top of page

ఒకరోజు రాత్రి ఒంటరిగా యెడారి ప్రక్కన---


'Okaroju Rathri Ontariga Edari Pakkana' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

కోట్లకు పడగలెత్తిన వ్యక్తి వేదాచలం.

అనుకోని పరిస్థితుల్లో కారు ఆగిపోవడం, చేతిలో మొబైల్ లేకపోవడంతో చిక్కుల్లో పడ్డాడు.ఆ పరిస్థితుల్లో తనకు సహాయం చేసిన వ్యక్తిని కొడుకులా భావించాడు. అతను కూడా వేదాచలాన్ని తండ్రిలా భావించి నమస్కరించాడు. పెంచుకుంటే బంధాలు పెరుగుతాయని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.

ముషీరాబాద్ నాలుగు రోడ్ల కూడలి వద్దకు వచ్చేటప్పటికి గుర్రుమంటూ ఓ చప్పుడు చేసి సర్రున ఆగిపోయింది కారు. వేదాచలం ఉలికిపాటుతో యెవరో యెక్కణ్ణించో వెనుక నుంచి నెట్టినట్టు కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు. మొన్న మొన్ననే కొన్న కొత్త జర్మన్ కారు వోగ్ కి యేమైంది? ఏదో అయింది. ఎందుకయింది? అతడికి తెలియదు. బోనెట్ తెరచి చూసినా అతడికి అంతు పట్టదు. కారణం, మరమ్మతుల గురించి అతడికి అవగాహన లేదు. అది పెంచుకోవలసిన అవసరమూ అతడికి లేదు.

నగర ప్రముఖ ఐటీ సోల్యుషన్ కంపెనీ యెమ్డీకి ఆ అవసరం యెందుకుంటుంది? వెనుకా ముందూ చుట్టు ప్రక్కలా తన పిలుపు కోసం చెవులొగ్గి నిల్చునే సిబ్బంది ఒకరా యిద్దరా-- పలువురు బ్లూకలర్, వైట కాలర్ సిబ్బంది చకోరపక్షుల్లా యెదురు చూస్తుంటారు. తను చూపు నిలిపి పిలుపివ్వడం వాళ్ళకదొక శుభదిన సంకేతం.

ఆలోచనలు కట్టిపెట్టి దీర్ఘంగా చూపు సారించాడు వేదాచలం. దేశ దేశాలను గొంతు వరకూ కబళించడానికి కంకణం కట్టుకున్న కరోనాలా చీకటి వ్యాపించి ఉంది. నలువైపులా శ్మశాన వైరా గ్యం వంటి నిశ్శబ్దం; తను యే మాత్రమూ గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నట్టు విలయతాండవం చేస్తూంది. అప్పుడతనికి ఉన్న పళాన దిగ్గుమన్నట్టు జ్ఞాపకం

వచ్చింది; అదంతా నిగూఢ నిశాచర లాక్ డౌన్ ప్రభావమని. చప్పున కోటు జేబులోకి చేతులు పోనిచ్చాడు. ఆ తరవాత కోటు లోపలి జేబుల్లోకి కూడా చేతులు పోనిచ్చాడు. ముబైల్ లేదు. డ్యాష్ బోర్టు తెరిచాడు. వెనుక సీటులో కి తిరిగి చూసాడు. తడిమి చూసాడు. లేదు. ఎక్కడా లేదు. ఇంతకీ యెక్క డ పడిపోయుంటుందది?

ఇంకెక్కడ—పరిమళ పడక గదిలో పడేసి ఉంటాడు. ఫోను విలువ తనకొక లెక్కకాదు. కాని, అందులో ముఖ్యమైన అత్యవసరమైన డాటా పొందుపర్చబడి ఉంది. అది తన వ్యాపార ప్రత్యర్థుల కంటబడనే కూడదు. అలాగ్గాని దొరికితే ఒకటి తరవాత ఒకటిగా ఘాటైన కౌకు దెబ్బలు తగు లుతాయి. డాటా తస్కరించడంతో బాటు పరిమళంతో తన కున్న అవాంఛిత అక్రమ సంబంధం బైట పడుతుంది. ఇక యింటా బైటా తనకు అనవరతం మరణ మృదంగం వంటి సంక్షోభిత వాతావరణమే--

