కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి
'Buridi' written by Vadlamannati Gangadhar
రచన : వడ్లమన్నాటి గంగాధర్
“ఏవిట్రా ఆ అమ్మాయి ఇంకా రాలేదు. అసలు ఆ లలిత వస్తుందా, నువ్వు అడిగిన బంగారం తెస్తుందా అని!. ఎందుకో నాకు శుద్ధ సందేహంగా ఉందిరా” అడిగాడు గిరి .
“సుద్దా లేదు చాక్ పీసు లేదు. నువ్వసలు సందేహ పడొద్దు. ఇదివరకు నేను ట్రాప్ చేసిన స్రవంతి గురించి కూడా ఇలానే కంగారు పడ్డావ్. కానీ వచ్చింది, బంగారం తెచ్చింది.దాంతో ఆమెకి మాయ మాటలు చెప్పి, ఆ బంగారం కాజేసి మొహం చాటేసాను.తర్వాత ఆ డబ్బులతో మనందరం గోవా పోయి ఎంజాయ్ చేసి వచ్చాం. కనుక నన్ను నమ్ము. ఈ లలిత కూడా మన వల్లో పడ్డ చేప. వస్తుందీ, బంగారం తెస్తుంది . మళ్ళీ మనం గోవాకి పోయి ఎంచక్కా జల్సా చేయవచ్చు. కాకపోతే కొంత ఆలస్యంగా రావచ్చు”చెప్పాడు.
“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నవూ అని!” అడిగాడు గిరి.
“ఎలా అంటే ఏవుంది!, నిన్న మా ఇంట్లో బంగారం ఉంది కానీ మా అమ్మ అడిగితే ఇవ్వదూ.అందుకే నువ్ నా కోసం మీ ఇంట్లోంచి బంగారం పట్టుకురా, ఆ బంగారం అమ్మగా వచ్చిన మనీతో మనిద్దరం ఎక్కడికైనా పోయి హాయిగా బతుకుదాం అని నమ్మ బలికాను”.
“మరి ఆ మాటలకి ఆమె ఏమంది” అడిగాడు గిరి
“ఏమంటుందీ నీ బొంద .నా మాటలకి ఆమె కరిగి పోయింది. తరువాత నా బుజంపై వాలిపోయింది.ఆ తర్వాత కొద్దిసేపటికి , సరే ఇక వెళతానూ, వస్తే బంగారంతోనే వస్తానూ అని చెప్పి వెళ్ళిపోయింది” చెప్పాడు మధు ఉత్సాహంగా
“నువ్ మొత్తానికి ఉండాల్సిన వాడివిరా మధు .అమ్మాయిలు ఏం చెబితే నీ బుట్టలో పడతారో నీకు బాగా తెలుసు” చెప్పాడు గిరి మధు బుజం తడుతూ
ఇంతలో దూరంగా లలిత నడిచి వస్తుండడం కనిపించింది. ఆమెని చూస్తూనే హుషారుగా నవ్వుతూ “ఒరేయ్ గిరి, చూశావా? ఇందాకటి నుండీ చెవిలో జోరీగలా పోరుపెట్టి ఏవేవో కూసావ్. ఇప్పుడు చూడు ,నాకోసం ఆ లలిత కుక్కపిల్లలా ఎలా వస్తోందో .అదేరా ఈ మధూ” అన్నాడు గర్వంగా కాలర్ ఎగరేస్తూ
ఇంతలో లలిత కంగారుగా మధు దగ్గరకు వచ్చి “పద మధూ వెళ్ళిపోదాం. నిన్ను నమ్మి, నీ కోసం, నీ ప్రేమ కోసం ఇలా వచ్చేసాను. ఎక్కడికైనా దూ...రంగా వెళ్ళి హాయిగా బతుకుదాం” చెప్పిందామె
ఆమె చెప్తున్నవేవీ అతని తలకెక్కడం లేదు. అతని దృష్టంతా ఆమె తెచ్చుకున్న బ్యాగ్ మీదే ఉంది. అందులో బంగారం ఉందా లేదా అని లోలోనే ఉండ చుట్టుకుపోయి గుండా పిండైపోతున్నాడు .ఇక ఓపిక పట్టలేక, ఆ బ్యాగ్ వైపు ఆశగా చూస్తూ “అది సరే కానీ, అదే నేను తెమ్మన్నది తెచ్చావా”.
