top of page

అమ్మ


Amma written by Lanka Jayakumari

రచన : లంక జయకుమారి

దూరంగా గుడిలో సుప్రభాతం మనస్సుకు ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే శుభ శ్రవణం, స్వామి వారి నామస్మరణతో మొదలవుతుంది, కానీ మెలుకువ వచ్చిన మంచం దిగడానికి బద్ధకంగా ఉంది. దిగిన దగ్గర నుండి ఉరుకులు పరుగుల జీవితం, ఎప్పుడు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని తింటానో ఏమో!!?

జాను:: ఏవండి.. ఏవండి....!!??

రాజా:: అబబ్బ ఎక్కడ దొరికావే, జీవితంలో ఎలాగో ప్రశాంతత ఎలాగో లేదు, మనసులో కూడా అనుకోనివ్వరా నువ్వు, నీ అత్తగారు., చెప్పి చావు ఎందుకు పిలిచావో, కాదు కాదు ఎందుకు అలా అరిచావో చెప్పు.

జాను:: అదికాదండి..

రాజా:: ఏది కాదు చెప్పువే విసిగించక..

జాను:: అత్తయ్య కనిపించడం లేదండి.

రాజా:: హా.. ఏమ్ మాట్లాడుతున్నావ్, ఇక్కడే.. ఎక్కడో ఉంటుంది చూడు, ఏ పక్కింట్లోనో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది, సరిగ్గా చూసి చావు.

జాను:: అందరినీ అడిగాను, ఎవరు రాలేదు అన్నారు.

ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారో!!? అసలు ఎక్కడికి వెళ్లినా చెప్పే వెళతారు, కానీ ఈరోజు చెప్పలేదు.. రాత్రి మీరు అన్న మాటలకు బాధపడి నిజంగానే ఇంట్లో నుండి వెళ్లిపోయారేమో. భగవంతుడా.. మా అత్తయ్య తొందరగా ఇంటికి వచ్చేయాలి. అయినా మీకు చాలా సార్లు చెప్పా ఆవిడ మీద అరవొద్దు అని... వినిపించుకోరు! ఆఫీసులో గొడవలు అన్నీ తీసుకుని వచ్చి మా మీద అరుస్తారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి దేవుడా..


ఏడుస్తున్న జానుని పట్టించుకోకుండా, 'అమ్మా! ఎక్కడికి వెళ్లావు' తల పట్టుకుని మంచం మీద కూర్చుండిపోయాను.

'ఎన్ని సార్లు చెప్పాలి నీకు, నన్ను తినకు. ఎప్పుడు చూడు నా వెనుక తిరుగుతూ.. తిన్నావా, ఉన్నావా, అలా చెయ్యకు, ఇలా చెయ్యకూడదు అని చెబుతూనే ఉంటావ్. నాకు తెలియదా ఏమి చెయ్యాలో, ఇంకా నువ్వే చెప్పాలా, నాకు అన్నీ తెలుసు, ఇంకా చిన్నపిల్లాడిని కాను, నువ్వు వెళ్లిపో నా కళ్ళకు కనిపించకు.. అసలే ఈ ఆఫీసు గొడవలతో చస్తున్నా! వచ్చిన జీతంలోనే ఇంటికి తీసుకున్న లోను కట్టాలి, పిల్లాడి చదువులు, నీ హాస్పటల్ ఖర్చులు.. ఇవన్నీ ఎలారా దేవుడా అని నా పాట్లు నేను పడుతుంటే మధ్యలో మీ సతాయింపు ఒకటి., కోట్ల ఆస్తులు సంపాదించి ఇచ్చినట్లు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ వుంటావ్, ప్రపంచంలో బోలెడు వృద్దాశ్రమాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కృష్ణరామా అనుకోకుండా, ఇక్కడ మమ్మల్ని.. చా., వెళ్ళు తల్లీ వెళ్ళు. అప్పుడైనా కొంచెం ప్రశాంతత దొరుకుతుంది ఏమో చూద్దాం'

రాత్రి అమ్మను అన్న మాటలు ఒక్కొకటిగా గుర్తు వస్తున్నాయి. గత జ్ఞాపకాలతో నాలో అంతర్మధనం మొదలయ్యాయి..

'ఓరి దేవుడా ఎంత పని చేశాను.. ఈ పని ఒత్తిడి మూలంగా అమ్మ మీద అరిచేసా, ఆ టైంలో అమ్మ ఎంత బాధపడి వుంటుందో పాపం, నాకు అస్సలు బుద్ధి లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను ఎంత కష్ట పడి పెంచిందో. తన ప్రాణాలన్ని నామీద పెట్టుకొని ప్రేమగా చూసుకొంది.


నాన్న నాకు 5 వ ఏట ప్రమాదంలో చనిపోతే, తన బాధ్యత కూడా తీసుకోని నన్ను బాగా చదివించి ఇంత వరకు తీసుకువచ్చింది.

ఏడుస్తూ చూస్తున్న నాకు ఎదురుగా ఒక పాత పెట్టె కనిపించింది. అది అమ్మది నా చిన్నప్పుడు అమ్మ బట్టలు, డబ్బులు దీనిలోనే దాచేది, ఇంకా ఈ పెట్టెను వాడుతుందా అని, పెట్టెను తెరిచి చూడగానే ఆశ్చర్య పోయాను.

దానిలో నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ, మొదటి పుట్టినరోజుకి వేసిన షర్ట్, పలక, అన్ని జ్ఞాపకాలతో పాటు, అమ్మ రాసుకున్నా డైరీ కూడా వుంది.

