top of page

చూపులు కలసిన శుభవేళ

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #చూపులుకలసినశుభవేళ, #ChupuluKalasinaSubhavela, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


ree

Chupulu Kalasina Subhavela - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 30/08/2025

చూపులు కలసిన శుభవేళ - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

సాఫ్ట్వేర్ ఇంజనీరైన అర్జున్ ఉదయాన్నే లేచి రోజూలాగానే వాకింగ్‌కు వెళ్తున్నాడు. అప్రయత్నంగా అతని చూపు ఎదురుగా ఉన్న మేడ మీద పడింది. అక్కడ ఒక యువతి తెల్లటి చీరలో తడిగా ఉన్న తన శిరోజాలను టవల్ తో తుడుచుకునే దృశ్యాన్ని చూసి అతని కళ్ళు ఆగిపోయాయి. 


“ ఇంత అందంగా ఉందే ఈ అమ్మాయి.. రంభా ఊర్వశిని తలదన్నే రమణీలలామ ఎవరీమె?" అని తన మనసులో అనుకున్నాడు అర్జున్. 


అప్పటి నుండి ప్రతి రోజు అదే సమయంలో అతను వాకింగ్‌కు వెళ్తున్నాడు.. కాకపోతే వాకింగ్ కన్నా ఎక్కువగా ఆ మేడ వైపు చూస్తూండటం అతనికి పరిపాటిగా మారింది. 


అటు సాహితి కూడా ఒక రోజు తన చేతిలో పుస్తకం పట్టుకుని బాల్కనీలో కూర్చుని ఉండగా, అర్జున్ వైపు చూచి చిరునవ్వు నవ్వింది. ఆ సమయంలో అర్జున్ హృదయం మన్మథ బాణం తగిలినట్లు ఫీలయింది. ఇరువురి చూపులు కలిసినాయి. 


ఇలా ప్రతిరోజూ ఇరువురు తమ చూపులతోనే పలకరింపులు పరిపాటిగా మారింది. ఒకరోజున అర్జున్ కి ఎదురింటి వాళ్ల నుండి అరుపులు వినపడగా గాభరాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఇంట్లో ఒకమ్మాయి స్పృహ తప్పి పడిపోతే ఆమె తల్లి పెద్దగా అరిచిన అరుపులవి. వెంటనే ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు అర్జున్. 


“బాబూ! సమయానికి వచ్చి మా నీలిమని రక్షించావు. ఇంత మంచి మనసున్న నిన్ను కన్న నీ తల్లి ఎంత సద్గుణవతి! నీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. " అంది కృతజ్ఞతతో నీలిమ తల్లి యశోద. 


“అయ్యో! ఇందులో ఏముందండి!” మర్యాదపూర్వకంగా అన్నాడు అర్జున్. 


ఆవిడ ప్రక్కనే ఉన్న యువతిని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. ఆమె ఎవరోకాదు. ప్రతిరోజూ తను చూసే ఎదురింటి యువతి. కానీ ఆ నవ్వులో ప్రేమ తొలి అడుగులు కనిపించింది సాహితికి. 


“ఈమె మా పెద్దమ్మాయి సాహితి. డిగ్రీ చదువుతోంది. నీ పేరేంటి? ఎదురుబొదురుగా ఇళ్లున్నా, రోజూ నిన్ను చూస్తున్నా నీ పేరేంటో తెలీదు. ఎవరి హడావుడి వాళ్లదాయే!” అంది యశోద. 


“నా పేరు అర్జున్. బాంక్ లో ఉద్యోగం చేస్తున్నానండి ” అన్నాడు అర్జున్. 


“హాయ్!” అని పలకరించింది సాహితి. 


“హాయ్!” అని అక్కడినుంచి వాళ్ల వద్ద శెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లాడు అర్జున్. 


కొన్ని రోజులుగా కొడుకు వాలకం గమనిస్తూ ‘విషయమేంటో వాడే చెబుతాడులే!’ అని అనుకుంటున్న వసుంధర ఇంక అసలు విషయమేంటో తెలుసుకుందామని ఒకరోజున అర్జున్ వద్దకు వెళ్లి అతని వంక అనుమానంగా చూస్తూ “రోజూ నీ ప్రవర్తనని ఎమనిస్తూనే ఉన్నా. ఇప్పుడన్నా ఏమైనా చెప్తావా? ప్రతి రోజూ మేడవైపు ఆ అమ్మాయి వంక చూస్తూ చిరు నవ్వులు చిందిస్తున్నావ్. దేనికి?” అంది. 


