సన్ స్ట్రోక్
- Srinivasarao Jeedigunta
- Mar 26
- 9 min read
#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #సన్, #స్ట్రోక్, #SunSonStroke, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు, #TeluguHeartTouchingStories

Son Stroke - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 26/03/2025
సన్ స్ట్రోక్ - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాజారావు, మహాలక్ష్మి లకు యిద్దరు కొడుకులు. రాజారావు తల్లిదండ్రులు యిచ్చిన యింట్లో వుంటూ ఏలూరు రైస్ మిల్లులో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. మిల్లు యజమాని మంచివాడు కావడంతో ఉద్యోగస్తులు అందరికి జీతంతో పాటు పది కిలోల బియ్యం కూడా యిచ్చేవాడు. తక్కువ జీతం తో రాజారావు తన వృద్ధులు అయినా తల్లిదండ్రులని కూడా తనతోనే ఉంచుకున్నాడు.
మహాలక్ష్మి కూడా సుగుణవతి. అత్తమామలని తన తల్లిదండ్రులుగా చూసుకునేది. దానితో రాజారావు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటో సాయంత్రం యింటి దగ్గర పదిమంది పిల్లలకి లెక్కలు కోచింగ్ యిచ్చేవాడు. కొంతమంది పది పరక యిచ్చే వాళ్ళు. పండగలకు పిల్లలకి బట్టలు కొని, తను తన కజిన్ యిచ్చిన ప్యాంటు షర్ట్స్ సైజు చేయించుకుని వాడుకునే వాడు. మహాలక్ష్మి కూడా అంతే పొదుపుగా సంసారన్ని నడిపేది.
ఆమె తమ్ముళ్లు వేసవికాలంలో తన దగ్గర వుండి, భర్త దగ్గర లెక్కలు నేర్చుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, అక్కా బావలకు బట్టలు పెట్టాలి అనే ఆలోచనే ఉండేది కాదు.
రాజారావు కి బాల్యమిత్రుడు చౌదరి వున్నాడు.
అతను చదువుకునే అప్పుడు రాజారావు చేత తనకి తెలియని సబ్జక్ట్స్ నేర్చుకుని, డబ్బున్న కుటుంబం లో పుట్టడం వలన పెద్దయిన తరువాత అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. రాజారావు ని ఆ రైస్ మిల్లు ఉద్యోగం వదిలి తన ఆఫీసులో ఉద్యోగం చెయ్యమని చాలాసార్లు అడిగినా, రాజారావు యిప్పుడు నువ్వు నేను స్నేహాతులం, నీ దగ్గర ఉద్యోగం చేస్తే మన స్నేహం లో ప్రేమ వుండదు అని ఒప్పుకోకుండా మిల్లులోనే ఉద్యోగం చేసేవాడు.
చౌదరి నెలలో యిరవై రోజులు హైదరాబాద్ లో వుండేవాడు వ్యాపారం కోసం.
రోజులు వేగంగా గడిచిపోయాయి, రాజారావు పెద్దకొడుకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ సంపాదించి ఇంజనీరింగ్ చదవటానికి ప్లాన్ చేసుకుని తండ్రికి చెప్పాడు.
రాజారావు ఒక్కనిమిషం అలోచించి, “అబ్బాయి.. నాకు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేస్తోంది. మనకి ఎందుకు ఇంజనీరింగ్.. డిగ్రీ చదివి ఏదైనా బ్యాంకులో ఉద్యోగం చేసుకొని నాకు సహాయంగా వుండు” అన్నాడు.
“అదేమిటి డాడీ! ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను, నేను ఇంజనీరింగ్ కోర్స్ లో జాయిన్ అవుతాను. నేను ఇంజనీర్ అయితే యిహ మీరు సుఖంగా ఉండచ్చు, ఈ గుమస్తాగిరి మీతోనే ఆఖరు చెయ్యండి” అని గొడవ పెట్టడం తో, “అయితే మన ఊరిలో వున్న ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే, హాస్టల్ ఖర్చులు తప్పుతాయి, యింట్లో తిని కాలేజీకి వెళ్ళవచ్చు. అలా అయితే ప్రయత్నం చేద్దాం. లేదంటే డిగ్రీ లో జాయిన్ కావలిసిందే” అన్నాడు రాజారావు కొడుకుతో.
