'Alanati Mandara Makarandalu' Written By Nallabati Raghavendra Rao
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
అలనాటి జ్ఞాపకాల కోసం వచ్చాడతను.
ఎంత వెతికినా అతను వెతికే మనిషి దొరకలేదు.
నిరాశతో వెనుతిరిగిన అతనికి అనుకోకుండా బస్సులో కనిపించిన వ్యక్తి చెప్పిన నిజం ఏమిటో తెలుసుకోవాలంటే నల్లబాటి రాఘవేంద్ర రావు గారు రచించిన ఈ కథ చదవండి.
పాతకాలంనాటి భవనాలు, మండువా లోగిళ్ళు,
వాడపల్లి పెంకుటి కొంపలు, బంగాళా పెంకుటి చిన్న ఇళ్ళు.. కొన్ని తాటాకుపాక నివాసాలు..
ఇంకొన్ని గడ్డివాము బొమ్మరిళ్ళు...ఇదే...... చెల్లూరు..వాతావరణం.
ఊరి చివరలో బోసినవ్వుల గాంధీతాత నిలు వెత్తు విగ్రహానికి ఎదురుగా ఉంది బొజ్జ గణపయ్య గుడి. లావుపాటి స్తంభాలు, దానికి పైన చుట్టూరా... ఏనుగు తల బొమ్మలు, సిమెంటు మామిడి తోరణాలతో రంగులు వెలిసి పోతున్నా... కాస్తోకూస్తో కళకళ లాడుతుంది ఆ గుడి.
వారణాసి గణపతిశాస్త్రి మాత్రం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. కూసంత నూనె ఇత్తడి ప్రమిదల్లో పోసి ఎలాగోలా కష్టపడి దీపాలు వెలిగించి మూలనున్న ఇనుప రేకుల డబ్బా నుంచి 4 బెల్లం ముక్కలు తీసి కాగితం ముక్క మీద నైవేద్యం పెట్టి తానొక్కడే కాసేపు అక్కడ..అలా కూర్చుని బొజ్జ గణపయ్యతో ఏదో గుర్తొచ్చిన వాడిలా గుసగుసలు పెట్టి... ఆయన ఎంతకూ మాట్లాడటం లేదని తల గోక్కుంటూ వెళ్ళి పోతూ ఉంటాడు.
ఆ వెళ్ళేది వచ్చేది ఊరవతల స్టాప్ లేని బస్ స్టాప్నుండి.. చుట్టూ తిరిగి ఊర్లోకి వెళ్లి పోతుం టాడు. ఆ బస్సు స్టాప్ కి దూరంగా మూలగా ఓ చిన్ని బుల్లి పూరిగుడిసె. ఆ గుడిసె చిన్నగా గాలి వేస్తే నాలుగడుగులు జరిగిపోయేoత అసలు ఏమాత్రం కట్టుదిట్టం లేకుండా ఉంది. ఆ గుడి సెలో కండలేని శరీరంతో ఎలాగోలా ప్రాణం నిలుపుకుంటూ బ్రతుకుతుంది...కనకమ్మ!!
కనకమ్మ వయస్సు 90 ఏళ్లకు అటూఇటూ అనడానికి ఏమాత్రం వీలు లేదు... ఖచ్చితంగా చెప్పాలంటే అటేగాని ఇటు కాదు. రోడ్డు మీద ఆగిన బస్సులోంచి దిగిన ఊరికి కొత్తవారు ఊరి లోపలికి వెళ్లాలంటే కనకమ్మ దర్శనం అయితేనే వీలవుతుంది. ఆవిడను అడ్రస్ అడిగి ఊళ్లోకి ప్రవేశించక తప్పదు..!
అదిగో.. అప్పుడే కంగారుగా వచ్చినట్టు వచ్చి రోడ్డుమీద బస్సు ఆగింది. ఆ బస్సురంగు ఫలానా అని ఈ భూమ్మీద చెప్పగలిగిన మగ వాడు ఎవడు లేడు.. బస్సు చక్రాలు విరజిమ్మిన దుమ్ముధూళి చీల్చుకుంటూ ఆ బస్సులోంచి కిందకు దిగాడు రాంకీ.
ఆరంకెల విలువైన సాఫ్టువేరు మనిషి అయినా
వచ్చేది పల్లెటూరు కనుక సాదాసీదాగానే వచ్చాడు చేతిలో మాత్రం ఓ చిన్ని గుడ్డ సంచి అతడికి తోడుగా ఉంది.
బస్సు దిగగానే దుమ్ము ధూళితో కూడిన చంద్ర మండలపు అనుభూతి కలిగింది రాంకీకి. చాలా సేపటికి ఆ దుమ్ముధూళి పలుచ పడ్డాక...
మిగిలి ఉన్నదాన్ని..'" ఉప్ ఒప్ ఒప్".. అని ఊదుకుంటూ చుట్టుపక్కల పరిశీలనగా చూశాడు. అల్లంత దూరాన కనకమ్మ గుడిసె తప్ప ఇంకేమీ కనిపించలేదు. సిరిపిలక సవ రించుకుంటూ గుబురు గడ్డం గోక్కుంటూ వారణాసి గణపతిశాస్త్రి నీరసంగా వెళ్ళిపోతు న్నాడు అప్పుడే రాంకీని దాటుకుంటూ.
రాంకీ ఆ గుడిసె సమీపిస్తుండగానే ముక్కాలితో
బయటకొచ్చింది కనకమ్మ.
" ఎవరు కావాలి పిల్లోడా"...ఆమె మాట మాత్రం చాలా బలంగా ఉంది. ఎటొచ్చి.. శరీరం మాత్రం కుమిలిపోయి కమిలిపోయి వడలిపోయి రాలి
భూమి మీద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది. ఆమె తలలో ఒక్క నల్లవెంట్రుక ఉంటే ఒట్టు!..ముగ్గుబుట్ట లాంటి ఆ తలే ఆమె ముఖా నికి కళ తెచ్చిపెట్టింది. నుదుటన పాత పావలా బిళ్ళ అంత ఎర్రని బొట్టు... మొత్తానికి ముసలి పెళ్లికూతురు లాగా ఉంది కనకమ్మ..!
" మామ్మ.. నీ పేరేమిటి?" ప్రశ్నించాడు రాంకీ.
" నా పేరు కనకమ్మ... ఎవరు కావాలిరా నీకు?"
అడిగింది కనకమ్మ.
