అభినేత్రి
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jan 24
- 5 min read
#Abhinethri, #అభినేత్రి, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Abhinethri - New Telugu Story Written By Kandarpa Murthy Published In manatelugukathalu.com On 24/01/2025
అభినేత్రి - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
విశాఖ జిల్లా ఏజెన్సీ అరకు పరిసర ప్రాంతం అది. చుట్టు కొండలు కోనలు, గిరిజన గూడేలు, పచ్చని పొలాలు, ప్రకృతి సిద్ధ బొర్రా గుహలు, చాపరాయి జలపాతాలు, అనంతగిరి కాఫీతోటలు, గిరిజన మ్యూజియం వంటి అనేక ఆకర్షణ ప్రదేశాలతో సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి.
వేసంగి శలవులైనందున దూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిష్టులతో కాటేజీలు, హోటళ్లు నిండిపోయాయి. వాహనదారులకు, చిరువ్యాపారులకు గిరాకీ బాగా ఉంది. అక్కడి గిరిజనులకు ఆదాయం వచ్చే సమయమిదే.
చిరు వ్యాపారులు తమ సరుకులు అమ్ముకుంటు సందడిగా తిరుగుతున్నారు. సినేమా షూటింగులకు అనువైన వాతావరణం ఉండటం వల్ల కొందరు సినేమా ప్రొడక్షన్ వారు లొకేషన్స్ కోసం చూసుకుంటున్నారు. హైదరాబాదు నుంచి సినేమా షూటింగ్ కోసం డైరెక్టర్ మధు, టెక్నికల్ బృందం వైజాగ్ లో బసచేసి షూటింగ్ స్పాట్ లు చూసుకుంటున్నారు.
కథ గిరిజన సాంప్రదాయ యువతికి సంబంధించింది కనుక అరకు వేలీ పరిసరాలు అన్ని విధాల అనువుగా ఉంటాయని సినేమా షూటింగ్ ఇక్కడ చెయ్యాలనుకున్నారు.
కెమేరా, మేకప్, డేన్స్ మిగతా టీమ్ తో సన్నద్దమై వచ్చాడు. హీరోయిన్ చెల్లెలి పాత్ర మీద ముఖ్యమైన సన్నివేశాలు కొన్ని గిరిజన గూడెంలో నృత్యాలు చిత్రీకరించడానికి స్క్రిప్ట్ తయారుచేసారు. అనుకోకుండా రెండవ హీరోయిన్ పాత్ర వేస్తున్న అమ్మాయి తల్లికి ఆరోగ్యం విషమించి హాస్పిటల్లో ఎడ్మిట్ చేసినందున తల్లిని చూసి తిన్నగా షూటింగ్ స్పాట్ కి వచ్చేస్తాననడంతో ముందుగా డైరెక్టర్ మధు, షూటింగ్ టీమ్ బయలుదేరి అరకు చేరుకున్నారు.
షూటింగ్ టీమ్ కి భోజన ఏర్పాట్లు చూడటానికి తిరుగుతున్న
ప్రొడక్షన్ మేనేజర్ కి బజారులో గిరిజన యువతి మంగ ఎదురు పడి పూసలదండలు కొనమని వేడుకుంటోంది.
ఆ గిరిజన అమ్మాయి నిగారింపు అందం, నిగ నిగలాడే బారెడు జడ, మిల మిల మెరిసే తేనె కళ్లు, చిరునవ్వు మొహం, కోల ముక్కుకి మెరిసె ముక్కు పుడక చూసి ఆశ్చర్యపోయాడు ప్రొడక్షన్ మేనేజరు.
తమ సినెమా షూటింగులలో ఎందరో యువతులు మేకప్ వేస్తేనే కాని కెమేరా ముందు అందంగా కనసడరు కాని ఈ కొండ పడుచు ఎటువంటి మేకప్ అవసరం లేకుండానే ఎంతో ఆకర్షణగా కనబడుతోందని మనసులో అనుకున్నాడు.
మర్నాడు సినిమా డైరెక్టరు మధు షూటింగ్ స్పాటులో ఆందోళనగా తిరుగుతున్నాడు. సెకెంటు హీరోయిన్ పాత్ర ధారి సమయానికి షూటింగ్ కి చేరుకోలేదు. వాతావరణం షూటింగుకి అనుకూలంగా ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తయి కీలక సన్నివేశం చిత్రీకరించవల్సి ఉంది. సమయం దాటితే
వాతావరణం అనుకూలించక ఆర్థికంగా నష్టపోవల్సి ఉంటుంది.
