top of page

అమ్మ(కం)తనం


'Ammakamthanam' New Telugu Story

Written By Sujatha Thimmana

'అమ్మ(కం)తనం' తెలుగు కథ

రచన: సుజాత తిమ్మన
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“అమ్మా...! నికిత ప్రెగ్నెంట్ అట....వాట్స్ అప్ లో మెసేజ్ పెట్టింది" పనులన్నీ అయి నిద్రకి ఉపక్రమిస్తున్న సరస్వతి దగ్గరికి వస్తూ చెప్పింది దామిని.


“చాలా సంతోషం రా...ఈ సారన్నా దేవుడు కరుణించి ఈ నలుసు నిలబడితే తన కోరిక, కష్టాలు తీరతాయి...పాపం మూడు సార్లు ఎబార్షన్స్ అయ్యాయి కదూ! క్రితం సారి ఇండియా వచ్చినప్పుడు కలిసాం కదా... ఎంతగా డీలా పడిపోయిందో పిచ్చిపిల్ల...” సంతోషాన్ని ప్రదర్శించింది సరస్వతి..


***


సరస్వతికి ఇద్దరు అమ్మాయిలు దామిని, యామిని. చిన్న కుటుంబం..భర్త మురళీధర్...అతనిది ప్రభుత్వరంగ సంస్థలో గుమస్తా ఉద్యోగం..


చిన్నప్పటి నుంచి సరస్వతికి బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చెయ్యాలని ఎంతో కోరిక ఉండేది..కానీ తన పరిస్థితుల కారణంగా పదవతరగతి అవగానే మేనరికం పోతుందంటూ పెళ్లి చేసేసారు ఆమె తల్లితండ్రులు. తమకి ఇద్దరూ అమ్మాయిలే పుట్టినా వాళ్ళని మంచి చదువులు చదివించాలన్న పట్టుదలతో, అద్దె ఇల్లు అయినా నేర్పుతో ఓర్పుతో సరిపెట్టుకుంటూ, పిల్లలిద్దరిని ఇంజనీరింగ్ చదివించారు.. వాళ్ళు కూడా అమ్మానాన్నలకి ఎదురు చెప్పకుండా బుద్ధిగా చదువుకున్నారు.


సరస్వతికి తెలిసిన వాళ్ళలో చాలా మంది ఇంజనీరింగ్ చదివిన పిల్లలు అమెరికాకి, లేదా ఇతర విదేశాలకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ... అది తెలుసుకుని తను కూడా ఎలాగయినా పిల్లలని విదేశాలకి పంపాలని ఆమెకి ఆశగా ఉండేది.. అమ్మాయిలిద్దరికకీ విదేశాలకి వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు.


“అంత దూరం అందరినీ వదిలి వెళ్లి అక్కడ కష్టాలు పడటం ఎందుకమ్మా? ఎంచక్కా నీకు దగ్గరగా ఉంటూ అన్నీ మేమే అయి చూసుకుంటాం కదా..” అంటూ తీయటి కబుర్లు చెపుతూ ఇక్కడే ఉద్యోగాలు వెతుక్కున్నారు ఇద్దరు అమ్మాయిలు..


అన్నట్టుగానే ఇద్దరికీ దగ్గర దగ్గర సంబంధాలే కుదిరాయి..


రెండు సంవత్సరాల తేడాతో ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసి ‘హమ్మయ్యా’ అనుకున్నారు మురళీధర్ దంపతులు. ఇద్దరు అల్లుళ్ళు కూడా హైటెక్ సిటిలో మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ.. ఇంటికి వస్తూ పోతూ... దగ్గర దగ్గరగానే ఉంటున్నారు.


ఒక వైపు ఆనందమే...మనవడు..మనవరాళ్ళతో..ముచ్చటలు తీర్చుకుంటూ..సమయం తెలియకుండా గడిచిపోతుంది...కానీ...


