top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 35


'Nallamala Nidhi Rahasyam Part - 35' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

"ఏమైంది అన్నయ్యా? ఈ ద్వారం ఎలా తెరవాలి?" అని అడిగాడు సంజయ్.

" ఇది నాగబంధనం. ఇది తెరిచే విధానం ఈ గ్రంధంలో వివరంగా రాసి ఉంది. ఈశ్వరుడి మెడను అలంకరించే ఆభరణానికి, శివయ్య వాహనపు కుడి చెవి కుండలం తీసి, బహుకరించండి." అంటూ చదివాడు అజయ్.

"ఈశ్వరుని మెడను అలంకరించే ఆభరణానికి అంటే ఆ జంట నాగుల పైన ఉన్న శేష సర్పం. శివయ్య వాహనం అంటే నందీశ్వరుడు. కానీ ఇక్కడ నందీశ్వరుని విగ్రహం ఎక్కడ ఉంది?" అంటూ ఉండగా

" అన్నయ్యా! ఇందాక మనిద్దరం పడిపోయాం కదా. అక్కడ కొలను లాంటిది ఉంది చూడు!అక్కడ ఆ కొలను మధ్యలో నంది విగ్రహం చూసానురా! బహుశా అదే అయి ఉంటుంది. నువ్వు ఉండు. నేను తీసుకొచ్చేస్తా" అంటూ అజయ్ వారిస్తున్న వినకుండా వెనక్కి పరుగెత్తాడు సంజయ్. అజయ్ కూడా సంజయ్ ని అనుసరించ బోయాడు.

"అన్నయ్యా! నువ్వు ఉండు. ఆ కుండలం నేను తెస్తాను. దానితో ఆ ద్వారం ఎలా తెరవాలో చదువు" అంటూ సంజయ్ పరుగున వెనక్కి వెళ్లి, ఆ కొలనులోకి దిగిపోయాడు. లోతు తక్కువగానే ఉన్నట్టు కనిపించిన ఆ కొలను ఊబి అని తెలియడానికి సంజయ్ కి ఎంతో సేపు పట్టలేదు. అజయ్ కి కనుచుపు మేరలోనే ఉన్న ఆ కొలనులో, సంజయ్ మునిగిపోతూ కనిపించాడు.

***

టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా అజయ్ గురించి, సింగా గురించి చెప్తూనే ఉన్నారు. అది చూసి సీత ఇంకా బెదిరిపోతోంది. బిడ్డలను కాపాడమని ఆ మల్లన్న స్వామికి మొక్కులు మొక్కేసుకుంటూ, గుండెలవిసిపోయేలా ఏడుస్తోంది. ఆమెను ఆపడం ఆ తల్లీ కూతుర్ల తరం కావడంలేదు. కమల, మల్లి కూడా సీత దగ్గరే కూర్చుని ఉన్నారు. ఎవరికీ ఆవిడని ఎలా ఓదార్చాలో తెలియక, ఏం జరుగుతుందో అని గుండెలు అరచేతిలో పట్టుకుని కూర్చున్నారు.

***

రామచంద్ర సిద్ధాంతి గారు ధర్మాన్ని గెలిపించమంటూ చండీ హోమం చేస్తూ ఉన్నారు. కానీ ఆయనికి మాత్రం అర్ధం అయిపోతోంది. ఆ ఇద్దరూ అన్నదమ్ములలో ఎవరో ఒకర్ని మాత్రమే కాపాడగలము అని.

మృత్యువు పొంచి ఉన్న వారి జాతకంలో మరణం అనేది ఏ రకంగా అయినా రావచ్చు అని ఆయనకు ముందే తెలుసు. పుట్టుక రెండు ప్రాణుల కలయిక. అది ఒకే విధంగా కలుగుతుంది. మరణం అనేది ఏ ప్రాణి నుండి ఏ ప్రాణికి రానుందో, ఏ జీవితం ఎవరి చేతుల్లో ఎలా అంతం కానుందో! ఒక జీవికి ఇన్ని తిండి గింజలు, ఇన్ని ఊపిరి క్షణాలు, ఇన్ని నూకలు అని బ్రహ్మ గారు లెక్కలు వేస్తూ, నుదిటిపై రాసిన రాతే బ్రహ్మరాత. అది ఒక జీవి తన ముందు జన్మలలో చేసిన పాప, పుణ్యాల ఆధారంగానే లెక్కించబడుతుంది.

ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ఆ విధంగా భూమి మీద పంచభూతాత్మకమైన శరీరంతో ఊపిరి ఉన్న మనిషిగా లేక జీవిగా, జీవించే ప్రతి ప్రాణి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్ధం తీరిన క్షణంలో ఆ జీవి ఈ లోకం మీద తన పుట్టుకకు సార్ధకత చేకూరింది అన్నాక, పరలోకానికి చేరుతుంది. ఈ జన్మ అంతా తాను చేసిన పాపపుణ్యాలను బట్టి తనకు ఉత్తమగతులు కలుగుతాయి. చెడు కర్మలకు దుర్గతులు కలుగుతాయి. అవి అనుభవించిన తరువాత, అతనికి మరుజన్మ లభిస్తూ ఉంటుంది. ఇదే అలుపెరుగని జన్మ వృత్తాంతము. ఇదంతా తనకు తెలుసు కాబట్టే రామచంద్ర సిద్ధాంతి గారి మనసు కీడుని శంకిస్తోంది.

ఆ ఇరువురు కవల పిల్లలుగా పుట్టుటకు ఒక కారణం ఉంది. ఇరువురిలో ఒక్కరే మిగులుటకూ ఒక కారణం ఉన్నది. ఒకరు ఈ లోకానికి రావడానికి గల కారణం పూర్తి కానుంది. ఇంకొకరి పాత్ర ఈ జగన్నాటకంలో ఇంకా పోషించవలిసి ఉంది. అన్నీ తెలిసి కూడా తన కర్తవ్యం ధర్మాన్ని గెలిపించడమే అని గుర్తెరిగి, తన దృష్టిని హోమంపై నిలిపి, ఆ జగన్మాతను వేడుకొనుచున్నారు సిద్ధాంతి గారు.

***

సంజయ్ ఊబిలోకి దిగబడడం చూసి, ఒక్క ఉదుటన తానూ ఆ ఊబిలోకి దిగబోయి, తమాయించుకుని, " కదలకుండా ఉండు సంజు! కదిలితే ఊబిలోకి ఇంకా త్వరగా కూరుకుపోతావు. నేను నిన్ను కాపాడతాను" అంటూ తన తమ్ముడ్ని బయటకు లాగేందుకు ఆ రాతి సొరంగపు మార్గం పొడవునా అల్లి ఉన్న నార చీరలను విప్పి, ఒక దానితో ఒకటి ముడి వేసి సంజయ్ కి అందేలా విసిరాడు. అది అందుకోడానికి ప్రయత్నం చేస్తూ, మరింతగా ఊబిలోకి కూరుకుపోతున్న సంజయ్ కి ఈ సారి అజయ్ విసిరిన గుడ్డతాడు అందింది. అది చేతికి గట్టిగా కట్టుకుని, ఆ ఊబిలోనే ఈదుతూ.. అతి కష్టం మీద ఆ నందీశ్వరుడు కొలువై ఉన్న గట్టులాంటి ప్రదేశానికి చేరుకున్నాడు.

పైకి ఎక్కి, చేతితో గుండెను గట్టిగా పట్టుకుని, ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. ఎందుకో గుండెల్లో కొద్దిగా నొప్పిగా అనిపించడం మొదలైంది సంజయ్ కి. ఊపిరి ఆడడం కూడా కొద్దిగా కష్టంగా అనిపిస్తోంది.

అది గమనించిన అజయ్. " ఏమైంది సంజు? నువ్వు బాగానే ఉన్నావా? " అంటూ ఆర్తిగా అడిగాడు.