" ఈ ఊర్లో గతంలో "సుందరమ్మ"' అని ఓ పెద్దా విడ ఉండేదట.. చెప్పాలంటే ఇప్పుడు ఇంచు మించు నీవయసే ఆమెకు ఉండొచ్చు... ఆవి డతో పెద్ద పని ఉండి వచ్చాను మామ్మ.. ఆవి డను కలవాలి... నీకు తెలిసి ఉంటే కొంచెం ఆమె ఇల్లు ఎక్కడో చెప్పవా?" కనకమ్మ కు దగ్గరగా వెళ్లి ప్రాధేయoగా అడిగాడు రాంకీ.
" సుందరమ్మా????.. అంటే..అది ఎవత్తి రా బుల్లోడా? నాకు తెలియకుండా ఎవరై ఉంటా రబ్బా.. అసలు నీది ఏ ఊరు రా చంటోడా?".. ప్రశ్నించింది కనకమ్మ.
"నాది హైదరాబాద్ మామ్మా.. మా తాతగారిది పూర్వం ఈఊరే..మా తాతగారి పేరు సుబ్బా రావు గారు "
"ఒరే గుంట.. 90 మంది సుబ్బారావు లు అందులో ఎవడో వీడు.".. తల గోక్కుంటూ అంది కనకమ్మ.
" నీది బాగా పెద్ద వయసు కదా... . చాలా సంగ తులు మరచిపోవడం సహజం... సరే..ఆ పుణ్యాత్మురాలు మా " సుందరమ్మ" పూర్వం
మా కుటుంబాన్ని రక్షించారని... ఆ మహాతల్లి లేకపోతే.. అసలు మేము ఎవరం ఉండేవారమే కాదని... మా తాతగారు చెబుతుండేవారు... అప్పుడు నాకు ఐదారేళ్లుఉంటాయేమో....
అప్పుడు ఆయన అలా చెప్పడం..ఆ మాటలు నా గుండె లో పూర్తిగా నాటుకు పోయాయి. సరే మేమంతా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లి పోయాక మా తాతగారు నా చిన్నప్పుడే గతించారు. గతం గతః!!
ఇప్పుడు మానాన్నగారు..ఆయనదీ పెద్ద వయసే 65 ఉండొచ్చు!!అప్పుడు మా తాతగారు చెప్పిన ఆ పుణ్యాత్మురాలు గొప్పదనం ఇప్పటికీ మా నాన్నగారు మాకు చెబుతూ ఉన్నారు...
అలాంటి మహాతల్లి..దేవతలాంటి "సుందరమ్మ"
మామ్మ ను.. ఎలాగైనా చూసి తీరాల్సిందేనని నా మనసుకు బుద్ధి పుట్టి... వచ్చేసాను. నువ్వు చెప్పు.. నేను ఒకసారి ఆవిడను చూడాలి అను కోవడం కరెక్టేకదా" రాంకీ చేతులు కట్టుకుంటూ ఆమెతో చెప్పాడు.
" నీ బుద్ధి గడ్డి తినలేదు కనుక వచ్చావురా చప్పిడి మొఖం చంటోడా..అసలు ఇంతకీ ఆ.. "సుందరమ్మ" ఎవరు చెప్మా... ఆ...గుర్తొచ్చింది.. ఆ ముదనష్టపు చాకలి మల్లయ్యగాడు ఉండే వాడుకదా.. ఆడి పెళ్ళాం పేరు సుందరమ్మే".. గుర్తు వచ్చినట్టు అంది కనకమ్మ.
" ఆవిడ వయసు ఎంత మామ్మా..?"..ఆతృతగా
అడిగాడు రాంకీ.
" ఓ 5 పదులు ఉండొచ్చేమోరా.."
" అయితే ఖచ్చితంగా ఆవిడ కాదు మామ్మ.
ఎందుకంటే మా "సుందరమ్మ" మామ్మ వయసు చాలా పెద్దది." నిరాశగా అన్నాడు రాంకి.
" సరే ..ఆ ఏలూరులో ప్రజలు అందరి చెవుల్లో ఎర్రపూలు పెట్టి.. పారిపోయి... ఈ ఊరు వచ్చా సాడే వెంకటశాస్త్రి ..ఆడేరా. మొన్నీ మధ్యన పక్షవాతం వచ్చి మూలన పడ్డాడు..ఆడి పెళ్ళాం
పేరు కూడా సుందరమ్మే. మన బొజ్జగణపయ్య గుడి పూజారి.. అదేరా ఇప్పుడే ఇలా ఈడ్చు కుంటూ వెళ్ళాడు కదా.. వారణాసి గణపతి శాస్త్రి.. ఆడికి స్వయానా చెల్లెలు ఈ "సుంద రమ్మ"..అదే అయ్యుంటుంది అంటావా?"..
కనకమ్మ గుర్తుకు తెచ్చుకుని మరీ చెప్పింది.
"నాకేం తెలుస్తుంది మామ్మ.. మొత్తానికి దాన ధర్మ గుణం చాలా ఎక్కువగా ఉన్న పెద్దావిడ ఆవిడ. అప్పట్లో తాతగారు ఇప్పుడు నాన్న చెప్పిన దాన్ని బట్టి ఆవిడ..దేవత కన్నా గొప్పది అందుకనే ఎలాగైనా ఒకసారి చూసి తీరాలని ఎవరికీ చెప్ప కుండా చివరికి మా నాన్నగారికి కూడా చెప్పకుండా వచ్చేసాను.".. ఆతృతగా చెప్పాడు రాంకీ.
" దాన ధర్మ గుణమా?? అయితే అది దీనికి లేదు. ఈ "సుందరమ్మ" పిసినారి ముండా కూతురు.. పిచ్చుకకు నాలుగు ధాన్యపు గింజ లు వెయ్యని ముదనష్టపుది... సరే ఇంకా ఎవరు ఉన్నారు చెప్మా.."సుందరమ్మ'లు" కాసేపు ఆలోచనలో పడింది కనకమ్మ.
రాంకీ.. నిరాశగా నిలబడ్డాడు
" కుర్రోడా.. గుర్తొచ్చింది రా.. కొండేపూడి వెంకట రమణ ఉండేవాడు కదా.. ధాన్యం వ్యాపారం చేసేవాడు. ఆడికి ముగ్గురు పెళ్ళాలు. అందులో పెద్ద దాని పేరు.. సుందరమ్మే. బలే గుర్తు వచ్చింది లే. పిచ్చిముండ.. నేనంటే అస్సలు పడేది కాదు. అస్తమానం ఆడిపోసుకునేది.. ఇప్పటికీ అంతే.. మొన్న మారినివారి వీధి కాడ కనబడిందా.. దుమ్మెత్తి నా ముఖాన పోసింది.. 'వయసులో ఉన్నప్పుడు నా మొగుడికి ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు.. నాకెందుకు ఉండకూడదు' అని.... ఇంకో ఇద్దరు మొగుళ్ల తో ముగ్గులు పెడుతూ ఉండేది.. ఊరంతా ఛీ అంటూ ముఖం మీదే ఉమ్ము వేసేవారు.. దానికి నాకు పడదు అని చెప్పాను కదా అయినా నీ గురించి దాన్ని చూపిస్తాను నడు..." ముందుకు కదిలింది తన కర్ర సహాయంతో కనకమ్మ.
