#AgniSikha, #అగ్నిశిఖ, #Gorthi VaniSrinivas, #గొర్తి వాణిశ్రీనివాస్, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Agni Sikha - New Telugu Story Written By Gorthi VaniSrinivas
Published In manatelugukathalu.com On 11/03/2025
అగ్ని శిఖ - తెలుగు కథ
రచన: గొర్తి వాణిశ్రీనివాస్
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రామనాథం, భార్య చనిపోయాక మళ్ళీ పెళ్ళికి ఆసక్తి కనబరచలేదు. తన కూతుర్ని తను తప్ప ఎవరూ సరిగా చూడరు అని బలంగా నమ్మాడు.
ఆడపిల్లల పెంపకం అనుకున్నంత తేలిక కాదని కూతురు రాధిక రజస్వల అయ్యాకగానీ తెలీలేదు.
“అమ్మలూ, నీకు తల్లైనా తండ్రైనా నేనేరా. నీకేం కావాలన్నా మొహమాటపడకుండా నన్నడుగు. నీ వ్యక్తిగత విషయం అడగాలనుకున్నప్పుడు మీ అమ్మ చీర తెచ్చి నాకివ్వు. అప్పుడు మీ అమ్మలానే ఆలోచిస్తాను” చెప్పిన తండ్రి ప్రేమకు రాధిక కన్నీటి పర్యంతమైంది.
రాధిక పదవతరగతి చదువుతున్నప్పుడు ఆమె మామ్మ కూడా కన్నుమూయడంతో రామనాథం ఇంటి విషయాలూ, ఉద్యోగ నిర్వహణ సమన్వయ పరిచుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
“నాన్నా! మా స్కూల్ లో కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్చార్జి గిరిజ మేడం వున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఆవిడకి నేను బాగా తెలుసు. ఈమధ్యే భర్త పోయాడు. పాప, బాబుతో ఎంతో కష్టపడుతోంది పాపం. ఆవిడ్ని నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకీ ఆసరా దొరుకుతుంది. నాకూ అమ్మ దొరుకుతుంది”. జాలిగా చెబుతున్న కూతుర్ని చూస్తూ,
“బుజ్జమ్మా, పరాయి వ్యక్తి నీకు అమ్మ కాగలదా? ఆమె బిడ్డలకు నేను తండ్రి కాగలనా? పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు తల్లీ. ఇంకెప్పుడూ ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు” అని చెప్పాడు.
రాధిక మొహం చిన్నబుచ్చుకుంది. రెండు రోజులు అన్నం తినకుండా అలిగి కూర్చుంది. బంధువులు కూడా రామనాథాన్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేసారు. అయిష్టంగా పెళ్లికి ఒప్పుకున్నాడు రామనాథం.
“మీరంతగా చెప్తున్నారు కాబట్టి సరే అంటున్నాను. నాదొక కండిషన్. ఈ ఇంట్లో నా కూతురు ఎప్పటికీ మహారాణిలా వుండాలి. ఈ ఇంటి హక్కులన్నీ నా కూతురువే. ఆమె చెప్పినట్టే నడవాలి. అందుకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటాను” అని పెద్దలందరి సమక్షంలో చెప్పాడు. గిరిజ అందుకు ఒప్పుకోవడంతో గుళ్ళో దండల మార్చుకుని దంపతులయ్యారు.
రామనాథం మనసులో ఆమె తన కూతుర్ని పట్టించుకోదేమో అనే భయం వుంది. గిరిజ రామనాధాన్ని తన పిల్లలతో నాన్నా అని పిలిపించింది. రాధిక గిరజను అమ్మా అని పిలుస్తూ స్నేహంగా వుంటోంది. రామనాథం మనసులో ఇంకా శంకలు మిగిలిన్నాయి.
గిరిజ ఇప్పుడు వున్నట్టు చివరిదాకా వుంటుందా? ఏ తల్లికైనా ఒక్క రవ్వైనా తన కడుపున పుట్టిన పిల్లల పట్ల స్వార్థం వుంటుంది. బయట పిల్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందా? అనే అనుమానాలు రామనాధాన్ని వదలకుండా వెంటాడాయి.