హీరోయిన్ సోదరి పాత్ర చేస్తున్న అమ్మాయి తల్లికి ఆరోగ్యం బాగులేదని తెల్సి అర్జంటుగా ఊరికి వెళ్లి తిరిగి రాలేదు.
డైరెక్టరు మధు కంగారు పడుతున్నాడు. తనకిది డైరెక్టర్ గా తొలి చిత్రం. ఇది సక్సెస్ అయితే మంచి పేరొస్తుంది.
డైరెక్టరు ఆందోళన గమనించిన ప్రొడక్షన్ మేనేజరు తను బజారులో చూసిన గిరిజన యువతి ప్రస్తావన తేగా వెంటనే ఆ యువతి వివరాలు తెలుసుకుని తల్లికి తండ్రికి విషయం తెలియచెప్పి ఆమెని షూటింగ్ స్పాటుకి రప్పించి మేకప్ వేసి స్క్రీన్ టెస్టు చెయ్యగా హీరోయిన్ తో పోలికలు కలిసి చెల్లెలి పాత్రకి సరిపోయింది.
మంగ టూరిజం డిపార్ట్మెంటు సాంస్కృతిక కార్యక్రమాల్లో గిరిజన థింసా నృత్యం చెయ్యడం, రోజూ టీ వీ లో వచ్చే డ్యాన్సు ప్రోగ్రాములు అనుకరించడం వల్ల డైరెక్టరు చెప్పిన విధంగా డైలాగులు పలకడం, కెమేరా ముందు భయం
లేకుండా నటించగలుగుతోంది.
ముందు డమ్మీ పాత్రలో మంగ చేత నటింప చేయాలని నిర్ణయించి షూటింగు జరిపారు. డైరెక్టరు మధు ఊహించిన దాని కంటే మంగ నటించిన సన్నివేశాలు బాగా వచ్చాయి.
హీరోయిన్ చెల్లెలి పాత్ర కోసం తీసుకున్న సెకండ్ హీరోయిన్ అమ్మాయి తల్లి ఆరోగ్యం బాగులేదని తెలిసి హైదరాబాదు చేరుకున్న తర్వాత ఆవిడ హాస్పిటల్లో చనిపోవడంతో తిరిగి షూటింగ్ కి రాలేకపోయింది.
డైరెక్టరు మధు స్క్రీన్ ప్లే ప్రకారం మిగతా మూడు రోజుల షూటింగు సన్నివేశాలు మంగను పెట్టి పూర్తిచేసారు.
యూనిట్ సభ్యులందరు మంగ యాక్షన్ సన్నివేశాలతో సంతృప్తి వ్యక్తం చేసారు. కెమేరా ముందు కొత్త అమ్మాయైనా బెదురు లేకుండా డైరెక్టరు చెప్పినట్టు నటించింది మంగ.
పిక్చరు షూటింగు ఎలా పూర్తవుతుందా అని ఆందోళన పడుతున్న సమయంలో వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు మంగ కనబడటం, అనుకున్న షెడ్యూల్ ప్రకారం అరకులో షూటింగ్ పూర్తవడం డైరెక్టరు.. మధుకి మనశ్శాంతినిచ్చింది.
యూనిట్ సబ్యులందరికీ ఘనంగా పార్టీ ఇచ్చాడు మధు. మంగకి అనుకోకుండా సినిమా షూటింగులో పాల్గొని నటించడం త్రిల్ అనిపించింది. మంగ తండ్రి సోములు, కూతుర్ని షూటింగుకి పంపి తనకి ఆర్థికనష్టం లేకుండా చేసినందుకు కృతజ్ఞతగా డైరెక్టరు మధు కొంత డబ్బు
అందచేసాడు.
అంతంత మాత్రంగా పూసలదండలు అమ్ముడై రోజులు గడిచే తనకు కూతురి మూలంగా అనుకోని డబ్బు చేతికి రావడంతో సంబర పడిపోయాడు సోములు.
సినిమాలో ఇంకా మంగ చేత కొన్ని సన్నివేశాలు స్టూడియోలో చిత్రీకరించవల్సి ఉందని అప్పుడు మంగ హైదరాబాదు రావల్సి ఉంటుందని సోములుకి చెప్పి డైరెక్టర్ మధు తన యూనిట్ బృందంతో సంతృప్తిగా తిరుగు ప్రయాణమయాడు.
