top of page

ప్రగతి ప్రేమికులు 8


'Pragathi Premikulu episode 8' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.


శ్రీ వివేకానంద స్వామీజీ అసలు పేరు నరేంద్రుడు. శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా మారారు. 1893 వ సంవత్సరం చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొన్నారు. అమెరికన్లను బాగా ప్రభావితం చేశారు. 1902వ సం: జూలై 4వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ వివేకానందస్వామీజీ మహా సమాధి పొందారు.


స్వామిజీ కథను చదవడం పూర్తి చేసాడు యస్. ఐ. వివేకానంద.


తమ్ముడు విజయానంద ని కలుస్తాడు. రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవాలనుకుంటాడు. తాను ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం తల్లికి ఇష్టం లేదని గ్రహిస్తాడు వివేకానంద.


తన మేనమామ ఆదిశేషయ్యను కారణాలు చెప్పమంటాడు.

వివేకానంద తండ్రి మృతి సహజం కాదనీ, అందులో వివేకానంద పినతండ్రి ధనుంజయ రావు ప్రమేయం ఉందని చెబుతాడు ఆదిశేషయ్య.



ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8 చదవండి.


ఐదు రోజులయింది. వివేకానంద ఆ స్టేషన్ ఛార్జి తీసుకోవాలి. ఆఫీస్ పరిసరాలు పూర్తిగా మారిపోయాయి. అన్నివైపులా శుభ్రం చేయించి, నర్సరీ నుంచి పూలమొక్కలు, టెంకాయ, కానగ, వేపచెట్లను తెప్పించి క్రమంగా నాటించాడు.


తను నిర్ణయించుకొన్నట్లుగానే స్టేషన్లో ఉన్న జాతిపిత గాంధీజీగారి ఫోటో ప్రక్కన, స్వామి వివేకానంద ఫోటోను ఆవిష్కరించాడు. తనకు సంబంధించిన ఇతర అన్ని స్టేషన్స్ లో కూడా, డి.ఐ.జి గారితో మాట్లాడి స్వామి వివేకానంద ఫోటో వుండేలా చేశాడు.


అమృతకు ఫోన్ చేసి మూడు వందల కాపీలను తెప్పించి, స్వామీజీ చరిత్రను అందరికీ పంచాడు. వివేకానంద మాటతీరు, పెద్దా చిన్నా అనే బేధం లేకుండా విచక్షణా భావంతో అందరికీ ఇచ్చే మర్యాద, డిపార్టుమెంటు సభ్యులకందరికీ బాగా నచ్చింది.


రాత్రి సమయంలో ఒంటరిగా నగరం నాలుగు మూలలా సంచరించి ఎక్కడెక్కడ ఏమేమి వున్నదీ తెలుసుకొన్నాడు.

కలెక్టర్ గారిని, జిల్లా పరిషత్ ఛైర్మన్ గారిని కలసికొని వీధుల్లో అడ్డదిడ్డంగా వున్న షాపులను, సంసారగృహాలకు మధ్యన వున్న సారాయి దుకాణాలను, ఏ ప్రాంతానికి మార్చితే బాగుంటుందో సూచించాడు. వారికీ శ్రీవివేకానందస్వామీజీ వారి పుస్తకాన్ని ఇచ్చి, "తీరిక సమయంలో చదవండి సార్" అని కోరాడు.


అతని మృదు మధురభాషణ వారికి నచ్చి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర సభ్యులూ సమావేశమై వివేకానంద సూచనలను అమలు పరిచేదానికి నిర్ణయించుకొన్నారు. కొందరు సభ్యులు వ్యతిరేకించినా, ఆ సూచనల్లో ప్రజాహితం ఉన్నందున, మెజారిటీ ఆమోదం లభించినందున వివేకానంద సూచనలు కార్యరూపం దాల్చాయి.


వివేకానంద కొందరికి గిట్టని వాడైనా ఎందరికో హితుడు, సమాజ శ్రేయోభిలాషి, అన్న భావన కలిగింది. వివేకానంద మరో సమావేశంలో, అమృత తన మండలానికి చేస్తున్న సేవ, ఆమె అద్వితీయ ఆశయాలు, రాష్ట్రంపట్ల, దేశంపట్ల ఆమెకు ఉన్న గౌరవాభిమానాలను గురించి చర్చించాడు.