డైరీ తెరవగానే దానిలో నా చిన్ననాటి ఫోటో, ఒక కవర్ లో చిరిగిన 50 రూపాయల నోటు ఉన్నాయి. ఆ నోటు చూడగానే నా చిన్నతనంలో ఆడుకుంటూ చింపిన 50 రూపాయల నోటు గుర్తుకు వచ్చింది. ఆ చిరిగిన నోటు చూపి అమ్మ నేను డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టినప్పుడల్లా డబ్బు విలువ తెలియచెప్పేది.


నువు చింపిన 50 రూపాయల విలువ ఒక వ్యక్తి ఒక రోజు ఆకలి తీరిస్తుందని, ఆకలితో ఉన్న ఒక తాత దగ్గరకు, 50రూ.లతో భోజనం కొని నన్ను తీసుకువెళ్లింది. ఆ భోజనం తీసుకొని తాత గబగబా భోజనం చేసి నన్ను దీవించారు, అమ్మకి నమస్కారం చేసి, మీరు మీ బాబు సుఖంగా ఉండాలి తల్లి అన్నారు, అప్పుడు ఆయన కళ్ళలో కృతజ్ఞత, సంతోషం స్పష్టంగా కనిపించాయి.

ఆ క్షణం అమ్మ చెప్పిన మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. ఆ చిరిగిపోయిన నోటు నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆనోటుని ఇంకా దాచిపెట్టిందా అమ్మ!

తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆ డైరీలో రాసుకుని రోజు చూసుకుంటూ ఉంటుందా, అమ్మ నన్ను నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే, నేను తనతో ఇలా ప్రవర్తిస్తున్నానా, అమ్మ నన్ను చాలా మిస్ అవుతుంది అందుకే నేను ఎక్కడ తప్పుడు మార్గాల్లో అడుగులు వేస్తానో అని భయపడుతున్నారు.


"అమ్మా! ఎక్కడకు వెళ్లావు" అని గట్టిగా ఏడవడం చూసి.. జాను వచ్చి "ఎందుకు అలా ఏడుస్తున్నారు, మాట అనే ముందు ఆలోచించాలి. ముందు వెళ్లి అత్తయ్యను వెతకండి".


"అవును అమ్మ ఎక్కడ ఉన్నా తీసుకోని వస్తా" అని లేచే సరికీ.


"రాజా.." అనే పిలుపు విని వెన్నక్కి తిరిగాను, అమ్మ "అప్పుడే బయలుదేరుతున్నవా నాన్నా.." అంటుంటే, పరుగెత్తుకుని వెళ్లి అమ్మను కౌగిలించుకొని "నన్ను క్షమించు అమ్మా! ".

అమ్మ : ఎందుకు రాజా

రాజా : నిన్న నేను నిన్ను అలా అనకూడదు, నన్ను క్షమించండి అమ్మ, ఇంకెప్పుడూ నిన్ను ఏమీ అనను. ఎంత బయపడ్డామో తెలుసా? నువు ఎక్కడికి వెళ్లిపోయావు ఏమో అని.

అమ్మ : పిల్లలు కోపంలో ఏదో అన్నారు అని వెళ్ళిపోతే తల్లి ఎందుకు అవుతుంది చెప్పు. నీ పని ఒత్తిడి వల్ల అలా అన్నావ్ అని నాకు తెలుసు రాజా. నింగి, నేల ఉన్నంత కాలం అమ్మ ప్రేమ అలానే ఉంటుంది.

రాజా : ఎక్కడికి వెళ్ళావ్ అమ్మ.

అమ్మ : గుడికి వెళ్ళాను, వెళ్లేటప్పడు ఆటో వాడుకి 100 రూ ఇస్తే, చేంజ్ ఇచ్చేటప్పుడు చిరిగిన50 రూ నోటు ఇచ్చాడు. నేను చూసుకోకుండా పర్స్ లో పెట్టేసుకున్న. కొబ్బరికాయ కొందామని పర్స్ లోంచి తీసి 50 రూ ఇచ్చా, తీరాచూస్తే అది చిరిగిన నోటు అని కొట్టు వాడు తిరిగి ఇచ్చేసాడు.. ఆటోవాడు చేసిన పనికి అక్కడ పెద్ద రచ్చ జరిగిందిలే. ఆటో డ్రైవర్ తన సమస్య తీరింది అనుకున్నాడు, కానీ అది ఇంకొకరికి సమస్య అవుతుంది అని ఆలోచించ లేకపోయాడు.,

కానీ ఆ 50 నోటు చూస్తే నువు చింపేసిన నోటు, నీ అల్లరి గుర్తుకు వచ్చింది. నిన్ను తలుచుకొంటు నడిచి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది. పోనీలే ఇప్పుడు వచ్చేశా కదా, నీకు ఈరోజు ఒక మాట చెబుతా విను.

మన వల్ల ఒకరు లాభ పడక పోయిన పర్వాలేదు కానీ నష్టపోకూడదు..

డబ్బు చాలా విలువయ్యింది దానిని అవసరం ఐతేనే ఖర్చు చెయ్యాలి, అనవసరంగా ఖర్చు చెయ్యకూడదు. అలా అని డబ్బే ప్రపంచం కాకూడదు. డబ్బు కన్న విలువైనది ప్రేమ, ఆప్యాయతలు, నీతి నిజాయితీ, అవే మనకు నలుగురు మనుష్యులను తోడుగా ఇస్తాయి.. సరేనా.

రాజ:: తప్పకుండా అమ్మా!

జయ.✍


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

1,182 views12 comments
bottom of page