top of page

ఆణిముత్యం

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Animuthyam, #ఆణిముత్యం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Animuthyam - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 15/09/2025

ఆణిముత్యం - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"మీరు ఇలా రోజూ నాతో గొడవపడితే, ఏం చేస్తానో నాకే తెలియదు" అంది భానుమతి.


"మహా అయితే ఏం చేస్తావ్.. పుట్టింటికి వెళ్తావు అంతేగా.. మళ్ళీ ఇక్కడికే వస్తావులే" అన్నాడు భర్త ఏవీరావు.


"ఈ రోజుల్లో.. పుట్టింటికి వెళ్తానన్నా.. మొగుళ్ళు అస్సలు భయపడట్లేదు. రోజూ మీతో నాకు గొడవలే.. మీరు కూడా నాకు చాలా నచ్చట్లేదు. మారడానికి ఇంకో అవకాశం ఇస్తున్నాను.. మారతారా లేదా?"


"ఏం చెయ్యాలో?"


"నన్ను ఎప్పుడూ తిట్టకూడదు.. నేను ఏది అడిగితే అది కొని ఇవ్వాలి.. అంతే"


"నీ డిమాండ్స్ కు ఒప్పుకునేది లేదు.. నేను మగాడిని"


"అలాగా.. ! చూద్దాం.. !"


అప్పుడే పక్కింటి పిన్నిగారు.. 


"భానుమతి! ఏం చేస్తున్నావు?"

"మా ఆయనతో పటాసులు పేలుస్తున్నాను.. ఇంతకీ ఎందుకు వచ్చారు?"


"వెరైటీ రంగులలో డ్రమ్స్ మార్కెట్ లోకి వచ్చాయి.. అందరూ కొంటున్నారు. కొత్తగా పెళ్ళైన వారైతే మ్యాచింగ్ రంగులు ఎంచుకుని కొంటున్నారు.. మనం తొందరపడాలి"


"ఎందుకో?"


"నీకు కొత్త ట్రెండ్ తెలియదా.. ? మొగుడు నచ్చకపోతే, అందరూ చేసేదే.. వాటి డిమాండ్ చూసి, ఇప్పుడు ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ సైజులు కూడా దించారు"


"ఏమిటది.. నాకు అర్ధం కాలేదు"


"ఆ మధ్య న్యూస్ లో చూడలేదా.. ? భార్యలకు ఓపిక నశిస్తే, ఏం చేస్తారు పాపం.. దొరికిన దానితో మొగుడు నెత్తిమీద రెండు వేసి, డ్రమ్ములో పడుకోపెడుతున్నారు అంతే.. ! కొంతమందికి డ్రమ్ము సరిపోవట్లేదు.. అందుకే పెద్ద సైజులు కావాలంటే ఇప్పుడు దించుతున్నారు. నువ్వు కూడా మీ ఆయన సైజు చూసుకుని రెండు కొనుక్కుని పెట్టుకో.. ఎప్పటికైనా పనుకొస్తుంది. మన పక్క వీధిలో చాలా మందికి నేనే ఇప్పించాను"


"ఏమిటండీ కాంతంగారు! ఇలా వచ్చారు? మీకు పనీపాట లేదా.. ? డ్రమ్స్ అని చెప్పి, మా ఆవిడ మనసు పాడు చేస్తున్నారా? మా ఆవిడ అసలే చాలా మంచిది.. చెడగొట్టకండి"


"నేను చెబుతున్నది మీ ఆవిడ మంచికోసమే రావుగారు. ఆడవారు ఎప్పుడూ మంచివారే, గొప్పవారే.. మగవారిలాగా కాదు"


"ఏమిటో మీ గొప్ప.. ఒక్క మాట పడరు.. ఇంట్లో పెత్తనం మొత్తం ఇచ్చేయాలి.. అంతేగా"


"మొగుడు తిడితే, ఎర్ర బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్ళే రోజులు పోయాయి రావు గారు.. ఇప్పుడంతా మేటర్ ఫినిష్ చేసెయ్యడమే"


"మా ఆవిడ అలా కాదు.. చాలా మంచిది"


"ఏమిటండి.. నేనంటే మీకింత ప్రేమ?" అడిగింది భానుమతి.


