top of page

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 33


'Nallamala Nidhi Rahasyam Part - 33' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

" మావా! మాట్లాడేందుకు సమయం లేదు. ఆ గుడి ఇక్కడికి చాలా దూరం. ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకోవాలి! లేకుంటే నీ తమ్ముడి ప్రాణానికే ప్రమాదం.

నేను నీలోకి అవహిస్తాను. ఆ తాయత్తు నన్ను ఏమీ చేయదు. నేను అమ్మవారి ఉపాసకురాలిని కదా! " అంటూ అజయ్ ని పూర్తిగా మాట్లాడనివ్వకుండా, అజయ్ శరీరంలోకి మరియా ఆవహించింది. ఒక్కసారిగా అజయ్ గాలిలోకి ఎగిరి, తను అమ్మవారి గుడి వైపుగా పయనమయ్యాడు.

సంజయ్ ఒక్కో అడుగూ భారంగా వేస్తూ, చివరికి అమ్మవారి గుడికి చేరుకొని, అక్కడే కుప్పకూలిపోయాడు.

అక్కడ ఉన్న ఆదివాసులు, పూజారి గారు వచ్చి, "ఎవరు బాబూ నువ్వు? ఇక్కడికి ఈ సమయంలో ఎలా రాగలిగావు? ఈ సమయంలో అధికారులు ఎవరినీ ఇక్కడ ఉండనివ్వరు కదా! ఎలా వచ్చావు?" అంటూ, ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తున్నారు.

సంజయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారి వైపు దీనంగా చూస్తూ, ఆయాసంతో రొప్పుతున్నాడు. పూజారి గారు వెంటనే లోపలికి వెళ్లి, అమ్మవారికి అభిషేకం చేసిన పాలు తీసుకు వచ్చి, సంజయ్ చేత తాగించారు. అవి తాగిన సంజయ్, కొద్దిగా ఊపిరి తీసుకుని, కాస్త తేట పడి, ఆ పూజారి గారి వైపు కృతజ్ఞతగా చూస్తూ, రెండు చేతులు జోడించి,

" అయ్యా! నేను మా అన్నయ్యని కాపాడుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. అధికారుల అనుమతి తీసుకునే జీప్ అతను నన్ను లోపలికి తీసుకువచ్చాడు" అంటూ సంజయ్ తనకి కావాల్సిన ఖడ్గం గురించి పూజారి గారిని అడిగే లోపే, ఒక్కసారిగా అక్కడ ఉన్న పొదల నుండి అజయ్ పరిగెట్టుకుంటూ రావడం చూసి అందరూ ఒక్కసారి భయపడ్డారు.

సంజయ్ మాత్రం, " అతనే మా అన్నయ్య" అంటూ వెళ్లి అజయ్ ని గట్టిగా హత్తుకుని,

" అన్నయ్యా! నీకోసం అమ్మ కంగారు పడిపోతోంది.

నీకోసం, నీ క్షేమం కోసమే నేను వచ్చాను" అంటూ ఏడ్చేస్తున్నాడు.


అజయ్ కి 'సంజయ్ ఈ జన్మలో తన తమ్ముడు' అన్న దానికన్నా, క్రిందటి జన్మలో తన మహారాజు, మిత్రుడు అనే భావన, అతనితో సంజయ్ ని "మిత్రమా." అని పిలిచేలా చేసింది.


" మిత్రమా. ఏంటిరా? నేను సంజుని." అంటూ తన అన్న కళ్ళలోకి చూస్తున్న సంజయ్ ని

" అదే.. అదే.. నువ్వు ఇక్కడికి రావడం ఏంటి?"అంటూ ఉండగా పూజారి గారు అక్కడ ఉన్న అదిమవాసులందరినీ

" మీరంతా వెళ్లి, మీ పనులు చూసుకోండి. ఆ వచ్చిన వారెవరో, ఏ పని మీద ఈ సమయంలో వచ్చారో, తెలుసుకుని పంపుతాను" అంటూ అందరినీ అక్కడనుండి పంపించి,

తను సంజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి,

"బాబూ! మీరిద్దరూ ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. మీరు ఏదో పని మీదే వచ్చినట్టు ఉన్నారు" అంటున్న ఆయన అజయ్ కి పక్కనే నిలబడి ఉన్న గాలి లాంటి ఆకారం గల మరియాను చూసి, " అర్ధం అయింది! మీరెవరో నాకు అర్ధం అయింది. మార్తాండ, ప్రతాప రుద్రులు! దేశం కోసం మళ్ళీ పుట్టిన కారణ జన్ములు! మీ ఇరువురి రాక కోసం, ఎన్నో ఏళ్లుగా నిధిని కావలి కాస్తూ ఉన్న ఆ దీనురాలికి విముక్తి కలుగనుంది" అంటున్న ఆయన మాటలు సంజయ్ కి ఆశ్చర్యం కలిగించాయి.

"అన్నయ్యా! అయన చెప్పిన వారిలో నువ్వు మార్తాండ అని నాకు ముందే తెలుసు" అంటున్న సంజయ్ వైపు చూస్తూ.

“ఏమంటున్నావ్? నీకు ఎలా తెలిసింది? " అంటున్న అజయ్ కి తను తెలుసుకున్నది అంతా చెప్పనారంభించాడు సంజయ్.

