top of page

ఆ నలుగురు మిత్రులు

#TVLGayathri, #TVLగాయత్రి, #AaNaluguruMithrulu, #ఆనలుగురుమిత్రులు, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Aa Naluguru Mithrulu - New Telugu Story Written By - T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 14/04/2025

ఆ నలుగురు మిత్రులు - తెలుగు కథ

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అదొక పేరున్న ఐఐటి కోచింగ్ సెంటర్. 


 జూనియర్ ఇంటర్మీడియట్ లో చేరుతున్నారు పిల్లలు. 

హాస్టలులో చేరే పిల్లలతో కోలాహలంగా ఉంది ఆ ప్రాంతం. చాలామంది తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నారు. అక్కడే ఒక మూలగా కొడుకుతో నిల్చుని ఉంది నర్మద. బట్టల సూటుకేసు, రోజువారీ సామాన్లు, పుస్తకాలు రూములో సర్ది వచ్చాడు భార్గవ. 


"జాగ్రత్తగా ఉండు! వారం వారం వస్తాను! నేను మీకు చెప్పక్కర్లేదనుకో!అయినా నా ఆరాటం!.. " అంటూ ఉంటేనే నర్మదకు దుఃఖం వచ్చింది. 


"జాగ్రత్తగా ఉంటానమ్మా! దిగులుపడకు! చెల్లాయిని చూసుకో!"తల్లి బుజం చుట్టూ చేయి వేశాడు పదహారేళ్ళ భార్గవ. 


కన్నీళ్లు తుడుచుకొంది నర్మద. 


"నీతో పాటు రూములో ఎవరెవరున్నారో? నేను వెళ్లి నీ మేనేజరుతోమాట్లాడి క్యాంటిన్ నుండి నీకు పళ్ళు, కూరలు వచ్చే ఏర్పాటు చూస్తాను!" అంటూ నర్మద హాస్థలు మేనేజరుతో మాట్లాడి, ప్రతిరోజూ భార్గవకు పళ్ళు, కూరగాయలు ఇవ్వమని దానికి అదనంగా డబ్బు కడతానని చెప్పింది. ఆమె చెప్పిన దానికి ఒప్పుకున్నాడు మేనేజరు. 

తల్లిని పంపించి తనకు కేటాయించిన రూముకు వచ్చాడు భార్గవ. 


రూముమేట్సుగా వికాస్, ప్రశాంత్, నీలేష్ కనిపించారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. నలుగురూ ఒకే రూములో ఉండాలి. రెండేళ్లు కష్టపడి చదివి ఐఐటీలో సీటు సంపాదించుకోవాలని పిల్లలందరికీ ఆరాటం!


బ్యాగులో నుండి కురుకురే ప్యాకెట్స్ తీసాడు వికాస్. అతడు తనవయసు కంటే కొంచెం లావుగా ఉన్నాడు. 


"మీరు కూడా తీసుకోండి!"అంటూ ఫ్రెండ్సుకు కురుకురే ప్యాకెట్స్ ఇచ్చాడు. 


"నాకు వద్దు!సారీ!" అంటూ భార్గవ మాత్రం వద్దన్నాడు. మిగిలిన ఇద్దరూ కురుకురే ప్యాకెట్స్ తీసుకున్నారు. 


కాసేపటికి భోజనాలకు రమ్మని హాస్థలు క్యాంటిన్ నుండి పిలుపు వచ్చింది. 


కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు, ఒక చిన్న ముక్క స్వీటు, నాలుగు పనస తొనలు. ఇదీ మేనూ. 


"అబ్బా! భోజనం చెత్తగా ఉంది! రెండేళ్లు ఎలా గడపాలో!” అన్నాడు వికారంగా మొహం పెట్టి ప్రశాంత్. 


"ఏం చేస్తాం!మన ఖర్మ! ఇక్కడ అమ్మచేతి వంటలాగా ఎలా ఉంటుంది?" విసుక్కున్నాడు నీలేష్. 


 భార్గవ మాత్రం మాట్లాడకుండా అన్నం తింటున్నాడు. 


