top of page

ఆశపాశం


'Asapasam' New Telugu Story


Written By Allu Sairam


రచన: అల్లు సాయిరాం(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ప్రాంతం.

ఆకాశమంతా నిండుగా ప్రకాశిస్తూ, బహుశా డ్యూటీ దిగిపోయే గాభరాలో చకచకా మబ్బుల చాటున పరుగెత్తుతున్న మూడోజామురాత్రి చంద్రుడ్ని, ఎంత తొందరగా తెల్లవారుతుందా అని నిద్రపట్టక మంచం మీద పడుకుని చూస్తున్నాడు చంద్రయ్య.


దీపం వెలుగులో గడియారం చూస్తే, టైం రెండున్నరయింది. యింకా రెండున్నరేనా! టైం నాలుగున్నర అయితే కానీ కూరగాయలు బజారుకి తీసుకెళ్ళడానికి ఆ ఆటో రాజు ఆటో తీసుకునిరాడు అని నిట్టూరుస్తూ, తన మంచం ప్రక్కన రెండు బుట్టల్లో మూటగట్టిన కూరగాయలు, పండ్లు చూస్తూ, యిరోజు సంతబజారులో కూరగాయలన్ని ఎలాగైనా తొందరగా అమ్మేయాలి అని ఆలోచించుకుంటూ పడుకున్నాడు.


యిలా చిన్న కునుకు తీయడం, టైం అయిపోయిందని ఉలిక్కిపడి నిద్రలేవడం, టైం అవ్వలేదని నిట్టూర్చడం, బుట్టల్లో మూటగట్టిన కూరగాయలు, పండ్లు చూసుకోవడం, మళ్లీ పడుకోవడం, రాత్రంతా యిదే వరుస. ముందురోజు సాయంత్రం పొలంలోకి వెళ్లి, పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, యిలా ఎదుంటే అది బుట్టల్లో మూటగట్టి, దగ్గరున్న పట్టణం సంతబజారులో అమ్ముకుంటే, నాలుగు డబ్బులు వస్తాయి కదా అని ఆశపడే రకం చంద్రయ్య.


ఎప్పటిలా యింట్లో ఒక్కడే ఉంటే, టైం తో సంబంధం లేకుండా నిద్రలేచి, బుట్టలతో కూరగాయలు పట్టుకుని బస్టాండుకి వెళ్లి, ఆటో రాజు రాకపోతే, అవసరమైతే చీకటిలో సంతబజారుకి నడిచి వెళ్ళిపోతాడు. కానీ, తనకున్న ఒక్కగానొక్క మనవరాలైన గిరిజ పట్టణం నుంచి ముందురోజు రాత్రి వచ్చింది. యిలా నిద్రల్లేకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటాడని ఎప్పుడూ గిరిజ చంద్రయ్య మీద కోప్పడుతుంది.


దురదృష్టవశాత్తు గిరిజ తన తల్లిదండ్రులని చిన్న వయసులోనే కోల్పోయింది. అప్పటినుంచి ప్రాణంగా చూసుకుంటూ, తన శక్తి మేరకు గిరిజని డిగ్రీ వరకు చదివించాడు చంద్రయ్య. పట్టణంలో ప్రైవేటు కంపేనీలో చిన్న ఉద్యోగావకాశం వస్తే, చంద్రయ్యని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఏమాత్రం యిష్టంలేని గిరిజ వద్దనుకుంది. నేను యింకెంత కాలం ఉంటానమ్మా! నాలుగు డబ్బులు వస్తే, నీ భవిష్యత్తు బాగుంటుంది తల్లీ! అయినా నేను రోజూ కూరగాయలు తీసుకుని పట్టణం సంతబజారుకి వస్తాను కదా, అక్కడినుంచి నిన్ను చూడడానికి వస్తాను అని గిరిజకి సర్దిచెప్పి ఉద్యోగం చెయ్యడానికి ఒప్పించాడు.


ఎదురుచూసి చూసి, ఓపిక పట్టలేక మూడుగంటల అవ్వకముందే నిద్రలేచేశాడు. పడుకున్న గిరిజ నిద్రకి భంగం కలగకుండా, యింట్లో లైటు వెయ్యకుండా అటుయిటు తిరుగుతూ కాలకృత్య పనులు కానిస్తున్నాడు. టైం మూడున్నర అవుతుంది. ఒక సంచిలో క్యారేజీతో చద్దన్నం, రెండు ఉల్లిపాయలు, నీళ్ల బాటిల్ పెట్టుకున్నాడు. మెల్లగా తలుపు చప్పుడు అవ్వకుండా మూటగట్టిన రెండు బుట్టలతో కూరగాయలు పట్టుకుని బస్సులు ఆగే చెట్టు దగ్గరికి వచ్చాడు.