అకస్మాత్తుగా తల్లి అడిగిన ప్రశ్నకు అర్జున్ తడబడ్డాడు. కానీ సాహితి అభిప్రాయం తెలుసుకోకుండా తల్లితో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం అతనికి ఇంకా రావడం లేదు. 

రోజులు గడుస్తున్నాయి. 


అర్జున్, సాహితిల మధ్య చిన్న చిన్న మాటలు మొదలై అది అభిమానంగా మారి క్రమేణా “హాయ్” లు, “బుక్స్ ఇచ్చి పుచ్చుకోవడం, షాపింగ్ చేయడం ” మొ.. వన్నీ జరుగుతూ మెల్లగా ఒక అనుబంధం వైపు నడిపిస్తున్నాయి. 


సాహితి కాలేజి నుంచి, అర్జున్ బాంక్ నుంచి రాగానే ఇద్దరూ ఎక్కడోఅక్కడ సరదా కబుర్లతో గడపడం పరిపాటైంది. 

కూతురి ప్రవర్తనను గమనించిన యశోద ఆమెని నిలదీసింది. 


“ఎదురింటి అబ్బాయితో ఏం వ్యవహారం నడుస్తోంది? బుద్ధిగా చదువుకో.” అంది.

 

ప్రేమ అనేది తప్పు కాదు. నా జీవితాన్ని నిర్ణయించుకునే బాధ్యతను నేను తేలికగా తీసుకోను. అర్జున్ మంచి వ్యక్తి. " మనసులో అనుకుంది సాహితి. 


సాహితి తమ ప్రేమ విషయం తల్లితో చెప్పగా ఆవిడ నివ్వెరపోయింది. 


“చూడు సాహితీ! మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాక చిన్న పిల్లలైన మిమ్మల్ని ఒక ప్రైవేటు జాబ్ చేస్తూ కష్టపడి పెంచి చదివిస్తున్నాను. మగదిక్కు లేని ఈ ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్నాను. నీవు బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ నీ చెల్లిని పైకి తీసుకొస్తావని ఆశ పెట్టుకున్నాను. ఈ ప్రేమా, దోమా మనకొద్దమ్మా!” అంది యశోద. 


“ప్రేమ అనేది తప్పు కాదు. నా జీవితాన్ని నిర్ణయించుకునే బాధ్యతను నేను తేలికగా తీసుకోను. అర్జున్ చాలా మంచివాడమ్మా! మా మనసులు కలిశాయి. అతను వాళ్ల కుటుంబం గురించి చెప్పాడు. తల్లి తండ్రులకు అతనొక్కడే కొడుకు. సమయం చూసుకుని ఆవిడకి మా విషయం చెప్తానన్నాడు. మీ అందరి ఆశీస్సులతో మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ” అంది సాహితి. 


“మన ఇంట్లో ప్రేమపెళ్లిళ్లు జరుగవు. మంచి సంబంధం చూస్తాను. చేసుకో. ” అంది యశోద. 

ఒక సాయంత్రం వేళ చిరు జల్లుల వానలో రెండు గొడుగులు – ఒకటి సాహితి చేతిలో, మరొకటి అర్జున్ చేతిలో. 

“నీకిష్టమైనదేంటో చెప్పు?. ” అన్నాడు అర్జున్. 


సాహితి సమాధానంగా చిరునవ్వు నవ్వింది. 

అర్జున్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి మరలా అదే ప్రశ్న అడిగాడు. 


“పోనీ! దీనికి సమాధానం చెప్పు. నీ మనసులో నేను ఉన్నానా?” అన్నాడు అర్జున్. 


సాహితి నవ్వి సిగ్గుతో తల దించేసి “రోజూ నీ చూపులకై ఎదురుచూసే నాకళ్లని, అందులోని ప్రేమభావాన్ని పసిగట్టలేదా నీవు. ఇప్పటికే నా మనసుని నీకర్పించాను” అంది. 


 అర్జున్ హర్షాతిరేకంతో ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వెంటనే వదిలేస్తూ “నాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రేమ విషయం మన రెండు కుటుంబాలకు చెప్పేద్దాం” అన్నాడు. 