సోములు - దేవుడమ్మ కాకుండా గూడెంలో అందరూ మంగకు సినేమా చాన్సు రావడం చూసి ఆనందపడ్డారు.
అనుకున్న సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత మంగ అమ్మా నాన్నలతో హైదరాబాదు చేరింది. ఫిల్మ్ నగర్లో గెస్టుహౌసులో ఉండటానికి ఏర్పాటు చేసారు.
రోజూ మంగకి డ్యాన్సు క్లాసులు, వస్త్ర ధారణ, నటనలో మెలకువలు, డైలాగ్ డెలివరి, ఇంగ్లీష్ హిందీ భాషల స్పీకింగ్ క్లాసులు మొదలయాయి. డైరెక్టర్ మధు, మంగ పేరును మీనాక్షిగా నామకరణం చేసాడు. మెల్ల మెల్లగా వ్యక్తిత్వం, సిటీ జీవితం అలవాటైంది. గిరిజన యువతిగా కొండల్లో పెరిగిన మీనాక్షిలో మోడరన్ సిటీ లైఫ్ స్టైల్ ప్రారంభమైంది.
వేషం, భాష నడక అన్నిటిలో మార్పు వచ్చింది. కారు డ్రైవింగు నేర్చుకుని ఖరీదైన కారు కొంది. సినిమాలతో పాటు టి. వి. సీరియల్స్, వ్యాపార ప్రకటనలతో బిజీ అయిపోయింది.
క్రమేపీ సినీ జీవితానికి అలవాటు పడింది. అరకు కొండల్లో చిన్న తాటిపాక ఇంట్లో సినిమా, టి. వి. కార్యక్రమాలు
చూసే గిరిజన యువతి మంగకు అదృష్టం తిరిగి సినిమా నటిగా మారి సమాజంలో డబ్బు హోదా సంపాదించగలిగింది.
నిరక్షరాస్యులు, అమాయకులైన అమ్మా నాన్నలు కూడా గిరిజనగూడెం నుంచి వచ్చి బయటి ప్రపంచం చూడగలుగుతున్నారు. వారిద్దరిలో కూడా ఆధునిక పోకడలు వచ్చాయి.
గూడెం సోములు సోమ్ గాను, దేవుడమ్మ దేవిగా పేర్లు మారిపోయాయి. మొదటిసారి అరకు వ్యాలీలో షూటింగ్ జరిగిన "మన్యంలో మాణిక్యం " సినిమాలో నటించిన పాత్రకు నూతన నటిగా ప్రశంసలందుకున్న మీనాక్షి అనతి కాలంలోనే మరిన్ని సినిమా, టీ. వీ. లలో నటిస్తూ బిజీ స్టారయిపోయింది. ఖరీదైన కారు, విలాసవంతమైన బంగళా,
ప్రముఖ సినీ నటిగా సమాజంలో పేరు సంపాదించుకుంది.
మధు డైరెక్టర్ గా తను నిర్మించిన తన జీవిత కథ ఆధారంగా పూర్తిగా అరకు పరిసర గిరిజన గూడెంలో షూటింగ్ జరిపిన "మోనాలిస" సినిమా బ్రహ్మాండంగా ప్రదర్సింపబడి ఆర్థికంగా లాభాలు తెచ్చి పెట్టింది. తను పుట్టి పెరిగిన గిరిజన గూడేన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకుంది మీనాక్షి.
గిరిజన బాలికల విద్య, ఆరోగ్యం, వయోవృద్దులకు వైద్య సౌకర్యాలు, రోడ్లు ఏర్పాటు చేసింది. మా గూడెం మంగ ఎంతగా ఎదిగిపోయిందోననీ మురిసిపోయారు
గిరిజన అమాయక జనం.
తన జీవిత గమనాన్నే మార్చేసిన సినిమా డైరెక్టర్ మధుని పెళ్లి చేసుకుని అభినేత్రిగా జీవితంలో స్థిరపడింది మంగ ఉరఫ్ మీనాక్షి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
new concept story. Excellent.
కె. విశ్వనాథ దర్శకత్వం సినిమా "సీతా మా లక్ష్మి" గుర్తుకు తెచ్చింది. తాళ్లూరి రామేశ్వరి మొదటి సినిమా అది. ఆమె చచ్చినట్టు సృష్టించి సినిమా రంగం వదులుకొని ... తన ప్రియుడు, పల్లె వాసి అయిన కొండయ్య (చంద్ర మోహన్) వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది.
పి.వి. పద్మావతి మధు నివ్రితి