'Annachellella Gattu' - New Telugu Story Written By Balu Dommeti
'అన్నాచెల్లెళ్ళ గట్టు' తెలుగు కథ
రచన: బాలు దొమ్మేటి
ఒక చేతిలో పొడవాటి ఎరకల కత్తి, మరో చేతిలో తాటాకులతో అల్లిన చిన్న పూలబుట్ట. ఘంటసాలను అనుకరించే గళం, నడకకు కిర్రుజోళ్ళ తాళం. కొబ్బరినూనె రాసిన తప్పడ జుట్టు. నిమ్మకాయల్ని నిబ్బరంగా మోసేలా కోరమీసాల పడికట్టు. ముళ్ళ కనకంబరాల మొక్కలా సన్నగా వుండే ఆ మనిషి ప్రతిరోజూ పొద్దెక్కగానే ‘వల్లూరు’కి ఆనుకుని వున్న గోదారి గట్టు దిగి ఊరికి కొంచెం ఎడంగా వుండే ‘పెద్దింటోరు’ ఇంటి వైపు వెళ్తుంటాడు. ముంజేతికి తగిలించుకున్న తాటాకు బుట్ట నిండా మందారాలు, గులాబీలు, సంపెంగలు, కనకాంబరాలు, బొగడబంతులు… ఇలా రకరకాల పూలు. అతను ఆ బుట్టతో దారంటా వెళ్తుంటే పూల పరిమళం గింగిరాలు కొడుతూ ఊరివాళ్ళను ఆకర్షిస్తుంది. ‘పూల కొండయ్య’ వెళ్తున్నాడన్న విషయం చూడక్కర లేకుండా చెప్తుంది.
పెచ్చులూడిపోయిన మట్టిగోడలు, చెదలు పట్టిన దారబందాలు, చివికిపోయిన తాటాకు కప్పుతో ‘పెద్దోరిల్లు…పెద్దోరిల్లు’ అని అందరి చేత పిలిపించుకునే ఆ ఇంట్లో వుండేది ఇద్దరు. ఒకరు పెద్దోరు. రెండవ వ్యక్తి ఆయన భార్య మంగాకుమారి. ఆయన అసలు పేరు ‘రామజోగయ్య’. అది మరుగున పడిపోయి ‘పెద్దింటోరు’, ‘పెద్దోరు’ అనేవి అసలు పేర్లుగా చెలామణి అవుతున్నాయి. ఒకప్పుడు బాగా బతికిన ఆ పెద్దింటి వారసుడు ఆర్ధికంగా చితికిపోయి ప్రస్తుతం పాము కాటుకి మందులిస్తూ కఠిక పేదరికంతో సావాసం చేస్తున్నాడు. పేదరికాన్ని జయించడానికి ఏదైనా కాయకష్టం చేద్దామంటే ఒంటికి అలవాటు లేని పని. ఇంటి పరిస్థితిని కళ్ళారా చూస్తున్న మంగాకుమారి నిత్యం పూజలు చేస్తూ దేవుడి మీద భారమేసి మంచిరోజుల కోసం ఎదురు చూస్తుంది. ఆవిడ పూజలకు, పునస్కారాలకు అవసరమైన పూలను కోసుకొచ్చి ఇవ్వడం ఈ ‘పూల కొండయ్య’ పని.
ఆరోజు తొలేకాదశి. తిండి గింజలు, మంత్ర గింజలు తేవడం కోసం ఆ ఇంటాయన కిరాణా కొట్టుకు వెళ్ళాడు. తలకి నీళ్ళేసుకుని, గంజిపెట్టిన కాటన్ చీర కట్టుకుని, ఇంటికి దగ్గర్లో వున్న ఎర్రమట్టి దిబ్బ మీద దిగాలుగా కూర్చుంది మంగాకుమారి. అప్పుడే వచ్చిన కొండయ్య ముంజేతుకున్న పూలబుట్ట తీసి ఆవిడకిచ్చేసి ఆమెకు కొంచెం దూరంగా కూర్చున్నాడు.