విదేశాల్లో ఉంటున్న పిల్లల తల్లితండ్రులు మాటిమాటికీ అమెరికా అనో, ఆస్ట్రేలియా అనో, లండన్ అనో, స్విట్జర్లాండ్ అనో వెళుతూ, అక్కడి కబుర్లు చెపుతూ ఉంటే సరస్వతికి తన పిల్లలు కూడా కనీసం ఒక్కళ్ళయినా అలా వేరే దేశాలలో, ఉండి ఉంటే ఎంత బాగుండేది అని వాపోతూ ఉంటుంది... భర్తా పిల్లలూ ఒక్కటై తన ఆశను ఆట పట్టిస్తూ ఉంటారు.


‘అనుకున్నది జరుగదు, జరిగేది తెలియదు, జరిగినదే మంచిది అనుకుని సర్డుకుపోవడమే జీవితమంటే’ అన్న జీవిత సత్యాన్ని నమ్మి, ఆ సత్యంలోనే జీవితాన్ని గడిపేయడం అలవాటు చేసుకుంది సరస్వతి.


***


ఓ రోజు కూరలు కొనడానికి దగ్గరలోనే ఉన్న కూరగాయల దుకాణానికి వెళ్ళింది సరస్వతి...


“అమ్మా ! నమస్తే..! చాల రోజులకి వచ్చారమ్మా....” అంటూ పరామర్శించాడు కూరగాయల దుకాణం ఓనరు బాలకృష్ణ...


చిన్నగా సైకిల్ మీద కూరగాయలు అమ్ముకుంటూ మెల్లగా దుకాణం పెట్టుకుని, ఎంతో కష్టపడి ఇప్పుడు సొంత ఇల్లుకొనుక్కున్నాడతను. రోడ్డు వైపుకి నాలుగు మడిగెలు [షాపులు] కట్టించి మూడు అద్దెకు ఇచ్చి...ఒక దాంట్లో తాను కూరగాయలు అమ్ముకుంటున్నాడు... సైకల్ మీద అమ్మేటప్పటి నుంచి అతను సరస్వతి వాళ్ళకి మంచి కూరగాయలు తెచ్చి ఇవ్వటం అలవాటు.. మాటా మంతీ మాట్లాడుతూ ఉంటాడు..(అంటారు కదా..నోరు మంచిది అయితే..ఊరు మంచిది అవుతుంది అని...అక్షరాలా ఆ సామెత పాటిస్తాడు బాలకృష్ణ..)


“నమస్తే బాలకృష్ణా! ఎలా ఉన్నావు..? ఈమధ్య సారే తీసుకొస్తున్నారు. అందుకే నేను రావడంలేదు... అమ్మాయి చదువు అయిపోయిందా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సరస్వతి.“అమ్మవారి దయ వల్ల ఇంజనీరింగ్ అయిపొయిందమ్మా! క్రిందటేడాదే ఆరు నెలల క్రితం నా చిట్టి తల్లి అమెరికాకి వెళ్ళిందమ్మా... పెద్ద సదువులు సదువుతా అంటూ... కాదనలేక పోయిన.. బ్యాంక్లో లోన్ తీసుకుందమ్మా..” అంటూ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ..


ఒక్క క్షణం కళ్ళముందు చీకటి అయిపొయింది సరస్వతికి..ఆశ్చర్యం తోటి...గుండె చిక్కబట్టుకొని..తనని తాను సముదాయించుకుంటూ... “చాలా సంతోషం బాలకృష్ణా...” అని పై పైనే అంది సరస్వతి... ఇక అక్కడ ఉండలేక ఏవో రెండు కూరలు కొని గబగబా ఇంటికి వచ్చి పడింది సరస్వతి..


***


బాల్కనీలో వేసిఉన్న పడక్కుర్చీలో కూర్చుని, మొబైల్ కున్న ఇయర్ ఫోన్స్ ను చెవులకు తగిలించుకొని, రఫీ పాటలు వింటూ, మెల్లగా హమ్ చేస్తున్న మురళీధర్ దగ్గరికొచ్చి, అతన్ని ఒక్క కుదుపు కుదిపింది, “ఇది విన్నారా?” అంటూ...


ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏమిటన్నట్టు కనుబొమలు ఎగరేసాడు మురళీధర్, చెవుల్లోని ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పడేస్తూ...


“మన బాలకృష్ణ..అదే కూరగాయల బాలకృష్ణ కూడా తన కూతుర్ని అమెరికా పంపించాడు. మరో రెండేళ్ళు పొతే.., మంచి జాబ్ చూసుకుని అక్కడే సెటిల్ అయిపోతుంది ఆ పిల్ల... ఇక ఆ బాలకృష్ణ భార్య... ఎంచక్కా విమానం ఎక్కి అమెరికా వెళ్లి వచ్చి తెగ పోజులు కొడుతుంది...హు..మన పిల్లలు ఉన్నారు..ఎందుకు...” అక్కసంతా వెళ్ళగక్కింది...సరస్వతి..


“ఇంతకీ ఫోజులు కొట్టలేకపోతున్నాననా నీ బాధ?” ఓరగా చూస్తూ అన్నాడతను.


‘ అనండి.. అనండి.. మీకు వెటకారం అయిపోయాను.. పిల్లలను ఉన్నత చదువులు చదివించింది...ఎంతో గొప్పగా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ...తల్లి తండ్రులను కూడా ఉన్నతంగా చూసుకుంటారు అని..ఏదో ఆశ..అలా ఆశ ఉండటం ఏమీ తప్పుకాదే... అదే చాలీ చాలని జీతాలతో ఇక్కడ నానా కష్టాలు పడుతూ పిల్లలిద్దరినీ కనీసం మన మాదిరిగా కూడా పెంచలేని స్థితిలో ఉన్నారు మన పిల్లలిద్దరూ... ఇందుకోసమేనా మనం అంత కష్టపడింది...చెప్పండి...” ఎదురు ప్రశ్న వేస్తూ...లోన వేదనని వెళ్ళగ్రక్కింది సరస్వతి.


“పైన ఏముంటుంది...అంటే ఆకాశం అని టక్కున ఎట్లా చేపుతామో...అలాగే ఉన్నత విద్యలు చదివిన వాళ్ళు తప్పనిసరిగా విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటారు...అది ఎంత సబబో..కాస్త ఆలోచించు సరస్వతి....అక్కడ మాత్రం వాళ్ళు ఊరికే డబ్బు సంపాదిస్తున్నారా..రాత్రి..పగలు..తిండి నిద్ర మానుకుని మరి..ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ..పిల్లలని డే కేర్ లలో వదిలి పెడుతూ...ఐన వాళ్ళకి దూరంగా...ఉంటూ...ఎంత బాధని..తమలో తాము దాచుకొని పైకి అలా గొప్పలు పోతున్నారో...ఒక సారి తరచి చూడు సరస్వతి...” అంటూ అనునయంగా సమాధానపరచాడు మురళీధర్.


***


దాదాపు ముప్పై సంవత్సరాల తరువాతే.. తన అమ్మమ్మ గారి ఊరిలో అడుగు పెట్టింది సరస్వతి మేన మామగారి షష్టిపూర్తి సందర్భంగా. పట్టుమని మూడు వందల ఇళ్ళు అయినా లేవు... అందులో సగం గడపలు తాళాలతో ఉండగా ఊరంతా బోసిపోయినట్టుగా ఉంది.


మామయ్య ఇంటి గుమ్మంలోనే సందడి...అంతా విదేశీ వాసనలు...సరస్వతిని చూస్తూనే మామయ్య ఎంతో ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు. “మళ్ళీ మిమ్మల్నందరిని ఇలా చూస్తాను అనుకోలేదురా..” అంటూ..


అత్తయ్య పచ్చని ఛాయతో మెరిసిపోతూ మహలక్ష్మి లా కళకళ లాడుతూ ఉంది...వారిరువురిని చూస్తూ ఉంటె అచ్చంగా ఆ శివపార్వతులే కళ్ళముందు కనిపిస్తున్నారా అన్నట్టుంది..


