అసహజ గురువు
- Dr. D. V. G. Sankararao
- Aug 3
- 4 min read
#DVGSankararao, #డివిజిశంకరరావు, #StoryOnSocialProblems, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Asahaja Guruvu - New Telugu Story Written By Dr. D. V. G. Sankararao
Published In manatelugukathalu.com on 03/08/2025
అసహజ గురువు - తెలుగు కథ
రచన: డా. డి. వి. జి. శంకరరావు
ఒకే కారులో నాన్న గారి ఊరు వెళ్తూ నేను, తాత గారి ఇంటికి వెళ్తూ నా కూతురు ఇద్దరం ఆలోచనల్లోనే మౌనంగా ఉన్నాం. మెయిన్ రోడ్డు దిగి, గ్రామీణ ప్రాంతపు రాళ్ల దారికి వచ్చి చాలా సేపు అయ్యింది. ఇంకో అరగంట లో ఇల్లు చేరవచ్చు.
"నాకు తాతయ్య ని చూడాలన్న ఉద్వేగం కన్నా, ఆ పేషెంట్ ని చూడాలన్న ఉత్సుకతే ఎక్కువగా ఉంది నాన్నా" నోరు తెరిచింది, నా కూతురు డాక్టర్ గాయత్రి.
"నాకైతే నాన్న, అదే మీ తాతయ్య, తప్ప ఇంకేం గుర్తుకు రాదు."
పైకి ఇలా అన్నాను గానీ నాక్కూడా ఆ పేషెంట్ బాగోగులపై కొంత ఆసక్తి ఉంది.
***. ***. ****
మా నాన్న ఆయుర్వేద వైద్యులు. ఆ పల్లెటూరులో ఏ కష్టం వచ్చినా ఆయనే దిక్కు. ఆయనది చల్లని చేయి అని, ఔషదం ఇస్తే ఎలాంటి రోగమైనా తగ్గిపోతుందని అనుకునే వారు. ఒక వేళ తగ్గకపోయినా, ప్రాణం దక్కకపోయినా 'అది విధి లిఖితం, మనమేమైనా దేవుళ్ళమా ' అని రోగి బంధువులు అనేవారు తప్పించి, ఆయన పట్ల భక్తి ప్రకటన తగ్గించేవారు కాదు.
చిన్నప్పటి నుండి అంతా ఆశ్చర్యంగా, ఆరాధనగా చూస్తూ పెరిగాను కానీ నాకు నేను వైద్యుడిని అవుదామని అనుకోలేదు. ఆయనకు నన్ను కూడా వైద్యుడిలా చూడాలని ఉండేది కానీ బయటపడే వారు కాదు. నేను టీచర్ని అయ్యాను. నా కూతురుకి డాక్టర్ అవుదామని సంకల్పం ఎలా వచ్చిందో కానీ పట్టుదలగా చదివి అనుకున్నది సాధించింది.
అందుకు నాకన్నా మా నాన్న ఎక్కువ సంతోషం పొందినట్టు మొదట్లోనే అర్థమైంది. తను కూడా ఇష్టంగా, చకచకా మంచి మార్కులతో చదువు పూర్తి చెయ్యడం గర్వంగా ఉంది. పైగా నేనున్న పట్టణంలోనే కార్పొరేట్ హాస్పిటల్ లో మంచి జీతంతో స్థిరపడింది. ఆ హాస్పిటల్ లోపలికి వెళ్లి చూస్తే నాకు ఈ దేశంలోనే ఉన్నామా అని డౌటు వస్తుంది. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నట్లు ఉంటుంది కానీ రోగుల మూలుగులతో హాస్పిటల్ లో ఉన్నట్లు అనిపించదు.
చక్కగా, సిస్టమాటిక్ గా మనుషులు, యంత్రాలు కలిసిపోయి కదులుతున్నట్లే అనిపిస్తుంది. ఊళ్లో నాన్న నడుపుతున్నది కూడా హాస్పిటల్ లాగా ఉండదు. ఆశ్రమం లాగా ఉంటుంది. ప్రకృతి వైద్య శాల అనుకోవచ్చు. పరిశుభ్రంగా ఒక లాంటి పవిత్రత తో.