" చి చి..ఛీ ఛీ.. మా బంగారుతల్లి " సుందరమ్మ"
అలాంటిది కాదు మామ్మ. సీతాదేవి అంతటి పతివ్రత ఆవిడ!.. ఆరోజు ఏ రంగు చీర కట్టు కొని ఉందో పక్కింటి వారికి కూడా తెలిసేది కాదట. వీధి లోకి వచ్చిన కూరగాయలు కూడా కొనడానికి గడప దాటి వెళ్ళేది కాదట!!!" చిత్రంగా చెప్పాడు రాంకీ.
" నువ్వు చెప్పేది మరీ బాగుందిరా చొట్టమొఖం గాడిద..నేను నీకు ఎర్రిదానిలా కనిపిస్తున్నానా..
నీ ఉద్దేశం నన్ను ఆటపట్టిస్తూ ఉన్నట్టుంది...
నేను తింగరిదాన్ని అనుకుంటున్నావు కదూ!! ఎంతమంది సుందరమ్మ ల విషయం చెప్పినా కాదు అంటున్నావు ఏబ్రాసోడా.. ఇక నీ తిప్ప లు నువ్వే పడు...అయినా నా అంత వయసుం టుంది అంటున్నావు..అసలు అది బ్రతికి ఉన్న దో చచ్చిపోయిందో ఎవడికి తెలుసు రా".. కోపంగా కాస్తంత చిరాకుగానే అంది కనకమ్మ.
"అలా అనొద్దు..మా బంగారుతల్లి.. మా కుల దైవం మా "సుందరమ్మ మామ్మ" కు ఏమి కాకూ డదని నేను ఎప్పటి నుంచో దేవుళ్ళు అందరికీ మొక్కుతున్నాను. ఎటొచ్చీ నేను రావడం కొంచెం ఆలస్యం అయింది అంతే..." నమ్మకం గా అన్నాడు రాంకీ.
అయినా కనకమ్మ కదల లేదు.. ఓ పక్కకు వెళ్లి పోయి 'నాకేమీ తెలియదు నీ తంటాలు నువ్వే పడు'.. అన్నట్టునిలబడిపోయింది.
అంతే రాంకీ గుండెలో పెద్ద బండ పడ్డట్టు అయింది. బాగా నీరసపడి పోయాడు. నిస్సత్తు వగా ఆ పూరి గుడిసె కింద ఉన్న మట్టిదిమ్మ మీద కూలబడి పోయాడు.
బాగా జాలివేసింది కనకమ్మ కు. లోపలకెళ్లి బెల్లం ముక్క తెచ్చి బలవంతంగా రాంకీ నోట్లో కుక్కింది.
"బెల్లం ముక్క నోట్లో పెడితే కొరకలేక పోతు న్నావు...ముందు ముందు ఎలా బతుకుతావు రా ఎర్రి ముఖం వాడా..." అంటూ కనకమ్మ రాంకీ ని చెయ్యి పట్టుకుని లేపింది.
" సరే రా నాకూడా రా.. ఎలాగోలా ఈ ఊరులో వీధులన్నీ సంధులన్ని గొందులన్నీ తిప్పి... ఆ సుందరమ్మ ను కనిపెట్టి.. నీకు అప్పచెప్పే భారం నాది."... ముక్కాలు తో నడక లంకించుకుంది
కనకమ్మ..చాలా సరదాగా సంతోషంగా ఆమెను అనుసరించాడు రాంకీ.
****"
అలా వీధి వీధి తిరుగుతూ బొజ్జ గణపయ్య గుడి కి ఈశాన్యం మూలగా రావిచెట్టు పక్కన ఉన్న ఓ కొంప ముందు ఆగింది కనకమ్మ.
" సీతప్పా... ఇలా బయటకు రావే .. ఏం చక్క పెడుతున్నావు లోపల.. మన ఊర్లో ఎప్పుడో "సుందరమ్మ" అనే ఉండేదట!. ఈ పిల్లోడు దాని గురించి వచ్చాడే. ఆ బొంగురునోరు అన్న వరంగాడి పెద్దమ్మ... అదేనే... నల్లగా దుబ్బు ముక్కలాగా ఉండేదిచూడు... దాని పేరు... అదేనే.. మన సైకిల్ నవాబుతో 60 ఏళ్ళ వయ సులో లేచిపోయింది ...గుర్తొచ్చిందా.. దాని పేరు కూడా "సుందరమ్మ"కదా."
అంటూ అడిగింది కనకమ్మ.. బయటకు వచ్చిన సీతప్ప ని.
" అదా.. చొట్టకాలుది కదా.. అది మన తాపీ మేస్త్రి అమ్మిరాజు తో కదా లేచిపోయింది.. నువ్వు సైకిల్ నవాబు గాడితో అంటావేంటి... నీకు మరీ మరుపు ఎక్కువైపోయిందే కనకమ్మ... చాలా బాగుంది సంబడం... నాలుగు రోజులు పోతే నీ పేరే నువ్వు మరిచిపోయేలాగా ఉన్నావ్
దాని పేరు "సుందరమ్మ" కాదు దమయంతి. అవునుగాని రేపోమాపో చచ్చేలాగున్నావ్.. నీకెందుకే కనకమ్మ ఈ తిరుగుళ్ళు. ఎక్కడన్నా దారిలో కళ్ళు తిరిగి పడిచస్తావ్... బోల్డంత మంది కొడుకులు కూతుళ్లు మనవళ్ళు...వాళ్ళు రమ్మంటున్నారు కదా.. ఏ ఇక్కడే చావాలా?? 64 స్తంభాల పెద్ద వాడపల్లి పెంకుల మండువా లోగిలి... అమ్మేసి డబ్బంతా సంతానానికి పంచే శావు... ఊరవతల ఆ మట్టి గుడిసెలో ఉండే కర్మ నీకెందుకే...".. కోపంగా చిరాకు పడుతూ అంది సీతప్ప.