తనకు తాను శూన్యం లోలోతుల్లోకి కి వెళ్లిపోతూ కొన్న క్షణాలు ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు యెక్కడి వాడక్కడ. ఇప్పుడు తన చేతిలో ముబైల్ ఉన్నా-- దానితో మెకానిక్ షాపుతో సంపర్కం పెట్టుకున్నా మెకానిక్ ఇంత దూరం కరోనా లాక్ డౌన్ కాలంలో యెలా రాగల డు? అసలతణ్ణి నైట్ పెట్రోలింగ్ పోలీసులు రానిస్తారా! తిన్నగా తీసుకువెళ్ళి ఐసోలేషన్ సెంటర్ లో పడేయరూ! ప్రముఖ నగర వ్యాపారవేత్తగా తనకు కలెక్టరేట్ వాళ్ళు స్పెషల్ ఈ-పాస్ యిచ్చారు కాబట్టి తనిలా ఊళ్ళ వెంట పడగలిగాడు. తిరగ్గలిగాడు. అందరికీ అది వీలుపడదుగా! ఎలాగో ఒకలా తను ఇల్లు చేరగలగాలి. అదీను జారవిడిచిన ముబైల్ ని అంది పుచ్చుకుని. తనకు మరునాడు ఉదయం విదేశీ వ్యాపార వేత్తలతో ముఖ్యమైన బిజినెస్ మీట్ ఉంది.

ఆ తలంపు మెదడు పొరను తాకిన వెంటనే వేదాచలం మెరుపు తీగలా పూనకం వచ్టిన వాడిలా కదిలాడు, కారు డోరు తెరచి బయటకు దూసుకు వచ్చాడు. సరిగ్గా — అదే సమయాన తనకనుకూల సూచనగా యెవరో బైక్ పైన వేగంగా వస్తున్నారు. చురుగ్గా రోడ్డుమధ్యకు వచ్చి చేతులూపాడు. ఆగలేదు సరికదా— సర్రున రైట్ టార్న్ తీసుకుని అడ్డంగా చేతులూపినందుకు కోపంగా అరచుకుంటూ బైక్ వాడు వెళ్ళిపోయాడు.

వేదాచలానికి అసహనం నశాలానికి అంటుకుంది. ఎంతటి పొగురు వీడికి, మర్యాద కోసమైనా ఓపారి ఆగ వచ్చుకదా! ఆగి కారణం తెలుసుకోవచ్చు కదా! మనిషి పట్ల మనిషికి ఆపాటి అక్కర ఉండవద్దా! మనిషికీ మనిషికీ మధ్య సామాజిక దూరం పాటించాలన్నది కోవిడ్ క్రిమి బారిన పడకూడదని. అంతే కాని, తోటి మనిషి వేపు చూపు కూడా విసరకుండా అలక్ష్యంగా కప్పదాటుగా సాగిపొమ్మని కాదు.

మరి కాసే పటికి, అదే రోడ్డమ్మట మరొక మూడు ద్విచక్ర వాహనాలు వచ్చాయి. కాని ఒక్కటీ ఆగలేదు. అప్పుడతను దీర్ఘంగా బరువుగా నిట్టూర్చాడు. కరడుగట్టిన నిస్సహాయత అతణ్ణి ఆవహించనారం భించింది. ప్రక్కలకు చూపులు సారించాడు. అమ్మవారి గుడి కని పించింది. అందులోకి ప్రవేశించి తల దాచుకుందామా! దగ్గరగా అటు వెళ్ళాడు. తాళం కప్ప వేసుంది. తన మతి మరుపు కాకపోతే, ఈ మధ్య గుళ్ళూ గోపురాలూ భక్తుల కోసం యెక్కడ తెరుస్తున్నారని. పుణ్య ఘడియలకు ద్వారాలు తెరిచినా అర్చక స్వాములు మాత్రమే వచ్చి దేవార్చనతో అభిషేకం పూర్తి చేసి చప్పుడు లేకుండా వెళ్ళిపోతున్నారు సామాజిక దూరం పాటిస్తూ-- మరైతే తన గతి! తనకున్న ఈ సామాజిక హోదా- ఆర్థిక పరపతీ- అంతా గాలిలోకి యెగిరిపోయిన పేలపిండేనా! నేల రాలిన ఆముదపు నూనె చుక్కలేనా! వేదాచలం గుండెలో బరువు పేరుకుపోయింది. శ్వాస అందనట్టు ఊపిరి తిత్తులు కదలాడ సాగాయి. అతడి కళ్ళ ముందు దివంగత తండ్రి పాపారాయులుగారి రూపం ఉవ్వెత్తున లేచి నిల్చుంది. స్కూలు రోజుల్లో తనకు తరచూ చెప్తున్నట్టు యేదో చెప్పడానికి పూనుకున్నట్టున్నాడు. " ఒరేయ్ వేదాచలా! పాపాలు రెండు రకాలురాలురా! ఒక రకమైన దుష్ట చేష్టకు ఫలితం- చాలా నాళ్ళ తరవాతనే తెలుస్తుంది. మరొక దుష్ట కార్యముందే— దాని కర్మ ఫలితం వెంటనే తెలిసిపోతుంది. అప్పటికప్పుడు వెంటపడి నిలదీస్తుంది. మొదటి దాని కన్నా యిదే మేలు. కాని రెండు పాప కార్యాలకూ ఫలితం మాత్రం ఒకే రీతిన ఒకే మోతాదున ఉంటుంది. కావున పాప కార్యాల కు యెప్పుడూ దూరంగా ఉండు" .

