చెవిటి మొగుడు - చాదస్తపు పెళ్ళాం
- Pavana Datta Sai Kulakarni

- 2 hours ago
- 4 min read

Cheviti Mogudu - Chadasthapu Pellam - Telugu Humorous Story | Kulakarni Pavana Dattasai
చెవిటి మొగుడు - చాదస్తపు పెళ్ళాం - తెలుగు హాస్య కథ | కులకర్ణి పవన దత్తసాయి
Published in manatelugukathalu.com on 27/08/2026
“చెవిటి మొగుడు - చాదస్తపు పెళ్ళాం” కులకర్ణి పవన దత్తసాయి రచించిన చక్కని తెలుగు సామాజిక హాస్యకథ. గంగాధర శాస్త్రి, సరోజినీ దేవి అనే వృద్ధ దంపతుల దైనందిన జీవితంలోని సరదా సంఘటనల ద్వారా రచయిత మనల్ని నవ్విస్తూనే కొన్ని ముఖ్యమైన సామాజిక ప్రశ్నలను మన ముందుంచారు.
ఆచారాలు మనుషుల కోసం ఉండాలా? లేక మనుషులు ఆచారాల కోసం ఉండాలా? అనే ప్రశ్నకు గంగాధర శాస్త్రి చెప్పే మాటలు ఈ కథకు అసలైన బలం.
ఏజీ ఆఫీసు అకౌంట్స్ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ గా పని చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యారు గంగాధర శాస్త్రి గారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కాలానుగుణంగా వచ్చే మార్పులను ఆహ్వానిస్తూ మూలాలను మరవని ఆధునిక సంప్రదాయవాది. శాస్త్రి గారి భార్య సరోజినీ దేవి గారు. మనుషులకోసం ఆచారాలు పుట్టాయని కాకుండా ఆచారాలను పాటించడం కోసమే మనుషులు పుట్టారని నమ్మే మహిళ. వారి ఇద్దరు కొడుకులూ పెళ్ళిళ్ళు అయ్యాక అమెరికాలో స్థిరపడ్డారు.
దేవి గారి కాలక్షేపమల్లా పక్క వీధిలో ఉండే తన స్నేహితురాలు కామాక్షి గారితో ముచ్చట్లు. ఇద్దరు కలిసి ఈ కాలం యువత మీద ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ల వేష భాషలు, వ్యవహారాల మీద రోజుకొక భాష్యం రాస్తారు.
ఉద్యోగ విరమణ తర్వాత శాస్త్రి గారి జీవితంలో చాలా మార్పులొచ్చాయి గానీ సరోజినీ దేవి గారికి లంచ్ బాక్స్ తయారు చేసే పని తప్పడం తప్ప ఏ మార్పూ లేదు. వయసు రీత్యా శాస్త్రి గారికి చెవుడు, దేవి గారికి చాదస్తం పెరిగాయి. రిటైర్ అయిన మొగుడికి చెవుడికి మించిన వరం లేదని శాస్త్రి గారు తొందరలోనే గ్రహించారు. పొద్దున లేచి పరిగెత్తే హడావుడి లేనందున నిత్యపూజ నిదానంగా తీరికగా తృప్తిగా చేయడం ఆరంభించారు శాస్త్రి గారు.
ఒక రోజు పూజకి ఉపక్రమించే ముందు శాస్త్రి గారు భార్యతో చెప్పారు, "ఒక అమెజాన్ పార్శిల్ డెలివరీ ఉంది, డబ్బులు ముందే కట్టేసాను, వస్తే తీసుకోవడమే" అని. శాస్త్రి గారు పూజలోనూ, దేవి గారు వంటలోనూ మునిగిపోగా 'అమెజాన్ డెలివరీ' అని కాలింగ్ బెల్ కొట్టాడు డెలివరీ బాయ్. తీసుకోవడానికి బయటకి వెళ్ళిన దేవి గారు కాసేపైనా రాక కోపంతో లోపలికొచ్చి శాస్త్రి గారితో అంటున్నారు, "ఏమండీ, మీరు డబ్బులు ఇది వరకే కట్టేశామన్నారు గా, అయిన వాడు ఇంకేదో అడుగుతున్నాడు అదేదో మీరే చూడండి" అని. బయటకెళ్ళి కనుక్కుంటే తెలిసింది వాడు అడిగినది ఓటీపీ (OTP) అని. "ఏమనుకోకు నాయన, మా ఆవిడకి ఓటీపీ గురించి చెప్పకపోవడం నా పొరపాటే" అని ఓటీపీ చెప్పి పార్శిల్ తీసుకున్నారు శాస్త్రి గారు.