ఎంతచూసినా ఆటో రాజు రావట్లేదు. తనతో పాటు కూరగాయలు పట్టణానికి వచ్చే కూలీపనులకు వెళ్ళేవారు కూడా ఎవరూ రావట్లేదు. కనీసం ఒక్కరూ కుడా రోడ్డు మీద కనిపించట్లేదు. మెల్లగా సూర్యోదయం అయిపోతుంది. చంద్రయ్యకి ఓపిక నశించి రెండు బుట్టలు పట్టుకొని పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి నడిచి వెళ్ళిపోదామని బయలుదేరాడు.


ఇంట్లో పడుకున్న గిరిజ నిద్రలేచి చూస్తే, చంద్రయ్య యింట్లో లేకపోయేసరికి, పక్కన చూస్తే కూరగాయలు, ఆకుకూరలు బుట్టలు కనిపించలేదంటే, కచ్చితంగా అవి పట్టుకుని పట్టణానికి బయలుదేరుంటాడు అని కంగారుపడి యింటి నుంచి బయటికి వచ్చి చుట్టూ వెతుకుతూ చూస్తే, దూరం నుంచి నడిచి వెళ్ళిపోతున్న చంద్రయ్య కనిపించాడు.


గిరిజ వెంటనే "తాతా! తాతా!" అని అరుస్తూ పరిగెత్తుకుంటూ చంద్రయ్య దగ్గరికి వచ్చింది. "ఎక్కడికి పోతున్నావు తాతా?" అని ఆలిసిపోతూ అడిగింది గిరిజ.

"నువ్వెందుకు వచ్చావు? ఏమైందమ్మా?" అని అడిగాడు చంద్రయ్య.


"నేను చెప్తా గాని, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు చెప్పు!" అని గిరిజ గట్టిగా అడిగేసరికి, చంద్రయ్య కంగారుపడి "యింకెక్కడికి పోతాను. పట్టణంలో సంతబజారుకి! ఎంతసేపు నుంచి చూసినా ఆ ఆటోరాజుగాడు ఆటో తీసుకుని యింకా రావట్లేదు. డబ్బులు వసూలు చెయ్యడానికి మాత్రం ముందు వచ్చేస్తాడు. తాగడానికి ఉండాలి కదా! పోనీ, వేరే ఎవరైనా వస్తే, తోడు పట్టుకుని వెళ్లిపోదామనుకుంటే, ఉదయం నుంచి ఒక్కరూ కుడా రాలేదు. మరింకెందుకని, నేనే నడిచి వెళ్ళిపోదామని నడుస్తున్నాను!" అని జరిగినదంతా చెప్పాడు.


"తాతా! చెప్పేది విను! నువ్వెంత చూసినా, ఆ ఆటో రాజు మాత్రమే కాదు, జనాలు ఎవరూ కుడా బయటికి రారు. తిరగరు. ట్రైన్లు, బస్సులు కుడా తిరగవు. ఆఫీసులు ఉండవు. మార్కెట్లు ఉండవు. నువ్వు ముందు యింటికి రా!" అని యింటికి తీసుకెళ్లడానికి చంద్రయ్య చెయ్యి పట్టుకుంది గిరిజ.


చంద్రయ్య గట్టిగా నవ్వుతూ "ఏటి గిరిజమ్మా! ట్రైన్ బళ్ళు, బస్సులు తిరగవా! ఆఫీసులు, మార్కెట్లు ఉండవా! జనాలు బయటికి రారా! బయటికి రాకుండా, ఏం చేస్తారు? ఇంట్లో పడుకుంటారా! బయటికి రాకుండా, నాలుగు డబ్బులు సంపాదించకుండా కడుపుకి ఏలా అన్నం తింటారు? బజారుకి నన్ను వెళ్లకూడదని నువ్వు యిలా చెప్తున్నావని నాకు తెలుసులే!" అని ముందుకి నడుచుకుంటూ వెళ్తున్నాడు.


గిరిజకి చిర్రెత్తుకొచ్చి, చంద్రయ్య ముందుకి పరుగెత్తుకొని వచ్చి "తాతా! నేను నీకు అబద్ధం చెప్పుండొచ్చు. మరి, యింత పొద్దు పొడిచినా మిగతా జనాలు ఎందుకు ఎవరూ బయటికి రాలేదు. మా తాతని ఆటపట్టించడానికి, అందరికి నేనే రావొద్దని చెప్పానా?" అని అడిగేసరికి, చంద్రయ్య చూట్టూ చూస్తూ వాస్తవాన్ని గ్రహించాడు.