ఓరోజురాత్రి గాలివాన ఉదృతంగా వచ్చింది. గిరిజ పిల్లలిద్దర్నీ దగ్గరకు తీసుకుని పడుకుంది. తన కూతురు రాధికను గిరిజ పట్టించుకోలేదని మధనపడ్డాడు రామనాథం. గిరిజ ఈ ఇంటిని ఆక్రమించింది. తన కూతుర్ని నిర్లక్ష్యం చేస్తోంది. తను కోరుకున్నదొకటి జరుగుతున్నదొకటి. గిరిజకు ఆశ్రయం దొరికింది. తన బిడ్డకు ఆశ్రయం పోయింది. పెళ్లి చేసుకుని తప్పు చేసానేమో, అని లోలోపల కుమిలిపోయాడు రామనాథం.
ఏర్పరుచుకున్న అభిప్రాయాలు మార్చుకోవడం అంత సులువు కాదు. పరిస్థితులను కూడా అదే దృష్టితో చూడడం మొదలుపెట్టాడు.
రామనాథం ప్రతి విషయంలో గిరిజ, ఆమె పిల్లలు తన కూతుర్ని ఎలా చూస్తున్నారనే పరిశీలన ఎక్కువైంది. పిల్లలు ఆటల్లో రాధికను వెనకనించి కొట్టారు. అతని మనసు తల్లడిల్లిపోయింది.
ఇది ఆరంభం మాత్రమే. ముందుముందు ఇంకెంత భయంకరంగా ఉండబోతోందని అతని మనసు చేసే హెచ్చరికలు అతన్ని బలహీనుడ్ని చేశాయి.
మానసిక చింతలు, శారీరక రుగ్మతగా ప్రతిఫలించాయి. మనిషి క్షీణించి మంచం పట్టాడు.
ఆరాత్రి గిరిజ, పిల్లలు, రాధిక అతని మంచం చుట్టూ కూర్చున్నారు. “నిన్ను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నేను తట్టుకోలేనమ్మా. ఆ వర్షం కురిసిన రాత్రి నిన్ను పట్టించుకోకుండా పిల్లల్ని దగ్గర పెట్టుకుని పడుకుంది. నీ మనసు ఎంత బాధ పడి వుంటుందో నేను ఊహించగలను” చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు రామనాథం.
“లేదు నాన్నా. పిల్లలు నిద్రపోయాక అమ్మా, నేనూ కలిసి నా గదిలోనే పడుకున్నాం. అది నువ్వు చూళ్లేదా?” అని చెప్పిన రాధిక వంక, గిరిజ వంక చూస్తూ “మీరిద్దరూ ఎప్పటికీ కలిసి వుండాలని నాకోరిక”అని చెప్పి కన్నుమూసిన ఆ రాత్రి వాళ్ళ జీవితాల్లో చీకటి నింపిన రాత్రి.
ఇక వాళ్ళ ఒంటరి ప్రయాణం మొదలైంది.
“సొంత ఇల్లు వుంది కాబట్టి తిన్నా తినకపోయినా గుట్టుగా బతుకుతున్నాం. రోజూ గడవాలంటే నేను ఉద్యోగం చెయ్యాలి. మీ ముగ్గుర్నీ నేనే పోషిస్తాను. నీ చదువు ఆగకుండా చూస్తాను. మీ నాన్న ఆఖరి కోరిక నెరవేరుస్తాను” చెప్పి తిరిగి ఉద్యోగంలో చేరింది గిరిజ.
రాధిక ఒక ఏడాది ఇంజనీరింగ్ పూర్తయింది. మరుసటి ఏడాదిలో చేరబోతుండగా గిరిజ పనిచేస్తున్న కెమిస్ట్రీ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగి, అక్కడున్న కొంతమందితో పాటు గిరిజకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు షుగర్ వుండటంతో చాలా కాలం గాయాలు తగ్గలేదు. రాధిక చదువు ఆపేసింది. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంది.