మామయ్యగారికి నలుగురు సంతానం. అందులో ఇద్దరు అబ్బాయిలు పెద్దవాళ్ళు. తరువాత ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయిలు పొలం పనులు మాకు పడవు అని ఉన్నత చదువులు చదువుకుని... మంచి ఉద్యోగాలు చేస్తూ... ఒకళ్ళు కెనడా.. ఒకళ్ళు ఆస్ట్రేలియా లో స్థిరపడ్డారు. ఇక అమ్మాయిలు కూడా అమెరికాలో ఒకళ్ళు దుబాయ్ లో ఒకళ్ళు స్థిరపడ్డారు. ఇలా పిల్లలందరూ విదేశాలలో ఉండటంతో దంపతులిద్దరూ ఏడాది పొడుగునా పిల్లల దగ్గరికి అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. మధ్యలో ఎప్పుడైనా ఇండియా వచ్చి పొలం...ఇల్లు..ఇతర వ్యవహారాలు వాకబు చేసుకుని వెళుతూ ఉంటారు...ఇదంతా తెలుసుకున్న సరస్వతి “నిజంగా మామయ్య వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో... ఎప్పడు విమానాలలో తిరుగుతూ...గాలిలో తేలిపోతూ ఉంటారు..” అనుకుంది..


“బీటలు పడిన పొలాలని చూడు సరస్వతి ఒకసారి....చదువుకున్న యువతరం తమ జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త పరికరాలతో ఆధునిక సేద్యం చేస్తే..ఈ మట్టి లోనే బంగారం పండించ వచ్చు..పిల్లలు చదువుకోవాలని పెద్దవాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కాయా కష్టం చేస్తూ ఉంటే...చదువుకున్న పిల్లలు ఊరు మాకు వద్దు అని పట్టణాలు..విదేశాలు వలస వెళ్ళిపోతూ ఉంటే...ఇక ఊరు ఇలా మట్టి దిబ్బ..ఎడారి కాక ఏమవుతుంది...”కనుచూపు మేరలో పచ్చదనం కనిపించని ఆ భూమిని చూస్తూ... ఆవేదనగా అన్నాడు మురళీధర్.


“మీరు ఏమయినా చెప్పండి.. నాకు ఉన్న ఈ అసంతృప్తిని మాత్రం పోగొట్టలేరు...” ఖరాఖండీగా చెప్పేసింది సరస్వతి.


***


సెల్ రింగ్ అవుతూ ఉంటే ఆన్ చేసి హలో అన్నాడు మురళీధర్. “హా నాన్నా నేను...’ దామిని స్వరం.


“చెప్పరా బంగారు..”


“ఓ విషయం నాన్నా....మన నికిత గురించి తెలుసు కదా.యు.యస్.లో ఉంటుంది చూడండి..”


“అవునురా నాకెందుకు తెలియదు.. నీ బెస్ట్ ఫ్రెండ్ కదా...”


“హా నాన్నా..తన పెళ్లి అయిన ఆరు నెలలకే అమ్మా నాన్నా ఆక్సిడెంట్ లో పోయారు...ఆ దిగులే క్రుంగ దీస్తుంటే..మూడు సార్లు అబార్షన్లు...ఈ సారి కూడా చాలా కష్టం అంటున్నారట... పూర్తిగా బెడ్ రెస్ట్... తనకు సహాయం చేసే వాళ్ళు కానీ, ఓదార్పు నిచ్చే వాళ్ళు కానీ ఎవరు లేరు నాన్నా! కాల్ చేసి ఒకటే ఏడుపు... పాపం నాన్నా!”


“అయ్యో... మనమేం చెయ్యగలంరా..పాపం..”


“అందుకే మిమ్మల్ని ఒక సలహా అడుగుదామని కాల్ చేసా నాన్నా...!”


“ఏంటమ్మా?”