"అవును భానుమతి.. ఆవిడ మాటలు ఏమీ నమ్మకు. నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు.. మారకు" అన్నాడు రావు.


"నాకు ఒక రెండు డ్రమ్స్ పంపించండి.. మంచి క్వాలిటీ ఉండాలి.. గాలి కూడా లోపలికిపోకూడదు.. " అంది భానుమతి.

"అలాగే.. రెండు కొంటె, ఒకటి ఫ్రీ అంట. నువ్వు నేను కలిపి తీసుకుందాము.. ఎవరికి ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు కదా"


"ఇంకేంటి కాంతంగారు.. ! మన కాలనీలో కబుర్లు?" అడిగింది భానుమతి.

 

"పక్క వీధిలో ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది.. "


"ఏమిటో.. ?"


"హనీమూన్ కోసం ఎత్తైన కొండలు, లోయల దగ్గరకు వెళ్దామని భర్తని అడిగింది ఆ భార్య.. "


"అక్కడికే ఎందుకో?"


"అదే నేను అనుకున్నా.. సంబరపడిన భర్త తీసుకుని వెళ్ళాడు. మర్నాడు అమ్మాయి ఒక్కర్తే ఏడుస్తూ.. ఆయన లోయలో పడిపోయారని రిటర్న్ వచ్చేసింది"


"అయ్యో పాపం. ?"


"పాపం లేదు ఏం లేదు. అందరూ.. ఆవిడే ఆయనని చంపేసిందని అనుకుంటున్నారు. ఎప్పుడూ ఇద్దరికీ గొడవలేనంటా. ఆమెకు పెళ్ళికి ముందు లవ్ స్టొరీ కూడా ఉందంట. అందుకే అనుమానం"

"అయ్యో పాపం! మీ ఆడువారు మంచివారే మరి" అన్నాడు పక్కనే ఉన్న రావుగారు.


"ఎలాగోలా మొగుడు పీడ వదిలింది కదా.. అందరికీ అంత అదృష్టం ఉంటుందా?"


"ఏమిటి నీ ఉద్దేశ్యం.. " అని భర్త గొంతు లేచింది.

 

"ఏదో అంటే, ఎందుకు అలా అయిపోతారు" అంది భానుమతి.


"నేను వెళ్ళొస్తా.. మీకు డ్రమ్స్ తొందరగా పంపిస్తాను.. " అంటూ కాంతంగారు వెళ్ళిపోయారు.


రెండు రోజుల తర్వాత.. ఇంటి కాలింగ్ బెల్ మోగింది.. 


"హలో భానూ.. !"


"ఓహ్ సుబ్బు.. ! నువ్వా! రా.. కూర్చో.. "


"ఏమిటి ఇతను నీకు ముందుగా తెలుసా.. ? సుబ్బు అంటున్నావంటే, చాలా క్లోజ్ అనుకుంటా"


"అవునండి.. కాలేజీ రోజుల్లో అందరూ మా గురించే మాట్లాడుకునేవారు.. తెలుసా?"


"ఇప్పుడెందుకు వచ్చినట్టు?"


"నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. ఒకసారి భానుని చూద్దామని వచ్చాను" అన్నాడు సుబ్బు.


"నేనంటే ఎంత ప్రేమో చూడండి"


"నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తెస్తావా భానూ?"


"ఇదేమైనా పెళ్ళి చూపులా.. ఏంటి? కాఫీ, టిఫిన్లు ఇవ్వడానికి.”


"మీరు ఉండండి.. నా సుబ్బు అలసిపోయి వచ్చాడు.. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా చెప్పండి?"


"అవును సుబ్బు.. నీకు ఇప్పటివరకు ఎందుకు పెళ్ళి కాలేదు?"