“రాధికా! నావల్ల నీకు ఉపయోగం లేకపోగా నేనూ నా పిల్లలు నీకు భారంగా తయారయ్యాం. ఎందుకిలా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడో” అని బాధపడింది గిరిజ.
“మనం కలిసిన ఉద్దేశ్యాలు నెరవేరేదాకా ఈ పోరాటం తప్పదమ్మా! నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తాను. నువ్వేం బాధపడకు.” అని గిరిజను ఓదార్చింది.
రాధిక ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాక సమాజమంటే ఏవిటో తెలిసింది. ప్రతిచోటా కాంపిటేషన్ పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు ముందుకు దూసుకెళ్ళేందుకు చేసే ప్రయత్నంలో అర్ధబలం వున్న వాళ్ళది పైచేయి. రన్నింగ్ రేస్ లో పాల్గొనక తప్పని విషమ పరిస్థితుల్లో ఎంత పరిగెత్తినా అలుపు తప్ప మంచి మలుపు దొరకని పరిస్థితి.
అతికష్టం మీద రాధికకి ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిదొరికింది.
ఆ ప్రెస్ యజమాని భార్య ఒక సీరియల్ రాసింది. ముందుగా కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసి పంపింది. అవి అచ్చయ్యాక తర్వాత ఏం రాయాలని ఆలోచిస్తూ రాధికను సలహా అడిగింది. సీరియల్ మలుపులకు సంబంధించి, తన జీవితాన్నే కాస్త మార్చి పది ఎపిసోడ్స్ కి సరిపడా కంటెంట్ చెప్పింది రాధిక. ఆవిడ దాన్ని రాసి తన పత్రికలోనే అచ్చు వేయించింది.
కొన్ని పత్రికలు ఆమెను దుయ్యబట్టాయి. ‘ఇతరుల ఐడియాలు తీసుకుని కాపీ కథలు రాస్తున్న ఒక పత్రిక యాజమానురాలు.’ అని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విషయం రాధికే బయట చెప్పి తమ పరువు తీసిందనే కోపంతో ఆమెను ఉద్యోగంలోంచి తీసేసారు. నిజానికి పత్రిక యజమాని జీతం పెంచట్లేదని కోపంగా వున్న ఒక స్టాఫ్ మెంబర్ చేసిన పనికి రాధిక బలయ్యింది.
మళ్ళీ ఉద్యోగాల కోసం తిరగడం మొదలుపెట్టింది. ఒక ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం వుందని తెలిసి వెళ్ళింది. వాళ్ళు చాలా సేపు కూర్చోబెట్టిన తర్వాత పిలిచి ఇంటర్వూ చేసారు.
బయటకు వచ్చేసరికి రాత్రి తొమ్మిదైంది. త్వరత్వరగా నడుస్తూ ఇంటికి వస్తున్న ఆమెను ఇద్దరు యువకులు వెంబడించారు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో చూసుకోకుండా పక్కనే వున్న నీటి గుంటలో పడబోయింది. చటుక్కున ఆమె చేతిని పట్టుకుని ఆపింది ఒక చెయ్యి. ఆ హఠాత్పరిణామానికి విస్తుపోయి చూసింది రాధిక. పొడుగ్గా వున్న ఒక వ్యక్తి ఆమెను సరిగా నిలబెడుతూ “వందనా..పద ఇంటికెళదాం” అని భుజం మీద చేయి వేసి కబుర్లు చెబుతూ అక్కడ్నించి తీసుకెళ్లాడు.
ఆమె బొమ్మలా అతని అడుగులో అడుగు వేసింది. వాళ్ళిద్దర్నీ అలా చూసిన ఆకతాయిలు ఎటో వెళ్ళిపోయారు.