“ఏం లేదు..అమ్మకి అమెరికా వెళ్ళడం అంటే చాలా ఇష్టం కదా నాన్నా...అందుకే అమ్మని పంపిస్తే ఎలా ఉంటుంది..అని...” ఒక్క క్షణం ఏమి మాట్లాడలేకపోయాడు మురళీధర్..


“ఇట్స్ ఒకే రా..బానే ఉంటుంది..అలా వీలు అవుతుందా...మరి..”


“మీ అభిప్రాయం తెలుసుకుని..తరువాత అమ్మని కూడా అడిగి నికితకి చెపుతా నాన్నా..”


“అలాగే రా..మీ అమ్మ ముందు గాల్లో తేలిపోతుంది లే..”


“అమ్మకి మీరు చెప్పండి నాన్నా..”


“హు..సరే చెపుతా..అసలు వీలు అవుతుందో లేదో ముందు కనుక్కో..పాస్ పోర్ట్ ఐతే ఉంది మరి..”


“సరే నాన్నా!”


***


విషయం తెలుసుకుని ముందు “అయ్యో... నేనెలా వెళతాను... నాకు భయం బాబూ, విమానాలు ఎక్కటం అంటే..అంత దూరం ఒంటరిగా ఎలా వెళ్ళటం...” అని ఎన్నో సందేహాలతో ఉక్కిరి బిక్కిరి అయింది సరస్వతి.


అయినా ఈ రకంగా తను నికితకి సహాయ పడినట్టుగాను ఉంటుంది... తన ఆశ నెరవేరుతుంది...అని “సరే “అంది.


నికిత విజిటింగ్ వీసా పంపించింది. ప్లైట్ టికెట్స్ కూడా ఆన్ లైన్ బుకింగ్ చేసింది.


అన్ని సక్రమంగా జరుగుతూ ఉంటె...సరస్వతికి ఎక్కడలేని బెంగ

”ఏంటో ! నేను ఒక్కదాన్ని ఇలా విమానంలో ప్రయాణం చేస్తూ... అమెరికా వెళుతున్నా... చాలా వింతగా అనిపిస్తుంది..” అని తనలో తానే అనుకుంటూ ఉంది.


అనుకున్న రోజు రానే వచ్చింది... ఒకవైపు సంతోషం... మరో వైపు గుండె భారం... రెండిటిని లగేజితో పాటు మోసుకుంటూ.. విమానం ఎక్కింది సరస్వతి... తనవాళ్ళందరికీ వీడ్కోలు చెపుతూ.


సరస్వతి క్షేమంగా అమెరికా చేరుకుంది. నికిత భర్త యోగేష్ రిసీవ్ చేసుకుని తమ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. సరస్వతి వాళ్లతో చక్కగా కలిసిపోయింది. నికితను తన బిడ్డలాగా చూసుకుంటా... నీకేం దిగులు లేదురా... నేను ఉన్నాను గా... జాగ్రత్తగా చూసుకుంటా... పండంటి బేబిని ఎత్తుకుంటావు” అంటూ భరోసా ఇచ్చింది.

సంతృప్తిగా నవ్వింది నికిత.


***


పిల్లలని స్కూల్ కి పంపించి నాన్నని చూసి పోదాం అని యామిని వచ్చింది..యామిని వస్తాను అని చెప్పిందని దామిని కూడా ఆఫీస్ కి సెలవు పెట్టింది...కాసేపు అక్కచెల్లెళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు...కూతుళ్ళతో కొద్దిసేపు సరదాగా కాలం గడిపారు మురళీధర్...’ కాసేపు పడుకుంటానమ్మా !’ అంటూ తన గదిలోనికి వెళ్లారు.


‘ఉండవే..కాఫీ కలుపుకొస్తా.... ‘అంటూ..వంటగదిలోకి వెళ్ళింది దామిని.


