అసలు రహస్యం
- Yasoda Gottiparthi
- Jul 16
- 5 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #AsaluRahasyam, #అసలురహస్యం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Asalu Rahasyam - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 16/07/2025
అసలు రహస్యం - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
శ్రీకర్, సవితకు భాను, రాంజీ అని ఇద్దరు పిల్లలు. భాను పదేళ్లు, రాంజీకి అయిదేళ్ళు..
వేసవి సెలవులు రావడంతో ఇద్దరి అల్లరి భరించలేక,
“పిల్లలూ! త్వరగా రెడీ అవ్వాలి మనము పిక్నిక్ వెళదాము" అనగానే, “పిక్నిక్ వద్దు మమ్మీ, జూ పార్క్ వెళ్దాం” అంటూ రాగాలు తీశారు.
“వర్షాకాలం కదరా జంతువులన్నీ వాటి గుహల్లోనూ, పక్షులన్నీ గూళ్ళలోనూ ఉంటాయి.”
“వర్షం పడకపోతే బయటకు వస్తాయి, చూడొచ్చు ఎంచక్కా. అక్కడికే వెళ్దాం” అంటూ మొండి పట్టు పట్టారు.
“సరే మీ ఇష్టం, జూకి సాయంత్రం వెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఎండలో తిరిగి చూడలేము..”
“సరే అయితే. మనం మన పెరట్లో పూలు చెట్లను చూద్దాం రాంజీ” అని.. భాను అంది.
“అక్కా! జూకి వెళ్తున్నాం కదా! అక్కడ అవే ఉంటాయి" అన్నాడు రంజీ.
“నాకోసం రావా! నీతో జట్టు కటిఫ్.. " బుంగ మూతి పెట్టగానే, ‘సరే పద’ అని తోటలోకి వెళ్లారు.
చక్కని అందమైన పువ్వులపై రంగుల సీతాకోకచిలుకల రెక్కలు రెపరెపలాడుతూ ఎగురుతూ, మళ్ళీ మరొక పువ్వుపై వాలుతూ తిరుగుతుంటే, సంతోషం వేసి పట్టుకుంటారా అంటూ వాటి వెంటే తిప్పుకుంటున్నాయి అవి..
రాంజీకి చెట్టు మీద పచ్చని చిలుకలు కనిపించి, “అక్కా! రారా! రామచిలుకలు చూడు ఎంత బాగున్నాయో? సీతాకోకచిలుక, రామచిలుక రెండు ఎగిరేవే. సీతారాములు రెండింటిని ఒకే గూటిలో పెట్టుదామా!"
“అవి దొరకవు తమ్ముడు.. మనం కాసేపు కదలకుండా, నిశ్శబ్దంగా నిలబడితే ఈ మందార చెట్టుపై వాలుతాయి"
రెక్కలు పట్టుకున్నాడు రాంజీ..
“అలా చేస్తే బాధపడుతుందిరా” అనగానే..
“కొద్ది సేపే అక్క! ముద్దొస్తుంది, మనకు తేనెను పంచుతాయి".
రామచిలుక కావాలి అంటూ పరుగెత్తాడు రాoజీ.
“చిలుక ఆకాశంలో ఎగురుతుంది దొరకదు. నేను ఇంట్లోకి వెళ్లి ఒక చిన్న పంజరం తెస్తాను తమ్ముడు! నేను దీనిని బాగా పండిన జామపండు కొమ్మకు కట్టుతాను. పండు కోసం రామచిలుక లోపలికి పోతుంది. అప్పుడే వెళ్లి పట్టుకుందా”మని చెప్పింది.
అలాగే చేసి పట్టుకొని సీతాకోకచిలుకకు దారం కట్టి, “మమ్మీ” అన్నారిద్దరూ.
***
"జూ"కి టైమ్ అయింది అనగానే, తమ స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ సర్దుకుని బయలుదేరారు అందరూ..
*******
"జూ" లో పిల్లలందరూ పక్షులను చూస్తుంటే నెమలి, గ్రిల్ లోనుండి రాంజీ కాలును మెల్లగా కొరికింది. రాంజీ ఏడుస్తూ ఉంటే, శ్రీకర్ కు లోపలినుండి పొంగుకొచ్చే అంత ప్రేమ రావట్లేదు. నలుగురిలో గొప్పగా తన కొడుకు అని చూపించు కుంటున్నాడు తప్ప..
