top of page

ప్రభ



'Prabha' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 18/09/2024

'ప్రభ' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


చంద్రవంశానికి చెందిన ఊర్వశీపురూరవుల పుత్రుడు ఆయువు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు. 


అతని పట్టాభిషేక మహోత్సవానికి వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, మహారాజులతో పాటు రంభ, ఊర్వశి, మేనక వంటి సురలోక వాసులు కూడా హాజరయ్యారు. 


"చంద్రవంశానికి నువ్వు తీసుకువచ్చే కీర్తిప్రతిష్టలు చిర కాలం చరిత్రలో నిలిచిపోవా”లని ఆయువును వశిష్ట మహర్షి దీవించాడు. 


 "ఇక ఆయు మహారాజే మా ఆయుష్షు పెంచే దాత విధాత కావాలి" అని రాజ్యంలోని పెద్దలందరూ ఆయు 

మహారాజు ను ప్రశంసించారు. 


 ఆయు మహారాజు అందరి ఆశీర్వాదాలను వినయంగా స్వీకరించాడు. అందరికి వారి వారికి తగిన రీతిలో విందు వినోదాలను ఏర్పాటు చేసాడు. 


తదనంతరం ఆయువు తన అంతఃపురం లో విశ్రాంతి తీసుకొనుచుండగా అతని తలిదండ్రులు ఊర్వశీ పురూరవులు ఆయు మహారాజు అంతః పురానికి వచ్చారు. ఆయు మహారాజు తలిదండ్రులైన ఊర్వశీపురూరవులకు నమస్కారం చేసాడు. 


"నాయన ఆయు, మీ తండ్రి పురూరవ మహారాజు మహా శౌర్యవంతుడు. వివిధ యజ్ఞ యాగాదులను నిర్వ హించడంలో కడుసమర్థుడు. అయితే వారు బలగర్వం తో బ్రాహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కున్నారు. నా మీద మితిమీరిన వ్యామోహంతో చెయ్యరాని తప్పు పనులు చేసారు. చివరికి తన తప్పు తను తెలుసుకున్నారు. ఉత్తమ మహారాజు గుణాలను వశిష్టాది మహర్షుల ద్వారా తెలుసుకున్నారు. 


 మీ తండ్రిగారు సనకసనందాదుల విశ్వరూపమును దర్శించి తన జన్మ ధన్యం చేసుకున్నారు. నువ్వు నీ తండ్రిగారు చేసిన పొరపాట్లను చేయమాకు. అలాగే వారు చేసిన గొప్ప గొప్ప పనులను విస్మరించకు. " అని తన కుమారుడైన ఆయువుకు ఊర్వశి చెప్పింది. 


 తల్లి ఊర్వశి మాటలను అనుసరించి ఆయు మహారాజు తన తండ్రి పురూరవుడు బలగర్వంతో స్వంతం చేసుకున్న బ్రాహ్మణ ధనాన్ని, సామంత రాజుల దగ్గర సంపాదించిన మొత్తం ధనాన్ని తన కుల గురువు వశిష్ట మహర్షి కి చూపించాడు. వశిష్ట మహర్షి ఆయు మహారాజు చూపించిన ధనాన్నంత చూసాడు. అంత వశిష్ట మహర్షి "ఆయు మహారాజ! ఈ బ్రాహ్మణ ధనాన్ని ఏం చేయదలచుకున్నావు?" అని ఆయు మహారాజును అడిగాడు. 


 వశిష్ట మహర్షి మాటలను విన్న ఆయు మహారాజు "కులాచార్య వశిష్ట మహర్షి! ఇందులో బ్రాహ్మణులకు చెందవలసిన ధనాన్నంత బ్రాహ్మణులకు మీరే పంచేయండి. మిగతా ధనంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేద్దాం. అన్నార్తులను ఆదుకుంటాం.. " అని అన్నాడు.

 

 ఆయు మహారాజు మాటలను అనుసరించి వశిష్ట మహర్షి ధర్మబద్ధంగా బ్రాహ్మణులకు ఇవ్వ వలసిన ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసాడు. మిగతా ధనంతో ఆయు మహారాజు వశిష్ట మహర్షి తో అనేక యజ్ఞయాగాదులు చేయించాడు. గోసంపదను, పశుసంపదను, గొర్రెల సంపదను, మేకల సంపదను పెంచి పోషించాడు. తన రాజ్యంలోని రహదారులను బాగుచేయించాడు. నిరుపేదలను తగిన రీతిలో రక్షించాడు. 