అక్కడే టివి చూస్తూ ఉంది యామిని. అంతలోనే దామిని సెల్ లో మెసేజ్ వచ్చిన చప్పుడు అయింది. పక్కనే ఉన్న సెల్ వైపు చూసిన యామిని


“అరే! నికిత మెసేజ్” అనుకుంటూ ఓపెన్ చేసి చూసిందో లేదో - ఒక్కసారిగా ముఖంలోనికి పొంగి వచ్చింది...ఎర్రగా... ఈర్శ్య.. ద్వేషం... కోపం.. రకరకాల భావాల కలబోతతో... శరీరం గడ్డకట్టి.. ఊపిరి సరిగా ఆడని పరిస్థితి అయింది..


కాఫీ కప్పులతో వచ్చిన దామిని, యామినిని చూస్తూనే, ”ఏమైందే..అలా అయిపోయావు”అని ప్రశ్నించింది.


“అమ్మని అమ్ముకున్నావా అక్కా!” వ్యంగ్యంగా అంది యామిని.


“వాట్ డుయు మీన్... అసలు ఏమంటున్నావో అర్ధం అవుతుందా?” ఆశ్చర్యంగా అంది దామిని.


“ఆహా! అబ్బా! ఎం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావో... నికిత దగ్గర పదిలక్షలు తీసుకుని, అమ్మని దాస్యానికి అమ్ముకున్నావు... ఒక్క మాట అయినా చెప్పావా? మొత్తం పదిలక్షలు నీవొక్కదానివే తీసేసుకుని, నంగనాచి లా... మాట్లాడుతున్నావా....? ” కోపంతో ఊగిపోతూ... సివంగే అయింది యామిని.


“యాము..కూల్...నిజానికి నేను అడగలేదు...ఎప్పుడో చెప్పాను త్రీ బెడ్ రూమ్ హౌస్ తీసుకోవాలని ఉంది.. డౌన్ పేమెంట్ కోసం ఇరవై లక్షలు అడుగుతున్నారు...మాదగ్గర పదిమాత్రం ఉన్నాయి..అందుకే ప్రస్తుతానికి వాయిదా వేసాము అని...అది మనసులో పెట్టుకొని తను పంపించింది..ఫోన్ లో ఎంతో సేపు మట్లాడాను...వద్దు..నేను తీసుకోను అని చెప్పాను..అయినా వినలేదు...” అంటూ...చెల్లెలిని సమాధాన పరచాలని చూసింది..నిజానికి తను డబ్బు కావాలనే అర్ధం వచ్చేలా అడిగింది నికితను...


“అదేమీ నాకు తెలియదు...నీవు ఒక్కదానివే అమ్మకి పుట్టలేదు..నేను కూడా కూతురునే...దగ్గరే ఉండి అమ్మని అన్ని విధాలా వాడుకున్నావు...చాలు..చాలు...నాకూ అన్ని హక్కులు ఉన్నాయి...ఈ డబ్బులో నాకు వాటా కావాలి అయిదు లక్షలు...వెంటనే నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యి...ఇప్పుడే...లేదంటే...నేను ఊరుకోను...” దబాయిస్తూ అడిగింది..యామిని...


“ప్లీజ్ యాము...ఇలా ఇచ్చేస్తే మంచి హవుస్ చెయ్యి జారిపోతుంది...అర్ధం చేసుకో...” అర్థిస్తూ అడిగింది దామిని...


“ఇంకొక్క నిముషం కూడా నేను ఆగను..” వేలు చూపిస్తూ అంది యామిని...


“ఏమిటే మరీ పెద్దదాన్ని అని కూడా చూడకుండా...వేలు చూపిస్తున్నావు...ఆ మధ్య నాన్నకి హార్ట్ ప్రాబ్లెం వస్తే...నేనేగా దగ్గర ఉండి లీవ్ పెట్టుకుని మరీ హాస్పిటల్ లో చేర్పించి...ట్రీట్మెంట్ ఇప్పించాను..నీవు ఏదో చుట్టంలా వచ్చి చూసిపోయావే గాని ఒక్క పూట అయినా ఉన్నావా...ఇప్పుడు కూడా నాన్న బాద్యత నాదే కదా...అమ్మ వచ్చేవరకు నాన్న ని మీ ఇంట్లో ఉండనిస్తావా?” ఎదురు ప్రశ్న వేస్తూ...మండిపడింది..దామిని...