చేయ పైకి ఎత్తి, “అయామ్ ఓకే" అంటూ భారంగా చెప్పాడు. సంజయ్ కి అర్థం అయిపోతోంది! తనకి ఊపిరి సరిగా ఆడటం లేదు. కానీ ఎలాగైనా అన్నని కాపాడాలి అని ఒక సంకల్ప బలం అతనికి ఊపిరి తీసుకోవడానికి శక్తిని ఇస్తోంది. ఎలాగో ఓపిక అంతా కూడగట్టుకుని, ఆ నందీశ్వరుని కుడి చెవికి ఉన్న కుండలాన్ని తీసుకోగలిగాడు. అది బంగారంతో చేసిన పద్మం ఆకారంలో ఉన్న కుండలం. అది గట్టిగా పట్టుకుని మళ్ళీ ఆ ఊబిలోకి దిగాడు సంజయ్. అజయ్ ఆ తాడుని గట్టిగా లాగసాగాడు. ఒడ్డుకి చేరి, ఈ కుండలం అందించగలిగితే చాలు! అన్నయ్యకి ఆ శిల్పం దొరికేస్తుంది. ఆ క్షణం వరకూ నేను ప్రాణాలతో ఉంటే చాలు. అనుకుంటూ ఊపిరి బిగపట్టి, ఆ ఊబిలో ఈదుతున్నాడు సంజయ్.

అజయ్ తన శక్తిని అంతా కూడ దీసుకుని " హర హర మహాదేవ! శంభో శంకరా.." అంటూ ఆ తాడుని గట్టిగా లాగాడు. అతి కష్టం మీద ఊపిరి నిలుపుకుంటూ ఒడ్డుకు చేరాడు సంజయ్. సంజయ్ ని గుండెలకు హత్తుకుని, కన్నీరు పెట్టుకున్నాడు అజయ్.

ఊపిరి బలవంతంగా తీసుకుంటూ " అన్నయ్యా! తొందరగా ఈ కుండలాన్ని ఆ సర్పానికి అలంకరించు" అంటూ ఆ కుండలాన్ని అజయ్ కి ఇచ్చాడు. ఆ కుండలాన్ని శేష సర్పం తలపై పెట్టమన్నట్టుగా ఉన్న ఆ గ్రంధంలో ఉన్నది చూసి, అలాగే ఆ సర్పం శిరస్సుపై ఆ కుండలాన్ని తగిలించగానే వళ్ళు గగుర్పొడిచేలా ఆ సర్పం ఆటు ఇటు కదిలి అదృశ్యం అయిపోయింది. ఆ జంట నాగుల బొమ్మ జీవం పోసుకుని, రెండిటికి కదలిక వచ్చి, ఆ జంట నాగులు రెండు దివ్యమైన కాంతితో వెలిగిపోతూ.. సర.. సర.. పాకుతూ పక్కగా వెళ్లిపోయాయి.

భళ్ళుమని శబ్దం చేస్తూ ఆ ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం తెరుచుకుంటూనే దివ్యమైన కాంతి చిందిస్తూ దర్శనం ఇచ్చింది మహామహిమాన్వితమైన మహా శివలింగం. ఆ శివలింగాన్ని చూస్తూనే, అజయ్ సంజయ్ లు ఇద్దరూ చేతులు జోడించి, " హర హర మహాదేవ శంభో శంకరా!" అంటూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ స్వామికి ఎడమ పక్కన కలశం పట్టుకుని ఒక శిల్పం, ఖడ్గాన్ని పట్టుకుని ఒక శిల్పం కనిపించింది.

సంజయ్ ఆ శిల్పాన్ని చూసిన వెంటనే ఆ దివ్య ఖడ్గాన్ని అందుకోడానికి వెళ్ళిపోయాడు. అజయ్ కనురెప్ప వేసేలోగా జరిగిపోయిన ఆ ఘటనకి, సంజయ్ ఆ ఖడ్గమును పట్టుకోగానే షాక్ కొట్టిన వాడిలా ఎగిరి వెళ్లి గోడకు గుద్దుకుని కిందపడి స్పృహ కోల్పోయాడు. ఊహించని ఆ ఘటనకు అజయ్ కన్నీటి సంద్రం అయ్యాడు.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.




28 views0 comments
bottom of page