వేదాచలం ఉన్నపాటున తల విదిలించాడు. తనిప్పుడు యేం పాపం చేసాడని? తనెక్కడ చేసాడని? తనా పరిమళ ఒంపు సొంపులకు మైమరచి ఆమె అందాలను ఆస్వాదించాలని వెంపర్లాడాడు! ఆమే కదా తానుగా మాటి మాటికీ ఒంటి విరుపుల్ని ప్రదర్శిస్తూ అవసరానికి మించిన రీతిన చనువు చూపిస్తూ తన స్నేహం కోసం తన పవర్ ప్యాక్డ్ సర్కిల్ కోసం పరితపిస్తూ తనను మోహ సముద్రంలో ముంచింది. ఊహుఁ! వేదాచలం తనకు తాను తల అడ్డంగా ఆడించాడు. కచ్చితంగా తన దివంగత తండ్రి తన అవక తవక వాదనలతో అంగీకరించడు. అటూ యిటుగా రెండు దవళ్ళూ సాగదిస్తాడు; అరిటాకుకీ ముల్లుకీ మధ్య ఉన్న నకారాత్మక చర్య ప్రతిచర్యను యెత్తి చూపుతూ. మహాలక్ష్మి వంటి భార్య- తన కోసమే జీవిస్తూన్న యిద్దరు బిడ్డల తల్లి యింట్లో ఉండగా తను పొరుగింటి పుల్ల కూర కోసం అర్రులు చాచడం నేరమే కదా! అటూ యిటుగా ఆత్మసమర్థన కోసం ప్రాకులాడకుండా చూస్తే తను పరదారా సంగమం కోసం వెంపర్లాడటం దుష్టకార్యమే కదా! ఆ దుష్టకార్యపు పాప ఫలితాన్ని తనిప్పుడు యిలా నిర్వీర్యుడై నిస్సహాయుడై ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడేమో!

అదేమి విచిత్ర మో— తను పట్టుదలతో వెనక్కి మరలిపోవాలని పదే పదే తలచుకున్నా వీలు కాలేకపోయింది. ఒక్కొక్క స్త్రీలోనూ ఒక్కొక్క మేని రంగు- కళ్ళను తిప్పుకోనివ్వని యవ్వన పొంగు. ముప్పిరిగొనే సొగసు సువాసనల జల్లు. వీటి ముందు అతడు తోకాడిస్తూ లొంగిపోయాడు. ఇప్పుడు తండ్రి మాటను జవదాటి యిలా చీకటి పూట చీకటి బాట పట్టి నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతిగా మానసిక ఒత్తడికి లోనవడం వల్ల కాబోలు అతడి కడుపులో యెలుకలు పరుగెత్తనారంభించాయి.