***. ****. ***
నెల రోజుల క్రితం ఒక రోజు నా కూతురు డాక్టర్ గాయత్రి ఛాంబర్ కి వెళ్ళాను. ఎవరో పేషెంట్ ని చూస్తుంటే బయట ఉన్నాను. ఆయన్ని చూడడం పూర్తయ్యాక నేను లోపలికి వెళ్ళాను. దిగాలుగా ఉంది. ఏమైందని అడిగాను.
"ఇప్పుడు చూసిన పేషెంట్ కి నయం కాని వ్యాధి. పాపం. తక్కువ వయసే.
ఆయనకి, తీవ్రత తెలియక మామూలుగానే ఉన్నారు. వాళ్ళింట్లో వాళ్లు ఎంత ఖర్చయినా పరవాలేదు అంటున్నారు తప్పించి ఆశ వదలడం లేదు. ఇప్పుడు ఏ మందులు వాడినా ఫలితం లేదు"
"అయ్యో పాపం. కన్ఫర్మా?"
"అవును నాన్నా. అన్ని టెస్టులూ కన్ఫర్మ్ చేశాయి. ట్రీట్మెంట్ కూడా మరేం లేదన్నది కూడా కన్ఫర్మ్. వాళ్ళని ఫాల్స్ నమ్మకం లో ఉంచి, ఉన్న కొద్దిపాటి డబ్బుల్ని వేస్ట్ చెయ్యాలని అనిపించడం లేదు."
"హయ్యర్ సెంటర్ కి పంపితేనో?"
"డబ్బులు ఖర్చు పెట్టిస్తారు తప్పితే ప్రయోజనం లేదు. అలా అని ఇంట్లో చూస్తూ చూస్తూ ఉండలేరు."
"అయితే వాళ్ళకి అభ్యంతరం లేదంటే తాతయ్య హాస్పిటల్ లో చేర్పించమని చెప్పు. కొంత ప్రకృతి కి దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది."
'మంచి ఐడియా నాన్నా' అని, వారిని పిలిపించి మాట్లాడితే వాళ్లు సరేనన్నారు. తను దగ్గరుండి తాతయ్య ఊళ్లో వారిని దింపి, హాస్పిటల్ లో చేర్పించింది.
చేర్పించి వస్తూనే ఆశ్చర్యం గా చెప్పింది. "నాన్నా, తాతయ్య గ్రేట్. మేం ఆధునిక పరికరాలు, పరీక్షలు వాడి చెప్పగలిగిన డయాగ్నోసిస్ కి తాతయ్య దాదాపుగా దగ్గరగా చెప్పగలిగారు. వ్యాధికి పెట్టిన పేరు వేరే గానీ లక్షణాలు, నిదానం చేసే ప్రక్రియలకు సామ్యం ఉంది. కాకపోతే ఈ నెల లోగా రోగి మరణించడం ఖాయం" అంది.
"దానికి మనమేం చెయ్యగలం?" నిట్టూర్చాను.
***. ***** ***
నెల తర్వాత వెళ్తున్నాం కదా! అందుకే ఆసక్తి. రోగి బాగా కృశించిపోయి ఉండొచ్చని నేను, డెత్ బెడ్ పై ఉండొచ్చని ఆమె ఊహిస్తూ వెళ్తున్నాం.
హాస్పిటల్ కి చేరిన మాకు నాన్న ఎదురొచ్చారు. మొక్కని అప్పుడే పాతినట్టు ఉన్నారు. చేతికి మట్టి. ఇంతలోగా ఒకాయన నీళ్ల బకెట్ మోసుకు వచ్చాడు. దానితో బాటు మిగతా మొక్కలకి నీళ్లు పోయడానికి. అసిస్టెంట్ అనుకున్నాం. తీరా చూస్తే అదే పేషెంట్. చక్కగా ఆరోగ్యంగా కనబడుతున్నాడు. అమ్మాయికి నమస్తే చెప్తే అప్పుడు పోల్చాం. అమ్మాయి ప్రతి నమస్కారం చేసి 'బాగున్నావా ' అని పలకరిస్తే పొంగిపోయాడు.
తర్వాత ఫ్రీ టైమ్ లో నాన్న ఒక్కరే ఉన్నప్పుడు గాయత్రి అడుగుతోంది.
"తాతయ్యా, ఆ రోగి తాలుకా రోగ నిర్ధారణలో తప్పు లేదు కదా!"
