top of page
Original.png

క్షీరసాగర మథనము - 1

Updated: Feb 4, 2025

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #ఉత్పలమాల, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 1 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 27/01/2025

క్షీరసాగర మథనము - 1 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


1.

ఉత్పలమాల.


క్షీరపయోనిధిన్ జిలుక శ్రీకరమౌ సుధకై సురాసురుల్

వారికి తోడుగా నిలిచి వాసిగ కూర్మపు రూపమొంది తాన్

దీరుగ మోసి మందరము దీవెన లిచ్చెను భక్తకోటికా

వారిజనేత్రుడా,హరికి భక్తిగ మ్రొక్కెను విశ్వమంతయున్.//


2.

తేటగీతి.


శ్రోత ‌విష్ణురాతుడువక్త శుకునకెరగి

క్షీరసాగరమున్ దొల్త చిల్కి రెట్లు?

దేవగణములు పొందిన దీనతేమి?

యని యడుగ శుకుడు పలికె ననఘు గాంచి.//


3.

తేటగీతి.


పూర్వకాలమందునబహు పుణ్యులైన

సురసమూహము లోడె నసురుల జేత

తీవ్రమైనట్టి బాధతో తెరలి తెరలి

యమర రాజ్యమున్ గోల్పోయి యడగిరపుడు.//


4.

తేటగీతి.


యజ్ఞ యాగాది కార్యము లాగిపోయె

మునులు యోగులు వగచిరి ముప్పు గనుచు

ధర్మ పరులకు జగతిలో దారిలేక

దుఃఖమొందుచునుదొరలిదొరలిరచట.//


5.

తేటగీతి.


అత్తెఱంగున దేవతలార్తితోడ

బ్రహ్మ దేవుని కడకేగి భక్తికదుర

తలలు వంచుచు తమ బాధ తెలుపు కొనుచు

నిలిచియుండిరి దీనులై నిలువలేక//


6.

తేటగీతి.


చిత్తమందున జిష్ణుని స్థిరము చేసి

నవ్వు మోముతో నప్పుడు నలువ పలికె

''దివిజ వరులార!విష్ణుని దివ్యమైన

శక్తి నిల్పునీ జగతిని శాశ్వతముగ.//


7.

తేటగీతి.


పాదపంబులు గిరులును పక్షి గణము

పశువులున్ మీరు నేనును పంచముఖుడు

జన్మమొందితిమా హరి సంతరించ

జ్ఞాన మయుడైన విష్ణుండు జయము నొసగు.//


8.

తేటగీతి.


సత్త్వగుణముతో నలరారు శార్ఙ్గపాణి

శుభఫలంబుల నొసగునీ శోభనుండు

వాని పాదముల్ బట్టిన భయము తొలగు

మౌని హృదయనివాసుండు మనకు దిక్కు".//


9.

తేటగీతి.


ఇట్లు వచియించి స్రష్టతా నిరవుగాను

సురల గూడి వైకుంఠమున్ జొచ్చెనపుడు

పరమ తేజోమయంబైన పథము గాంచి

నచ్చెరువు నొంది రచ్చట యమర వరులు.//




టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page