“ముందు కౌన్సిలింగ్ దాకా రానివ్వరా, మీ నాన్నని ఒప్పిద్దాము” అని కొడుకు కు సద్దిచెప్పింది మహాలక్ష్మి.
కౌన్సిలింగ్ లో తనకి విశాఖపట్నం లోని ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ కోరుకున్నాడు. విషయం తండ్రికి చెప్పిన వెంటనే రాజారావు “నిన్ను బయట ఊరులో హాస్టల్ లో పెట్టి చదివించడం నా వల్ల కాదు, యింకా నీ తమ్ముడి చదువు కూడా చూసుకోవాలి” అని కేకలేశాడు.
సాయంత్రం మహాలక్ష్మి రాజారావు కి స్నాక్స్ పెట్టి, “ఏమండీ! పిల్లాడు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. మంచి కాలేజీలో చదవటం కూడా ముఖ్యం కదా. కొద్దిగా మనం యిబ్బంది పడ్డా వాడు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుని వాడి చదువుకైనా అప్పు వాడే తీర్చుకుంటాడు” అంది.
“పిల్లలు వృద్ధిలోకి రావాలి అని నాకు మాత్రం ఉండదా, అయితే అప్పు చెయ్యడం నాకు యిష్టం లేదు” అన్నాడు.
“మీరు ఏమి అనుకోకపోతే ఒక ఉపాయం చెప్పనా, నేను, పెద్దాడు మా తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఒక రెండు లక్షలు సహాయం చేస్తే, వాడు ఉద్యోగం రాగానే తీరిచ్చి వేస్తాము అని చెప్పి డబ్బులు తీసుకుంటాను” అంది మహాలక్ష్మి.
“ఇన్నాళ్లు మీ తమ్ముడు మనవైపు చూడలేదు, యిప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే యిస్తాడా, నీ ప్రయత్నం నువ్వు చేసి చూడు” అన్నాడు రాజారావు.
భర్త అంగీకారం తెలియచెయ్యడంతో విశాఖపట్నం షిప్ యార్డ్ లో పని చేస్తున్న తమ్ముడు కరుణాకర్ కి ఫోన్ చేసి తాము రేపు గోదావరి ఎక్సప్రెస్ కి బయలుదేరి ఎల్లుండి ఉదయం విశాఖపట్నం వస్తున్నాము అని, నువ్వు స్టేషన్ కి వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పింది.
అక్కగారి మాట విని “అలాగే, మీరు బోగి దగ్గరే వుండండి, నేను వస్తాను” అన్నాడు.
రైలు దిగిన అక్కగారిని, మేనల్లుడు ని తన కారులో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యింటి ముందు దిగుతో యిల్లు పెద్దదే అనుకుంది మహాలక్ష్మి.
లోపలికి వెళ్తోవుండగా మరదలు ఎదురు వచ్చి “రండి వదినా” అంటూ హాల్లో కూర్చోపెట్టి, “అమ్మాయి గిరిజా! అత్తయ్య, మీ బావ వచ్చారు. మంచినీళ్లు తీసుకుని రా” అని పిలిచింది తమ్ముడి భార్య. మంచినీళ్లు తీసుకొని వచ్చిన మేనకోడలు ని అడిగింది మహాలక్ష్మి ‘ఏం చదువుతున్నావు, నేను ఎవ్వరో తెలుసా’ అని.
“ఇంటర్ కి వచ్చాను, నాన్న చెప్పారు అత్తయ్య అని” అంది.
“యిదిగో వీడు మీ బావ నరేష్” అని పరిచయం చేసింది గిరజ కి.
లంచ్ అయిన తరువాత తమ్ముడితో చెప్పింది, నీ మేనల్లుడు ఎంసెట్ లో మంచి ర్యాంక్ సంపాదించి విశాఖపట్నం లోనే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నాడు అంది.
“కంగ్రాట్స్ రా, అయితే నా మేనల్లుడు ఇంజనీర్ అవుతున్నాడు అన్నమాట, చాలా సంతోషం అక్కా” అన్నాడు కరుణాకర్.