కొద్ది దూరం వెళ్ళాక ఆమె చేతిని వదిలి “క్షమించండి. వాళ్ళు మిమ్మల్ని అల్లరి పెడుతుంటే తెలిసిన వాడిలా మీ భుజం మీద చెయ్యి వేసాను. పదండి మీ ఇంట్లో దిగబెడతాను” అన్నాడు.
అతని తోడుతో ఇంటికి చేరుకుంది.
“మీ సహాయానికి థాంక్స్. మీ పేరు?”అని అడిగింది.
“వంశీ. మీ పేరు?” అడిగాడు అతను.
“వందన” అని చెప్పింది నవ్వుతూ.
అతను “ఆ పేరుతోనే మీ నెంబర్ నా ఫోన్ లో ఫీడ్ చేసుకుంటాను” అన్నాడు.
వాళ్లిద్దరి పరిచయం స్నేహంగా మారింది. వంశీ స్నేహితుడి సహాయంతో రాధికకు ఒక ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పించాడు. ఆర్థికంగా కాస్త ఊరట దొరికింది. అప్పటివరకూ ఒడిదుడుకులు పడుతున్న వాళ్ళ జీవితాల్లో కాస్త ప్రశాంతత వచ్చింది. కాలం వేగంగా గడిచిపోయింది.
రాధిక తమ్ముడు చెల్లెలు పెద్ద చదువులకి వచ్చారు. “పిల్లల్ని ఏదన్నా ఉద్యోగం చూసుకోమని చెబుతాను. ఇక నువ్వు పెళ్లి చేసుకుని స్థిరపడు రాధికా” చెప్పింది గిరిజ.
“లేదమ్మా, వాళ్లకు మనం ఇచ్చే ఆస్థి ఒక్క చదువే. నాలా చిన్న ఉద్యోగాలు చేస్తూ అవమానాలు పడకూడదు. ఇంకా కొన్నాళ్ళు కష్టపడితే వాళ్ళ చదువులు పూర్తవుతాయి. వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడతారు” చెప్పింది రాధిక.
ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేని గిరిజ ఏదైనా వంటల యూట్యూబ్ ప్రారంభించాలని అనుకుంది. కానీ ‘కాలిపోయిన మచ్చలున్న చేతులతో వంట చేసి చూపిస్తే చూసేవాళ్ళకి బాగుండదేమో’ అంది.
“అమ్మా, రాత్రి ఆఫీస్ నుంచి రాగానే రెసిపీ నేనే తయారు చేస్తాను. నీ గొంతు బాగుంటుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి యూ ట్యూబ్ లో అప్లోడ్ చెయ్యి” అని సలహా ఇచ్చింది రాధిక.
అలా గిరిజ కూడా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టింది. పిల్లలిద్దరి చదువులూ పూర్తయ్యాయి. ఇద్దరికీ క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగాలు వచ్చాయి.
“అక్కా, మన కష్టాలు తీరిపోయినట్టే. మేం తొలి జీతం అందుకోగానే నువ్వు ఉద్యోగం మానేయాలి. సరేనా!” పిల్లలు భరోసా ఇస్తుంటే రాధికలో సంతోషం ఉవ్వెత్తున ఎగసింది. పిల్లల్ని ఆనందంగా దగ్గరకి తీసుకుంది.
ఒకరోజు రాధిక ఆఫీస్ లో అకౌంట్ సెక్షన్ లో దొంగతనం జరిగింది. స్టాఫ్ అందర్నీ నిలబెట్టి ప్రశ్నించింది ప్రొప్రైటర్ దేవయాని. ఎన్నో ఏళ్లుగా అక్కడ మ్యానేజర్ గా పనిచేస్తున్న రఘునందన్ రాధిక తీసుంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.
“ఆమే తీసిందనటానికి ఆధారం మీ దగ్గర వుందా” అనడిగింది ప్రొప్రైటర్ దేవయాని.
“రాధిక అకౌంట్ సెక్షన్ కి వెళ్ళటం నేను చూశాను. పేదరికం ఆమెతో పని చేయించింది.” అని దృఢంగా చెప్పడంతో దేవయాని సీ సీ కెమరా పరిశీలించింది. అందులో రాధిక వెళ్లినట్టు కనిపించింది. నీ సమాధానం ఏంటని గద్దించింది దేవయాని.