"నీ అంత మంచి ఆణిముత్యం దొరకలేదు భాను. ఇంతకీ మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా?"


"ఏం చెప్పను.. ఎప్పుడూ గొడవలే"


"నన్ను ఏమైనా సాయం చెయ్యమంటావా.. మీ ఆయన పని నేను చూసుకుంటాను"


పక్కనుంచి చాటుగా వింటున్న భర్త.. ఐపోయింది.. నా జీవితం ముగుసిపోయింది. ఇదే టైం లో నేను నా పెళ్ళాంతో గొడవ పడాలా.. ? ఈ సుబ్బుగాడు ఇప్పుడే రావాలా.. ? వాడికి ఇంకా పెళ్ళి కాకుండా ఉండాలా.. ? అన్నీ నా చావుకు పాయింట్ చేస్తున్నట్టే ఉన్నాయి. దీనికి తోడు, ఆ పక్కింటి పిన్నిగారు ఉదయం వచ్చి ఆద్యం పోశారు. ఆ ఎదురుగా కొత్తగా ఉన్న డ్రమ్స్ చూస్తుంటే, నాకు ఏమైనా జరగొచ్చని భయంగా ఉంది. దేవుడా.. ! నన్ను ఇక నువ్వే కాపాడాలి. 


అప్పుడే టీవీలో.. క్రైమ్ న్యూస్.. 


"రోజుకో హత్య బయటపడుతోంది.. భర్తలూ కాస్త జాగ్రత్త.. పెళ్ళాలతో గొడవలొద్దు. ఏది అడిగినా కొనేస్తేనే బెటర్. మనం ప్రాణాలతో ఉండడం చాలా ముఖ్యం.. " అంటూ టీవీ లో గట్టిగా వాయించేస్తున్నారు.


"అమ్మో.. ! శకునాలు కూడా బాగున్నట్టు లేవే.. "


"ఏమండీ.. ! ఒకసారి ఇటు రండి.. ఈ కొత్త డ్రమ్స్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను.. ఏమంటారు?"


"నన్నెందుకు అడుగుతున్నావు.. ?"


"మీరే కదండీ.. ఓపెన్ చెయ్యాల్సింది"


"ఎందుకండీ అలా వణికిపోతున్నారు.. చమటలు కూడా పడుతున్నాయే.. "


"సుబ్బూ.. మా ఆయన సంగతి చూస్తానన్నావు.. పాపం ఆయన చాలా భయపడిపోతున్నారు.. "


'అయిపోయింది.. ఇక దేవుడిని తలుచుకోవడమే ఆలస్యం.. ' అనుకున్నాడు రావుగారు.


"నన్ను చంపకు భానుమతి.. నన్నేమి చెయ్యకు.. ఐ యాం సారీ. నిన్ను బాగా చూసుకుంటాను.. నీ మాట వింటాను"


"నేను మిమల్ని చంపడం ఏమిటండి.. ? మీరే నా దైవం"


"డ్రమ్స్ కొన్నావుగా?.. ట్రెండ్ ఫాలో అవుతున్నావేమోనని"


"అవా.. వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందిగా, అందుకే వాటికోసం. మీరే అందులో వాటర్ పట్టాలి. ప్రేమ చూపించడంలో ట్రెండ్ చూపించాలి గానీ.. కాంతంగారు చెప్పినట్టుగా కాదు. పక్కింటి కాంతంగారి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను"


"మరి సుబ్బు సంగతి?"


"నాకు తెలిసిన మంచి పెళ్ళి సంబంధం ఉందని చెప్పాను.. అందుకే వచ్చాడు. సుబ్బు నాకు మంచి ఫ్రెండ్ అంతే! పైగా డాక్టర్.. మిమల్ని చూస్తానన్నాడు"


"బ్రదర్..! భాను చాలా మంచిది.. ఆణిముత్యం. ఇదంతా మిమల్ని ఆటపట్టించడం కోసమే చేసింది. ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం బ్రదర్" అన్నాడు సుబ్బు.


******


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments


bottom of page