top of page

ఏది మన సంపద


'Edi Mana Sampada' Written By Rejeti Venkataramana Murthy

రచన : రేజేటి వెంకటరమణ మూర్తి


అత్తమ్మకు బాగోలేదని అమెరికాలో ఉన్న భర్తకుఫోన్ చేసింది శ్రావణి.


రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి," హలో, శ్రావణి,. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు?" అడిగాడు.


" మరేం లేదండి. అత్తయ్యకు ఎన్ని మందులు వేసినా దగ్గు కంట్రోల్ అవడం లేదు." చెప్పింది శ్రావణి.


" మరి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళ లేదా?" అడిగాడు.


"తీసుకుని వెళ్ళాను. డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేస్తున్నా దగ్గు తగ్గడం లేదు. " చెప్పింది.


"సరేలే రేపే నేను బయల్దేరి వస్తున్నాను. అంతవరకు అమ్మ ని జాగ్రత్తగా చూడు. నేను వచ్చాక ఏదైనా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్దాం"చెప్పి ఫోన్ పెట్టేసాడు.

. ******. ******. ********

"నాన్నా, పృధ్వీ ! నీ స్కూల్ బస్ వచ్చే టైం అయ్యింది. రా తొందరగా. ఇదిగో నీ స్కూల్ బ్యాగ్ లో లంచ్ బాక్స్, స్నాక్స్ , వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసాను. నువ్వే తిను. ఎవ్వరేదడిగినా ఇవ్వకు.ఓకేనా!" కేక వేసింది శ్రావణి .


"ఓ.కే. మమ్మీ, బై!" అంటూ స్కూల్ బ్యాగ్ తీసుకొని, భుజానికి తగిలించుకుని," మమ్మీ ఈరోజు మా స్కూల్లో కల్చరల్ మీటుంది. డాడీ కూడా ఈరోజు వస్తున్నారు కదా! ఇద్దరూ కలిసి ఈవెనింగ్ తప్పకుండా రావాలి.బై మమ్మీ" అంటూ బయటకు వెళ్ళాడు పదవ తరగతి చదువుతున్న కొడుకు పృధ్వీరాజ్.


"ఓ.కే.నాన్నా. బై! " అంటూ గేట్ వేసి,లోపలికి వచ్చేసింది శ్రావణి.


రాజేష్ ఇంటికి చేరేసరికి అమ్మ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మంచంపైనున్న అమ్మను ఆ పరిస్థితిలో చూసి రాజేష్ తట్టుకోలేకపోయాడు. "వెంటనే అమ్మను టౌన్ తీసుకుని వెళ్లి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ లో చూపిద్దాం. నువ్వు కూడా తోడుగా పద " అని భార్యతో అన్నాడు.


"నేనా? ఈరోజు స్కూ బాబు స్కూల్లో కల్చరల్ మీట్ కి వస్తానని చెప్పాను. మనిద్దరినీ రమ్మన్నాడు. వెళ్ళకపోతే బాధపడతాడు. అత్తమ్మ ను రేపు హాస్పిటల్ కి తీసుకు వెల్దాం లెండి" అంది.


"ఇప్పటికే ఆలస్యమైంది. ఎప్పుడో తీసుకెళ్లాల్సింది హాస్పిటల్ కి. ఇన్నాళ్లు ఏం చేశావ్? " గట్టిగా అడిగాడు భర్త.


"మన ఊరి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇప్పటికే నాలుగు సార్లు తీసుకుని వెళ్లాను. మందులు కూడా అక్కడే ఉన్నాయి. తను వేసుకోక పొతే నన్ను ఏం చేయమంటారు?" చెప్పింది శ్రావణి.


"ఇంత సీరియస్ అయినంత వరకూ ఏం చేస్తున్నావు? టౌన్ తీసుకుని వెళ్లి ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో నైనా చేర్పించాల్సింది. ఇంతస్థాయిలో ఉండి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లో చూపిస్తావా! ఛ.. సరేలే,అయిందేదో అయింది , నువ్వు వచ్చినా రాకపోయినా నేను అమ్మని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తున్నాను." అంటూ అమ్మని తీసుకొని కారు లో టౌన్ కి వెళ్ళాడు.


డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని , అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని, పది, పదిహేను లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అదికూడా తొందరగా చేయాలని చెప్పారు.


ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తొందరగా ఆపరేషన్ రెడీ చేయండని చెప్పి అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంటికొచ్చాడు రాజేష్.


"శ్రావణి , శ్రావణీ.." పిలిచాడు ఇంటికొచ్చి రాజేష్.


"ఆ వస్తున్నానండి" అంటూ బెడ్ రూం నుండి బయటకు వచ్చింది.


"అత్తమ్మ ఏరండీ? డాక్టర్ ఏమన్నారు?" అడిగింది బాబు స్కూల్ కి బయలు దేరుతూ శ్రావణి .


"పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు పది, పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. సరేనని చెప్పి అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాను. పద అర్జెంటుగా బ్యాంక్ కి వెళ్లి డబ్బులు డ్రా చేద్దాం. టైం లేదు. బ్యాంకు మూసేస్తారు." బాధతో చెప్పాడు రాజేష్.


"బ్యాంకు కా, డబ్బులా? " అనుమానంగా అడిగింది శ్రావణి.


"ఏం, నీ అకౌంట్లో డబ్బులు లేవా? నా లెక్క ప్రకారం పాతిక లక్షల పైనే ఉండాలిగా... " అన్నాడు రాజేష్.