ఎన్నో వ్యవహారాలతో తీరికలేనివారు కూడా, వివేకానంద మాటలు విని అమృతను కలవాలని నిర్ణయించుకొన్నారు. కలెక్టర్ ఆఫీస్లో కలవవలసినదిగా తేదీని నిర్ణయించి

ఆమెకు సందేశాన్ని పంపారు కలెక్టర్ గారు.


ఈ లోగా ఒక బృందం కలెక్టర్ గారి ఆదేశానుసారంగా అమృత మండలాన్ని వీక్షించి వచ్చి, వారి అభిప్రాయాలను వ్రాసి కలెక్టర్ గారికి అందించారు.


కొత్త డి.ఐ.జి త్రిపాటిగారు వచ్చి చార్జి తీసుకొన్నాడు. వివేకానంద త్రిపాటిని కలసి సెల్యూట్ చేసి, అందరి ముందూ వారికి పాదాభివందనం మన సాంప్రదాయ

ప్రకారం చేశాడు. త్రిపాటీ వివేకానందను తన హృదయానికి హత్తుకొన్నాడు. చూపరులందరూ ఆశ్చర్యపోయారు.

త్రిపాటీ నవ్వుతూ అందరినీ ఉద్దేశించి... “మా ఇరువురి సంబంధం గురిశిష్యుల అనుబంధం. వివేక నా ప్రియశిష్యుడు. మన ఈ పోలీస్ జాతిలో పులి.” సగర్వంగా చెప్పాడు త్రిపాటి.


వారి మాటలు కొందరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తే, కొందరికి అసూయను కలిగించాయి. జరుగనున్న సమావేశానికి హాజరు కావలసిందిగా కలెక్టర్ ఆఫీసునుండి పోలీస్ ఆఫీసర్సుకు, మున్సిపల్ అధికారులకు, జిల్లా పరిషత్ అధికారులకు, బి.డి.ఓలకు ఆహ్వానాలు పంపబడ్డాయి.


అందరూ ఆ సమావేశానికి హజరైనారు. అమృత సకాలంలో వచ్చి ఒక ప్రక్కన కూర్చుంది. కలెక్టర్ గారు జిల్లాపరిషత్ ఛైర్మన్ గారు వేదికపై తమ ఉన్నతాసనాలలో కూర్చున్నారు.

కలెక్టర్ గారి ఆదేశానుసారంగా వారి పి.ఏ.. అమృత బ్లాక్ డెవలప్మెంటును గురించి, వెళ్ళి పరిశీలించిన బృందం వ్రాసిన అభిప్రాయాలను ఆ మండల అభివృద్ధిని గురించి చదివి వినిపించారు. చివరగా అమృతను వేదికమీదికి రావలసినదిగా కోరారు.


అమృత వేదికపైకి వెళ్ళి, వయస్సులో, హోదాలో, తనకంటే ఎంతో గొప్పవారైన ఆ ఇరువురు పెద్దలకు సవినయంగా నమస్కరించింది. తనకుగా ఏర్పరచిన ఆసనంలో కూర్చుంది.


కలెక్టర్ పి.ఏ. గారు.. “ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మాట్లాడతారు.” అని చెప్పి, ఛైర్మన్ వంక చూచారు.


వారు నవ్వుతూ మైక్ ను సమీపించారు…


“సభాసదులందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ఇక్కడ మన అందరి సమావేశానికి కారణం, ఇద్దరు వ్యక్తులు. మొదటివారు యన్.ఐ. వివేకానందగారు, రెండవ వ్యక్తి కుమారి అమృతగారు, వివేకానంద ఈ వూరికి వచ్చి మూడు వారాలయింది. వారు మన నగరాన్ని నాలుగు మూలలా పరిశీలించి, నన్ను కలక్టర్ గారిని కలసి, మాకు కొన్ని సూచనలను వివరించారు. వారి సూచనలు

మా యిరువురికీ ఎంతగానో నచ్చాయి.


