top of page

అమ్మ నోట జోలపాట

Updated: Feb 4

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaNotaJolapata, #అమ్మనోటజోలపాట, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 7

Amma Nota Jolapata - Somanna Gari Kavithalu Part 7 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 27/01/2025

అమ్మ నోట జోలపాట - సోమన్న గారి కవితలు పార్ట్ 7తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అమ్మ నోట జోలపాట

----------------------------------------

అమ్మ ప్రేమ ఘనమైనది

అవనిలో సాటిలేనిది

పిల్లల పెంపకంలో

మిగుల నైపుణ్యమున్నది


పెడుతుంది గోరు ముద్దలు

చెపుతుంది మంచి మాటలు

ప్రేమనంత రంగరించి

నింపుతుంది చిరు బొజ్జలు


వినిపించును నీతి కథలు

సవరించును చెడు గుణములు

అమ్మ గృహమున తొలి గురువు

పిల్లలకు కామధేనువు


పాడుతుంది జోలపాట

పరికింప అమృతంబు ఊట

శుభములెన్నొ అమ్మ నోట

ఆమె ఇంట కంచుకోట


















ఎంతో మంచిది

----------------------------------------

ముఖానికి బహు అందము

చిందించిన చిరు నవ్వులు

పరిమళించు సుమ గంధము

రంజింపజేయు మనసులు


శ్రేష్టమే స్నేహ బంధము

ఖరీదు కట్టలేనిది

సంతోషం ఐశ్వర్యము

అన్నింటిలో ఘనమైనది


సుగుణ సంపద గొప్పదోయ్!

కల్గియుంటే మంచిదోయ్!

గౌరవానికి హేతువు

జీవితానికి సేతువు


ధర్మాన్ని పాటిస్తే

న్యాయాన్ని గౌరవిస్తే

ఎంతో ఎంతో క్షేమము

సత్యాన్ని అనుసరిస్తే
















స్వర్గతుల్యం మనశ్శాంతి

----------------------------------------

వెలపెట్టి కొనలేనిది

సృష్టిలో విలువైనది

హృదయాన మనశ్శాంతి

జీవితాన నవకాంతి


మనశ్శాంతి స్వర్గమే!

జగమెరిగిన సత్యమే!

అది గనుక లేకపోతే!

జీవితాలు అధోగతే!


మదిని నెమ్మది లేకున్న

ఎంత ఉన్న గుండు సున్న

జీవితమే వ్యర్తమన్న

అక్షరాల నిజమన్న


మనశ్శాంతే ఉంటే

సమస్తం ఉన్నట్టే

చేజార్చుకుంటే

ఇక అన్నీ లేనట్టే


అనవసర విషయాలతో

పనికిరాని పనులతో

మనశ్శాంతి కోల్పోకు

జీవచ్చవం కాబోకు















చింతలు చితి మంటలు

----------------------------------------

గుండెల్లో చింతలు

చెలరేగే మంటలు

ఆదిలో తరిమితే

ఉల్లసించు మనసులు


చీడపురుగులు చింతలు

చెరుపునోయి బ్రతుకులు

మించితే మ్రోగించును

పెను ప్రమాద ఘంటికలు


వదిలిపెడితే చింతలు

మిగులునోయి! నెమ్మది

మనసులోని బాధలను

చేయవచ్చు సమాధి


తేలికగా మనసును

చేసుకొనుము సతతము

అందమైన బ్రతుకును

చేయి నిత్య నూతనము























నోటి మాటతో జాగ్రత్త!

----------------------------------------

శక్తిగలవి మాటలు

కదిలించును మనసులు

ఆదరించి చల్లగ

బాగు చేయు బ్రతుకులు


మాటలతో మోదము

పంచపెట్ట వచ్చును

వాటితోన ఖేదము

కల్గియుంచ వచ్చును


మాట మనిషి ఆయుధము

అభివృద్ధికి మార్గము

సృష్టించును స్వర్గము

లేకపోతే నరకము


జాగ్రత్త! మాటతో

కలుగజేయు ప్రమాదము

గతితప్పితే నష్టము

జీవితాన కష్టము


మాట విలువ పెంచును

సంతసమే పంచును

నిలకడ లేకపోతే

అపకీర్తి తెచ్చును


మాట వలన శుద్ధత

దానితోన భద్రత

మాట్లాడే ముందే

యోచిస్తే మంచిదే









మేలి మాటల సరాలు

---------------------------------------

దివ్వెలాగ పదిమందికి

రువ్వాలోయ్! వెలుగులే

పువ్వులాగ జీవితాన

నవ్వుతూ బ్రతకాలోయ్!