 వశిష్ట మహర్షి ఆయు మహారాజు తో " ఆయు మహారాజ! నీ తండ్రి పురూరవుడు ఈ భూమిని పదమూడు ద్వీపాలను మహా శౌర్యంతో పరిపాలించాడు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. నువ్వు నీ తండ్రి లోని ఈ మంచి గుణాలను తప్పకుండా స్వీకరించాలి. ప్రజలందరినీ కన్నతండ్రి వలే కాపాడాలి.. " అని అన్నాడు. 


 ఆయు మహారాజు వశిష్ట మహర్షి మాటలను విని "చిత్తం" అని అన్నాడు. అటుపిమ్మట అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేయసాగాడు. 


 ఆయు మహారాజు చేసే పనులను చూసి సుర నర రాక్షసాది లోకాలలోని వారంత ఎంతో సంతోషించారు. 


"మహా శౌర్యం లో తండ్రిని మించిన తనయుడు ఆయు మహారాజు. తండ్రి లోని సుగుణాలను మాత్రమే తన స్వంతం చేసుకున్నాడు ఆయు మహారాజు" అని ఆయు మహారాజు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రజలంతా అనుకోసాగారు. 


 ఊర్వశీ పురూరవుల వృత్తాంతంను, పురూరవుని గుణగణాలను దృష్టి లో పెట్టుకొని ఆయువుకు తమ కుమార్తెను యిచ్చి పెళ్ళిచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.. అది గ్రహించిన వశిష్ట మహర్షి, " మహారాజ ఆయు. నీ తండ్రి పురూరవుడు బ్రహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కుని చాలా పెద్ద పాపం చేసాడు. పెద్దలు చేసిన పాపం తప్పకుండా తమ పిల్లలు కొంత అనుభవించ వలసి ఉంటుంది. నువ్వు బ్రాహ్మణ ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసి చాలా పుణ్యాన్ని మూటకట్టు కున్నావు. అయినా నీ తండ్రి చేసిన పాపం నిన్ను కొంత పట్టి విడువకుంది. అందుకే నీ వివాహం ఆలస్యం అవు తుంది. నీ చిత్ర పటాలను నరసురకిన్నెర రాక్షసాది లోకాలకు పంపాను. అయినా ఫలితం దక్కలేదు. 


 ఇకపై నువ్వు శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం దినం లో నాలుగవ భాగం శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో ఉండు. త్వరలో నీకు వివాహం జరుగుతుంది. " అని అన్నాడు.

 

 వశిష్ట మహర్షి మాటలను అనుసరించి ఆయు మహారాజు శ్రీ దత్తాత్రేయ స్వామి ని సేవించసాగాడు. " అనసూయ పుత్ర, అత్రి తనయ హరిః ఓం జై గురుదత్త.. 

కృపావతార!" అంటూ ఆయు మహారాజు దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ కుక్కల పండగ చేసాడు. కుక్కల నడుమ చిరు దరహాసం తో సంచరించే శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆయు మహారాజు దర్శించాడు. స్వామి తేజం లోని వేద కాంతులను దర్శించాడు. 


 శ్రీ దత్తాత్రేయ స్వామి "ఆయు మహారాజ! నీకు త్వరలో వివాహం అవుతుంది. నీ ధర్మ పత్ని ఖగోళ శాస్త్ర నైపుణ్య సామర్థ్యంతో లోకానికి కాంతిని ఇస్తుంది. నీ వంశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. శ్రీదత్తాత్రేయ వరప్రసాది గా నీ కుమారుడు కీర్తిప్రతిష్టలు పొందుతాడు. " అని ఆయు మహారాజును శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీర్వదించాడు. 


 స్వర్భానుని కుమార్తె ప్రభ. తండ్రి దగ్గర సమస్త విద్యలను అభ్యసించింది. అమరత్వం కోసం ఖగోళ మండలంలో తపస్సు చేసింది. ఖగోళం లోని సప్త మహర్షులు, తదితర నక్షత్ర గణ దేవతలు, మహర్షులు, బ్రహ్మర్షులు, నరయక్షనాగ కిన్నెరాదుల తేజస్సులన్నిటిని ప్రభ చూసింది. ఆయా దివ్య తేజస్సుల మాటు ఉన్న అమర తేజస్సు ను చూడటానికి ప్రభ ప్రయత్నించింది. ఖగోళ తపో పీఠం పై ప్రకాశించే ప్రభను, ఆమె పట్టుదలను చూచి ఖగోళ వాసులందరూ వేనోళ్ళ ప్రశంసించారు. 


