top of page

అమ్మ బదిలీ'Amma Badili' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 19/05/2024

'అమ్మ బదిలీ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్కుటుంబానికి కావాల్సినవన్నీ తండ్రి తీసుకొస్తున్నప్పుడు కుటుంబాన్ని తల్లే కాదు, ఎవరైనా నడపగలరు అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకునే వారిలో ఆడవాళ్లు కూడా ఉంటే వాళ్ళు అమ్మ అయ్యేంత వరకు తెలియదు అమ్మ విలువ. ప్రతి ఆడది ఒక అమ్మే. ఆ అమ్మ ఏ ఇంట్లో కన్నీరు పెట్టిన ఆ ఇంట్లో నుండి దేవతలు వెళ్ళిపోతాయని మన భారతదేశంలో బలమైన నమ్మకం కూడా ఉంది. అమ్మ అంటే అంతటి బలం, అంతటి శక్తి, మరెంతో ధైర్యం. అమ్మ లేకపోతే అసలు ఏ పని అవ్వదు. అసలు ఇంట్లో అమ్మ ఉంటే ఎంత వెలుగు ఉంటుందో.. తాను లేకపోతే ఆ ఇల్లు బోసిపోయినట్లు ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని విషయం. 


అమ్మ తన కోసం ఎప్పుడు బతకదు. తన కుటుంబం కోసం ముఖ్యంగా తన పిల్లల కోసం బతుకుతుంది. అమ్మ చేసే సాహసాలు ఎవరు చేయరు. భవిష్యత్ లో కూడా ఎవరు చేయలేరు. అమ్మ ప్రేమకు ఈ ప్రపంచంలో ఏది సాటిరాదు. 


అందరి అమ్మలు తమ పిల్లలపై అమితమైన ప్రేమను కురిపిస్తారు. అలాంటి అమ్మల్లో ఒక అమ్మ సింధూరమ్మ. సింధూరమ్మకు మూడో కాన్పుగా మూడో మగబిడ్డ పుట్టాక తండ్రి మరణించాడు. అప్పటికే ఇద్దరు కొడుకులు ఉన్నారు. తండ్రి ఆస్తి, ఇల్లు పెద్దవే మరియు తండ్రి పని చేసిన కంపెనీ నుండి తల్లికి ఉద్యోగం ఇవ్వటంతో అలా పిల్లలను చదివించింది. 


తక్కువ వయసులో భర్త పోవటంతో ఆ పనిలో ఆమెకు వేధింపులు మొదలయ్యి తీవ్ర స్థాయికి చేరినా.. పిల్లలు కోసం ఆమె అన్నీ భరిస్తూ వచ్చింది. లొంగని కారణంగా ఆమె ఉద్యోగం నుండి తొలిగించబడింది. అయినా మొక్కవోని ధైర్యంతో పిల్లల్ని చదివించి గొప్పవాళ్ళని చేసింది. అలా గొప్పవాళ్ళని చేయటమే ఆమె చేసిన పాపం ఏమో.. పెళ్ళిళ్ళు అయ్యాక అమ్మ అనే పదానికి కాసింత గౌరవం కూడా ఉండదా.. కాసింత ప్రేమ కూడా ఉండదా.. అని మనసులో కుమిలిపోయేంత. 


పెద్ద కొడుకు జయచంద్ర. సాప్ట్వెర్ గా స్థిరపడ్డాడు. తర్వాత వాడు లోకేష్ ఇంజనీరింగ్, మూడోవాడు నీరజ్ ఓ గవర్నమెంట్ డాక్టర్. ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడటం వలన పెళ్ళి చేశాక పెద్దోడు తాను ఉద్యోగం చేస్తున్న దగ్గరే ఒక ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నానని ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి సరిపడే డబ్బులు కూడా లేవని తనకు రావల్సిన వాట ఇస్తే బాగుణ్ణు' అని తన మనసులో మాట అమ్మ వద్ద చెప్పాడు. లోకేష్ కూడా ఇదే మాట అంటూ.. " అవునమ్మా నువ్వు ఎలాగూ.. మాలో ఒకరి వద్ద ఉంటావు కదా.. ఆస్తిని ఇంటిని అమ్మేస్తే ఆ డబ్బులతో మేం కొత్త ఇల్లు కొనుక్కోగలం "అన్నాడు. 