“ మా అత్తగారు ఉంటారు… మా ఇంట్లో ఎట్లా కుదురుతుంది, నీకు తెలుసు కదా!” కొంచం మెత్తబడింది యామిని..


మంచినీళ్ళ కోసం హాల్ లోకి రాబోయిన మురళీధర్ ఈ జరుగుతున్నది అంతా చూస్తూనే ఉన్నాడు.


లో లోన ఎదో బాధ... “ఆ పిచ్చిది పిల్లలు పిల్లలు అని ఈ పిల్లల కోసం తనని తాను గుల్ల చేసుకుంటూ ఉంటుంది... వీళ్ళు ఇలా తోడబుట్టిన వాళ్లం అన్న సంగతి మరిచి... అమ్మ పాలు పంచుకుని తాగినట్టే అమ్మని కూడా పంచుకోవాలని చూస్తున్నారు... అమ్మలోని అమ్మతనం అమ్మకానికి పనికి వచ్చింది...” భారమైన మనసుతో మంచం మీద వాలిపోయి, తరువాత తమ ముందు జీవితం గురించి ఆలోచించసాగారు.


తన స్నేహితుడు భాస్కర్ ముందే ప్లాన్ చేసుకుని రిటైర్ అయిన తరువాత తమ కోసం కొంత సొమ్ము బ్యాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీతో వృద్ధాశ్రమం అని చెప్పబడే గెష్ట్ హౌస్ లో ఉంటున్నాడు. ఆ విషయం పోయిన నెల కాల్ చేసి ఈ చెప్పాడు భాస్కరరావు.


“అక్కడ చాలా ఆహ్లాదకరంగా, అందరూ తమ లాంటి వాళ్ళే కాబట్టి కొత్త స్నేహితులు అయి అసలు సమయం తెలియకుండా గడిచిపోతుంది. ఎటువంటి అనారోగ్యం ఉన్నా దానికి తగిన చికిశ్చ కోసం డాక్టర్లు అందుబాటులో ఉంటారు.


నిజానికి మన వయసు వాళ్ళకి ఇది ఒక బ్రేక్ వంటింది. మళ్ళీ చిన్న పిల్లల్లా మనసుకు తోచింది చేసుకోవచ్చు. ఎటువంటి బంధాల పోరూ ఉండదు. హాయిగా ఉన్నామంటే నమ్ము” అంటూ చెప్పుకొచ్చాడు భాస్కర్.

అదే విషయం గుర్టుకు వచ్చింది మురళీధర్ కు.


‘రేపు ప్రొద్దున్న ఒక సారి భాస్కర్ తో మాట్లాడాలి. సరస్వతి వచ్చిన తరువాత తాము కూడా అలా వెళ్ళి సెటిల్ అయితే బాగుంటుంది’ అని దృఢంగా అనుకున్నాడు.--సమాప్తం--

సుజాత తిమ్మన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పేరు సుజాత తిమ్మన.

డిగ్రీ చదువుతుండగానే వివాహం... ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు.

చిన్నప్పటి నుంచీ మనసులో కలిగిన భావాలను నోటు పుస్తకంలో వ్రాసుకోవడం అలవాటు.

అలా కవితలు లెక్కకు మించి వ్రాసాను, వ్రాస్తూనే ఉంటాను.

ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రికలో తరచుగా ప్రచురితం అయ్యేవి.

బహుమతులు, ప్రశంసా పత్రాలు రావడం సర్వ సాధారణం.

ముఖ పుస్తకంలో అనేక సమూహాలలో నేను కనిపిస్తూనే ఉంటాను.

30 కథల వరకు వ్రాసాను. ఇక ఈ కథ "అర్థాంగి" నమస్తే తెలంగాణ వీక్లీ లో అచ్చయిన కథ.

మన తెలుగు కథలు లో నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలతో...

సుజాత తిమ్మన.73 views0 comments
bottom of page