ఇంతవరకూ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నా దగ్గరకు వచ్చి ఆ రీతిగా చర్చించలేదు. ఆ సలహాలను అమలు పరచవలసిందిగా నేను ఆయా సంబంధీకులకు నా నిర్ణయాన్ని తెలియజేసి అమలు పరచవలసిందిగా చెప్పాను. ఆయా పనులు ప్రారంభం అయినాయి. వివేకానందగారి అమూల్య సలహాలకు నా ధన్యవాదాలు.


ఇక కుమారి అమృత, మనందరికంటే చిన్న వయస్కురాలు. ఆమె ఒక బి.డి.ఓ. రొండు. సంవత్సరాలుగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ వుంది. ఆమెకు స్ఫూర్తి... స్వామీజీ వివేకానంద. వారి చరిత్రను సంక్షిప్తంగా వ్రాసి తన బ్లాక్లో వున్న అందరి అధికారులకు, పాఠశాలలకు పంచి, తన బ్లాక్ డెవలప్మెంటుకు నిర్విరామంగా కృషి చేశారు. ఈనాడు మిగతా అందరి బి.డి.ఓలకు ఆమె ఆదర్శం. మీరంతా ఆమెను కలసి, మాట్లాడి, మీమీ మండలాలను కూడా, వారి మండలంలా అన్ని విధాలా అభివృద్ధి పరచాలని కోరుకొంటున్నాను.


ఆమెలో వుండే కార్యదీక్షకు ప్రగతి పట్ల ఆమెకు ఉన్న తపన, సంకల్ప బలానికీ మెచ్చి, ఆమెకు మరో ఎనిమిది మండలాలకు అడిషనల్ బి.డి.ఓగా నియమిస్తున్నాను. ఇప్పుడు ఉన్న బి.డి.ఓలు ఆమెతో సహకరించి, మీ మండలాభివృద్ధికి పాటు పడవలసిందిగా కోరుచున్నాను. ఒక్క సంవత్సరంలో మన జిల్లాలోని అన్ని మండలాలు

సర్వతోముఖంగా వున్నతిని, ఆమె నేతృత్వంతో పొందాలన్నది నా ఆశయం.


ఈ నాడుఅమృతగారి మండలం వుత్తమ మండలంగా ఎన్నిక చేయబడిందని మీకందరికి తెలియజేస్తున్నాను. మీ అందరితో కలసి నా మనోభావాలను మీకు తెలియపరచే దానికి, నాకు అవకాశం కల్పించిన వివేకానందగారికి, కుమారి అమృతగారికి నా ధన్యవాదాలు.” చేతులు జోడించి తన స్థానాన్ని చేరి కూర్చున్నాడు ఛైర్మన్.


కలెక్టర్ పి.ఏ మైక్ ను సమీపించి... "ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు ప్రసంగిస్తారు.” అని చెప్పి వారు ప్రక్కకు జరిగారు.


కలెక్టర్ గారు మైక్ ను సమీపించారు. "అందరికీ నమస్కారం. మీరంతా ఆశ్చర్యపోయి వుండవచ్చు. వేదిక మీద మా టేబుల్ ముందే వుండవలసిన మైకులు లేకుండా ఇలా ఒక మూల మైక్ ను ఏర్పరచినందుకు. అది నా ఆదేశమే..! రోజంతా కుర్చీలో కూర్చొనే పని చేస్తాము. కాసేపైనా నిలుచొని మాట్లాడితే అది ఆరోగ్యకరం అన్న నమ్మకంతో ఈ ఏర్పాటు జరిగింది.”


సభాసదులందరూ నవ్వారు. ఛైర్మన్ గారు, వేదిక పైన ఉన్నవారు నవ్వారు.


"మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈ సమావేశపు ముఖ్య వుద్దేశాన్ని, క్రొత్తగా వచ్చిన యస్.ఐ. వివేకానందగారిని, బి.డి.ఓ కుమారి అమృతగారిని గురించి, వారి నిర్ణయాలను గురించి విపులంగా తెలియజేశారు. వారు వయస్సులో నాకంటే చాలా పెద్దవారు. వారి ఉపన్యాసాన్ని విన్న తరువాత, నేను మీ అందరికీ చెప్పదలచు కొన్నది ఒక్కటే..!