“నువ్వు చెప్పడం నేను తేకపోవడమా మధూ, తెచ్చాను.కాక పోతే ఎవరో స్రవంతి అనే అమ్మాయి ఫోన్ చేసి ఏదేదో చెప్పింది, నేను నమ్మలేదులే.అందుకే ఈ ఆలస్యం.ఇదిగో ఇంట్లో బంగారం మొత్తం తెచ్చాను .ఒక్క అమ్మదే కాదు చెల్లిది కూడా తీసుకుని వచ్చాను” చెప్పిందామె బ్యాగ్ చూపుతూ
ఆమె మాటలకి మధు విజయగర్వంతో చిన్న నవ్వుతో “చూశావా” అన్నట్టు సైగ చేశాడు గిరికి .
“కానీ ఓ షరతు మధూ ,ఈ బంగారం నువ్వు మళ్ళీ ఉద్యోగం అదీ చేసి డబ్బు సంపాదించాక ,ఈ బంగారం అమ్మకీ చెల్లికీ తిరిగి ఇచ్చేయాలి మరి” చెప్పిందామె.
“పిచ్చిదానా . నీలాంటి అమాయకులు ఉన్నారు కనుకే, నాలాంటి మాయకులు హాయిగా బతికేస్తున్నారు .అయినా ఒక్క సారి నా చేతికి బంగారం వస్తే మళ్ళీ అది నీ చేతికి రావడమా” అని మనసులో అనుకుని “ఏదీ నువ్ తెచ్చిన బంగారం? ఓ సారి చూపించు” అడిగాడు ఆసక్తిగా .
“ఇదిగో తీసుకో. నువ్వే చూసుకో” అంటూ లలిత బ్యాగ్ ఇవ్వగానే ,ఆతృతగా తెరిచి చూసి “శబాష్” అన్నాడు. తర్వాత కొద్ది క్షణాలకి , ఏదో ఆలోచన వచ్చినట్టు, “అవునూ.. నీకు చెల్లి లేదు కదా, మరి చెల్లి బంగారం కూడా తీసుకు వచ్చానన్నావ్! అదెలాగా” అడిగాడు దేబ్యపు మొహంతో.
“అవును, నాకు చెల్లి లేదు కానీ, నీకు ఉందిగా” చెప్పిందామె నవ్వుతూ
“అంటే ఈ బంగారం... ఇది...?” అంటూ నీళ్ళు నమిలాడు.
“అవును. ఇది మీ ఇంట్లోంచి తెచ్చిన బంగారమే. మీ అమ్మగారిని కలిసి విషయం చెప్పాను. నేను ఈ బంగారం తీసుకురాకపోతే నువ్వు రైలు కింద పడి చచ్చిపోతావని చెబితే హడలిపోయింది. తర్వాత మౌనంగా లోనికి వెళ్ళిపోయింది. బీరువాలో ఉన్న ఈ నగలు మొత్తం ఇచ్చింది . మీ చెల్లి కూడా పాపం తన వంతుగా ఉంచమని ఒంటిమీది బంగారం తీసి ఇచ్చేసింది మరి” చెప్పడంతో మధుకి కళ్ళు తిరిగినంత పనైంది. తేరుకుని చూశాడు. దూరంగా స్రవంతి, పోలీసులతో రావడం చూసి “చచ్చానురో దేవుడో” అని పారిపోదామని వెనక్కి తిరిగాడు. అక్కడ కూడా పోలీసులు ఉండటంతో మధు, గిరిల గుండాగినంత పనైంది.
“ఆమె నిన్ను బురిడీని చేసింది. లలిత పన్నిన వలలో మనం చేపల్లా చిక్కాం” అన్నాడు గిరి గజ గజా వణికి పోతూ.
***శుభం***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
Comments