top of page

వయసులోని మనసు'Vayasuloni Manasu' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 08/04/2024

'వయసులోని మనసు' తెలుగు కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్“ఏమ్మా కల్పన.. కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టు, గోలి వేసుకోవాలి, ”

 లోపలి గదిలో నుండి కోడలిని పిలిచింది లక్ష్మమ్మ. 


 “ అబ్బబ్బా ఏమిటి ములుగుడు ఏదో కొంపలంటుకుపోయినట్లు, తినేంత తినడం, మందులు మింగినవి మింగినట్లే అయినా ఎప్పుడు నసనే, అస్తమానం ఆ మంచంలో పడుకుని పొర్లే బదులు కాస్త గాలి తలిగేలా బయటకు వచ్చి కూర్చోవచ్చు కదా! పడుకోని పడుకోని ఒంటికి పుండ్లు పుట్టేదాక, అబ్బా ఆవిడ గదిలో అడుగుపెట్టాలంటేనే కంపువాసన, ఎన్నాళ్ళో ఏమిటో ఈ కంపు మనుషులను భరించడం, ” రుసరుసలాడుతూ అత్త లక్ష్మమ్మను దుయ్యబడుతూ మంచినీళ్లు తెచ్చి అక్కడపెట్టివెళ్ళింది. 


“ ఏమిటి కల్పన.. ఏమైంది అంత కోపంమీద ఉన్నావు, అమ్మకు అన్నం పెట్టావా.. మందులు వేసుకున్నదా, ” బయటనుండి వస్తూ అడిగాడు కిరణ్. 


“ఆ అబ్బో తల్లిమీద విపరీతమైన ప్రేమ పుట్టుకొస్తుంది, అదే పెళ్ళాం మీద మాత్రం ఉండదు. ఇంటెడు చాకిరి చేసినా పాపమనే నాథుడేలేడు, మీ అమ్మకు అన్నంపెట్టకపోతే ఊరుకుంటుందేమిటి, చెవిలో జొర్రీగలాగా పిలుస్తునే ఉంటుంది. టయానికి అన్ని సమకూర్చాలి, ఏదన్నా లేటు కావచ్చేమోగాని మీ అమ్మకు మాత్రం అన్ని టంచనుగా కావాలసిందే, ఏమిటో వెదవ గోల ఎప్పుడు తప్పుతుందో ఏమిటో, ” అంటూ గయ్యిన లేచింది. 


భార్యమాటలు పూర్తిగా పట్టించుకోకుండానే తల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు కిరణ్. 


“ అమ్మా .. అన్నంతిని మందులువేసుకున్నావా? ఇదిగో నీకిష్టమని ఐస్ క్రీం తెచ్చాను తిను, ” తల్లి చేతిలో పెట్టాడు. 


“ఎందుకు తెచ్చావురా కష్టపడి..  అది చూసిందంటే ఏమంటుందో ఏమో, ” కోడలికి భయపడుతూ చాటుకు పెట్టుకుంటూ అడిగింది. 


“ అది ఏమనుకోలేదు గాని నువ్వు తినేసెయ్యి, కరిగిపోతుంది, ” చెబుతూ వెళ్ళాడు. 


సంతోషంతో ఐస్ క్రీం తింటూ ఆలోచించసాగింది లక్ష్మమ్మ. నాకు ఇంకా అరవై ఎనిమిదేళ్ళే కదా నేను అప్పుడే ముసలిదాన్ని అయిపోయాననుకుంటుంది నా కోడలు. చేతికి పెత్తనం రాగానే అత్తను గదిలో పడెయ్యాలని ఆలోచన. నాకు వయసు వచ్చిందేమోకానీ నా మనసుకు మాత్రం ఇంకా తీరని కోరికలు చాలా ఉన్నాయి. నేను అత్తవారింటికి వచ్చినప్పటినుండి పెద్దవాళ్ళందరికి బండెడు చాకిరి చెయ్యడంతోనే సరిపాయే. 


ఇక పిల్లలు వచ్చేసరికి వాళ్ళను పెంచిపోషించడమే అయింది. భార్య భర్తలన్నాక ఓ సినిమా షికారు పోవాలని ఉంటుంది అది తీరనేలేదు. ఇంతపెద్ద సంసారం ఈదే వరకు ఆయన ముసలాడిలా అయ్యాడు. నేను ముసలిదానిలా కనిపిస్తున్నాను. ఇద్దరాడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి 

పంపేలోపల కిరణ్ కు పెళ్ళి చేసే సమయం వచ్చింది. కోడలురాగానే అత్త అడవి ప్రవేశం కోడలు గృహప్రవేశం అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఇవన్ని చూడలేక హాయిగా వెళ్ళిపోయాడు మహానుభావుడు నన్ను ఒంటరిని చేసి. గతం తలుచుకుంటునే నిద్రలోకి జారిపోయింది. 