అతడు అసహాయంగా ఆకాశంలోకి తలెత్తి చూసాడు. నక్షత్రాలు వింతగా తనను చూసి మిణుకు మిణుకు మంటూ కనుకొడ్తున్నట్లున్నాయి. అప్పుడు అతడు యేమాత్రం యెదురు చూడని విధంగా యేదో వచ్చి ప్రక్కనే ఢీ కొట్టినట్టు కర్రున శబ్దం వినిపించి తుళ్ళిపడుతున్నట్టు ఫుట్ పాత్ వేపు గెంతాడు వేదాచలం. ఎవరో అబ్బాయి యేదో డొక్కు స్కూటర్ పైన అలవోకగా కూర్చుని సూటిగా చూస్తూ అడిగాడు- “పెద్దమనిషిలా ఉన్నారు. ఇక్కడ ఒంటరిగా యేం చేస్తున్నారు? పచార్లు చేయడానికి యిదా సమయం? నగరంలో పరిస్థితి యెలా ఉందో మీకు తెలియనిదా!" వేదాచలం కారణం చెప్పాడు. ఆతరవాత నిదానంగా అడిగాడు" ఇంతకూ మీరెవరయ్యా"

" నిజానికి నేనేమీ కాను. ఐనా మీరడిగారు కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. పేరు సూర్యనారాయణ. ముషీరాబాద్ యూత్ ఫ్రంటులో కార్యకర్తను. ఇప్పుడిప్పుడే కరోనా బారిన పడి ఆస్పత్రిలో తేరుకుని వచ్చిన ఓ ఫ్రండుని చూసి వస్తున్నాను. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను గాని, యింకా నిరుద్యోగిగానే ఉన్నాను. మీకిది చాలనుకుంటాను. ఇక మీరు యిక్కణ్ణించి కదలి వెళ్ళిపోతే మంచిది. లేదా నిమ్మళంగా కారులోపలకు వెళ్ళి కూర్చుంటే మంచిది" అని స్కూటర్ కి కిక్ యివ్వడానికి పూనుకున్నాడా యువకుడు.

వేదాచలం చట్టున సూర్యనారాయణను ఆపాడు- " కొంచెం ఆగవయ్యా బాబూ! వెళ్ళగల స్థితిలో ఉంటే నువ్వొచ్చి చెప్పేంత వరకూ యిక్కడుంటానా? గుర్రం తగిలించిన దెబ్బతో బాటు గాడిద దెబ్బకూడా తగిలినట్టు నా మొబైల్ కూడా నాకు తెలిసిన వారింట్లో విడిచివచ్చేసినట్లున్నాను- అందువల్ల—" అని అతడు చెప్పి ముగించేలోపల- యిక సోదె ఆపమన్నట్టు చేతిని అడ్డంపెడ్తూ సూర్యనారాయణ జేబులోనుంచి సర్రున తన మొబైల్ తీసి అందించాడు. యింటికి ఫోను చేయమని.

వేదాచలం ఫోను అందుకోలేదు. ఆలోచించాడు. ఇప్పుడుగాని యింటికి ఫోను చేస్తే మంజుల తప్పకుండా అడుగుతుంది-" ఇంత రాత్రి పూట అక్కడేమి చేస్తున్నారు!" అని.

అప్పుడు తను మరిన్ని దాగుడు మూతలు ఆడాలి. మరింత గుండె బరువుకి లోను కావాలి. లేనిపోనివి చెప్పి మరింత అపరాధ భావానికి లోను కావాలి. అతడాలోచన పూర్తవకముందే సూర్యనారాయణ సర్రున లేచాడు- “అకారణంగా కాలయాపన చేసి కార్యహానికి పాల్పడుతున్నారు మీరు. ఇప్పుడు మీరు యెంతటి అపాయకర మైన స్పాట్ లో ఉన్నారో తెలుసుకోలేక పోతున్నారు!"

“దానికి వేదాచలం అదోలా ముఖంపెట్టి బదులిచ్చాడు" తెలియకేం?ఎక్కడ నానుంచి గాలి సోకితే కరోనా అంటుకుంటుందేమోనని ఒక్క బైకిస్టుగాడు కూడా నా సహాయానికి రాకుండా దూసుకుపోయారు. ఇక నాకు మిగిలిందేముంది? నిలువు దోపిడీ— అంతే కదా!" సూర్యనారాయణ వెంటనే రిటార్ట్ చేసాడు-" మీరు పరిస్థితి అర్థం చేసుకోకుండా బడి కుర్రాడిలా మాట్లాడుతున్నారు సార్. అపాయకరమైన పరిస్థితి అంటే నేను చెప్పేది దొంగలు వచ్చి దోపిడీ చేస్తారని కాదు. మీరిప్పుడిక్కడ అపాయకరమైన స్థితిలో చిక్కుకున్నారు. అదిగో! అటు చూడండి ఆబోర్డు వేపు- పరిస్థితి తెలుస్తుంది".