రూముకు రాంగానే ప్రశాంత్ బ్యాగులోంచి చిప్స్ ప్యాకెట్స్ తీశాడు. 


అప్పుడు కూడా భార్గవ వాటిని వద్దంటూ" నా బాస్కెటులో అరటిపళ్ళు, జామపళ్ళు ఉన్నాయి. మీరు కూడా తినండి!" అంటూ పళ్ళు తెచ్చి ముందు పెట్టాడు. 


"అబ్బా! పళ్ళా! బోరు నువ్వు తిను! మేము ఈ చిప్స్ లాగించేస్తాము!" అన్నాడు ప్రశాంత్. అతడికి కళ్ళజోడు ఉంది. 


నీలేష్ బ్యాగులోనుంచి టాబ్లెట్ తీసికొని వేసుకున్నాడు. 


"దేనికి నీలేష్ మందు వేసుకుంటున్నావు?" అడిగాడు భార్గవ. 


"నాకు ఈ మధ్యే షుగర్ వచ్చింది. అందుకని రోజూ అన్నం తిన్నాక ఒక టాబ్లెట్ వేసుకోవాలి" అన్నాడు నీలేష్. 


ఆ రోజు మిత్రులంతా మాట్లాడుకుంటూ గడిపారు. రెండోరోజు నుండి క్లాసులు, కోచింగులు. హాస్టల్ నుండి కాలేజీకి వెళ్తుంటే కొద్దిగా ఆయాసపడుతున్నాడు వికాస్. 


వీళ్ళుచేరి పదిహేనురోజులయింది. హాస్థలులో భోజనం బాగాలేదని ఒక్క భార్గవ తప్ప మిగిలిన మిత్రులు ముగ్గురూ జంకుఫుడ్డుతో కడుపు నింపుకుంటున్నారు. భార్గవ కోరిక మేరకు క్యాంటిన్ మేనేజరు భార్గవకు టమేటోలు, కీరాదోసకాయలు, క్యారెట్లు, పళ్ళు తెచ్చి పెడుతున్నాడు. 


భార్గవ వాళ్ళ అమ్మగారు రెండుసార్లు వచ్చి సున్నుండలు, నువ్వుండలు ఇచ్చివెళ్ళింది. భార్గవ పొద్దున్నే కాసేపు యోగా చేస్తాడు. సాయంత్రం కాలేజీ గ్రౌండులో ఆటలాడుకొని వస్తాడు. సెల్లుఫోన్లతో ఆడుకునే మిగిలిన ముగ్గురు స్నేహితులకు భార్గవ అలవాట్లు కొంచెం చిత్రంగా అనిపించాయి. 


*** **** **** **** **** **** ****


ఒకరోజు మధ్యాహ్నం వికాస్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. హాస్టల్ వార్డెన్ డాక్టర్ని పిలిపించింది. గ్యాసుట్రబుల్ అని, కాస్త పత్యంగా తినాలని చెప్పి మందులు ఇచ్చాడు డాక్టర్. ఆ సాయంత్రం క్లాసు నుండి వచ్చారు మిగిలిన ఫ్రెండ్స్. వికాసుకు కీరాదోసకాయముక్కలు కోసి ఇచ్చాడు భార్గవ. 


"తగ్గేదాకా ఇవే తినాలి!” నీరసంగా అన్నాడు వికాస్. 


"తగ్గాక కూడా ఇలాంటివి తింటే మంచిది!" అన్నాడు నవ్వుతూ భార్గవ. 


"నా కళ్ళజోడు మార్పించుకోవాలి! కొంచెం కళ్ళు స్ట్రైన్ అవుతున్నాయి అనిపిస్తోంది!" చెప్పాడు ప్రశాంత్. 


"రోగాలు రాకుండా ఉండాలంటే కాస్త ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే చాలు! డాక్టర్ అవసరం ఉండదు!" అన్నాడు భార్గవ. 


"ఇక్కడ ఏం తిని బ్రతుకుతున్నాము? చెత్తకూర!.. చెత్తపప్పు!.. ఇంతకంటే పశువులు తినే గడ్డి మేలు!.." విసుగ్గా పలికింది వికాస్ గొంతు. 