“నువ్వు తలచుకుంటే అవుతాడు రా తమ్ముడు, మీ బావగారి విషయం తెలుసుగా నీకు.. చాలిచాలని జీతం. దానికి తోడు ముక్కుషూటి మనిషి. వీడిని వున్న వూరిలో చదువుకోమంటే లేదు విశాఖపట్నం లో మంచి కాలేజీ, అక్కడ చదువుతాను అని పట్టుపట్టాడు. ఫ్రీ సీట్ వచ్చినా హాస్టల్ లో డబ్బు కట్టి చదివిచడం నా వల్ల కాదు అన్నారు మీ బావగారు. అందుకే నీ సహాయం కోసం వచ్చాను. వాడి చదువు కోసం ఒక రెండు లక్షలు అప్పుగా యిస్తే ఉద్యోగం రాగానే మొదట నీ డబ్బులు తిరిగి యిచ్చేస్తాడు” అంది.
గుమ్మం కర్టిన్ వెనుక భార్య పాదాలు చూసి, ‘ఓహో తను మా మాటలు వింటోంది అన్నమాట’ అనుకున్నాడు.
“అక్కయ్య! నేను చేసేది మంచి ఉద్యోగం అయినా ఈ మహానగరం లో ఎంత డబ్బులు వచ్చినా చాలటం లేదు. నాకు యిద్దరు ఆడపిల్లలు, మొదటి పిల్ల గిరిజని కాలేజీ లో చేరిపించాలి, తరువాత పెళ్లి చేసి పంపాలి. అలా అని మేనల్లుడి చదువుని పాడుచేయ్యలేను. అందుకే ఈ విషయం ఆలోచించు, వాడి చదువు పూర్తి అయ్యేంత వరకు ఖర్చు నేను చూసుకుంటాను, వాడికి ఉద్యోగం రాగానే మా గిరిజని పెళ్లిచేసుకోవాలి, అప్పుడు మన యిద్దరి కోరికలు తీరుతాయి” అన్నాడు.
“పెళ్లి అనే పెద్ద నిర్ణయం మీ బావగారిని అడగకుండా తీసుకోలేను రా” అంది మహాలక్ష్మి.
“నాకు చెప్పకుండా మీ తమ్ముడు యింత నిర్ణయం తీసుకున్నప్పుడు మా అన్నయ్య ని అడగకుండా మీరు నిర్ణయం తీసుకోలేరా వదినా” అంది లోపలికి వస్తో తమ్ముడి భార్య.
“అమ్మా, మామయ్య.. నాకు కావలిసింది నేను ఇంజనీర్ అవ్వడం. నాన్న ఒప్పుకుంటారు మీ ప్రొపొసలకి. ఒప్పుకోకపోయినా గిరిజను నాకు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాను, యిదే నా ప్రామిస్” అన్నాడు నరేష్.
కొడుకు మాటలకి విస్తుపోయింది మహాలక్ష్మి. మొత్తానికి నరేష్ చదువు ఖర్చులకి ఆరెంజ్మెంట్ అయింది. అయితే ఎదుగుతున్న ఆడపిల్లలు ఉండటం తో హాస్టల్ లో పెట్టి చదివించాలి అని నిర్ణయం తీసుకున్నాడు కరుణాకర్.
రాజారావు రెండో కొడుకు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు. యిట్టే నాలుగు సంవత్సరాలు అయిపోయాయి. బావమరిది ఎంత డబ్బులు తన కొడుకు చదువు కోసం పెడుతున్నాడో కూడా చెప్పడం లేదు. ‘మీకెందుకు బావగారు, మా అల్లుడి చదువు బాధ్యత నాది’ అనేవాడు ఎప్పుడు అడిగినా.
ఒకరోజు ఉన్నట్టుండి నరేష్ రావటం చూసి, “ఏమిటి రా, యూనివర్సిటీలో స్ట్రైక్ జరుగుతోందా” అన్నాడు.
“లేదు నాన్న. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే వచ్చాను” అన్నాడు.
భోజనాలు అయిన తరువాత తల్లిదండ్రుకి చెప్పాడు, “నేను మామయ్య కూతురిని పెళ్లి చేసుకోను, మా క్లాసుమేట్ ని ఇష్టపడ్డాను, ఆమెకి కూడా నేనంటే యిష్టం” అన్నాడు.
ఆ మాట విని కుర్చీలోనుంచి కోపంగా లేచి, “మరి ఇన్నాళ్లు నీ చదువుకు డబ్బులు ఖర్చు పెట్టి, తన కూతురిని నువ్వు చేసుకుంటావు అనే కదా, యిప్పుడు యిలా మాట్లాడటానికి సిగ్గులేదా” అన్నాడు రాజారావు.