" ఏంచేయను..ఈఊరు మట్టిని, మిమ్మల్నంద రినీ వదిలి పెట్టలేక... చచ్చే 'ముందురోజు' వాళ్ల దగ్గరికి పోతే సరిపోతుంది లే....నా గురించి ఎందుకు కానీ.. ఈ పిల్లగాడు కి ఏం తెలియదు
బొత్తిగా ఎర్రిబాగులోడు. నోట్లో పాలపీక పెడితే పాలు కూడా చీకలేడు.ఈడి ముఖం చూడు... ఎంత అమాయకంగా ఉన్నాడో... ముక్కు సరిగా చీదుకోవడం కూడా రాదు. పోనీ సాయం చేస్తే ఏమౌతుంది." అంటూ కనకమ్మ రాంకీ ని వెంటబెట్టుకుని చాలా ఇరుకు సందులు కూడా తిరిగింది.
అంత ముసలి వయసులో కనకమ్మ తన గురించి పడుతున్న వేదన, సేవ.. చూసి రాంకీకి చాలా బాధ కలిగింది. తొమ్మిది పదుల వయసు లో ఆవిడకి ఇది అవసరమా అనిపించింది. పల్లెటూరి మంచిమనుషుల స్వభావాలు, మన స్తత్వాలు.. అమోఘంగా ఉండేయేమో... అని మనసులో అనుకుంటున్న రాంకీ .. ఆవిడను ఓ చల్లని చెట్టు కింద కూర్చోపెట్టి తన గుడ్డసంచిలో ఉన్న రెండు పుల్లేటికుర్రు జామపళ్ళు పెట్టాలను కున్నాడు. ...' అమ్మో '.. అవి... ఆ మహాదేవత "సుందరమ్మ" మామ్మ.. గురించి కదా...... ఆ ఆలోచన విరమించుకుని.. కనకమ్మ తో నడు స్తున్నాడు రాంకీ.
కాసేపట్లో "సుందరమ్మ" మామ్మ ను ఎంత కష్ట పడి అయినా ఎలాగోలా వెతికి పట్టుకోవాలి.. ఆమె పక్కనే కూర్చుని ఈ పళ్ళు రెండు ఆవిడకే పెట్టి ప్రేమగా తినిపించి.. తనివితీరా మాట్లాడి వీలైతే ఈ రాత్రికి ఆవిడ పక్కగానే పడుకుని... ఆ తాదాత్మ్యం అనుభవించి...అమ్మో అమ్మో.... చాలా ఆలోచన మీద వచ్చినట్టు గుర్తొచ్చింది రాంకీ కి.
కనకమ్మ ఒక చోట ఆగింది.." ఇట్రా పిల్లోడా.. ఆ మెట్టపైన.. బసవ వెంకట్రావు అని.. కాఫీఒటీలు
నడిపేవాడు. ఆడి పెళ్ళాం ఇడ్లీలు చేస్తే.. ఇడ్లీలు తినేవారు కాదు జనం... ఆ గుల్ల శనగపప్పు పచ్చడి తినడానికే ఇడ్లీలు కొనేవారు. అంత పెద్ద పేరు.ఆ పచ్చడివెంకట్రావు ....అత్తపేరు "సుందరమ్మే"..రా చూపిస్తాను..".. అంటూ అక్క డికి తీసుకెళ్ళింది రాంకీ ని.
" ఒరేయ్ పిండారీ వెంకట్రావు.. ఇటు రారా.. మీ అత్త పేరు " సుందరమ్మ".. కదూ.. ఏది.. దాన్ని ఒకసారి ఇలా రమ్మను." అంటూ అరిచింది.
" అదెక్కడుందే.. ఏడాది క్రితమే కొండెక్కింది.
బస్సులో యాత్రలకు వెళ్ళింది.. వెళ్లిన బస్సు లోయలో తిరగబడి పోయిందట..శవాన్ని కూడా నేను చూడలేదు. ఊర్లో అందరూ దానంత మంచిది లేదనేవారు.. నీకు తెలుసు కదా చివరికి పనికిమాలిన చావు వచ్చింది దానికి... నాకు సిగ్గేసి ఊర్లో ఎవరికీ ఈ విషయం చెప్ప లేదే." ఏడుస్తూ అన్నాడు ఒటీలువెంకట్రావు.
రాంకీ కనకమ్మ ను దూరంగా తీసుకొచ్చాడు.
" మామ్మ...మా "సుందరమ్మ" మామ్మకు.. ఇలాంటి దిక్కుమాలిన చావు ఏ పరిస్థితుల్లోనూ రాదు. ఎందుకంటే ఆవిడ మహా గొప్ప పుణ్యాత్మురాలు."అంటూ వివరించాడు.
ఇంకాసేపు వాళ్ళిద్దరూ చాలా వీధుల్లో తిరిగి..
ఎక్కడా సుందరమ్మ ఆచూకీ దొరకనoదుకు నీరస పడ్డారు.
" సరే రా.. ఇక వీధులన్నీ తిరిగేసి నట్టే.. ఇంకా చూడవలసింది ఏమీ లేదు....పసలవారి వీధి.. మార్నివారి వీధి.. చుండ్రువారి వీధి.. బలుసు వారి వీధి.. సూర్రావుపేట.. అన్ని తిరిగేసాం.
" సుందరమ్మ" లు.. ఈ చెల్లూరులో ఇంకెవరూ లేరు. ఇంక నువ్వు మీ ఇంటికి వెళ్లి పోరా బుడ్డోడా... ఇదిగో గుడిసె లో మట్టికుండలో కూసంత పలసని సల్లనీళ్లు..ఉన్నాయి.. అవి తాగి వెళ్ళు.." అంటూ వెనుతిరిగింది కనకమ్మ.
అక్కడే కూలబడి పోయాడు రాంకీ.
కనకమ్మ మళ్ళీ వెనక్కు వచ్చింది.."నువ్వు అలా బాధపడుతుంటే నాకు ఏడుపొస్తుంది రా..... ఉండు ఆ ముంజకాయలు వీరన్న ఇటు వస్తున్నాడు.. ఆడిని అడుగుదాం." అంటూ వీరన్న ను ఆపింది కనకమ్మ.
" వీరిగాడా బాగున్నావా.. ఇదిగో.. మన ఊరి అవతల పిల్ల కాలవ దగ్గర సిమెంటు తూములు కింద దుబ్బు గడ్డి పాకలో కాలు విరిగిన ముసల్ది ఉంది కదా.. దాని పేరు ఏంట్రా..." అంటూ అడి గింది..