వేదాచలం చప్పున తలెత్తి చూసాడు-" ఇక్కడ కుక్కలున్నాయి జాగ్రత్త! ఇటువేపు రాత్రిపూట ఒంటరిగా రాకండి!" అని వ్రాసుంది.

" ఇందులో బెదరిపోవల్సిందేముంది! ఇటువంటి ప్లకార్టులు

అన్ని చోట్లా దర్శనమిస్తూనే ఉంటాయిగా!"

" అయ్యో భీమేశ్వరా! మీరు యింటి పనులూ కార్యాలయ పనులూ తప్ప స్థానిక తెలుగు దిన పత్రికలు చూడరన్నమాట! ఆ రాత ఫలక వ్రాసి పెట్టింది మరెవ్వరో కాదు. మా ముషీరాబాద్ యూత్ ఫ్రంటే! అదిగో! అటు రోడ్డు కోనావేపు చూడండి యెన్ని ఊర కుక్కలు గుంపు గుంపుగా తిరుగుతున్నాయో! అవన్నీ వెర్రి కుక్కలు. ఒంటరిగా రాత్రిపూట యెదురైన పుశువును గాని, మనిషిని గాని విడిచిపెట్టవు. వెంట తరిమి చీల్చి చెండాడుతాయి".

అటు చూసిన వేదాచలానికి ముఖాన చెమటలు పట్టాయి. " “అయ్యా సూర్యం! వెర్రి కుక్కలు ఒకటో రెండో ఉంటాయి గాని, అన్ని ఊరకుక్కలూ వెర్రి కుక్కలేనా!"

" అయ్యో రామేశ్వరా! మీతో వచ్చిన తంటా యిదేనండీ— మీవంటి వారు గ్రంథాలయాలకు వెళ్ళరు- పత్రికలు ముందేసుకుని చూడరు. ఎప్పుడూ కార్యాలయాలలో ఫైల్స్ తో కాలం గడిపేస్తుంటారు. ఇక్కడి ఊరకుక్కలు అలా వెర్రి కుక్కలుగా తయారవడానికి వివిధ పత్రికలో దీర్ఘంగానే విశ్లేషించారు. చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ మగకుక్కలకు ఆడకుక్కల సాన్నిహిత్యం కావాలి. ఈ మధ్య నగరంలో ఆడకుక్కల ఉనికి పలు కారణాల వల్ల తగ్గిపోయిందట. అందుచేత కుక్కలకు సెక్స్ హంగర్ పెరిగిపోయి—"

" చాలు చాలు! ఇక చాలు. నన్ను మరింతగా బెంబేలు పెట్టేయకు. నాకిద్దరు కొడుకులున్నారు. ఇద్దరూ ఇక్కడ కాలేజీ సీట్లు దొర క్క వేరే ఊళ్ళో చదువుకుంటున్నారు. నేనిప్పుడు ఫోను చేసి పిలిచినా మా ఆవిడ ఒక్కతే

యిప్పుడిక్కడకు రాలేదు. రేపు ఉదయమే తప్పకుండా ఆఫీసుకి వెళ్ళి సమీక్షా సమావేశంలో పాల్గొనాలి. లేకపోతే— మనుగడ ఖాలీ! నువ్విప్పుడు నా కళ్ళకు నా స్వంత కొడుకులా కనిపిస్తున్నావు. ముఖ్యంగా సామాజిక కార్యకర్తవి కూడాను. ఇవి చేతులనుకోకుండా నన్ను చిక్కడ పల్లి ఆవల ఉన్న భగీరథ్ నగరంలో దింపి సహాయం చేయి. నీ కష్టం ఊరకే పోనిచ్చుకోను" అని సూర్యనారాయణ రెండు చేతులూ పట్టుకు న్నాడు వేదాచలం.