"తాతా! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అనే భయంకరమైన వ్యాధి వలన ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. బయట కొన్నిదేశాల్లో మనుషులు ప్రాణాలతో పోరాడుతున్నారు. యిప్పుడు ఆ భయంకరమైన వ్యాధి మన దగ్గరికి వచ్చింది. మనిషి ద్వారా మరో మనిషికి వ్యాపించే వ్యాధి నుంచి అందరి ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వాలు, ఈరోజు నుంచి ఎవరిని బయటికి రావొద్దని చెప్పాయి. దీన్నే లాక్డౌన్ అంటారు. అందుకే పట్టణంలో పనిచేసే మాలాంటివారు ఎవరి ఊర్లకి వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను నిన్న అందుకే వచ్చేశాను!" అని విషయం కూలంకషంగా వివరించింది గిరిజ.


"అదెట్లా కుదురుతుంది. ప్రభుత్వాలు చెప్తే జనాలు తిరగడం మానేస్తారా? రెండు, మూడు గంటల్లో ఎవరి పనులకి వారు వచ్చేస్తారులే! అసలు వాళ్ళెవరో రాకపోతే, బయట తిరగకపోతే నాకేమీపోయింది. నేను నా కూరగాయలు పండించుకున్నాను. అమ్ముకుంటాను! యిప్పుడికే బోలెడంత ఆలస్యమైపోయింది. నేను పోయి వచ్చేస్తా! నువ్వు యింటి దగ్గర జాగ్రత్తగా ఉండు గిరిజమ్మ!" అని గిరిజని పక్కకి తప్పించుకుంటూ ముందుకి నడుచుకుంటూ వస్తున్నాడు చంద్రయ్య.


"జనాలు ప్రభుత్వాలు చెప్తే, వినకపోవచ్చు తాతా! ప్రాణాలు పోతాయంటే కూడా వినరా? యిప్పుడు బయటికి వెళ్తే, నీ ప్రాణాలకే ప్రమాదం తాతా!" అని గిరిజ చెప్పేసరికి చంద్రయ్య నడక వేగం తగ్గింది.


"యి పంట చూడు గిరిజమ్మ! కూరగాయలు, పండ్లు ఎంత నవనవలాడుతున్నాయో, మార్కెట్లో పెడితే గంటలో అమ్ముడయిపోతాయి. యిరోజుకి యి బుట్టడు కూరలు అమ్మేసి వచ్చేస్తాను తల్లీ!" అని ఒక చెట్టు దగ్గర బుట్టలు దించి మూట కట్టు విప్పి గిరిజకి చూపిస్తూ చెప్పాడు.


"అయ్యో తాతా! నువ్వు అమ్మడానికి అక్కడికి వెళ్లినా, ఎవరు కొనడానికి బయటికి రారు. అసలు, రోడ్లమీద కాపలా కాస్తున్న పోలీసులు నిన్ను అంతవరకు పోనీవ్వరు. రా యింటికి పోదాం!" అని గిరిజ తల పట్టుకుని చెప్పినా ఎందుకో చంద్రయ్య మనసొప్పలేదు.


"గిరిజమ్మా! పోనీ, రేపు బజారుకి పోవచ్చా? నువ్వు చెప్పినట్టు, యిరోజు బజారుకి వెళ్లకుండా, యింట్లో యి బుట్టలతో దాచిపెడదాం!" అని ఆశగా అడిగాడు చంద్రయ్య.


అప్పటికే కోపంగా ఉన్న గిరిజ "కుదరదు! రేపే కాదు, యింకా మళ్లీ పట్టణం పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. పరిస్థితులు మళ్లీ ఎప్పుడు చక్కపడతాయో, అప్పుడు ప్రభుత్వం మళ్లీ అన్ని పనులకి, అందరికీ పర్మిషన్ యిస్తుంది. అంతవరకు కుదరదు!" అని కరాఖండిగా చెప్పేసింది.


"ఆఁ అలాగయితే కుదరదు. అంతవరకు పంట బాగుండదు. వద్దు! యిరోజే బజారుకి పోవాల్సిందే!" అని అంటూ బుట్టలు ఎత్తుకుంటున్నాడు చంద్రయ్య.


గిరిజ కోపం కట్టలు తెంచుకుని "సరే అయితే పదా! పోదాం! నేను బజారుకి వస్తాను!" అని అంది.