పటికబెల్లం ప్రసాదాన్ని అతనికి అందిస్తూ… “ఇంట్లో పరిస్థితికి ఆయన చాలా బెంగెట్టేసుకుంటున్నారు కొండయ్య. పూజల పేరు చెప్పి నేను ఒంటిపూట తింటున్నాను కాబట్టి సరిపోతుంది. నేను కూడా రెండు పూటలా తింటే ఇల్లు గడవడం ఇంకెంత కష్టమో” ఆమె మనసులో దిగులు దాగలేనట్టు మాటల్లో బయటకొచ్చేసింది.
“అమ్మా! ఇలా అంటున్నాని ఏమీ అనుకోవద్దు. అయ్యగారు ఏదైనా పనెత్తుకుంటే బాగుంటాది కదా” “అదీ అయ్యింది. ఆయన చేత పని చెయ్యుంచుకోవడమంటే ఆయన పెద్దరికాన్ని అవమానించడమేనని ఎవ్వరూ పనివ్వట్లేదు. వారసత్వంగా వచ్చిన ఈ ‘పెద్దింటోరు’ పేరు నాలుగు గిద్దల గింజలు సంపాదించుకుందామంటే అడ్డుగా తగులుకుంటుంది. ఈయన ఒకరి కింద పని చెయ్యడమే కష్టమనుకుంటే ఆపని దొరకడం ఇంకా కష్టంగా వుంది”
ఆవిడ బలవంతంగా ఆపుకుంటున్నా కళ్ళల్లో నీళ్ళు కాటుక గీతల్ని దాటి బయటకు వచ్చేస్తున్నాయి.
ముద్దాలోరి నాము చేలో దూళ్ళను మేపడానికొచ్చిన ‘కోటిగాడు’ దూరం నుంచి వారిద్దర్నీ రెప్పేయకుండా చూస్తున్నాడు. ఆ అనుమానపు చూపుల్ని పసిగట్టిన కొండయ్య జాయిగా పైకి లేచి తువ్వాల సర్ధుకుంటున్నాడు.
విషయం గ్రహించిన మంగాకుమారి “ఆడు చూపే తేడాగుంటది కొండయ్య. ప్రతిరోజూ ఆడు దూళ్ళను తోలుకొత్తాడు. ఆడి దూళ్ళు ఈ చుట్టుపక్కల గడ్డి మేత్తావుంటే ఆడి కళ్ళెప్పుడూ నన్ను మేసెయ్యాలన్నట్టు చూత్తుంటాయి. ఆడి చూపులో చాలా అర్ధాలుంటాయి. పాపిష్టి కళ్ళు.” అని పూలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.
పటికబెల్లం ప్రసాదాన్ని నోట్లో వేసుకుని కొండయ్య కూడా తిరుగుముఖం పట్టాడు.కిరాణా కొట్లో గింజలు అరువట్టుకొత్తానని వెళ్ళిన భర్త ఇంకా రాలేదు. అతని కోసం ఎదురు చూస్తున్న మంగాకుమారికి కడుపులో ఆకలి బాధ ఎక్కువయ్యింది. ఆయన ఎంత సేపట్లో వస్తాడో తెలీదు. వంట చెయ్యడానికి ఇంట్లో ఏమీ లేవు. నిన్న పూజకోసం తెచ్చిన అరటి పండ్లలో కవల అరటి పండు వచ్చింది. దాన్ని దేవుడి దగ్గర పెట్టకుండా పక్కన పెట్టింది.
ఆ విషయం గుర్తొచ్చి ఆకలి తీర్చుకోవడానికి అందులో ఒకటి తెచ్చుకుని తింటుండగా ‘పెద్దాయన’ ఇంటికి చేరుకున్నాడు. కవల అరటిపండు తింటున్న భార్యను చూసి “అది తిని నువ్వు కవల పిల్లల్ని కంటే పోషించే ఓపిక నాకు లేదు భార్యామణి” అని ఆట పట్టిస్తున్నట్టుగా అన్నాడు. అరటిపండు తింటున్న ఆవిడ ఆలోచనగా ఆగిపోయింది. అది నిజమో నమ్మకమో అప్రస్తుతం. కానీ ఆ మాటే నిజమైతే. నిజంగానే ఇద్దరు పిల్లలు పుడితే. ఇద్దరు మనుషులు బతకడమే కష్టంగా వున్న ఈ సంసారంలో మరో ఇద్దరిని పోషించగలమా?! “అంత దూరం ఆలోచించలేదండీ” అంటూ ఆ మిగిలిన అరటిపండును పక్కన పెట్టేసి భర్త తెచ్చిన కిరాణా సరుకుల సంచిని లోపలికి తీస్కెళ్ళింది.
