top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 36


'Nallamala Nidhi Rahasyam Part - 36' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఆ ద్వారం తెరుచుకునే సరికే చాలా రాత్రి అయిపోయింది. కాసేపట్లో తెలవారిపోతుంది. గ్రహణ ఘడియలు మొదలవక ముందే, ఆ ఖడ్గమును సంపాదించాలి అనే కంగారులో, సంజయ్ ఆ శిల్పాన్ని చూసిన వెంటనే ఆ దివ్య ఖడ్గాన్ని అందుకోడానికి వెళ్ళిపోయాడు. అజయ్ కనురెప్ప వేసేలోగా జరిగిపోయిన ఆ ఘటనకి, సంజయ్ ఆ ఖడ్గమును పట్టుకోగానే షాక్ కొట్టిన వాడిలా ఎగిరి వెళ్లి గోడకు గుద్దుకుని కిందపడి స్పృహ కోల్పోయాడు. ఊహించని ఆ ఘటనకి అజయ్ కన్నీటి సంద్రం అయ్యాడు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోతోంది. ఇంకాసేపట్లో సూర్యోదయం అయిపోతుంది. సంజయ్ ని ఎంత లేపుతున్నా లేవడం లేదు. ఆ శిల్పాన్ని నేరుగా తాకడం వల్ల సంజయ్ ఎగిరిపడ్డాడు అని అర్ధమైన అజయ్, ఆ గ్రంధాన్ని తెరిచి చూసాడు.

"ఎవరైనా సరే, ఖడ్గమును పొందాలి అంటే, మహా శివలింగానికి ఎడమ పక్కగా ఉన్న శిల్పం చేతిలో ఉన్న కలశంలోని గంగాజలంతో, ఆ శివయ్యకు అభిషేకం చేసి, ఆ నీటిని కుడి పక్కగా ఉన్న ఖడ్గమును పట్టుకుని ఉన్న శిల్పంపై జల్లి, అప్పుడు మాత్రమే ఆ శిల్పాన్ని తాకవలెను. లేనిచో, ఆ శిల్పం నుండి వెలువడే విద్యుత్ఘాతానికి బలి అగుదురు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఆ విద్యుత్ఘాతానికి బలి అయితే, ఆ జలమును తాగించిన యెడల తిరిగి కోలుకొనెదరు" అని ఆ గ్రంథంలో రాసి ఉంది. అది చదివిన వెంటనే, అజయ్ ఇంక ఆలస్యం చేయకుండా కుడి వైపు ఉన్న శిల్పం చేతిలోని కలశాన్ని తీసుకుని ఆ గంగాజలంతోనే "హర హర మహాదేవ శంభోశంకర!" అంటూ ఆర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ అభిషేకం చేసాడు. ఆ శివయ్య నుండి పడుతున్న అభిషేక జలాన్ని మళ్ళీ సేకరించి, సంజయ్ నోట్లో పోసాడు. ఆ నీరు సంజయ్ గొంతులోకి వెళ్ళగానే, అతనిలో కొద్దిగా చలనం వచ్చింది. సంజయ్ కళ్ళు తెరిచి చూసే సరికి, అతన్నే చూస్తూ ఉన్న అజయ్ కనిపించాడు.

" అన్నయ్యా. నాకు ఏమైంది? " అంటూ పైకి లేచిన సంజయ్ ని గట్టిగా గుండెలకు హత్తుకుని

" నీకేం కాలేదు. నీకేం కాలేదు." అంటూ కన్నీరు తుడుచుకుంటూ "ఇక మనకి ఖడ్గం దొరికింది. ఆ నీచుడ్ని అంతం చేసేద్దాం! పద. " అంటూ ఆ అభిషేక జలమును ఎడమ వైపు ఉన్న శిల్పముపై జల్లి, ఆ ఖడ్గమును తీసుకొన గానే, ఆ గుహ మొత్తం భూకంపం రావడం మొదలైంది. ఆ మహాశివునికి దండం పెట్టుకుని, ఇంక అక్కడనుండి " హర హర మహాదేవ శంభో శంకరా!" అంటూ ఆ శివయ్యను తలుచుకుంటూ మెరుపు వేగంతో బయటకు వచ్చేందుకు ఇద్దరూ పరుగు మొదలుపెట్టారు.

ఆ గుహ మొత్తం కంపించిపోతోంది. రాళ్లు కదిలి దొర్లుతూ వారి దారికి అడ్డం వస్తున్నాయి. వాటిని తప్పించుకుంటూ, ఆ దివ్య ఖడ్గముతో వారు బయటకు పరుగులు పెడుతూ ఉండగా, ఆ దారి మొత్తం ఇరుకుగా మారిపోతూ, ఆ దారి గుండా పరిగెడుతున్న ఆ ఇద్దరికీ చర్మం చీరుకుపోతూ, వళ్లంతా గాయాలు అయిపోతున్నాయి. అయినా వారు అలుపెరగకుండా పరిగెడుతూ, గ్రహణ ఘడియలు మొదలవక మునుపే బయటకు వచ్చేసారు. వీరు అడుగు బయట పెట్టగానే, ఆ సొరంగ మార్గం మొత్తం మూసుకు పోయింది. అప్పటికి మరియా ఆ నరేంద్రుని ఎదుర్కుంటూ ఉంది.

