top of page
Original.png

విధివ్రాత

#SudhavishwamAkondi, #Vidhivratha, #విధివ్రాత, #సుధావిశ్వంఆకొండి, ##పురాణం, #ఆధ్యాత్మికం, #devotional

ree

Vidhivratha - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 20/04/2025 

విధివ్రాత - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


విధి వ్రాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఈ కథ.. 


ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి, లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు. ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్కనుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్య పడిన దొంగ, అలాగే చూస్తుండగానే కొద్దిదూరం వెళ్లిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. 


అది చూసిన దొంగ తను వచ్చిన విషయం మర్చిపోయి భయంతో, విస్మయంతో అక్కడే నిలబడి చూస్తుంటాడు. ఇంతలో ఆ వైపుగా వచ్చిన ఒక బాటసారుల బృందం అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడన విశ్రమించడానికి సిద్ధపడి, అందరూ కూర్చుంటారు. అలా కూర్చున్న వారు బలమైన ఆ చెట్టు కొమ్మలు పడి అందరూ మరణిస్తారు. 


అటు తర్వాత ఆ చెట్టు ఒక స్త్రీ రూపం ధరించి వెళ్తుండగా చూసిన ఆ దొంగ ఆ స్త్రీ కి దగ్గరగా వెళ్లి.. 

"ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చంపుతున్నావు అందరినీ?" అని అడుగుతాడు. 


ఆవిడ "నేను మృత్యువును. 

ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో, ఆ ప్రకారం వాళ్ళ ప్రాణాలు తీయడం నా కర్తవ్యం. అందుకే ఆ ప్రకారంగా రూపం మార్చుకుంటూ ప్రాణాలు హరిస్తున్నాను" అని వివరిస్తుంది. 


అది విన్న దొంగకు తన మరణం ఎలా, ఎప్పుడో తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది. 


 "అయితే నేను ఎప్పుడు, ఎలా మరణిస్తానో చెప్పమ్మా" అని వేడుకుంటాడు.

 

"నన్ను ఎవ్వరూ చూడలేరు. ఏదో పుణ్య విశేషం వల్ల నన్ను నువ్వు చూడగలిగావు. కాని అలా చెప్పడం కుదరదు" అన్న మృత్యువుతో


 "ఆ పుణ్య విశేషాన్ని అడ్డుపెట్టి నా మృత్యువు ఎప్పుడు చెప్పమ్మా" అని ప్రాధేయపడతాడు. 


 "సరే! ఇంతగా ప్రాధేయ పడుతున్నావు కనుక చెబుతాను. నీకు ఇంకా సమయం ఉంది. ఆ లోపు మంచి పనులు చేసి బ్రతుకుతూ నీ జన్మ సార్ధకం చేసుకో. ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు" అని హితవు పలికి, 


సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరం, ఫలానా సమయానికి ఏనుగు చేత తొక్కబడి మరణిస్తావు అని చెబుతుంది. 


అది విన్న దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకుని తన ప్రాంతానికి బయలుదేరుతాడు. 


అప్పట్నుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి పనులు చేస్తూ, అందరికి సాయపడుతూ జీవిస్తుంటాడు. 


నేను దొంగగా ఉంటే రాజ భటులకు దొరికి రాజదండనకు గురి కావొచ్చు కదా! ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను మృత్యువు నుండి తప్పించుకోగలిగాను అనుకుంటాడు. 


కానీ.. 


 అనుకోని విధంగా ఇంకెవరో చేసిన దొంగతనానికి ఈ దొంగ పాత నేరస్థుడు అయిన కారణంగా ఇతన్ని అనుమానించి, తీస్కెళ్ళి రాజు ముందు నిలబెడతారు. 


 "నేను ఏ దొంగతనం చేయలేదు. నేను మంచిగా మారాను మహారాజా! మంచి జీవితం గడుపుతున్నాను" అంటాడు. కానీ.. 

ఆ రాజుగారు వినకుండా, 

"ఇంతకుముందు చేసేవాడివే కదా! ఇప్పుడు మారావని నమ్మకం లేదు" అని ఇతన్ని ఏనుగులతో తొక్కించి చంపండి అని ఆజ్ఞాపిస్తాడు. 


మృత్యువు చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది. ఇక లాభం లేదని రాజుగారు విధించిన శిక్ష అమలు చేయడానికి తీసుకెళ్తున్న ఆ భటులతో ఇలా వేడుకుంటాడు.. 


"నన్ను ఇంకేరకంగా అయినా చంపండి. కానీ ఏనుగు ద్వారా మాత్రం వద్దు. ఇది నా చివరి కోరిక. చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కదా" అని అంటాడు. 


"అలా రాజాజ్ఞ ధిక్కరించలేము. రాజుగారు ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే అమలు చేయాలి మేము" అంటారు వాళ్ళు. 


దొంగ ఎంతో బ్రతిమిలాడిన తరువాత.. 


"కానీ చివరి కోరికగా అడుగుతున్నావు. కనుక ఒక పని చేస్తాం. కనీసం మొదటగా ఒక ఏనుగు బొమ్మ చేత నిన్ను తొక్కించి, ఆ తర్వాత నీ ఇష్టమైనట్టు చంపుతాం అప్పుడు మాకు రాజాజ్ఞ ధిక్కరించినట్టు అవ్వదు, నీ చివరి కోరికా తీర్చినట్టు అవుతుంది. ఏమంటావ్" అంటారు. 


సరే బొమ్మే కదా అనుకుంటాడు. 

అందుకని ఒప్పుకుంటాడు దొంగ. 


 కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైన ఏనుగుగా మారి తొక్కి, ఆ దొంగను చంపేస్తుంది. అలా విధి నిర్ణయించినట్లుగా, నియమిత సమయానికి దొంగ మరణిస్తాడు


అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడవద్దు. జరిగేది ఎలా అయినా జరుగుతుంది అంటారు పెద్దలు. అలాగని మొండిగా ఇష్టంవచ్చినట్టుగా చేయకూడదు. 


మృత్యువు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. కనుకనే ఉన్న జీవితాన్ని మంచి పనులతో, పరోపకారబుద్ధి తో, ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకుండా గడుపుతూ జన్మ ను సార్ధక్యము చేసుకోవాలి.. 


చిన్నప్పుడు మా అమ్మ ద్వారా విన్న కథ


సుధావిశ్వం


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page