ఇంతలో ఒకరోజు వారి పెళ్లి రోజు వచ్చింది. రిటైర్ అయిన తర్వాత వచ్చిన మొదటి పెళ్లి రోజు. గుడికి వెళ్దాం అనుకున్నారు. కార్ ఉన్నా కూడా, తన పెళ్ళిలో మామ గారు "కానుక (కట్నం)"గా ఇచ్చిన బజాజ్ చేతక్ (Bajaj Chetak) స్కూటర్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న శాస్త్రి గారు దాని మీద గుడికెళ్దామని అన్నారు. స్కూటర్ స్టార్ట్ చేసి గేటు దగ్గర ఉన్న దేవి గారి కోసం ఆపి గుడికి బయలుదేరారు.
"అదేంటోనే సరూ (శాస్త్రి గారు సరసంగా సరూ అని పిలుస్తారులే, మనకెందుకు), పెళ్ళయి ఇన్నేళ్ళయినా ఈ స్కూటర్ మీద నువు కూర్చున్న బరువు అసలు తెలియట్లేదు. ఇన్నాళ్లుగా ఒకరి బరువు బాధ్యతలు ఒకరు మోసి ఒకరికి ఒకరు తేలిక అయినట్టున్నామ్ కాబోలమ్మా, ఏమంటావ్?"
ఎంతకీ సమాధానం రావట్లేదని బండి ఆపి వెనక్కి చూస్తే వెనక సీటు ఖాళీ. అపుడు అర్థమయింది తను ఎక్కే వరకు ఆగలేదని, తను అరిచినా వినపడలేదని. యూ టర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళి కోపంగా చూస్తున్న భార్య కళ్లలోకి చూడలేక స్కూటర్ టర్న్ చేసుకొని నిల్చున్నారు శాస్త్రి గారు. ఈసారి వెనక కూర్చున్నానని నోటితో చెవిలో కాకుండా చేత్తో వీపు మీద చెప్పారు దేవి గారు. దేవుడా అనుకుంటూ దేవుడి గుడి వైపు స్కూటర్ నడిపారు శాస్త్రి గారు.
గుడిలో అర్చన చేయించి ప్రసాదం తీసుకున్నారో లేదో దేవి గారు కనపడడం లేదు. అంతా వెతికి తీరా పార్కింగ్ దగ్గరికొస్తే సెంటర్ స్టాండ్ వేసి ఉన్న స్కూటర్ వెనక సీటు మీద కూర్చొని ప్రసాదం తింటూ కనిపించారు దేవి గారు. 'దిగితే స్టార్ట్ చేస్తా' అని, 'లేదు ఇలాగే స్టార్ట్ చెయ్యి' అనే సంభాషణ వారి కళ్ల మధ్య జరిగింది. ఇందాకటి కోపం ఇంకా పోలేదని అర్థమయి చేసేదేం లేక అలాగే కిక్ కొట్టి బండి స్టార్ట్ చేసినారు శాస్త్రి గారు.
పని వాళ్ళని ఇంట్లోకి రానివ్వదు సరోజినమ్మ. వయసు మీద పడుతున్నా ఇంటిలోపల తానే రోజూ ఊడుస్తూ తూడుస్తూ ఉంటుంది. అమ్మ కష్టం చూడలేక క్లీనింగ్ రోబోట్ (Cleaning Robot) ని పంపించాడు అమెరికాలోని చిన్న కొడుకు. దాన్ని వాడడం ఇష్టం లేకపోయినా కొడుకు పంపినాడు కాబట్టి అంగీకరించింది. కొన్ని రోజులకి అలవాటు కూడా చేసుకుంది. ఇలా సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా ఒక కుదుపు.
