దిశా నిర్దేశం చేసిన కల

'Disa Nirdesam Chesina Kala' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
చిమ్మ చీకటి... కాకులు దూరని కారడవి...
అందులోనూ అది అమావాస్య రాత్రి.
చుట్టూ కీచురాళ్ళ అరుపులు...
దూరంగా ఎక్కడో నక్కల ఏడుపులు...
ఆ ఏడుపులు సరిపోనట్టు ఉండి ఉండి ఉరుముతున్న ఆకాశం.
ఏ క్షణం లో అయినా వర్షించేలా ఉన్న మబ్బులు.
ఆ మబ్బులను చెదరగొట్టేలా భీకరమైన గాలులు..
ఆ గాలి వేగానికి పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న చెట్లు.
ఆ చెట్లపై తలకిందులుగా వ్రేల్లాడుతున్న గబ్బిలాలు.
అప్పుడప్పుడు ఉరుములకి ముందు మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపు వెలుగుల్లో కొద్దీ కొద్దిగా దారి చూసుకుంటూ...
భయం భయంగా అడుగులు వేస్తున్నాను.
ఎంత పరికించి చూసినా కన్ను కానరాని అంధకారం.! ఎటు వెళ్తున్నానో తెలియడం లేదు.
ఏం జరగ బోతోందో అర్ధం కావడం లేదు.
అడుగులో ఆడుగు వేసుకుంటూ... ఆ చీకటి నిండిన కీకారణ్యంలో గుండెలు అరచేత పట్టుకుని వెళ్తున్నాను.
ఇంతలో ఎవరో నా వెనుకే వస్తున్నట్టు అడుగుల శబ్దం.
ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాను.
అడుగుల శబ్దం ఆగిపోయింది.
ఎవరూ లేరు అని నిర్ధారించుకుని... ఒక్కో ఆడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాను.
ఇంతలో మళ్ళీ ఎవరో నా వెనుకే వస్తున్నట్టు అనిపించింది. కానీ ఈ సారి అడుగుల శబ్దమే కాదు.. నా వెనుకే నిలబడి ఉన్నట్టు.. అంత చలిలోనూ వెచ్చని గాలి నా వెన్నుని తాకుతోంది.
మ్మ్....! మ్...! మ్మ్...! అంటూ ఒకరకమైన మూలుగు, మధ్య మధ్యలో హృదయ విదారకమైన ఏడుపు...
నా చెవులకు చిన్నగా... చాలా దగ్గర నుండే వస్తున్నట్టు వినిపించింది.
కానీ...ఈసారి వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేక...
బిగుసుకుపోయాను.
భయంతో.. నా కాళ్ళు..చేతులు కర్రల్లా బిగుసుకుపోయాయి. ఒక్క ఆడుగు కూడా వేసే శక్తి రావడం లేదు.
ఇంతలో ఆ మూలుగు గట్టిగా ఇంకా ఇంకా దగ్గరగా వినిపిస్తోంది.
ఆ ఏడుపు ఇంకా స్పష్టంగా వినిపిస్తోంది.
ఏదో ఆకారం నా వెనుకే ఉన్నట్టు నిశ్చయించుకున్నాను.
ప్రాణాలు కాపాడుకునేందుకు చివరగా ఒక్క ప్రయత్నం చేసి, శక్తి కూడ గట్టుకుని...భయంతో బిగుసుకుపోయిన నా కాళ్ళను కదిపేందుకు ప్రయత్నం చేసాను. ఎంత ప్రయత్నించినా అవీ కదలడం లేదు.
గట్టిగా ఆరుద్దామన్నా.. నా అరుపు గొంతులోనే ఆగిపోయింది.
ఇంతలో ఆ ఆకారం వెనకునుండే నన్ను గట్టిగా హత్తుకుని....
వికృతమైన గొంతుతో... బాధ నిండిన స్వరంతో ....చాలా నెమ్మదిగా..
" వచ్చావా...!
నువ్వు వచ్చేసావా
నీకోసమే ఎదురు చూస్తున్నా...!
నా బాధ నీతో చెప్పాలనే ఎదురు చూస్తున్నా..!
నాకు సాయం చేస్తావా...!? " అంటూ కర్ణ కఠోరమైన గొంతుతో... ఎంతో బాధగా మాట్లాడుతోంది.
ఇదేంటి... మాములుగా అయితే.. ఇలాంటి అడవుల్లో నీడలా వెనకవచ్చే ఆకారాలు వెంటపడి చంపుతాయి కదా..ఇదేంటి సాయం చేయమంటోంది అనుకుంటూ ధైర్యం తెచ్చుకుని..వెనక్కితిరిగి చూసాను.
అంతే.! వికృతరుపంలో ఉన్న ఆ ఆకారం…
ఆడ మనిషి రూపంలో మారింది.
అద్భుతమైన అందం తనది.
నేను ఆమెను చూస్తూనే అలా ఉండిపోయాను.!
కానీ ఆమె ఆత్మ అని గుర్తొచ్చి...
" ఎవరూ నువ్వూ..!? నన్ను వదిలేయ్.!" అని బ్రతిమాలాను.
నీకు నేను సాయం చేయడం ఏంటి...!?
నన్ను వదిలేయ్.!" అంటూ వేడుకున్నాను.
ఆ ఆడ మనిషి... నా చేతిని గట్టిగా పట్టుకుని...