******
తెల్లజిల్లేడు డొంకలో గూడుకట్టుకున్న గోరింక కిరకిరమని అరుస్తూ పైకి లేచి పక్కనే వేలాడుతున్న ఎండు కొబ్బరాకుపై వాలింది. ఆగకుండా భయంతో కీచుపెడుతోంది. అనుమానం వచ్చిన ‘పెద్దాయన’ అటేపు వెళ్ళాడు. అమావాస్యకు కుబుసం విడిచిన నల్లతాచు తెల్లజిల్లేడు మదగలో మందంగా కదులుతుంది. పొడి ఎండ పడి దాని ఒళ్ళు తళతళ మెరుస్తోంది. ఆయన వచ్చిన అలికిడికి మంద గమనాని కొంచెం వేగం జోడించి వెళ్ళిపోయింది. ఎండుకొబ్బరాకుపై వున్న గోరింక ఇంకా గట్టిగా అరుస్తూ, ఆ నల్లతాచు వెళ్ళిన దిక్కుగా గాలిలో వెంటాడుతూ వెళ్ళింది. ‘ఇన్నాళ్ళూ లేనిది ఈ తాచు ఎక్కడ్నించి వచ్చిందో..’ అనుకుంటూ బనేలు జేబులో పొట్లం కట్టివున్న మంత్రించిన చోడు గింజల్ని ఆ జిల్లేడు పొద చుట్టూ చల్లుతున్నాడు. ఇంతలో ‘కోటిగాడు’ భుజాన జాడుకర్రతో ‘పెద్దాయన’ దగ్గరకి వచ్చాడు.
“కోటి! ఏంటి సంగతులు?”
“చుట్టకు నిప్పుకోసమని మీ ఇంటికే వత్తుంటే నల్లతాచు కనిపించిందండి. కాసిన్ని మంత్రం గింజలుంటే ఇవ్వండి’ అన్నాడు కోటి.
“అది ఇప్పుడే ఇటు వైపు నుంచి వచ్చింది. రా తీస్కో..” అని గుప్పిట్లో వున్న కొన్ని గింజల్ని ఒక చిన్న గుడ్డ పీలికలో కట్టి ఇచ్చాడు.
‘కోటిగాడు’ ఆ గింజల్ని తీస్కుని… “చిల్లర డబ్బులు లేవండి. ఈటికి డబ్బులు మళ్ళొచ్చినప్పుడు ఇత్తాలెండి”
‘ఎంతో కొంత చిల్లరిస్తే బాగుండని’ ఎదురుచూసిన పెద్దాయన ఆ మాటతో మౌనమైపోయాడు. “చుట్టెలుగించుకోడానికి నిప్పు కావాలి ఇంట్లో ఆడోరున్నారండి?” అడిగాడు కోటి.
'అమ్మగారున్నారండీ' అని అడగడానికి బదులు 'ఆడోరున్నారండి?' అన్న కోటిగాడి మాటను పెద్దాయన గమనించకుండా.. “ఆ! వున్నారు” అని పాము కుబుసాన్ని ఎండుపుల్లతో తీసి పక్కకు విసిరేస్తూ చెప్పాడు.
‘కోటిగాడు’ పెద్దోరి ఇంటివైపు నడిచాడు. మంగా కుమారి మెడలోని రంగెలిసిపోయిన మంచి ముత్యాల దండ తెగి పూసలన్నీ నేలపై పడ్డాయి. వాటిని ఒక్కొక్కటికిగా యేరుతుంది. నిశ్శబ్దంగా పూసలేరుతున్న ఆవిడను నడవా గోడ మీద బల్లికూత భయపెట్టింది. ఇంతలో వాకిట్లోకి ఎవరో వచ్చిన అలికిడి. మంగా కుమారి బయటకు వెళ్ళి చూడబోతే ఎదురుగా కోటిగాడు.