ఎత్తుకుంటున్న బుట్టలు కిందకు దించి "బజారుకి నువ్వెందుకు గిరిజమ్మా? ఎన్నెన్ని జాగ్రత్తలు చెప్పావు. నీ ప్రాణాలకే ప్రమాదం కదా తల్లీ!" అని గిరిజ ముఖం చూస్తూ అన్నాడు చంద్రయ్య.

"ఓహో! నీ ప్రాణాలు పోయినా పర్వాలేదా! నేను మాత్రం బతికేయేలా!! నాకున్నది నువ్వొక్కడివే తాతా! వస్తే యింటికి రా. యిద్దరం పోదాం! లేదంటే, బజారుకి పదా, యిద్దరం వెళ్దాం!!" అని గిరిజ కోపంగా చెప్పేసరికి చంద్రయ్యకి ఒళ్ళంతా చెమటలు పట్టి, ఆ చెట్టు కింద ఉన్నచోటనే కూర్చుండిపోయాడు.


ఎన్నో ఆశలు పెట్టుకున్న పంట, బాగా పండిన కుడా అవాంతరంగా వచ్చిన యి లాక్డౌన్ వలన పంటసాయం నష్టపోతున్నామని ఆక్రోశం, మిగతా పంటని ఏం చేయాలన్న దిగులు, పండించిన పంట నలుగురికి ఉపయోగపడట్లేదన్న ఆవేదన, రేపు ఏమౌతుందోనన్న ఆందోళనలతో రేగుతున్న ఆలోచనల ధాటికి ఆవిరైపోయిన ఆశలు చంద్రయ్య కళ్లల్లో కన్నీటి సుడిగుండాలుగా తిరిగి, తన ప్రమేయం లేకుండా జలజలా ధారగా కారిపోతున్నాయి.


చంద్రయ్య కోపానికి ఎదురుగా గిరిజ కాకుండా, వేరే ఎవరైనా ఉండి ఉంటే, తన శక్తినంతా కూడగట్టుకుని ఏం చేసుండేవాడో తెలియదు. కోపాన్ని తట్టుకోలేక, ఉన్నట్టుండి లేచి, బుట్టలు తల మీద పెట్టుకుని, గబగబా పెద్ద అడుగులేస్తూ వెళ్తున్నాడు చంద్రయ్య. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో అని గిరిజ చంద్రయ్య వెనుక పరుగెత్తుకుంటూ వచ్చినా, చంద్రయ్య అడుగుల వేగాన్ని అందుకోలేకపోయింది.


చంద్రయ్య నేరుగా కూరగాయల తోటలోకి వచ్చాడు. కోపంగా కూరగాయల, ఆకుకూరలు మొక్కల వైపు చూస్తూ "యివి ఎవ్వరికి వద్దంట! నువ్వు యిచ్చినవి నువ్వే తీసుకో! యిరోజే కాదు. రోజూ యింతేనంట!" అని అంటూ బుట్టల్లో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు గట్టిగా గాల్లోకి విసిరేశాడు.


కూరగాయలు, ఆకుకూరలు పంటభూమిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. చంద్రయ్య పొలంలో నిల్చున్న చోటే చతికిలపడిపోయినట్టుగా మెకాలి మీద కూర్చుని "కిందటి సంవత్సరం వర్షాలు పంటని ముంచేశాయి. అంతకు ముందు సంవత్సరం కరువు పెట్టి పంటలు పోయాయి. పోనీ, దేవుడి దయవల్ల, యి సంవత్సరం బాగా పండిందంటే, యిప్పుడు అదేదో కరోనా వచ్చిందంట! యిది నీ దరిద్రమో, లేక నా దురదృష్టమో తెలియట్లేదు! తరువాత సంవత్సరం నన్ను వ్యవసాయం చెయ్యమంటావా! వద్దంటావా!! చెప్పు!" అని గట్టిగా అరుస్తూ అడుగుతున్న చంద్రయ్య ఆగ్రహానికి ప్రకృతి కుడా స్పందించినట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా బలంగా వీస్తున్న గాలులకు, మొక్కలు, చెట్లు చిగురాకులు కొట్టుకుంటూ, ఎండుటాకులు రాలుస్తున్నాయి.