" నేను నీకు ఏ హానీ చేయను. నాకు నీలాంటి వారి సాయం కావాలి.
నువ్వు నా గురించి రాయాలి.
నా కథ ను రాయాలి.!" అంటుంటే.... నాకు ఏమీ అర్ధం కాక.. ఆమె వైపు అయోమయంగా చూశాను
" నేను ఎవరో అర్ధం కాలేదా...!
అన్యాయానికి గురైన ఆడపిల్లని. దేశమే ఉలిక్కిపడేలా..
దేశ రాజధానిలో.... అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైన ఆడపిల్లని.!" అంటూ ఆమె తన కథ చెప్తూ ఉంటే... సాటి ఆడదానిగా... నా హృదయం ద్రవించింది.
ఆమె తను చెప్పాలి అనుకున్నది చెప్తోంది.
"నువ్వూ నాలాంటి ఆడదానివే కాబట్టి రాయాలి.
అన్యాయంగా కామాంధుల చేతిలో బలైపోయిన నాలాంటి వేలాది మంది ఆడబిడ్డల కన్నీటి వ్యధల గురించి రాయాలి.
ఆడది అంటే ఆటబొమ్మగా చూసే సమాజం సిగ్గుపడేలా రాయాలి.
ఆడవారిపై అకృత్యాలకు తెగబడే కామాంధుల కళ్ళు తెరిపించేలా రాయాలి.
ప్రతీ ఆడదానిలో ఆది పరాశక్తి అంశ దాగి ఉంది అని..
ఆడపిల్లలకు తమ శక్తి యుక్తులు గుర్తొచ్చేలా...
అన్యాయాన్ని ఎదిరించి...తిరగబడి, నిలబడేలా రాయాలి.
ప్రతీ ఆడపిల్ల కి ధైర్యం నూరిపోసే లాంటి రచనలు చేయాలి.
తనను వక్రదృష్టితో చూసిన వాడి కనుగుడ్లు పెకిలించి వేసేలా... తనలో ఉన్న కాళికను నిద్రలేపేలా రచనలు రాయాలి.!" అంటూ ఆ ఆడమనిషి ఆత్మ నాతో చెప్తూ ఉంటే...
నా నర నరాల్లోను... నారీ మణుల మీద జరుగుతోన్న దారుణాలు స్ఫురణకు వచ్చి..ఉద్వేగానికి లోనవుతూ ఉంటే... నా కంట కన్నీరు కురిసింది.
ఆమె నా కన్నీటిని చూస్తూ..
నీ కంట కన్నీరు కురిపించకు. ఈ కన్నీరు నాకు న్యాయం చేయలేదు. ఎవరికీ సాయం చేయలేదు.
నీలోని కసినంతా.. నీ కలంలో నింపి...
కాలంలో కలిసిపోయి.. న్యాయానికి నోచుకోని అభాగ్యుల కన్నీటి వ్యధలను కధలుగా అందించు.
కటాకటాల వెనక ఊచలు లెక్కపెట్టాల్సిన నేరస్థులు ..
శిక్ష తప్పించుకుని సభ్య సమాజంలో తిరుగుతున్న మానవ మృగాలు సిగ్గుతో తలవంచుకునేలా అత్యాచారానికి బలైపోయిన దీనుల కధలు రాయి.
కరడు గట్టిన గుండెల్లో... కారుణ్యం కలిగించు.
ఆడదంటే శక్తి స్వరూపిణి అని చాటి చెప్పు.!"
అంటూ నా భుజం తట్టి... తను పొగలా మారి కనుమరుగవపోబోతోంది...
అతికష్టం మీద నా కన్నీరు ఆపుకుని... నీ పేరేమిటి..!?
అని అడిగాను.
ఆమె చాలా సౌమ్యంగా...
నిర్భయ..! అని చెప్తూ.... చీకటిలో కలిసిపోయింది.
" నిర్భయా...ఆగు... ఆగు... వెళ్ళిపోకు...!" అంటూ అరుస్తున్న నా కళ్ళపై నీళ్లు పడ్డాయి.
ఒక్కసారిగా ఉలిక్కి పడి పైకి లేచాను.
పక్కనే మావారు.!
" ఏమైంది నీకు..! నిర్భయ..! ఆగు..! అంటూ కలవరిస్తున్నావు.!" అంటూ అయోమయంగా నా మొహంలోకి చూస్తూ అడుగుతున్నారు.
" ఇదంతా నా కలా.!
అంటే..! ఆమె నాతో చెప్పినది అంతా నా కల.!?
కానీ ఆమె వ్యధ మాత్రం కల కాదుగా.!" అనుకుంటూ ఉండగా నాకు అనిపించింది.
'కొత్తగా ఏమి రాయాలి .. ఏమి రాయాలి.. అని ఆలోచిస్తూ పడుకున్న నాకు.
నువ్వు ఇవి రాయాలి.! అన్యాయానికి బలైపోయిన స్త్రీల
ఆత్మ ఘోష గురించి రాయాలి.!' అంటూ...
నా మనసు నాకు కల రూపంలో ఆమెగా వచ్చి చెప్పింది అని అర్ధం అయింది.
ఇక నుండీ నిజాన్ని నిర్భయంగా....రచనలుగా రాయాలని... దిశా నిర్దేశం చేసుకున్నాను.
🙏శుభం 🙏
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య. నేనొక గృహిణిని.
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.