" కనకమ్మత్తా.. దాని పేరు "సుందరమ్మ"... మా మంచిదిలే.. నీకు తెలుసుగందా... సేనామందికి ఉపకారం చేసింది.. సివరికి... దాని బతుకు అలా అయిపోయింది."... అంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
" హమ్మయ్య... ఆఖరుకు దొరికేసింది రా.. నీ పంటపండింది రా.... తొందరగా రా అక్కడికి వెళ్దాం" అంటూ గబగబా అడుగులు వేసింది ముందుకు కనకమ్మ.. రాంకీ చాలా సంతోషంగా ఆమెను అనుసరించాడు
" అది బతికి చెడ్డది రా. నాకు మల్లె 64 స్తంభాల మండువా లోగిలి ... పనిమనుషులు రాకుంటే ఇంటికి రంగుసున్నం వేద్దామని నిచ్చెన ఎక్కింది. కాలు జారి కింద పడింది. ఆ ఇల్లు అమ్మేసుకుని చుట్టాలు పట్టాలు దీన్ని ఇక్కడే వది లేసి వెళ్లి పోయారు..అది ఒక్కతే ఊరవతల పిల్లకాలువ తూములు దగ్గర ఉంటుంది.. నాకు గుర్తుకు వచ్చింది.. అనవసరంగా నిన్ను ఊరంతా తిప్పాను..నడు నడు"..అంటూ వెనక్కుతిరిగి బొజ్జగణపయ్యగుడి....గాంధీగారి విగ్రహం దాటించి ఆగ్నేయం మూలగ చాలా దూరం నడి పించింది....కనకమ్మ.
రాంకీ కి ఆమె మహదానందం చూసి సంతోషం కలిగింది..
ఆమె....ఒకమనిషికి సంపూర్ణంగా సహాయం చేస్తున్నాను...అన్న సంబరంతో ..పరుగులాంటి నడకతో... తన్మయత్వంతో.. నడవడం చూసి
ఆశ్చర్యం కూడా కలిగింది.
తన పని పూర్తి గా అయ్యాక.. వెళ్ళేటప్పుడు కనకమ్మ గుడిసె దగ్గర ఆగి... కనీసం ఓ పది రూపాయలు.... చి చి 100 రూపాయలు అయినా ఆమె చేతిలో పెట్టాలని.. ఖచ్చితమైన ఓ నిర్ణయానికి వచ్చేశాడు రాంకీ.
కనకమ్మ నడిచి నడిచి పిల్ల కాలువ తూముల దగ్గర ఆగిపోయింది.
" సుందరమ్మా.. ఒసే..సుందరమ్మా... నేనే కనకమ్మను వచ్చాను.. ఒకసారి తలుపు తీసుకుని బయటకు రా.." .... అంటూ గట్టిగా కేక పెట్టింది.
తన విరిగిన కాలు ఈడ్చుకుంటూ... బయటకు వచ్చింది ఆ "కుంటి సుందరమ్మ"...!?
" ఈ బుల్లోడు ,నేను...నీ గురించి రెండుగంటల నుండి.. ఊరంతా తెగ తిరుగుతున్నాం... ఎలా గున్నావు..? నువ్వు ఇక్కడకు వచ్చేసేక నేను నిన్ను చూడ్డానికే రాలేదు.. బాగున్నావా..".....
చాలా ఆప్యాయంగా పలకరించింది కనకమ్మ.
"ఏం బాగోడంలే... ఏదో ఇలా ఉన్నాను"..నీరసం గా అంది ఆ కుంటిసుందరమ్మ.
ఆ కుంటిసుందరమ్మ వయసు బాగానే పైబడి ఉంది. ఖచ్చితంగా నాకు కావలసిన సుంద రమ్మ ఈవిడే...అని ఆనందపడ్డాడు రాంకీ.
" నువ్వు ఈ ఊర్లో ఎప్పటి నుంచిఉంటున్నావే?"
అడిగింది కనకమ్మ.
" కనకప్పా...చెప్తా కానీ అసలు ఈ గుంటడు ఎవరు?" అడిగింది ఆ కుంటి సుందరమ్మ.
"" తర్వాత చెప్తాగాని ముందు ఈ విషయం చెప్పు.. నువ్వు మీ ఊరు వచ్చి ఎన్ని సంవ త్సరాలయింది..?" మళ్లీ అడిగింది కనకమ్మ.
"నేను ఈ ఊర్లో పాతికేళ్లు నుంచే ఉంటున్నా ను. అంతక్రితం మాది అమలాపురం"చెప్పింది కుంటి సుందరమ్మ".
అంతే.... వింటున్న రాంకీ.. గుండెలో పెద్ద బండ పడినట్లయింది. తన బాల్యంలో అంటే 'పాతి కేళ్లు' క్రితం తన తాత ఇక్కడ జరిగిన అద్భుతాల గురించి చెబుతూ... ఈ సంఘటన అప్ప టికే 'పాతికేళ్ళ' క్రితం జరిగింది అని చెప్పేవారు. వెరసి 50 ఏళ్ళ క్రితం సంఘటన ఇది.మరి ఈ కుంటిసుందరమ్మ తను అనుకున్న సుందరమ్మ ఎలా అవుతుంది?
నీరసంతో ఇద్దరూ వెనక్కి తిరిగారు.. వచ్చిన పని పూర్తి కానందుకు రాంకీ...కష్టపడి ఊరంతా తిరిగినా ఫలితం దక్కనందుకు..కనకమ్మ...
దిగాలు పడి నడుస్తున్నారు...దారిలో కొంత మందిని ఇంకా చెల్లూరులోఎక్కడైనా ఎవరైనా " సుందరమ్మ" లు ఉన్నారా అని వాకబు చేస్తూ ఊరవతల తన పూరిగుడిసె సమీపించింది కనకమ్మ రాంకీ తో. వెంటనే లోపలికి వెళ్లి రాగి గ్లాసులో పలుచని మజ్జిగ పోసి " నా కొంపలో తినడానికి..... తాగడానికి ఇంకేమీ లేదురా పిల్లోడా" అంటూ రాంకీకి అందించింది.
" ఒక పని చేయరా బుల్లోడా... నీ వివరాలన్నీ కాగితం ముక్క మీద రాసి ఈ గూట్లో పెట్టు. మీ "సుందరమ్మ"...... కనబడితే ఎక్కడికి పోయావు అని దానికి నాలుగు చీవాట్లు పెట్టి... ఎలాగోలా నీకు కబురుపెడతా"... అంది రాంకీ వంక చూస్తూ..