“మేడం. నేనాడబ్బు తియ్యలేదు. పేదదాన్నయి వుండొచ్చు. కానీ కష్టపడి పనిచేస్తాను తప్ప తప్పుడు పనులు చేయను మేడం. నన్ను నమ్మండి. నిరూపించుకునే ఒక్క అవకాశం నాకివ్వండి” అని రిక్వెస్ట్ చేసింది.
ఆల్ రైట్ అని అవకాశం ఇచ్చింది దేవయాని. రాధిక సీ సీ కెమరా పరిశీలించింది.
“మేడం, అటు చూడండి. నేను వేసుకున్న చుడిదార్ లాంటిదే ఆ వ్యక్తి వేసుకుని లోపలికి ప్రవేశించారు. అయితే షూస్ మార్చుకుని సాండిల్స్ వేసుకోవడం మర్చిపోయారు. చూడండి” అని జూమ్ చేసి చూపించింది. పైన చుడిదార్, కింద మగవాళ్ళ షూస్.
“మై గాడ్. ఎవరో కావాలనే చేసారు. హు ఈజ్ ద కల్ప్రిట్. పోలీసులకు ఫోన్ చేయండి” అని దేవయాని తనదైన పద్ధతిలో బెదిరించేసరికి,
రఘునందన్ ముందుకొచ్చి “ పిల్ల పెళ్లి కుదిరింది. డబ్బులు చాలక నేనే ఆ పని చేశా”నని ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడు. పోలీసుల్ని పిలవద్దని కాళ్లా వేళ్లా పడ్డాడు.
“నువ్వు డబ్బు తీశావన్న బాధకన్నా ఒక ఆడపిల్లమీద తేలిగ్గా నింద వేసావని కోపంగా వుంది. ఆడపిల్లలను ఎన్ని రకాలుగా వేధిస్తారయ్యా! ఎంత జాగ్రత్తగా వున్నాఅడుగడుగునా అవమానాలు, నిందలు మోయాల్సి వస్తుంటే ఇక ఆడవాళ్ళు ఎలా బతగ్గలరు.
కూతురి పెళ్లి అన్నావు కాబట్టి వదిలేస్తున్నా. నిన్ను ఈ పోస్ట్ లోంచి తీసేసి రాధికను నియమిస్తున్నాను. ” అప్పటికప్పుడు
ఆర్డర్స్ రెడీ చేయించింది దేవయాని.
“మిస్ రాధికా, నీ నిజాయితీని నిరూపించుకున్నావు. నిన్ను అనుమానించి తప్పుచేసాను. సారీ” అంది రాధికకు ఆర్డర్ పేపర్ అందిస్తూ.
“నాకొక అవకాశం ఇచ్చిన మీ ఔదార్యం గొప్పది మేడం. నన్ను నమ్మి ఇస్తున్న ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని నన్ను ఆశీర్వదించండి ”అంది వినయంగా.
తనకు అప్పజెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూ కంపెనీకి లాభాలు చూపించింది.
స్నేహితుడు వంశీతో తన సంతోషాన్ని పంచుకుంది. ఆమె తెలివికి, మార్కెటింగ్ టెక్నిక్స్ చూసి ఆశ్చర్యపోయింది దేవయాని.
రాడిసన్ బ్లూ హోటల్ లో సెలబ్రేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. స్టాఫ్ తో పాటు చాలా మంది వచ్చారు. దేవయాని మైక్ అందుకుని మాట్లాడుతూ,
“ఈ చల్లని సాయంత్రం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ బిగ్ థాంక్స్. ఆడవాళ్లలో క్రియేటివిటీ దాగివుంటుంది. సరైన వేదిక దొరికితే అద్భుతాలు సృష్టిస్తారు. అందుకు ఉదాహరణ మా మేనేజర్ రాధిక.