“మా అమ్మకి చెప్పాను. నీవే మీ ఇంట్లో చెప్పాలి” అంది సాహితి. 


కాసేపు ముద్దుముచ్చట్లతో కబుర్లు చెప్పుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. 

వసుంధరకు కొడుకు పెళ్లి గురించి చాలా ఊహలు కలుగుతున్నాయి. అర్జున్ వాలకం తెలుస్తున్నా త్వరలో తమ స్ధాయికి తగ్గ సంబంంధం చూడాలని భర్త రఘురామ్ తో చెప్పింది. ఆయన ‘సరే’ అని సంబంధాలు వెతకడం మొదలు పెట్టాడు. 


ఇంట్లో జరుగుతున్న వ్యవహారం తెలుస్తోంది అర్జున్ కి. తమ ప్రేమ విషయం వాళ్లకి చెప్పే సమయమిదే అనుకుని వాళ్లకి తన మనసులోని మాట చెప్పాడు. 


 అది విన్న రఘరామ్ కోపోద్రిక్తుడయి ససేమిరా కుదరదన్నాడు. 


“మన ఇంట్లో ప్రేమపెళ్లిళ్లు జరుగవు. నేను చూసిన సంబంధమే నీవు చేసుకోవాలి” అన్నాడు రఘురామ్. 

అర్జున్ అంతే పట్టుదలతో “ నా పెళ్లి సాహితితోనే జరుగుతుంది. మీరొప్పుకుంటే మీ పెద్దరికం నిలబడుతుంది. “అన్నాడు. 


“లేదంటే?” అన్నాడు రఘరామ్. 


“మేం రిజిస్టర్ మారేజ్ చేసుకుంటాం” అన్నాడు అర్జున్. 


వాళ్లిద్దరి మధ్యన వాదన ఇంకా పెరుగుతోందని గమనించిన వసుంధర వాళ్లిద్దరికీ సర్దిచెప్పింది. 


 "వసూ! పిల్లలు తమ మనసుకి నచ్చిన పెళ్లి చేసుకోవడం అన్నం తినడం అంత సులభం కాదే!" అన్నాడు రఘరామ్ భార్యతో. 


వసుంధర అర్జున్ తో సాహితి వివరాలను అడిగింది. ఆమెది తమ కులంకాదని తెలుసుకుని చాలా కోపంగా “నీకు బుద్దుందా? మన కులం, మన అంతస్తుకి తగ్గ పిల్ల నీకు దొరకలేదా? ఆ అమ్మాయిని చేసుకుంటే మన పరువేం కాను? సంఘంలో మేం తలెత్తుకు తిరగ్గలమా?” అంది. 


" అమ్మా! చిన్నతనం నుంచి నీవు నాకు మంచితనం- మానవత్వంని ఉగ్గుపాలతో రంగరించి పోశావు. ఇప్పుడు నా పెళ్లి విషయంలో ఇలా మాట్లాడతావని నేనూహించలేదు. 

సంతోషంగా బ్రతకడానికి కులం ముఖ్యం కాదమ్మా! ప్రేమించే మంచి మనసు కావాలి. ఆమె మంచితనమే నాకు నచ్చింది” అన్నాడు అర్జున్. 


వసుంధర నిశ్శబ్దంగా మౌనంగా ఉంది. ఆ తర్వాత అర్జున్ – సాహితిల ప్రేమకు అనుకోని అడ్డంకులు మొదలయ్యాయి. 

రఘురామ్ కొడుక్కి పెళ్లి సంబంధాలను చూస్తుంటాడు. ఈ వార్త తెలిసిన అర్జున్, సాహితిని కలవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తండ్రి గట్టిగా హెచ్చరిస్తాడు. 


అర్జున్, సాహితి లు ఒకరినొకరు చూసుకోలేని స్థితిలోకి వచ్చారు. ముందు నిశ్శబ్దంగా పెరిగిన ప్రేమ ఇప్పుడు అడ్డంకుల్లో చిక్కుకుంది. 


గుండెల్లో మౌనంగా తపనగా పోరాడుతున్న ప్రేమగా మారింది. 


ఆరు నెలల తర్వాత .. 

అర్జున్ తన ఆఫీసు పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతున్నాడు. కాని ప్రతి రోజు సాహితిని గుర్తు చేసుకుంటూ డైరీలో ఒక వాక్యం వ్రాస్తుంటాడు. 