“ ఏమిటి లక్ష్మి బట్టలషాపుకు ఒక్కదానివే వచ్చావు, ఏదైనా పండుగకు బట్టలు కొనడానికా లేకపోతే మనవడో మనవరాలు పుట్టిందా, ” అడిగింది లక్ష్మి స్నేహితురాలు అనసూయ. 


“ అవును అనసూయ .. నా కోసమే చీరలు కొందామని వచ్చాను, నాకు ఎప్పటినుండో కలినేత చీర కట్టుకోవాలని ఆశ, అది దొరుకుతుందేమోనని రెండు షాపుల్లో అడిగాను లేదన్నారు, ఇక్కడ ఉంటుందేమోనని వచ్చాను రా చూద్దాం, ” అంది. 


“ అదిగో ఆ చీర ఇవ్వు ఆ ఆ అదే .. చూసావా అనసూయ ఇదే చీర ఎంతబాగుందో చూడు, ”

మురిసిపోతూ ఒంటిమీద వేసుకుని చూసుకుంది. 


“ లక్ష్మి .. చీర తీసుకున్నావు ఇంటికేనా పోయేది, ” అడిగింది అనసూయ. 


“ అప్పుడేనా .. అనసూయ నీకేం పనిలేదు కదా నాతో గాజులషాపుకు రా, ఇంకా చీరకు సరిపడే గాజులు తీసుకుంటాను, తరువాత మనిద్దరం కలిసి సినిమాకు పొయి హోటల్ టిఫిన్ తిని వద్దాము, ఇవన్ని నాకు ఎప్పటినుండో కోరిక ఆయనకు చెబితే ఇప్పుడెందుకు వయసైపోయాక అంటాడు, కనీసం నువ్వన్న నాతోడుగా రావా, ” బతిమాలుతూ అడిగింది. 


పక్కున నవ్వింది అనసూయ. “ అవునుగాని ఈ వయసులో ఇవేం కోరికలు లక్ష్మి, నలుగురు చూస్తే నవ్వుతారు మనని చూసి అయినా ఇంట్లో కమ్మగపుల్లగా వండిపెట్టే కోడలుండగా ఇదేం బుద్ధి అనుకోరు, నాకంటే ఎవ్వరులేని ఒంటరిదానిని, ” అంది విచిత్రంగా చూస్తూ. 


“ పోవే అనసూయ.. ఏం మనకు కోరికలుండవా చెప్పు? మనమేం పాతకాలంలో పుట్టినవాళ్ళం కాదుకదా! పరిస్థితులు అనుకూలంగా లేక అన్నింటికి నోరు కట్టేసుకున్నాము, అవకాశం వచ్చినప్పుడన్నా కోరికను తీర్చుకుంటే తప్పేముంది, ఒంటరిగా వెళుతులేము ఇద్దరం ఒకరికొకరం తోడున్నాము, ” అంది లక్ష్మి. 


తను అనుకున్నవన్ని తీసుకుని షాపునుండి రిక్షాలో ఎక్కి, సినిమా చూసి పక్కనే ఉన్న హోటల్ లో ఆలు కూర్మా పూరి తిని. కమ్మటి కాఫీ తాగి రిక్షా మాట్లాడుకోని తిరుగు ముఖం పట్టారు. 


“ లక్ష్మి.. ఇప్పుడు నీ కోడలు అడిగితే ఏం చెబుతావు ఎక్కడివెళ్ళావు అంటే, పైగా ఈ చీర ఇవన్ని చూస్తే ఏమనదా, ” అనుమానంగా అడిగింది అనసూయ. 


“ అనసూయ .. నా కోడలు పుట్టినింటికి పోయింది ఇప్పుడప్పుడే రాదు, నాకు ఎన్నాళ్ళనుంచో ఉన్న ఈ అవకాశాన్ని జారవిడువదలచుకోలేదు, చూడు అనసూయ..