"పర్వాలేదు మామ్మ... నేను మళ్లీ ఎప్పుడైనా వస్తాలే.."..ఖాళీగ్లాసు మట్టి గోడ మీద పెడుతూ
గుడిసె బయటకు వచ్చాడు.. రాంకీ.
" అయ్యో అయ్యో.. అదిగదిగో బస్సు వచ్చే సింది..పిల్లోడా.ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్లా లన్నా ఇదే చివరి బస్సు రా... మళ్లీ రేపు ... పొద్దున్న కానీ బస్సు లేదు...పరుగెత్తుకెళ్లి బస్సు ఎక్కు."... అంటూ కనకమ్మ రాంకీ ని కంగారు పెట్టేసింది.
*** *****
కనకమ్మ కంగారుతో పరుగెత్తుకెళ్లి బస్సు ఎక్కేసాడు రాంకి... మిగిలిన అందరూ కూడా బిలా బిలా బస్సు ఎక్కేసారు. బస్సు కదిలింది. చక్రాలు నెమ్మదిగా తమ పని ప్రారంభించాయి.
" ఈ కనకమ్మ మామ్మ కూడా ఎంత మంచిది. అప్పట్లో...పల్లెటూర్లలో 'చాలామంది' మను షులు,వాళ్ల భావాలు..ఇలాగే... నిస్వార్ధంగా ఉండేవి కాబోలు! అలా బ్రతకడమే వీళ్ళ యొక్క ఆరోగ్య రహస్యమేమో! ' స్వార్థం'..అన్న పదం ఒకటుంటుందని.. అసలు ఏ మాత్రం తెలియని తేటతెల్లనిమనసు వీళ్ల సొంతం!!" బస్సులో కూర్చుని ఆలోచిస్తున్నాడు కనకమ్మ మంచి హృదయం గురించి.
బస్సు మళ్లీ ఆగింది.. జనం కోసం.
" ఏ ఊరు రా బుడ్డోడా నీది? ...".. పలకరించాడు పక్కనే ఉన్న పెద్ద వయసు ఆయన.
" హైదరాబాద్ బాబాయ్ గారు..మా తాతగారి పేరు నల్లబాటి సుబ్బారావుగారు ...పూర్వం ఆయనది ఈ ఊరే. ఆయన మనవుడిని నేను.. నాపేరు రాంకీ."... అని చెప్పాడు రాంకీ.
" అలాగా మీ తాతగారు.. కాలం చేశారట కదా"
అడిగాడు ఆ పెద్దాయన.
"నా చిన్నప్పుడే మా తాతగారితో సహా మేమంతా హైదరాబాద్ వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక ఆరోగ్యం మారి ఓ సంవత్సరానికి మా తాతగారు నా ఆరోఏట.. కాలం చేశారు.. ఆ తర్వాత మా నాన్నమ్మ కూడా......" వినయంగా చెప్పాడు రాంకీ.
"అరే...మా గురువుగారురా...నల్లబాటి సుబ్బా రావుగారు ... అంటే.. మీ తాతగారు పోయి ఇప్పటికి పాతికేళ్ళు అయ్యిందన్న మాట !... పుణ్యాత్ముడు! మీ నాన్న పేరు రామచంద్రం. వాడు నా ఫ్రెండ్.. ఇద్దరం కలిసి రోజు గూటీ బిళ్ళ ఆడేవాళ్ళం... మా ఇద్దరిదీ నెలల తేడా లో దగ్గర దగ్గర 65 ఏళ్ళ వయసు రా."... ఆనందంగా చెప్తున్నాడు... ఆ పెద్దాయన.
" అవునా బాబాయ్ గారు... మా వాళ్ళందరూ మీకు తెలుసా...? సంతోషంగా అడిగాడు రాంకీ దగ్గరకు జరుగుతూ.
" ఈ ఊర్లో.. మీ తాతది రామాలయం వెనుక చిన్న బంగాళపెంకుటిల్లురా...తూర్పున మార్ని రామ్మూర్తి గారి ఇల్లు... దాని పక్కన ఇల్లు మాదే. మీ ఇంటికి ఒకటే గది ఉండేది. పిల్లలు చూస్తే ఎనిమిది మంది మీ నానమ్మ వీరభద్రమ్మ.. మహాతల్లి ... ఎలా చేసుకు వచ్చిందో కాపురం... చాలా గుట్టు మనిషి! వాళ్ళిద్దరికీ చెయ్యి ఎత్తి దండం పెట్టాలి... పిల్లల పెంపకం కోసం మీ తాత అష్టకష్టాలు కన్నా ఎక్కువ కష్టాలు పడ్డా డు రా. మహానుభావుడు!...అయినా ఏ రోజు నీతి నిజాయితీ తప్పలేదు.
అందుకనే నేనే కాదు అప్పట్లో వీధిలో చాలా మంది కుర్రాళ్ళు మీ తాత గార్ని చాలా గౌరవంగా 'గురువుగారు గురువుగారు' అంటుండే వారు. ఆయన మనసు వెన్నపూస. కోపం వస్తే మాత్రం పెద్దపులి, సింహం సరిపోవు. శ్రీరామ చంద్రుడు లా నిలువెత్తు మనిషి. పొడవాటి ముక్కు ఆజానుబాహుడు నుదుటన పొడవైన ఎర్రని కుంకుమ బొట్టు తెల్లని పంచెకట్టులో ఆయన్ని చూసిన వారు ఎవరైనా నిజంగా చెయ్యెత్తి దండం పెడతారు. ఒకసారి మీ తాత, మామ్మ శ్రీరామనవమికి భద్రాచలం వెళ్తే ఎవ రో కేబినెట్ హోదా మంత్రి వచ్చారని తివాచీల తో పూలు జల్లుకుంటూ లోపలకి తీసుకు వెళ్లారట. ...అదీ ఆయన క్యారెక్టర్."
చెప్పడం ఆపి మళ్ళీ ఇలా అడిగాడు ఆ పెద్దా యన
""ఇక్కడ మీ వాళ్ళు ఎవరు ఉన్నారు??"..
" సుందరమ్మ మామ్మ"
"ఏ సుందరమ్మ..? నాకు తెలియని వాళ్ళు ఎవరబ్బా?" ఇంకోసారి ప్రశ్నించాడు ఆ పెద్దా యన.
"మాతాతగారు అష్టకష్టాల్లో ఉన్నప్పుడుచాలా సహాయ పడిందటకదా ఆ సుందరమ్మ మామ్మ".
"ఓహో...ఆవిడా... ఇనపకోళ్ళ సుందరమ్మ... అవి బంగారంలాంటి రోజులు... అప్పటి చరిత్ర లన్ని అద్భుతాలు రా...ఆ విషయాలు నీకేం తెలుసు రా బుల్లోడా.. నేను చెప్తా విను....
