top of page

ఆమె - అతడు - పిల్ల



'Ame-Athadu-Pilla' - New Telugu Story Written By Susmitha Ramana Murthy

Published In manatelugukathalu.com On 23/08/2024

'ఆమె - అతడు - పిల్ల' తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



విశాలమైన హాలులో మూడు ట్యూబు లైట్లు వెలుగులు చిమ్ముతున్నాయి. మూడు ఫంకాలు అవిశ్రాంతంగా తిరుగుతున్నాయి.

హాలు చివర్లో లేప్ టాప్ కీబోర్డుపై విరామం లేకుండా ఆమె వ్రేళ్ళు కదులుతున్నాయి. అప్పుడప్పుడు టివి చూస్తూ కూడా, సోఫాలో కూర్చున్న కుర్రాడు టేబ్ చూస్తున్నాడు. మరో గదిలో పదమూడేళ్ళ పిల్ల ఆన్ లైన్లో పాఠాలు వింటోంది. 

 ఇంకో గదిలో అతడు డెస్క్ టాపుపై ఆఫీసు పనిలో లీనమై ఉన్నాడు. 

 వంట మనిషి వంట చేస్తోంది. 


 “కూరల్లో కాస్త ఉప్పు, కారం తగ్గించమ్మా! కావాలిస్తే చిటికెడు మేము వేసుకుంటాంలే! “ వంటావిడను పెద్దావిడ హెచ్చరిస్తోంది. 


 “దగ్గరకు వెళ్ళి చెప్పవే!” 


 “మీకులా తనకు చెవుడు లేదులెండి!” ఆయన సలహాను కొట్టిపారేసింది ఆవిడ. 


ఆమె, అతడు, పిల్ల, పిల్లాడు  

అంత పెద్ద ఇంటిలో చిన్న కుటుంబం. 

పెద్దావిడ, పెద్దాయన అతని అత్త, మామలు. 

అతడు, ఆమె ఆఫీసు పనుల్లో ఉంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకునేది వారే!

 “ట్యూషను లేదా తల్లీ?”


 “ఉంది తాతా! వెళ్తున్నా!”


“ట్యూషన్నుంచి వచ్చింతర్వాత స్కూలు హాంవర్కు చేసుకో అమ్మా!”


 “ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లకు హోమ్వర్కు చేసుకోమని ప్రత్యేకంగా చెప్పాలా?”

తన మాటను సమర్ధించని భార్య వేపు అసహనంగా చూసాడు పెద్దాయన. 

 *****

“మమ్మీ! కింద అంతస్తులోని మా స్నేహితుల దగ్గరకు వెళ్ళొస్తాను “


“నీకు రోజూ ఇదేపనా?.. స్కూలు హోంవర్కు లేదా? స్కూలుకి, ట్యూషనుకి వెళ్ళొస్తే సరిపోదు. ఏరోజు పాఠాలు ఆరోజు చదువుకోవాలి. అర్థం కానివి ట్యూషన్లో నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ స్కూలులో లక్షలు ఖర్చువుతున్నాయి. తొంభై శాతమైనా దాటటం లేదు. ఇలా అయితే ప్రభుత్వ స్కూలులో పడేస్తాను!..”


 “మమ్మీ!.. నాకు అన్నీ వచ్చు! “


 “చదువుతుంటుంటే అన్నీ వచ్చినట్లే ఉంటాయి. ప్రశ్నలకు జవాబులు చూడకుండా రాస్తేనే బాగా గుర్తుంటాయి” 


“మమ్మీ!.. ఓ గంట తర్వాత వచ్చి, హోంవర్కు చేస్తాను. బాగా చదువుకుంటాను. సరేనా?”


“సరే! తొందరగా వచ్చేయాలి” 


‘కిందకు వెళ్ళి స్నేహితులతో మాట్లాడడానికి కూడా అనుమతులు, నిబంధనలూను.. ’ అసహనంగా అనుకుంటూ వెళ్ళిపోయింది పిల్ల. 

 *****

‘ఎనిమిది అవుతోంది. ఇప్పుడు ఈయన బయటకు వెళ్తారు. ఏ పదికో గాని రారు. పిల్ల అలా!.. ఈయనిలా!.. ఈ వాతావరణంలో మార్పు ఎప్పటికో!?.. ’ 


ఆమె నిట్టూర్చింది. 

‘ఈరోజు ఆఫీసు పనితో బుర్ర వేడేక్కి పోయింది. అలా బయటకు వెళ్ళొస్తే కాస్త హాయిగా ఉంటుంది’ 

అతను బయటకు వెళ్ళిపోయాడు. 


ఆమె విసుక్కోవడం..అతడలా వెళ్ళడం రోజూ మామూలే!