“నీవు కనిపించని రోజులు, నాకు చీకటి జీవితాన్ని గుర్తుచేస్తున్నాయి. ” అంటూ..


ఇంకోవైపు.. 

సాహితి తన తల్లి చూసిన సంబంధానికి ఒప్పుకోక, ఇంట్లో తన మనశ్శాంతి కోసం ఒత్తిడిలో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చేరింది. 


‘విద్యతో, మంచి ఉద్యోగంతో జీవితాన్ని మార్చాలి, తన ప్రేమను నిజం చేయాలి’ అనేది ఆమె మనసులో ఆశ. 

ఒకరోజు యశోద వాళ్ల ప్రేమని అంగీకరిస్తూ సాహితితో “ నీవు జీవితంలో ఉన్నతంగా ఎదిగితే వాళ్లంతట వాళ్లే నిన్ను పిలిచి తమ కోడలిగా అంగీకరిస్తారు. అర్జున్ కూడా చాలా సంతోషిస్తాడు” అంది. 


కొన్నాళ్ల తర్వాత అర్జున్ కి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతాడు. తల్లి వసుంధర ఆశ్చర్యపోతూ అడుగుతుంది. 

అర్జున్ "ఇక్కడ ఉన్నంతవరకూ నా మనసు సాహితి జ్ఞాపకాలను వదలక బాధపడుతున్నాను. ” అన్న కొడుకు మాటలకు చాలా బాధపడుతుంది వసుంధర. 


వేరే చోటుకి మారినా అర్జున్ మనసు సాహితిని తలచుకోని క్షణం లేదు. 


రెండేళ్లు చాలా భారంగా గడిచాయి. ఇద్దరి మనసులలో ఉన్న బంధం మాత్రం మారదు. 


 డైరీలో అతను రాసిన పదాలు:

“నీవు లేని రోజులు.. నా ఎదలో నీవే ఉన్నావని చెప్పే నిశ్శబ్దాన్ని మరింత బలంగా చేస్తున్నాయి. ”


అర్జున్ కొత్త ప్రదేశంలో తన జీవితం మొదలు పెడుతున్నాడు. కాలం గడుస్తోంది. చూస్తూండగానే 2 సం.. గడిచాయి. 


సాహితి ఇప్పుడు చదువు పూర్తి చేసి ఓ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోంది. 


అర్జున్ తిరిగి తన ఊరికే బదిలీ అయి వచ్చాడు. తన మదిలో నన్నే అనుకునే ప్రేమను ఓసారి.. నిజం అయ్యేలా చూసుకోవాలనుకుంటాడు. 


ఒకరోజున అర్జున్ వసుంధర దగ్గరకి వచ్చి చెప్తాడు:

"అమ్మా.. ఈ మూడేళ్లలో నా మనసు మారిందేనేమో అనుకున్నా.. కానీ నా మనసు ఆమె దగ్గరే ఉంది. ఒకసారి.. ఒకసారి ఆ అమ్మాయిని కలవాలి. " అన్నాడు బరువైన హృదయంతో. 


వసుంధర కొంచెం నిశ్చలంగా ఉండి కాని ప్రేమగా చెప్తుంది:

"నీ బాధలోనే నిజాయితీ కనిపిస్తోంది నాయనా. నాకు ఇప్పుడు అర్థమైంది. గెలిచే ప్రేమ ఒక్కటే ఉంటుంది.. ఆ ప్రేమ పసిగట్టగలిగే తల్లే నిజమైన అమ్మ. "


అర్జున్ ఆశ్చర్యంతో ఆమె చేతిని పట్టుకుని:

"అమ్మా.. నువ్వే నా గెలుపు. "


"పెళ్లి జీవితానికి మనసే మౌలికం.. అతను నిజంగా మా ప్రేమ ధృఢమైనదని అనిపిస్తోంది ఇప్పుడు. " అనుకుంది సాహితి తన మనసులో. 


అర్జున్ – సాహితి ఒక పుస్తక ప్రదర్శనలో, ఏమీ అంచనా లేకుండా ఎదురెదురుగా కనిపిస్తారు. 


చూపులు కలుస్తాయి.. కానీ మాటలు ఉండవు. మనసు మూగదైంది. 