ఆమె ఎన్నో ఇబ్బందులను అధిగమించి కష్టపడి పైకి వచ్చింది.
తనను తను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఒక్కో మెట్టూ ఎదుగుతూ కంపెనీని పైకి తీసుకురావడంలో భాగస్వామి అయ్యింది. ప్రతియేటా కంపెనీ తరపున మా ఉద్యోగులకు ఇచ్చే ‘కృషీ వాన్’ అవార్డు రాధిక సొంతం చేసుకుంది” అని అనౌన్స్ చేయగానే ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.
ఆ అవార్డు గురించి ముందుగా తెలియని రాధిక సంభ్రమాశ్చర్యాలలో తేలుతూ దేవయాని చేతులమీదుగా సంతోషంగా అవార్డు అందుకుంది.
“ఇంకొక గుడ్ న్యూస్ కూడా వుంది. అదేంటంటే నా ఒక్కగానొక్క కొడుకు మోహన్ కి సరిజోడుగా రాధికను ఎంపిక చేశాను. ఆమెకు కూడా ఇష్టమైతే వాళ్ళిద్దరికీ ఇప్పుడే ఎంగేజ్ మెంట్ ఇక్కడే జరిపిస్తాను” అని ప్రకటించగానే రాధిక ఖిన్నురాలైంది.
దేవయాని దగ్గరకొచ్చి “మేడం, నన్ను క్షమించండి. నేను ఎంతో కాలంగా ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను” అని చెప్పింది వినమ్రంగా.
“అవునా, నాకు తెలియక ఎనౌన్స్ చేశాను. అతను ఇక్కడ వుంటే రమ్మను. మీ ఇద్దరి గురించీ ఎనౌన్స్ చేస్తాను” అంది దేవయాని.
థాంక్స్ మేడం అని దూరంగా కూర్చున్న వంశీని పిలిచి దేవయానికి చూపించింది. అతన్ని చూసి
దేవయాని తెరలు తెరలుగా వస్తున్న నవ్వాపుకుంటూ.
“త్వరలో జరగబోతున్న నా కొడుకు వంశీ మోహన్, రాధికల నిశ్చితార్ధానికి మీరంతా తప్పక రావాలి” అని ప్రకటించగానే రాధిక ఆశ్చర్యంగా వంశీ వంక చూసింది.
“మా అమ్మ” అంటూ తల్లి భుజాలపై వాలాడు వంశీ. అతనివంక కోపంగా చూసింది రాధిక.
“సారీ రాధికా, ఈవిడ కొడుకునని చెప్పకపోవడం తప్పే. కానీ ఒక ఎరువుల కంపెనీలో సామాన్య ఉద్యోగిగా నన్ను ఇష్టపడ్డావు నువ్వు. ఆ కంపెనీ నాదని చెప్పకపోవడంలో నాకు సంతోషం వుంది. నన్ను నన్నుగా ఇష్టపడే మనిషి నాకు దొరికింది. నీ చక్కటి స్నేహంలో నన్ను నేను తెలుసుకోగలిగాను. అంచెలంచెలుగా ఎదుగుతున్న నిన్ను చూసి గర్వపడుతూ నీకు వూతకర్రని అవ్వాలనుకున్నాను. ” అన్నాడు తన చెవులు పట్టుకుని మన్నింపు కోరుతూ.
రాధికను మాట్లాడమని మైక్ ఇచ్చింది దేవయాని.
రాధిక గట్టిగా ఊపిరిపీల్చుకుంది. మాట్లాదమన్నట్టు సైగ చేశాడు వంశీ.
“ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులను సహజం. వాటిని అధిగమిస్తూ ముందుకు పోవడానికి ఆత్మవిశ్వాసం కావాలి. మన శక్తిని మనం తెలుసుకుని, నిరంతరం ఉత్తేజంతో పనిచేసుకుపోవడం, మనం చేసే పనిలో నిజాయితీగా వుండటం. ఇవే మూలమంత్రాలు. మేడం గారిలాంటి
మంచివాళ్ళు, వంశీగారిలాంటి మానవత్వమున్న అరుదైన వ్యక్తుల అభిమానం పొందగలిగిన నేను అదృష్టవంతురాల్ని. ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా సంతోషించేవారు. మా నాన్నగారి పేరుమీద ఒక సేవా ట్రస్ట్ నడపాలనుకుంటున్నాను. అందుకు మేడం, వంశీగార్ల సహకారం కావాలని కోరుకుంటున్నాను” చెప్పగానే అందరూ చప్పట్లుకొట్టారు.
రాధిక మంచి ఆలోచనలకు వంశీ, దేవయాని అభినందించారు. చిన్నప్పట్నుంచీ రాధిక పట్టుదలను చూస్తున్న గిరిజ, ‘ఆడపిల్లంటే ఇలా వుండాలి. కష్టాలకు భయపడి పారిపోకుండా ధైర్యంగా నిలబడి ముగ్గురు జీవితాలకి ఆలంబన అయింది. ఆమె ఎందరో ఆడవాళ్ళకి ఆదర్శ ప్రాయురాలు. భవిష్యత్తులో స్త్రీ మానసిక వికాసానికి కూడా తనవంతు కృషి చేస్తుంది.’ అనుకుంటూ అభినందించేందుకు ఆమె దగ్గరకు వచ్చింది.
రాధిక తల్లిని సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ నమస్కరించింది. వంశీ పక్కన గర్వంగా నిలబడిన రాధికను ఆశీర్వదిస్తున్న గిరిజకు, ఆమె ఎన్ని సవాళ్లు వచ్చినా నిలిచి జ్వలించే ఆత్మవిశ్వాపు అగ్ని శిఖలా కనిపించింది.
-----సమాప్తం ----
గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
నా పేరు గొర్తివాణి
మావారు గొర్తి శ్రీనివాస్
మాది విశాఖపట్నం
నాకు ఇద్దరు పిల్లలు
కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది
అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
రచనల మీద ఎంతో మక్కువతో
కవితలు, కథలు రాస్తున్నాను.
విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,
ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు
ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.
మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ
గొర్తివాణిశ్రీనివాస్
విశాఖపట్నం
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

@vijayasaikolachana1978
• 12 minutes ago
కథ చాలా బావుంది వాణి గారు,ఈనాటి సామాజిక పరిస్థితులు,పరిష్కారాలు, ఒక స్త్రీ అగ్నిపరీక్ష లా ఎదురయ్యే పరిస్థితులను ఎంత చక్కగా అధిగమించిందీ చక్కగా వివరించి మలచిన బావుంది హృదయపూర్వక అభినందనలు వాణి గారుకథనం హృద్యంగంగా చదివి వినిపించిన మల్లవరపు సీతారాం కుమార్ గారికిహృదయపూర్వక అభినందనలు
@vanigorthy6887
• 2 hours ago
అగ్నిశిఖ' కధ 'అనేక మలుపులతో, చక్కని ముగి౦పుతో చాలాబాగు౦దిమహిళాసాధికారిత ఇతివృత్తము తో కధరాసిన మీకు అభిన౦దనలు..... V.gangaraju....vizag.
@challach5716
• 11 hours ago
ఆడది అబల కాదు సబలఅని రాధిక పాత్ర ద్వారా చాలా చక్కగా నిరూపించారు వాణీ గారుచక్కని కథ కు మధుర మైన కంఠం తో ప్రాణం పోచారు సీతారాం గారుఇరువురికి అభినందనలు
@VijayaMavuru
• 51 minutes ago
చక్కటి కథను అందించారు. అభినందనలు వాణీ గారు
@ratnakumariboyanapally4233
• 11 hours ago
తండ్రీ కూతురి అనుబంధం అద్భుతః . చాలా మంచి కథ.ప్రతి ఆడపిల్ల రాదికని చూ సి నేర్చుకోవాలి. చక్కటి కథని అందించారు వాణిగారూ...అభినందనలు