బాలల పుస్తక దినోత్సవ సాక్షిగా
- Gadwala Somanna
- Apr 2
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #BalalaPusthakaDinotsavaSakshiga, #బాలలపుస్తకదినోత్సవసాక్షిగా, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 50
Balala Pusthaka Dinotsava Sakshiga - Somanna Gari Kavithalu Part 50 New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 02/04/2025
బాలల పుస్తక దినోత్సవ సాక్షిగా - సోమన్న గారి కవితలు పార్ట్ 50 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
బాలల పుస్తక దినోత్సవ సాక్షిగా
----------------------------------------
పట్టుకో పుస్తకాన్ని
పొందుకో జ్ఞానాన్ని
సద్విషయాలు నేర్చుకొని
మార్చుకో జీవితాన్ని
చరవాణి వదులుకొని
ఎంచక్కా చదువుకొని
జీవితాన గొప్పగా
ఉండాలోయ్! స్ఫూర్తిగా
పుస్తకాల కాంతిలో
అజ్ఞానం త్రుంచుకొని
అక్షరాల నీడలో
ఆనందం నింపుకొని
తలరాతలు మార్చుకో!
విజేతగా నిలిచిపో!
అక్షరాలు ఆయుధాలు
దిద్దుకో! జీవితాలు
నమ్ముకున్న పుస్తకాలు
బాగుపడును కుటుంబాలు
భువిని గ్రంథాలయాలు
కాంతులీను కాగడాలు
స్నేహిస్తే పుస్తకాలు
అగును మధుర జ్ఞాపకాలు
గుండెల్లో మోదమిక
తలపించు జలపాతాలు

పిట్ట ప్రబోధం
----------------------------------------
ఎగిసి పడే అలలన్నీ
మిడిసి పడే తలలన్నీ
నేలపాలు అగునోయి
అక్షరాల నిజమోయి
కనే పగటి కలలన్నీ
చిరిగిపోయిన వలలన్నీ
నిరుపయోగమేనోయి
ఫలితాలే లేవోయి
వాడిపోయిన పూలన్నీ
వాడి లేని తలపులన్నీ
విలువ కాస్త తక్కువోయి
నష్టమే ఎక్కువోయి
పసలేని మాటలన్నీ
తావి లేని తోటలన్నీ
ఏమాత్రం వలదోయి
లాభమే శూన్యమోయి

విలువైనవి సూక్తులు
----------------------------------------
మహనీయుల సూక్తులు
దిద్దుతాయి బుద్ధులు
తప్పులను సరిచేసి
బాగు చేయు బ్రతుకులు
నేర్పుతాయి విలువలు
తెచ్చునోయి ఘనతలు
వెన్నెలై వర్షించి
మురిపించును మనసులు
పంచిపెట్టు మంచిని
చేయు మహా మనిషిని
విలువైనవి సూక్తులు
జీవితాన వెలుగులు
పసిడి వంటి సూక్తులు
బోధించును నీతులు
ఆలకిస్తే గనుక
అండ నిలుచు మిత్రులు
భవితకవే త్రోవలు
విజ్ఞానపు తోటలు
జీవితాభివృద్ధికి
దారిచూపు గురువులు
ఎన్నెన్నో సూక్తులు
శ్రాన్తినిచ్చు గుళికలు
అనునిత్యము వినాలి
మంచి అందు కనాలి

చెట్టు తల్లి సందేశం
----------------------------------------
మొక్కను నాటితే
నీడను ఇస్తుంది
కుక్కను పెంచితే
కాపలా కాస్తుంది
నవ్వులు రువ్వితే
అందమే వస్తుంది
దివ్వెలు వెలిగిస్తే
చీకటి పోతుంది
పువ్వులు అల్లితే
దండగా అవుతుంది
మువ్వలు మ్రోగితే
నాదం ధ్వనిస్తుంది
అన్నీ ఉపయోగము
సృష్టియే విచిత్రము
నువ్వు,నేను కూడా
అలా ఉన్న గౌరవము

అలా మనం ఉందమా!
----------------------------------------
కోకిలమ్మ పాటలా
చిలుకమ్మ మాటలా
అలా మనం ఉందమా!
పదిమందికి కోటలా
దండలో దారంలా
ఎండలో విటమిన్ లా
అలా మనం ఉందమా!
గుండెలో స్పందనలా
పువ్వులోని తావిలా
దానిలోని గుణంలా
అలా మనం ఉందమా!
పూలకున్న త్యాగంలా
ఊటలోని జలంలా
తోటలోని పూలలా
అలా మనం ఉందమా!
మూటలోని పైడిలా
పొలంలోని పైరులా
గళంలోని గానంలా
అలా మనం ఉందమా!
కలంలోని బలంలా
తల్లిలోని ప్రేమలా
మల్లెలోని తెలుపులా
అలా మనం ఉందమా!
పల్లెలోని సొగసులా

-గద్వాల సోమన్న
Comments