‘వీడొచ్చాడేంటి. ఇన్నిరోజులుగా దూరం నుంచి దొంగ చూపులు చూడటం తప్ప ఇంటికొచ్చే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు’ అనుకుంది మనసులో. దూరం నుంచి చూసినా దగ్గరకొచ్చి చూసినా అతని చూపులో ఏమీ తేడాలేదు.
“ఏం కావాలి” అతన్ని ఎక్కువ సేపు అక్కడ భరించలేనట్టుగా అడిగింది.
“చుట్ట అంటించుకోడానికి నిప్పు కావాలి” ఆ మాటలో, చూపులో కొరుకుడు పడని అర్ధమేదో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆవిడ విసవిసా లోనికెళ్ళింది. మనసంతా ఏదో తెలియని చిరాకుతో అగ్గిపెట్టె తెచ్చి ఇచ్చింది. అగ్గిపుల్ల వెలిగించాడు కోటి. ఆ మంట గాలికి ఆరిపోకుండా రెండు చేతులతో దోసిల పట్టాడు. నోట్లో చుట్టను తన రెండు చేతుల మధ్య వున్న అగ్గిపుల్ల మంటతో వెలిగిస్తూ, గుప్పు గుప్పున పొగ వదులుతూ చుట్ట రాజేశాడు. ఆవిడకు చాలా ఇబ్బందిగా వుంది. ‘ఈయన ఎక్కడికెళ్ళాడు..’ అనుకుంటూ దిక్కులు చూస్తుండగా.. “ఓ రెండు అగ్గిపుల్లలు తీస్కుంటున్నానండి” అని అగ్గిపెట్టెలోంచి వేళ్ళకు అందినకాడికి అగ్గిపుల్లలు తీసుకున్నాడు.
“నిన్న ఆ మట్టిదిబ్బ మీద ఏయో రెండు పాములు మసకలాడుకున్నట్టు కనిపించాయండి. కొంచెం జాగర్తండి. ఇలా చెప్పానని తప్పుగా అనుకోకండే” అన్నాడు.
నిన్నటిరోజున కొండయ్య, తను మట్టిదిబ్బకు అటుఇటు కూర్చుని మాట్లాడుకున్న విషయాన్ని అతను చాలా తెలివిగా, అసహ్యంగా ప్రస్తావించాడన్న విషయాన్ని పసిగట్టి కోపంతో రగిలిపోయింది.
“కళ్ళకు పొరలు కమ్మినపుడు మనం చూసేవన్నీ తప్పుగా కనపడతాయి కోటి. నీ పాడుబుద్ధి నీ చూపుల్లోను, మాటల్లోను బయటపడిపోతుందన్న విషయం మర్చిపోతున్నావ్. పాము పగబడితే మంత్రగింజలు కాపాడతాయో లేదో నాకు తెలీదు. మాటపడ్డ ఆడది పగబట్టిందంటే ఆ బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు. జాగర్త” అనేసి మరో మాటకు అవకాశం లేకుండా లోపలికి వెళ్ళిపోయింది.
రాజుకున్న చుట్టపొగ గాలిలోకి వదులుకుంటూ ‘కోటిగాడు’ అక్కడ్నించి వెనుదిరిగాడు.
*******
రోజులు మారుతున్నా పూల కొండయ్య దినచర్యలో మార్పులేదు. మునిపటిలాగే ప్రతిరోజు గోదారి గట్టు దిగి ‘పెద్దోరి’ ఇంటి వైపు పూలబుట్టతో వెళ్తున్నాడు. ఇప్పుడు బుట్టలోని పూల వాసనకు బదులు పూల కొండయ్యే ఊరివాళ్ళను ఆకర్షిస్తున్నాడు. అతను పెద్దింటోరి ఇంటికి వెళ్ళేటప్పుడు, అక్కడ్నించి తిరిగి వచ్చేటప్పుడు ఊరివాళ్ళ కళ్ళు అనుమానంగా చూస్తున్నాయి. ఆ చూపులతో తోచిన దృశ్యాలను మనసులో ఊహించుకుంటున్నాయి.