కొడుకుల పై నమ్మకం. మరియు ఎలాగూ తనను వాళ్ళే చూసుకుంటారు కదా.. పైగా ఇక్కడే ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళు తనను చూడ్డానికి రావటం అసలే వారికి టైం ఉండదు. అనవసర ఖర్చులు కూడా ఉంటాయి. అన్నీ ఆలోచించి కొడుకులు ఆనందం కోసం మరో సాహసం చేసింది ఆ అమ్మ. ఆ సాహసంలో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న ఆ ఇంటిని, ఆస్థిని అమ్మి డబ్బులు కొడుకులకు పంచింది. 


ఆ డబ్బులతో వాళ్ళు తమకు కావల్సిన చోట ఇల్లు కొనుక్కున్నారు. మొదట సింధూరమ్మ పెద్దకొడుకు దగ్గర ఉండాలని నిర్ణయించుకుంది. ఇక్కడే అసలు ఆట ఆరంభం అని పాపం ఆ అమాయకపు అమ్మకు తెలియదు సరికదా వాళ్ళ పై జాలిపడుతుండేది. 


కొడుకు, కోడలు ఇద్దరు ఏ రాత్రికో ఆఫీసు నుండి వస్తారు. దీంతో సింధూరమ్మ ఇంటి పని వంట పని చేసి వాళ్ళు వచ్చేసరికి అన్ని రెడీ చేసేది. చివరకు వాళ్ళు వచ్చి అమ్మ వండి వడ్డించిన అన్నం తిని విశ్రాంతి పేరుతో మనసారా నిద్రపోయేవారు. 


"తనకు ఎలాగూ కూతుళ్ళు లేరు. పోనీ పిల్లలకు పెళ్ళి చేస్తే ఏకంగా ముగ్గురు కూతుళ్ళు వస్తారని మనసులో కలలు కన్నది ఈ అమ్మ. అసలు కోడళ్ళని కూతురుగా ఊహించుకున్న ఈ నిజమైన మాత్రృమూర్తికి పెద్ద కోడలు ఇచ్చిన విలువ సున్నా. 


కరెక్ట్ గా నాలుగు నెలలు గడిచాక 

" అమ్మా.. ఎప్పుడూ నువ్వే అమ్మను ఉంచుకుంటావా.. ? ఏం మేము తనకు కొడుకులం కాదా.. మా దగ్గరకు పంపొచ్చుగా అని ఇప్పుడే తమ్ముడు ఫోన్ చేశాడమ్మా పాపం నీకోసం తమ్ముడు కూడా ఆరాటపడుతున్నాడు వెళ్ళి రా అమ్మ " అన్నాడు. 


ఆ మాటలకు పాపం ఆ పిచ్చి అమ్మ తనకోసం ముగ్గురు కొడుకులు ఎంతో ప్రేమగా ఎదరుచూస్తున్నారు. దేవుడు కరుణించక ఆ ముగ్గురు ప్రేమను ఒకే చోట అనుభవించలేకపోయాను. తప్పదు అన్నట్లు మురిసిపోతూ లోకేష్ వద్దకు బదిలీ అయ్యింది. 


తాను వెళ్ళేసరికి కొడుకు, కోడలు ఇంట్లో లేరు. కొడుకు డూటి నుండి ఏ అర్థరాత్రికో వస్తాడట, కోడలు కూడా ఏదో ఆఫీసులో పని చేస్తుందని సాయంత్రానికి మాత్రం ఆమె వస్తుందని పొరుగు వారికి అడిగి తెలుసుకుంది. 