శ్రీ వివేకానందస్వామీజీ సముద్రాలు దాటి తెల్లవారికి మన భారతజాతి యొక్క సంస్కృతిని, మన అద్వైత తత్వాన్ని, ఈ దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని, మన భారతీయుల మనస్తత్వాన్ని, మన ఆస్తికతా భావవ్యవస్థనూ, వారి భాషలో వారికి వివరించి, మన జాతి ఔన్నత్యాన్ని, జగత్ విదితం చేసిన ఆ మహా పురుషుని చరిత్రను అందరూ చదవాలి. మనం ఎవరమన్నది మనం తెలుసుకోవాలి. జాతికి, రీతికి, కట్టుబడి మన జీవిత విధానాలను చిత్రించుకొని, ఆచరించి మనం ఆనందంగా వుండడమే కాకుండా, మన చుట్టూ ఉన్న, మనవారందరి సుఖసంతోషాలను కోరాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను.


ఈ విధానాన్ని నమ్మి, తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వివేకానంద గారికి, కుమారి అమృతగారికి నా అభినందనలు. మన తెలుగులో ఒక సామెత వుంది. అది అందరికీ తెలిసిందే..! 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా' అని. మనం ఏ రీతిగా వర్తిస్తామో ఆ రీతిగానే మన సంతతి వర్తిస్తుంది. మన సంతతి భావి భారత పౌరులు. వారిని సక్రమమైన మార్గంలో నడిపించడం మన ముఖ్యధర్మం.


ఇంత చిన్న వయస్సులో కుమారి అమృత యొక్క సాధన, లక్ష్యాలు సాటివారికి ఆదర్శప్రాయాలు. మన జాతి ఔనత్యానికి, రాష్ట్ర, దేశ ప్రగతికి అలాంటి యువతరం ఎంతైనా అవసరం. వివేకానందగారికి, కుమారి అమృతగారికి వారి విధినిర్వహణలో సహాయసహకారాలను మా పరిధిలో పూర్తిగా అందిచగలమని తెలియజేస్తున్నాను. వారిరువురికి మరోసారి నా అభినందనలు." కలెక్టరుగారు తమ

ప్రసంగాన్ని ముగించి తన ఆసనంలో కూర్చున్నారు.


కలెక్టర్ పి.ఎ.గారు మైక్ ను సమీపించి... “ఇప్పుడు కుమారి అమృతగారు ప్రసంగిస్తారు.” అని సభికులకు తెలియజేసి ప్రక్కకు తప్పుకున్నారు.


అమృత మైక్ ను సమీపించింది.. "గౌరవనీయులు కలెక్టర్ గారికి, పూజ్యులు గౌరవనీయులైన జెడ్.పి. ఛైర్మన్ గారి, సభాసదులకు నా నమస్కారాలు.” చేతులు జోడించింది, అందరినీ కలయ చూచింది.


"నేను మీ అందరికన్నా చాలా చిన్నదాన్ని. పెద్దలు నాకంటే ముందు చాలా గొప్పగా ప్రసంగించారు. నేను మీకు తెలియజేయ తలచుకొన్నది ఏమిటంటే... ప్రతి వుద్యోగానికి కొన్ని నిర్ణీత ధర్మాలుంటాయి. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి ధర్మాలను గురించి తెలిసికొని కర్తవ్యపాలనను ధర్మబద్ధంగా నెరవేర్చాలి. ఈ సూక్తిని నేను మా తండ్రిగారి వద్దనుండి నేర్చుకొన్నాను. కాలానికి విలువనిచ్చి ఆచరించాను. అంతే... అంతకుమించి నేను

అతిశయంగా చేసిందంటూ ఏమీలేదు.


శ్రీస్వామి వివేకానందగారికి మన ఈ భారత సంస్కృతి అన్నా, మన ఈ పవిత్ర భారతదేశం అన్నా, మన భారత ప్రజానీకం అన్నా, ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. నాకూ వారివలే నా ప్రాంతం అన్నా, దేశం అన్నా, నా వారన్నా ఎంతో ఇష్టం. ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన జ్ఞానాన్ని నేను పుట్టిన గడ్డకు నావారి ప్రయోజనాలకు, ప్రగతికి, వినియోగించాలన్నదే నా ఆశయం. నేను చేసింది చాలా తక్కువ. ఇంకా చేయవలసింది ఎంతో వుంది. ఈ సువిశాల భారతదేశంలో, ఉన్నత అధికారంలో ఉన్న మహనీయులు, ప్రజాప్రతినిధులు, నాలాంటి వారి ఆలోచనలను చిత్తగించి, ఆర్థికపరమైన సహాయాన్ని అందించకలిగే ఈ మన జిల్లా మండలాలనే కాదు, యావత్ దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలూ సుభిక్షంగా మారుతాయి.