ఆపై నరంలేని నాలుకలు ఏవో గుసగుసలాడుకుంటున్నాయి. కొన్నాళ్ళకు ఆ గుసగుసలు మంగాకుమారికి, పూల కొండయ్యకు మధ్య ఏదో సంబంధం వుందని ఊరంతా నిప్పు రాజేశాయి. వాటికి మరింత బలం చిక్కడానికా అన్నట్టు మంగాకుమారి నీళ్ళోసుకుంది. ఒక నింద నిజమనేలా ఊరందరి బుద్ధిని అనుమానపు కారుమబ్బు కమ్మేసింది. అది క్రమక్రమంగా పెరిగి పెద్దదై నిజంలా తిష్ట వేసుక్కూర్చుంది.
***
‘సందకాడ వచ్చిన వాన ఎవడొకడు సత్తేకాని పోదంటారు. ఈ యేలప్పుడు ఇంత పెద్ద వానేంటి’ అనుకుంటున్నాడు కొండయ్య. అంత పెద్ద వర్షంలోనూ చీకటి కమ్మిన ఆ చిన్న గుడిసెలో ఏదో నిశ్శబ్దం. కొన్నాళ్ళుగా ఆ నిశ్శబ్క్షం కొండయ్యకు, అతని భార్య శాంతమ్మకు మధ్య గోడకట్టినట్టుగా వుంది. శాంతమ్మకు కొండయ్యపై వల్లమాలిన గురి. అతన్ని ఏవిషయంలోనూ అనుమానించి సందర్భాలు ఇంత వరకు లేవు. ఒకవేళ మనసులో ఏదైనా అనుమానం కలిగినా, అతని పెనిమిటి గురించి చెడుగా ఏదైనా మాట వినిపించినా వెంటనే అడిగేసి తన భర్త కడిగిన ముత్యమని మురిసిపోతుంది. అలాంటి మనిషి కొన్నిరోజులుగా తన మనసులో ఏముందో చెప్పకుండా ముబావంగా వుంటుంది. మనం ఈ ఊళ్ళో వుండొద్దు, మా పుట్టింటికి ‘అంతర్వేది’ వెళ్ళిపోదాం’ అని విషయం చెప్పకుండా మాటిమాటికి గొడవేసుకుంటుంది. ఎందుకో తెలీదు. అడిగితే చెప్పదు. పెళ్ళైన ఇన్నేళ్ళలో తను ఎప్పుడూ ఇలా లేదు.
కొండయ్య అంతు చిక్కని ఆలోచనల్లో వుండగా..అంత వర్షంలో ఎవరో తలుపు కొట్టినట్టు చప్పుడైంది. ఇలాయిబుడ్డి దీపానికి చేతులు అడ్డం పెట్టుకుని బయటకొచ్చి ఆ చిన్నపాటి వెలుగులో కళ్ళింతలు చేస్కుని చూసాడు. నెత్తిమీద తడిసి ముద్దయిపోయిన గోనెసంచి, రెండు చేతులతో గుండెలకు అదిమిపట్టుకున్న పసిబిడ్డతో ఎదురుగా ‘పెద్దింటోరు’. కొండయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.
“ఈవేళప్పుడు ఇలా వచ్చారేంటయ్యా”
“కొండయ్య నాకో సాయం చేసిపెట్టవయ్యా” బతిమాలుకుంటున్నట్టుగా అన్నాడు.