"అదీ, అదీ... వారం క్రితం వరకు ఉండేవి. కానీ ఇప్పుడు లేవు." సనుగుతూ చెప్పింది శ్రావణి.


"ఏంటీ, లేవా! అంత డబ్బు ఏం చేసావే?" అనుమానంగా అడిగాడు రాజేష్.


"మొన్ననే 20 లక్షలు పెట్టి ఒక త్రిబుల్ బెడ్ రూం హౌస్ సైట్ తీసుకున్నాను. బంగారం ధర పెరిగిపోతున్నదని, ఓ నాలుగు లక్షలు పెట్టి నెక్లెస్ తీసుకున్నాను. మీరు వచ్చాక చెబుదామని ముందుగా మీకు చెప్పలేదు . ఇప్పుడు బ్యాంకులో మహా ఉంటే నాలుగు లక్షల కంటే ఎక్కువ ఉండదు." చెప్పింది శ్రావణి.


"ఎంతపని చేశావు శ్రావణి. ఇప్పుడు అర్జెంటుగా అమ్మకి ఆపరేషన్ చేయకపోతే అమ్మ ప్రాణాలకే ముప్పు. ఓ పని చేద్దాం. నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం పట్టుకో. బ్యాంకు లో గోల్డ్ లోన్ పెట్టి పది లక్షల అప్పు తీసుకుందాం." చెప్పాడు భర్త.


"ఇప్పుడు గోల్డ్ లోన్ పెట్టి, అప్పు తీసుకొని అత్తమ్మ కు ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉందంటారా? ఇంత ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించినా మహా అయితే ఇంకా ఎన్నాళ్లు బ్రతుకుతుందిి, ఆలోచించండి. ఈ బంగారం మళ్ళీ ఇప్పట్లో విడిపించడం అవుతుందా? బాబుని మెడిసిన్ చదివించాలని అనుకుంటున్నాం . రేపు టెన్త్ పాసయ్యాక ఏ కార్పొరేట్ కాలేజ్ లోనో జాయిన్ చెయ్యాలి. ఇంత ఖర్చు ముందుంచుకుని, ఇప్పుడు ఈ బంగారం బ్యాంకు లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మరి అమ్మ ఆరోగ్యం కంటే , మన బాబు భవిష్యత్తు చాలా ముఖ్యం అనిపిస్తోంది. ఆలోచించండి." చెప్పింది శ్రావణి.


"ఇప్పుడు నాకు బాబు భవిష్యత్తు కంటే, అమ్మ ఆపరేషనే ముఖ్యం. నువ్వు బంగారం ఇవ్వక పోయినా , అప్పు చేసైనా ఆపరేషన్ చేయిస్తాను. వస్తా" అంటూ సీరియస్ గా వెళ్లిపోయాడు.


"సరే మీ ఇష్టం. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. " అంటూ ఇంటి తలుపులు వేసి లోనికి వెళ్ళింది.

బాబు స్కూల్ కి వెళ్ళాడు.సాయంత్రం స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రారంభమైనాయి. పిల్లలు మంచి ప్రదర్శనలు ఇస్తున్నారు. అందులో పృధ్వీ వాళ్ళ టీం వేసిన "మన సంపద" అనే లఘునాటిక చాలాబాగుంది. అది అక్కడున్న అందరి తల్లిదండ్రుల గుండెల్ని పిండేసింది.


సంపద అంటే డబ్బు, ధనం కాదని ; బంగారాలు, బిల్డింగులు కానేకాదని , మనల్ని కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే మన సంపదనీ, మనం చంటిపిల్లాడు గా ఉన్నప్పుడు వాళ్లు మనకు చేసిన సేవలను, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్లకు మనం అవి చేసిన నాడే కన్న రుణం తీరుతుందని , ఆ సంపదను చివరి క్షణం వరకు కాపాడాల్సిన బాధ్యత కడుపున పుట్టిన పిల్లలదేనని చక్కగా చెప్పారు.


ఆ నాటిక చూసిన ప్రేక్షకులందరికీ కళ్ళు చెమర్చాయి. గొంతులో తడి ఆరిపోయింది. అందరితోపాటు శ్రావణి పరిస్థితి కూడా అంతే. ఆ నాటికలో తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో నటిస్తూ ,అద్భుతమైన సందేశాన్ని ప్రేక్షకులకు అందించిన పాత్రలో తన కొడుకు పృధ్వీ నటనకు ప్రేక్షకులందరూ హర్షధ్వానాలు తెలియజేశారు.


శ్రావణికి, తన భర్త రాజేష్, వాళ్ళ అమ్మ పట్ల చూపిస్తున్న ప్రేమ సరైనదేనని గుర్తించింది. హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టి ఫోన్ బయటకు తీసింది. రాజేష్ నంబర్ డయల్ చేసింది.


"హలో, ఆఁ, నేనే నండి. అత్తమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఆపరేషన్ కి రెడీ చేసారా? నా దగ్గరున్న గోల్డ్ అంతా అమ్మేసి డబ్బు తీసుకొని హాస్పిటల్ కి వస్తున్నాను. మీరు ఎక్కడా అప్పు చేయాల్సిన అవసరం లేదు. మరో గంటలో అక్కడుంటాను. బై.. " అంటూ ఫోన్ పెట్టేసి, పృధ్వీ ని తీసుకొని ఇంటికి బయలుదేరింది.

సర్వే జనా సుఖినోభవంతు!

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




441 views0 comments

Comments


bottom of page