top of page
Writer's pictureMavuru Vijayalakshmi

పిల్లేష్ సెలవు గోల


'Pillesh Selavu Gola' New Telugu Story


Written By Mavuru Vijayalakshmi


'పిల్లేష్ సెలవు గోల' తెలుగు కథ


రచన: మావూరు విజయలక్ష్మి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“సార్..” మేనేజర్ కేబిన్ లోకి వెళ్లి నెమ్మదిగా పిలిచాడు పిల్లేష్.


“ఊ.. ఏంటి విషయం..? సీరియస్ గా ఫోన్ చూసుకుంటున్న మేనేజర్ లయనేష్

తలెత్తకుండానే కళ్ళద్దాల లోనుంచి కళ్ళు మాత్రం కొద్దిగా పైకెత్తి

అడిగాడు. ఆ చూపుతోనే పిల్లేష్ వాలకం, అతని చేతిలోని కాగితం చూసి

అతనెందుకొచ్చాడో గ్రహించేసాడు మేనేజర్.


“అదే సార్ రేపు సెలవు కావాలి..”


“అది తెలుస్తూనే ఉంది.. ఎందుకు?


“ఎందుకంటే సార్..మరి..నీళ్ళు నములుతూ తన పనేంటో.. సెలవెందుకో

చెప్పుకొచ్చాడు పిల్లేష్.


“ఏంటోయ్ పిల్లేష్..! మరీ విడ్డూరం కాకపొతే దీనికి కూడా సెలవు కావాలంటే ఎలా!?”


”తప్పదు సార్.. మొత్తం నిండిపోయింది. అస్సలు ఖాళీ లేదు. అస్సలు కదలడం

లేదు.”దీనంగా అన్నాడు పిల్లేష్.


“అంత నిండిపోయేవరకు ఏం చేసున్నావోయ్! కొద్దిగా అయినా జాగ్రత్త అనేది

ఉండాలిగా!? నువ్వేమైనా చిన్నపిల్లాడివా తెలియకపోవడానికి ఎప్పటికప్పుడు

క్లీన్ చేసుకోవద్దూ.. !? అంత నిండిపోయేవరకు ఊరుకొని ఇప్పుడు సెలవు

కావాలంటే ఎలా?


“అదికాదు సార్..ఎంత జాగ్రత్తగా ఉన్నా నిండిపోతుంది. సెలవు

పెట్టి క్లీన్ చేస్తేనే గాని అవడంలేదు.” ఎలాగైనా సెలవు సంపాదించాలని అతి

వినయంగా అన్నాడు పిల్లేష్.


“అయినా పదిరోజుల క్రితం దీనికోసమే కదా సెలవు పెట్టావు! మళ్ళీ ఇప్పుడు

దానికోసమే సెలవంటే ఎలా!? అయినా ఇప్పడు ఆఫీసు పరిస్టితి నీకు తెలుసుగా

చచ్చేంత పనుంది. ఇప్పటికే నీలాగే ఇలాంటి పని మీదే ఇద్దరు సెలవు

పెట్టేసారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా అంటే ఎలా? సారీ పిల్లేష్! రేపు

సెలవివ్వలేను. కావాలంటే వాళ్ళిద్దరూ లీవ్ అయ్యాక అఫీసుకొస్తే అప్పుడు

నువ్వు లీవ్ తీసుకో.” అన్నాడు మేనేజర్.


అదిరిపడ్డాడు పిల్లేష్ మేనేజర్ సమాధానానికి.


“అలా అంటే ఎలా సార్.. నా పరిస్టితి మీకు తెలియంది కాదు. ఆ మాటకొస్తే

మీకే కాదు అందరికీ తెలిసిందే! అంతెందుకు..మీరు కూడా వారం వారం ఈ

పనిలోనే ఉంటారుగా సార్..” లాజిక్కు లాగాడు పిల్లేష్.


