top of page

చెవిటిమేళం

#SudhavishwamAkondi, #Chevitimelam, #చెవిటిమేళం, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు


Chevitimelam - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 14/04/2025 

చెవిటిమేళంతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంలేదు. సరిగ్గా వినపడని తమ లోపాన్ని ఎవరికి వాళ్ళు అవతలి వారికి చెప్పకుండా దాచి, మాట్లాడితే అందులో ఏర్పడే హాస్యమే ఈ కథ. 


పూర్వం రామాపురం రామయ్య సీతాపురం సీతయ్యతో ఏదో పనిబడి చీకటితోటే కాలినడకన బయలుదేరాడు. అతను లక్ష్మణాపురం చేరేసరికి మిట్టమధ్యాహ్నం అయ్యింది. సీతాపురం వరకూ వెళ్లగలగాలంటే కడుపులో ఏదైనా ఆహారం పడాలి. అప్పట్లో హోటల్స్ ఏవీ ఉండేవి కాదు కదా. అందుకని ఆ ఊళ్ళోకి వెళ్లి ఎదురుగా కనబడిన ఇంటివైపు వెళ్ళాడు ఆకలి, అలసట తీర్చుకుని ప్రయాణం కొనసాగిద్దామని. అటు తరువాత ఏమి జరిగిందంటే.. 


రామయ్య ఆ ఇంటి గుమ్మం వద్దకెళ్లి ఎదురుగా కనిపించిన యువకునితో.. 

"బాబూ! రామాపురం వెళ్తూ మండుటెండలో వచ్చాను. మీ ఇంట్లో ఈ పూటకు భోజనం పెడతారేమో కనుక్కో! నీకు పుణ్యం ఉంటుంది" అని తన పై పంచెతో విసురుకుంటూ ఆ ఇంటి అరుగు పైన కూర్చున్నాడు. 


 వెంటనే ఆ యువకుడు లోపలికి విసవిసా వెళ్లి, తన చెల్లెలితో.. 


"ఎవడే వాడు? ఏ ఊరి వాడు? వాడిని పెళ్లాడతానన్నావట. వాడోచ్చి వీధి అరుగు మీద తిష్ట వేసాడు. ఈ సంగతి పదిమందికి తెలిస్తే ఎంత అప్రతిష్ట" అన్నాడు కోపంగా


ఆ మాటలు మరోలా అర్ధం చేసుకున్న ఆ చెల్లెలు విసవిసా నడుస్తూ వెళ్లి, పెరట్లో చుట్ట కాల్చుకుంటున్న తండ్రితో.. 


"నాన్నా ఇదెక్కడి ఘోరం? ఇదేమి న్యాయం? ఆస్తిలో నాకు వాటా రాదంటున్నాడు అన్నయ్య. ఆ మధ్య జమీందారు గారు తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కూడా హక్కు ఉందని చేసిన శాసనం ఈ చెవిటి వెధవకు తెలిసినట్టు లేదు. నాకు వాటా లేదంటూ వాదుకు వస్తే జమీందారుకు చెప్పి, వీడిని రోహిణికార్తె లో రచ్చబండ దగ్గర నిలువునా కొరత వేయిస్తాను హా.. " అని అనగానే.. 


ఆమె తండ్రి సగం తాగిన చుట్ట గిరాటు వేసి, అక్కడే బావిలోనుంచి నీళ్ళు తోడుతున్న భార్య వీపు చరచి.. "ఏమే మొద్దుమొహమా! అమ్మాయితో వంటచేయకుండా నన్ను పస్తు వుంచుతానని అనడానికి నీకెంత పొగరు? అయినా నిన్నని ఏం లాభం! అసలు మీ వంశంలో ఆడవాళ్లకు అన్నం వండడం కూడా రాదని మా బామ్మ పెళ్ళిచూపుల్లో మొత్తుకుని చెప్పింది. అయినా ఆమె మాట వినకుండా నిన్ను కట్టుకున్నాను నాది బుద్ధి తక్కువ" అన్నాడు


అది విన్న అతని భార్య సగం తోడిన నీళ్ల చేదను బావిలోనే వదిలేసి, పత్తితో వత్తులు చేసుకుంటున్న అత్తగారితో ఇలా అంది.. 