“మీరు ఏమైనా అనుకోండి, మామయ్య ఖర్చు పెట్టిన డబ్బులు ఈ వారం లో నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు తీర్చివేస్తారు. యిహ ఈ విషయం మామయ్య కి మీరు చెప్పినా సరే లేదా నేను చెప్తాను” అనేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు.
“చూసావా నీ కొడుకు స్వార్థం, అసలు యిటువంటి ఒప్పందాలు మంచివి కాదు, అయిదు ఏళ్ళ తరువాత ఏ మార్పు వస్తుందో అని అన్నా ఆనాడు చదువు కోసం స్వంత మామయ్య ని, అమాయకురాలైన గిరిజకు ఆశలు కలిపించి, యిప్పుడు మోసం చెయ్యడానికి రెడీ అయ్యాడు. యిప్పుడు నీ తమ్ముడికి ఏం చెప్పకుంటావో చెప్పుకో” అన్నాడు రాజారావు.
విషయం తెలిసి నానా విధాలుగా శాపాలు పెట్టాడు రాజారావు బావమరిది. కాబోయే కోడలు నరేష్ చదువుకు చేసిన బాకీ మొత్తం ఒక్కసారిగా తీర్చేసింది. మంచి రోజు చూసి నరేష్ కి కాబోయే మామగారి కంపెనీ లో హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంతోపాటు పెళ్లి కూడా వైభవంగా జరిగింది. రాజారావు మాత్రం నిమిత్తంగా వుండి తన బాధ్యత నెరవేర్చాడు.
ఒక ఏడాది తరువాత రాజారావు రిటైర్ అయ్యాడు. రైస్ మిల్లు యజమాని ఒక లక్ష రూపాయలు, ఒక శాలువా కప్పి పంపించాడు.
తను రిటైర్ అవ్వడం చిన్న కొడుకుకు బ్యాంకు ఆఫీసర్ గా హైదరాబాద్ లో ఉద్యోగం రావడం జరిగిపోయాయి..
“నాన్నా! నాకు ఉద్యోగం వచ్చింది అని నీలో ఆనందం కనిపించడం లేదు, బహుశా అన్నయ్యతో కలిగిన అనుభవం వల్ల అనుకుంట, యిదిగో మీకు మాట యిస్తున్నా మీరు చూపించిన అమ్మాయి ని వివాహం చేసుకుంటాను” అన్నాడు తండ్రి దగ్గర కూర్చొని.
“నా భయం నీ పెళ్లిగురించి కాదురా, నువ్వు వెళ్లి హైదరాబాద్ లో మీ అన్నయ్యతో కలిసివుంటావేమో అని” అన్నాడు.
“లేదు నాన్నా, నేను విడిగా యిల్లు తీసుకుంటాను, మీకు ఇష్టమైనప్పుడు రావచ్చు” అన్నాడు.
రెండు వాడు ఉద్యోగం లో చేరి ఏడాది అవుతోంది. విధం తప్పకుండా ప్రతి నెల తండ్రి పేరున అయిదు వేల రూపాయలు పంపిస్తున్నాడు. పెద్దాడు కూడా తల్లి పేరున కొంత డబ్బు పంపుతున్నట్టు తెలిసినా రాజారావు భార్యని అడగలేదు. కోడలు అప్పుడప్పుడు ఫోన్ చేసి అత్తగారితో మామగారితో మాట్లాడుతోంది, కాని ఎప్పుడు తమ యింటికి రమ్మని పిలవదు.
ఒకరోజున కోడలు ఫోన్ చేసి రాజారావు కి చెప్పింది. తనకి వరుసకి చెల్లెలు అయిన అమ్మాయి వుంది అని, ఆమె కూడా బ్యాంకు ఎంప్లొయ్ అని, వాళ్ళ కుటుంబం చాలా మంచిది అని, ఆ అమ్మాయి ని మరిది కి యిచ్చి చేస్తే బాగుంటుంది అని ప్రపోసల్ పెట్టింది.
“మీరు ఒప్పుకుంటే వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని కలుస్తారు” అని అంది.