“ఏంటి లాజిక్కులు మాట్లాడుతున్నావు? మీ అందరూ స్కూల్లో గంట కొట్టగానే

పిల్లలందరూ బయటకు పరుగులు పెట్టినట్టు 5 అవగానే వెళ్ళిపోతారు. నేనలా

వెళ్ళిపోతున్నానా? మీరు వదిలిపెట్టి వెళ్ళిన పనంతా చెక్ చేసుకొని

కంప్లీట్ చేసుకొని ఉసూరుమంటూ వెళుతున్నాను.” గాండ్రించాడు మేనేజర్

లయనేష్.


“అది కాదు సర్..” తన తొందరపాటు గ్రహించిన పిల్లేష్ మరింతగా వంగి నసిగాడు.


“ఏది కాదు! అహా..ఏది కాదు..అందరూ ఒకేసారి సెలవు పెట్టేస్తే ఎలా

అవుతుంది? వాళ్ళు లీవ్ నుంచి వచ్చాక నువ్వు పెట్టుకో.. అంతే” ఇదే

ఫైనల్ ఇక మాట్లాడేదేం లేదన్నట్టు చెప్పి ఫోన్లోకి తల వంచాడు మేనేజర్.


ఇక చేసేదేం లేక మొహం వేళ్ళాడేసుకుంటూ బయటకు వచ్చాడు పిల్లేష్.


రూమ్ లోనుంచి మేనేజర్ అరుపుల్లాంటి మాటలు వినిపించి ఇవాళ బాస్ దగ్గర

పిల్లేష్ కి ఏదో మూడినట్టుంది అనుకుంటూ..అప్పటికే అందరూ ఒక దగ్గర చేరిన

ఆఫీస్ స్టాఫ్ అంతా పిల్లేష్ చుట్టూ మూగారు ఏమందేమయిందంటూ ..


సెలవడిగితే మన మొగుడు ఇవ్వనంటున్నాడు ముఖం గంటు పెట్టుకుంటూ చెప్పాడు పిల్లేష్.


“అది సరే ఇంతకీ సెలవెందుకు ఎక్కడికైనా వెళ్తున్నారా?” అడిగాడు సందేహాల్రావ్.


“అదేనండీ మనందరం ఫేస్ చేస్తున్న ప్రోబ్లెమే ..!” అంటూ వివరంగా చెప్పాడు.


“అంతా విన్న స్టాఫంతా ముక్కున వేలేసుకున్నారు. ఏంటీ.. ఇలాంటి

పరిస్తితిలో కూడా సెలవు ఇవ్వనన్నాడా! ఎంత కర్కోటకుడు! అంతా క్లియర్

చేసుకోవాలంటే మాటలా!” అన్నాడు జాలేశ్వర్.


“అవునూ అసలింతకీ అంత నిండిపోయేవరకూ ఏంచేస్తున్నావ్ ఎప్పటి కప్పుడు

క్లియర్ చేసుకోవాలిగా నేనయితే రోజూ రాత్రి రెండు గంటలు ఆ పని మీదనే

ఉంటాను.” చెప్పాడు సలహాల్రావ్.


“నేనూ ఎప్పటి కప్పుడు చేస్తూనే ఉంటానండీ.. కానీ ఈ మధ్య వారం

రోజులనుంచీ మా ఆవిడ తరపు చుట్టాలొచ్చారు. రెండు బెడ్ రూమ్ లూ వాళ్ళతోనే

నిండిపోయాయి. పోనీ హల్లోనైనా కూర్చొని ఈ పని చేద్దామనుకుంటే ఎప్పుడూ అదే

పనా అంటూ ఫోన్ లాక్కుని పక్కన పడేస్తోంది మా ఆవిడ” దీనంగా చెప్పాడు

పిల్లేష్.


“ఊ..! ఇంతకీ ఎన్ని గుంపుల్లో ఉన్నావు..!?” ఆరా తీసాడు సందేహాల్రావ్.


