top of page
Original.png

పరమశివునికి మానస పూజ

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #MahaSivarathri, #మహాశివరాత్రి, #మానస పూజ

ree

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివునికి మానస పూజ


Parama Sivuniki Manasa Puja - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 26/02/2025

పరమ శివునికి మానస పూజ - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


“ఈశ్వరా!”


నిరాకారుడు, నిరహంకారుడు, త్రిగుణాతీతుడివీ కనుక ఏ రూపమున నిన్ను కొలువగలను ? 

ఏ విధముగా అర్చించగలను ? 


పవిత్ర నదీ జలాలతో నిన్ను ఆపాదమస్తకం అభిషేకిద్దామంటే, పవిత్ర గంగనే నీ శిరస్సున ధరించితివి కదా! 


హాలాహలమును గళమున ఉంచుకొని వేడెక్కిన నిన్ను పరిమళ చందనములతో చల్ల పరుద్దామంటే, హిమశిఖరమే నీ ఆవాసము కదా!

 

స్వర్ణ మణి మాణిక్యాలతో నిన్ను పూజించుదామనుకుంటే నాగరాజు అయిన వాసుకియే నీ కంఠాభరణము కదా!

 

శృతిలయలతో శ్రావ్యంగా గానం చేద్దామంటే, సామగానలోలుడివీ, ఓంకార స్వరూపుడివీ నీవే కదా!

 

నాద ధ్వని వినిపించుదామనుకుంటే, ఢమరుకాన్నే చేతిన పూనిన ప్రణవ నాదమునివి నీవే కదా! 


వేద పారాయణము చేసి నిన్ను ఆనందింప చేద్దామనుకుంటే, వేదోపాసన చేసిన దక్షిణామూర్తివి నీవే కదా!

 

పట్టు వస్త్రములతో నిన్ను సత్కరిద్దామనుకుంటే, జింక చర్మమే నీ ఆఛ్ఛాదనము కదా!

 

నృత్య నాట్యాలతో నిన్ను అలరిద్దామనుకుంటే, నాట్యాధిపతి నటరాజ స్వరూపుడు నీవే కదా!

 

పంచ భక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా నీకు నివేదన చేద్దామనుకుంటే, సాక్షాత్తు అన్న పూర్ణయే నీ సతి కదా!


షోడశోపచారములతో నీకు సేవ చేద్దామనుకుంటే, వినయ విథేయుడైన నందీశ్వరుడు నీ సేవకుడు కదా!


సుగంధ పరిమళ పుష్పాలతో అర్చించి పుష్పమాల వేద్దామనుకుంటే, సర్పాన్నే కంఠమాలగా ధరించితివి కదా!


మధురమైన ఫలాలను సమర్పించుదామనుకుంటే, గరళాన్ని మ్రింగిన గరళ కంఠేశ్వరుడువి నీవే కదా!


పవిత్ర మందిరమున నిన్ను ఉంచి పూజించుదామనుకుంటే, స్మశానమే నీ ఆవాసము కదా!


ఎచట ఉన్నావో నీ ఉనికిని కనుగొందామనుకుంటే, 

ఆది- అంతము లేని సద్యోజాతకుడివి నీవే కదా!


ఏమి ఇచ్చి నిన్ను సేవించుకోగలను ? 

ఏ సేవలతో నిన్ను సంతృప్తిపరచను?

ఏ రూపమున నిన్ను పూజింతును ? 


ఏమున్నది నా వద్ద ? " నేను - నా " అనే అహం తప్ప. 

అహం వీడి సత్యము తెలుసుకున్నాను.


నాలో జ్వలిస్తున్న జీవన జ్యోతివి నీవే.

నాది అనబడే ఈ దేహము నాది కాదు - నీవు ఇచ్చినదే. 


అహంకార దర్పములను వీడి, నిర్మలమైన మనస్సును నీకు అర్పించి, నిన్ను అర్చించి, నీలో ఏకమై, మమేకమై శివైక్యమును పొందుతాను ఈశ్వరా! 


-నీరజ  హరి ప్రభల


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page