"కానీ మనం ఇక్కడ రెండేళ్లు ఉండాలి.. ఎప్పుడూ జంకుఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుంది" స్థిరంగా చెప్పాడు భార్గవ. 


"ఇంకేం తినాలో చెప్పు!" ప్రశాంత్ హేళనగా అడిగాడు. 


"పండ్లు, కూరగాయలు, పాలులాంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి!.." భార్గవ మాట పూర్తికాకుండానే 


"అబ్బా బోరు! ఇంకేమన్నా చెప్పు!" నీలేష్ ఖయ్యిమన్నాడు. 


"సరియైన ఆహారం టైముకు తినకపోవటంవలన మా నాన్నగారు రెండేళ్ల క్రితం పోయారు.." గంభీరంగా చెప్పాడు భార్గవ. 


 నిర్ఘాంతపోయారు మిత్రులు. వెంటనే భార్గవ దగ్గరికి వచ్చారు. అతడి భుజం పట్టుకొన్నాడు ప్రశాంత్


"ఏమైంది భార్గవ?మీ నాన్నగారు లేరా?" ప్రశాంత్ గొంతు కీచుమంది. 


 "అవును. మా నాన్నగారిది స్టీలు బిజినెస్. అప్పుడప్పుడూ క్యాంపులకు వెళ్తూ ఉండేవారు. ఒక వేళ ఊర్లోనే ఉన్నాకూడా వేళపట్టున భోజనం చెయ్యటానికి కుదిరేదికాదు. ఏదో జంకుఫుడ్డుతో కడుపునింపుకోవటం.. సరియైన నిద్రకూడా ఉండదు.. దానికి తోడు స్మోకింగ్ హాబిట్ కూడా ఉంది. దాంతో మా నాన్నగారికి ముప్ఫయేళ్లకే ఊబకాయం వచ్చింది. దానితోబాటే షుగరు, బీపి కూడా తగులుకున్నాయి. రెండేళ్ల క్రితం గుండెపోటుతో నాన్నగారు మరణించారు. అమ్మ ఉద్యోగం చేస్తోంది.. నేను, చెల్లి.. మాకు జంకుఫుడ్డు తినాలంటే చాలా భయం!.. "


భార్గవ కళ్లనుండి జలజలా నీళ్లు కారుతున్నాయి. 


వింటున్న మిత్రులు ముగ్గురూ మౌనంగా అయిపోయారు. 


"అందుకే మా అమ్మ జంకుఫుడ్డు తినటం వలన వచ్చేనష్టాల గురించి ప్రచారం చేస్తూ ఉంటుంది. పత్రికలకు ఆర్టికల్స్ కూడా వ్రాస్తూ ఉంటుంది." కళ్ళనీళ్లు తుడుచుకొన్నాడు భార్గవ. 


"భార్గవా!ఈ రోజు నుండి నేను నీ మాటే వింటానురా!" భార్గవ చెయ్యిపట్టుకొన్నాడు వికాస్. 


మిగిలిన ఇద్దరు మిత్రులు కూడా భార్గవ చేతిలో చెయ్యివేశారు. 


సంవత్సరం గడిచింది. 


నలుగురు మిత్రులూ జూనియర్ ఇంటర్ పూర్తిచేశారు. వికాస్ సన్నగా అయ్యాడు. ఇప్పుడు రోజుకు నాలుగుకిలోమీటర్ల దాకా పరిగెత్తగలుగుతున్నాడు. ప్రశాంతు కళ్లు పరీక్ష చేసి పవర్ తగ్గించి వేరే కళ్జోడు ఇచ్చాడు కళ్ళ డాక్టర్. నీలేషుకు ఎప్పుడూ షుగర్ నార్మల్ గా ఉంటోంది. ఇప్పుడు ఆ నలుగురు మిత్రులు హుషారుగా సీనియర్ ఇంటర్ చదువుకొంటున్నారు. 

(సమాప్తం )


 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments


bottom of page