" అన్నయ్యా! నీకు గుర్తు ఉందో లేదో, మన 25 వ పుట్టినరోజు రాత్రి, ఒక ఆకారం నీ మీద దాడి చేస్తూ ఉండగా, అప్పుడే మెలుకువ వచ్చిన నేను, దాన్ని ఎదుర్కోబోతే, అది నా పీక పట్టుకుని, గాలిలోకి లేపింది. ఉన్నపళంగా నిద్రలోనే పైకి లేచిన నీ కళ్ళు నీలి రంగులోకి మారిపోయాయి. ఏదో వింత భాష మాట్లాడుతోన్న ఆ ఆకారంతో, నువ్వు అలాగే మాట్లాడుతూ, దాన్ని ఎదుర్కున్నావు. అది నా పీక వదిలేసింది. అప్పుడు కింద పడ్డ నేను, మరునాడు ఉదయం పైకి లేచాను. నిన్ను అదే అడిగితే, హారర్ సినిమాలు చూసి, పిచ్చి కలేదో కనుంటావ్! అంటూ నే చెప్పేది పట్టించుకోలేదు నువ్వు. నేను కలే అనుకుని వదిలేసాను.

మళ్ళీ నువ్వు ఇక్కడికి రాకముందు, వైజాగ్ లో ఉండగా అలాంటి అనుభవమే అమ్మకూ ఎదురైంది. నేను వచ్చేసరికి అమ్మ భయం చూసి అడిగితే, అమ్మ అంతా చెప్పింది.

ఆ రోజే నేను, అమ్మ చెప్పినట్టుగా, నీ జాతకం మన రామచంద్ర సిద్ధాంతి గారికి చూపించి, నిన్ను కాపాడుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలో, నీ గత జన్మ గురించి తెలుసుకున్నాను. నిన్ను కాపాడుకోవడం కోసమే, ఆ దివ్య ఖడ్గాన్ని సంపాదించేందుకే, నేను ఇక్కడికి వచ్చాను. నీ చేతికి, ఆ రోజు కట్టిన తాయత్తు ఆయన ఇచ్చినదే. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అన్నయ్యా! రేపు గ్రహణం చాలా ప్రమాదకరం నీకు. నీ మీద దాడి చేసిన ఆ ఆకారం, నిన్ను రేపటి సూర్యగ్రహణం ఘడియలలో వధించి, తన పగ తీర్చుకోవాలని చూస్తోంది. ఆ ఆకారం పేరు నరేంద్రుడు" అన్నాడు అజయ్.

షాక్ అయి చూసాడు సంజయ్, ఆ మాట విని.

" అన్నయ్యా! నీకు ఎలా తెలుసు? అంటే.." ఆశ్చర్యంగా చూస్తున్నాడు సంజయ్, అజయ్ వైపు.

" అవును! నీ అనుమానం సరైనదే! నాకు నా గతజన్మ అంతా గుర్తు ఉంది. అంతే కాదు. నువ్వు ఈ జన్మలో నా తమ్ముడివే. కానీ గత జన్మలో నువ్వు నా మహారాజువి. ప్రతాపరుద్ర మహారాజువి. కాకతీయ మహా సామ్రాజ్యపు ఆఖరి మహారాజువి" అంటూ అజయ్ చెప్తూ ఉండగానే..

" చూడండి బాబూ! మీరిద్దరూ రేపు సూర్యగ్రహణం లోగా ఆ దివ్య ఖడ్గాన్ని సంపాదించి, ఆ నీచుడి ఆత్మను నాశనం చేయాలి. లేకపోతే, ఆ ఒక్క ఘడియ చాలు. ప్రపంచ వినాశనానికి! ఆ ప్రళయాన్ని ఆపాలి అంటే, సాహసవంతమైన మార్గంలోనే, గుండె ధైర్యంతో ముందుకుసాగండి. ఆ ఖడ్గమును సాధించి, తిరిగి రండి. విజయోస్తు!" అంటూ సొరంగ మార్గంలో తీసుకోవలసిన జాగ్రత్తలను రాసి ఉంచిన తాళపత్ర గ్రంధాన్ని వారి చేతికి అందించాడు పూజారి గారు.

ఇప్పటి వరకూ, సంజయ్ ద్వారా తను ఆ దివ్య ఖడ్గాన్ని సొంతం చేసుకుని, తన అంతాన్నే, అంతం చేసేయాలని కలలు కన్న ఆ నరేంద్రుని దుష్టాత్మ, ఊహించని రీతిలో అజయ్ అక్కడికి రావడం చూసి, తన పన్నాగం విఫలం అయిందే అని కోపంతో రగిలిపోతూ, వికృతంగా నవ్వుతూ.

విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, భీకరమైన వర్షం కురువనారంభించింది.

అది చూసి, పూజారి గారు ఆ అన్నా తమ్ముళ్లతో

" మీరు బయలుదేరండి. వాడిని అంతం చేసే ఆయుధాన్ని తీసుకురండి. వాడిని మీ దాకా రానివ్వకుండా మరియా పవిత్ర ఆత్మ ఆపుతుంది" అని చెబుతూ ఉండగా

మరియా ఆ నరేంద్రుని దుష్టాత్మతో పోరాటం మొదలుపెట్టింది.ఆ యుద్ధం అజయ్ కి, పూజారి గారికి మాత్రమే కనిపిస్తోంది. సంజయ్ కి అక్కడ తను చూడలేనంత వెలుగు కనిపిస్తోంది. ఇక వారు కాలయాపన చేయకుండా ఆ దివ్య ఖడ్గమును సంపాదించేందుకు సొరంగ మార్గం గుండా పయనం ప్రారంభించారు.

ఆ దుష్టాత్మకి, మరియాకి భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఉరుములు, పిడుగులతో కుండపోత వర్షం కురుస్తోంది. ఇంతలో..

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.

24 views0 comments
bottom of page