 ప్రభ తనువు మహా తేజంతో వెలిగిపోసాగింది. అయితే ఆ తేజస్సు లో ప్రభకు అమరత్వ తేజం ఆవంత కూడా కనపడలేదు. తన తపో దీక్షలోని లోపాలు ఏమిటి? అని ప్రభ ఆలోచించింది. 

 ఆపై ప్రభ ఖగోళ పీఠం మొత్తాన్ని ఒకసారి పరిశీలించింది. అక్కడి విజ్ఞాన తేజాన్ని ఔపాసన పట్టింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నపుడు వచ్చే శబ్ద స్వరూపమే " ఓంకారం" అని గ్రహించింది. ఖగోళం లోని మహా తేజస్సుకు మనసార నమస్కరించింది. అటు పిమ్మట భూమి మీద తపస్సు చేయాలనుకుంది. ప్రతి ష్టాన పుర సమీపంలో ఉన్న తపో వనంలో తపస్సు చేయసాగింది. 


 ఒకనాడు ప్రభ తపస్సు చేసే ప్రాంతానికి వశిష్ట మహర్షి వచ్చాడు. తపస్సులో ఉన్న ప్రభను చూసాడు. తన దివ్య దృష్టితో వశిష్ట మహర్షి ప్రభ వృత్తాంతం మొత్తం తెలుసుకున్నాడు. 


 కొంత సమయం అనంతరం వశిష్ట మహర్షి ని చూసిన ప్రభ మహర్షికి సాష్టాంగ పడి నమస్కారం చేసింది. వశిష్ట మహర్షి ప్రభను ఆశీర్వదించాడు.


అంత "అ మ్మా ప్రభ, విప్రచిట్టి సింహికల కుమారుడైన నీ తండ్రి స్వర్భానుడు అమరత్వం కోసం తహతహలాడిన ఘనుడు. అయితే నీ తండ్రి స్వర్భానుడు అమరత్వం కోసం కనికరం లేని అన్వేషణ అధికంగా చేసాడు. తనకు తపో ఫలితం త్వరగా రావాలని సూర్యచంద్రులనే మింగాలని చూసాడు. కరుణ లేని అన్వేషణ కసాయి అన్వేషణ. అందుకే నీ తండ్రి స్వర్భానుడు ఇంతవరకు అనుకున్నది సాధించలేక పోయాడు. 

నువ్వు కూడా అమరత్వం కోసం ప్రయత్నం చేస్తున్నావు. మంచిది. అయితే నువ్వు నీ తండ్రిలా కాకుండా మంచి మార్గాన అమరత్వం కోసం ప్రయత్నించు. 


 ఊర్వశీ పురూరవుల పుత్రుడు ఆయు మహారాజు. తన తపోశక్తి తో శ్రీ దత్తాత్రేయ స్వామి ని ప్రసన్నం చేసకున్నాడు. శ్రీదత్త కరుణాకటాక్ష వీక్షణల నడుమ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. ఆయు మహారాజు కు ఇంకా వివాహం కాలేదు. అతనికి తగిన వధువువు నువ్వే అని నాకనిపిస్తుంది. 

 పుణ్య పురుషుడైన ఆయు మహారాజును నువ్వు వివాహం చేసుకుంటే నువ్వనుకున్న మార్గం సులభంగా సాధించే అవకాశం కూడా నిన్ను వరిస్తుంది " అని వశిష్ఠ మహర్షి ప్రభతో అన్నాడు. 


 వశిష్ట మహర్షి మాటలను విన్న ప్రభ వశిష్ట మహ ర్షినే పెద్దరికం వహించి తనను ఆయు మహారాజుకు ఇచ్చి వివాహం చేయమంది. ప్రభ మాటలను విన్న వశిష్ట మహర్షి స్వర్భానుడు తోనూ ఊర్వశీపురూరవుల తోనూ ఆయు మహారాజు తోనూ మాట్లాడాడు. అందరూ వశిష్ట మహర్షి ఆలోచనను సమర్థించారు. 


 ప్రభ ఆయు మహారాజు ల వివాహం సురనర కిన్నెర యక్షరాక్షసాదుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. 

 ప్రభ తన భర్త ఆయు మహారాజు పద్దతులను అనుసరించి శ్రీ దత్తాత్రేయ స్వామిని సేవించసాగింది. 


శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో మైమరచిపోయింది. అలాగే తనకు తెలిసిన ఖగోళ విజ్ఞానం ను అభివృద్ధి చేయ సాగింది. 