“నాదేముంది.. నీ మరిది అక్కడే ఉన్నాడుగా. వాడిని అడుగు, వాడికి యిష్టం అయితే మేము సరే అంటాము” అన్నాడు.
పెళ్లి కుదిరింది, పెళ్లి అయిన తరువాత కొడుకులు కోడళ్ళు తో ఏలూరు చేరుకున్నాడు రాజారావు. రెండు రోజుల తరువాత పెద్ద కొడుకు తండ్రి తో అన్నాడు, “నాన్న.. ఎకరం స్థలం లో యింత పెద్ద యింట్లో మీరిద్దరూ ఉండటం కష్టం, అందుకే ఈ యిల్లు అమ్మేసి, రెండు బెడ్ రూమ్ ల యిల్లు అద్దెకు తీసుకొని వుండండి. ఆ డబ్బు తో హైదరాబాద్ లో నేను తమ్ముడు ఫ్లాట్స్ కొనుకుంటాం” అన్నాడు.
“ఈ యిల్లు మా నాన్న అంటే మీ తాతయ్య యిచ్చింది, దీనిని నేను అమ్మను” అన్నాడు రాజారావు.
“తాతయ్య యిచ్చింది కాబట్టే అమ్మమని అంటున్నది. ఈ ఊరిలో యింత యిల్లు అనవసరం. మేము హైదరాబాద్ లోనే సెటిల్ అవుతాము. అందుకే అక్కడ యిల్లు కొనుకుంటాము” అన్నాడు మొండిగా.
“అద్దెకు వుంటే అద్దె డబ్బులు ఎవ్వరు యిస్తారు, నాకు అంత ఓపిక లేదు. అందుకే యిల్లు అమ్మను” అన్నాడు రాజారావు.
“ప్రతీ నెల మీకు నేను తమ్ముడు కలిపి ముప్పై వేలు పంపుతాము, ముందు ఈ యిల్లు అమ్మండి. లేదంటే యిహ మాకు ఈ వూరికి సంబంధం లేనట్టే” అని ఇండైరెక్ట్ గా తండ్రిని బెదిరించాడు. వాదోపవాదాలు అయిన తరువాత యిల్లు అమ్మటానికి అంగీకరించాడు రాజారావు.
యిల్లు అమ్మకం గురించి తన స్నేహితుడు చౌదరి కి చెప్పాడు రాజారావు.
“కొడుకులని నమ్ముకుని నీకంటో యిల్లు లేకుండా చేసుకోవద్దు, నీ తరువాత ఎలాగో వాళ్లే తీసుకుంటారు. అందుకే నువ్వు యిల్లు అమ్మడం నాకు యిష్టం లేదు” అన్నాడు చౌదరి.
“తప్పదు రా, నా పిల్లలు యిల్లు అమ్మి డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే నా మొహం చూడను అంటున్నారు, లాభం లేదు. నువ్వే ఏదైనా బేరం చూడు” అన్నాడు చౌదరి తో.
ఒక నిమిషం అలోచించి “సరే నీ యిష్టం, ఎంతకు అమ్ముతావు” అని అడిగాడు చౌదరి.
“డబ్భై లక్షలు కి అమ్మమని అంటున్నారు, అసలు స్థలం ఖరీదు కోటి రూపాయలు వరకు ఉంటుంది, కాని అమ్మేసి డబ్బులు పట్టుకు పోవాలి అని వాళ్ల ఆత్రం” అన్నాడు రాజారావు.
“మా అమ్మాయి ఎండీ చివరి సంవత్సరం లో వుంది. దాని చదువు అయిన తరువాత ఈ ఊరిలోనే హాస్పిటల్ కట్టి ప్రాక్టీస్ చేయించాలి అనుకుంటున్నాను. ఆ డబ్భై లక్షలు నేను యిచ్చి మీ యిల్లు కొనుక్కుని హాస్పిటల్ కడ్తాను” అన్నాడు చౌదరి.
చౌదరి రెండు చేతులు పట్టుకుని “నువ్వు ఈ కుచేలుడు ని కాపాడటానికి కృష్ణుడు లా వున్నావు, నీకు తప్పకుండా యిల్లు అమ్ముతాను” అని అన్నాడు రాజారావు.