ఎక్కడో మనసులో చివుకు మంటుంది.
******
సవిత తల్లి గారింట అందరికీ ఆడపిల్లలే, తనకు రెండవసారి బిడ్డే పుడుతుందని జ్యోతిష్యుడు చెప్పినట్టు గుర్తు. అతనికి కొడుకును చూపించాలని లోలోపల అనుకున్నాడు. సవిత శ్రీకర్ వాలకం గమనిస్తుంది..
( రాంజీ పుట్టే ముందు సవిత గుర్తు తెచ్చుకుంటూ)
ఆకాశంలో పట్టపగలే చుక్కలు పొడుస్తున్నాయి అంటూ వస్తున్న దగ్గర బంధువును చూడగానే, “ఆ రండి అప్పుడే మీదాకా వచ్చిందా వార్త..” అంటూ శ్రీకర్ ముఖం వెలిగిపోతూ, “నేనే ఫోన్లో చెబుదామనుకున్నాను.. ముందు హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడాను ఆలస్యమైంది. సవితకు గంట నుండి కాస్త పురిటి నొప్పులు ప్రారంభ మయ్యాయి.”
“మీ అత్తగారు ఇక్కడే ఉంది కదా ఫోన్ చేసి చెప్పింది” అనగానే.. సరే అని, కారులో హాస్పిటల్ వెళ్ళారు.
ఒక వైపు నొప్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అన్నిటికి తానే ముందంటూ వచ్చేసింది ఈవిడ కుంతల, ఎవరికి తెలియకుండా లేబర్ రూమ్ వెళదామని అనుకున్నాను అనుకుంది సవిత.
“అమ్మ! నువ్వు ఎందుకే హాస్పిటల్కు.. చంటిదాన్ని చూసుకుంటూ ఉండు. లేదా చెల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి, దానికి ఇదే సమయంలో డెలివరీ అన్నారు కదా. అటు వెళ్ళ”మని చెప్పగానే తల్లి వెళ్ళిపోయింది.
****
“డాక్టర్ గారు! నాకు బాబు కావాలి” అంటుంది సవిత ఒకవైపు పురిటి నొప్పులు తీస్తూ..
“బాబు కావాలి అంటుంటే మా చేతిలో ఏముందమ్మా? అంతా ఆ దేవుడు ఏమిస్తే అది”
“అలా అనకండి డాక్టర్.. ఎలాగు సిజేరియన్ చేస్తారు కదా. నాకు ప్రెగ్నెంట్ అప్పుడే తెలిస్తే ముందే ప్లాన్ చేసి చెప్పేదాన్ని..”
“నువ్వు ప్రశాంతంగా నొప్పులు తీయమ్మ.”
“సరే డాక్టర్ గారు. పక్క లేబర్ రూమ్లో మా చెల్లెలు మమత కూడా ప్రసవ నొప్పులు తీస్తుంది. మా ఇద్దరికీ మీరే దేవత అండి.”
“అయితే ఏమంటావమ్మా?” అని డాక్టర్ కాస్త విసుగ్గా అనగానే,
“నాకు బాబు పుడితే పర్లేదు, బిడ్డ పుడితే మాత్రం, మా చెల్లెలుకు కొడుకు పుడితే నా బిడ్డను మా చెల్లెలు పక్కన పడుకోబెట్టి మా ఆమె కొడుకును నా దగ్గర పడుకోబెట్టండి డాక్టర్ ప్లీజ్..” అంటూ ఆమె చేతులు పట్టుకుని “ఇవి కాళ్ళు అనుకోండి డాక్టర్ గారు..” అంటూ రెండు చేతులు జోడించింది.
“సరే నీవు ఇలా ఆందోళన పడితే బీపీ పెరుగుతుంది. ఆపరేషన్ చేయాలా వద్దా ? తప్పకుండ అలాగే చేస్తాను నువ్వు కూల్ గా ఉండు.”