 ఒకనాడు కాలనేమి అనువాడు తనకు పాలపుంతను కళ్ళార దగ్గర గా ఉండి చూడాలని ఉంది అని ఆయు మహారాజు తో అన్నాడు. ఆయు మహారాజు కాలనేమిని ప్రభకు పరిచయం చేసాడు. కాలనేమి మనసులోని కోరికను ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభకు చెప్పాడు. అప్పుడు ప్రభ భర్త విన్నపమును అనుసరించి తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం తో కాలనేమిని పాలపుంతకు పంపింది. 


కాలనేమి పాలపుంతను కళ్ళార చూసాడు. పాలపుంతలో ముదము మీర నడిచాడు. ప్రభ ఖగోళ విజ్ఞాన ప్రభను కళ్ళార చూసిన ఆయు మహా రాజు ఆమెను పలు విధాలుగా ప్రశంసించాడు. ప్రభ విజ్ఞానాభివృద్దికి కావలసిన ఏర్పాట్లన్నీ తానే దగ్గర ఉండి చేయించాడు. 


 తన విజ్ఞానం ను ప్రజలకు ఉపయోగపడేటట్లు చూడమని ఆయు మహారాజు ప్రభకు చెప్పాడు. ప్రభ అలాగేనని తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం తో ఆయు మహా రాజు రాజ్యంలోని ప్రజలందరూ అతివృష్టితో అనావృష్టి తో ఇబ్బంది పడకుండా చేసింది. సకాలం లో వర్షాలు పడేరీతిలో యజ్ఞ యాగాదుల ద్వారా ఖగోళ సామర్థ్యాన్ని పెంచింది. 


 ప్రభ తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం ను పదుగురికి ఉపయోగపడేటట్లు చేస్తూనే భర్త సహకారం తో దేవత లందరిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పద్దతులలో యజ్ఞయాగాదులను చేయసాగింది. ‌ భర్త చెప్పిన ట్టుగా తమో రహిత, రజో రహిత తపమును ఆచరించింది. 


 ప్రభ తపస్సు కు మెచ్చిన సనకసనందాదులు ప్రభ ముందు ప్రత్యక్షమయ్యారు. నిత్య బాలురైన సన కసనందాదులను చూచిన ప్రభ వారిని భక్తితో సనకస నందాదుల దండకంతో స్తుతించింది. 



 సనకసనందాదులు ప్రభకు అనేక ఖగోళ రహస్యాలను చెబుతూ, "ప్రభ, భక్తితో కూడిన మహా విజ్ఞానం మనిషి మేథస్సు ను అమృత తుల్యం చేస్తుంది. మనిషిని మనీషిగ మలుస్తుంది. భక్తిలేని మహా విజ్ఞానం జగతికి పలు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. భూమిని భూ కక్ష్య నుండి తప్పించిన హిరణ్యాక్షుడు మహా విజ్ఞానే.. పాతాళం పాలైన భూమిని మరలా తన కక్ష్యలో ప్రవేశపెట్టిన వరాహ మూర్తి శ్రీమహావిష్ణువు మహా విజ్ఞానే. 


అయితే ఒకరి జ్ఞానం మహికి కీడు చేస్తే, మరొకరి జ్ఞానం మహికి మేలు చేసింది. మహికి మేలు చేసే జ్ఞానమే మంచి జ్ఞానం. నువ్వు ఇప్పుడు మహా మంచిదైన విష్ణు జ్ఞానం వైపు పయనిస్తున్నావు. నీలో సురకళ దినదినాభివృద్ధి చెందుగాక!" అని ప్రభను ఆశీర్వదించారు. 


 సనకసనందాదుల ఆశీర్వాదాలను ప్రభ కడు వినయంగా స్వీకరించింది. 

 ప్రభ తన భర్త ఆయు మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కసారి "ఖగోళ విజ్ఞాన విషయంలో నేనే గొప్ప "అని అనుకునేది. అప్పుడు ప్రభను కొంచెం రజో గుణం ఆవరించేది. ఆ రజో గుణమే ఆమెలో కొంచెం అహంను పెంచేది. అప్పుడు ప్రభ భర్త ఆయు మహారాజు చెప్పే శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను విని తనలోని రజో గుణాన్ని, అహాన్ని తొలగించుకునేది. 


 రాక్షస గుణం గల తన తండ్రి స్వర్భానుని ప్రభావం వలనే తనను అప్పుడప్పుడు రజో గుణం తనని ఆవరిస్తుందన్న సత్యాన్ని ప్రభ గమనించింది. అందుకే ఆమె ముఖ్యమైన ఏ విషయాన్ని గురించి ఆలోచించే టప్పుడైన భర్త ఆయు మహారాజు అభిప్రాయ దిశగానే సంచరించేది. 


 ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభ తన అభి ప్రాయాలనే గౌరవిస్తుందని తెలిసినప్పటికీ ప్రతి విషయాన్ని ధర్మపత్ని ప్రభతో చర్చించేవాడు. ధర్మపత్ని ప్రభ అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చేవాడు. 


 ఆయు మహారాజు సోదరులు అమావసు, ధిమన, విశ్వాయు, ధృదాయు, శృతాయులు తన వదినగారు ప్రభలో లేశ మాత్రంగా ఉన్న రజో గుణాన్ని గ్రహించారు. 


రజో గుణం తో ముందుకు కదలాలనుకున్న తమని తమ వదిన ప్రభ సమర్థిస్తుందనుకున్నారు. 


 అమావసాదులు ముని వనంలో కాలం చేసిన తన తండ్రి పురూరవుని మరణానికి మునులే కారణం గా భావించారు. ముని సంహారానికి సిద్దమయ్యారు. ఆ విషయాన్ని ప్రభ కు చెప్పారు. 


అప్పుడు ప్రభ పద్మా సనం మీద ఆసీనురాలయ్యింది. తన భర్త ఆయు మహా రాజు ను తనువు మీదకు తెచ్చుకుంది. అంత "మీ తండ్రిగారు నా మామగారు అయిన పురూరవుల వారి మరణానికి కొంతమంది మునులు కారణం అని మీరు అనుకుంటున్నారు. నిజానికి పురూరవులవారి మరణానికి మునులు కారణం కాదు. మీ తండ్రి గారు మునివాడన కాలం చేయడం వలన కొందరు అలా అనుకుంటు న్నారు. 


 మీ తండ్రిగారు కొంత బ్రాహ్మణ ధనాన్ని మునివాడ లోని భూగృహంలో దాచి పెట్టారని కూడా కొందరు అను కుంటారు. ఆ ధనాన్ని తీసుకురావడానికి మీ తండ్రి గారు మునివాడకు వెళ్ళారని, అక్కడ మీ తండ్రిగారి దగ్గర ఉన్న ధనాన్ని అపహరించడానికి మునులు మీ తండ్రిగారిని కిరాతకంగా క్షుద్ర విద్య లతో చంపారని మరి కొందరు అంటారు. 


నిజానికి అదంతా అబద్దం. మీ తండ్రిగారు వయసు మళ్ళిన పిదప మునివాడన కాలం గడపాలనుకున్నారు. అలా మునివాడకు వెళ్ళారు. అక్కడ అనారోగ్యం తో కాలం చేసారు. అంతే. " అని ప్రభ తన మరుదులకు నచ్చ చెప్పింది. 


 ప్రభ మాటలను విన్న అమావసాదులు మునివాడ లో ఉన్న మునులను చంపాలన్న ఆలోచనకు స్వస్తి పలికారు. ముని సంహారానికి తన సోదరులు వెళుతున్నారని తెలిసిన ఆయు మహారాజు తన సోదరులకు అవసరమైతే కత్తితో బుద్ది చెప్పాలని అమవసాదుల దగ్గరకు వచ్చాడు.

 

 ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభ వలన తన సోదరులు మారిన విధానం కళ్ళార చూసి సోదరులను దగ్గరకు తీసుకున్నాడు. ధర్మపత్ని ని మనసారా అభినందించాడు. 


 ప్రభ ఆయు మహారాజులకు శ్రీ దత్తాత్రేయ స్వామి కరుణాకటాక్షాల వలన ఒక కుమారుడు కలిగాడు. ఆ పుణ్య దంపతులు తమ కుమారునికి నహుషుడు అని పేరు పెట్టారు. వారు నహుషుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసారు. ప్రభ ఆయు మహారాజు కు నహుషునితో పాటు వృద్దశర్మ, గయుడు, అనేనుడు అనే పేర్లు గల పుత్రు లు కూడా కలిగారు. 


 ప్రభ భర్త సహాయసహకారాలతో దేవతలందరిని ప్రసన్నం చేసుకుంది. తన తపో శక్తిని, ఖగోళ విజ్ఞాన శక్తి ని ప్రజలకు ధారపోసింది. తను పొందాలనుకున్న అమరత్వం పొందింది. 


   శుభం భూయాత్ 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు





38 views0 comments

Comments


bottom of page