గజరాజు మనోధైర్యం
- Kandarpa Venkata Sathyanarayana Murthy

- Mar 11, 2025
- 4 min read
#Gajaraju Manodhairyam, #గజరాజు మనోధైర్యం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Gajaraju Manodhairyam - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 11/03/2025
గజరాజు మనోధైర్యం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
దండకారణ్యంలో మృగరాజు కోపంతో చిందులేస్తున్నాడు. సింహగర్జనతో అడవంతా దద్దరిల్లుతోంది. చిన్నా పెద్దా జంతువులన్నీ ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నాయి.
ఇంతలో మృగరాజు సలహాదారు జిత్తులమారి నక్క ప్రతి ప్రాంతానికెళ్లి వనంలోని జంతువులన్నీ మృగరాజు గుహ ముందు హాజరు కావాలని ఆజ్ఞను తెలియజేసింది.
మాయలమారి నక్క సింహరాజు వెంట తిరుగుతూ వేటాడి తినగా మిగిలిన మాంసంతో కడుపు నింపుకుని గూఢచారిగా ఉంటూ అడవిలో ఏ మూల ఏం జరిగినా మృగరాజు చెవిన వేస్తుంది.
మృగరాజు ఆజ్ఞ విన్న అడవి జంతువులన్నీ గుహ ముందు భయపడుతూ కొలువుతీరాయి.
సింహరాజు ఠీవిగా చెట్టు కింద కూర్చున్నాడు. పక్కన సలహాదారు నక్క వినయంగా నిలబడింది.
జంతువులను మాంసాహారులు శాకాహారులను వేరు వేరు వరుసలుగా నిలబడమని ఆజ్ఞాపించాడు మృగరాజు.
ఏనుగులు జింకలు జిరాఫీలు కోతులు జీబ్రాలు కుందేళ్లు వంటి శాకాహారులు ఒక వరుసలో, పులులు చిరుతలు తోడేళ్లు ఎలుగుబంట్లు వంటి మాంసాహారులు మరో వరుసలో బిక్కుబిక్కుమంటూ భయపడుతూ నిలబడ్డాయి.
సింహరాజు గట్టిగా గర్జిస్తూ " ఈ మద్యకాలంలో నా నివాసానికి ఆహారం సక్రమంగా చేరడంలేదని యువసింహరాజు ఫిర్యాదు చేస్తున్నాడు. నేనంటే మీకు భయం లేకుండా ఉంది. నాకు కోపం వచ్చిందంటే మిమ్మల్నందర్నీ ఈ అడవిలో బంధించి నిప్పు పెట్టి దగ్ధం చెయ్యగలను, జాగ్రత్త! వినయంగా ఉండండి. నా సలహాదారు నక్క ఎలా చెబితే అలా నడుచుకుని యువరాజు ఏది కోరితే అది గుహకు పంపండి.
ముఖ్యంగా మిమ్మల్నందర్నీ ఇక్కడ సమావేశ పర్చింది ఎందుకంటే కొద్ది రోజుల్లో యువరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరప దలిచాము. ఆరోజు ప్రతి జంతు సముదాయం నుంచి ఒక ప్రత్యేక కానుక యువరాజుకి చేరాలి.
ఇప్పటి వరకూ మాంసాహారుల నుంచే మాకు ఎక్కువగా ఆహారం వస్తూ ఉంది. ఈ సారి శాకాహారుల నుంచి ఆహారం కావాలని యువరాజు ముచ్చట పడుతున్నాడు. కాబట్టి ఈమధ్యనే గజరాజు ఇంట పుట్టిన బుల్లి ఏనుగు పిల్లను జన్మదిన కానుకగా యువరాజు వద్దకు పంపవల్సిందిగా ఆజ్ఞను జారీ చేస్తున్నాను.
మా సలహాదారు నక్కను ఆ ఏర్పాట్లు చూడవల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఇక మీరందరూ వెళ్లవచ్చు" అన్నాడు కటువుగా మృగరాజు.
గుహ వద్ద నుంచి తన నివాసానికి తిరిగి వచ్చిన గజరాజుకు దిగులు పట్టుకుంది. లేక లేక పుట్టిన ఒక్కగానొక్క బుల్లి ఏనుగును యువరాజు సింహానికి కానుకగా ఎలా పంపడం, దాని బుడుబుడి నడకలు, ఆటలతో సందడిగా ఉంటోంది. ఏం చెయ్యడమని తర్జనబర్జన పడుతోంది. మృగరాజును
ఎదిరించి ఈ అడవిలో బతకడం కష్టం అని మదనపడుతోంది.
దగ్గరలో చెట్టు మీదున్న ఎర్రకోతి, ఏనుగు దిగులుగా ఉండటం గమనించింది. మృగరాజు బుల్లి ఏనుగును యువరాజు జన్మదిన కానుకగా పంపమని ఆజ్ఞాపించడం తెలుసుకుంది. సింహరాజు మీద తన పగ తీర్చుకోడానికి ఇదే సమయమనుకుంది. ఎందుకంటే తన ముద్దుల కోతి కూనను ఆ యువసింహం ఇలాగే తన గుహలో ఆటలాడి పొట్టన పెట్టుకుంది.
గజరాజుకు సహాయపడాలనుకుని దగ్గరికెళ్లి దైర్యం చెబుతూ, "గజరాజా! ఎందుకు దిగులు ? ఇంత భారీ శరీరమున్న మీరు, ఇందులో సగం శరీరం కూడా లేని ఆ సింహరాజుకి భయపడటమా" అంది.