 *****

“ఏఁవిటో!?.. అందరికందరూ ఒక్కలాగే ఉన్నారు. తల్లేమో గంటల తరబడి స్నేహితులతో ఫోన్లో కబుర్లు. లేకుంటే కంప్యూటర్లో ఆఫీసు పని, మీటింగులు!.. పిల్లేమో స్కూలు, ట్యూషను..తర్వాత స్నేహితులతో బయట బాతాఖానీ!.. చంటాడు ఎప్పుడూ టి. వి, టేబ్తోనే ఉంటాడు! అల్లుడు గారి సంగతి సరే సరి! “


 “మన రోజులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు కదండీ?”

పెద్దాయన మాటలకు పెద్దావిడ తన మనసులో మాట చెప్పింది. 


“మన మాట అమ్మాయి, మనవరాలు పట్టించుకోవటం లేదు. ఏమన్నా కోపమే!”


“మన అభిప్రాయం వారికి నచ్చనప్పుడు, మన పెద్దరికంకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండటమే మంచిది కదండీ!” 


“అవును! అంతేలే!” అంటూ పెద్దాయన మౌనం వహించాడు. 

 ***** 

పిల్ల స్కూలు టీచరు వెంటనే కలియమని ఫోన్ చేస్తే, అతడు, ఆమె స్కూలుకి వెళ్ళారు. 

టీచరు వారి ముందు పిల్ల డైరీ ఉంచి- “ఇందులో మడత పెట్టిన పేజీలు జాగ్రత్తగా చదవండి. మిమ్మల్నిఎందుకు రమ్మన్నానో తెలుస్తుంది. నాకు క్లాసుంది. గంట తర్వాత వస్తాను” అంటూ తను గదిలోంచి వెళ్ళిపోయింది.


ఇద్దరూ ఆత్రంగా డైరేలోని ఆ పేజీలు ఒక్కొక్కటి చూడసాగారు. 

మొదటి మడత పెట్టిన పేజీలో--

‘ఏమిటో!?.. ఈ పెద్దోళ్ళ ఆంక్షలు! సాయంత్రం ఆరు తర్వాత బయటకు వెళ్ళకూడదట! ఇంట్లోనే ఉండాలట! అది ఆడపిల్ల లక్షణమట! మమ్మీ, డాడీల చాదస్తం గాని, ఈ గేటెడ్ కమ్యూనిటీలో పకడ్బందీ సెక్యూరిటీ ఉందని తెలిసి కూడా వారికి అంత భయం దేనికో!?.. ’

రెండో పేజీలో ----

‘ఎంతసేపూ చదువుకో! బాగా చదువుకోమని అంటారే గాని, అలసిన పిల్లలకు కూడా, పెద్ద వారిలా కాస్త విశ్రాంతి అవసరమని గుర్తించరేం!?.. 

స్నేహితులతో ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడకూడదు. బయటకు వెళ్ళకూడదు.. అన్నీఆంక్షలే!.. వారి ఇష్టప్రకారమే అన్నీ జరగాలి!.. పిల్లల ఇష్టాయిష్టాలను పట్టించుకోరేం!?.. ’


మూడో పేజీలో ----

‘మమ్మీఅయితే మరీను! మార్కులు తక్కువ వస్తే తిట్లే తిట్లు!.. కేకలే కేకలు!.. మంచి స్కూలులో చదివిస్తున్నాం. ట్యూషనుకి పంపిస్తున్నాం. తొంభై అయిదు శాతం పైనే రాకుంటే, నీ చదువుకి లక్షలు ఖర్చు పెట్టడం శుద్ధ దండగ! చెప్పినట్లు వినకుండా, ఇలాగే మార్కులు వస్తుంటే ప్రభుత్వ స్కూలులో పడేస్తానంటోంది! ఇంత ఖర్చు ఉండదని మమ్మీ బెదిరిస్తుంటే నా ఆలోచనల్లో ప్రభుత్వస్కూలు చోటుచేసుకుంది’


నాలుగో పేజేలో ---

‘అమ్మ, నాన్నలు పనియంత్రాలు! లక్షల్లో సంపాదనే వారి ధ్యేయం! ఫోన్లో ఇద్దరూ తమ మిత్రులతో గంటల తరబడి కబుర్లు! నేను మాత్రం ఎవరితోనూ ఎక్కువ సేపు మాట్లాడకూడదు!?.. ’


అయిదో పేజీలో ----

‘ఈమధ్య మమ్మీ ధోరణి మరీ దారుణంగా ఉంటోంది. ఏవిషయంలోను నా అభిప్రాయానికి విలువ ఇవ్వటం లేదు. అన్నీ తను చెప్పినట్లే చేయాలి. లేకుంటే కోపంతో అరుస్తోంది. పనిమనిషి ఎదుటే కొడుతోంది. నిన్నటికి నిన్న చెప్పుతో కొట్టింది. నా మాట వింటేనే ఇంట్లో ఉండు. లేదంటే బయటకు ఫో!-- అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. ఎక్కడికి పోను!?.. ’


ఆరో పేజీలో----

తాత నా పరిస్థితికి ఓరోజు నోరు విప్పారు. 