 

అందరూ మనను ముసలాళ్ళు ఇది మీకెందుకు, ఏదో ముద్ద పెడితే తిని పడుండక అంటుంటారు, పోని కడుపున పుట్టిన ఆడపిల్లలకు చెబితేనన్న అర్ధం చేసుకుంటారంటే, వాళ్ళు ఇదే మాటంటారు నీకెందుకు హాయిగా తిని కూర్చోక అని, మనము ఇన్నాళ్ళు సంసార బాధ్యతలు మోయకుండానే ఇంతవాళ్ళమయ్యామంటావా, ఇప్పుడు ఇంగ్లీషు చదువులొచ్చి మీ కంటే మాకే బాగా తెలుసు అని గొప్పలకు పోతున్నారు కానీ! మనకున్న పరిజ్ఞానం మనకున్న ఆలోచనలు వీళ్ళకుంటాయంటావా? వయసు మీదపడిందే కానీ మనమేం చేతకాని వాళ్ళం కాదు, ఇప్పటికి వందమంది వచ్చిన అవలీలగా వంటచేసే పెట్టగలం, ఇప్పటివాళ్ళు నలుగురు వస్తే తర్జనభర్జన పడుతుంటారు కాదంటావా అనసూయ, ” ఆవేశంతో అడిగింది. 


“ ఏం చేస్తాం లక్ష్మి .. నోరున్నోడిదే రాజ్యం, డబ్బున్న వాళ్ళకే విలువ గౌరవం నేను చూడు ఎవరులేరు దిక్కులేని దాన్ని నన్ను ఎవరన్నా చేరదీస్తున్నారా, శరీరంలో ఓపిక ఉన్నన్నీ రోజులు చాకిరి చేసుకుని బతుకుతాను తరువాత నా గతి ఏమిటో, ” బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంది అనసూయ. 


“ పిచ్చి అనసూయ.. ఒకరకంగా చెప్పాలంటే నువ్వే అదృష్టవంతురాలవేమో, ఎందుకంటే స్వతంత్రంగా ఉంటూ నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు, నేను చూడు పెళ్ళి అయిననాటినుండి నా స్వతంత్రాన్ని కోల్పోయాను, ఎప్పుడూ  పరాధీనమే నా బతుకు.


నాకు ఎన్నో కోరికలుండేవి. ఏవి తీరలేదు అనసూయ, నా మనసెప్పుడు పసిపిల్ల మనస్తత్వంలాగా ఉంటుంది, కాలేజికి వెళ్ళి చదువుకోవాలని, టీచరమ్మా లాగా ఉద్యోగం చెయ్యాలని ఉండేది ఏది అవన్ని తీరకుండానే పెళ్ళిచేసి కూర్చోబెట్టారు, ఇప్పుడవన్నీ అనుకుని లాభంలేదుగానీ చిన్న చిన్నవి కూడా తీర్చుకునే అవకాశం ఇదిగో ఇప్పుడు వచ్చింది, ”


మాటల్లోనే తయారవుతూ అద్దంలో తన రూపాన్ని చూసుకుని మురిసిపోతూ చెప్పింది అనసూయతో. 


అనసూయ లక్ష్మిని ఎగాదిగా చూస్తూ “ లక్ష్మీ చాలా బాగున్నావు ఈ వేషంలో, ఇప్పుడే ఇలా ఉన్నావంటే వయసులో ఇంకా ఎంతంగా ఉండేదానివో, ” నవ్వుతూ చెప్పింది అనసూయ. ఏమనుకున్నావు మరి నేనంటే అన్నట్టుగా చూస్తూ ఆమె నవ్వులో తన శృతి కలిపింది లక్ష్మీ. 


“ అమ్మా.. అమ్మా.. ఏంటమ్మా అంత పగలబడి నవ్వుతున్నావు ఏమైన కల వచ్చిందా, ”


నిద్రలోనే నవ్వుతున్న తల్లిని తట్టిలేపుతూ అడిగాడు కిరణ్. అదిరిపడి లేచి కూర్చుంది లక్ష్మమ్మ. అంటే ఇంతసేపు నేను అనుభవించింది అంతా కలలోనా నిజం కాదా ! ఆశ్చర్యంతో కొడుకువైపు చూసింది. 


“ ఇంకా ఏం పనుంది కనుక తినడం కలలు కనడం, పొద్దస్తామానం పడుకోవడమేనాయే. కలలు రాకపోతే ఏం వస్తాయి మీ అమ్మకు, ” హేళనగా అంది కల్పన. 


“ అబ్బా కల్పన నువ్వు ఆగు నేను అమ్మతో మాట్లాడుతున్నాను కదా!, ” కొంచెం కసిరినట్టు అన్నాడు కిరణ్. 


“ చూడమ్మా .. నువ్వునుకున్నట్టుగా పనిపాటలేక నడుము వాలుస్తున్నాను, నేను ఏదన్నా పని చేస్తానంటే చెయ్యనివ్వవు ఏం చెయ్యమాంటావు చెప్పు, ” అడిగింది కోడలిని. 