“చెప్పండయ్యా” “కటిక పేదరికంలో మగ్గిపోతున్న ఈ పెద్దింటోడి ఇంట్లో ఇద్దరు పిల్లలు పుట్టారు. మీ అమ్మగారిని చూస్తే కనీసం ఒక్కడికి కూడా కడుపునిండా పాలిచ్చే పరిస్థితిలేదు. ఆత్బాభిమానం చంపుకుని అన్నంకోసం అడుక్కోగలనేమోగాని అమ్మ పాలకోసం కూడా ఎక్కడ అడుక్కోగలను చెప్పు. నేనున్న పరిస్థితుల్లో ఇద్దరి పసోళ్ళ ఆకలి తీర్చలేను, వాళ్ళకి మంచి జీవితాన్నీ ఇవ్వలేను. మా ఇద్దరి బిడ్డలలో ఒకడ్ని నువ్వు పెంచుకో కొండయ్య”
‘పెద్దాయన’ మాటలకు కొండయ్య నిశ్చేష్టుడై చూస్తున్నాడు. “ ఆలోచించకు కొండయ్య! మీ బిడ్డలకి గవర్నెమెంటోళ్ళు ఉచితంగా అన్నం పెట్టి చదువు చెప్తారుకదయ్యా. వీడు నీ ఇంట్లో, నీ బిడ్డగా పెరిగితే ఆ రకంగానైనా వాడికి పెద్ద మేలు చేసినోడి అవుతావు. పెద్దోరింట్లో పుట్టిన పాపానికి వీడ్ని నా దరిద్రం అంటకుండా తప్పించిన దేవుడివి అవుతావు. కాదనకయ్య”
బయట వర్షంతో పోటీపడుతున్నట్టుగా అతని కళ్ళు వర్షిస్తున్నాయి. ఇంతలో శాంతమ్మ వచ్చి కొండయ్యకు కొంచెం దూరంగా నిలబడింది.
“ నీ భర్తకు నచ్చజెప్పి ఈ బిడ్డకు తల్లివికా శాంతమ్మ. చచ్చి నీ కడుపున పుడతాను” అని బిడ్డను శాంతమ్మ చేతిలో పెట్టేసి, రెండు చేతులెత్తి దణ్ణం పెట్టి వడివడిగా అడుగులేస్కుంటూ చీకట్లో కలిసిపోయాడు పెద్దింటాయన. చీకటిని చీల్చుకుంటూ పెద్ద మెరుపు మెరిసింది. దాని వెలుగులో పరుగులాంటి నడకతో జీవితంలో పోరాడలేక పారిపోతున్న పెద్దింటోరు కనిపించారు శాంతమ్మకు. చేతుల్లో వున్న బిడ్డతో భర్త కళ్ళలోకి చూసింది. ఆమె అలా అతని కళ్ళలోకి చూసి చాలా రోజులయ్యింది.
“ఈ బొడ్డూడని బిడ్డ మీద ఒట్టేసి చెప్పయ్యా… పెద్దింటోరి ఆడగాలి సుఖం నిన్ను ఎప్పుడైనా తాకిందా” ఆమె మౌనం వెనకున్న అనుమానం ఇన్నాళ్ళకు బయటపడింది. ఆమె అంత పెద్ద నిందేసినందుకు చటుక్కున అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“లేదు” అన్నాడు.
ఆ రెండక్షారాలే వారిద్దరి మధ్య అఘాదాన్ని పూడ్చే వారధిలా నిలబడ్డాయి. గుండెకు గాయమైనట్టు కొండయ్య కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగుతున్నాయి. అవి అతనిపై పడ్డ నిందను కడికేస్తున్నట్టుగా దీపం వెలుగులో కనిపిస్తున్నాయి శాంతమ్మకు. అతని మాటలోను, మనసులోనూ ఎలాంటి మర్మం లేదని ఆమెకు అప్పటికి అర్ధమయ్యింది. మనసు తేలికపడినట్టుగా ఒక నిర్ణయం తీసుకుంది. “ఉన్నఫలంగా బయల్దేరి మనం మా పుట్టింటికి వెళ్ళిపోదాం పదా” అనేసి బిడ్డను గుండెలకు హత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ.
****
అంతర్వేది తీరానికి ఆనుకుని అటు గంభీరంగా వున్న సముద్రం, ఇటు అలల కేరింతలతో గోదారి. మధ్యలో వున్న అన్నాచెల్లెల్ల గట్టుపై కూర్చుని బుట్టలు అల్లడానికి ఈత జువ్వలు చెక్కుతున్నాడు కొండయ్య. చంటిబిడ్డను సంకనేసుకుని ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చింది శాంతమ్మ. చెప్పలేని విషయమేదో మోసుకొచ్చినట్టుగా వున్న ఆమె ముఖంలో ఆందోళన పసిగట్టాడు.