రెవిన్యూ ప్రభుత్వానికి వచ్చేది ప్రజలనుండి. ఆ ప్రజల అవసరాలను తీర్చడం ప్రభుత్వ ధర్మం. వేసిన ప్రణాళికలను అందిన గ్రాంటును సవ్యంగా వినియోగించడం వుద్యోగుల ధర్మం. ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మాన్ని సవ్యంగా నెరవేర్చాలనేది నా కోరిక. మన జాతిని, ఔన్నత్యాన్ని, అద్వైత హైందవ సిద్ధాంతాలను ఎరిగి, ఆచరించి, అందరి శ్రేయస్సునూ కోరడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా నేను భావిస్తాను. ఈ భారతావని తత్వాన్ని, ఈ భారత ప్రజ ఔన్నత్యాన్ని, శ్రీస్వామి వివేకానంద యావత్ ప్రపంచానికి తెలియజేశారు. వారు నాకు ఆదర్శప్రాయులు.


వారిని గురించి ఈ చిన్న పుస్తకాన్ని తయారుచేసి నా మండలంలో కొన్ని స్కూళ్ళకు పంచాను. త్వరలో అన్ని స్కూళ్లలో ప్రతి విద్యార్థికి ఈ చిన్న పుస్తకాన్ని అందించే ప్రయత్నంలో వున్నాను. మరో నెల లోపల ఆ పని పూర్తి అవుతుంది.


సహృదయులు యస్.ఐ. వివేకానందగారు, తమ డిపార్టుమెంటువారికి పంచేదానికి మూడు వందల కాపీలు అడిగారు, పంపాను. యాభైవేల డి.డిని వారు నాకు అందజేశారు. నా ధోరణి వారికి నచ్చి ఆర్థిక సహాయాన్ని అందించిన వారికి నా ధన్యవాదాలు. వారిని గురించి మనం మాట్లాడుకొంటున్నాము కానీ..! వారు ఈ సభలో లేరు. కారణం ఏమిటో..!


మీ అందరికీ ఆ చిన్నపుస్తకాన్ని మా ఈశ్వర్ అందిస్తాడు. స్వీకరించి చదువవలసిందిగా కోరుచున్నాను. ఇది చాలా గొప్ప వేదిక. దీనిపై కూర్చొన్న మీ అందరి ముందు మాట్లాడకలిగే అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలు, గౌరవనీయులైన జడ్.పి ఛైర్మన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు.” వారి వైపు చేతులు జోడించి నమస్కరించింది అమృత.


ఈశ్వర్ ఆ వివేకానందస్వామీజీ చరిత్ర పుస్తకాన్ని సభికులందరికీ పంచాడు.


వివేకానంద వచ్చి ద్వారం దగ్గర నిలబడ్డాడు.


“వివేక్..! రారా...” పిలిచాడు త్రిపాటి నవ్వుతూ.


వివేక్ ను చూచిన కలెక్టర్ గారు, జడ్.పి. ఛైర్మన్ గారూ, అతన్ని వేదికపైకి రావలసినదిగా చేతిని ఆడించారు.


"వారు నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు.” అన్నాడు త్రిపాటి.


వేగంగా వివేక్ మెట్లెక్కి స్టేజ్ పైకి చేరాడు. జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి నమస్కరించాడు వివేకానంద.

చిరునగవుతో చేతులు జోడించి స్వాగతం పలికింది అమృత.

కలెక్టర్ పి.ఏ. మైక్ ను సమీపించి... “ఇప్పుడు యస్.ఐ. వివేకానందగారు ప్రసంగిస్తారు." అని చెప్పి ప్రక్కకు నడిచాడు.


వివేకానంద మైకు సమీపించాడు. తన గురువుగారైన త్రిపాటీని చూచాడు. ఆయన నవ్వుతూ మాట్లాడమని తల వూపారు.