“ఆ.. ఎన్నండి..! స్నేహితులవి, బంధువులవి, కమ్యూనిటీ వాళ్ళవి, ఇక కాలనీ

వాళ్ళవి ఎలాగూ ఉంటాయిగా.. అన్నీ కలిపి ఓ వంద ఉంటాయేమో! అందులో ఇరవై

గుంపులకి నేనే అడ్మిన్!” కాస్త గర్వంగా చెప్పాడు పిల్లేష్.


“వామ్మో!వందే! నేను ఏభై గుంపుల్లో ఉన్నాను. వాటితోనే సాయంత్రమయేసరికి

ఫోన్ ముందుకు నడవనంటూ మొరాయించేస్తోంది.” గుండెలమీద చేయ్యేసుకున్నాడు

భయాల్రావ్.


“ప్రతిరోజూ ఓ రెండొందల వరకు గుడ్ మొర్నింగ్ లు, మరో రెండొందల వరకు గుడ్

నైట్ లు, ఇక గ్రూప్ లో సందేహాలు.. సమాధానాలు .. ఇతరత్రా మరో వెయ్యివరకు

సందేశాలుంటాయి రోజుకే అన్నుంటే వారానికి ఎన్నవుతాయి చెప్పండి. మరి అవన్నీ

డిలిట్ చేసుకోడానికి ఎంత సమయం పడుతుంది..”వాపోయాడు వంద వాట్సాప్

గ్రూపుల మెంబరు, ఇరవై వాట్సాప్ గ్రూపుల అడ్మిన్ అయిన పిల్లేష్.


“సరే..సరే..ఇంతకీ అసలు విషయానికి రండి..ఇలాంటి సమయంలో కూడా సెలవు

ఇవ్వకపోవడం దారుణం. ఈ విషయంలో మనందరం కూడా గట్టిగా నిలబడాలి. ఇది

మనందరికీ ఎదురయ్యే ప్రాబ్లెమే. ఈ రోజు పిల్లేష్ రేపు మనం..అంతే. అందుకే

మనందరం గట్టిగా నిలబడాలి! ఛలో మేనేజర్ రూమ్..” అంటూ తమ హక్కుల సాధన

కోసం స్టాఫంతా మేనేజర్ రూమ్ వైపు కదిలారు కలిసికట్టుగా.


======================= ***=================

మావూరు విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నమస్తే...

నేను మావూరు. విజయలక్ష్మి.(విశాఖపట్నం). M,A.Music చదువుకున్న నేను ఆల్ ఇండియా రేడియో, రెడ్ ఎఫ్ ఎమ్ లలో రేడియో జాకీగా పనిచేసి, ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా న్యూస్ చానల్స్ కి వాయిస్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వనిత, వనితాజ్యోతి, పల్లకి, నవ్య, చిత్ర, వార, మాస, దిన పత్రికలలోను, ఈనాడు, సాక్షి పత్రికల ఆదివారం పుస్తకాలలోను, సంచిక సహరీ లాంటి వెబ్ పత్రికలలోనూ నా కథలు, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. మహానటి, కలకంఠి నవలలు ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే వీటన్నిటికీ కారణం నేనేం రాసినా ఏదో పెద్ద రచయిత్రిని అయిపోయానని మురిసిపోయి ప్రోత్సహించిన అమ్మా, నాన్నగారు మావూరు. అన్నపూర్ణమ్మ, సాంబమూర్తి గార్లు... ముఖ్యంగా నేను ఓ నాలుగు లైన్లు రాసినా నేనేదో పెద్ద నవల రాసినట్టు సరదా పడిపోయి ప్రోత్సహించిన మా అన్నయ్య డాక్టర్ మురళీమోహన్.

ఇప్పుడు మన తెలుగు కథలు లో నన్ను కూడా ఒక రచయిత్రిగా చేర్చిన మనతెలుగు కథలు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.


39 views0 comments

Comments


bottom of page