రాజారావు, అతని పిల్లలు కలిసి వెళ్ళి యిల్లు చౌదరి గారి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. యిల్లు అమ్మిన డబ్బులు భార్య మహాలక్ష్మి చేతికి యిచ్చి ‘బీరువా లో పెట్టు’ అన్నాడు రాజారావు.
‘మీ చేత్తో డబ్బులు మా ఇద్దరికి సమానంగా యిచ్చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది నాన్న” అన్నారు ఇద్దరు కొడుకులు.
“ముందు రేపు మీరు మా కోసం అద్దె యిల్లు చూసి, రెంట్ ఆ యజమానికి మీరే పంపించే విధంగా ఒప్పందం చేసుకుని ఈ యింట్లో సామాన్లు తో సహా మమ్మల్ని అక్కడ కి చేర్చండి. అప్పుడు మీరు కోరుకున్నట్టుగా చేస్తాను” అన్నాడు రాజారావు.
మొత్తానికి యిల్లు అమ్మిన డబ్బులు ఇద్దరు కొడుకులు చేరి సగం తీసుకున్నారు. మహాలక్ష్మి కొడుకులని అడిగింది నాకు ఒక అయిదు లక్షలు ఇవ్వండి రా అని.
“అమ్మా! హైదరాబాద్ లో ఈ డబ్బు చాలదు యిల్లు కొనడానికి, అప్పు తీసుకోవాలి, అయినా నీకెందుకు డబ్బు. మీ బాధ్యత మాది, మా డబ్బే మీ డబ్బు” అన్నాడు. యిల్లు ఖాళీ చేసి చౌదరి గారికి అప్పగించేసారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టుగా చౌదరి పాత యిల్లు పడకొట్టి హాస్పిటల్ కట్టడం మొదలుపెట్టాడు.
ఆరునెలలు ప్రశాంతం గా నడిచింది. ప్రతీ నెలా అయిదో తేదీకి కొడుకులు నుంచి చెరో పదివేలు డబ్బు రాజారావు కి అకౌంటికి వచ్చేది యింటి ఖర్చులు కోసం. యింటి అద్దె డైరెక్ట్ గా హౌస్ ఓనర్ కి పంపించే వాళ్ళు.
కొన్నాళ్ళు తరువాత హౌస్ ఓనర్ వచ్చి “రెండు నెలల నుంచి అద్దె పంపడం లేదు, వెంటనే అద్దె డబ్బులు పంపమని మీ పిల్లల కి చెప్పండి, లేదంటే యిల్లు ఖాళీ చెయ్యాలి” అన్నాడు.
రాజారావు కొడుకులకి ఫోన్ చేసి ఆడిగాడు.
“కొత్త ఫ్లాట్ కొనటానికి డబ్బు యిబ్బంది గా వుంది, కొన్ని నెలలు మీకు పంపించే డబ్బులో నుంచి అద్దె ఇవ్వండి. మిగిలినది జాగ్రత్తగా వాడుకోండి” అన్నారు.
యిరవై వేల లో పదివేలు రెంట్ పోతే మిగిలే పదివేలతో ఎలా గడపాలి అని రాజారావు కి దిగులు పట్టుకుంది. విషయం తన స్నేహితుడితో చెప్పుకున్నాడు.
“నేను ముందే చెప్పానుకదరా, నీ చేతిలో వున్నది వదులుకోవద్దు అని, నువ్వు నీ పిల్లలని నమ్మావు. నేను నమ్మలేదు. అందుకే నీ యిల్లు, స్థలం ఖరీదు ఎనభై లక్షలు గా అనుకుని, పదిలక్షలు నీకు ఇవ్వకుండా నువ్వు అడిగిన డబ్భై లక్షలు యిచ్చాను. రేపు పదిలక్షలు నీ అకౌంట్ కి వేస్తాను, ఇప్పటికైనా తెలివితేటలతో వుండు” అని అన్నాడు.
రాత్రి అంతా నిద్ర లేదు రాజారావు కి, యిప్పుడు నేను వున్నప్పుడే కొడుకుల ప్రవర్తన యిలా వుంది, రేపు మహాలక్ష్మి ఒంటరి అయితే తనకి దిక్కు ఎవ్వరు అనుకుని బాధపడ్డాడు. కలత నిద్రపోయి బద్ధకంగా లేచాడు, కాఫీ తాగుతు ఫోన్ లో చౌదరి పది లక్షలు డిపాజిట్ చేసినట్టు మెసేజ్ చూసి, ఈ రోజులలో స్నేహం కి యింత విలువ యిచ్చేవాడు దొరకడం నా అదృష్టం అనుకున్నాడు.