వెనక్కు నడిచి, ఛైర్మన్ గారితో, కలెక్టర్గారితో ఏదో చెప్పి వేగంగా త్రిపాటీని సమీపించాడు.


"ఏం వివేక్..! మాట్లాడకుండా ఎందుకొచ్చావ్..?" త్రిపాటి అడిగాడు.


“సారీ..! మీరు మాట్లాడితే బాగుంటుంది ప్లీజ్...”


నో.. నో.. నీవే మాట్లాడాలి. త్వరగా వెళ్ళు.” భుజంపై తట్టి నెట్టాడు.


వివేకానంద వేదిక పైకి వచ్చాడు. మైక్ ను సమీపించి ‘పెద్దలు, గౌరవనీయులైన జడ్.పి. ఛైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, సభాసదులకందరికీ నా నమస్కారాలు. ముఖ్యమైన పనిమీద నెల్లూరికి వెళ్ళాను. రావడంలో కొంచెం ఆలస్యం అయింది. మన్నించండి.


కలెక్టర్ గారు "మేమంతా మాట్లాడేశాం. మరో పదినిముషాలు నీవు ఆలస్యంగా వచ్చి వున్నట్లయితే సభా కార్యక్రమం ముగిసి అందరం వెళ్ళిపోయి వుండేవాళ్ళం. నీ టర్న్ వచ్చే సమయానికి వచ్చావు. మాకు చాలా ఆనందం. ఈ కార్యక్రమం అమృత నీ కారణంగానే ఏర్పరచింది. కనుక నీవు తప్పక మాట్లాడాలి” అని నవ్వుతూ చెప్పారు.


“నేను మన డి.ఐ.జి త్రిపాటి గారి వద్దకు వెళ్ళి వారిని మాట్లాడవలసిందిగా కోరాను. వారూ నన్నే మాట్లాడమన్నారు. నేను రావడంలో ఆలస్యం అయినందుకు నన్ను మీరందరూ క్షమించాలని కోరుతున్నాను.


నేను ఈ నగరానికి వచ్చిన తర్వాత గౌరవనీయులైన జడ్.పి. ఛైర్మన్ గారిని, కలెక్టర్ గారిని కలసి ప్రజాసౌకర్యార్థం, క్షేమంకోసం కొన్ని సూచనలను వారికి సూచించాను. వారు నాతో ఏకీభవించారు. వాటి ఆచరణకు అనుమతించారు. అవి కార్యరూపం దాల్చాయి. రొండు మూడు వారాల్లో పూర్తి అవుతాయని ఆశిస్తున్నాను. మా డిపార్టుమెంటు సభ్యులందరం, ఈ నగర ప్రజల శాంతి, భద్రత, సుఖాల కోసం మా విద్యుక్తధర్మాన్ని సవ్యంగా, సజావుగా, పక్షపాతరహితంగా నెరవేరుస్తామని మీకు మనవి చేస్తున్నాను.


నేరం చేసినవాడు ఎవరైన సరే, శిక్షను అనుభవించక తప్పదు. మా కర్తవ్య నిర్వహణలో మీ సహాయం మాకు ఎంతో అవసరం. దాన్ని మీరు మాకు సహృదయంతో, పక్షపాతరహితంగా, మాకు అందచేయవలసినదిగా కోరుచున్నాను.


నాకు అమృతగారు నేను ఈ వూరికి వస్తూ వుండగా పరిచయం అయ్యారు. వారు వ్రాసిన శ్రీ స్వామీజీ వివేకానందగారి చరిత్ర పుస్తకాన్ని నాకు ఇచ్చారు. సాంతం చదివాను. ఆ పుస్తకాన్ని నా డిపార్టుమెంటులో, ఈ వూర్లో

వున్న వారందరికీ పంచాలని నిర్ణయించుకొన్నాను. వారిని పుస్తకాలను పంపమని కోరాను. పంపారు. మా వారందరికీ పంచాను. మన చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి కూడా యిచ్చాను.