"లేదనుకుంటాను అమ్మా. "
"మరి ఈ పాటికి కండిషన్ పాడయ్యేది కదా. ఆ ఛాయలేమీ లేవు. కోలుకుంటున్నట్లు కనబడుతున్నాడు. అలా బాగుపడడం చాలా సంతోషమే కానీ డౌట్ డౌటు గానే ఉంది. తప్పుగా ఆలోచించామా అని అయోమయం గా ఉంది."
చిరునవ్వు చిందించి ఊరుకున్నాడాయన. నేను ఇద్దరినీ గమనిస్తున్నాను. మధ్యలో దూరి మాట్లాడడానికి నాకు తెలియని సబ్జెక్టు అది.
"చెప్పు తాతయ్యా" మళ్లీ అడిగింది.. ఏదో తెలుసుకుంటే గానీ వదిలేటట్టు లేదు.
"ఏం లేదమ్మా. మీ డయాగ్నోసిస్ నూటికి నూరు శాతం కరెక్ట్. ఆధునిక సాంకేతికత, పరికరాలు నిన్ను మోసం చెయ్యలేదు. అలాగే ఆ రోగి కోలుకునే అవకాశాలూ తక్కువే. అయితే మన అంటే వైద్యుల ఆలోచన లోనే తేడా ఉంది. తక్కువ అవకాశం ఉన్నప్పుడు లాభనష్టాలు మీరు బేరీజు వేస్తారు.
నేనైతే గుడ్డిదో, మెల్లదో అవకాశమైతే ఎంతోకొంత ఉంది కదా అని ఆలోచిస్తాను. వాస్తవంగా ఏ వైద్యుడైనా అదే ఆలోచించాలి. చిన్న చిగురు తొడిగే అవకాశం ఉన్నా ఆ మొక్కని మరింత సంరక్షించి ఎదిగేలా సహకరించాలి. నేను చేస్తున్నది అదే. నాకు ప్రకృతి సహజ గురువు. మీకు ఆధునిక సాంకేతికత అంటే కృత్రిమ మేధ అసహజ గురువు. మీ గురువు విజ్ఞానం ఒక్కటే అందిస్తాడు.. నా గురువు దానితో బాటు ఆశని, జీవన స్పర్శని పరిచయం చేశాడు."
మౌనంగా వింటున్న గాయత్రి తో చెప్పడం కొనసాగించాడు నాన్న.
"కృత్రిమ మేధ ని అందిపుచ్చుకోవాలి. దానితో సహాయకారి గా, సేవకుడిగా పని చేయించుకోవాలి. అయితే ప్రకృతి ని మాత్రమే గురువుగా భావించాలి. అప్పుడు అందిపుచ్చుకున్న విజ్ఞానానికి మానవ స్పర్శ తోడవుతుంది. ఒకప్పుడు నెల రోజులు పట్టే టెస్టులు ఇప్పుడు చిటికెలో సాధ్యమవుతున్నాయి. ఈ లెక్కన ఎంత మందికి ఎక్కువగా సేవ చెయ్యగలం. దానికి సహానుభూతి కూడా కలిపితే ప్రపంచం ఎంత ఆరోగ్యంగా, అందం గా తయారౌతుంది చూడు. "
నాన్న ఎప్పుడూ ఇంతే. ఏం చెప్పినా తాదాత్మ్యత తో చెప్తాడు. కూతురు కూడా అంతే తాదాత్మ్యత తో వినడం చూసి ముచ్చటేసింది.
నాకేం డౌటు లేదు.. నాన్న ని చూసి గర్వపడుతు న్నట్టే, రేపు గాయత్రి ని చూసుకుని గర్వపడతాను.
****. *****సమాప్తం ****
డా. డి. వి. జి. శంకరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
డా. డి. వి. జి. శంకరరావు,మాజీ ఎంపీ
విజయనగరం, ఆంధ్రప్రదేశ్
ప్రచురించబడ్డ రచనలు : స్వాతి,ఈనాడు, ఆంధ్రజ్యోతి,సూర్య, ప్రజాశక్తి,విశాలాంధ్ర, ఆంధ్రభూమి,సాక్షి,వార్త, ఆదివారం అనుబంధం పత్రికల్లో,కౌముది వెబ్ పత్రికలో,
కథలు 35
కవితలు 300
వ్యాసాలు,లేఖలు ఇంగ్లీష్,తెలుగు దిన పత్రికల్లో: 4 వేలు
డీవీజీ కవితలు పేరుతో ఒక పుస్తకం ప్రచురణ.
Comments