" పెద్దవారు. తప్పుతుందా మరి— ఐతే ఒక షరతు" అదేమిటన్నట్టు కళ్ళు మిటకరించి చూసాడు వేదాచలం,

" నేను చెప్పినట్టు వినాలి. నోటికి చేతి గుడ్డ ముసుగులా గట్టిగా బిగించి కట్టుకోవాలి"

" డన్! ఇంకేమైనా ఉందా?"

" ఉంది. పిల్లోపైన నా వేపు కాకుండా మీరు అటువేపు ముఖం తిప్పుకుని కూర్చోవాలి. ఆర్ యు రెడీ!"

కంగుతిన్నట్టు చూసిన వేదాచలం వెంటనే సర్దుకుంటూ— రెడీ- అంటూ కొనసాగించాడు.

" నాదొక చిన్న రిక్వెస్ట్ సూర్యా— పెట్రోల్ ఖర్చు కోసం చూడకుండా యిలా తిన్నగా సాగకుండా వెనక వేపు ఒక టర్న్ తీసుకుని, రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న నాకు తెలిసిన వారింట ముందు బండి ఆపితే నేను మరచిపోయి జారవిడుచుకున్న ముబైల్ ని తీసుకుంటాను. ప్లీజ్! అన్యథా భావించకు— నీ కష్టం ఊరకే ఉంచుకోను".

సూర్యనారాయణ యిక మాటలు కలపకుండా స్కూటర్ ని సర్రున వెనక్కి తిప్పాడు.

***

వేదాచలనం సూచన ప్రకారం సూర్యనారాయణ వేగంగా ఒక రౌండు తిరిగి వేదాచలం ముబైల్ అందుకున్న తరవాత భగీరథ్ నగర్ చివరన ఉన్న అపార్టుమెంట్సు కట్టడం ముందు స్కూటర్ నిలిపాడు. నిలుపుతూ సూచన యిచ్చాడు-" వేదాచలం గారూ! తొందరపడకండి. నిదానంగా సర్దుకుని దిగండి. మీ ముఖం అటువేపు ఉందన్నది మరచిపోకండి" .

సూర్యనారాయణ నిర్దేశం ప్రకారం వేదాచలం జాగ్రత్తగా కుదురుగా సర్దుకుంటూ దిగాడు. అతను దిగడం చూసిన వెంటనే సూర్యనారాయణ స్కూటర్ కి కిక్ యివ్వడానికి ఉద్యుక్తుడయాడు.

" కొంచెం ఆగవయ్యా బాబూ! ఓసారి క్రిందకు దిగవయ్యా—" మరు మాటకు తావివ్వకుండా దిగాడు సూర్యనారాయణ.

" ఇదిగో! కెంతకావాలో తీసుకో!" అని బరువైన పర్సు చేతిలో పెట్టాడు. సూర్యనారాయణ తల అడ్డంగా ఆడించాడు తనకు వద్దని సంకేతం యిస్తూ--

" నువ్వు కొంచెం మొహమాటస్థుడిలా ఉన్నావు. ఈ పర్సు పూర్తిగా తీసుకుపో! రేపు నీ ఫ్రెండ్సుతో యెంజాయ్ చేయి. ఓకే?"

" మీరిది నాకెందుకు యిస్తున్నారో తెలుసుకోవచ్చా!"

" లాక్ డౌన్ సమయంలో.. అదీను రాత్రి పూట ఇంతటి రిస్క్ తీసుకుని నాకు సహాయం చేసినందుకు---"

" అలాగే తీసుకుంటాను. మొదట దీనికి బదులివ్వండి. నన్ను మీరు కొడుకుగా భావిస్తూ సహాయం అడిగారు. నేను చేసాను దానికి పత్యమ్నాయంగా మీనుండి డబ్బు తీసుకుంటే అది సహాయం యెలా ఔతుందండి? అది యిచ్చిపుచ్చుకునే వ్యాపారం కదూ ఔతుంది--" అంటూ అతడు ఒక్క ఉదుటున స్కూటర్ పైకి యెక్కి సర్రున కిక్ యిస్తూ పోనిచ్చాడు.