“వెంటనే కళ్ళు మూసుకుంది. పాప ఏడుపు విని కళ్ళుతెరవగానే, “అమ్మ! నీకు పాప పుట్టింది” అనగానే “అలాగా డాక్టర్” అంటూ ఆమె వైపు దీనంగా చూచింది.
వెంటనే సిస్టర్ తో పాపను తీసుకురమ్మని మమత దగ్గరికి వెళ్లి అక్కడ పాపను పడుకోబెట్టి, కళ్ళుమూసుకున్న మమతను చూసి, బాబును త్వరగా తీసుకురా అంది డాక్టర్.
“డాక్టర్ గారు! నాకు అంతా తెలుసు. నేను మా అక్క అలా ఒప్పందం చేసుకున్నాము. నాకు ఒక బాబు ఉన్నాడు పాపను ఇవ్వమన్నాను.. ఇలా చేస్తున్నాము"
""***"*****
సిస్టర్ బయటకు వచ్చి “సవిత డెలివరీ అయింది, బాబు పుట్టాడు” అని చెప్పింది.
“థ్యాంక్యూ సిస్టర్ !”
ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బై, “థ్యాంక్యూ సిస్టర్! అమ్మా! నీ కోడలు నీ మాట నిలబెట్టింది.. వంశాంకురాన్నీ ఇచ్చింది. " అని శ్రీకర్ అంటుంటే, ‘ఒక పది నిమిషాలు తర్వాత మీరు చూడొ’చ్చని వెళ్ళిపోయింది సిస్టర్..
*******
తను తన కోసమే త్యాగం చేస్తుందా? తన కుటుంబం కోసమే.
సవిత, మమత ఇద్దరు కవల పిల్లలు. చిన్నతనం నుండి అన్ని సమానంగా ఒకే లాగా పెరిగారు. ప్రేమలోనూ, పెంపకంలోను, చదువులో, బట్టల్లో కూడా ఒకే తీరుగా, భర్తల ఎంపికలో అన్ని విధాల ఇద్దరికీ ఒకే విధంగా దొరకడం కన్నవాళ్ళకు చాలా కష్టమైంది. రంగు, రూపు చక్కగా అమ్మాయిలకు నచ్చినట్టుగా కుదిరాయని సంతోషం తో
ఇద్దరి పెళ్లిళ్లు సవితకు శ్రీకర్, మమతకు, శంకర్ తో ఒకేసారి జరిగాయి.
దేవుడు తాను ఇచ్చినట్లు అన్ని ఇచ్చి ఇద్దరికీ సంతానంలో మాత్రం తేడా చేశాడు.
మొదటి కాన్పులో సవితకు పాపను, మమతకు బాబుని ఇచ్చాడు. కొన్ని రోజుల వరకు బేధాలు ఓర్చుకోలేక పోయారు. ఇద్దరికీ మళ్ళీ రెండో కాన్పులో ఏం జరుగుతుందో అని ఆందోళన మొదలైంది.
ఎవరికీ చెప్పవద్దని డాక్టర్ తో ఒట్టేయించుకుని తమ ఇష్టంగా మార్చుకున్నారు. శ్రీకర్ మాత్రం తనకు కొడుకే పుట్టాలి అని రోజు నస పెడుతూ, కొడుకును కనకపోతే నిన్ను పుట్టింటికి పంపిస్తాను అంటూ బెదిరించేవాడు.
ఈ కాలంలో ఆడ మగ తేడా ఏంటండీ? ఏదైనా మన మంచికే అనుకోవాలి అని అంటున్నా, లోలోపల అన్నంత పని చేస్తారేమో ? అని భయపడేది.
అత్తగారైతే మనుమరాలుతో “నువ్వు తమ్ముడిని తెచ్చుకోవాలి లేకపోతే గొంతు నులిమి చంపేస్తా” అనేది చాటుగా..
తమ్ముడిని చూచి ఊపిరి పీల్చుకుంది భాను.. పెద్దవాళ్ల ఇష్టం పిల్లల ప్రాణాల మీదికి వచ్చేట్టుందే అనుకునేది
లోలోపల.