ప్రస్తుతం మన చుట్టూ వున్న పాశ్చాత్య నాగరిక వ్యవస్థ, మనలను, మన సంస్కృతిని, మన హైందవ అద్వైత జీవన విధానాన్ని మార్చి వేస్తూ వుంది. ఈ ప్రభావం ముఖ్యంగా కొందరి ఆడపిల్లల మూలంగా అంటే.. వారి కట్టుబొట్టు తీరుల వలన, మన యువత ఏ దిశగా పయనిస్తూ వుందో తేటతెల్లంగా గోచరిస్తూ వుంది. స్వధర్మాన్ని మరచి పరధర్మాన్ని పాటించడం ఎంత వరకూ న్యాయం..! ఈ తీరు ఇలాగే కొనసాగితే, మన జాతికి ఉన్న ఔన్నత్యం, మన భావి భారతపౌరులు, ముందు తరాలవారు పూర్తిగా మరచిపోతారు.


మనలో ప్రతి ఒక్కరూ తమ సంతతిని పెంచే విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొనవలసిన సమయం ఆసన్నమయింది. పాఠ్యపుస్తకాల్లో మనదేశ మహనీయులు చరిత్ర కనుపించడంలేదు. ఇది యంత్ర యుగం. మనిషి తన సొంత వునికిని, ఈ జాతికి అనాదిగా వున్న ధర్మాలను

మరచి, యంత్రంగా మారిపోకూడదు. ఈ జాతి యొక్క ఔన్నత్యాన్ని, ధర్మ నిరతిని, మనం మన పిల్లలకు నేర్పాలి. వారిని చక్కటి భారత పౌరులుగా తీర్చి దిద్దాలి. పాఠ్యాంశాలూ ఈ ధోరణికి అనుగుణంగా వుండటం ఎంతైనా అవసరం. ఈ.విషయంలో కుమారి అమృతగారు చేసే ప్రయత్నం చాలా గొప్పది. సహృదయులైన పెద్దలందరూ ఆమెను ప్రోత్సహించాలి.


మహాత్మాగాంధీజీ మన జాతిపిత అయితే, శ్రీ స్వామి వివేకానందాజీ మహాభారతగాథలో భీష్ముణ్ణి ఏ రీతిగా పితామహా అని పాండవ కౌరవులు సంభోదించారో, ఆ రీతిగా మనమందరం శ్రీస్వామీజీ వారిని 'హైందవ పితామహా' అని సంభోదించడంలో అతిశయోక్తిలేదు, కాదు అని నా భావన”


ఈ మాటను విన్న అమృత ఆనందంతో చప్పట్లు కొట్టింది. ఆమెను చూచి అందరూ అదే పని చేశారు. వారి కరతాళధ్వనులతో ఆ హాలు మారుమ్రోగింది. అమృత వేగంగా వివేకానందను సమీపించింది. వారి చేతిని తన చేతిలోనికి తీసుకొని ఎంతో ఆనందంగా...

"వెల్ సెడ్ సార్... వెల్ సెడ్..! థ్యాంక్యూ..!" పారవశ్యంతో పలికింది అమృత. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంతో తన స్థానం వైపుకు నడిచింది.


వెళుతున్న అమృతను చూస్తూ.. "థ్యాంక్యూ..!” అన్నాడు వివేకానంద.


తర్వాత సభాముఖంగా.. “నేను చిన్నతనంలో స్వామీజీని గురించి విన్నాను, చదివాను. వారి పూర్తి చరిత్ర నాకు తెలియదు. కుమారి అమృతగారు యిచ్చిన పుస్తకాన్ని చదివిన తర్వాత నేను వారి పరిపూర్ణ జీవనయాత్ర, వారు తెల్లవారికి మన జాతిని గురించి తెలియజేసింది, అంతిమ శ్వాసవరకూ వారు తన జాతి ఉద్ధరణకు పాటుపడిన విశేషాలన్నీ నాకు తెలిశాయి. దేశంలో ప్రతి కార్యాలయంలో వారి ఫోటోను వుంచాలి. ఈ జిల్లాలో ఆ పనిని నేను పూర్తి చేస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు. జైహింద్." వివేక వేదికనుండి క్రిందికి నడిచాడు. అందరి కరతాళధ్వనులు. సభాకార్యక్రమం ముగిసింది.

=================================================================================

ఇంకా ఉంది..

=================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


22 views0 comments
bottom of page