అనుకున్నట్లే కోడలు సాయంత్రం వచ్చింది. అత్తని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆశ్చర్యపోయింది. భర్త రమ్మన్నాడేమో అని తగిన మర్యాదలు చేసి ఆహ్వానించింది. 


లోకేష్ వచ్చాక అమ్మని చూసి 

"ఏంటమ్మ ఇక్కడికి వచ్చావ్.. ? అన్నయ్య దగ్గర కష్టంగా ఉందా.. ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా.. ? ప్రశ్నించాడు. 


" అదేంట్రా అలా అంటావ్.. ?” జయచంద్ర చెప్పినది లోకేష్ కి చెప్పింది. 


"అమ్మా! నువ్వు వస్తే ఏ కొడుకుకైనా ఆనందమేగా. అలాగే నాకు కూడా ఆనందమే కానీ.. ! అన్నయ్య ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు తెలియదమ్మా. ఆసలు నేను అన్నయ్యకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు " అన్నాడు. 


పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని ఎదురుగా గోడకు తగిలించి ఉన్న క్యాలెండర్ చూసి అమ్మను చూడ్డానికి తన వంతుగా నాలుగు నెలలు పూర్తి అయ్యాయని పొమ్మనే ధైర్యం లేక ఈ మాటలు చెప్పాడని తెలుసుకుని మనసులో కుమిలిపోయింది. ఇలాంటి కొడుకుల కోసమా.. ఇన్ని త్యాగాలు చేసింది.. అని రోజు మనసార ఏడ్చేది సింధూరమ్మ. ఎందుకంటే.. ! ఇంట్లో కొడుకు లోకేష్ కానీ.. కోడలు కానీ ఉండరు కదా.. పెద్ద కొడుకు ఇంట్లో ఎలా పనిచేసిందో ఇక్కడ కూడా అలానే చేస్తుంది కాబట్టి. 


ఈ ఇద్దరి కొడుకులు బండారం బయట పడ్డాక నాలుగు నెలలు నాలుగు యుగాల్లా గడిచాక చిన్నవాడి దగ్గరకు వెళ్ళింది. వాడికి కూడా అమ్మ బదిలీ వాట గూర్చి తెలిసిందో ఏమో.. సగర్వంగా ఆహ్వానించాడు. కానీ.. ఉదయం తొమ్మిది లోపు, సాయంత్రం ఐదు తర్వాత అందుబాటులోనే ఉంటాడు అయినా.. ! అమ్మ వండింది తినటమే తప్ప ఏ రోజు అమ్మ అంటు తన దగ్గరకు వచ్చి మాట్లాడే సమయం మాత్రం ఉండేది కాదు వాడికి. 


ఈ అమ్మలో ఎన్నో ఆలోచనలు మరెన్నో భాదలు.. 

నెలకు వేలు, లక్షల్లో జీతం సంపాదించే కొడుకులు అమ్మను భారంగా భావించటం ఏంటీ.. ? 


తానను నాలుగు నెలలకు ఒకసారి బదిలీ చేసే ఈ కొడుకులు, ఇంట్లో ఏ పనికి కూడా సహకరించని కోడళ్ళు తాను లేనప్పుడు ఇంటి పని, వంట పని ఎలా చేస్తున్నారు.. ?


ఇప్పుడు తనకు పని చేసే శక్తి ఉంది. మరీ.. !ఆ శక్తి లేనప్పుడు అయినా.. తనను చూస్తారా.. ?


అసలు ఈ అమ్మ ఒక కొడుకు నుండి మరో కొడుకు దగ్గరకు బదిలీ అవుతుందే తప్ప ఆమెకు ప్రేమ కానీ.. సంతోషం కానీ.. విశ్రాంతి కానీ దొరికితేగా.. 


ఈ ఆలోచనలతో మూడో కొడుకు, మూడో కోడలుకు సేవ చేసే సరికి మరో నాలుగు నెలలు గడవగా మరలా పెద్ద కొడుకు దగ్గరకు బదిలీకి అమ్మ సిద్ధమయ్యింది. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

40 views0 comments

Comments


bottom of page