అక్కడ ఉన్న గిరిజనులంతా అజయ్, సంజయ్ ల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.

పూజారి గారు లేచి, " నాయనా మార్తాండా! ఆ దివ్య ఖడ్గముతో ఆ నీచుడు దుష్టాత్మను అంతం చేయి నాయనా. విజయోస్తు!" అంటూ గుడి గంటలు మ్రోగించసాగారు.

మరియాతో పోరాడుతూ ఉన్న నరేంద్రుడు, అజయ్ చేతిలో ఉన్న దివ్య ఖడ్గం వైపు చూస్తూ, వికృతంగా నవ్వుతూ, నేలమీదకి దిగాడు. వాడు అలా దిగగానే పిడుగు భూమి మీద పడిందా, ఆకాశం విరిగి పడిందా అన్నట్టు పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి పూజారి గారు, అజయ్, సంజయ్ లు తప్ప అక్కడ ఉన్న వారంతా మూర్ఛ వచ్చి పడిపోయారు.

కిందకి దిగిన సింగా ఇప్పుడు పూర్తిగా నరేంద్రుని రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. వాడిని ఆ రూపంలో చూసిన సంజయ్ కి ఇప్పుడు పూర్తిగా తన గత జన్మ గుర్తుకు వచ్చింది.

" ఓరీ మిత్రద్రోహి! నీ వల్లే కదరా నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నా వెన్నంటే ఉండి, నమ్మించి, నన్ను క్రూరంగా చంపేశావు కదరా! నిన్ను వదలను" అంటూ గాలిలో ఎగిరి వెళ్లి ఆ నరేంద్రుని గుండెలపై తన్నాడు. సంజయ్ చేతికి తాయత్తు ఉండడం వల్ల, ఆ దుష్ఠుడి ఆత్మ, నేరుగా సంజయ్ ని ఎదుర్కొలేక అతనిపైకి రాళ్లు, పదునైన చెట్టు కొమ్మలు విసురుతూ ఉన్నాడు. అవేమి సంజయ్ ను తాకనివ్వకుండా మరియా ఆత్మ శక్తి తో ఆపుతోంది. మరియా కూడా వారి వెనకనే ఉండి, ఆ దుష్ట ఆత్మ పై తన పగను తీర్చుకునేందుకు సంజయ్ కి శక్తిని ఇస్తోంది.

తన గత జన్మలో తనని నమ్మించి గొంతు కోసినందుకు ఆ నరేంద్రునిపై అమ్మవారి కుంకాన్ని కురిపించాడు సంజయ్. ఆ కుంకుమ శక్తికి ఆ నరేంద్రునికి వళ్ళు మొత్తం కాలిపోతున్నట్టుగా భగభగా మంటలు ఒళ్లంతా వ్యాపించాయి. తన కసి తీరేలా నరేంద్రుని హింసించసాగాడు, తనని తాను ప్రతాపరుద్రునిగా నమ్మిన సంజయ్. అది చూసి అజయ్, మరియాలు కూడా సంతోషించారు.

పూజారి గారు, " బాబూ! గ్రహణ ఘడియలు మొదలు కాబోతున్నాయి. వాడిని వధించండి" అంటూ వారిని హెచ్చరించాడు.

అజయ్ వెంటనే ఆ దివ్య ఖడ్గమును నేరుగా నరేంద్రుడు ఆవహించి ఉన్న సింగా గుండెల్లో దించాడు. అంతే! ఆ సింగా ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. నరేంద్రుని దుష్టాత్మ సింగా శరీరంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసినా, అది సాధ్యం కాలేదు. ఆ దివ్య ఖడ్గపు జ్వాలలో, ఆ దుష్టాత్మ, ఆ దుష్టాత్మకు వాహకం అయిన నీచుడు సింగా, ఇద్దరూ ఆహుతి అయ్యారు.

అలా ఈ ప్రపంచాన్నే ముంచేద్దామనుకున్న ఒక దుష్టాత్మ, తన స్వార్థం కోసం చిన్న పిల్లలను క్రూరంగా హింసించే పశు ప్రవృత్తి కలిగిన సింగా.. ఇద్దరూ నశించిపోయారు. అమ్మవారి అనుగ్రహంగా ధర్మం గెలిచింది.

తనని తాను ప్రతాపరుద్రునిగా నమ్మిన సంజయ్ "మిత్రమా" అంటూ అజయ్ గా మళ్ళీ పుట్టిన మార్తాండను గుండెలకు హత్తుకున్నాడు.

మరియా వారిద్దరితో " మహారాజా! మీ నిధి పదిలముగా ఉన్నది. మీకు ఆ నిధిని అప్పగించి, నా కర్తవ్యం పూర్తి చేసుకొనవలెను. నేనిక పరమాత్మలో ఐక్యం కావలెను. అందుచేత, మీ ఇరువురిని నాతో తీసుకు వెడుతున్నాను" అంటూ పూజారి గారికి నమస్కరించి, ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారికి కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన ఆత్మ శక్తితో, ఆ ఇరువురు కారణ జన్ములను, నిధిని దాచి ఉంచిన నీలగిరి కొండ గుహలలోకి తీసుకువెళ్ళింది.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.




28 views0 comments
bottom of page