ఈ సుందరమ్మ మీ తాత కన్నా రెండేళ్లు పెద్దది. మీ తాత అక్క అక్క అంటుండేవాడు. ఆవిడ మీ కుటుంబ పరువు ,మీ తాత ప్రాణాలు రెండు సార్లు కాపాడింది."..చెప్తూ రాంకీ వంక చూశాడు ఆ పెద్దాయన.
" బాబాయ్ గారునిజం..అప్పుడు మా తాత, ఇప్పుడు మా నాన్నగారు ఇదే విషయం చెబు తుండేవారు.".. ఆశ్చర్యంగా అన్నాడు రాంకీ.
" విను.. మీ రెండో అత్తమ్మ కు అంటే మీ తాత రెండో కూతురు సీత కు మంచి పెళ్లి సంబంధం కుదిరింది. మీ తాత దగ్గర పైసా లేదు. ఊరిలో ఎవరిని అడిగినా ఆస్తిపాస్తులు లేవు అని అప్పు ఇచ్చే వారు కాదు. దాంతో మీ తాత బెంగపెట్టు కున్నాడు. విషయం తెలుసుకున్న సుందరమ్మ మీ తాత ఇంటికి వచ్చి.. తన మెడలో నాలుగు పేట ల బంగారంకాసులపేరు తీసి ఇచ్చేసింది.
" తమ్ముడూ! ఇది అమ్మేసుకుని ముందు పిల్ల పెళ్లి చెయ్యి. నీకు వీలున్నప్పుడు నా నగ చేయించి ఇద్దువు గాని..."... అంటూ చేతిలో పెట్టి వెళ్లి పోయింది..సుందరమ్మ మీ కుటుంబం పాలిట దేవత రా" అంటూ చెప్పాడు ఆ పెద్దా యన.
" నిజం బాబాయ్ గారు నిజం"... రాంకీ కళ్ళ ల్లోంచి కాకుండా గుండెల్లో నుంచి కన్నీళ్లు తన్నుకొస్తు న్నాయి.
" ఇంకా చెప్తా విను.. మరోసారి పిల్లల పెంపకం విషయంలో మీ తాత పూర్తిగా అప్పులపాలై పోయాడు. ఎలాగంటే అప్పు ఇచ్చినవారు అందరూ మీ తాత మీద దౌర్జన్యం చేయడానికి సిద్ధపడ్డారు. దాంతో మీతాత బెంబేలెత్తి పోయాడు.
ఇంట్లో వాళ్ళు బయట వ్యక్తులు మీ తాత ఏదైనా చెయ్యరాని పని చేసుకుంటాడేమో అని కూడా కంగారుపడిపోయాము. అప్పుడు ఏం జరిగిందో తెలుసా.. నెమ్మదిగా ఈ విషయం సుందరమ్మకు తెలిసింది. చాలా జాలి పడిపో యింది.
"గంపెడు పిల్లలు...ఆడేమన్నా తాగుబోతా,
తిరుగుబోతా... శాస్త్రాలూ...ధర్మాలు అన్నీ తెలుసు...నిజాయితీపరుడు.. ప్రజలందరినీ "ముంచి" మోసం చేసే చెడు బుద్ధి ఆడికి లేదు..." అంటూ మీ తాతను తన ఇంటికి కబురు పెట్టింది.
మీ తాత, మీ నాన్న, నేను.. మరో నలుగురం వెళ్ళాo.. ఆ మహాతల్లి ఏం చేసిందో తెలుసా...
" తమ్ముడూ! బాధపడకు. ఒక ఊరు వాళ్ళం. మనం మనం సహాయం చేసుకోకపోతే పొరుగు ఊరు వాడు వచ్చి సాయం చేస్తాడా?? అయినా నువ్వు కుటుంబం గురించి ఇలా అయ్యావు గాని వేరే చెడు అలవాట్ల వల్ల కాదు గా.. ఇదిగో నా పెద్ద మండువా లోగిలి దస్తావేజు కాగితాలు తీసుకో.. రెడ్డిగారి దగ్గర తనఖ పెట్టి డబ్బులు తీసుకో ... నేను సంతకం పెడతాను. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు పెట్టి తనఖ విడిపించు...నీకు బరువు అయితే వడ్డీ నేనే కడతాను... కంగారు పడకు..ఈ కాగితాలు, ఈ ఇల్లు నా నెత్తి మీద పెట్టుకొని పోతానా"
అంటూ మీ తాత చేతిలో ఆ దస్తావేజు కాగితాలు పెట్టేసింది.. మీ తాతయ్య , కూడా వెళ్ళిన మేమందరం... ఆమె ఎదుట సాష్టాంగ పడి దండం పెట్టేసాం. ఈ రెండువిషయాలు ఈ చెల్లూరులో జనం అంతా అప్పట్లో చాలా వింత గా విచిత్రంగా గొప్పగా చెప్పుకునేవారం.
" నాకు కన్నతల్లిగా, అక్కగా, అంతకుమించి ఓ దేవత లా... నన్ను ఆదుకుంది ఆ మహాతల్లి "సుందరమ్మ"... అంటూ మీ తాత... ఇక్కడి నుండి వెళ్లే వరకు... కథలు కథలుగా ఊరందరికీ చెప్పేవాడు...
కొన్నాళ్ళకు మీ 'తాత'కు ..మీనాన్న ..మిగిలిన పిల్లలు అందరూ బాగా కలిసి రావడంతో బాగా సంపాదించి సుందరమ్మ.. మొత్తం బాకీలు ,
అప్పులు అన్ని... నెమ్మది నెమ్మదిగా తీర్చే శాడు. ఆ తర్వాతే మీరందరూ ఊరు నుంచి వెళ్లిపోయారు. సరే పిల్లల చదువుల కోసం అభివృద్ధి కోసం వెళుతున్నారు అనుకుని... ఊరంతా ఆనందించాము...అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు రా మీ తాత నల్లబాటి సుబ్బారావు గారు అంటే... ఆయన బుద్ధులే ఆయన కొడుకులకు..కూతుళ్లకు మనవళ్లకు వచ్చి ఉంటాయి.... ఆ మంచి బుద్ధి ఉండబట్టే... నువ్వు మీ "సుందరమ్మ మామ్మ" ను చూడ్డా నికి వచ్చావు."
అంటూ ముగించాడు ఆ పెద్దాయన.