“ఏమైంది శాంతా?”
“వల్లూరు చేపలు అమ్మడానికి వెళ్ళిన ‘పల్లెనాగు’ ఇప్పుడే ఇంటికొచ్చిందయ్య”
‘వల్లూరు’ పేరు చెప్పగానే కొండయ్య మనసు ఉల్లాసపడింది. కానీ అది క్షణకాలమే అన్నట్టు.. “నిన్న పెద్దాయన్ని పాము కరిచిందంట. ఇంటెదురుగా వున్న తెల్లజిల్లేడు డొంక దగ్గర నురగలు కక్కుని చచ్చిపడున్నారట. నాగు చెప్పింది”
“పాము కాటుకి మందిచ్చే ఆయన పాము కరిచి చచ్చిపోవడమేంటి” నమ్మలేనట్టుగా అన్నాడు.
శాంతమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. పూడుకుపోయిన గొంతుతో… “ఆ మాట కూడా చెప్పింది. నీకు, పెద్దమ్మోరుకి మధ్య ఏదో సంబంధం వుందని, ఆ పాపమే పండి పురిటి కందయ్యిందని ఊల్లో అందరూ అనుకుంటున్న ఇసయం పెద్దాయనకి తెలిసిందంట. ఆ అవమానం తట్టుకోలేకే ఏదో అఘాయిత్యం చేస్కునుండుంటాడని అందరూ అనుకుంటున్నారటయ్యా…” అని చెప్పి ఏడుస్తూనే వుంది.
మౌనంగా తనలో తానే కుమిలిపోయాడు. ఆ తల్లిపై నింద పడటానికి తాను కారణమయ్యానని తెలిసిన మరుక్షణం చేతిలోని ఎరకల కత్తితో గొంతు కోసుకుని చచ్చిపోవాలనుకున్నాడు. ఇంతలో శాంతమ్మ సంకనున్న బిడ్డ ఏడుపు మొదలెట్టాడు. వాడి ఏడుపు వదిలేసి వెళ్ళిపోయిన తండ్రికోసమో లేక ఒంటరిగా మిగిలిపోయిన తల్లికోసమో తెలీక కొండయ్యను కలవరపెడుతుంది.
“శాంతా! నేను వల్లూరు వెళ్తున్నాను” అని అప్పటికప్పుడు బయల్దేరాడు.
“ఇప్పుడెందుకయ్యా..”
“జీవితంలో దెబ్బతిన్న నా ఆడబిడ్డను పుట్టింటికి తెచ్చుకోవడంకోసం. శిధిలమైన పెద్దింటోరి ఇంటి గోడలకంటే జనం నిందలే ఆ తల్లికి బతికుండగా సమాధి కట్టేత్తాయి. నేనెల్లాలి” అని తోబుట్టువులాంటి మంగాకుమారి కోసం బయల్దేరాడు.
ఆ పవిత్రమైన ‘అన్నాచెల్లెల్ల గట్టు’ వెంబడి వెళ్తున్న పూల కొండయ్యలో కల్మషం లేని వ్యక్తిత్వం పరిమళిస్తుంది. అలాంటి వ్యక్తిని అపార్ధం చేస్కున్న విషయం తలుచుకుని శాంతమ్మ సిగ్గుతో తలదించుకుంది..
*********
రచయిత పరిచయం
మనతెలుగుకథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారములు!
నేను పంపిన ‘అన్నా చెల్లెళ్ళగట్టు’ కథ ప్రచురించారని మీరు పంపిన మెయిల్ చూసి చాలా సంతోషం కలిగింది. సంక్రాంతి కథల పోటీకి ఈ కథను ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నా గురించి…
నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నాను. ‘బాలు దొమ్మేటి’ అనే పేరుతో సమయం చిక్కినప్పుడు కథలు రాస్తుంటాను.
బాలకృష్ణ గుబ్బల
హైదరాబాద్
Comments