****
భాను, రాంజీ వచ్చి, మమ్మీ అన్న పిలుపుతో ప్రస్తుత లోకం లోకి వచ్చి, “ఏంటి రాంజీ ఆకలేస్తుందా?” అని అడిగింది సవిత.
“అరటి చెట్టు ఆకులు అందుతున్నాయి తెస్తాము” అంటూ కదిలారు.
ఎండ పడుతూ ఉంటే చల్లగా ఉంది అని తలపై కప్పుకున్నారు ఇద్దరూ ఒకే ఆకును.
అక్కడున్న వాళ్ళు చూసి అరటి ఆకు గొడుగు భలేగా చేశారర్రా! అని మెచ్చుకున్నారు.. అరటి ఆకుల్లో వడ్డించింది. శ్రీకర్ కు ఇష్టమైనవి కొడుకుకు పెడుతుంటే వాడు తినను అనగానే. వీడు నా కొడుకైతే మా ఇద్దరి ఇష్టాలు ఒక్కటే ఉండాలి, అటు ఇటు చూస్తుంటే.. జ్యోతిష్యుడు కనిపించడం తో వెళ్ళి,
“రండి స్వామి! మా పిల్లలు ఇద్దరు” అంటూ పరిచయం చేసి, “మీరు నాకు రెండోసారి బిడ్డే పుడుతుందని చెప్పారు" అన్నాడు.
“అలా జరగదు. నా మాట తప్పకుండా అవుతుంది. ఆ దేవుని మాయ” అంటూ వెళ్ళగానే, తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయి సవితను సందేహంగా చూడడం, రాంజీని దూరం పెట్టడంతో, గమనించిన సవిత, “పదండి పిల్లలు! మనం బయలుదేరుదాం " అని ఇంటికి వెళ్లారు.
*******
"అనుమానం పెనుభూతం" వదిలించుకోవాలి అనుకొని,
డాక్టర్ను కలిసి “మా బాబు పుట్టినప్పుడు ఏమైనా తారుమారు అయ్యారా?” అనడంతో, “అలా ఎన్నడు ఇక్కడ జరగదు” అని ఖచ్చితంగా చెప్పింది డాక్టర్.
“కంగారు ఎక్కువయింది పక్కనే లేబరేటరీ లో.. పిల్లల "డీఎన్ఏ " టెస్టులు రిజల్ట్స్ ఈరోజు పంపించాలి..” అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, వెంటనే వెళ్లి డాక్టర్కు చెప్పి రాంజీ డీఎన్ఏ టెస్ట్ చేయించాడు ఎవరికీ తెలియకుండా..
వెంటనే భార్యని నిలదీశాడు.
“అవునండి! నిజమే మీ అనుమానం" అనేసరికి,
“నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు?” అని చేతులెత్తబోయే సరికి, “ఇప్పుడు మా చెల్లెలు సాక్ష్యం ఉంది.. కానీ ఆ జ్యోతిష్యుడు నాకు ఒక నిజం చెప్పాడు.
‘స్వామి ! నాకు బిడ్డ పుట్టినా పరవాలేదు కానీ నా భర్త తట్టుకోలేడు. కొడుకు పుట్టాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నేను మా చెల్లెలు పిల్లలను మార్చేసుకున్నాము. ఇప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా స్వామి’ అనగానే,
‘మీకు పుట్టిన పాపతో తండ్రికి గండం ఉందనీ, ఐదు ఏళ్ల వరకు తండ్రి తన బిడ్డగా చూడకూడదని, అలా చేయమని నేనే చెప్పానని చెప్పండి. మంచి కార్యం కోసం నేను చిన్న అబద్ధం ఆడినా ఫర్వాలేదు.. నా మాటంటే తప్పక నమ్ముతాడు’.. అనగానే అలా చేయవలసి వచ్చింది క్షమించండి” అనగానే,
శ్రీకర్, “నాకున్న కొడుకు ప్రేమ మీ అందరికీ ఇంత ఇబ్బంది కలిగించింది. ఏది ఏమైనా మన మంచికే జరిగింది” అని శ్రీకర్ "రాoజీ" ని మమతకు ఇచ్చి తన బిడ్డ రాణిని హత్తుకుని క్షమాపణ అడిగాడు.
సమాప్తం.
******************
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments