top of page
Original.png

దీపావళి ప్రాశస్త్యం


#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #PendekantiLavanyaKumari, #పెండేకంటిలావణ్యకుమారి, #దీపావళిప్రాశస్త్యం, #DeepavaliPrasasthyam

ree

'Deepavali Prasasthyam - New Telugu Poem Written By Pendekanti Lavanya Kumari Published In manatelugukathalu.com On 01/11/2024

'దీపావళి ప్రాశస్త్యం' తెలుగు కవిత

రచన, పఠనంపెండేకంటి లావణ్య కుమారి



భూదేవి, వరాహస్వాముల అసుర సంధ్య సమాగమం,

కలిగెను భూదేవికి అసుర లక్షణాల తోటి నరకుని జననం,

తెలిసిన భూదేవి, స్వామిని నరకాసుర రక్షణకై కోరెనొక వరం,

తన కుమారుడి మరణం తన చేతిలోనే జరగాలన్నది దాని వివరం, 


తల్లి బిడ్డను చంపుట అసాధ్యమనుకొని నరకుని తలకెక్కెను వరగర్వం,

విర్రవీగిన నరకుడు కావించెను అకృత్యాలు అనంతం,

చివరకు పదహారువేల పడతుల చెరపట్టి చేసెను నిర్బంధం,

రోదనలు, విన్నపాలతో ఆగ్రహించిన కృష్ణుడు గావించెను యుద్ధసన్నద్ధం, 


వెడలెను నరకునిపై యుద్ధానికి భూదేవి అంశైన సత్యభామా సమేతం,

రకరకాల అస్త్రశస్త్రాలతో ఇరువర్గాలూ సలిపిరి ప్రచండ యుద్ధం,

యుద్ధంలో మురారి మూర్ఛిల్లినట్లుగా ఆడెను నటనం,

తల్లడిల్లిన సత్యాదేవి చేతి బాణం చేసెను నరక సంహారం, 


ఇన్నేళ్ళూ భయం చెరలో బ్రతికిన జనులలో వెల్లువెత్తెను ఆనందం,

నరకచతుర్థశి పేరుతో సంతోషంగా  జరుపుకొనిరి ఉత్సవం,

మరునాటి అమావాస్యను మాపుటకై పెట్టిరి దీపాల సమాహారం,

చీకటి పై గెలిచిన వెలుగన్న రీతిలో నేటికీ దీపావళి ఎంతో ప్రాశస్త్యం.


ree

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.


Comments


bottom of page