 “చూడమ్మా! రెండు డిగ్రీల నీ చదువులో, ఏ ఒక్కరోజూ నిన్ను కొట్టలేదు తిట్టలేదు. మరీ దాన్నలా..” తాత మాటలు పూర్తి కాకుండానే మమ్మీ కేకలు వేసింది. “డిగ్రీలు చదివించినా, వేలల్లోనే కదా ఖర్చు అయింది? నా అంతట నేనే చదువుకున్నాను. ట్యూషన్లు లేకుండానే!.. మీరీ విషయంలో కలుగ చేసుకోవద్దు”

మమ్మీ మాటలకు తాత కళ్ళలో నీళ్ళు తిరిగడం చూసాను. 


ఏడో పేజీలో –

‘మమ్మీ ఎప్పుడు తిడుతుందోనన్న భయం! డాడీ ఎప్పుడూ ఆఫీసు పనిలోనే! మిత్రుల ధ్యాసలోనే! డాడీ మమ్మీనే సమర్ధిస్తున్నారు. నా సమస్య ఎవరికి చెప్పుకోవాలి?.. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు?చదువు బుర్రకు ఎక్కటం లేదు. యాంత్రికంగా స్కూలుకి, ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాను’


ఎనిమిదో పేజీలో---

‘ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నానో తెలుసుకోవడానికి, నా ఫోను చెక్ చేస్తున్నారు. ఎవరూ మనసు విప్పి మాట్లాడటం లేదు. మమ్మీ, డాడీల ఆప్యాయతకు దూరమయాను. అమ్మమ్మ, తాతయ్య ఏమీ చేయలేక పోతున్నారు.


అపార్టుమెంటులో స్నేహితులు నా పరిస్థితికి చాటు మాటుగా నవ్వుకుంటున్నారు. 

భరించలేను. ప్రభుత్వ స్కూలులోనే వేసేయమంటాను. హాస్టలులో పడేయమనీ చెప్పేస్తాను’ 

మిగతా పేజీలు చదవకుండానే డైరీ మూసేసారు. 


తీవ్ర మనస్తాపంకి గురయ్యారు ఇద్దరూ. 

గంట తర్వాత టీచరు గదిలోకి వచ్చారు. 

“ఎప్పుడూ ఎంతో చలాకీగా ఉండే మీపిల్ల, స్కూలులో ఈమధ్య పరధ్యానంగా ఉంటోంది. విరామం సమయంలో ఏకాగ్రతతో, కళ్ళనుండి నీరు కారుతున్నా పట్టించుకోకుండా డైరీ రాస్తుండటం చాలాసార్లు గమనించాను. స్కూలు మేగజైనుకి విద్యార్థుల వ్యాసాలు, కవితలు, కథలు కావాలని ప్రకటన ఇచ్చాం. గత సంవత్సరం మీపిల్ల రాసిన చదువు—పిల్లల బాధ్యత-- అన్న వ్యాసం అందరి మన్ననలు పొందింది.


అటువంటి తెలివైన పిల్లలో ఈసారి స్పందన లేకపోవడంతో అశ్చర్యపోయాను. ఒకరోజు క్లాసులో డైరీ మరచిపోయింది. ఆతర్వాత స్కూలుకి రెండు రోజులు సెలవులు. డైరీ ద్వారా మీ పిల్లలోని మానసిక సంఘర్షణ అర్థం చేసుకోగలిగాను”

ఇద్దరూ టీచరు మాటలు మౌనంగా వినసాగారు. 


“మీరు ఆ పేజీలు చదివారన్న విషయం కళ తప్పిన మీ ముఖాలను చూస్తే తెలుస్తోంది. ఎదిగే వయస్సులో పిల్లల మానసిక ధోరణి పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. 

పిల్లలు మీకు నచ్చిన విధంగా ప్రవర్తించి తీరాలన్న మీ ఆలోచనలో మార్పు చాలా అవసరం. పిల్లల భావాలు అర్థం చేసుకోవడానికి పెద్దలు ప్రయత్నించాలి.

వారి అభిప్రాయాలు ఓపికగా వినాలి. తప్పొప్పులను విశదీకరించే ప్రయత్నం చేస్తే, తప్పకుండా వారిలో మనం కోరుకునే మంచి మార్పు వస్తుంది “


దుఃఖాన్ని ఆపుకుంటూ ఇద్దరూ టీచరు మాటలకు తలలూపారు. 