వంట వండుతున్న భార్యతో “యిదిగో, నేను అలా బ్యాంకు దాకా వెళ్ళొస్తాను. పిల్లలతో టచ్ లో వుండు, వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారులే” అని అంటున్న భర్తని చూసి, “వొంట్లో బాగానే వుందా, యిప్పుడు ఈ అప్పగింతలు ఏమిటి, మీరుండగా నాకేమిటి” అంది.
తలుపు దగ్గరగా వేసివెళ్లిన రాజారావు సాయంత్రం కి కూడా తిరిగి రాలేదు. మహాలక్ష్మి కి కంగారు ఎక్కువ అయ్యి, చౌదరి గారికి ఫోన్ చేసింది. ఆయన బ్యాంకు కి వెళ్ళి తెలుసుకుని, ఆ చుట్టుపక్కల వాకబ్ చేసి ఏమైపోయాడా అనుకుంటూ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసాడు. మర్నాడు కూడా రాకపోవడం తో కొడుకులుకు ఫోన్ చేసి చెప్పింది.
యిద్దరు కొడుకులు సాయంత్రం కి వచ్చేసారు. పేపర్ లో వేయించినా ఫలితం లేదు. అసలు నాన్న బ్యాంకు కి ఎందుకు వెళ్ళాడు అని అడిగిన కొడుక్కి అమాయకంగా చౌదరి గారు యిచ్చిన పది లక్షలు గురించి చెప్పింది. ఆ డబ్బులు నా అకౌంట్ లో వేసి యింటికి రాలేదు అంది.
నాలుగు రోజులు తరువాత మహాలక్ష్మి కొడుకులు ఇద్దరు హైదరాబాద్ బయలుదేరుతో, “అమ్మా! నువ్వు కూడా మాతో వచ్చేసేయి, నువ్వు బ్యాంకు కి వెళ్ళి ఖర్చులు కి డబ్బులు తెచ్చుకోలేవు” అన్నారు.
“వద్దు నాయనా, నేను మీ నాన్న లా తెలివితక్కువ దానిని కాను, నేను ఈ డబ్బుల తో నా జీవితం గడపాలని ఆలోచన చేసి తను వెళ్లిపోయారు. మీరు, మేము యిద్దరం బతకటానికి కూడా సహాయం చెయ్యలేకపోతే ఎందుకు రా మీ ఉద్యోగాలు” అంది.
“అయితే నెపం మా మీద వేసావు అన్నమాట. సరే నీ యిష్టం. నీకు వీలున్నప్పుడే రా” అంటూ వెళ్లిపోయారు.
జరిగింది విన్న చౌదరి గారు “అమ్మా! మీరు యింటి అద్దె యిచ్చుకుంటో వుండే దానికంటే, మీ స్థలం లో కట్టిన హాస్పిటల్ భవనంలో మీరు ఉండటానికి రెండు రూములు వేసి యిస్తాను. మీరు అక్కడ ప్రశాంతం గా ఉండవచ్చు. అదృష్టం బాగుండి రాజారావు తిరిగి వస్తే మంచిదే. ఈ విధంగా అయినా నా స్నేహితుడికి సహాయం చేసాను అనే తృప్తి మిగులుతుంది” అన్నాడు.
కడుపున పుట్టిన సంతానం వల్ల అసంతృప్తి కలిగినా దేముడు ఈ విధంగా ఆదుకున్నాడు అనుకుంది.
పిల్లలు మనవాళ్లే, అందరు చెడ్డ వాళ్ళు కాదు అలాగని అందరూ మంచి వాళ్ళు కాదు. వాళ్ల ప్రవర్తన పరిస్థితుల బట్టి ఉండవచ్చు. అందుకే మనకంటో ఒక యిల్లు, డబ్బు చివరి వరకు ఉంచుకుని, తరువాత మనవళ్లకో మనవరాళ్ళకో అందే విధంగా చూసుకుంటే సన్ స్ట్రోక్స్ తప్పించుకోవచ్చు.
రాజారావు తిరిగి రావాలి అని కోరుకుంటూ
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comentários