సరోజినీ దేవి గారి స్నేహితురాలు కామాక్షి గారి భర్త సర్వేశ్వర శర్మ అనారోగ్యంతో చనిపోయారు. రోజూ తన స్నేహితురాలితో మాట్లాడకుండా ఉండలేని సరోజినమ్మ ఇపుడు తన ముఖం చూడడానికి కూడా ఇబ్బంది పడుతుంది. బయటకెళ్తే వాళ్ళింటి ముందు నుండి కాకుండా వేరే వీధిలోంచి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇంట్లో కూడా ఎపుడూ ముభావంగా ఉంటోంది. భార్యలోని మార్పులను నిశితంగా గమనిస్తున్నారు శాస్త్రి గారు.
ఒక రోజు భార్యని పిలిచి ఇలా అన్నారు:
"సరూ! ఏమయిందని ఇపుడు? భర్త చనిపోవడం కామాక్షి చేసిన తప్పా? ఆవిడేం చంపలేదుగా ఆయన్ని. పైగా అంత్య కాలంలో ఆయనకి ఎంతో సేవ చేసింది. అలాంటి పుణ్యాత్మురాలితో విధవ అన్న పేరుతో నువు ఇలా అమానుషంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు? విధవ ముఖం చూసినంత మాత్రాన అశుభం జరుగుతుందా, ఎంత అజ్ఞానం! మాంగల్యం మంగళసూత్రంతో తప్ప ఆడవారికి వేరే గుర్తింపే లేదా?
ఈ సమయంలో ఆవిడకి నీ నుండి కావలసింది కొంత ఓదార్పు; అది నువు ఇవ్వకపోగా ఇలా ప్రవర్తించడం దారుణం. నీతో ఎపుడూ చెప్పాలనుకొని చెప్పలేని కొన్ని వాస్తవాలున్నాయ్. మన పిల్లాలిద్దరూ మనతో ఎందుకు ఉండలేకపోతున్నారు? వాళ్ళకి ఉద్యోగాలు ఇక్కడ దొరకలేకనా లేదా మన మీద ప్రేమ లేకనా? రెండూ కాదు. ఉద్యోగం చేసే ఆడవాళ్ల పట్ల నీ నిర్దిష్ట అభిప్రాయాలు, ఆచారాల పేరుతో నువు పెట్టే చాదస్తపు పోకడలకి భయపడి వాళ్లు దూరంగా ఉన్నారు, అంతే కానీ మనమంటే ప్రేమ లేక కాదు; మనల్ని మార్చలేక.
భగవంతుని సృష్టి అయిన మనిషిని నీవు అంగీకరించవు, కానీ మనిషి సృష్టి అయిన రోబోట్ ని ఇంట్లోకి రానిస్తావు, ఇదెక్కడి అమాయకత్వం? మనిషికి చిత్తశుద్ధిని కలిగించడానికి మనం ఏర్పాటు చేసుకున్నవే ఈ ఆచారాలు, కానీ వాటి పేరుతో మనుషుల మధ్య దూరం పెంచడానికి కాదు. పూజ గదిలో దేవుణ్ణి చూడగలిగిన నువు, నువ్వు ద్వేషించే వాడిలోని భగవంతుడిని ఎపుడు గుర్తిస్తావు? కాలానుగుణంగా వచ్చే మార్పులని కొంత వరకైనా అంగీకరించే ప్రయత్నం చేయు. అశాంతితో ఉన్నవాడికి సుఖం లేదు. ఎదుటివారిని తక్కువ చేసేవారికెపుడూ శాంతి ఉండదు. మార్పులని నీ కొడుకు పంపిన రోబోట్ అనుకో. మొదట్లో కష్టంగా అనిపించినా అవిచ్చే సౌకర్యాల దృష్ట్యా అలవాటైపోతాయి."
శాస్త్రి గారు చెప్తున్నవన్ని సహేతుకంగా అనిపించినా మనసొప్పక గంభీరంగా అలా చూస్తూ ఉండిపోయారు సరోజినీ దేవి గారు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
కులకర్ణి పవన దత్తసాయి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: కులకర్ణి పవన దత్తసాయి
నమస్కారం.. నేను కులకర్ణి పవన దత్తసాయి.
వృత్తి రీత్యా AG office Hyderabad లో auditor గా పని చేస్తున్నాను. ప్రవృత్తి రీత్యా సాహితీ ప్రియుడిని.






Comments