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య మంచి అవగాహన ఉండటం చాలా అవసరం. పిల్ల మనసు బాగా గాయపడింది.


మీకు లక్షల ఖర్చు లేకుండా చేయడానికే ప్రభుత్వ స్కూలులో చదవడానికి నిర్ణయం తీసుకుంది. హాస్టల్లో ఉంటానంటోంది “ 


ఊహించని పిల్ల నిర్ణయానికి ఇద్దరూ అవాక్కయారు. 

“ఇప్పుడు ప్రభుత్వ స్కూల్సు చాలా బాగున్నాయి. ప్రయివేటు స్కూల్సులో చదివే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ప్రభుత్వ స్కూల్సులో పిల్లల చదువులు బాగుండవు అన్నది—మీ అపోహ మాత్రమే!”


 టీచరు మాటలకు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. 

 “ప్రభుత్వ స్కూలులోనే మావారు టీచరు. పిల్లను ఆస్కూలులో చేర్పిస్తాను. ఆ స్కూలు ప్రక్కనే మీ నాన్న గారి అపార్టుమెంటు ఉంది. అక్కడే మేమూ ఉంటున్నాం. వారి ద్వారా మీ ఇంటి విషయాలు అన్నీ తెలిసాయి. పిల్లకు నచ్చచెబుతాను. భయపడాల్సిన అవసరం లేదు. అమ్మమ్మ తాతయ్యల దగ్గర, నా పర్యవేక్షణలో పిల్ల చదువుకుంటుంది. కాలమే పిల్ల గాయాన్ని మాన్పుతుంది. తన నిర్ణయాన్ని కాదనకండి!” 


తమ ప్రమేయం లేకుండానే జరుగుతున్న దానికి ఇద్దరూ ఆశ్చర్యపోతున్నారు. 

 “పిల్ల తాతయ్య, అమ్మమ్మలు వారి ఇంటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. పిల్ల తాలూకు బట్టలు, పుస్తకాలు వారితో పంపించి వేయండి. ఈ సమస్యకు ఇదే మంచి పరిష్కారం! “ అంటూ టీచరు వెళ్ళిపోయారు. 


అతడు, ఆమె ఆలోచనల్లో టీచర్ మార్గనిర్దేశన ప్రకారం, పిల్ల భవిష్యత్ ప్రణాళిక రూపు దిద్దుకుంటోంది. 


 / సమాప్తం /

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

      మీ సుస్మితా రమణ మూర్తి.


 

 

 

 

 

 





 

 

 



 




 


198 views3 comments

3 Comments


కథ చాలా నచ్చింది నాకు

ఒకప్పటి మన చదువులు వేరు ఉమ్మడి కుటుంబాలు ఆలోచనలుకూడా అలానే ఉండేవి

ఇప్పటి వేర్వేరు కుటుంబాలు ఆలోచనలుకూడా

ఒకరకంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ స్టేట్ లో కాపురాలు కాలక్షేపాలు అంతే ఎవరికివారే యమునాతీరే- --అవసరాల రామమూర్తి అమెరికా

Like

కథ బాగుంది గురువు గారూ, క్లుప్తంగా మొగుడు, పెళ్లాలు ఉద్యోగాలు చేస్తున్న కొంపలు ఇంచుమించు ఇలాగే తగలడ్డాయి సార్, దానికి కారణం ఇద్దరూ రెండు చేతులా సంపాదించడం, ప్రతీది ప్రెస్టీజ్, అహంకారం, ప్రక్క వాడితో పోటీ, అంతే గాని వారి పిల్లల మనస్తత్వం, వారి ఇష్టాయిష్టాలు తెలుసుకునే కనీస ప్రయత్నం కూడా చేయరు, సరే, తాతయ్య, అమ్మమ్మ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చెయ్యడానికి ఒప్పుకున్నారు, కాని తల్లిదండ్రులు అంత సులువుగా ఒప్పుకోరు, అది డౌటే మరి , వారి ప్రెస్టిజ్ ఏమి కావాలి😄- దేవానంద్ విశాఖ

Like

ప్రస్తుత పోటీ ప్రపంచంలో, డబ్బులు సంపాదించే మరమనుషుల మధ్య, చిట్టి తల్లికి కలిగిన ఇంతటి మానసిక సంఘర్షణ రాయగలగటం రచయిత యొక్క విషయ పరిజ్ఞానం, మానసిక పరిపక్వత తెలియచేస్తుంది. రచయితకు ధన్యవాదాలు. మరిన్ని సందేశాత్మక మనస్సుకు హత్తుకునే కథలు రచయిత కలంనుండి రావాలని ఆకాంక్షిస్తున్నాను.

... దిలీప్ కుమార్

Like
bottom of page