"అవును బాబాయ్ గారు.. మా "సుందరమ్మ మామ్మ" గురించి మీరు చెప్పిన విషయాలన్నీ.. నా బాల్యంలో తాతగారు చెప్పడం నాకు ఇప్ప టికీ గుర్తే... ఆరేళ్ళ వయసులోనే అవి నా గుండె లో నాటుకుపోయాయి. ఆ తర్వా త ఇప్పటి వరకూ నాన్నగారు కూడా అప్పుడప్పుడు చెప్ప టంతో...మా ఇంటిమహాదేవత గా "సుందరమ్మ" గారు నా హృదయంలో స్థిరపడి పోయింది." రాంకీ అలా అంటూ పెద్దగా బాధ పడిపోతూ
" బాబాయ్ గారు..కానీ ఏమి లాభం...అలాంటి
మా కుటుంబ దైవము.... దేవత "సుందరమ్మ" మామ్మ ని.. చూడాలని ప్రేమగా మాట్లాడాలని చాలా ఆశపడి వచ్చాను.. ఆ కనకమ్మ మామ్మతో కలసి అన్ని వీధులు కలతిరిగి చూశాను... ఎక్కడా కనబడలేదు. ఫలితం దక్కలేదు..నాకు చాలా బాధగా ఉంది"... ఏడుస్తు.. కళ్ళ నీళ్ళు ఒత్తు కుంటూ అన్నాడు రాంకి.
" అదేమిట్రా బుడ్డోడా... ఆ దూరంగా కనబడేది
మీ "సుందరమ్మ" గుడిసే కదా..అదిగదిగో గుడిసె కింద మట్టిమెట్టు మీద నీరసంగా కూర్చుంది మీ "సుందరమ్మే" కదా. నువ్వు ఇప్పుడు ఆవిడ దగ్గర నుండే కదా నడుస్తూ వచ్చావు." ఆశ్చర్యం గా అన్నాడు ఆ పెద్దాయన.
" అదేమిటి.. ఆవిడ "కనకమ్మ" మామ్మ....కదా..!?"మరింత ఆశ్చర్యంగా అన్నాడు రాంకి.
ఆ పెద్దాయన విచిత్రంగా నవ్వాడు
"ఆవిడ అసలు పేరు "సుందర కనకమ్మ" రా. వయసు లో ఉన్నప్పుడు ఊరంతా "సుందరి... సుందరి.. సుందరి".. అని పిలిచేవారు. కానీ పెద్ద వయసు వచ్చాక కూడా ఆవిడను అలాగే పిలవడం.. మీ సుందర కనకమ్మ కు అసలు నచ్చలేదు. దాంతో ఆవిడ ఊరు అమ్మలక్కలు అందరిని పోగేసి..ఇక నుండి తనను 'సుందరి'.. అని పిలవద్దని చివరి పేరు అయిన 'కనకమ్మ' అనే పిలవమని హుకుం జారీ చేసింది...అలాగే అందరికీ అలవాటు చేసేసింది కూడా.. కొన్నా ళ్ళకు ఊరిజనం అందరూ 'సుందరి... సుంద రమ్మ' అని పిలవడం మొత్తానికి ....మర్చిపో యారు. అంతెందుకు 'కనకమ్మ' అన్న పేరుకు ముందు 'సుందర' అన్న పేరు ఉన్నట్టు ఈ 'సుందరకనకమ్మ' మామ్మే మరచిపోయింది.
మీ 'సుందరమ్మమామ్మ'.. ఆవిడే రా బుడ్డోడా." నవ్వుతూ చెప్పాడు ఆ పెద్దాయన.
అంతే... రాంకీ శరీరం.. జీవితంలో మొదటగా జలదరించినట్లు అయ్యింది..
".మీ తాతగారిపేరు నల్లబాటి సుబ్బారావు గారు అని... ఆవిడకు బాగా అర్థమయ్యేలా నువ్వు చెప్పి ఉండవలసింది... బాగా పెద్ద వయసు కదా
.. ఆవిడకు..వివరంగా అడగాలని అనిపించ లేదు."...
వివరించాడు ఆ పెద్దాయన.
" అదే జరిగింది బాబాయ్ గారు.. నేను ఇంత సేపు ఆవిడను రాసుకుపూసుకు తిరిగినా నాకు ఏమీ అనిపించలేదు. కానీ ఆవిడే నేను కలవా లనుకున్ననా 'కుటుంబదేవత'.. అన్న విషయం తెలిసాక ఆనందభాష్పాలు నా శరీరపు ప్రతి రంధ్రం నుండి కారుతున్నట్టు వుంది.ఛీఛీఛీ... కనీసపు మానవ ధర్మంతో ఆవిడకు రెండు జామపళ్ళు కూడా పెట్టలేకపోయాను. తిరిగి వచ్చేటప్పుడు ఈ వంద రూపాయలు నీ దగ్గర ఉంచుమామ్మ అని కూడా ఇవ్వ లేక పోయాను.. ఆవిడ నాకు మజ్జిగ ఇస్తే.. నువ్వు తాగావా మామ్మ అని కూడా అనలేకపోయాను.మూర్ఖుడి
ని..! ఈ ప్రపంచంలో పెద్దమూర్ఖుడుని నేనేనేమో!!!!" బావురుమంటూ అన్నాడు రాంకీ.
" వెళ్తాను బాబాయ్ గారు ఇప్పుడే వెళతాను.
ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ కోసం తెచ్చిన ఈ పళ్ళు ప్రసాదంలా ఆవిడ చేత తినిపించి... నా వంశాన్ని నిలబెట్టిన ఆ దేవతను కళ్లారా తనివి తీరా చూసుకుంటూ రాత్రికి కూడా ఇక్కడే ఉండిపోయి..మనవడిగా మా"సుందరకనకమ్మ"
మామ్మ ఒడిలో తలపెట్టుకొని ఆత్మీయఆనందం పూర్తిగా అనుభవించాలని... చాలా ఉబలా టంగా ఉంది బాబాయ్ గారు.." రాంకీ గుడ్డ సంచీ పట్టుకుంటూ అన్నాడు.
రాంకీ...... అలా అంటుండగానే .."రైట్ ..రైట్.. రైట్ .." అంటూ కండక్టరు గట్టిగా కేక పెట్టాడు..
బస్సు కదిలింది..నాలుగుచక్రాలు దుమ్మూదూళి విరజిమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి!!
" స్టాప్ స్టాప్ స్టాప్...".... మరింత గట్టిగా అరుపు లాంటి కేక పెట్టాడు రాంకీ.
స్పీడ్ అందుకోబోతున్న బస్సు.. సడన్ బ్రేక్ తో ఆగిపోయింది.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం....
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments