, వీడికి తగిన శిక్ష విధించండి” అంటూ యమధర్మరాజు అరుస్తూ ఉంటే, చిత్రగుప్తులవారు చిట్టా చూసి “వీడిని ముక్కలుగా కోసి, సలసల కాగుతున్న నూనెలో వేయాలని రాసి ఉంది ప్రభూ, వీడు వడ్డీ వ్యాపారం చేయడం తో పాటు వృత్తి ధర్మాన్ని సరిగా నిర్వహించలేదు” అన్నారు వినయంగా. 

పది మంది యమభటులు వచ్చి వంటిమీద బట్టలు ఊడతీసినంత సులభంగా కాళ్ళూ చేతులూ శరీరం నుండి విడదీసి, పొయ్యిలో పెట్టి మిగిలిన శరీర భాగాల్ని కోసేసి నూనెలో వేయించడం మొదలెట్టారు. ఒకపక్క తోబుట్టువులు, ఇంకోపక్క అప్పు తీసుకున్నప్పుడు మీరే దైవం అని పొగడిన నా సహోద్యోగులు చక్కగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి, నన్ను రెండోరోజుకే మరిచిపోయారు. 


నారాయణ, రాజు మాష్టార్లూ చక్కగా చెరో కారు కొనుక్కొని, కుటుంబాలతో పిక్నిక్ కి వెళ్తూ నా ఇల్లున్న వీధి వైపు చూసి, తల తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటే గట్టిగా అరిచి పిలిచాను. కానీ వాళ్ళు నా అరుపులు వినలేరని ఇప్పుడు అర్థమైంది. ఇంకోపక్క యమదూతలు నన్ను నానా తిట్లు తిడుతూ శరీరాన్ని నూనెలో వేయిస్తూ ఉంటే నాకేమో ఒళ్ళంతా మండిపోతోంది. కానీ దానికంటే నా సహాయం పొంది సంతోషంగా పండగ చేసుకుంటున్న నా అనుచర ద్వయం మీద కోపం కట్టలు తెంచుకుంటోంది. ఇలాంటి అపాత్రులకా నేను సాయం చేసింది అని పశ్చాత్తాపం పడడం మొదలెట్టాను. 


నా ముఖంలో నూనెలో వేయిస్తున్న బాధకంటే కూడా మిత్ర ద్రోహం చేసిన నా ఇద్దరు సహోద్యోగుల పట్ల అసహ్యం కనపడుతోంది. నేను గడిపిన పిసినారి జీవితం మీద నాకే అసహ్యం వేయసాగింది. మరో జన్మమంటూ ఉంటే పిసినారిగా జీవించకుండా, ఉన్నదాన్ని అనుభవిస్తూ పదిమందికి నాకు చేతనైనంత చేయాలని అనుకున్నాను. ఇప్పటికిప్పుడు మళ్ళీ నన్ను వెనక్కి పంపిస్తే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న నా డబ్బు మొత్తం కక్కించి ఆ మొత్తం డబ్బు ఏదైనా అనాథ, వృద్ధాశ్రమాలకి సహాయంగా ఇవ్వాలనిపించింది.


కానీ ఇదంతా సాధ్యం కాదు. సినిమాల్లో అయితే యముడు వచ్చి వెనక్కి వెళ్ళమని ఆజ్ఞ ఇస్తాడు హీరో మళ్ళీ భూమ్మీదికి వచ్చి విలన్ల భరతం పడతాడు. నేనేమీ హీరో ని కాదు కదా. వాళ్ళు విలన్లు కూడా కాదు. కేవలం మనుషులం మేమంతా. ఇది నిజజీవితం. ఇప్పటికీ ఇంతే అని సరిపెట్టుకొని గట్టిగా నిట్టూర్చాను. 


ఎవరో వెనకనుండి వీపు మీద కొరడా తో కొట్టినట్లయింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. చుట్టూ మా అపార్ట్మెంట్ వాసులు. వాళ్ళల్లో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. అసలైతే నాకేమీ అర్థం కాలేదు. “మీరంతా నాలాగే పాపాలు చేసి ఇక్కడికి వచ్చారా?” అంటూ అడిగాను. 


వాళ్ళు తెల్లబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఘొల్లున నవ్వారు. “మీరు ఎక్కడికి వెళ్లలేదు. మీ ఫ్లాట్ లోనే ఉన్నారు. శనివారం రాత్రి అందరితో మాట్లాడిన మీరు సోమవారం ఉదయం వరకు కనపడకపోతే ఏమయ్యారా అనుకున్నాం. మీ ఇంటి తలుపు తెరిచి ఉంటే, మీరు ఇంట్లో ఉన్నారో, లేకపోతే ఏ దొంగ వెధవయిన లోపలికి దూరాడో అని హడిలి పోయి చచ్చాం”. 


“మీరేమో కదలక మెదలక నేలమీద పడి ఉంటే ఏమైందో అని గత గంట సేపటినుండి లేపుతున్నాం. మీ అక్కా, చెల్లీ కూడా వచ్చి మీరు స్వర్గస్తులయ్యారేమో అని కంగారు పడుతున్నారు”. ఆగకుండా తనదైన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నారు పక్క ఫ్లాట్ లో అవధాన్లు గారు. 


“బావుంది సంబడం, చూసింది చాల్లెండి. పదండి ఆఫీసు లకి టైమ్ అవుతోంది” అంటూ మూతి వంకర్లు తిప్పుకుంటూ అక్కడినుండి కదిలింది ఎదురింటి శాస్త్రి గారి రెండో భార్య కమలం గారు. 


ఎలాగైనా డబ్బు అప్పులిచ్చి వడ్డీలతో దాన్ని పెంచుకుని పిసినారిగా బ్రతకడం కంటే, అప్పులు వసూలు చేసుకొని, పదిమందికి పనికొచ్చే పనేదైనా చేయాలని ధృడంగా నిశ్చయించుకొని, హడావుడిగా స్నానం కి బయల్దేరాను, స్కూల్ కి టైమ్ అవుతోందని


***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ P. గోపాలకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna 

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


1 comentario



@gopalkrishna5639

18 minutes ago

Excellent

Me gusta
bottom of page