వేదాచలం నివ్వెరపోయి వెంటనే తేరుకుంటూ గట్టిగా అరిచాడు-" సూర్యా!సూర్యా!" అంటూ-

-ఆ అరుపుకి చీకటి అదరిపోయింది. ఆకాశపు తెర నుండి నక్ష త్రాలు అక్కడక్కడ రాలిపడ్డాయి. సూర్యనారాయణ అదే వేగంతో టార్న్ చేసుకుంటూ తిరిగి వచ్చాడు. " మీకేమయింది వేదాచలం గారూ! ఇక్కడున్నవన్నీ జనావాసాలు. మనగురించి చుట్టుప్రక్కల యేమనుకుంటారు? పోలీసుల్ని పిలవరూ! అటు చూడండి— ఎవరో స్త్రీ బెదరిపోయి యిటు పరుగెత్తుకు వస్తూంది"

" ఆమె యెవరో కాదు. మా ఆవిడే! నువ్వు నానుండి యేదీ తీసుకోకుండా యిక్కణ్ణించి కదలకూడదు సూర్యా! “

" అంతలో పరుగె త్తుకుంటా వచ్చిన స్త్రీ మూర్తి అక్కడకొచ్చి ఆగిపోయింది-" ఏమయిందండీ!" అని అడుగుతూ-- అతడామె వేపు తిరిగి- " ఉష్!" అని చూపుడు వ్రేలితో సంకేతం యిచ్చాడు నిశ్శబ్దంగా ఉండమని. సూర్యనారాయణ నిదానంగా స్కూటర్ ని స్టాండుపైన నిలిపి దగ్గరకు వచ్చాడు".

నేను ముందే చెప్పాను కదండీ- మీరు మా తండ్రిలా ఉన్నారని! మీనుండి నేనెలా డబ్బులు తీసుకుంటాను?"

" అంటే—నేను మీ తండ్రిలా ఉన్నానని ఒప్పుకుంటున్నావన్నమాట!"

తలూపాడు సూర్యనారాయణ.

" అలాగయితే నేను చెప్పిన ట్టు చేయి. రేపు ఈ కంపెనీకి రా! ఎందుకని అడక్కు— నేను నడుపుతూన్న ఈ ఐటీ సొల్యుషన్స్ కంపెనీలో ఫ్రంటాఫీసులో చేరబోతున్నావు. మొదట ట్రైనీగా— ఆ తరవాత రెగ్యులర్ స్టాఫ్ గా--" అని జేబునుండి విజిటింగ్ కార్టు తీసి యిచ్చాడు సూర్యనారాయణ.

ఆశ్చర్యంగా చూసాడు- " ఇదెలా వీలువతుందండీ! ఇంతకు ముందు మీరే కదండీ అన్నారు- మీరేదో కార్యాలయంలో పని చేస్తు న్నారని. ఉదయం సమీక్షా సమావేశానికి హాజరు కాకపోతే ఉద్యోగం అభేసని— భార్యాబిడ్డలు రోడ్డున పడతారని—"

" ఔను. అన్నాను- ఆ భీకర నిర్మానుష్య స్థలం నుండి నన్ను నేను కాపాడుకోవడానికి— నీ మనసు కరిగించడానికి. తప్పా!" సూర్యనారాయణ బిత్తరపోతూ మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూడసాగాడు.

" ఇదిగో!ఈ రెండువందలూ తీసుకుని కంపెనీకి వచ్చేటప్పుడు పెట్రోల్ పోసుకుని రా! ఈ స్పెషల్ ఇ-పాస్ కూడా ఉంచుకో— దారిలో యేదైనా పోలీసు పెట్రోల్ వ్యాన్ యెదురు కావచ్చు. నేను ముషీరాబాదులో విడిచిన కారు కోసం నువ్వు దిగులు పడకు. దాని సంగతి నేను చూసుకుంటాను" అని, భార్య భుజంపైన కుడిచేతినుంచి- " సారీ మంజూ!" అంటూ అపార్టుమెంటు వేపు కదిలాడు వేదాచలం.

" నాకోసం ఒకసారి ఆగుతారా!" సూర్యనారాయణ గొంతు విని వెనక్కి తిరిగాడు వేదాచలం. అతడు తిన్నగా వచ్చి, వినమ్రంగా వంగి భార్యాభర్తలిద్దరి కాళ్ళకూ నమస్కరించాడు. ఇద్దరూ అతడి నెత్తిపైన చేతులుంచి తదేకంగా చూస్తూండి పోయారు ఆశీర్వదించడం మరచి. . . .

శుభం


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

.

రచయిత పరిచయం :

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి



188 views0 comments
bottom of page