అవ్వ మాటలు వింటూ

గువ్వలాగ విహరిస్తూ

మువ్వలాగ మ్రోగాలోయ్!

జువ్వలా సాగాలోయ్!


హద్దులో ఉండాలోయ్!

బుద్ధి బాగుండాలోయ్!

శుద్ధమైన హృదయంతో

ముద్దబంతి కావాలోయ్!


వట్టి మాటలు వద్దోయ్!

భట్టి విక్రమార్కునిలా

గట్టి పనులు చేయాలోయ్!

చెట్టులా !సాయ పడాలోయ్!














సూక్తి సుధ

---------------------------------------

బహు విలువైనది సమయము

సుతిమెత్తనిది హృదయము

జాగ్రత్తగా వాడాలి

కనుపాపలా చూడాలి


పువ్వులాంటి స్నేహము

చేయరాదు ద్రోహము

రోజా పూవు రీతిలో

రోజురోజూ పూయాలి


పవిత్రమైన బంధము

జీవితంలో అందము

పదిలంగా ఉండాలి

నదిలా ప్రవహించాలి


అంతరంగ సద్గుణము

అసలు సిసలు సౌందర్యము

సూర్యోదయమవ్వాలి

నందన వనం కావాలి
















అందానికి అందము

---------------------------------------

నీటిలోని కలువలు

యేటిలోని జలములు

అందానికి అందము

ఇంటిలోని బాలలు


నింగిలోని చుక్కలు

నేల మీద మొక్కలు

అందానికి అందము

అవనిలోన వనితలు


తోటలోని పూవులు

పాటలోని పదములు

అందానికి అందము

బాట ప్రక్క తరువులు


పసి పిల్లల ముఖములు

చంద్రబింబ కాంతులు

అందానికి అందము

చిరు నవ్వుల పువ్వులు


మనసులో సుగుణములు

పొంగిపొర్లు మమతలు

అందానికి అందము

సదనంలో పెద్దలు


వెలసిన హరివిల్లులు

విరిసిన సిరిమల్లెలు

అందానికి అందము

మమతల పొదరిల్లులు



















అక్షర సత్యాల హారాలు

---------------------------------------

పసి వారి చిద్విలాసము

తలపించును మధుమాసము

నిర్మల నీలాకాశము

పురివిప్పిన నెమలి అందము


అమ్మ ఒడిని వెచ్చదనము

పూవు వోలె మెత్తదనము

వర్ణింపనెవరి తరము

పాన్పులాంటి చక్కదనము


నాన్న గారి త్యాగగుణము

వారిలోని గొప్పతనము

ఎవ్వరికి కాదు సాధ్యము

కొనియాడగ పౌరుషము


గురువులోని విజ్ఞానము

తొలగించును అజ్ఞానము

ఇస్తుంది నిండుదనము

అదే మనకు మూలధనము
















ఉపయోగమెంతో!

---------------------------------------

చెట్టుకున్న వేరు

వ్రేలుకున్న గోరు

ఉపయోగమెంతో!

పారుతున్న యేరు


శుద్ధమైన తీరు

సేవించు తేనీరు

ఉపయోగమెంతో!

ఆదరించు నోరు


అన్నదాత హలము

కవీంద్రుని కలము

ఉపయోగమెంతో!

చెరువులోని జలము


పంటనిచ్చు పొలము

కొమ్మకున్న ఫలము

ఉపయోగమెంతో!

శ్రాన్తినిచ్చు గళము

***

-గద్వాల సోమన్న


1 Kommentar


అమ్మ నోట జోల పాట: సోమన్న


చిన్ననాటి మధుర స్మృతులు మదిలో మెలిగాయి


ఉదాహరణ పాట:


"చిన్నారివే నీవు, చిలకవే నీవు ... జో జో జో"


అన్నమయ్య రచించిన: "చందమామ రావే, జాబిల్లి రావే ...


చాలా ప్రచురణ పొందాయి ... ప్రజలలో ... ప్రత్యేకంగా అమ్మలలో


4) ఎంత మంచిది: సోమన్న


అందరూ ప్రపంచ నాయకులు చదవాలి ... ప్రపంచ ఐక్యత వస్తుంది ... యుద్ధాలు పోతాయి


మంచి శాంతి - స్నేహం - ప్రేమ పుస్తకాలు, కవితలు ... చదవాలి

ప్రపంచ నాయకులు ... రోజూ ... కనీసం ఒక్కటైనా ... అప్పుడే మంచి మార్పు సంభవం ...


మహాత్మా గాంధీ యే అన్నారు

"మంచి పుస్తక పఠనం... అత్యున్నత అలవాటు అని"

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Gefällt mir
bottom of page