top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 34


'Nallamala Nidhi Rahasyam Part - 34' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఆ అన్నాతమ్ములు ఇద్దరూ దివ్య ఖడ్గమును సంపాదించేందుకు సొరంగ మార్గం గుండా పయనం ప్రారంభించారు. ఆ దుష్టాత్మకి, మరియాకి భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఉరుములు, పిడుగులతో కుండపోత వర్షం కురుస్తోంది.

ఇంతలో హెడ్ కానిస్టేబుల్ సూర్యం "ఇన్స్పెక్టర్ అజయ్, సింగాని వెతుకుతూ అడవిలోకి ఒక్కరే వెళ్లిపోయారు" అంటూ పై అధికారులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల, అలెర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం అప్పటికే, అజయ్ కోసం నల్లమల అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ దారిలోనే, చనిపోయి ఉన్న ఫారెస్ట్ అధికారుల భౌతిక దేహాలను గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న సీసీటీవీ పుటేజ్ ఆధారంగా, ‘వాళ్ళని చంపింది సింగానే’ అనే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాయువేగంలో అప్పటికే ఆ వార్త మీడియాకి చేరిపోయింది. 'నల్లమల అడవుల్లో ఏదో జరిగిపోతోంది' అంటూ ఎప్పటినించో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్న పీకే ఛానల్ వాళ్లు కూడా దొరికిందే సందు అంటూ రంగంలోకి దిగిపోయారు.

"ఇన్స్పెక్టర్ అజయ్ ధైర్యసాహసాలు! అడవిలోకి పారిపోయిన నేరస్తుడు సింగా! పట్టుకునేందుకు ఒక్కడే ధైర్యంగా వెళ్లిన ఇన్స్పెక్టర్ అజయ్.. జీప్ నడుపుకుంటూ అడవిలోకి వెళ్లేదారిలో సింగాను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు!

వాళ్ళని గొంతు నులిమేసి హత్య చేసిన సింగా! సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్తుడు సింగాను, హంతకుడిగా గుర్తించిన పోలీస్ అధికారులు! గంటలు గడిచిపోతున్నా తెలియని అజయ్, సింగాల ఆచూకీ.. సింగా, అజయ్ ల అన్వేషణలో పోలీస్ యంత్రాంగం" అంటూ టీవీ లో బ్రేకింగ్ న్యూస్ గా చూపించేస్తున్నారు.

లైవ్ ఇచ్చేందుకు నల్లమల చేరుకున్నారు పీకే ఛానల్ వారి నల్లమల అడవులపై ప్రోగ్రామ్స్ చేసే టీం, కెమెరామెన్ గంగతో, ప్రతినిధి రాంబాబు గారు. ఇక అక్కడ నుండీ, నల్లమలలో కురుస్తున్న జడివాన, పిడుగుల ప్రభావానికి, లైవ్ ఇవ్వాలి అనుకున్న వారికి నెట్వర్క్ సహకరించకపోవడం వల్ల, వారి ప్రయత్నం వారు చేసుకుంటూ, వర్షం ఎప్పుడు తగ్గుతుందా.. అన్నట్టుగా చూస్తూ, అదే రికార్డు చేస్తూ.. లైవ్ ఇవ్వడం కోసం, సిగ్నల్ కోసం ట్రై చేస్తున్నారు.

***

ఆ భీకరమైన వర్షానికి, ఉరుములకి, అక్కడ పడుతున్న పిడుగులకి, ఆ పోలీస్ వారికే హడలెత్తిపోతోంది. కానీ ఎన్నో రిస్కీ ఆపరేషన్స్ చేసి ఉన్న వారికి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలాగో తెలుసు కాబట్టి, అజయ్ ని, సింగాని గాలిస్తూ, వారి గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.