“ ఆహా.. మీరు చెయ్యడమూ నేను చెప్పడమూ బాగుంది, మా అమ్మ చూడు మా వదినలకు ఎంతపని చేసిపెడుతుందో, మీరున్నారు తిండి దండుగ వయసు వచ్చిందే కానీ బుద్ధి మారదు, ” అంది కల్పన చేతులు తిప్పుతూ. 


“ కల్పనా .. ఏం మాట్లాడుతున్నావు, ” గట్టిగా పిలిచాడు కిరణ్. 


“ కిరణ్ .. నువ్వాగరా, ఏమ్మా వయసు వయసు అంటూ నా మీద పడుతున్నావు, నీ వయసు వరకు నేను ఇద్దరు పిల్లల పెళ్ళి చేసాను తెలుసా? నీకు నా అంత వయసు వచ్చే వరకు నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చెయ్యలేవు అది తెలుసుకో, నాకు వయసు వచ్చింది నా శరీరానికి గాని నా మనసుకు కాదు అది గుర్తుంచుకో, నాకు ఇంకా కాలుచేతులు సక్రమంగానే పని చేస్తున్నాయి, నువ్వనుకున్నట్టుగా నేనేం తొంబది సంవత్సరాల ముదుసలిని కాదు, నాకు ఇంకా చాలా కోరికలున్నాయి కోడలిగా నువ్వు గృహప్రవేశము చెయ్యగానే నేనో మూలకు కూర్చోవలసిన పనిలేదు, నా స్వతంత్రంగా నేను బతుకగలను. కన్న కొడుకుకు మాట రాకూడదని మీతో ఉంటున్నాను, కిరణ్ ఇక నేను ఈ ఇంట్లో 

ఉండడం కుదరదు. అనసూయమ్మకు ఎవరులేరు. ఆమెతోపాటుగా నేను ఉంటాను, ” అంది బాధనంతా వెళ్ళగక్కుతూ. 

 

కొయ్యబారిపోయి అలానే చూస్తుండిపోయింది కల్పన అత్తగారిని. 


“ కల్పన .. ఏమిటి నువ్వు చేస్తున్నది, మా అమ్మను ఎంత వేదనకు గురిచేసావో చూడు, 


అమ్మా .. నువ్వెక్కడికి వెళ్ళిపోనవసరం లేదు నిన్ను విడిచి నేనుండను, నువ్వంటే ఇష్టంలేని వాళ్ళు వెళ్ళిపోని, ” అంటూ తల్లిని ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు. 


“ అత్తయ్యా.. నన్ను క్షమించండి మీ విషయంలో చాలా తప్పుచేసాను, మీ మనసును అర్థం చేసుకోలేకా మిమ్మల్ని అనరాని మాటలన్నాను, మీ అనుభవం ముందు నాకు తెలిసింది చాలా తక్కువే అయినా మీరంటే చిన్న చూపు చూసాను, నా ఇల్లు నా పెత్తనమే జరగాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మంచానికి పరిమితం చేసాను, వయసుతో నిమిత్తం లేకుండా మంచి మనసున్న మీరు నా వలన చాలా బాధపడినారు, నా పొరపాటును దిద్దుకునే అవకాశం ఇవ్వండి అత్తయ్యా, ” లక్ష్మమ్మ కాళ్ళుపట్టుకుంది

బాధపడుతూ కల్పన. 


“ అయ్యో ఇదేం పని కల్పన లే, ” అంటూ కల్పన రెండుచేతులతో లేవనెత్తింది. 

“ కల్పన .. నువ్వేం పరాయిదానివి కాదమ్మ నువ్వు నా బిడ్డలాంటిదానివే, ” అంది కల్పనను ఓదారుస్తూ. ఇన్ని తప్పులు చేసినా తనను గుండెలో దాచుకున్న అత్తగారినిచూసి ఆనందంతో కాళ్ళకు నమస్కరించి అత్తను మనస్పూర్తిగా కౌగిలించుకుంది కల్పన. కొడుకు కొడలిని చూసి మనసారా నవ్వుకుంది లక్ష్మమ్మ. తనకు వచ్చిన కల తన మనసులో ఉన్నది బయటకు వచ్చింది. కోడలు మారినందుకు మనసులో ఆనందంగా ఉంది. లక్ష్మమ్మకు. 


******* ********** ********** **********


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 


 


116 views1 comment

1 Comment


@swapnaj8931

• 3 days ago

Bagundi attayya katha

Like
bottom of page