ఆ దైర్య వచనాలు విన్న ఏనుగు " నా భారీ శరీరం వల్లే ఇబ్బంది అవుతోంది మిత్రమా ! తొందరగా పరుగెత్త లేను, వెనక్కి తిరగలేను. అదీగాక మృగరాజుకున్న వాడి పంజా గోళ్లు, పదునైన కోరదంతాలు నాకు లేవుగా! అందుకే అది గబుక్కున ఎగిరి నా కుంభస్తం మీద కాలిపంజాతో కొట్టి పడగొడుతుంది. వెనక నుంచి దెబ్బ తీస్తుంది. అదీ నా భయం, మరి ఎలా ఎదురించాలి?" తన అశక్తతను వివరించాడు గజరాజు.
గజరాజు సమస్యను విన్న వానరం, "విచారించకు నేస్తమా! నేను ఒక ఉపాయం ఆలోచించాను. దాన్ని ఆ జిత్తులమారి నక్కకి తెలియకుండా రహస్యంగా అమలు చేద్దాం. ఏమిటంటే, నది ఒడ్డున బంకమన్నులో తుమ్మజిగురు, మర్రిపాలు, తేనె, మైనం, మరికొన్ని లేపనాలు కలిపి రోజూ పట్టించి ఒక కవచంలా నీ శరీరాన్ని తయారుచేస్తాను.
మృగరాజు ముందు నుంచి కాని వెనుక వైపు నుంచి కాని నీ శరీరం మీద దెబ్బ తీయాలంటే దాని పంజా గోళ్లు జారి పోతాయి. నోట్లో దంతాలు విరిగి పోతాయి. అప్పుడు నీ తొండంతో దాన్ని విసిరి కాళ్లతో తొక్కెయ్, అడవిలో సింహం పీడ వదులుతుంది" వివరంగా తన ఆలోచన తెలియచెప్పింది.
కోతి మిత్రుడి ఉపాయం గజరాజుకి నచ్చింది. ఈ గండం నుంచి బుల్లి ఏనుగును రక్షించాలంటే దైర్యం చెయ్యక తప్పదనకుంది. నక్కకి ఏ మాత్రం అనుమానం రాకుండా కోతి మిత్రుడు చెప్పినట్టు రోజూ నది ఒడ్డున లేపనాల మిశ్రమంతో ఒండ్రు మట్టిని శరీరానికి పూయించుకుని ఆరపెట్టేది.
కొద్ది రోజుల మిశ్రమ లేపనం అనంతరం గజరాజు భారీ శరీరం ఉక్కుకవచంలా తయారైంది. ఇక మృగరాజుకి భయపడాల్సిన పని లేదనుకున్నాడు.
అనుకున్న రోజు వచ్చింది. యువసింహరాజు జన్మ వేడుకలు ప్రారంభమయాయి. పిల్ల ఏనుగును తన వెంట పంపవల్సిందిగా నక్క వచ్చి గజరాజును కోరింది. ఒక్కగా నొక బిడ్డను యువ సింహానికి ఆహారంగా పంపేది లేదని కరాకండిగా చెప్పేసాడు గజరాజు.
ఆ మాటను నక్క వెళ్లి మృగరాజుకు చెప్పగా, పట్టరాని కోపంతో, "నన్నే దిక్కరిస్తాడా, ఆ గజరాజుకి ఎంత దైర్యం! ప్రాణాలతో వదలను. పద" అని నక్కను వెంట పెట్టుకుని ఏనుగు స్థావరానికి వచ్చాడు.
గజరాజు దైర్యంగా స్థిరంగా మృగరాజు ఎదురుగా నిలబడ్డాడు.
"నా మాటనే ధిక్కరిస్తావా, నీ కెక్కడి నుంచి వచ్చిందీ దైర్యం? నిన్ను చంపి నీ పిల్ల ఏనుగును తీసుకెళ్తా”నని ఏనుగు కుంభస్తం మీదికి ఎగిరి కాలి పంజా విసిరింది. జర్రున జారి గజరాజు కాళ్ల దగ్గర పడ్డాడు మృగరాజు.
గజరాజు పట్టరాని ఉక్రోషంతో తొండం సాచి సింహరాజును చుట్టి నేలకేసి కొట్టి కాళ్లతో కుమ్మేసింది. రక్తం కక్కుకుని మృగరాజు చచ్చాడు. వెంట వచ్చిన నక్క ఈ సంఘటన చూసి అడవి వదిలి పారిపోయింది.
ఇదంతా చెట్టు కొమ్మ మీద కూర్చుని గమనిస్తున్న ఎర్రకోతి తన పగ తీరిందని ఆనందపడింది.
గజరాజు కోపం తగ్గ లేదు. యువసింహం బ్రతికుంటే అడవి జంతువులకు ముప్పేనని తలిచి తిన్నగా యువసింహం నివాసమున్న గుహ దగ్గరికెళ్లి దాన్ని కూడా తొండంతో నేలకేసి కొట్టి చంపేసాడు.
గజరాజు దైర్యాన్ని అడవి జంతువులన్నీ కొనియాడి ఇన్నాళ్లు మృగరాజు తమని పెట్టిన యాతనలు తొలగిపోయాయని సంతోషించి వన జంతువులన్నీ గజరాజును ఏకగ్రీవంగా తమ రాజుగా నిర్ణయించాయి.
నీతి : ఆపదలు వచ్చినప్పుడు దైర్యంగా ఎదుర్కొంటే విజయం తథ్యం.
సమాప్తం
💐💐💐💐💐💐💐💐
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.




Comments