చాలా క్షణాల తర్వాత.. అర్జున్ చెప్తాడు:


"నిన్ను మరిచే రోజులు ఎన్నో వచ్చాయి సాహితీ.. కానీ ఒక్కరోజూ నేనెప్పుడూ నిన్ను మర్చిపోలేదు. "


సాహితి చిరునవ్వుతో:

"నువ్వు వెళ్ళిపోయిన రోజునే నిన్ను నా డైరీలో చివరి పేజీగా రాశాను. కానీ నిన్ను మళ్లీ చూడగలిగాను.. నీవే నా మొదటి పేజీ అయిపోతావా?" అంది. 


అర్జున్ కళ్ళలో నీళ్లు.. కానీ అతని పెదవులపైన చిరునవ్వు తొంగి చూస్తుంది. కొన్నాళ్ల తర్వాత పెద్దలు వాళ్ల ప్రేమని అంగీకరించారు. పెళ్లి ఏర్పాట్లు ప్రారంభం..


సాహితి తల్లి అర్జున్ ఇంటికి వెళ్లి అక్కడ వసుంధరతో "మన పిల్లలు మనల్ని మార్చారు. మనం వాళ్ల ప్రేమకు అడ్డుగా ఉండకూడదని తెలిసేలా చేసారు. " అంది. 


వసుంధర హర్షాతిరేకంతో:

"మీ మాటలు మన పిల్లల ప్రేమకు మరింత అర్థం తెచ్చాయి. ఈ పెళ్లి మన కుటుంబాల మధ్య ప్రేమ బంధంగా ఉండాలి. "


పెళ్లి రోజు.. 

వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వర్గసుందరంగా అలంకరించిన మంటపం..

సాహితి అందమైన పుచ్చకాయ రంగు కంచిపట్టు చీరలో..

అర్జున్ హుందాగా కట్టుకున్న. పట్టు పంచెకట్టులో..


ఆ ఇద్దరి మనసులలో తమ చుట్టూ ఇద్దరి మధ్య జరిగిన ప్రయాణం – పరిచయం, ప్రేమ, విరహం, పునఃకలయిక అన్నీ ఒక్క క్షణంలో జరిగిందా అని తలుచుకుంటూ చూస్తున్నారు. 


పెళ్లి మంత్రాలు మొదలవుతాయి..

మంగళసూత్రం కట్టే వేళ.. అర్జున్ మళ్లీ సాహితిని చూస్తూ:

"నీతో ఉండే ప్రతి క్షణం – ఇదే నా జీవితం. "


సాహితి నవ్వుతూ నిశ్శబ్దంగా తల ఊపుతుంది. 

తర్వాతి దశ..

వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత, ఇద్దరూ కలిసి హనీమూన్ కి బయలుదేరతారు. 

వెనుక విడిచిపోయిన బాధలు..ఇప్పుడు కొత్త ప్రయాణం..


అర్జున్ సాహితిని చెంతకు చేరి చెప్తాడు:

"నిన్ను ప్రేమించడం ఓ ప్రయాణం అయింది. నిన్ను పొందడం ఒక గెలుపు కాదు.. నీతో పంచుకునే ప్రతి రోజు నాకు విజయమే. " అన్నాడు ప్రేమగా సాహితిని దగ్గరకు తీసుకుని. 


 “నీ ప్రేమ నన్ను నమ్మకంగా మార్చింది. నీ కోసం ఎదిగాను, ఇప్పుడు నిన్ను స్నేహితుడిగా, జీవనభాగస్వామిగా పిలవగలగడం నా అదృష్టం. " అంది సాహితి అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతూ. 


“ఈ ప్రేమకథ ఓ కలల కదలిక కాదు. ఇది ఓ సత్యంగా నిలిచిన అనుబంధం. ఇందులో విరహం ఉంది, బాధ ఉంది, తల్లి ప్రేమ, తండ్రి మార్పు, ఇద్దరి ఎదుగుదల ఉంది” అన్నాడు అర్జున్. 


ప్రేమ నిజంగా గెలవాలి అంటే —అడిగేది హృదయం, ఇచ్చేది ధైర్యం, నిలుపుకోవాలంటే నమ్మకం కావాలి అనుకున్నారు సాహితి, అర్జున్ లు. 


.. సమాప్తం .. 


ree

-నీరజ హరి ప్రభల

Profile Link


Youtube Playlist Link









Comments


bottom of page