***

మరియా, ఆ నరేంద్రుని దుష్టాత్మతో యుద్ధం చేస్తూనే ఉంది. పూజారి గారు అమ్మవారి ముందు పద్మాసనం వేసుకుని కూర్చుని, ధర్మాన్ని గెలిపించమని ప్రార్ధిస్తూ, దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేస్తున్నారు. సొరంగ మార్గంలోకి నీళ్లు చేరిపోయే లాగా భీకరంగా వర్షం కురుస్తున్నా కూడా, మరియా తను నరేంద్రుడిని ఎదురుకుంటూనే, ఆ మార్గంలోకి నీటి ప్రవాహం చేరకుండా, తన శక్తితో అడ్డుకుంటూ ఉంది. చీకటి పడుతున్న కొద్దీ ఆ భీకరమైన దుష్టాత్మ రెట్టించిన కోపోద్రేకంతో విరుచుకుపడుతోంది.

ఆ గాలి, భీభత్సానికి అమాయక గిరిజన ప్రజలు బెంబేలెత్తిపోతూ అమ్మవారి గుడికి చేరిపోయారు. వారి గుడిసెలు, ఆ వాన భీభత్సానికి చెల్లాచెదురైపోయాయి. వారంతా, తల దాచుకునేందుకు అమ్మవారి గుడికి చేరుకున్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, అంత వాన కురుస్తున్నా , గుడిలోకి మాత్రం నీరు చేరడం లేదు. చిన్న షెడ్ లా ఉన్నదైనా ఆ గుడికి మాత్రం ఏమీ కాలేదు. అది ఆ గిరిజనులకు ఆశ్చర్యం కలిగించినా, అది అమ్మవారి అనుగ్రహంవల్ల మరియాకి కలిగిన ఆత్మశక్తి ప్రభావం అని పూజారి గారికి మాత్రమే తెలుసు.

"ఎవ్వరూ గాభరా పడకండి. అమ్మవారి అండ ఉంది మనకు. అంతా ఇక్కడే కూర్చుని ఆ జగన్మాతను ప్రార్ధించండి" అని చెప్పి, ఆయన స్తోత్ర పారాయణం చేయనారంభించారు.

***

సొరంగ మార్గం గుండా ముందుకు సాగిన ఆ అన్నా తమ్ముళ్లకు, చీకటితో నిండిపోయిన ఆ మార్గంలో,సెల్ ఫోన్ లైట్స్ తో కొంత దూరం వెళ్ళిన తరువాత, దారి రెండు వైపులుగా కనిపించింది. ఎటువెళ్లాలో తెలియని పరిస్థితుల్లో, పూజారి గారు ఇచ్చిన తాళ పత్ర గ్రంధాన్ని తెరిచి చూసారు. అందులో ఎడమ వైపుగా వెళ్ళమని రాసి ఉండడంతో, మళ్ళీ వారి పయనం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్లేసరికి, ఆ మార్గం కొద్దిగా విశాలంగా మారింది. అక్కడ రక రకాలైన గుర్తులు కనిపిస్తున్నాయి. రాళ్లు, ఆటవికుల ఆయుధాలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుని వెళ్తున్న వారల్లా ఒక్కసారిగా కాళ్ళకి తీగ లాంటిది తగలడం వల్ల ముందుకు పడిపోయారు.

ఒక్కసారిగా అలా పడిపోవడం వల్ల ఇద్దరికీ ఆ రాళ్లు గుచ్చుకుని దెబ్బలు తగిలాయి. అయినా ఎలాగో ఓపిక తెచ్చుకుని, ఆ గ్రంథంలో చెప్పిన గుర్తులు సరి చూసుకుంటూ ఆ శిల్పాన్ని వెతుకుతూ ముందుకు వెడుతున్న వారికి కొంత దూరం వెళ్లేసరికి, ఇక ముందుకు వెళ్లేందుకు లేకుండా ఒక రాతి గోడ కనిపించింది. దానిపై జంట నాగుల ఛిహ్నం ఉంది. ఆ ద్వారాన్ని ఎలా తెరవాలో అని గ్రంధాన్ని చూస్తున్న అజయ్ కి గుండె వేగం పెరిగిపోయింది.

"ఏమైంది అన్నయ్యా? ఈ ద్వారం ఎలా తెరవాలి?" అని అడిగాడు సంజయ్.

" ఇది నాగ బంధనం! ఇది తెరవాలంటే..


రేపు చెప్తనే!😛

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.






22 views0 comments
bottom of page