ఎనభైయేళ్ల వయసున్న చంద్రయ్య ఎప్పుడూ ఏడవడం చూడని గిరిజ పరుగెత్తుకుంటూ వచ్చేసరికి, చంద్రయ్య పొలంలో భూమి మీద పడి కన్నీళ్లతో నేలతల్లిని చూడడం, కోపంతో గట్టిగా అరవడం, బాధతో మొరపెట్టుకోవడం, హక్కుగా నిలదీసి అడగడం, కన్నతల్లి దగ్గర చంటిబిడ్డ పాలు కోసం ఏడుస్తున్నట్టుగా, తల్లి కన్నబిడ్డను దగ్గరికి తీసుకున్నట్లుగా అనిపించి కళ్ళల్లో నీళ్ళు తిరిగి, అలా నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. చాలాసేపు చంద్రయ్య అలానే పొలంలోనే ఉండిపోయాడు. తెల్లవారిపోయింది. భానుడి కిరణాలు భూమిని తగులుతున్నాయి. గిరిజ మెల్లగా చంద్రయ్యకి సర్దిచెప్పి యింటికి తీసుకొచ్చింది.


కరోనా తీవ్రంగా వ్యాపించడం వల్ల ప్రభుత్వం లాక్డౌన్ ను కఠినంగా రోజులు పోయి, వారాలు పోయి, నెలల తరబడి అమలుచేస్తున్నారు. చంద్రయ్య రోజూ ఆ పంటని చూడడం, కాసిన కాయలు పళ్ళు అయిపోయి రాలిపోతుంటే ఉసురుపోయినట్టు అనిపించి, ఏం చేయాలో తెలియక, చెయ్యడానికి ఏమిలేక దిగులుపట్టుకుంది. ఒక్కోసారి చూసి చూసి ఓర్చుకోలేక, మొత్తం కూరగాయలు యిరుగు పొరుగువారికి పంచేసేవాడు. గిరిజ చంద్రయ్య మానసిక పరిస్థితిని అర్ధం చేసుకుని, ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకునేది.


ఒకరోజు ఉదయం చంద్రయ్య తన తోటలో ఎప్పట్లానే విచారిస్తూ కుర్చున్నాడు. యింటి ముందు ఒక బైక్ వచ్చి ఆగింది. ఆ బైక్ మీదున్న వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని చంద్రయ్య యింటివైపు చూస్తున్నాడు. గిరిజ యింటి లోపలి నుంచి బయటకు వచ్చి ఎవరు కావాలని అడిగింది.


"బజారులో కూరగాయలు అమ్ముతుంటాడు కదా, ఆ చంద్రయ్య యిల్లు యిదేనా?" అని అడిగాడు ఆ వ్యక్తి. వీరిద్దరి మాటలు విన్న చంద్రయ్య మెల్లగా అక్కడికి వస్తున్నాడు.


"ఆఁ యిదేనండి! ఎందుకు?" అని ఏమైనా కరోనా టెస్టులు చేస్తానంటారా లేక తాతని హాస్పిటల్ కి తీసుకెళ్ళిపోతారనో అని భయపడుతూ అడిగింది గిరిజ.


"కూరగాయలు కావాలి!" అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాటలు చంద్రయ్యకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుగా ఆనందంతో తబ్బిబ్బై, గబగబా పొలంలోకి వెళ్లి, తాజా కూరగాయలు తెచ్చి, ఆ వ్యక్తి అడిగినదానికి కొసరు కలిపి యిచ్చాడు. చాలారోజుల తర్వాత నాలుగు డబ్బులు చూసిన చంద్రయ్య ముఖం వెలిగిపోతుంటే, చూస్తూ ఆనందించింది గిరిజ. రోజులు గడుస్తున్న కొద్దీ, ఒక్కొక్కరు నేరుగా చంద్రయ్య యింటికి వెతుక్కుని వచ్చి డబ్బులు యిచ్చి కూరగాయలు తీసుకువెళ్తున్నారు.


యిసారి ఆనందబాష్పాలతో చంద్రయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. మళ్ళీ పొలంలోకి వెళ్ళి, మెకాలిపై కూర్చుని "చూడమ్మా చూడు! నాకు తెలుసమ్మా! నువ్వు ఏదోకటి చేస్తావని! మనం వాళ్ల దగ్గరికి వెళ్లకుండా, వాళ్లే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారమ్మా! చూడమ్మా!" అంటూ నేలతల్లికి చెప్పుకుంటూ, భూమిని ముద్దాడాడు.


"మా తాతకి ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా, ఏమోచ్చినా తట్టుకోలేం! అంతే!!" అని గిరిజ అనుకుంటూ దూరం నుండి నిలబడి నవ్వుతూ చూస్తుంది.

***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


92 views4 comments
bottom of page