"ఏమత్తయ్యా! నీకిదేం బుద్ధి? యాభై ఏళ్ళు దాటి రేపో మాపో అరవయ్యోవడిలో పడబోయే నీ కొడుక్కి రెండోపెళ్లి చేసుకోమని బుర్రకెక్కిస్తావా? నీ కొడుకేమన్నా నవ యువకుడా? ముచ్ఛుపాలెం మునసబుదారా? నేనేం నోరూ వాయా లేనిదాన్ననుకున్నావా? చూడు! నేనీవూరు పెద్దలనే కాదు ఏటవతలున్న ఏడు గ్రామాల పెద్దల్ని కూడా రప్పించి, మీ ఇద్దర్నీ చింతబరికెలతో ఒళ్ళుహూనం చేయుస్తాను ఏమనుకుంటున్నారో? హా.. " అంది. 


అది విన్న ముసలావిడ చేస్తున్న వత్తులు గాలికి వదిలేసి.. 

"ఆహా! ఇంతకాలానికి చెరువుగట్టు సోమిదేవమ్మ కూతుర్ననిపించావు గదే! 

అసలు నువ్వెవత్తెవే ఈ ఇంట్లోనుంచి నన్ను పొమ్మనడానికి? ఇది మా ఆయన ఇల్లు. ఇప్పుడు నా కొడుకు ఇల్లు. రేపు నా మనవడి ఇల్లు. మా మామగారికీ ముత్తాత ఆది సూరన్న గారు కట్టిన ఈ ఇంట్లో నా ప్రాణాలు గుటుక్కుమనేదాకా ఈ ఇల్లు వదిలేది లేదు ఆ! " అని కొంగు నడుముకు బిగించి ఆయాసపడ్తూ ఊగిపోసాగింది. 


చివరికి అందరూ కలిసి విషయమేంటి అని అరుగుమీద ఉన్నవాడినే కనుక్కుందాం, తర్వాత గ్రామ పెద్ద వద్ద తేల్చుకుందాం ఆయనే న్యాయం చెబుతాడు అనుకున్నారు. 


అందరూ కలసి బయటకు వస్తుంటే అది చూసిన రామయ్య.. 


"ఆహా! ఎంత మర్యాద! అతిథిని భోజనానికి పిలువడానికి ఇంతమంది రావాలా! మీ గ్రామం అతిథి మర్యాదకు పెట్టింది పేరన్నది లోక ప్రసిద్ధి కదా! " అనగానే కోపంతో ఉన్న ఆ ఇంటిపెద్ద ఆ మాటలు వేరేలా అర్ధం చేసుకుని.. 


"మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోడానికి నువ్వెవరివయ్యా? అంతా అయినవాళ్ళం కనుక తిట్టుకుంటాం, ఆ తర్వాత కల్సుకుంటాం. పిలువని పేరంటంగా వచ్చి, మాకు బుద్ధులు చెప్పడానికి నువ్వేమన్నా ఆ మధ్య కాశీకి పారిపోయిన బుద్ధిరాజు భూషయ్యవా ?" అంటూ గట్టిగా చిటిక వేశాడు. 


అది విన్న రామయ్య బెంబేలుపడిపోతూ.. "అయ్యబాబోయ్! అంత డబ్బే! నిజంగా అంత డబ్బు నా దగ్గరుంటే నాకు ఆకలి వేయదు. ఈ విషయం ముందే తెలిస్తే, అసలు మీ ఇంటి అరుగు మీద కూర్చునే వాణ్ణి కానేకాదు" అంటూ గబగబా అరుగుమీద నుంచి కిందకు గెంతి వీధి వెంట పరుగోపరుగు.. 


కొసమెరుపు: 


ఇంతకీ సంగతేమంటే పాపం ఈ రామాపురం రామయ్యకు బ్రహ్మచెముడు.. 


హాయిగా నవ్వుకోండి


 # సమాప్తం #


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page